ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్ ముచ్చట్లు
హైదరాబాద్ లో అత్యంత పురాతన పుస్తక షాపుల్లో అబిడ్స్ లో ఉన్న “ఎ.ఎ హుస్సేన్ బుక్ సెల్లర్స్” ఒకటి. దాదాపు ఆరు దశకాల నుండీ పుస్తక విక్రయంలో విశిష్ట సేవలను అందిస్తున్నారు. బెస్ట్ సెల్లర్స్ పుస్తకాల నుండి అరుదైన పుస్తకాల వరకూ ఇక్కడ చాలానే పుస్తకాలున్నాయి. ఎ.ఎ.హుస్సేన్ బుక్ సెలర్స్ అధినేత, ఆసిఫ్ హుస్సేన్ తో ప్రశ్నలూ-జవాబులు ఇక్కడ మీ కోసం. చెప్పాపెట్టకుండా వెళ్ళినా, మా అభ్యర్థన మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు హుసేన్ గారికి మా కృతజ్ఞతాభినందనలు! – పూర్ణిమ, సౌమ్య
ఈ పుస్తకం షాపు ఎప్పుడు పెట్టారు?
ఇది 1940 దశకం చివర్లో మొదలయ్యింది.
అంటే.. స్వాతంత్రం రాక మునుపేనా?
లేదు.. ఆ తర్వాత, బహుశా 1949లో అయ్యుండచ్చు.
అప్పటి నుండీ ఇక్కడే ఉందా?
అవును.. అప్పటి నుండీ ఇదే ప్రదేశం.
ఎలా మొదలయ్యింది?
ఇది మా తాతగారైన రియాజత్ హుస్సేన్ ప్రారంభించారు. ఆయన తర్వాత మా నాన్న అజ్‍గర్ హుస్సేన్ అరస్తు కొనసాగించారు. తర్వాత దీన్ని నేను కొనసాగిస్తున్నాను.
షాపుకి ఈ పేరెందుకు పెట్టారు?
అది మా తాతగారి నాన్నగారి పేరున, ఎ.ఎ హుస్సేన్!
ఓహ్..
మా నాన్న వల్లే ఈ షాపుకి చాలా పేరు వచ్చింది. చిన్నపిల్లల పుస్తకాలతో మొదలయ్యింది కాస్తా ఇంత పెద్దది అయ్యింది. మా నాన్న అరవైల్లో ఈ బిజినెస్ లోకి వచ్చారు. అప్పటి నుండి తొంభైల చివరి వరకూ ఆయనే అన్నీ చూసుకునేవారు. కాన్సర్ వల్ల ఆయన 1997లో చనిపోయారు. బిజినెస్ చూసుకోడానికి ఇక ఎవ్వరూ లేక.. (నేనొక్కడినే కొడుకుని).. చదువు మానేసి ఇందులోకి వచ్చేశాను.
మీరు బుక్స్ ఎక్కడ నుండి తెప్పిస్తారు?
అన్నీ డిస్ట్రిబ్యూటర్స్ నుండే! మా తాతగారి కాలంలో అయితే నేరుగా దిగుమతి చేసుకునే వాళ్ళం కానీ.. ఆ తర్వాత అంతా డిస్ట్రిబ్యూటర్సే! ముఖ్యంగా ఢిల్లీ, ముంబయ్, చెన్నైల నుండి.
మీరు పబ్లిషర్స్ కూడానా?
లేదు! మేం రిటేలర్స్ మాత్రమే!
కస్టమర్ల తాకిడి ఎలా ఉంది?
ఎన్నో ఏళ్ళుగా మమల్ని అంటిపెట్టుకున్న కస్టమర్లు మాత్రమే మా దగ్గరకి వస్తుంటారు. కొత్తగా, మొదటిసారిగా వచ్చే కస్టమర్లు చాలా తక్కువ. పాత కస్టమర్లు కూడా ఒక నాస్టాల్‍జిక్ భావనతో వస్తారు. “మేం మొదటి పుస్తకం కొన్నింది ఇక్కడే!”, “మీ తాతయ్య పాకెట్ మనీ ఇవ్వగానే మర్నాడు ఇక్కడే వచ్చేసే వాళ్ళం”, “నేను ఫలనా బుక్ వెతుకుతుంటే ఈ మూలనే కనిపించింది” లాంటి బాల్య స్మృతులు తమ పిల్లలతో పంచుకోడానికి వీళ్ళు వస్తుంటారు. అలా ఆ పిల్లలూ మా షాపుకి పరిచయం అవుతుంటారు.
మీ బుక్ షాపుకి ఆన్‍లైన్ సైటుందా?
లేదు! అది చేయాలన్న ఆలోచన ఉంది. కానీ సుమారుగా రెండేళ్ళ సమయం పట్టచ్చు.
కస్టమర్లు హోం డెలివరీ అడిగితే చేస్తారా?
కొన్ని సందర్భాల్లో .. చేస్తాం.
షాపు పేరులో గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉంది?
మేం 1960 అప్పటినుండీ గ్రీటింగ్ కార్డ్స్ బిజినెస్ లో ఉన్నాం. అప్పట్లో వేరే షాపులు తక్కువ కాబట్టి అందరూ అడగడంతో యునిసెఫ్ కార్డుల అమ్మకం మొదలెట్టాం. అప్పట్లో అన్నీ బాంకులూ, ప్రతీ పండగకీ కార్డులు ఇక్కడి నుండే కొనేవారు. కుముద్బేన్ జోషి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఎక్కువ కార్డులు అమ్మినందుకు గాను మాకు ప్రశంసా పత్రం కూడా ఇచ్చారు.
మీ దగ్గర ఎలాంటి పుస్తకాలు దొరుకుతాయి.
చాలా వరకు అన్ని రకాలూ దొరుకుతాయి. ఫిలాసఫీ ( భారతీయ మరియు పాశ్చాత్య) , వివిధ రకాల ఫిక్షన్, సైన్స్, చరిత్ర, మెటాఫిజిక్స్, వంటకి సంబంధించిన పుస్తకాలు, ఆర్ట్, చిన్నపిల్లల పుస్తకాలకైతే ఏకంగా పై ఫ్లోర్ మొత్తం కేటాయించాము! ఆర్నిథాలజీ నా హాబీల్లో ఒకటి. అందుకని దానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ ఉంటాయి. అలానే హైదరాబాద్ చరిత్రను గురించిన పుస్తకాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ అనగానే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయి.
తెలుగు పుస్తకాలో మరి?
ఉండవు! ఇది ప్రాధమికంగా ఇంగ్లీషు పుస్తకాలు దొరికే షాపు. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ పుస్తకాలూ పెడుతుంటాము. ఇప్పుడు హైదరాబాద్ గురించి ఏ భాషలోనైనా పెడతాం. అలానే నాకు ఆర్నథాలజీ ఇష్టం. అందుకని ఆ పుస్తకాలూ ఏ భాషలో ఉన్నా పెడుతుంటాను.
మీ దగ్గర అందుబాటులో లేని పుస్తకాలు అడిగితే?
వీలైనంతలో ఆ పుస్తకాలని తెప్పించే ప్రయత్నం చేస్తాం. కొన్ని సార్లు ఖర్చు ఎక్కువైనా పర్లేదు, కొన్ని పుస్తకాలు కావాలని నేనే స్వయానా డిస్ట్రిబ్యూటర్లకి చెప్పాను. ఈ మధ్యకాలంలో ఆ అవసరం రావటం లేదు. ఇప్పుడు కస్టమర్లు ఆన్‍లైన్ వైపు మగ్గు చూపుతున్నారు. అన్నాళ్ళు ఇక్కడ వేచి చూసే బదులు, అక్కడే కొనేసుకుంటున్నారు.
ఆన్‍లైన్ వల్ల మీ వ్యాపారం దెబ్బతినింది అంటారా?
లేదు.. అలా ఏమీ అనను. ఆన్‍లైన్ షాపింగ్‍కి కూడా కొన్ని నష్టాలున్నాయి. ఆన్‍లైన్‍లో అయితే షిప్పింగ్ చార్జెస్ వేస్తారు కాబట్టి పుస్తకం ధర బాగా పెరుగుతుంది. అంతే కాక, క్రెడిట్ కార్డ్ లతో ఎప్పుడూ భయంభయంగానే ఉంటుంది. ఆన్‍లైన్ వల్ల పెద్దగా నష్టపోయాం అని చెప్పలేం.
ఇది చాలా పాత పుస్తకాల షాపు, కానీ ఒక్కటి కూడా పాత పుస్తకం లేదే!
ఇక్కడ సెకెండ్ హాండ్ పుస్తకాలు అమ్మం. ఈ షాపు పాతది.. పుస్తకాలు మాత్రం కొత్తవే!
ఈ కాలంలో పుస్తకాల షాపు నడపడం ఎంత కష్టం?
చాలా కష్టం. మాలాంటి ప్రొప్రెటరీ వాళ్ళకి మరీ కష్టం. అందునా ఇక్కడ పుస్తకాలు తప్ప ఏవీ దొరకవు. ఈ పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే పుస్తకాల షాపుల్లా, తినుబండారాలు ఒక వైపు, గిఫ్ట్ లూ, బొమ్మలూ ఇంకో వైపు – అలా లేని పుస్తకాల షాపుకి చాలా కష్టం. అక్కడైతే పుస్తకాల విషయంలో నష్టం వచ్చినా, వేరే వాటి వల్ల వచ్చిన లాభాలుంటాయి. ఇక్కడలా కాదు.
అయితే మీ షాపుని ఆ తీరులో విస్తరించే ఉద్దేశ్యాలు ఉన్నాయా?
లేవు! మహా అయితే స్కూల్ పిల్లల చదువుకి సంబంధించిన వస్తువులు పెట్టే ఆలోచన ఉంది. అంతే కానీ సాప్ట్ టాయ్స్ గానీ, మ్యూజిక్ గానీ అమ్మే ప్రసక్తే లేదు. అవి పెట్టేసరికి, అసలు పుస్తకం కొట్టుకుండాల్సిన వాతావరణమే చెడిపోతుంది. అందుకు నేను ఒప్పుకోను.
ఈ మధ్యకాలంలో కొన్ని non-conventional ways of publishing మొదలయ్యింది. అంటే పుస్తకాలు సి.డీల్లోనూ వాటిలోనూ రావటం. మరి అలాంటి వాటి సంగతి?
అలాంటివున్నా ఎక్కడో అక్కడక్కడ మాత్రమే! పుస్తకం ఎప్పటికీ పుస్తకమే! పుస్తకం పట్టుకుని చదవే అనుభూతి వేరే దేని వల్లా రాదు.
మీ రీడింగ్ హాబిట్స్ గురించి చెప్పండి..
నేను ఇంతకు ముందు ఎక్కువ చదివేవాడిని. కానీ ఇప్పుడు షాపు పనుల వల్ల కుదరటం లేదు. ఈ కొట్టుకు సంబంధించి అన్ని పనులూ నేనూ చూసుకోవాలి. ఆర్డరింగ్ దగ్గర నుండీ అన్నీ..
ఫలానా పుస్తకాలు అని ఎలా ఆర్డర్ చేస్తారు?
కొన్ని సార్లు డిస్ట్రిబ్యూటర్స్ సూచిస్తారు. మరికొన్ని సార్లు కస్టమర్లే అడుగుతారు, ఏ పుస్తకాలు కావాలో అని. కానీ అత్యధిక భాగం నేనే పుస్తకాల గురించి తెల్సుకొని ఎంపిక చేస్తుంటాను. దీని కోసం, దాదాపు అన్ని పుస్తకాల గురించి తెల్సుకోవాల్సి ఉంటుంది. ఎవరు రాశారు? ఏ విషయం పై? ఇలాంటి పుస్తకాలు వేరే ఏమున్నాయి? లాంటి చాలా విషయాల గురించి చదువుతాను, పుస్తకం మొత్తం చదవలేకపోయినా.
నిజం?! కొన్న షాపుల్లో పుస్తకాల పేర్లో, రచయిత పేర్లో అడిగితే “పర్ఫ్యూమ్ ఆ” అని అడిగించుకున్న అనుభవాలూ ఉన్నాయి..
అవును.. నేనూ విన్నాను. వాళ్ళు అన్ని ఆడంబరాలు పెట్టి కూడా, ఈ ప్రాధమిక విషయాన్ని విస్మరిస్తారు. ఈ ఒక్కటీ ఉంటే కూడా ఎంత బాగుంటుంది. ఒక్కటి మాత్రం నిజం.. there is no charm in selling books without knowing about them.
మీతో పాటు షాపులో ఇంకెంత మంది పని చేస్తారు?
ఆరుగురు.
మరి వాళ్ళకీ పుస్తకాల గురించి తెల్సా?
ఊ.. ఉద్యోగంలో చేరిన మొదట్లో వాళ్ళకి ట్రేనింగ్ ఇవ్వబడుతుంది.
మీ నాన్నగారు, మీకు బిజినెస్ పరంగా ఇచ్చిన అతి ముఖ్యమైన సలహా ఏది?
మా నాన్నగారి మరణం హఠాత్‍పరిణామం మాకు. అప్పటికి నేనింకా చదువుకుంటూనే ఉన్నాను. బిజినెస్ పరంగా ఆయన నాకు “ట్రేనింగ్” లాంటివేవీ ఇవ్వలేదు. కానీ మా నాన్నగారి పబ్లిక్ రిలేషన్స్ మాత్రం చెప్పుకోదగ్గవి. ఆయన కస్టమర్లని స్నేహితుల్లా భావించేవాళ్ళు. వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించేవాళ్ళు. కొంతమందైతే మా నాన్నగారితో కబుర్లు చెప్పడానికే వచ్చేవారు. షాపులో ఎప్పుడూ ఎవరో ఒకరితో మా నాన్న మాట్లాడుతూనే కనిపించేవారు. మా నాన్న ఇచ్చిన సలహా అంటే.. బహుశా.. “ఇతురలను వీలైనంతగా సేవించు, తిరిగి ఏమీ ఆశించకుండా!”
మీది చాలా పాత షాపు కదా! ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చేవారా?
వచ్చేవారు. అందులో కె.పి. ఎస్ గిల్, సునీల్ గవాస్కర్ (తన ఆటోబయోగ్రఫీ మై డేస్ విడుదలైనప్పుడు వచ్చారు), దిలీప్ కుమార్, రేఖ, ఎం.ఎఫ్. హుస్సేన్, సురేష్ ఒబరాయ్ నాకు గుర్తున్నంతలో..
స్కూల్స్ లేక కాలేజీలతో మీకు ఏవైనా “టై అప్స్” ఉన్నాయా?
టై అప్స్ అంటే స్కూల్ మేనేజ్‍మెంట్స్ పిల్లలకి కొన్ని సందర్భాల్లో మా గిఫ్ట్ వౌచర్లూ ఇస్తుంటారు. దాని వల్ల పిల్లలు తమకు నచ్చిన పుస్తకాలు కొనుక్కునే అవకాశం. ఇక డిస్కౌంట్లూ అవీ అంటే ఎప్పుడూ ఉండేవే!
మీ షాపుకి కొత్తగా పరిచయం అవుతున్న వాళ్ళకి మీ మాటగా ఏం చెప్పమంటారు?
నేనేం ప్రమాణాలు చేయను. ఈ పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే ఎ.సిలూ, కూర్చోడానికి విలాసమైన స్థలం – ఇలాంటివి కాక, పుస్తకానికి సంబంధించిన దేనికైనా రండి.. నా వంతు కృషి నేను చేస్తాను.
*************************************************************************
Address:
A.A. Husain & Co.
Book Sellers
5-8-551, Arastu Trust Building,
Abids,
Hyderabad – A.P
Tel: 040-23203724
Purnima
@gaddeswarup: Sir, Could you please let us the details of the other shop as well?
Thanks,
Purnima
Mahita
“here is no charm in selling books without knowing about them.”..
With just that statement, everything about the shop is conveyed.
ANd it hit the bull’s eye too… :)…
రవి
మేధ, అరుణ గారు ఆల్రెడీ చెప్పేశారు. నాదీ అదే మాట.
మేధ
>>నేనేం ప్రమాణాలు చేయను. ఈ పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే ఎ.సిలూ, కూర్చోడానికి విలాసమైన స్థలం – ఇలాంటివి కాక, పుస్తకానికి సంబంధించిన దేనికైనా రండి.. నా వంతు కృషి నేను చేస్తాను
too good…
కె.మహేష్ కుమార్
“ఎ.సిలూ, కూర్చోడానికి విలాసమైన స్థలం – ఇలాంటివి కాక, పుస్తకానికి సంబంధించిన దేనికైనా రండి.. నా వంతు కృషి నేను చేస్తాను.” ఒప్పుకోవాలని ఉన్నా ఎందుకో అవుంటే పుస్తకానికి మేలేకదా అనిపిస్తోంది. పుస్తక పఠనం ఒక సామాజిక ఉద్యమం చెయ్యాలంటే కూర్చోవడానికి స్థలాలూ, చర్చించుకోవడానికి వెన్యూలూ అవసరం. అందులో ఏ.సి. ఉంటే అదో సుఖం. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో చెమట్లుకారుతూ పుస్తక పరిచయాలు వినడమంటే సగం ఆనందాన్ని హరించే విషయమే కదా!
అరుణ పప్పు
‘‘పెద్ద పెద్ద మాల్స్ లో ఉండే ఎ.సిలూ, కూర్చోడానికి విలాసమైన స్థలం – ఇలాంటివి కాక, పుస్తకానికి సంబంధించిన దేనికైనా రండి.. నా వంతు కృషి నేను చేస్తాను.’’
కదిలించింది.
Prabhakar Mandaara
ముచ్చట్లు ఎంతో ముచ్చటగా వున్నాయి.
నిర్మొహమాటంగా, నిజాయితీగా వున్నాయి.
వెంటనే ఏ.ఏ. హుస్సేన్ బుక్ సెల్లర్స్ షాపుని సందర్శించాలనిపిస్తోంది.
ఈలోగా ఆసిఫ్ హుస్సేన్ గారికి చిన్న మనవి.
వారి షాపులో తప్పకుండా ఏదో ఒక మూల తెలుగు పుస్తకాలకు విధిగా చోటు కల్పించాలి.
సెలెక్టివ్ పుస్తకాలకైనా లేదా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వంటి కొన్ని మంచి పుస్తకాలు ప్రచురించే సంస్థలకైనా వారు ప్రోత్సాహం అందిన్స్తూ తెలుగు పాఠకులను కూడా మెప్పించాలి.
అభినందనలు.
పుస్తకం జిందాబాద్.
gaddeswarup
I was there for the first time this March looking for English books about India. I found books like the first 2 volumes of “Comprehensive History and Culture of Andhra Pradesh” (published by Tulika Books, New Delhi, The second volume is quite good) and many others. Aksharam is also good. There is another huge shop ( I forget the name) where several recent foreign publications (like Oxford Series) about India are available which I did not find in Hussain’s.
మాలతి
చదువుతుంటే, ఆపకుండా చదివించేలా చేసేరు ఇంటర్వూయ చిన్న హాస్యంతో, సున్నితమయిన human toughతో. అభినందనలు.