దాంపత్యోపనిషత్తు

‘దాంపత్యోపనిషత్తు’ పేరును బట్టి మీరెన్ని ఊహించుకున్నాకూడా, రాసినది మునిమాణిక్యం వారు అని చెప్పాక, ఆయన రాసినవి చదివిన వారెవరికైనా ఆ పుస్తకం దేని గురించి? అన్నది ఊహించడం కాస్త తేలికవ్వొచ్చు. ఆయన పేరు చూడకముందు – ఇదేమిటీ? ఇప్పుడిందులో అలా ఉండు, ఇలా ఉండకు అని పాఠాలు చెప్తారు కాబోలు – అనుకున్నాను. రచయిత పేరు చూశాక -ఒకవేళ చెప్తే చెప్పారు లే, సరదాగా ఉంటుంది పుస్తకం అనుకుని చదవడం మొదలుపెట్టాను.

ఈ పుస్తకం ప్రధానంగా భార్యా-భర్తల మధ్య వచ్చే తగువుల గురించి. వాటిని కూడా ఇంత పరీక్ష చేసి, పరిశోధన చేస్తారని అనుకోలేదు నేనిన్నాళ్ళూ. పైగా, ప్రతి చోటా శాస్త్ర కారులు ఇలా అన్నారు, అలా అన్నారు అనుకుంటూ రిఫరెన్సులు ఇవ్వడమే కాక, ఒక్కోరకం అలకకీ, తగువుకీ పేరు, దానిలోని సౌందర్యం యొక్క వర్ణనా నూ. చాలా చోట్ల అబ్బో! ఇంత రిసర్చి బిల్డప్ అవసరమా అని అనుకుంటూనే నవ్వుకుంటూ ఉన్నాను. ఈ పుస్తకం ముందుమాట పేరు “మునిమాట”. కొంత స్తోత్కర్ష లేకపోలేదు కానీ, పుస్తకం గురించి మంచి పరిచయం ఇచ్చింది. ఐడియల్లీ, భర్త భార్యకి చదివి వినిపించాలట. నిజమే, అలాంటి సన్నివేశంలో ఇది బాగా ఎంజాయ్ చేయగల పుస్తకం. ఎటొచ్చీ, అలా చేస్తే ఇద్దరికీ తగువులొచ్చే కారణాలు లేకపోలేదు. కలహానికి కారణాలు అని కూడా ఈ పుస్తకంలో వివరణలు ఉన్నాయి. అందులో ఇది లేదనుకోండి..అది వేరే విషయం.

“..భార్య చెప్పిందల్లా ఓపిగ్గా వినడం భర్త అయిన వాడు అలవరుచుకోవలసిన సుగుణాల్లో మొదటిది. దాంపత్య సౌఖ్య సాధనకు ఇది ప్రథమసోపానం. భార్య కాపురానికి వచ్చి చాలా సంవత్సరాల నుంచి భార్యతో కాపురం చేస్తున్న వాళ్ళకి ఈ హితవాక్యం అనవసరం. వాళ్ళకి ఈపాటికి ఈ సుగుణం ఎముకల్లోకి పాకి ఉంటుంది.”

“నీ భార్య నిన్ను గౌరవించడం లేదని ఎప్పుడూ అనుకోకు. భార్య అయిన మనిషి భర్తను ఎప్పుడూ గౌరవించదు”

-ఇలాంటి వాక్యాలు చూస్తే ఇది చాలా పురుష పక్షపాతం అనిపిస్తుంది నాకైతే. కానీ, రాసినది పురుషుడే కదా 😉 అయితేనేం, నవ్వుకోడానికి నాకు అది అడ్డు కాలేదు. మధ్య మధ్య పిట్ట కథలు బోలెడు. మచ్చుకి రెండు చెప్తాను:

ప్రముఖ రచయిత, నోబెల్ గ్రహీత Sinclair Lewis తనకి నోబెల్ వచ్చిందన్న విషయాన్ని ఆనందంగా భార్యకు చెప్పాలని వెళ్ళాడట. ఆమె అంతా విని, “ఐతే, ఇది అంత పెద్ద బహుమతి అయితే, మీకెందుకిచ్చారూ?” అందట 🙂 వేదులవారు ప్రేమ కవిత్వం రాస్తూ ఉంటే, వారి భార్య – “మీకు ప్రియురాలు ఏమిటండీ నా బొంద! ఎవరైనా వింటే నవ్వుతారు. ఎవరో వ్రాసారు అంటే వేరే సంగతి. మన అందానికి తోడు ప్రియురాలు కూడానుటండీ?” అనడంతో దెబ్బకు ఆయన ఆ తరహా కవిత్వం మానేశారట! ఇలాంటివి – నిజాలెంతో తెలీకున్నా కూడా చదవగానే నవ్వు పుట్టించాయి. ప్రధానంగా ఆ వర్ణించే విధానం వల్ల.

“భార్యా భర్తల మధ్య జరిగిన కలహం పేలవమైనట్టీ, నిర్జీవమైనట్టీ మాటల కూర్పు అని మీరు అంటారు. అది రసవంతమైన కావ్యం అని నేనంటాను. ఆ మాటలు కఠినవాక్కులు అని మీరూ, రమణీయార్థ ప్రతిపాదకములని నేనూ అంటున్నాను. ఆ మాటలు ఉచ్ఛారణలో కాకవీత్వములేనివని మీరంటారు. అవి మాటలు కావు, రాగయుక్తమైన కీర్తనలు అని నేనంటాను. పోట్లాటలో భయానక భీభత్స రస ప్రదర్శనము మాత్రమే జరుగుతుందని మీరు అంటారు. కాదు బాబూ, నిశితంగా చూస్తే, తీవ్రంగా ఆలోచిస్తే ప్రతిమాట ధ్వని వ్యంజకమని, అన్ని రసములూ ప్రదర్శితమౌతాయనీ నేనంటాను”
– బహుశా, essence of the book ఈ మాటల్లో అర్థమౌతుంది అనుకుంటా.

మొత్తానికి highly enjoyable బుక్. ఆల్రెడీ సంసారసాగరంలో మునిగిన వారు, మునగడం నేర్చుకుంటున్నవారూ అయితే మరింత ఎంజాయ్ చేయగలరు.

**************************
పుస్తకం వివరాలు:
దాంపత్యోపనిషత్తు – మునిమాణిక్యం నరసింహారావు (Dampatyopanishattu – Munimanikyam Narasimharao)
శ్రీమానస పబ్లికేషన్స్, విజయవాడ
ఆగస్టు 2003
ధర: 35/-
విశాలాంధ్ర లో దొరుకుతుంది.
***************************

You Might Also Like

One Comment

  1. రావు పంగనామముల

    మునిమాణిక్యం వారి “కాంతం వృద్ధాప్యం” అన్న నవలిక, “అల్లుళ్ళు” అనే కథల సంపుటి 1950 లలో చదివాను. అవి ఇప్పుడు దొరుకుతున్నవేమో పాఠకులెవరైనా చెప్పగలరా?

Leave a Reply