తేరా నామ్ ఏక్ సహారా ?!
రాసిన వారు: రమాసుందరి
(జంపాల చౌదరి గారు “తేర్ నాం ఏక్ సహారా” పై రాసిన సమీక్షకు వచ్చిన ఈ వ్యాఖ్య ఒక వ్యాసంగా ప్రచురిస్తే చదివేందుకు వీలుగా ఉంటుందని ఇలా ప్రచురిస్తున్నాం. అనుమతించిన రమాసుందరి గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
***************************
తేరా నామ్ ఏక్ సహారా ? !
(నీ నామమే ఏకైక ఆధారం)
దీన్ని నవలిక గానూ, పెద్ద కథగానూ చూడడం కంటే, రచయిత స్వానుభవంగా చూడడమే సరైన విషయంగా తోస్తుంది. దీన్ని గురించి మాట్లాడాలంటే రచయిత కలం ప్రతిభ కంటే, అనుభూతుల గాఢతని ఏ రీతిగా వెలువరించారు ? అసలెందుకు ఆ అవసరం వచ్చిందీ అనే అంశం మీదే మాట్లాడాలనుకుంటున్నా.
ముందు పేజీలో నరేష్ కృతజ్ఞతలు కూడా ఇచ్చుకోలేనని చెప్పినా, ఏనాడూ వేడుకోకపోయినా ఆ దైవమే తన దూతను ఉష రూపంలో పంపాడని ఎపిలోగ్ ముగిస్తూ చివరి పేజీలో ఆయన తన అంతరంగం పరిచారు. ఈ నాటి వాస్తవం ఇదే కాబట్టి ‘ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ అన్న న్యాయంతో ఈనాడు ఆయన సంతోషంగా ఉన్నారు అనే భరోసాతోనే ఈ పుస్తకాన్ని సమీక్షించవచ్చునని నాకు అనిపిస్తోంది. నిజానికి తను ఒకటి కావాలనుకోవచ్చు. కానీ ‘వీడికేం కావాలో వీడికి తెలియడం లేదు, ఉష వల్లే వీడు సంతోషంగా ఉండగలుగుతాడు’ అని ప్రీ డిసైడ్ అయిపోయింది. అందుకే అన్నీ ఒక్కొక్కటీ తప్పుకున్నాయి.
‘తేరా నామ్ ఏక్ సహారా’ లో తన హృదయంలో సంచలనం రేపిన ఘడియలను గురించి నరేష్ మాట్లాడారు. ఎందుకు రాశారో కూడా ఆయన చెప్పారు. అదెందుకు నవల రూపంలో వచ్చిందో , మిత్రులు, బంధువులు, హితులు సూచించిన పలు సలహాల అనంతరం కూడా ఎక్కడా ఏ మార్పులూ లేకుండా ఈ పుస్తకం ఆ రూపం అలాగే ఎందుకు తీసుకుందో కూడా పేర్కొన్నారు. ఇక ఆ పరంగా ఏ సందేహమూ మిగలడానికి వీల్లేదు.
ఈ పుస్తకం చేతిలోకి తీసుకున్నాక నేను పూర్తయ్యే వరకూ ఆపలేదు. పుస్తకంగా రాక ముందూ నాకు ఆ సబ్జెక్టు తెలుసు. అయితే పుస్తకంగా వచ్చాక నరేష్ అంతరంగానుభూతిని దర్శింప చేసే బొమ్మలకి వాటిదైన ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ పుస్తకంలో. తాల్ ఫిల్మ్ లో ఓ ఖవ్వాలీలో ‘ఊపర్ రబ్ హై , నీచే ఇష్క్ హై, ఇన్ దోనోంకే బీచ్ మే సబ్ హై’ (పైన ఆ భగవంతుడూ… క్రింద ఈ ప్రేమా….ఇక సమస్తమూ ఈ రెండింటి మధ్యనే…) అన్నాడొక కవి.
శబ్దం నుంచి శబ్దాతీత స్థితికి తీసికెళ్లే ఒక దృశ్య కావ్యం. ధ్వన్యాకారుడు ఆనంద వర్ధనుడు ‘కావ్యానికి ధ్వనే ఆత్మ’ అంటాడు. ఈ రచనలో అడుగడుగునా ధ్వని ఉంది. అదీ సిమిలీలు, రూపకాలు, ఆక్జిమోరన్లూ, ఉత్ప్రేక్షలతో కలిసి పలికింది. రచయిత మనతో చెబుతున్నట్టే ఉన్న ఆత్మ కథన శైలి… అనుభూతుల గాఢత వల్ల గుండె బరువెక్కించే కథ…కథనం…
అర్జునిడి బాణం తోడిన పాతాళగంగ భారతి స్వర ధార. రాబోయే ఘడియలకు ముందస్తు సూచన….శిలల మీద రాలి తలలు బద్దలైన రంగు పూలని పక్కకి ఊడ్చి. భారతికి కర చాలనం ఇచ్చి తొలి స్పర్శే వీడ్కోలు చేయడం ఇష్టం లేకపోవడం … సంధ్యా భీభత్సం వంటి రూపకాలు, కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం వంటి అనుభూతుల గాఢత రచయిత అంతరాత్మ నుంచి బయల్దేరి సూటిగా పాఠకుడి అంతరాత్మనే చేరుతుంది.
వినబోయే మాటలకు ముందుగానే వాటి పర్యవసానం వెల్లడించే ప్రకృతి దృశ్యాలు…
తెల్ల చొక్కా భుజం మీద పడిన కాకి రెట్టని తుడుచుకుంటుంటే నడిచొచ్చింది భారతి, గడ్డిపోచల్ని తొక్కి కొత్త డొంక వేస్తున్న మట్టి కాళ్లతో..
…వద్దన్నారు… నీకూ నాకు అసలు కుదరదన్నారు… ఇక ముందెప్పుడూ నన్ను కలవకూడదని కూడా చెప్పారు…
63 వ పేజీలో మోడు మానవ ముఖంతో రోదిస్తున్న తీరు… చూశారా…
గాన కళానిధి సుబ్బులక్ష్మిని గురించి మేఘ మృదంగాల ఉరుము దరువు కంటే ముందే చేరే మెరుపు తేజంలా. నిండైన నీలం రంగు కంచి పట్టు చీరలో స్వభావాన్ని సూచిస్తున్న మెత్తని నడకతో వస్తోంది రాగాన్ని వెదుక్కుంటున్న పదం, పరాన్ని అన్వేషిస్తున్న ఇహం …అంటూ ఇంత సంక్షిప్తంగా , అందంగా, గాఢతనీ, ఔన్నత్యాన్నీ పట్టివ్వగలిగే పదాలు మరెక్కడా నేను చూడలేదు. శబ్దాతీత సౌందర్యాన్ని కనిపెట్టగలిగిన ఆ అంతర్దృష్టే జీబురు జుట్టు మాయా ప్రపంచాన్నీ ఆవిష్కరించింది… ఎక్కడా తనకు విశ్వాసం కుదరలేదు. ఆ కుదరనితనాన్ని స్పష్టమైన శబ్దాల్లో చెప్పడానికీ ఎక్కడా వెనుదీయలేదు. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం దగ్గర నరేష్ అర క్షణం కూడా ఆగరేమో.
సుబ్బులక్ష్మి దేవుడు ఉన్నాడని నమ్మి పాడితే, ఆ దేవుడు దిగి వస్తాడని మాత్రం నమ్ముతారని అనిపిస్తుంది. అందుకు ఆమె దగ్గర సాష్టాంగ పడ్డారు. అది విలువైన ఆరాధన. అందరూ భగవాన్ గా కొలిచే , సాగిల పడే వ్యక్తి దగ్గర చేయలేదు ఆ సాష్టాంగం. అంతరాత్మను కాదనుకుని నరేష్ ఎక్కడా ఎప్పుడూ తలవంచలేదు. ఇది వ్యక్తిత్వ ఔన్నత్యం. జానకి రామయ్యగారితో వాగ్వాద సందర్భంలో కూడా ఇది గమనించవచ్చు.
భారతి పాటకు పరుగున వచ్చి వరాలివ్వని వాడు దేవుడా అని సందేహం. అది భారతి పట్ల ప్రేమ కంటే ఆమె అంతటి ఆర్తితో పాడడాన్ని ఇష్టపడి అలా అన్నారనిపిస్తుంది. తనకిష్టమైన భారతికి దేవుడెందుకు వరమివ్వడని వకాల్తాతో అన్న మాటలు కావవి.
కీర్తి ప్రతిష్ఠలకు ఆశించి చేసిన రచన కాదిది. భక్తులకు ఉండే విశ్వాసం కొంత మౌఢ్యానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కథాంశం సత్యమే అయినా కోట్లాది మంది భక్తులకు జ్ఞానోదయం అయ్యే అవకాశమూ లేదు. ‘మణి రత్నం చిత్రంలో ఏమిటీ గొప్ప?’ అతడి కథ సింపుల్ గా ఉంటుంది. కానీ కథన వైచిత్రి చెప్పుకోదగ్గది. కెమేరా పనితనాన్ని అతడు గొప్పగా ఉపయోగించుకుంటాడు. పాటలో 150 ఫ్రేములు కనిపిస్తాయి. ఆ వివిధ భంగిమల్లోంచి ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని సంక్షిప్తంగా చూపించేస్తాడు. శ్రీ నరేష్ కథనం నాకు మణి రత్నం సిన్మా లానే ఉంటుంది. అక్కడ కెమేరా పని ఇక్కడ అక్షరం పని. అంతే తేడా.
మనసుకు అద్దం పట్టినట్లున్న ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. 60 పేజీలో బొమ్మ ‘జాగ్ తే రహో’ అంతిమ దృశ్యంలోని నర్గీస్, రాజ్ కపూర్ లను తలపించింది. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అందులోనూ ఆ అంతిమ దృశ్యం…’జాగో మోహన్ ప్యారే’ పాడుతూ కృష్ణ మందిరంలో వనకన్యలా, దేవతా మూర్తిలాంటి నర్గీస్ పాట పాడుతూ పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుంది. ప్రపంచ పంకిలం చూసి, రోత పుట్టి, భీతావహుడైన రాజ్ కపూర్ అటుగా వస్తాడు. తానూ దోసిలొగ్గితే, అదిగో…అలాగే నీరు పోస్తుంది.
కచేరీ ముందు గాయకుడు గొంతు సవరించుకోవడంలో గుర్తింపుకి నోచని ఏదో తీయదనం ఉందనిపిస్తుంది. గుడ్డు పగిలి, మొలిచీ మొలవని చిట్టి రెక్కలు విప్పుతూ గువ్వ పిట్టలు చేసే కువకువలు విన్నట్టుంటుంది. విరామ నిశ్శబ్దపు తెరల జారుముడిని సుతారంగా లాగినప్పుడు చిరు గంటలు మంద్రంగా మేలుకున్నట్టుంటుంది. తీగల్లోకి ఒత్తిగిల్లిన వాయిద్యాలు ఒక్కొక్కటే లేచి ఒళ్లు విరవడం…
…ఇలా సాగే వర్ణనలో ప్రకృతి మానవ కన్యగా హొయలొలికింది. తన ప్రగాఢానుభూతిని చదువరి గుండెల్లోకి నేరుగా చేర్చింది ఈ రచన.
నవ రసాల్లో మనిషి నిరంతరం ఏదో ఒక రసానుభూతిలో ఉంటాడు. ఆ రసానుభవాన్ని అందజేయడంలో ప్రకృతి తోడు లేకుండా ఏ ఒక్కసారీ ప్రయత్నించలేదు రచయిత. భీభత్స, హాస్య, శృంగార, శాంత, కరుణ రసాలతోనూ, సజీవమైన ప్రకృతి కాంత సాయంతోనే కావ్యం లాంటి ఈ రచన ముందుకు సాగింది.
(7 వ పేజీలో) వెండి పోగుల పల్చని నీరెండ…ఒద్దికగా వీస్తున్న చల్లని గాలి..నిండైన నమ్మకంలా వెయ్యి బాహువుల్తో విస్తరించిన మహా వృక్షం… ఆశీర్వచనాల మెత్తని నీడ…తన్మయంలో తలలూపే కొమ్మల్లోంచి ఆమోదంగా రాల్తున్న పూలు…కానీ రెండవ పేరాలోనే సందేహం కూడా వ్యక్తం చేస్తూ, ప్రకృతి రహస్యాత్మక ప్రవృత్తి ద్వారా… ఏమో ..ఏ కానుందో అనే సంశయంలో పడవేసేదిగానూ ఉంది. మొదటి రెండు పేరాల్లో ఆశ, చివరి పరిణామాలూ రెండూ స్పష్టమవుతాయి.
(61 వ పేజీలో) అది స్పష్టంగా సూది మొనల నీరెండ… నక్కి నక్కి వీస్తున్న నంగిరి గాలి… విస్తరించిన అపనమ్మకమై వెయ్యి చేతుల్తో లంఘిస్తున్న మాను… అనుమానంగా కదలాడే నీడ… అసహనంగా ఊగే కొమ్మల్లోంచి పట్టు తప్పి పడుతున్న పూలు గా మారింది. ప్రకృతి చైతన్యంతో తొణికిసలాడుతూ, మానవ స్పందనలను కలిగి ఉండడమే మానవీకరణ అలంకారం. అది కావ్యం నిండా పుష్కలంగా వర్ధిల్లింది.
డోలాయమానంగా ఉన్న తన భవితవ్యం చూపించడానికి సూర్యుడు మూసిన మబ్బుల్ని జరీ అంచుతో మురిపించడం గురించి చెప్తారు.
ఆవరించిన నిశ్శబ్దం నిట్ట నిలువునా చీలి, నడి రాతిరి యమునలా దారివ్వడం …
మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా…
కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం.
కాండం తొలిచే పురుగు పట్ల మొక్కకుండే ఏవగింపు … వంటి పదాల్లో సజీవ చిత్రమేదో కదులుతూ ఉంది.
బంగాళ దుంప, ఇడ్లీల ప్రసంగం మొత్తం పాఠకులు మంద స్మితితోనే, మనసులో చక్కలిగింతలతోనే చదువుకుంటారు.
డాక్టరుకీ, భారతికీ మధ్య జరిగినట్టుగా చేసిన పరికల్పన కూడా పౌరాణికత స్ఫురింపచేస్తున్న పదాలతో రసస్ఫోరకంగా ఉంది.
(17 వ పేజీలో) ‘నమ్మకమైన ఎన్నిక గురించి చెప్పిన సత్యం నూటికి నూరుపాళ్లు ఏకీభవించదగింది. సత్య సాయి అయినా, నిత్య సాయి అయినా అది మనకు నచ్చిన ఎంపిక.’
చేతి రుమాలు విసిరి కుర్చీ సొంతమన్నట్లు మాట వరసకు వేసిన పసుపుతాడుతో తన ఇలాకా అని సదరు మొగుడు చెప్పుకుంటున్నా… పసుపుతాళ్లు బంధించలేని బంధాలను అలవోకగా చెప్పడం.
నాస్తికత ఛాయల్లో పెరిగినా బహుశా అది కొంచెం తార్కికత నేర్పి ఉంటుందేమో గానీ మనిషికి సహజంగా రసజ్ఞతను దూరం చేయలేదు. సివిల్ ఇంజనీరింగ్ చదివీ, అదే వృత్తిలో స్థిరపడలేకపోవడం, తన passion కు విలువనిచ్చి అక్షర ప్రపంచంలోకి చోటు చేసుకోవడం, అక్కడే స్థిరంగా ఉండడం అనేది అతి పెద్ద ఫీటు.
ఆశావహంగా ఉన్నప్పుడు
హతాశుడైనప్పుడు
ప్రతి జీవితంలోనూ కొన్ని ఘటనల సమాహారం సత్యాన్ని వెలికి తీస్తుంది.
ఇక్కడ శీర్షికలో చివర చేర్చిన ‘? !’ చిహ్నాలతోనే ‘తేరా నామ్ ఏక్ సహారా’ అనే పదం పాడుకోవడానికే తప్ప వాస్తవం కాదనేది సత్య సాయికి సంబంధించిన సత్యాన్వేషణ.
ఒక థాట్ నుంచి సాకారమైన ఈ తెలుపు నలుపుల పుస్తకం అనుభూతుల గాఢతనూ, హృదయ స్వచ్ఛతనూ, అలౌకికత్వాన్నీ అలవోకగా ప్రదర్శించింది.
సత్య సాయి పేరు మీద ప్రపంచం అంతటా లక్షల కోట్లాది రూపాయలు వసూలైంది. సేవా సంస్థలు అన్నారు. ఆధ్యాత్మికత అన్నారు. జనం వెర్రికి ఎప్పుడూ ఒక ఆలంబన కావాలి. అది అదృష్ట వశాత్తూ సత్య సాయి అవతారం అయింది. గాన కోకిలలు పాడాయి. బృంద గానాలూ, కచ్చేరీలు ఎవరి ప్రతిభను వారు ప్రదర్శించడానికి ఓ వేదిక దొరికింది.
కనీసం ప్రపంచానికి మరుగైనా తన సత్యం ఆ సత్య సాయికి తెలుసు. ఆయనను గురించిన వాస్తవం కొద్ది మోతాదులో అయినా సరే, అర్థమై ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారంటే, పర్యవసానాలు ఇలాగే ఉంటాయనేందుకు నమూనా ఈ కథ. మరీ కక్ష తీర్చుకునే చర్యలు చేపట్టడానికి ఇటు నుంచి అంత ధిక్కారం లేదు. కాబట్టి, అదే స్థాయిలో అటు నుంచి పొగ బెట్టడం జరిగిందనిపిస్తుంది.
ఒక వేళ తిరుగుబాటుదార్లు ఓడితే పోయేది కొంచెమే. అదీ వ్యక్తిగత నష్టాలే…రచయితకి జరిగినట్టు. కానీ భక్తుల్లో వచ్చే తిరుగుబాట్లకు వెసులుబాటు ఇస్తే, ఆయన వైపు సామ్రాజ్యాలే కూల్తాయి. ఒకానొక స్థాయి తర్వాత ధిక్కారం సైపడం కష్టం అవుతుంది. తన వాస్తవికత తనకు తెలిసినంత బాగా రచయితకీ తెలిసిందనే ఒక అనీజీనెస్…అది పోగొట్టుకోవడానికి డౌన్ చేయాలి…అవతలి వ్యక్తిని…ఆయన చేశారు. తన చేతిలో ఉన్న తురుఫు ముక్క భారతిని కలుసుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడే నరేష్ తట్టుకోలేకపోయారన్నది నిజం. తనకు ఏ అర్హతా లేదని సాయికి తన అంతరాత్మలోనైనా తెలుసుగా, ఎదుటివారి తల రాతలను మార్చేందుకు సాయి ఆ రకంగా సాహసించడంపై రచయితకి గల అసహనం అడుగడుగునా ప్రదర్శితమైంది. ఆ అసహనం అర్థ రహితం కాదు.
ముందూ వెనకల్లేని శుద్ధ వచనం లాంటి ‘ఇక్కడేముందీ, అంతా అక్కడే వుంది’ వాక్యాల్లోనూ,
మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా… తిరనాళ్లలో తప్పి పోయిన పిల్లాడిలా బాబా జనం మధ్య తిరుగాడుతూ ఉండడం …వంటి చోట్లా ప్రదర్శితమవుతుంది. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నరేష్ కి తేరా నామ్ ఏక్ సహారా రాయాల్సిన అవసరమే ఉండి ఉండక పోవచ్చు. అనంతమైన సంఘటనలు జరగనూ వచ్చు. అనంతమైన సంఘటనలు జరగకపోనూ వచ్చు.
రచయితది నాస్తిక ధోరణి కాబట్టి , దైవ ధిక్కారం చేశారా? అంటే, కాదనిపిస్తుంది. సుబ్బులక్షి తన అంతరంగాన్ని ఎక్కడ కేంద్రీకరించారో, కబీరు రాముణ్ణీ, మీరా కృష్ణుణ్ణీ తన స్వరంతో ఎలా వెదుక్కుంటున్నారో తట్టిన దృష్టి నాస్తిక , ఆస్తిక పరిభాషలకు అతీతమైంది. కానీ ఒకటి… ఏం చెబుతున్నారో…అది వారు చేస్తున్నారా…అనే ఒక పరిశీలన ఉంది. ఎవరు ఏ ప్రతిపాదన చేసినా, ఆ ప్రతిపాదనలో వారి అంతరాత్మ ఉందా లేదా అని చూసే నిశితమైన చూపు ఉంది. ఎవరి స్థాయికి వారిని అర్థం చేసుకుని, వారి ఎరీనాలో వారిని స్వేచ్ఛగా తిరగడానికి వదిలి వేస్తూ ఉండే ఒక స్వభావం వల్ల ఒకప్పుడు సుజీతోనూ, తర్వాత కాలంలో భారతితోనూ అసందర్భాలు ఎదురయ్యాయి.
ప్లాసిబో అనే మందు పేరు చెప్తారు హోమియోలో. అది మందు కాదు. కొందరు పేషెంట్లకు జబ్బు ఉండదు. లేదా వచ్చిన జబ్బు ఒక్క రోజులో దానంతట అదే తగ్గి పోతుంది. అలాంటి స్థితిలో తన జబ్బుకి డాక్టరు ఇచ్చిన పిల్స్ వేసుకుంటే కానీ నయం కాదనే ఫీలింగ్ లో ఆ పేషెంట్ ఉంటే, డాక్టరు ఈ ప్లాసిబో ఇస్తాడు. అంటే ఏ మందూ లేని ఉత్త పంచదార గుళికలన్నమాట. వేసుకున్న పేషెంట్ మందుకే నయమైందనుకుంటాడు. కానీ అసలు రహస్యం డాక్టరుకి తెలుసు.
ప్రజలు ఎంచుకునే డాక్టరు ఒకో సారి సత్య సాయి లాంటి వ్యక్తులు అవుతారు. వారి ప్రభ వెలుగుతుంది. ఇలాంటి చరిత్రలు కోకొల్లలుగా నడుస్తూనే ఉన్నాయి ఇంకా.
ఫిర్ వహీ దిల్ కో బేకరారీ హై
సీనా జోయా యే జఖ్మెకారీ హై
నా మనసు మళ్లీ వ్యాకులమవుతోంది, గుండె చెలమల్లోకి చూస్తే గాయమే ఉంది. అలా గాయం ఎందుకైందీ అంటే,
ఫిగర్ జిగర్ ఖోద్ నే లగా నాఖూన్
ఆమ్ దే ఫస్ లే లాలకారీ హై
ఇక్కడ హృదయాన్ని గోరు త్రవ్వడంగా చెప్పారు ఇక్కడ హృదయం గాలిబ్ దీ, గోరు ప్రియురాలిదీ అయి ఉండవచ్చు. అలా చేయడం ద్వారా ఆమె నాటే బీజాలన్నీ (జ్ఞాపకాలు) ఎప్పటికీ గాయాలోడుతూ ఉండేవిగానే ఉంటాయి. (పంట కూడా రాగ రంజితంగానే ఉంటుంది.) మళ్లీ ఓ కొత్త పరిచయం గుండెను కుదుపుతోంది అని భావం.
ఈ పుస్తకం నాకు నచ్చిన అతి కొద్ది పుస్తకాల్లో ఒకటి.
****************
తేరా నామ్ ఏక్ సహారా?!
నరేష్ నున్నా
సెప్టెంబరు 2011
ప్రచురణ: అంజలి గ్రంథమాల
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
Flat no. 3, MIG-II
Block 6, APHB,
Baghlimgampally, Hyderabad, 500 044
Phone: 40-2767 8430
E-mail: palapittabooks@gmail.com
71 పేజీలు; 50 రూ.
ప్రసాద్
గొప్ప పరిచయం. ఎన్నిసార్లు చదివినా ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవమంటుంది.
ఇందులోని శబ్దలయ మనసును వుర్రూతలూగిస్తుంది.
NS Murty
రమాసుందరి గారి ఈ వ్యాఖ్య / వ్యాసం చాలా చక్కగా ఉంది. బాగుందని “Vague” గా చెప్పకుండా ఎందుకు ఎక్కడ ఎలా బాగుందో చాలా బాగా వివరించారు. ఈ రచన సమగ్రంగానూ, వివరణాత్మకంగానూ, హృద్యంగానూ సాగింది.
కాకపోతే నాకు అర్థం కానిదల్లా ఈ క్రింది కామెంటే:
“నాస్తికత ఛాయల్లో పెరిగినా బహుశా అది కొంచెం తార్కికత నేర్పి ఉంటుందేమో గానీ మనిషికి సహజంగా రసజ్ఞతను దూరం చేయలేదు. ….”
నాస్తికుడికి రసజ్ఞత ఉండదా? లేదా నాస్తికతఛాయల్లో పెరగడం వ్యక్తి యొక్క రసజ్ఞత దూరం చేస్తుందా? తార్కికత వల్ల మనిషి నాస్తికుడవుతాడా లేక నాస్తికత “కొంచెం తార్కికత” నేర్పుతుందా?
మంచి సమీక్ష చేసినందుకు అభినందనలు.
rama (rama sundari)
మూర్తి గారూ,
నాస్తికుడు కల్పన, ఊహాజనిత వాస్తవం కంటే, భౌతిక వాస్తవికత, తర్కబద్ధమైన శాస్త్రీయ జ్ఞానం, ఇంటిలిజన్స్ కి విలువ ఇస్తాడు. తర్కం పాళ్లు ఎక్కువగా ఉంటాయి అతనిలో. ఆ అభిప్రాయంతో అన్నదే తప్ప వేరే ఏ ఉద్దేశ్యమూ లేదు. థాంక్యూ.
ramachary bangaru
rachaita tana tolinaati muchatlu nijayatito andamgaa chekkinaaru.intavaraku agnaatamgaaunna voohasundari silanunchi silpamgaa mundukochindi.eemainaa aayanato vusulu cheppindi anna vaastavam koodaa veluguloki vachindi. akkado prasaantamgaa jeevanam gaduputunnavaarini akaasmaatugaa elaavelikitevadam konchem bhaadakaliginchindi.