ఫోకస్ – విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్
తల్లో హెడ్డున్న ఏ మనిషీ, అందునా సాహిత్యాభిమాని – చూస్తూ చూస్తూ టాగోరంటే నాకు తెలీదు అనడు. అయినా సరే, ఈ నెల టాగోర్ పై ఫోకస్ చేస్తున్నప్పుడు మాటవరసకైనా పరిచయ వ్యాసం రాయాలి కదా అన్న ఉద్దేశ్యంతో చేస్తున్న సాహసం ఇది – టాగోర్ గురించి ఓ పరిచయ వ్యాసం రాయడం.
“జనగణమన” రాసాడనో, “శాంతినికేతన్” స్థాపించాడనో, “గీతాంజలి” రాసాడనో, నోబెల్ బహుమతి పొందాడనో, నాయకుడనో, సంగీతకారుడనో, కవనో, నవలాకారుడనో, చిత్రకారుడనో,తత్వవేత్తనో, విద్యావేత్తనో, నాటకరచయితనో – ఎలాగో ఒకలాగ చాలామందికి టాగోర్ పరిచయం ఉండే ఉంటుంది. ఇన్నిరకాలుగా ఒకే మనిషి గురించి తెలుసుకోగల సౌకర్యం ఉండటం వినడానికి ఎంత బాగుంటుందో, అలాంటి ఘనత సాధించగలగడం అంత అసాధారణం.
టాగోర్ మే ఏడు న 1861లో ఓ గొప్ప బెంగాలీ కుటుంబంలో పుట్టాడు. దేబేంద్రనాథ్ టాగోర్, శారదా దేవిల పదమూడు మంది సంతానంలో బ్రతికున్నవారిలో ఆఖరువాడు. తండ్రి దేబేంద్రనాథ్ గొప్ప ఆలోచనాపరుడు. బ్రహ్మో మతాన్ని కనుగొన్నవారు. తాత ద్వారకనాథ్ ప్రముఖ వ్యాపారవేత్త. టాగోర్ సోదరుల్లో కవి, సంగీతకారుడు, పండితుడు, శాస్త్రవేత్త, ICS అధికారి – ఇలా రకరకాల వ్యక్తులున్నారు. టాగోర్ విద్యాభ్యాసం చాలావరకు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులతోనూ, తండ్రితో కలిసి చేసే ప్రయాణాలతోనూ గడిచింది. ఎనిమిదేళ్ళకే కవిత్వం రాసి, పదహారేళ్ళు వచ్చేసరికి మొదటి పుస్తకమూ,కొన్ని కథలూ, నాటకాలూ – రచయితగా రూపొందుతూ వచ్చాడు. కాలం గడిచే కొద్దీ ఆయన చేతులు వేర్వేరు రంగాల్లోకి వెళుతూ పట్టిన ప్రతి చోటా ఓ పట్టు పట్టేదాకా వదలకుండా, జనాల మనసులో నిలిచిపోయే గుర్తులు సృష్టిస్తూ వచ్చాయి. టాగోర్ ప్రభావం ప్రపంచం పై ఎంత ఉందో ఒక్కసారి అంతర్జాలం లో టాగోర్ గురించి లభించే సమాచారం చూస్తే అర్థమౌతుంది. ఆయన కవిత్వం ఇష్టపడ్డ ప్రముఖుల్లో సీ.ఎఫ్.ఆండ్రూస్, యీట్స్, ఎజ్రా పౌండ్, థామస్ మూర్ వంటి ప్రముఖులున్నారు. టాగోర్ కలిసిన ఆ నాటి ప్రముఖుల్లో ఐన్‌స్టీన్ మొదలుకుని ముస్సోలిని దాకా ఎంతో మంది ఉన్నారు. నిజానికి, టాగోర్ గురించి చెప్పాలంటే, ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కానట్లే, ఎన్ని చెప్పాలో, ఎన్ని వదిలేయొచ్చో, ఏది చెప్పి తీరాల్సిందో – ఏమీ అర్థం కాదు. అన్ని సంగతులున్నాయి. మరి ఆయనొక వ్యక్తా? కాదే! ఎందరో వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిగా ఏర్పడ్డ రూపం 🙂
ఆయనలోని మిగితా కోణాలను వదిలి రచనా వ్యాసంగాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఆత్మకథగా ఆయన రాసుకున్నవి రెండు – జీవన స్మృతి (My reminiscences), చేలేబేలా (Childhood Days). ఆయన ఉత్తరాల ద్వారా, వ్యాసాల ద్వారా ఆవిష్కరింపబడ్డ ఆత్మకథ “my life in my words”. భిన్న శైలుల్లో కవిత్వం రాసారు. Gitanjali, Stray Birds, Crescent Moon వంటి ఆంగ్లానువాద కవితా సంకలనాలన్నీ ఇప్పుడు విరివిగా ఆన్లైన్లో చదివే సౌలభ్యం ఉంది. ఘర్ భైరే, గోరా, చోకర్ బాలి వంటి నవలలే కాక, చిత్ర, పోస్ట్ ఆఫీస్ వంటి నాటకాలు, Hungry stones వంటి చిన్న కథలు, లెక్కలేనన్ని సాహిత్య, రాజకీయ, ఆత్మకథాత్మక, ఆలోచనాత్మక వ్యాసాలు – ఒకటా రెండా, ఉన్న అన్ని రాత ప్రక్రియలలోనూ ఎన్నో రచనలను చేసారు. ఆయన రచనలు ఎన్నో భారతీయ, విదేశీ భాషల్లోకి అనువాదం కాబడి, ఎందరినో ప్రభావితం చేసాయి.
ఈ పరిచయంతో అసలు విషయానికొస్తే: పుస్తకం.నెట్ లో ఈ నెలను టాగోర్ నెలగా ప్రకటిస్తున్నాము. పాఠకుల్లో టాగోర్ రచనల గురించి, ఆయన సాహితీ కార్యకలాపాల గురించీ ఇతర విషయాల గురించి రాసే ఆసక్తి ఉన్నవారు తమ తమ వ్యాసాలను editor@pustakam.net కు పంపగలరు. దీనికర్థం ఈ నెల్లో ఈ వ్యాసాలు తప్ప మరేవీ వేసుకోమని కాదు 🙂 . ఈ నెల ఫోకస్ టాగోర్ అని తెలియజెప్పడం మాత్రమేనని గమనించగలరు. టాగోర్ ప్రభావం లో ఇప్పుడిప్పుడే పడుతున్న వారు మొదలుకుని, ఓ జీవితకాలం ఆయన రచనలతో సంభాషిస్తూ ఉండిపోడానికి సిద్ధపడిపోయిన వారిదాకా అందరికీ టాగోర్ రచనలతో మీ అనుబంధం పంచుకోడానికి ఇదే మా ఆహ్వానం.
bharathroyal
me storys supers super.marinni vishayalu tagore gurinchi thelusukuvalani adhuruchusthunnam
naveen kumar
ravindra nath tagore gari geethanjali book nenu chadava ledu
kani chadavalani undi
aa book chadivi nenu maralani anukuntunnanu
kachitanga maratanu.
pingali sasidhar
విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ జగమెరిగిన కవి అంతకంటె జగాన్నెరిగిన కవి.
అందుకే విశ్వకవి బిరుదానికి సమర్ధుడు, సార్ధకుడు. ముందునుంచీ మన తెలుగు సాహిత్యానికి బెంగాలీ సాహిత్యానికీ ఒక చక్కని అవగాహన తో కూడిన ఆత్మీయతానుబంధముంది. అనువాద రచనల పేరుతొ ఎంతో మంది ఆమహానుభావులని పరిచయం చేసి మనవాళ్ళని చేసేసారు. శరత్ అంటే తెలుగు వాడే నన్న అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. వాళ్ళని మనకి మన మాత్రుభాష లో పరిచయమ్ చేసిన మహానుభావుల గొప్పదనం వల్ల మనకా భావం యేర్పడింది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే అందరికి అన్ని భాషలు నేర్చుకొవటం సాధ్యం కానిపని కాబట్టి యే కొందరో దాన్ని సుసాధ్యం చేసుకొని మనకి మన భాషలో తెలుగు దనాన్ని జొడించి చూపించారు కాబట్టే అంత మమేకం కాగలిగా మన్నది నాఅభిప్రాయం.
ఇక టాగోర్ విషయానికొస్తే, ఆయన రచనలలో విశ్వ విఖ్యాత మైనది గీతాంజలి. ఇందులోని ప్రతి భావము పైకి ఒక లాగాను, తరచి చూచిన కొద్దీ మరోలాగానూ అనిపిస్తుంది. చలం మొదలుకొని ఎందరో వీటిని రకరకాల ప్రక్రియలలో తెలుగు లోకి అనువాదం చేసారు. ఠాగోర్ కి శాంతినికేతనం లో ప్రత్యక్షం గా సుస్రూష చేసిన శ్రీ బెజ్అవాడ గోపాల రెడ్డి గారు గీతాంజలిని తెలుగు పద్యాలలో అనువదించారు, అలానే ప్రముఖ సినీ నటుడు శ్రీ కొంగర జగ్గయ్య “రవీంద్ర గీత” పేర్న చక్కటి పద్యాలు వ్రాసారు. అవి అందరికీ లభ్యం కాక పొవచ్చు ( ముఖ్యంగా నాకు లభ్యం కాలేదు) కాబట్టి ఎవరైనా సాహితీ మిత్రులు వాటిని పరిచయం చేస్తే బాగుంటుందని నా అకాంక్ష.