రంధి సోమరాజు మూడు కాలాల ‘పొద్దు’

పుస్తకాలు సర్దుకొంటుంటే రంధి సోమరాజుగారి పొద్దు కనిపించింది. ఈ పుస్తకాన్ని మొదట గ్యాలీ ప్రూఫుల దశలో చదివానని గుర్తు. నా చిన్నతనంలో రంధి సోమరాజుగారి పేరు బాగానే కనిపిస్తుండేది. పత్రికలలో ఆయన కథలు, నవలలు కనిపిస్తుండేవి. కవిత్వం కూడా చాలానే వ్రాశారు. నాకు ఆయన కథలూ, నాటకాలు అంతగా గుర్తు లేవుకానీ ఆయన కవిత్వం మాత్రం కొద్దిగా గుర్తుంది. ఉత్తరాంధ్ర యాసలో కవిత్వం రాసేవారు. బుల్లి బుల్లి సిత్రాలు అని కొన్ని కవితల్లో జనజీవనాన్ని చిత్రించినట్లు గుర్తు. అన్నిట్లోకి ఎక్కువగా గుర్తున్నది మాత్రం ఈ పొద్దు సంకలనంలోని కవితలే.

ఈ చిన్న పుస్తకంలో మూడు పెద్ద కవితలు ఉన్నాయి – వోనాకాలం, శీతకట్టు, ఏసంగిపొద్దులు. ఆంధ్రదేశపు వాతావరణం లాగానే, శీతకట్టు మిగతా రెండింటి కన్నా పరిమాణంలో చిన్నది. ఋతువర్ణన మనకు అనాదిగా ఉన్న సాహితీ వస్తువే ఐనా, సోమరాజుగారి చూపు వేరు, బాస వేరు. ఆయన పద్యాలను కొన్నిటిని చదివితే మీకే అర్థమౌతుంది ఈ కవితల సొగసు. నేను ఎక్కువ మాటలు చెప్పవలసిన అవసరం ఉండదు.

వోనాకాలం

వోనా కాలం వొత్తే సాలు
వొల్లు కుందేలు పిల్లనా
గెంతు లేత్తాది

జల జల సినుకు లడ్తా వుంటే
సమర్తాడిన గుంటలు
సెమ్మ సెక్క లాడ్తున్న ట్టుంటాది

సూరీడ్ని సొక్కా జేబులో ఏసి
మూసేత్తునట్టు
సెనంలో మబ్బులు
నోకాన్ని మూసేత్తాయి

యెండలు పేనాలు తీత్తె
వోనలు పేనా లిత్తాయి
అందుకే నొరే
యెండ లెము లోలు
వోనలు సల్లని తల్లులు

వోనలో నా న్నాని (నాని నాని)
బాతులు రెక్క లార్సుకుంటూ
“ వోన నొగ్గీసి మేం రాం” అన్నట్టు
తోక లడ్డంగా ఆడిత్తాయి

అసలు గుద్దులాట లాగిసచ్చినా
మూల మూలల్లో యుద్దం మిగి లున్నట్టు
ఆరబైట వో నెల్సిపోతే
సెట్టు కింద వోన సిటపట మంటాది

ఆకు జోడుతో పట్టి పట్టి నడ్వకపోతే
ఎనకేపు వోన్నీలు (వోననీలు)
సొక్కా సెవులు దాక
బురద బొ ట్లెడతాయి
సుకంగా నడ్సెల్తన్నాం అని
సంబరపడ్తే సాలేటి
ఎన కే టౌతుందో
సూసుకునే సరుకుండాల

గోదారి పూటుగా వొత్తే
సూడ్డానికొచ్చే పట్టుసీర్ల రాణీలు
బిడ్జీకాడ ఈదుల్లోని నీలుసూసి
సీర్ల కన్న వొల్లే సిగ్గు లేన్దని
గుడ్డలెత్తుకునే నడుత్తారు!

వోనలో ఎలిగే బల్బులు
సిన్ని సేమంతి పూరేకు మొనల్లాటి
సిరు సెమటతో మెరుత్తూ
సల్లని కిరనాల వోన కురిపిత్తయ్
సిన్ని బుడ్డిసూరిదేవుళ్ళనాగ

మందేసి కోరీలని
దెబ్బకు బద్దలు సేసినట్టు
ఆకాశెంలో
ధన్ ధనా మని బద్ద లౌ ద్దొరే మబ్బు

సల్లని గాలి తాకిడికి
సుకంగా కరిగిపోద్ది మబ్బు
గొప్పోలు అలా పేదల గుండెల్ని
కరిగిత్తే
నోకమంతా ఔద్దొరే
వొకటే సేమంతి పువ్వు!

జెర్రి పాకినట్టు
ఆకాశెం మీద సూడు
ఎలా పాకుద్దో
మెరుపు!

యెంత కాలని కెంత కాలాని కంటూ
ఆకాశెంలో మబ్బులు
ముద్దు లాడ్తా వుంటే
ఆ ముద్దు లందం
యీ మెరుపు ముక్కలంట!

ఏసంగిలో ఇం తో నొత్తే సాలనుకుంటాం
వోనలప్పు డిం తెం డొత్తే సాలనుకుంటాం
అంతేనొరే…. అంతే…
వుత్త సంటోడి బుద్దనుకో…
ఇంతకీ మనం కాలం సేతిలో సంటోలం కాదేటి?

తెల్లార్లూ సూరు నుండి
సిదుకు సిదుకు మని
సినుకు లడ్తా ఉంటే
నిద్దరేటడద్ది
సెవికాడ వొకటే
ముసిలోల సనుగుడు నాగ
పై కెగర్ని వోనరోకళ్ల
దంపుళ్ళ పోటు!

ఏలెట్టి
ఆకాశెం కంటిలో పొడిత్తే
కారే నీలలా
వొకటే వోన!

యిల్ల కప్పుల మీద
దారి తెలియనట్టు
పొగ నిల్సి పోనాది
ఏ వూరెల్లాలో మరి
ఆ పొగ పిల్ల!

ఇల్లార్పడానికి
నీల కార్లెట్టినట్టు
ఇళ్ళెండెయ్యడానికి
యెండ కార్లెట్టినా బావుండేది
పెబుత్తమోరు!

గోడల్లోంచి వుబికిన నీలు
సూత్తే….
సేతి కందికొచ్చిన కొడుకు
సచ్చిపోయి
గోడకి సేరగిలి పోయినోడు
దిగాలుగా
కల్ల ముందు నిలుత్తాడు!

సూరిబాబు తిన్న నై నో డేటి?
సెయ్యుచ్చుకు నాగితే
పట్ట పగలే సరస మేటని మబ్బు రాణీ
సె య్యిదిలించు కుందేమొ …. సటుక్కున
ఆకాశెం మీద ఐదు రంగుల గాజు ముక్క రాలింది

సెందురుడి సుట్టు
సిన్ని గుడి సుట్టి
సెక్రాల జుట్టు
నోకాని కిచ్చి
ఎయ్యి రూపాల
ఎలిగి పోనాది
వొయ్యారి మబ్బుల
వోన పిల్ల!

శీతకట్టు

గోదాట్లో నీలు
నలుపు తిరిగి
సెందురుడికి కన్ను గీటాయి
గుండెలోకి రమ్మంటూ….

పక్కలొంచేత్తోంది తస్సాదియ్యని సలి
మడ్సుల వొల్లే దానికి పక్కేమొ!
సిట్ట సీకట్లో దుప్పటి సరిసేత్తున్నట్టు
వొల్లంతా తడి వేత్తోంది!

ఏరుసెనక్కాయిలు తింటూ
సినేమా కట్టాలు సూసి
కన్నీ లెట్టుకునే కుర్రోలకి
ఈదిలో గేటు ముందల సలిలో కూసోని
సెనక్కాయలమ్మే ముసిలిముద్ద
ఒకసారీ కల్లల్లోకి రానే దదేటి సిత్రమో!

సలిలో పడవలు లాగేవోళ్ళని సూసి
సలిదేవుడే
సలెత్తి పోనాడు!

మాటాడ కొరే
కల్లిప్పి సూడు
సెందురుడు సలిసంద్రాన కూకోని
తప స్సేత్తూ
ఎన్నె ల్నెలా
దారోత్తన్నాడో ….

కొబ్బరినూని సిక్కగా పేరుకపోయి
పేరుకున్న నెయ్యి నాగ ముద్దగట్టుక పోనాది
పొయ్యికాడెడ్తే మల్లీ పేనం పోసుకుంది
అత్తోరింటికాడ ముడ్సుక పోయిన బుల్లి
అమ్మగోరింటి కాడ కల్విడిగా తిరిగినట్టు!

బుజం మీద
నిండా లేని కుండలో
వూగీస లాడే నీలనా
వొనికి సత్తోంది గుండె!

తెల్లార గట్ట
గోదాట్లో
అరటి దొప్పల్లో ఆడో ళ్ళొదిలిన దివ్వెలు
సుక్కలికి తల్లిసుక్క లెట్టిన బువ్వ లొరే!

ఎప్పుడూ నేదు గొల్లమ్మి
సిక్కని పా లోసింది
రేత్రి ఎన్నెల్ని కాని పిండుకుందేమో!

ఏటీ రుసిగా నేదు ఎదవ కాలం అని
నోకం శోకాలు తీత్తె
సెరకు ముక్కిచ్చి
సూసుకో నా మజాకా అంది సలి!

కొత్త బియ్యంతో అమ్మ
తాజాబెల్ల మేసి
పాలజా వొండితే
వొలసిన సిన్నదాన్ని
కట్టేసు కున్నట్టుంది!

తడ్పిన బట్టలిట్టే పొడి పొడ్లాడ్తాయి
బూమి బీట్లారుద్ది
పాపం ఎక్కడ లేని నీలు తాగేత్తాది సలి!
కోరుకున్న వొసంతం బుల్లి
సేతి కందే దాక యిలాగే
తాగుద్దేమో తాగుమోతు సలి!

ఏసంగి పొద్దులు

కూత్తూన్న కోయిల
సెట్టు కాడ నిలేత్తాది
యిని యిని
వో సెట్టయితే సా లనిపిత్తాది!

సిరు గాలి తగిల్తేసాలు
వొంటి కేటీ తెలీదు
సెక్రవొర్తి నా
దాన్ని దోసెయ్యాలనిపిత్తాది

సీక టడక ముందు
వొల్లమాలి నన్ని రంగులు
పడమటేపు వొయ్యారా లొలక బోత్తే
య్యేటీ సెయ్య బుద్దెయ్యదు
అటే సూత్తూ కల్లూ వొల్లూ
సంటోణ్ణి కూడ
సూడ మర్సిపోతాయ్!

కుర్ర నాగమ్మల వొల్లు
నూకల కూడునా పేలిపోద్ది
మంచి గందం సెక్క
అరగ దీసి పామితే
తల్లి సుట్టూ గందం బొమ్మల్లా
గెంతు లేత్తారు

తాటి ముంజి లెన్ని తిన్నా
ముద్దు లేనా వొద్దంటాదికాని
ఆటి నొ ద్దనదు పేనం!

సవ్వగా ఉన్నా
పుచ్చకాయలు
నాలిక పెడార్సక సావకుండా
సూరీడు కే దావత కట్టిత్తాయ్

అదేటో
దుడ్డు లే నోడి యింటి ముందు
అయిరాన సేసె
రాకాసి పన్నుల కలకటేరునా
యెగదోసు కొత్తాది యెండ!

నీ లెండ బెట్టవేం అని
వోలో సూరీడి నెత్తిమీద గూసోని
గొడ్డుని బాదినట్టు బాదుతా వుంటే
యెండ సిన్నోడు
వొగుర్తూ యిడ్సిన గాలే నంట
యీ వొడ గాడ్పు!

బోయిలేరులో నడ్సెల్తున్నట్టుంది
రామసెంద్ర పెబో
యెండలో నడక!

బతుకులో సుకం సిటికెడేనేమొ
తెల్లారగట్ట శీతగాలి కొట్టి
పేనానికి పేనమయింది

ఆ సుకం సూడనేక
కడుపుబ్బి
పుచ్చకాయ గింజల్లా
పుట్టె డీగలు
మీద నోలి
సికాకు పెట్టేసి నై!

సల్లని సూపుల్తో ఏకాసులు పేసి
ఆనక రాకాసుల్లా కయ్యాలాడే
ఆడంగులికీ ఏసంగికీ
యేటీ తేడా నేదు
వొరున వోన కుర్సినప్పుడెల్లా సల్లంగా వుంటదో
యెండెక్కితే సాలు
అంత మండుకు పోద్ది!

అయిసుపూటు లమ్ముతూ సిట్టితండ్రి
అమ్మ కడుపులో సిచ్చెట్టి
వొడ దెబ్బకు రాలి పోనాడు!

యిసక తిప్పలతో
బయటడ్డ గోదారి
యెట్టాం టోల్ల కేనా
తిప్పలు
తప్పవన్నట్టుంది!

పిటపిటలాడే సాకలి సిన్నది
వొయ్యారం వొల్లైంది
రేవు కాడ రై కిసి రేసి
వున్న వోయిల సీ రిప్పకుండ
నీలల్లొ ములిగి
మునేల మీద గట్టెక్కితే
ఓరి నాయినో ఎయ్యికల్లు సాలవ్
పొరలు పొరలుగా
తడి వొదుగుళ్ళ సీర నలుగుళ్ళు
సెర్మాన్ని సుట్టేసుకోని
బిగువుల్ని సూపితే
సిగ్గేసి సిన్నది సిన్న నవ్వు నవ్వితే
ఛస్ …. ఆ నవ్వునా ఎలగనేక పోనా నని
సూరీడు సిగ్గుతో సత్తా డంతే!

ఈ పుస్తకానికి దాశరధి, మల్లంపల్లి శరభేశ్వర శర్మ, సంజీవదేవ్, సి.నారాయణరెడ్డి ముందు మాటలు వ్రాశారు. వీరి దృష్టిపథాలు వేరైనా, ఈ కవితలు వీరందరి మన్ననలు పొందాయి. నేను ఉదహరించిన పంక్తులే కాక మిగతావి కూడా చక్కటి పరిశీలనలతోనూ, మంచి పోలికలతోనూ గిలిగింతలు పెడతాయి. ఆహా అనిపిస్తాయి. ఆలోచింప చేస్తాయి.

పుస్తకం చిన్నగా, చక్కగా, పొందిగ్గా ఉంది. ముద్రణ బాగుంది. ముఖపత్రాలంకరణ శీలా వీర్రాజుగారిది. అచ్చుతప్పులు లేవు.

1955లో రచయితల ప్రకటనపై ఆరుద్ర సంతకం వివాదంలో, ఆరుద్రని విమర్శిస్తూ ఉత్తరాలు వ్రాసిన ఇద్దరిలో రంధి సోమరాజు ఒకరు. శ్రీశ్రీ షష్తిపూర్తి సందర్భంలో, శ్రీశ్రీని ఆక్షేపిస్తూ కవిత్వం వ్రాశారని గుర్తు. రంధి సోమరాజు గారు రాజకీయాలమీద వ్రాసిన కవితలకన్నా జనజీవనాన్ని వర్ణిస్తూ వ్రాసిన కవితలే బాగుంటాయని ఆయన రచనలు ఎరిగిన మిత్రుడొకరు చెప్పారు. ఏలూర్లో చాలాకాలం ఉన్న రంధి సోమరాజు గారు ఇప్పుడు లేరనుకుంటాను.

* * *
పొద్దు
నవకవిత
రంధి సోమరాజు
జూన్ 1972
72 పేజీలు
అప్పటి ధర: మూడు రూపాయలు

You Might Also Like

One Comment

  1. పంతుల గోపాల కృష్ణ

    చాలా అద్భుతమైన కవిత.మన ప్రబంధాల్లో ఋతు వర్ణన ఇంత గొప్పగా లేకున్నా వాటికి విశేషమైన ప్రఖ్యాతి లభిస్తుంది.జానపదుల బాషలో వ్రాయడం వల్ల సోమ రాజు గారికి ఆఖ్యాతి రాలేదనుకుంటాను.ఫరవా లేదు. దీని విశిష్టత దీనిది. చాలా ఏళ్లక్రితం ఏదో వీక్లీలో సోమరాజుగారి కవిత చదివాను. అద్భుతంగా ఉంటుందది.పేరు గుర్తు లేదు.వీరి ఈ కవితా సంపుటి కాని తర్వాతి రచనల సంపుటి కాని ఎక్కడైనా దొరుకుతాయేమో తెలియజేయండి. వీలయితే వీరి ఇతర రచనలూ పరిచయం చేయండి.అభిమందనలు.

Leave a Reply