సొంతగూడు – Toni Morrison’s Home

టోని మోరిసన్ నోబెల్ బహుమతి గ్రహించిన (1993) నవలా రచయిత్రి. ఆఫ్రికన్ అమెరికన్ (నల్ల) జాతి మహిళ. నల్లవారి జీవితంలో ఉన్న సమస్యలు, సంఘర్షణలు, సంక్లిష్టతలను కవితాత్మకమైన వచనంలో ప్రతిభావంతంగా చిత్రించటానికి పేరు గాంచింది. ఇప్పటి అమెరికన్ రచయితల్లో, ముఖ్యంగా నల్లవారిలో, ప్రముఖస్థానంలో ఉన్న రచయిత్రి. ఆవిడ క్రొత్తగా వ్రాసిన నవల హోం.

ఈ నవల ఒక కవితతో ప్రారంభమౌతుంది:
“ఎవరిది ఈ ఇల్లు
ఎవరి రాత్రులు ఇక్కడి దీపాల్ని ఆర్పుతున్నాయి
ఈ ఇంటి యజమాని ఎవరో చెప్పండి
ఇది నాది కాదు
నేను కలగన్నది ఇంకా అందంగా, మెరుస్తూ
సరసులను దాటున్న నావల దృశ్యాలతో
బాహువులు విశాలంగా చాచిన బయళ్ళతో నన్ను ఆహ్వానిస్తుంది.
ఈ ఇల్లు కొత్తగా ఉంది
దీని నీడలు అబద్ధాలాడుతున్నాయి
మరి దీని తాళపుకప్ప నా తాళపుచెవికి ఎందుకని సరిపోతుంది?”

ఈ నవల ఇద్దరు అన్నాచెల్లెళ్ల గురించి. 1950లలో, పౌరహక్కుల పోరాటం ముందు కాలంలో జరిగిన కథ. ఫ్రాంక్ మనీ అనే నల్ల జాతి వ్యక్తి కొరియన్ యుద్ధంలో గాయపడి అమెరికాకు తిరిగివచ్చాడు. అతని పటాలంలోనే ఉన్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులు తన కళ్ళముందే మరణించగా తాను బతికి ఉండటం అతనిలో విపరీతమైన దోషభావాన్ని కలిగిస్తుంది. తన ఊరికి తిరిగివెళ్ళి తన స్నేహితుల తల్లితండ్రులు ఎదుటపడటానికి అతనికి మొహం చెల్లదు. సైన్యంనుంచి విడుదల అయినప్పుడు వచ్చిన డబ్బుతో తాగుతూ తన గతాన్ని మర్చిపోవటానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తుంటాడు. యుద్ధకాలపు జ్ఙాపకాలు అతన్ని వదలవు; ఉన్నట్టుండి అతను అవాస్తవికమైన లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక అమ్మాయితో కొంత బాంధవ్యం ఏర్పడినా, అతని మానసిక స్థితి ఆ బంధాల్ని నిలుపుకోనివ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి అట్లాంటానుంచి ఎవరో ఉత్తరం వ్రాశారు – “తొందరగా రా, నీ చెల్లెలు చచ్చిపోతూంది.”

ఫ్రాంక్ ఇంటి పేరు మనీ ఐనా, అతని జీవితంలో డబ్బు ఎప్పుడూ లేదు. ఫ్రాంక్ కుటుంబం ముందు టెక్సస్‌లో ఉండేవారు. ఒకరోజున ఊళ్ళో ఉన్న తెల్లవారు నల్లవారిని 24 గంటలలో ఊరు విడచి వెళ్ళిపోమని ఆదేశించారు. ఉన్న ఊరిని రాత్రికి రాత్రే వదిలేసి కట్టుబట్టలతో బయలుదేరి లూజియానా మార్గం పట్టాయి ఆ కుటుంబాలన్నీ. అప్పుడు ఫ్రాంక్ చిన్నపిల్లవాడు. చెల్లెలు ఇంకా పుట్టలేదు. తల్లి గర్భంలో ఉంది. వారి కుటుంబం నెమ్మదిగా లోటస్ అనే కుగ్రామాన్ని చేరుకుంది. యుద్ధరంగంకన్నా అన్యాయమైన ఊరు అది. ఎండలో పొలాల్లో పనిచేయడం వల్లవచ్చే కొద్దిపాటి చిన్న రాబడితో జీవించడం తప్ప వేరే ఏం లేదు ఆ ఊళ్ళో. తల్లీ తండ్రీ పనికిపోతే ఫ్రాంక్ తనకన్నా నాలుగేళ్ళ చిన్నదైన చెల్లెలి సంరక్షణను తానే చూసుకునేవాడు. ఆమె పేరు యిసిడ్రా, సీ అని పిలుస్తారు. తల్లితండ్రులు చనిపోయారు. ఆ ఊరిలో ఎలాంటి భవిష్యత్తూ కనిపించని ఫ్రాంక్ ఇద్దరు స్నేహితులతో కలసి ఆర్మీలో చేరిపోయాడు. సీ ఊళ్ళోకి వచ్చిన ఒక పోరంబోకు సోగ్గాడి వలలో పడి అతన్ని పెళ్ళి చేసుకుంది. వాడు ఆమెను లోటస్ నుంచి అట్లాంటా చేర్చి కొన్నాళ్ళ తర్వాత మాయమైపోయాడు. అప్పట్నుంచి చిన్నా చితకా ఉద్యోగాలలో కష్టపడుతూ చివరికి ఒక డాక్టరుకు సహాయకురాలిగా కొద్దిగా మంచి ఉద్యోగంలోనే చేరింది. ఆర్మీలో చేరిన తర్వాత ఫ్రాంక్ ఈ ఉత్తరం వచ్చేవరకూ చెల్లిని చూడలేదు.

సియాటిల్‌లో మానసికరోగుల ఆసుపత్రిలో ఉన్న ఫ్రాంక్ అక్కడినుంచి తప్పించుకొని, కొంతమంది నల్ల మతప్రచారకుల సహయంతో చికాగో చేరుకుని అక్కడనుంచి అట్లాంటా చేరుకొంటాడు. అక్కడ సీ ఆమెకు ఉద్యోగం ఇచ్చిన డాక్టరు ఆమె శరీరంపై చేసిన పరిశోధనలవల్ల చావుబతుకుల మధ్య ఉంది. ఫ్రాంక్ తన చెల్లెల్ని తీసుకుని తన స్వగ్రామానికి చేరాడు..

మంచి భవిష్యత్తుని వెతుక్కుంటూ తమ స్వస్థలాన్ని వీడి వెళ్ళిన అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ మళ్ళీ స్వంత గూటికే చేరారు. కాకపోతే ఇప్పుడు ఒకరు శారీరకంగా, ఇంకొకరు మానసికంగా వికలాంగులు. వారికి ఇక్కడ స్వస్థత దొరుకుతుందా? మళ్ళీ మన ఇంట్లో మనం ఇమడగలమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది.

హోం చిన్న పుస్తకం. టోని మోరిసన్ పూర్వపు పుస్తకాలతో పోలిస్తే మరీ చిన్నది. 145 పేజీలు. పుస్తకం చకచకా చదివిస్తుంది. పుస్తకం చిన్నదే ఐనా, దీన్లో చాలా సంఘటనలూ, పాత్రలూ ఉన్నాయి. అప్పటి బీద నల్లవారి జీవితంలో ఉన్న ఆశా రాహిత్యాన్నీ, అణచివేతనీ, తరతరాలుగా దౌష్ట్యానికి గురి అవుతున్నా మొక్కవోని నల్ల స్త్రీల జీవశక్తినీ రచయిత్రి స్పష్టంగా చిత్రీకరించింది. యుద్ధంలో దారుణ మానసికఘాతాలకు గురి ఐనవారికి యుద్ధానంతరం కలిగే మానసిక అస్వస్థతనూ చక్కగా చిత్రీకరించింది.

తక్కువ నిడివిలో ఎక్కువ విషయాలు చెప్పాలని ప్రయత్నించడం వల్లనో ఏమో గాని, టోని మోరిసన్ పుస్తకాలలో ఉండే కవితాత్మక వచనం ఈ పుస్తకంలో మామూలు స్థాయిలో లేదు. ప్రతీకలుగా కనిపించిన కొన్ని పాత్రల్లోనూ, సంఘటనల్లోనూ లోతు కనిపించలేదు. ఫ్రాంక్ తప్పించి మిగతా పాత్రలన్నీ అస్పష్టంగా మిగిలిపోయాయి. ఫ్రాంక్ మానసిక పరిస్థితికి రచయిత్రి కల్పించిన ముఖ్య కారణం నాకు వృత్తిపరంగా నచ్చలేదు. ఈ కారణాలవల్ల పుస్తకం బాగానే ఉంది అని మాత్రమే అనిపించింది.

* * *

Home
Toni Morrison
2012
Publisher: Alfred A Knopf
2012
145 pages

You Might Also Like

2 Comments

  1. varaprasad

    home is the final destination of everyone,

Leave a Reply