చరిత్రకు భాష్యకారుడు
(ఆర్నాల్డ్ టాయిన్బీ గురించి నండూరి సంతాపకీయం. ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
*************
మానవజాతి చరిత్రలో ఎన్నో మహా నాగరికతలు ఆవిర్భవించాయి, కొంత కాలం వర్ధిల్లాయి, కాలగర్భంలో అంతరించాయి.
ఎందువల్ల ఇలా జరిగింది? ఏ నాగరికత ఎల్లకాలం ఎందుకు వర్దిల్లలేదు?
అసలు ఏ నాగరికత అయినా ఎందుకు, ఎలా అవతరిస్తుంది? ఎందుకు, ఎలా వర్ధిల్లుతుంది? ఎందుకు, ఎలా అంతరిస్తుంది?
ఆరువేల ఏళ్ళు వెనుకకు పోయి చూస్తే, మానవ చరిత్రలో ఈజిప్షియన్, సుమేరియన్, అక్కేడియన్, బాబిలోనియన్, సింధు, చైనీస్, గ్రీక్ ఇలా ఎన్నో నాగరికతలు పరిఢవిల్లినట్టు కనిపిస్తుంది. ఇవి దేనికది స్వతంత్రంగా ఆవిర్భవించాయా? లేక ఒక దాని నుండి ఒకటి ఉత్పన్నమైనాయా? వీటి మధ్య పరస్పర సంబంధాలు ఎటువంటివి?
ఇట్టివే, కొన్ని మౌలిక ప్రశ్నలు తనకు తాను వేసుకొని, వాటికి తార్కికమైన సమాధానాలు చెప్పడానికి ఒక జీవితకాలాన్ని వెచ్చించిన మహామనీషి మొన్న కన్నుమూసిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ టాయిన్బీ. మొత్తం మానవ చరిత్రను ఆయన కూలంకషంగా మథించాడు. ఎన్నో విస్మృత నాగరికతలను అధ్యయనం చేశాడు. నలభై ఏళ్లపాటు ఏకదీక్షగా సాగిన ఆ అధ్యయనం ఫలితమే ఆయన పన్నెండు సంపుటాలలో రచించిన బృహద్గ్రంథం “ఎ స్టడీ ఆఫ్ హిస్టరీ“.
టాయిన్బీ కేవలం చారిత్రిక సంఘటనలను తీదీల వారీగా వ్రాసుకుపోయిన వట్టి చరిత్రకారుడు కాడు. చరిత్రకు ఆయన గట్టి భాష్యకారుడు. మొత్తం ౨౮ నాగరికతలను, వాటి అభ్యుదయ, పతనాలను ఆయన అధ్యయనం చేశాడు. హారంలో దారంవలె దాగి ఆయా నాగరికతలను ఏకసూత్రంలో బందిస్తున్న చారిత్రిక సత్యాన్ని అన్వేషించాడు.
ఒక జాతి జన్మతః మిగిలిన జాతుల కంటె గొప్పది కావడం వల్లనే గొప్ప నాగరికతను సృష్టించ గలుగుతుందని కొందరు చరిత్రకారుల వాదన. దీనిని టాయిన్బీ త్రోసిపుచ్చాడు. ఒక జాతి తన భౌతిక పరిసరాలు తన సుఖమయ జీవితానికి అనుకూలంగా వున్నప్పుడే గొప్ప నాగరికతను సాధించగలుగుతుందని మరి కొందరన్నారు. దీన్ని కూడా ఆయన తిరస్కరించాడు. జర్మన్ తత్వవేత్త, చరిత్రకారుడు స్పెంగ్లర్ వలె కొందరు నాగరికతలకు కూడా వ్యక్తులవలె – శైశవ, యౌవన, వృద్ధాప్య దశలుంటాయని విశ్వసించారు. దీన్ని సయితం టాయిన్బీ నిరాకరించాడు.
ఏ సమాజమైనా, తన ప్రాకృతిక పరిసరాల నుంచి, లేదా, ఇతర సమాజాల నుంచి వచ్చే సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలోనే నాగరికత అన్నది ఆవిర్భవిస్తుందని టాయిన్బీ సిద్ధాంతం. దీనికి ఆయన “ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్” (సవాలు-జవాబు) అని పేరు పెట్టాడు. అంటే పరిస్థితులు అనుకూలంగా కాక ప్రతికూలంగా ఉన్నప్పుడే నాగరికతా సృష్టికి ప్రేరణ కలుగుతుందని ఆయన వాదం. ఈ సిద్ధాంతానికి నిరూపణగా ఆయన ప్రాచీన, అర్వాచీన చరిత్ర నుంచి ఇచ్చిన అనేకోదాహరణలలో ఆయన ప్రతిభా వైడుశ్యాలు అచ్చెరువు కలిగిస్తాయి.
టాయిన్బీ పై విమర్శలు రాకపోలేదు. కొన్ని వైరుధ్యాలకు ఆయన లోనైనాడని ఒక విమర్శ. ఆయన సాధారణీకరణ (జనరలైజేషన్) కొన్ని చోట్ల మితిమీరినదని మరొక విమర్శ. మతం పట్ల ఆయన విశ్వాసంపై వేరొక విమర్శ. ఏమైనా ఆయనా పాండిత్య వైభవాన్ని కాదన్న వారు లేరు.
చరిత్రకారులు సాధారణంగా జోస్యం చెప్పకుండా ఉండలేరు. టాయిన్బీ మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలను ముందుగానే ఊహించి చెప్పాడట. సుమారు ఇరవై ఏళ్ల క్రిందట ప్రాక్పశ్చిమ సైనిక కూటాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన ఇండియాలో పర్యటిస్తూ ఒక ప్రసంగంలో క్యాపిటలిజం, కమ్యూనిజంలు ఎన్నటికైనా సహజీవనం చేయక తప్పదని చెప్పాడు. దీనికి సమర్థనగా మధ్య యుగాలలో పరస్పర విద్వేషంతో ఘర్షించిన ఇస్లాం, క్రైస్తవ మతాలు ఈనాటి సహజీవనం నెరపడాన్ని ఆయన ఉదాహరించాడు. ఆయన మాటలు ఆనాడు ఆశ్చర్యం కల్గించినా, ఈనాటి పరిణామాలను బట్టి ఆయన సరిగానే ఊహించినట్టు అనుకోవాలి.
తన “స్టడీ ఆఫ్ హిస్టరీ”లో ఇండియాను గురించి కూడా టాయిన్బీ ఒక ఊహాగానం చేశాడు. ఇండియా ఎదుర్కొంటున్న పెద్ద సవాలు జనాభా పెరుగుదల అని, దాన్ని భారతీయ నాయకులు పాశ్చాత్య మానవతా పద్ధతులలో ఎదుర్కొన లేకపోతే ఇండియాను కమ్యూనిజం లోగోనక తప్పదని ఆయన భావన.
ప్రొఫెసర్ టాయిన్బీ సిద్ధాంతాలు, జోస్యాలు ఎట్టివైనా, వాటిలో కొన్నిటితో ఏకీభవించలేకపోయినా, ఒక మౌలిక చరిత్ర కారుడుగా ఆయన ప్రతిభా పాండిత్యాలకు జోహారులర్పించని వారుండరు.
అక్టోబర్ ౨౫, ౧౯౭౫
(October 25, 1975)
ranganath
chala bagundhi