మూడో ముద్రణ – కన్నెగంటి చంద్ర కథలు


(జనవరి 6న ఒంగోలులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహోత్సవాల వేదికపై శ్రీ కన్నెగంటి చంద్ర కథల సంపుటి మూడో ముద్రణ – శ్రీయుతులు ఎండ్లూరి సుధాకర్, కె.శివారెడ్డిల ఆధ్వర్యంలో శ్రీ పాపినేని శివశంకర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి వ్రాసిన ముందు మాట)

********

మిత్రవాక్యం

ఎత్తుగా ఎదిగినవాడి భుజం తట్టటం కష్టం అంటూ ఒక కథను కన్నెగంటి చంద్ర ముగించడం నాకు గుర్తు. ఐనా, స్నేహితుడి భుజం తట్టడం, అది అందకపోతే వీపైనా తట్టడం, మిత్రులకు ఉండే హక్కు. ఆ హక్కుతోనే ఈ మాటలు చెబుతున్నాను.

కన్నెగంటి చంద్ర నాకు చిరకాలంగా మిత్రుడు. ఆభిరుచుల్ని పంచుకునే స్నేహితులు ఎక్కువగా లేని రోజుల్లో ఎడారిలో ఒయాసిస్సులా తెలుగు ఇంటర్నెట్ వేదిక soc.culture.indian.telugu కనిపించింది. ఇంటర్నెట్ తొలి రోజుల్లో తెలుగువారికి అందుబాటులో ఉన్న ఒకే ఒక్క వేదిక అది. 1994 జనవరిలో, ఆ అద్భుత ప్రపంచంలో విప్పార్చిన కళ్ళతో అడుగుపెట్టాను. 35,000 మంది పైగా తెలుగువారు ప్రపంచం అన్ని మూలలనుండీ పాల్గొనే వారు. సినిమా, సాహిత్యం, సంగీతం, రాజకీయాలూ, సమస్త విషయాలూ వాడిగా వేడిగా చర్చించుకొనేవారు; అచ్చమైన తెలుగువారిలా అరుచుకొంటూ, పోట్లాడుకొంటూ (కొండొకచో అచ్చమైన సంస్కృతం మాట్లాడుతూ కూడా) ఉండేవారు. అంత గడబిడలోనూ, స్పష్టంగా గుర్తుపట్టగల, వినవలసిన గొంతుకలు కొన్ని ఉండేయి. వాటిలో కన్నెగంటి చంద్ర గొంతు ఒకటి. అప్పుడు మొదలైంది మా స్నేహం.

కన్నెగంటి చంద్ర నాకు ముందు కవిగా పరిచయం. ఆ తరువాత తెలిసింది అతను చెందూ అన్న పేరుతో కథలు వ్రాసేవాడని. అతని కథలు ప్రచురితమవటం మొదలు పెట్టేటప్పటికి, నేను అమెరికా వచ్చేశాను. ఇప్పట్లా, ఆ రోజుల్లో పత్రికలు అందుబాటులో లేనందువల్ల అతని కథలు అప్పటిదాకా నేను చదవలేదు. నేను కొద్దిగా బలవంతం చేయగా, రెండు కథలు మాత్రమే తన వద్ద ఉన్నాయని – సిగ్గు, అవతలి గట్టు –చూపించాడు. సరళంగా ఉన్న అతని శైలి, కథానిర్మాణం పట్ల అతను చూపించిన శ్రద్ధ, వస్తువును ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా మలచటంలో చూపిన పరిణతి నన్ను ఆకట్టుకున్నాయి. సిగ్గు కథని తానాపత్రికలో ప్రచురించినప్పుడు పాఠకులనుండి విశేష స్పందన వచ్చింది. నేను సంపాదకత్వం వహించిన తానపత్రిక, తెలుగునాడి పత్రికలలోనూ, సావెనీర్లలోనూ అతనితో కథలూ, కవితలూ – ఒకోసారి మొహమాటపెట్టో, బలవంతం చేసో – రాయించుకొనేవాణ్ణి.

కన్నెగంటి చంద్ర ఈ తరం తెలుగు కథకుల్లో ఒక ప్రశస్తమైన స్థానంలో ఉండవలసినవాడని నా నమ్మకం. ఐతే అతను రచయితగా అమెరికా బయట తెలుగువారికి పెద్దగా తెలిసినవాడు కాదు. అమెరికా వచ్చిన తరువాత, కన్నెగంటి చంద్ర రచనలన్నీ అమెరికన్ తెలుగు పత్రికల్లోనే ప్రచురింపబడ్డాయి. చాలామంది అమెరికన్ తెలుగు రచయితల్లా తెలుగు నాట పత్రికలలో ప్రచురణకోసం అతను ప్రయత్నించినట్లు లేదు. బతుకు కథ మాత్రం కథ – 2001 సంకలనంలోకి ఎంపిక అయ్యింది. ఇన్నాళ్ళకి అతని కథలు ఈ సంకలనం ద్వారా తెలుగునాట అందుబాటులో రావడం ఆనందించవలసిన విషయం.

అప్పుడప్పుడూ కొంటె కథలూ, చిన్న కథలూ వ్రాసినా, చంద్ర ఏదీ ఆషామాషీగా వ్రాయడు. ఇంజనీరు కావటంవల్లనేమో, ఏం వ్రాసినా వస్తుపరంగా దిట్టమైన పునాది ఉంటుంది. సృజనాత్మకమైన నమూనా, నిపుణమైన, పటిష్టమైన నిర్మాణం ఉంటాయి. నగిషీలు – అవసరమైనంత వరకే – పొదుపుగా ఉంటాయి. అనవసర ఆడంబరాలు సాధారణంగా కనిపించవు. భవన నిర్మాణం పూర్తయ్యాక మాయమైపోయే అర్కిటెక్టులానే, కథ వ్రాయటం పూర్తయ్యాక పాత్రలకూ, పాఠకులకూ మధ్య ఉండకుండా కథకుడు మాయమైపోతాడు. చాలా కథలు ఉత్తమ పురుషలోనే సాగినా, అన్ని పాత్రలపాట్లా రచయిత నిర్మమకారంగా, నిర్వికారంగా ఉండటం అనే అరుదైన లక్షణం చంద్ర కథల్లో కనిపిస్తుంది.

అతని తొలికథల్లో ఒకటైన విచిత్రం లోనే ఈ లక్షణాలన్నీ చూడవచ్చు. కథ ఎత్తుగడ, ముగింపు యాదృఛికం కాదనీ, రచయిత బుద్ధిపూర్వకంగానే అలా కథను నిర్మించాడనీ స్పష్టమౌతుంది. ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయే కథ చకచకా చదివింపజేస్తుంది. మూడు పాత్రలలోనూ, ఏ పాత్ర ప్రవర్తన పట్లా రచయిత జడ్జ్‌మెంటల్ గా ఉండడు. అలాగే అవతలి గట్టు కథలో ప్రతి ప్రకరణం మొదలు, చివర నిర్మాణం పట్ల చంద్రకు ఉన్న శ్రద్ధను స్పష్టం చేస్తాయి. తన తొలి కథల్లోనే చంద్ర ఈ పరిణతి సాధించడం విశేషం.

చంద్ర విశిష్టత కథానిర్మాణానికే పరిమితం కాదు. నాలాగా మానసిక వైద్యుడు కాకపోయినా చంద్ర మానసిక శాస్త్రాన్నీ, మనుషుల ప్రవృత్తులనీ, మనుషుల మధ్య సంబంధాలనీ, వైరుధ్యాలనీ శ్రద్ధగా అధ్యయనం చేశాడని, సునిశితంగా పరిశీలిస్తున్నాడనీ అనిపిస్తుంది. చాలా కథల్లో ఉత్తమ పురుషలో కథ చెప్తున్న నాయకుడి అంతర్గత మథనం చైతన్య స్రవంతిని పోలిన శైలిలో ఉంటుంది. సాధారణ మానవుడి ఆలోచనల్లొనూ, ప్రవర్తనలోనూ ఉండే వైరుధ్యాలు చాలా కథలకి వస్తువులు. పరిణామాలు ఒకోసారి విషమంగానే ఉన్నా, అతని పాత్రల పోకడలు మనకు సహజంగానే కనిపిస్తాయి. ఉదాహరాణకు మధ్యవ్యవధిలో నీడలు కథలో నాయకుడి ఆలోచనలకూ, ప్రవర్తనకూ ఉన్న వైరుధ్యంవల్ల కథ అనుకోని రీతిలో సాగినా రచయిత తన పాత్రల ప్రవర్తనను అసహజంగా నిర్దేశించినట్లు అనిపించదు.

చంద్ర మొదటి కథల్లో ఒకే రకమైన నిర్మాణ ధొరణి కనిపించినా, కాలక్రమేణా అతనిలో ప్రయోగాత్మక ధోరణి పెరిగింది. మ్యాజికల్ రియలిజం, సైన్స్ ఫిక్‌షన్, స్ట్రీం ఆఫ్ కాన్షస్‌నెస్, నాన్-లీనియర్ నేరేషన్ వంటి ప్రక్రియల్లోనూ కథలు వ్రాశాడు. తెలుగులో వచ్చిన అతి తక్కువ మంచి సైన్స్ ఫిక్‌షన్ కథల్లో మచ్చ ఒకటి. వస్తువులానే కథనంలోనూ క్లిష్టత ఉన్నా, కథ చదవడం పూర్తయ్యేసరికి కథాంశం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఒక నేను, ఏంలేదు కథల్లో నాయికలు విస్మయకరమైన పాత్రలు.

చంద్రలో రచయిత అనుభవంతోపాటే పెరుగుతున్నాడు. పాటకుల పరిణతిపట్ల మంచి రచయితకు ఉండే నమ్మకం ఈ కథల్లో కనిపిస్తుంది. ప్రతి విషయాన్నీ వాచ్యంగా చెప్పనవసరం లేదనీ, కథను అర్థం చేసుకోవడంలో పాఠకుడికీ భాగం ఉందన్న స్పృహ ఈ కథల్లో చూడవచ్చు. వెదుకులాటను వేర్వేరు కోణాల్లో చిత్రిస్తూ చంద్ర ఈ మధ్యే వ్రాసిన కథాత్రయం – మూడో ముద్రణ, చిహ్నం, చిట్టచివరిది కథల్లో ఈ పరిణతి స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. పాప కథ వస్తుపరంగా,భాషపరంగా, శిల్పపరంగా అరుదైన కథ; గొప్పకథల జాబితాలో చేర్చదగిన కథ.

అమెరికా తెలుగుజీవితాన్ని, సంబంధబాంధవ్యాలపై వలసజీవితం చూపుతున్న ప్రభావాల్ని తన కథల్లో నిజాయితీగా విశ్లేషిస్తున్న వారిలో కన్నెగంటి చంద్ర ప్రముఖుడు. అతివ్యామోహం, అతి విమర్శ లేకుండా అవగాహనతో, సంయమనంతో, నిష్పాక్షికంగా చిత్రించటం చంద్ర ప్రత్యేకత. దైనందిన జీవితపు సంఘర్షణలలో సతమతమౌతున్న సమయంలో సెప్టెంబర్ 11 సంఘటనలు చూపిన ప్రభావాన్ని చిత్రించిన బతుకు కథ బహుప్రశంసలు పొందింది. మనుమలూ, మనుమరాళ్ళూ అమెరికాలోనూ, అమ్మమ్మలూ తాతలూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నప్పుడు వారిమధ్య అనుబంధాల్ని ఎంత నీరు పొసి బతికించగలమో హృద్యంగా చిత్రించిన కథ ఒక వేసవి. పిల్లల పెంపకంపై ఇతరులపై ఆధారపడ వలసిన పరిస్థితిని వేరే దృక్కోణంలో చూపిన కథ మా అమ్మగదే. ఆర్థిక మాంద్యము, ఒంటరితనము, సైబర్‌జీవితము వంటి అమెరికన్ దినుసులు ఇతర కథలకు వస్తువులు.

సహజంగా కవి ఐన చంద్ర కథల్లో కవిత్వం కనిపించటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఒకోసారి కవితలే కథలు ఐపోవడమూ కద్దు. వ్యాసాల్ని కథలుగా చెలామణీ చేయడానికి ప్రయత్నించలేదు కానీ, కొన్ని కథలు కాని కథలూ వ్రాశాడు. ఆ కోవలోని కథ కథ ఈ సంపుటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కథ. ఈమాట అంతర్జాల పత్రికలో కథల నాణ్యతను నేను విమర్శించిన మరు సంచికలో ఈ కథ రావటం కాకతాళీయమే అయి ఉండవచ్చు. ఈ కథ కథ మనకు చెప్తూ చంద్ర కథకుడిగా తన లక్ష్యాలను, కథ లక్షణాలను నిర్వచిస్తున్నాడు. ఔత్సాహిక కథకులు అధ్యయనం చేయవలసిన కథ ఇది.. కథల బహు పార్శ్వాలను, కథకు, పాఠకుడికి, రచయితకీ ఉండే సంబంధాలనీ వాచ్యంగానూ, సూచ్యంగానూ చర్చించే ఈ కథ కథ కథపై మక్కువ ఉన్నవారందరీనీ ఆలోచింపచేసే కథ.

ముప్పై ఏళ్ళు పైగా వ్రాస్తున్నా చంద్ర కథలు రాశిలో తక్కువే. ఈ సంపుటిలో ఉన్న 22 కథలే కాకుండా చంద్ర ఇతర కథలు కూడా కొన్ని వ్రాసినా, ఆ కథాలన్నీ ఈ సంపుటిలో ఉంచితీరాలి అనే లౌల్యానికి అతను లొంగిపోవకపోవడం అభినందించవలసిన విషయం. ఈ సంపుటి స్థాయిలో లేకపోయినా ఇందులో చేర్చనివి కూడా గుర్తుండే కథలేనటానికి తార్కాణం, వ్యాసం మొదట్లో నేను ఉదహరించిన వాక్యం ఉన్న కథ (భేష్, మధురవాణి పత్రికలో ప్రచురించబడింది) ఈ సంపుటంలో లేకపోయినా, చదివి పదహారేళ్ళయినా నాకు గుర్తుండటం.

మంచి కథను అభిమానించే పాఠకులు ఈ కథలని అభిరుచితో ఆస్వాదించి ఆనందిస్తారని నా నమ్మకం. కన్నెగంటి చంద్ర ఇంతకన్నా మంచి కథలు వ్రాయాలనీ, పాఠకాదరణతో ఈ మూడో ముద్రణ బహుముద్రణలు పొందాలనీ నా కోరిక.

జంపాల చౌదరి
—-

మూడో ముద్రణ
కన్నెగంటి చంద్ర కథలు
2012 జనవరి
విరించి క్రియేషన్స్
AG-2, Mathrusri Apts., Hyderguda,
Hyderabad – 500 029.
పంపిణీ: నవోదయా పబ్లిషర్స్, విజయవాడ
త్వరలో: kinige.comలో కూడా దొరుకుతుంది.
182 పేజీలు. 60 రూ.

You Might Also Like

11 Comments

  1. Suresh

    Chandra,
    I have been collecting your stories from sources like Eemaata to write an intro. Glad that the book arrived now, and Jampaala gaaru shared my views already (what a relief!) . You are the one Telugu writer who fascinated me in the recent years, and remember you as another cruel as chaa.so in maintaining brevity.

    -Suresh (990)

  2. chavakiran

    ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ లింకు చూడగలరు. http://kinige.com/kbook.php?id=611

  3. Krishna Prasad

    Heartly Congrats Chandra garu.

  4. nalgondareddy

    చంద్ర.

    కంగ్రాట్స్. మీ బతుకు చదివాను. అప్పట్లో ఆశ్చర్యపోయాను. ఎవడీన అని కూడా అనుకున్నాను. అలా క్రిస్ప్‌గా కథ రాయడం కష్టం. అమెరికాలో ఉంటున్న మీరు, అమెరికా నుంచి వచ్చేసిన అక్కిరాజుగారు మంచి కథకులు. ఆరి సీతారామయ్య, సాయి బ్రహ్మానందం గొర్తి వీళ్ల కథలు కూడా శ్రద్ధగా చదువుతాను. నిడదవోలు మాలతిగారివి సరేసరి. కె.వి.గిరిధరరావు ఇప్పుడు రాస్తున్నారా? నారాయణస్వామి ‘తుపాకీ’ మంచి కథ. ఆ తర్వాత ఆయన ఏమైనా రాశారా? అంటే- తుపాకీని దాటారా?
    రాయదగ్గ వాళ్లు రాస్తుంటే గమనించాల్సినవాళ్లు గమనిస్తూనే ఉంటారు. రాయకూడని వాళ్లు రాస్తుంటే అప్పుడు కూడా గమనించాల్సిన వాళ్లు గమనిస్తూనే ఉంటారు.
    జంపాలగారు ఎందుచేతనో కథల జోలికి పోలేదు. లేకుంటే ఆయనకున్న ఓపికకు, ఆచరణకు మడమ తిప్పకుండా రాసి మీలాంటి వారికి పెద్ద సవాలుగా నిలుచుండేవారు. అమెరికా వీరబాహుల చేత కాకుండా ఆయన చేత ముందుమాట రాయించడం బాగుంది.
    చంద్రగారూ. మీలో అలక్ష్యం కొద్ది వచ్చిన తెంపరితనంతో కూడిన లెక్కలేనితనం వల్ల కలిగిన పొగరుబోత్తనంతో మిళితమైన వినయం ఉందని అనుమానం.
    రెక్కలు సాచండి. రాసిన దానిని సీరియస్‌గా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ప్రమోట్ కావాల్సిన కథలు ప్రమోట్ కాకపోతే ప్రమోట్ కాకూడని కథలన్నీ ప్రమోట్ అవుతూ ఉంటాయి.
    అన్నట్టు ఈ మధ్య అమెరికాలో ఎవరినీ నిదురపోనీకుండా కావుకావుమనే కాకులెక్కువైనట్టున్నాయ్. ఆ కాకుల మధ్య ఆకులందు అణిగిమణిగి మీలా కూసే కోకిలలన్నీ వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    -శ్రీనివాస ప్రసాద్, హైద్రాబాద్.

    1. చంద్ర కన్నెగంటి

      @ప్రసాద్

      ధన్యవాదాలు.
      రాసేవాళ్లంతా రాస్తూనే ఉన్నారు 🙂 రాయకూడని వాళ్ళు ఎవరూ ఉండరనే నేను అనుకుంటాను. ఒక్కోటీ ఒక్కో రుచి. చదివే వాళ్ళకు చదివినంత.

      – చంద్ర

  5. Akkiraju Bhattiprolu

    చంద్ర కథల్ని ప్రస్థావించ కుండా అమెరికా తెలుగు కథ గురించి రాసే ఏ వ్యాసం, సమీక్ష కూడా సంపూర్ణం కాదు అని నేను భావిస్తాను. పుస్తకం మూడో ముద్రణ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది.

    చిన్న సవరణ కాని వివరణ. బతుకు కథ “కథ 2001” లో ఎంపిక కాబడింది అన్నది నిజమే అయినా ఇది కూడా మొదట అమెరికా సావనీర్ లోనే ప్రచురించ బడింది. ఈ కథ సిలికానాంధ్రా వారి మొట్టమొదటి సావనీర్ “సుజన రంజని” (http://www.siliconandhra.org/sanoad.pdf) లో ప్రచురించబడింది. ఆ సంచికకి నేను సంపాదకత్వం వహించిన కారణాన నాకు అంత గుర్తు.

    అమెరికా మరియు నెట్ పత్రికల్లో వచ్చే చాలా మంచి కథలు సంకలనాల్లో ఇప్పటికీ చోటు చేసుకోక పోవటం దురదృష్ట కరం. ఈ బతుకు కథ లాంటి కొన్ని కథలు మాత్రమే అలా రాగలిగాయి. సంకలానాల్లో వస్తుందా రాదా అనేది పక్కన పెట్టినా, ఎక్కువ మంది తెలుగు పాఠకులకి చేరాలంటే మాత్రం ఆంధ్ర రాష్ట్రం లోని పత్రికల్లో ప్రచురించ బడటమే మార్గం. చంద్ర కథలకి స్థాయికి తగినంత గుర్తింపు రాలేదని, అందుకు ఇదే కారణమని నమ్ముతాను. రచయితగా చంద్రకి ఎంత పేరొచ్చిందీ అనే విషయంలో చంద్రకి పెద్ద గా పట్టింపేమీ ఉన్నట్టు లేదు. కానీ ఆ కథలు ఇంకా ఎక్కువ మంది చదివితే బాగుండేదీ అని నాబోటి స్నేహితులం (చంద్రకీ, ఆయన కథలకీ) అనుకోవటం సహజం.

    -అక్కిరాజు

    1. Jampala Chowdary

      @అక్కిరాజు: బతుకు కథ సుజనరంజనిలో చదవటం నాకూ గుర్తే. పుస్తకంలో మొదటి ప్రచురణ వివరాలు ఇచ్చారు. ఆ కథ ఒక్కటే గత ఇరవైయేళ్ళలో ఆంధ్రదేశానికి చేరిన చంద్ర కథ అని చెప్పటమే నా ఉద్దేశం.
      సందర్భం వచ్చింది కాబట్టి చెబ్తున్నాను: ఆ 2001 సుజనరంజని సావెనీర్లో చదవవలసిన కథలు, వ్యాసాలు చాలా ఉన్నాయి. బాగా వచ్చిన సావెనీర్లలో అది ఒకటి.

    2. చంద్ర కన్నెగంటి

      @అక్కిరాజు

      పుస్తకం మొదటి ముద్రణే; పేరు మాత్రమే “మూడో ముద్రణ”

      – చంద్ర

  6. Kumar N

    I read some of his stories, and liked them.
    Thanks for the article

Leave a Reply