“కదంబి” కబుర్లు – 1

vbs008(గూగుల్ చేయటం వల్ల  కలిగే గొప్ప లాభం, ఒకటి వెతకబోతే మరోటి తగలటం. ఏదో పుస్తకాల షాపు కోసం వెదుకుతుంటే, హిందూ లోని ఈ ఆర్టికల్ మా కళ్ళబడింది. ఓ సారి చూసొద్దాం అనుకుంటూ వెళ్లి, కదంబి బుక్ సెల్లర్స్ అధినేత, రామకృష్ణ ఆచార్య గారితో మేం ముచ్చటించినవి, ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది ఇంటర్వ్యూ కాదు, నేను జర్నలిస్ట్ ను అంత కన్నా కాను. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుని, మాట్లాడిన అనుభవాన్ని తిరిగి అందరితో పంచుకోవటమే నా ఉద్దేశ్యం! ఇక్కడ చెప్పుకొచ్చే విషయాలు నాకు గుర్తున్నంతలో సరియైనవే! ఎక్కడైనా పొరపాట్లు జరిగుంటే, అందుకు ముందస్తు క్షమాపణలు!)

మే నెల మధ్యలో మిట్టమధ్యాహ్నపు మండుటెండలో ఓ అడ్రస్సు కోసం ఓ నాలుగు కాలనీలు తిరిగి తిరిగి, విసిగి చిరాగ్గా “ఇహ.. పోదాం” అనుకుంటుండగా “KADAMBI BOOKSELLERS” అని గోడ మీద రాసున్న అక్షరాలు కనిపించి కొత్త ఊపిరినిచ్చాయి. గబాగబా మెట్లెక్కుతున్నాం అన్న మాటే కానీ, పాత సినిమాల్లో నిధి నిక్షేపాల కోసం వింత దారుల్లో వెళ్తారే ఆ ఫీలింగ్ వచ్చింది. (అంటే “వచ్చింది కదూ..” అంటూ సౌమ్య నన్ను ఒప్పించింది) తలుపు దగ్గరకి వెళ్ళేసరికి, మమల్ని చూసి ఓ పెద్దాయన “రండి..రండి” అంటూ ఆహ్వానించారు. లోపలకి అడుగుపెట్టి, ఎదురుగా ఉన్న ఒక రాక్ దగ్గర నుంచుని ఏం వెతాకాలో తెలీకుండానే వెతుకుతుంటే, “ఏం పుస్తకం కావాలీ?” అంటూ ఆయనే మా దగ్గరకి వచ్చారు. “ఊరికే.. పుస్తకాలు చూద్దామనీ” అని గొణుక్కుంటూ చెప్పాము, అసలు విషయం ఎలా మొదలెట్టాలో తెలీక. “ఊ.. చూసుకోండి” అన్నట్టు వెళ్ళిపోయారు. కాస్త ఊపిరి గట్టిగా తీసుకున్నాం అప్రయత్నంగానే! మాల్స్ లో షాపింగ్ అలవాటయ్యో ఏమో, అలా ఒకరు వచ్చి ఏం కావాలనగానే ఏం చెప్పాలో తోచలేదు.  “మొదలెడదామా? ఆగుదామా? బాగుంటుందా? ఎలా మొదలెడదాం?” అని మాలో మేము మల్లగుల్లాలు పడుతుంటే, ఆయన దగ్గరకి వచ్చి, “మీకు కావాల్సిన పుస్తకం దొరక్క పోతే నాకు చెప్పండి.. తీసిస్తాను” అంటూ ముందుకెళ్ళబోయారు. ఇక చల్లకొచ్చి ముంత దాచటం దండగని తేలిపోయింది. “అసలు సంగతేంటంటే..” అని నసుగుతూనే మొదలెట్టి, ఇక అటో ఇటో తేలిపోవాల్సిందే అని, “మాకు పుస్తకాల గురించి రాయడమంటే సరదా! అందుకని ఒక సైట్ పెట్టాం. అందులో ఈ షాపు గురించి రాయాలనీ…” అని ఇంకా పూర్తి చేయలేదు, ఆయన అందుకున్నారు. “మీరేనా వస్తానని ఫోన్ చేసింది? నాకు నెంబర్ ట్రేస్ చేయడం రాలేదు. తిరిగి ఫోన్ చేద్దామనుకున్నా, ఆడపిల్లలు ఇంత ఎండని పడి రావడం ఎందుకు? కాస్త చల్లబడ్డాక రాకూడదూ?” అని. ఏమనాలో తెలీక నవ్వాము. “అడ్రస్ వెతుక్కోవటం కష్టమయ్యిందా?” అని ఆరా తీశారు. “అబ్బే.. మీరెలా చెప్పారో అలానే వచ్చేశాం, కొంచెం ముందుకెళ్ళాం అంతే!” అని చెప్పాం. అబద్ధం కాదది! అంతలా అడిగేసరికి, అరగంట సేపు వెతకడం పెద్ద కష్టంగా తోచలేదు.

అయినా మా వాడిన మొహాలు ఆయనకి నిజం చెప్పేసినట్టున్నాయి, “వచ్చి కూర్చోండి” అంటూ కుర్చీలు చూపించారు. “అసలీ బుక్ షాపు క్లాక్ టవర్ దగ్గరే ఉండేది. ఆ “సోనీ షో రూమ్” ఉంది చూశారు కదూ, అక్కడే ఉండేది. రోడ్ వైడనింగ్ అప్పుడు మారాల్సి వచ్చింది. అప్పుడే ఇక్కడకి వచ్చేశాను. ఇది కొంచెం లోపలకి ఉంది.” అనగానే “నాన్‍సెన్స్.. రోడ్డు కోసం టూ మచ్ కదూ” అని అనిపించింది. “ఎన్ని పుస్తకాలుండేవనుకున్నారు! చాలా వరకూ తూకానికి అమ్మేశాను. కొన్ని ఉత్తినే ఇచ్చేశాను. అలా మూడు లక్షలకు పైగా ఇచ్చేసుంటాను. కొన్ని అట్ట డబ్బాల్లో ఉన్న పాత పుస్తకాలయితే కాల్చేయాల్సి వచ్చింది. ఇదో ఇంకొన్ని రికార్డ్స్ ఇక్కడున్నాయి చూడండి” అంటూ గది చివర్న ఉన్న అటకపై పెట్టున్న అట్టడబ్బాలు చూపించడానికి లేచారు.

“అసలెప్పటి నుండి ఉందీ కొట్టు?” అంది సౌమ్య. “1950” అన్నారాయన. ఉన్న కళ్ళను ఇంతలేసి చేసుకున్నాం, సౌమ్యా, నేనూ!
దుమ్ము పట్టున్న అట్టడబ్బాలు చూస్తూ “ఎందుకు పారేసినట్టు?” అని నిస్సహాయంగా ఆయనకేసి చూశాం.

“ఏం చేస్తాం మరి, అవన్నీ ఇక్కడికి తీసుకురావటం కుదరదు. అందుకే! కొట్టు మార్చే ముందు విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చాను. అయినా మిగిలిపోయాయి.” అంటూండగా మళ్ళీ కుర్చీల దగ్గరకి వచ్చాం. ఈ బిజినెస్ చాలా కష్టమైన పని. పుస్తకాలు అమ్మటం మాటలు కాదు. వచ్చి కొనేవారిని, వచ్చి ఊరికే చూసుకొని పోయే వారినీ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.” అనేసరికి “అవును మరి! వాళ్ళకేం కావాలో, అది ఎక్కడుందో వెతికిపెట్టటం కష్టం కదూ” అని అన్నాం. “ఇప్పుడో మనిషి వస్తాడు. రాక్ లో ఉన్న పుస్తకం తీస్తాడు, చూస్తాడు, కానీ జాగ్రత్తగా తిరిగి అరలో పెట్టేయడు. ఒక పేజీ చిన్న మడతున్నా, వేరే మనిషి దాన్ని కొనడానికి ఇబ్బంది పడతాడన్న స్పృహ ఉండదు. అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి.” అన్నారు.  “హమ్మ్.. అదీ నిజమే!” అనుకున్నాం. “పైగా ఈ బిజినెస్ లో చాలా తెల్సుకోవాలి. ఎక్కువ మందితో పరిచయాలు ఉండాలి. రచయిలతో, పబ్లిషర్స్ తో, బుక్ సెలర్స్ తో, ఇలా చాలా మందితో సత్సంబంధాలు ఉండాలి. ఎప్పటికప్పుడు విషయాలు తెల్సుకోవాలి. ఎంత సంపాదన వస్తుందో, అంతా మళ్ళీ పెట్టేయాలి” అంటూ ఆయన ఇంకేదో చెప్పబోతుంటే..

“But, why a book shop? ఇదే ఎందుకూ?” అన్నాను ఉండబట్టలేక. ఊరుకోలేక.

“బుక్ షాపు గురించి చెప్పాలంటే, నా గురించి చెప్పాలి. నా గురించి చెప్పాలంటే మనం దాదాపు అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అందుకు మీరు సిద్ధమేనా అమ్మాయిలూ?” అంటూ చూశారు మా వంక. “ఓ..యెస్” అంది సౌమ్య. “wait..wait” అన్నా నేను. గబగబా పేపర్లు తీసి, నోట్స్ తీసుకోడానికి రెడీ అయ్యాను. కథ మొదలెట్టారు.. తన కథ!

“నా చిన్నప్పుడు మేం ముంబాయిలో ఉండేవాళ్ళం. మా నాన్న అన్నదమ్ములు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. 1942లో హైదరాబాద్‍కి వచ్చేశాం. మా అమ్మ తన ముప్ఫై రెండవ ఏట టి.బీ (ట్యూబర్‍క్యులాసిస్) బారిన పడి మరణించింది. అమ్మ చనిపోగానే నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మేం అయిదుగురం అన్నదమ్ములం. అందరి కన్నా పెద్దవాడిని నేను. పదిహేనేళ్ళ వయసు. వాళ్ళు “మీ జీవితం మీదర్రా!” అన్నట్టు వ్యవహరించారు. “ఇప్పటి నుండీ మా సంగతేంటి? ఎలా బతుకుతాం? మా చదువులెలా?” అని నేను లేవలెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానంగా నన్నే చూపారు. కాస్తలో కాస్త అయినా సాయం వస్తుందన్న నమ్మకం సన్నగిల్లింది. అప్పటి వరకూ నాణ్యమైన విద్యనూ, అందులోనూ ఆంగ్లంలో పరిజ్ఞానాన్నీ సంపాదించుకున్నాం. అప్పటి వరకూ వచ్చిన చదువును ఆసరా చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూశాము. చిక్కడపల్లి, ముషీరాబాద్ జైలు… తెల్సునా మీకు?” అని అడిగారు. తెలుసన్నట్టు తలాడించాం.

“ఆ.. అక్కడ నుండి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం కోసం కాలినడకన సఫిల్‌గూడ దాకా నడిచి వెళ్ళాం నేనూ, నా పెద్ద తమ్ముడూ. నాలుగు గంటలు నడిచి అక్కడ చేరుకునే సరికి సాయంత్రం నాలుగయ్యింది. అక్కడి ఆఫీసర్స్ మా మీద విరుచుకుపడ్డారు, అంత ఆలస్యంగా పనికి వచ్చినందుకు. ఆ రోజుకి వెళ్ళిపోయి మర్నాడు ఏడింటికల్లా పనికి రమ్మని చెప్పారు. మేం నడుచుకుంటూ ఇంటికి చేరి, పొద్దున్నే మూడింటికి లేచి, వెళ్ళాం ఉద్యోగానికి. అప్పటికి హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉండేది. మాకు తొంభై ఐదు రూపాయలు (ఐ.జి) వచ్చేవి, మళ్ళీ వాటిని ఒస్మానియా సిక్కాగా మార్చుకోవాలి. అప్పట్లో రూపాయికి పదహారు సేరుల బియ్యం వచ్చేవి అంటే నమ్ముతారా మీరూ?” అంటూ మా వంక చూశారు. “అబ్బో!” అని ఆశ్చర్యపోయాం.

ఆయన కాసేపు నాస్టాల్‍జియా అంటారే, అలాంటి దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్తూ, వెళ్తూ మమల్నీ తీసుకెళ్ళారు. “అప్పటి రోజులే రోజులూ! బ్రిటిష్ రాజ్యంలో చాలా డిసిప్లెన్ ఉండేది. రోజూ మగ్గుడు కాఫీ, ఇడ్లీ కోసం లైన్ లో నుంచుండే వాళ్ళం. ప్రతీ గురువారం మాకు “వ్యక్తిగత శుభ్రత” మీద పరేడ్ అయ్యేది. గోళ్ళూ, జుట్టూ అన్నీ పరిశీలించేవారు. ఒక రోజు అసహనంతో ఓ బ్రిటిష్ ఆఫీసర్ ని అడిగేశాను, “ఏం మాకు తెలీదా, శుభ్రంగా ఉండటం? మీరు చెప్తే కానీ మేం చెయ్యమా? అని. ఆ ఆఫీసర్ “you unhygienic bastards” అని తిట్టాడు. బ్రిటీషర్లంటే ఎలా ఉండేవారనుకుంటున్నారూ? ఎంత ఎత్తూ, ఎత్తుకు తగ్గ శరీరం. నా పక్కనున్న వాళ్ళంతా నన్ను బెదరగొట్టేశారు. “ఏం చేశావ్? వాళ్ళిప్పుడు నిన్నేదయినా చేస్తే?” అంటూ. అయినా నేనేం భయపడలేదు.” అనే సరికి మేం ఉల్లిక్కిపడ్డాం.

“తర్వాత ఆ ఉద్యోగం మానేశాం కొన్నాళ్ళకి. ఇంట్లో ఉన్న సామానులూ, వెండి ఒక్కొక్కటే అమ్ముకుంటూ రోజులు గడుపుకొచ్చాం. ఒక ఇంటిని నెలకు నూట పది రూపాయలకు అద్దెకు తీసుకున్నాం. అప్పుడు మా అమ్మమ్మ మాకు జత ఉండేది. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే, ఒక గది కింద, ఒక గది పైన, బాత్రూములు మరో చోట! తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉండాల్సి వచ్చింది. నా పెద్ద తమ్ముడు బద్రినారాయణ్ కూడా నాతో పాటు ఈ కష్టాలు అన్నీ పడేవాడు, మిగితా ముగ్గురి కోసం. నా తమ్ముళ్ళ విద్య చాలా ముఖ్యమనిపించింది నాకు. అందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను నేను. అప్పుడే ఈ పుస్తకాల కొట్టుకి బీజం పడింది.”

“చేయడానికి ఏమీ తోచక, పుస్తకాలు అమ్మితే పోలే అనుకున్నాను. లోకల్ మాగజైన్లూ, వార్తాపత్రికలూ తెచ్చి ఫుట్‍పాత్ మీద పెట్టి అమ్మేవాడిని. అప్పట్లో ఫెమీనా – డబ్భై అయిదు పైసలూ, వార్తాపత్రిక పదిపైసలూ ఉండేవి. కొద్ది కొద్దిగా ఇది ప్రాచుర్యం పొందటం మొదలెట్టింది. కొన్నాళ్ళకి ఇక్కడ నుండి మకాం మార్చి ఆనంద్ భవన్ దగ్గర పెట్టాను. అప్పుడే హిందూ దినపత్రిక వారు నన్ను సంప్రదించారు. ఒక్క రోజులో మూడొందల పేపర్లు అమ్మాను. నా దగ్గర దరిదాపు ఇరవై మూడు పత్రికలుండేవి. ఇది కొంచెం బాగా నడుస్తుందనగా, ఒక షాపు (10 X 12 గది) నెలకి రూ.ముప్ఫై అయిదుతో ఇస్తామన్న బేరం వచ్చింది. అలా కాదు, నెలకి యాభై చేసుకుందాం, కానీ వచ్చే పదేళ్ళ వరకూ ఇంకేం పెంచద్దని ఒప్పించాను.” అలా అసలు కదంబి పుస్తకాల కొట్టు ఎలా కుదిరిందో చెప్పుకొచ్చారు.

“కొట్టయితే కుదురుకుంది కానీ, అందులో పెట్టడానికి పుస్తకాలేవీ? దానికి సంబంధించిన ఏ పరిజ్ఞానమూ లేదూ. డబ్బులంత కన్నా లేవు. ఏం చేయాలో తోచక, ఖలిల్లుల్లా ఖాన్ అనే వడ్డీ వ్యాపారి దగ్గరకి వెళ్ళి, నుంచున్నాను. “ఏం కావాలీ?” అని గంభీరమైన స్వరంతో అడిగాడు. నా కథ అంతా చెప్పుకొచ్చి, అర్జెంటుగా అద్దె కట్టడానికి మూడొందలు కావాలని అడిగాను. ఆయనా డబ్బులు ఇచ్చి, “నిజాయతీగా నీకు నచ్చిన పని చేసుకుంటూ ఫో.. మళ్ళీ నాకు కనిపించక” అని చెప్పాడు. ఈ రోజుకీ నాతో నిలిచిపోయే మాటలవి. అలా నవంబరు 29వ తారీఖున, ఈ పుస్తకాల కొట్టు పెట్టాను. పండుగ కాలం కాబట్టి గ్రీటింగ్స్ అడిగే వారు జనాలు. కొన్న ప్రతీ కార్డుకి రెండు అనాలు ఎక్కువ వేసి, తిరిగి అమ్మేవాడిని.”

“బొంబయి కెళ్ళి అక్కడ వి.టి స్టేషన్ లో పాన్ షాపుల వాళ్ళనీ, హోల్ సేల్ బుక్ సెల్లర్స్ దగ్గర నుండీ అందరినీ వివరాలు కనుకొన్నాను. కొన్ని మెలకువలు తెల్సుకున్నాను. అప్పుడు నాకు ఇవ్వబడిన ఒక మంచి సలహా, “If its two slices of bread, then only that much butter, not more” అని. ఎంత స్థోమత ఉందో అంతే పెట్టుబడి పెట్టమని. అంతకు మించి ఎక్కువ పెట్టి, తల భారం పెంచుకోవద్దనీ!”

“హైదరాబాద్ కి తిరిగొచ్చి బిజినెస్ ప్రారంభించాను. నా తమ్ముళ్ళందరినీ మెహబూబా స్కూల్ లో జాయిన్ చేశాను. మొదటిసారి నేనెళ్ళి ఆ ప్రిన్సిపల్ ని అడిగినప్పుడు, ఆయన వేసుకున్న షూస్ తీయబోయారు. పరిగెత్తుకుని పారిపోయాను. కానీ మళ్ళీ సంప్రదించాను. ఆయన పేరు కోటేశ్వరన్. మా కథ అంతా విని, ఆర్నెళ్ళ పాటు ఏ ఫీజూ లేకుండా చదువుకోడానికి అనుమతినిచ్చారు తమ్ముళ్ళందరికీ. స్కూల్ లోని టీచర్లూ, సహ విద్యార్థులూ అంతా చందా పోగేసి ఇచ్చిన డబ్బుతో వాళ్ళకి క్రాఫింగ్ లూ, స్కూల్ యూనిఫారం లూ కొన్నాం. ఇక పాఠ్య పుస్తకాల చింత మాకు వద్దనే చేప్పేశారు. తమ్ముళ్ళు కూడా అంత శ్రద్ధగా చదువుకున్నారు. డబుల్ ప్రొమోషన్లు తీసుకునేంత బాగా చదువుకున్నారు.  నిజాం కాలేజీకి వెళ్ళారు. బిజినస్ పరంగా రెండేళ్ళ కాలంలో నమ్మశక్యం కానంత మంది కస్టమర్లు పెరిగారు.” అని చెప్పుకొచ్చారు. “ఓహ్.. కథ సుఖాంతం” అని మేం నవ్వుకుంటుండగా “పిక్చర్ అభీ బాకీ హై మెరె దోస్త్” అని ఏమీ అనకుండానే, చెప్పటం మొదలెట్టేశారు.

ఆయన అనకపోతేనేం? నేను అంటున్నా “పిక్చర్ అభీ బాకీ హై మెరె దోస్త్”.. మళ్ళీ చెప్తా ఈ సంగతులు!

*****************************************************************************************************

Address:

1/B, Pavan Kunj,

Sarvasukhi Colony,

West Maredpally

Secunderabad  -500026

Phone: 040- 27705349

You Might Also Like

  1. పుస్తకంలో నేను :P « ఊహలన్నీ ఊసులై..

    […] మాట్లాడినవన్నీ పూసగుచ్చినట్టు ఇక్కడ రాసినా కూడా, ఇంకా ఎన్నో చెప్పటం […]

  2. Mahita

    Very interesting! It is always fascinating to read about the life of a fellow human being and you have just spoken about the then common and now uncommon man :). Can’t help but feel that way!

    WHo would now give money just by trusting ur story and expecting u to live life sincerely or make sincere use of the money? I sometimes feel that these malls like cross word, pages, borders, odyssey, all these kind of run for commercial purposes. Just that they are accessible for people like me who are basically lazy to go that extra mile to find a book. But I guess they also succeed because they tend to give more space to the person who is purchasing a book. I wonder, why can’t these book store people, particularly those that sell regional languages, get under a single roof. I mean, there are huge complexes growing around, these people should have some sort of a union. They could probably contribute some money together, or they could raise funds from book lovers and get a decent space and give in an atmosphere of privacy and clarity and I am sure they will outrun all these commercial malls that have nothing but profit as a sole purpose.

    There just might be many stories behind all these book stores that seem to be running remotely and I shall look forward to reading more!!

  3. ramana

    Hii Poornima & Sowmya,
    really interesting,nice and superub narration.
    “A pat on the back is only a few vertebrae removed from a kick in the pants, but is miles ahead in results”

    Please continue the same..

    Best Regards,
    Ramana.

  4. నెటిజన్

    “కదంబి కబుర్లు -1” అని అన్నారు. తరువాయి, ఇంకా ఎన్ని భాగాలున్నవి? ఏ భాగాన్ని, ఏ తేదిన లేదా ఏ రోజున ప్రచురించాలనుకుంటున్నారు? ఒక నిర్దుష్టమైన ప్రణాలిక ఉందా? దాని వివరాలు తెలియజేస్తే బాగుంటుంది. లేదు ఆసక్తి ఉన్నవారందరూ, తీరికలేకపోయినా తీరిక చేసుకుని, పుస్తకం డాట్ నెట్ దగ్గిర చకోర పక్షుల్లాగ ఎదురుచూస్తుండమంటారా? “బెటర్ రీడబిలిటీ” అదేంటి చెప్మా? 🙂

  5. ఈము

    ఆనాటి వారి ముచ్చట్లు వినటం మహా ఆనందంగా ఉండండోయి! త్వర త్వరగా తక్కిన ముచ్చట్లు కూడా మీరు రాసేసి పొస్ట్ చెసెస్తే బాగుంటుందీ. పొస్ట్ బాగా రాసారండీ.

  6. నెటిజన్

    “చాలా వరకూ తూకానికి అమ్మేశాను. కొన్ని ఉత్తినే ఇచ్చేశాను. అలా మూడు లక్షలకు పైగా ఇచ్చేసుంటాను. కొన్ని అట్ట డబ్బాల్లో ఉన్న పాత పుస్తకాలయితే కాల్చేయాల్సి వచ్చింది.”
    ఎంత దారుణం?

  7. మురళి

    చాలా బాగుంది.. వీలయితే అప్పటి ప్రముఖ పత్రికలూ.. పాఠకుల అభిరుచిలోనూ, ప్రచురణ రంగంలోనూ వచ్చిన మార్పులు (ఆయన గమనించినవి) లాంటివి స్ప్రుశించండి వచ్చే భాగంలో..

  8. Swathy

    సరళమైన భాషలో బాగా రాసారు … మిగతా భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని మరచిపోకండి 😛

  9. మేధ

    బావుంది..

  10. Purnima

    Meher: Please find the phone number of the store, now updated in the post.

    Aruna: The whole and sole intention of publishing this particular article in a “series” is to allow people to have better readability. I wonder, how many would read an article, (that too online!) which would be 3 times this article.

    >> పాఠకుల్లో ఉత్సుకతను రేకెత్తించడం మీ లక్ష్యం కాదు.

    True! But that said, there is no tension-building process in our attempt as well. It is just a way of going about things. I hope, the point is clear.

  11. అరుణ పప్పు

    పూర్ణిమా, సౌమ్యా,
    చాలా మంచి ప్రయత్నం చేశారు మీరు. చాలా కదిలించింది. అయితే ఇది సీరియలో కథో కాదు. కల్పన కాదు, పాఠకుల్లో ఉత్సుకతను రేకెత్తించడం మీ లక్ష్యం కాదు. అందువల్ల ఇలాంటివి పూర్తిగా ఒకటేసారి ప్రచురిస్తే అందులోని అసలైన ఫీలింగ్ పాఠకులకు అందుతుంది. ఇది సూచనే. దయచేసి పరిశీలించండి. మొన్నెప్పుడో ‘మీరుచదివారా’ బ్లాగులో నామిని వ్యాసం గురించిన చర్చ గుర్తుండే ఉంటుంది మీకు.

  12. Meher

    Beautiful narration. మలిభాగంలో ఫోన్‌నెంబర్‌ ఇవ్వడంతో బాటూ ఏమేం రకాల (జెనర్ల) పుస్తకాలున్నాయో కూడా కవర్ చేస్తే బాగుంటుంది.

  13. afsar

    చాలా మంచి ఇంటర్వ్యూ . 1942 నించి 1948 దాకా హైదరాబాద్ పుస్తక ప్రపంచం , సాహిత్య ప్రపంచం చాలా మారాయి. ఎన్ని పుస్తకాల షాపులో..అన్ని సాహిత్య సంస్థలు! అనువాదాలు లెక్క లేనన్ని వచ్చాయి అదే కాలంలో! ఈ సాహిత్య సంస్కృతి వ్యాప్తిని మనం ఇంకా సరిగా వెతకాలి. అందులో చాలా చరిత్ర వుంది. ఈ కదంబి దానికి వొక ఆనవాలు కావచ్చు.

    అఫ్సర్

  14. సంతోష్ కుమార్ పుల్లురు

    సంతోష్ కుమార్ పుల్లురు

    నమస్కారం. మీ కబుర్లు చాలా బాగున్నాయి. చాలా నీట్ గా వుంది. కష్టమైన పదాలేమి లేవు, సరళంగా సాగిపోయింది. ఇంకా సమాచారం constructivega వుంది.

    మొత్తానికి నాకు నచ్చింది. కాని కష్టపడి తెలుగులో రాశా. 🙂

  15. జ్యోతి

    ఈ బుక్ షాప్ కి మేము పాతికేళ్లనుండి ఖాతాదారులం. క్లాక్ టవర్ దగ్గర ఉన్నప్పుడు కూడా మావారితో వెళ్లాను.