దాశరథీ… నీవెక్కడ?
వ్యాసం రాసిపంపినవారు: సుధాంశు“ఏదీ సులభముగ సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతొ దుష్కరము సుమ్ము”
దాశరథి కృష్ణమాచార్య. పేరు విన్నారా? వినే ఉంటారు. కొందరికి సినీగేయ రచయితగా ఈయన పరిచయం, కొందరికి దాశరథీ శతక కర్తగా పరిచయం. అప్పుడప్పుడూ వార్తల్లో “తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధుడు” గా కూడా వినే ఉంటారు. ఒక మనిషిని గురించి చెప్పుకునేప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా చోట పుట్టాడు, అది చదివాడు, ఈ ఉద్యోగం చేసాడు, ఇవి రాసాడు అన్న తరహాలో సాగడం సహజం. కానీ ఇవన్నీ ఎందుకో నిరుపయోగమైన నిజాలని అనిపిస్తాయి. Trivial truths. మనుషులందరిలోనూ ఉండే అతి సహజమైన complexities ని పక్కన పెట్టి పరిశీలిస్తే ప్రతి గొప్ప వ్యక్తి జీవితం లోనూ కొట్టొచ్చేట్లు కనిపించే ఒక థీమ్ ఉంటుంది. ఒక తత్త్వం. మనం విస్మరిద్దామన్నా వీలుకాని జ్వలింపజేసే ఆలోచన.
దాశరథి మహాకవి కావొచ్చు, అనువాదకుడు కావొచ్చు, వ్యాస రచయిత కావొచ్చు, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కావొచ్చు – ఇందులో పేద్ద విశేషం లేదు. అలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలున్నారు. మరి ఈయన ఎలా ప్రత్యేకం? దాశరథి మిన్ను విరిగి మీదపడుతుందన్నా వెన్ను వంచని ధీశాలి. కులం లేదు, మతం లేదు, ఇజం లేదు, భాషలేదు, ప్రాంతం లేదు. మనుషులను అన్ని స్థాయిల్లో ఏకం చేయడానికి సహజం గా ఏర్పడి, కాలక్రమేణా సంకెళ్ళుగా మారే ఏ జాఢ్యమూ సోకని వ్యక్తి దాశరథి. ఆయనకు అర్థం చేసుకున్న భాష కన్నీళ్ళది, వ్యథది, అసహాయతది – వీటన్నిటినీ దిగమింగి, జీర్ణం చేసుకుని సర్దుకుపోలేనప్పుడు, తిరగబడి మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు బయటపడతాయో తెలుసా? తెలుగైనా, ఉర్దూ అయినా – మాటలు నిప్పు కణాల్లా, బాణాల్లా తూటాల్లా పేలితే ఎలా ఉంటాయో తెలుసా? దాశరథి ని చదవండి!
దాశరథి ధీశాలి అయితే మనకేంటి, నిఖార్సైన భారతీయ విప్లవకారుడయితే మనకేంటి? పెత్తనాన్ని సహించలేని వాడు, పక్కవారి కన్నీటిని , వ్యథ నూ చూసి సహించలేని వాడయితే మనకేంటి అని అడిగేవారుండొచ్చు. మనం చిన్నప్పటి నుంచీ కథలు వింటూ పెరుగుతాం! వీరుల కథలు, ధీరుల కథలు, ధిక్కరించేవారి కథలు, ఉదాత్తుల కథలు.. మనపెద్దవాళ్ళు అవి మనకు చెప్పడానికి కారణం, కథలూ ఉదంతాలు అనువాలు జ్ఞానవాహకాలు. Learning through stories is *the* most effective! తన నిరసన తెలియజేయడానికి వరుసగా వస్తున్న యుద్ధవాహనాల ముందు ఒంటరిగా నిల్చున్న ఈ వ్యక్తిని చూడండి. ఆ ఒక్క సంఘటన, క్షణకాలపు ధైర్యం అతణ్ణి ప్రపంచ ప్రసిద్ధం చేసింది. మరి అదే స్ఫూర్తిని జీవిత కాలం ప్రదర్శంచేవారి సంగతేమిటి?
సరే.. ఏ విషయం చెప్పకుంటే కవిత్వాలూ, పుస్తకాలూ, బిరుదులూ, కథలూ అన్నీ నిరుపయోగమో ఆ విషయం పైన చెప్పేసాను. ఇక నా గోల వినండి. కాలేజి రోజుల్లో టీ షాపుల దగ్గర ప్రతి ఆదివారం ఉదయం వార్త అనుబంధం చూసేవాళ్లం. ఆధునిక సాహితీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానంతగా దాదాపు అరవై కి పైగా పుస్తకాలు రాసిన, ఇప్పుడు మనకు దాశరథి అంటే గుర్తుకు వచ్చే అక్షరవాచస్పతి దాశరథి రంగాచార్య( కృష్ణమాచార్యగారి తమ్ముడు) రాసిన “జీవనయానం” – అప్పట్లో ధారావాహిక గా వచ్చేది. అప్పట్లో మన అభిరుచులు వేరు, ప్రతి ఆదివారం చూసినా చదివింది మాత్రం లేదు. అది తొలి పరిచయం. తర్వాత్తర్వాత, నాకు చాలా ఇష్టమయిన పద్యాల్లో ఒకటైన “వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కటి కాళరాత్రి” ని దాశరథి కృష్ణమాచార్య రాసినదే అని తెలుసుకున్నాక వారిగురించీ, వారి రచనల గురించీ తెలుసుకువాలనే కోరిక కలిగింది. హైదరాబాదు పుస్తకప్రదర్శన లో “జీవనయానం” కొని చదవడం ప్రారంభించాకా, అక్కడక్కడా రంగాచార్యులవారు అగ్రజుడిని గురించి ఉటంకించడం చదివాకా, దాశరథి కృష్ణమాచార్య రచనలన్నీ చదవాలనీ, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలనీ పట్టుదల పెరిగింది.
మనం సాధారణంగా రెండు రెళ్ళు ఎంతో తెలుసుకోవాలనుకోవాలన్నా గూగుల్ నే అడుగుతాం కదా! Its a force habit, it has attained ‘ritual’ status. అదే నేనూ చేసాను. తెలుగు వికిపీడియాలో దాశరథి సహోదరుల పేజీలను చూసీ, ఇద్దరి గూర్చిన వివరాలూ కలగాపులగం అవడం చూసి,ఖంగు తిన్నాను. మీరూ ఖంగు తినాలంటే ఇక్కడ, మరియు ఇక్కడ చూడండి. ఆలోచిస్తే, అలా ఉండటం లాజికల్ అనే అనిపించింది. Wikipedia is democratic, and all democracy is unscientific(Note: merits of democracy are not being challenged). సరే, మళ్ళీ విషయానికొస్తే ఇంటర్నెట్ లో ఎంత వెదికినా దాశరథి పేరుతో రెండే పుస్తకాలు లభ్యం లో ఉన్నాయి. గాలిబ్ కవితలను అనువదించిన “గాలిబ్ గీతాలు”, వరంగల్ జైల్లో గడిపినప్పటి అనుభవాతో రాసిన “యాత్రాస్మృతి”. ఈ రెండు పుస్తకాలూ సులభం గా దొరికాయి, ఆత్రం గా చదివేసాను. వీటిని గూర్చి ఇక్కడ సమీప భవిష్యత్తులో మీతో పంచుకుంటాను. యాత్రాస్మృతి లో ప్రతి అధ్యాయం దాశరథి ఇతర కావ్యాలనుంచి సంగ్రహించిన పద్యం తో మొదలౌతాయి. చురుక్కున తగిలే ఆ పద్యాలు, ఆ పదాలు – పదం పదం లో వ్యక్తమయ్యే దాశరథి గారి స్వాతంత్ర్య కాంక్ష, ధిక్కారం నన్ను ముగ్ధుణ్ణి చేసాయి. అసలే మనకు పుస్తకాకలి! సహజం గానే అక్కడ ఉటంకించిన పుస్తకాలకోసం వెతికాను.
అగ్నిధార, మహాంధ్రోదయం, పునర్ణవం, మహాబోధి, కవితాపుష్పకం, తిమిరంతో సమరం (సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న రచన), ఆలోచనాలోచనలు, వీటన్నిటి కోసం కనబడినచోటల్లా వెతికాను. ఆ వెతకడం లో ఎదురైన అనుభవాలు అనుకోకుండా తగిలి కొన్ని మంచి పుస్తకాలు, తెలిసిన సంగతులు రాసుకుంటే ఈ వ్యాసం చాలా పెద్దదౌతుంది – కానీ కొన్ని చెబుతాను. ప్రతి పుస్తక దుకాణం లోనూ దాశరథి అనగానే దాశరథి రంగాచార్య గారి పుస్తకాలు కొన్ని తెచ్చి ముందేస్తారు, ఆశగా చూస్తాను, “ఇవి కాదండి, ఇంకో దాశరథి” అని అనగానే “లేదు. ఇప్పుడు ప్రింటులో లేవు” అని సమాధానం. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ – అన్ని చోట్లా అన్ని పుస్తకదుకాణాల్లో, అన్ని పబ్లిషర్ల దగ్గరనుంచీ ఇదే సమాధానం!
నిరంకుశుడైన నిజాం పాలించే నేల మీద నిలబడి నిజాం ను “ముసలి నక్క” అనగల్గిన దమ్మున్న దాశరథి, “కాలపు కంటిలో కరకు కత్తులు గ్రుచ్చి, మెరుంగు నెత్తురుల్ కాలువ కట్టి తెచ్చి, ధన కాళికకున్ బలి ఇచ్చి, యెన్ని కాలాలు వరమ్ము లందెదరురా?” అని నిగ్గదీసిన దాశరథి, “ఎంత తీపి పెదవులె ఇంతి! నీవి? తిట్టుచున్నప్పుడున్ కూడ తీపి గురియు” అని మురిసిపోయి దాశరథి, ఒక తపు యువకుల నెత్తురును మరిగించిన దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి( “ప్రజల మనిషి” నవలా రచయిత), ఆంధ్రపితామహ బూర్గుల, అచుత్ రావ్ దేశ్పాండే, ష్యాం అప్సంగేకార్, జంగారెడ్డి మొదలు వారు ఆదర్శంగా భావించిన దాశరథి రాసిన పుస్తకాలేవీ ప్రింటులో లేవంట, కనీసం పుస్తకాలమ్మేవాళ్లకు కూడా ఆయనెవ్వరో సరిగ్గా తెలీదంట! ఈ మధ్య కాలం లో నాకు చాలా బాధ కల్గించిన విషయం ఇది. మనుషులకొచ్చే అన్ని ఎమోషన్స్ లాగే నా బాధ కూడా నాకు తప్ప ఇంకెవ్వరికీ relevant కాదు. అంచేత దాన్నొదిలేసి, పనికొచ్చే విషయం ఒకటి అడుగుతాను చెప్పండి:
మీలో ఎవ్వరి దగ్గరైనా దాశరథి కృష్ణమాచార్య గారి మిగతా పుస్తకాలు (గాలిబ్ గీతాలు, యాత్రాస్మృత తప్ప) ఉంటే, అవి నాకు అరువివ్వగలిగితే దయచేసి ఒక వ్యాఖ్య ఇక్కడ వదలండి. మీరెక్కడున్నా పర్లేదు – వ్యయప్రయాసలకోర్చి నేను వాటి ని తెచ్చుకుంటాను. తెచ్చి డిజిటైజ్ చేస్తాను!
pavan santhosh surampudi
ఈ వ్యధ నేనూ అనుభవించాను అచ్చంగా మీలానే. విషయమేంటంటే విశాలాంధ్ర వారు ఆ మహాకవి కవితాసంకలనాలు ప్రచురించారు ఈ మధ్యే.
ఎట్టకేలకు..దాశరథి! | YOGIRK
[…] ఉంటే ఇస్తారేమో అన్న ఉద్దేశం తో ఇక్కడో అభ్యర్థనాపూర్వక టపా రాశాను. ఆచార్య ఫణీంద్ర గారు […]
ఎట్టకేలకు..దాశరథి! - సముద్రం నా పేరు..
[…] ఉంటే ఇస్తారేమో అన్న ఉద్దేశం తో ఇక్కడో అభ్యర్థనాపూర్వక టపా రాశాను. ఆచార్య ఫణీంద్ర గారు […]
Achilles
Wow! Thank you!! 🙂
సౌమ్య
new.dli.ernet.in వెబ్సైటులో “daasharathi” అన్న క్వెరీ ఇవ్వండి. ’అలోచనాలోచనాలు’ అన్న కవితాసంపుటి, జ్వాలాలేఖిని అన్న కవితాసంపుటి ధ్వజమెత్తిన ప్రజ, గాలిబ్ గీతాలు – ఈ నాలుగూ ఉన్నాయి అక్కడ. పీడిఎఫ్ కి మార్చుకోడానికి భువనవిజయం బ్లాగులోని టూల్ ని వినియోగించండి.
Krishna
Sudhanshu gaaru,
http://dracharyaphaneendra.wordpress.com/2009/07/20/మహాకవి-దాశరథి/
Dasarathi gari pustakalu anni Dr. Phannendra gaari degara unayata….
meeru Hyderabad vasi aite…daya chesi prayatninchandi…vari post lo
kuda vyakhya unchaanu…
Krishna
కొత్తపాళీ
విజయవాడ లెనిన్ సెంటర్లో పాతపుస్తకాల షాపుల మధ్యన నాగేశ్వర్రావు కొట్టు ఉంటుంది. ఆయనికి ఒక మాట చెప్పి ఉంచండి.
కాలనేమి
“మీలో ఎవ్వరి దగ్గరైనా దాశరథి కృష్ణమాచార్య గారి మిగతా పుస్తకాలు (గాలిబ్ గీతాలు, యాత్రాస్మృత తప్ప) ఉంటే, అవి నాకు అరువివ్వగలిగితే దయచేసి ఒక వ్యాఖ్య ఇక్కడ వదలండి. మీరెక్కడున్నా పర్లేదు – వ్యయప్రయాసలకోర్చి నేను వాటి ని తెచ్చుకుంటాను. తెచ్చి డిజిటైజ్ చేస్తాను!”
Hmm..ఎవరిదగ్గరా లేవన్నమాట!
Así es la vida!! 🙁 🙁
chavakiran
ఎప్పుడో వ్రాసుకున్న కవిత
http://archives.chavakiran.com/?p=973
మీరు చక్కగా చెప్పారు తమ్ముడు అన్నను పేరుతో సహా ఆక్రమించటాన్ని 🙂
Sowmya
That was a nice article. Waiting to see more from you!
మైత్రేయి
thanks for sharing your thoughts.
Both brothers are great human beings.