నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్లిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. పులిహోర తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….

మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక కథల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
‘అసలెలా ఎంచుకుంటున్నాడంటావ్‌?’
‘ఏది వరస?’
‘ఏమైనా ఖదీర్‌ కథలు చెప్పటంలో సిద్దహస్తుడు’
‘ఇంతకీ రేపెవరిదో? ఏ కథ వస్తుందో?’
జనంలో కథల పట్ల ఆకలి నిలువెత్తయి, తాడి ప్రమాణమయింది. నూరు రోజులు, నూరుగురు కథకులు, నూరు కథలు.
పీవీ నరసింహారావు రాసిన కథలో గొల్ల రామవ్వ ఏం చేసింది?
పూసపాటి కృష్ణంరాజు చెప్పిన ‘రెండు బంట్లు పోయాయ్‌’ కథెప్పుడైనా చదివారా?
పురాణం సుబ్రమణ్యంశర్మ ‘రాజనీతి’ ఏమిటో తెలుసునా?
గూడూరి సీతారాం ‘లచ్చి’ కాపరాన్ని ఎలా తీర్చిదిద్దారు?
2బీహెచ్‌కే పరుగుల్లో పడినవారికి దాదాహయత్‌ ‘మురళి ఊదే పాపడు’ ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది?
‘ధనత్రయోదశి’ కథలో భండారు అచ్చమాంబ ఇచ్చిన సందేశం ఏదైనా ఉందా?
‘హోగినెకల్‌’ దగ్గర ఉగ్రకావేరి ఏం చేసిందో మహేంద్ర మాటల్లో చదివారా?
నెల్లూరి కేశవస్వామి ‘యుగాంతం’ అయిపోయిందా, ఇప్పటికీ జరుగుతున్న కథా?

ఒక్కమాటలో చెప్పాలంటే వందరోజుల పాటు రోజుకో జీవితపు రుచి. అందుకున్నవాళ్లకి అందుకున్నంత. తెలుగు ప్రజలకు ఖదీరు వడ్డించిన మృష్టాన్న భోజనం. టీవీ సీరియళ్లు తప్ప మరో లోకమెరుగని ఇల్లాళ్లెందరో ఈ కథలున్న పుస్తకాలెక్కడ దొరుకుతాయోనని ఆరా తీశారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని హైదరాబాదులో ఉద్యోగమే పరమావధిగా బతుకుతున్న కుర్రకారంతా తెలుగు కథలింత బావుంటాయా – మరి మాకెవరూ చెప్పలేదేం అనుకున్నారు. సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ప్రవాస జీవితం గడుపుతున్నవారంతా తెలుగు కథల పుస్తకాలు కావాలని ఇక్కడికి ఫోన్లూ మెయిళ్లూ కొట్టేరు. ‘రావిశాస్త్రి పోయాక తెలుగు కథలు చదవడం మానేశానండీ’ అని స్పష్టంగా చెప్పిన నడివయసు జనాలంతా మళ్లీ తెలుగు కథ మీద ఇష్టం పెంచుకున్నారు. ‘నా కథ ఎప్పుడు వస్తుందో’ అని రచయితలు ఎదురుచూశారు. తమ కథ వచ్చిన రోజు పాఠకుల ఫోన్లు వెల్లువైపోతుంటే తట్టుకోలేక సంతోషంతో మనసు నిండిపోయి అది కంట నీరుగా ఒలికిపోతుంటే చిరునవ్వుతో స్వీకరించినవారున్నారు.

పోతే ఒకటే తేడా. బావగాడు వండించి వడ్డించిన తీరుకు జనాలంతే సుష్ఠుగా తిని ఆకుల ముందునుంచి లేవడం కూడా కష్టమైపోయింది, ఖదీరు కథలు చెప్పి ప్రచురించిన జోరు జనాల మీద ఎపిటైజర్లా పనిచేసింది. వాళ్ల ఆకలి సగం తీరి, మరి సగం తీరకుండా ఉండిపోయింది. వంద కథల తర్వాత దినపత్రికలో ఆ ఫీచర్‌ మరిక రాదంటే వాళ్లకి పిచ్చకోపమొచ్చింది. అలాగని కథల భోజనం ముందు నుంచి లేవలేరు. ‘‘ఏం తెలుగులో ఉన్నవి ఈ నూరు కథలేనా? ఈ నూరుగురు కథకులేనా? మరో వంద చెప్పలేవూ?’’ అని నిలదీశారు. రచయితలకూ కోపమొచ్చింది. ‘‘ఏం తెలుగులో కథలంటే అవేనా? మరో యాభయ్యో వందో వేస్తే నాదీ ఆ జాబితాలో నిలబడకపోదునా?’’ అని చాటుమాటుగా విసుక్కున్నారు. అమరావతి కథల్లో బావగాడి సంతర్పణకీ, ఖదీరుబాబు సంతర్పణకీ ఇదిగో ఇదొక్కటే తేడా.

దాన్ని ఖదీరుబాబు ఊహించాడు. అనుభవించాడు. అందుకే వినయంగా ‘‘కొండను అద్దంలో చూపిస్తున్నా’’నని చెప్పేశాడు. ‘‘వందేళ్లలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొతాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని అడావిడి రోజుల్లో నూరేళ్ల తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత’’ అని చెప్పుకున్నాడు.ఈ వందమంది కథలను నేను ఎంతో సంతోషంగా రాశాను. ఎంతో పరవశిస్తూ రాశాను. ప్రతి కథలోని సంస్కారాన్ని ఎంతగానో స్వీకరిస్తూ రాశాను. ప్రతి రచయితా వదిలివెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో రీవిజిట్‌ చేశాను. ఇది నాకు పండగ. నిజంగా నేను అనుభవించిన పండగ’’ అని చెప్పిన ఖదీర్‌ మాటల్లో ప్రతి అక్షరమూ సత్యమేననిపిస్తుంది ఈ పుస్తకం చదివాక.

మా ఊరి అమ్మవారి గర్భగుడిలో నూనె దీపాల మసక వెలుతురే తప్ప కరెంటు దీపాలుండవు. అందుకని అమ్మ ముఖం స్పష్టంగా కనిపించడానికి పూజారి కర్పూర హారతినెత్తి అమ్మ విగ్రహం చుట్టూ తిప్పుతాడు. ఆ వెలుగులో జగద్ధాత్రి చిరునవ్వునూ, కరుణాదృష్టినీ, మెరిసే ముక్కెరనూ, కుంకుమబొట్టునూ, మంగళసూత్రాలనూ, తల్లిపాదాలనూ దర్శిస్తాం. మనసు నిండిపోతుంది. ఖదీరుబాబు మా ఊరి పూజారిలాగా అనిపించాడు నాకు. ఆయన ఎత్తిన కర్పూర హారతిలో తెలుగు కథా దేవత స్వరూపమంతా స్థూలంగా కనిపిస్తోంది. ఆమె పాదాల దగ్గర అతను పెట్టిన దేవగన్నేరు పువ్విది.
ఖదీరు నూరేళ్లుండాలి, తెలుగు కథ వెయ్యేళ్లకీ వెలగాలి.

You Might Also Like

27 Comments

  1. K. Chandrahas

    ‘నూరేళ్ళ తెలుగు కథ’ చదువుతున్నాను కాస్త ఆలస్యంగా. నాకైతే ఈ ప్రకియ సరి కాదనిపించింది. ఒకవేళ ఇలా చేయడంలో ఆక్షేపణ అనవసరం అనుకుంటే, retelling అన్నది చాల నిష్ఠగా సాగాలి. ఈ విషయంలో అభిప్రాయభేదాలకి ఆస్కారం లేదనుకుంటాను.
    ‘నూరేళ్ళ తెలుగు కథ’లో ఒక కథ చాసో గారి “బండపాటు”. ఇందులో బండ దొర్లి నెత్తిమీద పడితే రామి చనిపోతాడు. సత్యం అనే మేస్త్రీ రాబందులాగా వచ్చి, అన్నిటికీ తనే అన్నట్లు వ్యవహారం నడిపిస్తాడు. రామి భార్యకు మూడొందలు కంట్రాక్టరు compensationగా అప్పచెప్తాడు. కంట్రాక్టరు నుండి తన కమిషను కింద రెండొందలు పట్టేస్తాడు. అన్నిటినీ ఓ కంట కనిపెట్టే కనకమ్మ ఆడవాళ్ళను చక్కగా manage చేస్తుంది. తనాపని వూరికే చెయ్యదు. “నా కోక కొనవా?” అన్నాది కనకమ్మ. “నీకెందుకో కోక?” అంటాడు సత్యం. అతను వూరికే డబ్బు ఇచ్చే రకం కాదు. “అందరి ఆడాళ్ళ నోర్లూ నొక్కి వెనక సాయం నీకు నానూ సేశాను” అంటుంది కనకమ్మ. అలా కనకమ్మ demand చేస్తుంది; వసూలు చేస్తుంది. దోపిడీకి సమయం సందర్భం అంటూ ఏవీ వుండవు. అందరూ దోపిడీకి సిద్దమే. ఇదీ ప్రపంచం పోకడ అని చాసో చెప్పారు.
    కనకమ్మ విషయాన్ని నూరేళ్ళ తెలుగు కథలో ఇలా రాశారు: “అక్కడా యిక్కడా ఆడవాళ్ళు ఎవరైనా నోరెత్తేవాళ్ళుంటే వాళ్ళని కనకమ్మ అదుపు చేసింది. నోరు మూయండి…రామిగాడి సావు అలా రాసిపెట్టుంటే కాంట్రాక్టరేం చేస్తాడు అని దబాయించింది. ప్రతిఫలంగా మేస్త్రీ సత్యం కొత్త కోకకు డబ్బు ఇస్తే కాదనలేకపోయింది.”
    చాసో గారు చెప్పినదానికి నూరేళ్ళ తెలుగు కథలో రాసిన దానికి పొంతన లేదు. కనకమ్మ వ్యక్తిత్వమే మార్చేశారు retold కథలో. సత్యం కూడా ఎంతో generous అయినట్లు చెప్పారు. Absurd.
    ఇది కరెక్టు కాదు. చాసో గారు వందల కథలు రాసి అందులో కొన్నే publish చేశారు. His standards were high and exacting. అలాంటి రచయిత కథను మళ్ళీ చెప్పేటప్పుడు చాలా discipline అవసరం. ఒకటికి పది సార్లు compare చేసుకోవాలి. అది నూరేళ్ళ తెలుగు కథలో వేసిన “బండపాటు” విషయంలో లోపించిందనే నా అంచనా. కథల్లోని పాత్రల స్వభావాన్ని మార్చే అధికారం ఆ రచయితలకే వుంది. ఇతరులు అలాంటి సాహసం చేయరాదు. ఇక ఇది చాసో గారి కథకు జరిగిందంటే ఏమనాలి?

  2. venkateswarrao

    arunamma thallee nee comment baagubdi avrao, karimnagar

  3. తాడేపల్లి హరికృష్ణ

    నాకున్నదల్లా ఒక్కటే సందేహం. ఇటీవల పాత సినిమా పాటలని రీమిక్సుల పేరుతో వక్రంగానూ, అసహ్యంగానూ తిరిగి పాడీ అభినయించీ తమ సృజనా దారిద్ర్యాన్ని నిలువెత్తునా ప్రదర్శించుకుంటున్నారు కొందరు. ఘంటసాల గారు బతికున్న కాలంలోనే కొందరు ఔత్సాహిక యువకులు “నేను అచ్చు ఘంటసాల లాగా పాడతానండీ” అని ప్రొడ్యూసర్లూ డైరెక్టర్ల వెంట పడితే, “ఘంటసాలలా పాడటానికి నువ్వెందుకయ్యా – ఘంటసాలనే పెట్టుకుంటే సరిపోతుంది గదా” అని బదులిచ్చేవారట. కనక ఖదీరు బాబు గారు పూర్వకథలని రీమిక్సు చేసి నిలబెడుతున్న సాహిత్యవిలువేమిటో కాస్త వివరంగా తెలిపే బాధ్యత సమీక్షకులది.

    నిజంగా అయా కధలు కొత్తతరం వాళ్లకి తెలియజెయ్యల్సిన పెనుభారం నెత్తిన వేసుకోదలచినట్లైతే – ఖదీర్ గారు వాటి కాపీరైట్లు సంపాదించి, మరో కధాసంకలనంగా వేసి, వాటికి తమ సమీక్షలని, మున్నుడులనీ జోడించి ప్రచురిస్తే బాగుండేదేమో. పూర్వం రామాయణాలని పునర్నిర్మాణం చేసే వారంటే వాటికి కొన్ని దేశకాలభాషాభేదాలు ప్రాతిపదికలుగా వుండేవి. గూరజాడ గారి మొదటి కధ నుండీ గడిచిన రమారమి నూరు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ మార్పులే వచ్చాయి. కానీ అవేవీ ప్రస్తుత పాఠకుల అనుభవాలకీ, ఊహా పరిధులకీ, భాషా కౌశల్యాలకీ మించినవేవీ కావు.

  4. naresh nunna

    లక్ష్మీ గారు, వారి వ్యాఖ్యలకి పుస్తకం సంపాదక బృందం తరపున పూర్ణిమ, నూరేళ్ళ తెలుగు కథ మీద రివ్యూ రాయడమే కాకుండా అంతకుముందు ఖదీర్‌కు సహకరించిన ‘పాపాని’కి గాను జంపాల గారు చేసిన పై వ్యాఖ్యల్ని, ప్రతివ్యాఖ్యల్ని చూశాక, ఖదీర్‌ బాబు రచనలకి ఆయన మోటివ్స్‌కి ఉన్న ప్రత్యక్ష సంబంధాల గురించి కూడా కొన్ని ఆరోపణలు చర్చలో దొర్లినందువల్ల, ”నూరేళ్ళ తెలుగు కథ” అనే పునఃకథనాల సంకలనం గురించి కాకుండా, ఖదీర్‌ మోటివ్స్‌ మీద నాకున్న అభిప్రాయాలాంటి ఫిర్యాదుల్ని ఏకరువు పెట్టాలనుకుంటున్నాను:
    Jean Francois Lyotard వంటి పోస్ట్‌ మోడరన్‌ సాహిత్య సిద్ధాంతకారుల ప్రతిపాదనలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, గొప్ప హీరోలు, మహోన్నత లక్ష్యాలు, పెనుసవాళ్లు, జైత్రయాత్రల…మహాకథనాల (Grand Narrative or Metanarrative) అంతం గురించి సావాసదోషం చేత కర్ణాకర్ణిగా విని, ఆ మహాకథనాల్ని తమ స్వానుభవ, స్థానిక, సామాన్య కథనాలతో స్థానభ్రంశం చేసిన నామిని వంటి రచయితలే ఆదర్శంగా కలం పట్టిన తరానికి చెందిన వారిలో ఖదీర్‌ బాబు ముఖ్యుడు. అతని ‘దర్గామిట్ట కథలు’, ‘పోలేరమ్మ బండ కథలు’ వంటివి ఆ small, local narrative కి అందమైన ఉదాహరణలే. లబ్ధప్రతిష్ఠులుగా పేరొందిన వెనకటితరం రచయితలు ఈ కొత్త సహజసుందర కథాకథనాలకి ముగ్ధులైయ్యారు. వాటి వస్తువుకి మూలం జీవితం కాబట్టి, ఆ జీవితంలో కనిపించిన కొత్త రంగులకి సంబరపడ్డారు. కుర్రతరం భుజం తట్టి మెచ్చుకున్నారు. ఆదరణ లభించడం, పాఠకులు బ్రహ్మరథం పట్టడం నాణేనికి మరోవైపు. వాటివల్ల కీర్తి, పాపులారిటీ అనే జాఢ్యాలు తప్ప మరేవీ సోకవు. కానీ వెనకటితరం రచయితలు ముళ్లపూడి వంటి వారు రచనని తలమీద పెట్టుకోవడం వల్ల సదరు రచయితల కళ్లు తలకెక్కాయి. జీవితాన్ని నిసర్గ రమణీయంగా చిత్రించడానికి వారు దానిని అమితంగా ప్రేమించడమే కారణమన్న ఉద్దేశం (అపోహ?)తో ఆ పాతకాలం రచయితలు నామిని, ఖదీర్‌ వంటి రచయితల్ని అభిమానించారు. వారి రచనల్లో లోపాల్ని ignore చేసి మరీ ప్రేమించారు. దాంతో ఈ మలితరం రచయితలు తాము కారణజన్ములమని, వంక పెట్టడానికి లేని మహాకథకులమని నమ్మేసుకుని, తమ గుంతనీళ్లల్లో తమ బింబాల్ని చూసుకుని విర్రవీగారు. ఇక వారు ‘అరిస్తే పద్యం చరిస్తే వాద్యం!’
    ఇక ఖదీర్‌ బాబు విషయానికొస్తే – లక్ష్మీ గారు ఆయన వ్యాసాలు, ఫీచర్సు, సాహిత్యేతర పుస్తక వాణిజ్యాల గురించి ప్రస్తావించారు కాబట్టి,ఆ విషయంలో కూడా నా observation కొంత చెప్పాల్సి వుంది:
    ముచ్చటైన, చదవచక్కని వాక్యాలు రాసే సబ్‌ ఎడిటర్లు, రిపోర్టర్లని చూసి ఎడిటర్లు ముచ్చటపడిపోతారు (వారి శ్రమ తగ్గినందు వల్ల కలిగే ఆనందం కావచ్చు), ప్రోత్సహిస్తారు. అటువంటి ప్రోత్సాహమే ఖదీర్‌ ‘మన్‌చాహే గీత్‌’ అన్న శీర్షికన హిందీ పాటలు, అవి రాసిన, స్వరపరచిన, పాడిన గురించి ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాసేలా చేసింది. అతను పాటల ఊట అయినా కాకున్నా, తేనెటీగ మాదిరిగానైనా రకరకాల సోర్సుల నుంచి సేకరించి సమాచారాన్ని అందంగా, హృద్యంగా present చేశాడు ఖదీర్. వృత్తిపరమైన తప్పనిసరితనాలు లేవందులో. అవి రాస్తే మెచ్చుకోళ్లు వస్తే వస్తాయి గానీ, రాయకపోతే ఉద్యోగం పోతుందనే షరతులుండవు. ప్రలోభాలు లేని రాత కాబట్టి, vested interests లేని రచన కాబట్టి, వాటి కింద కచ్చితంగా పెట్టుకోదగింది తన సంతకమే- ‘మహమ్మద్‌ ఖదీర్‌ బాబు.’ ఈలోపు కాలం ముందుకు కదిలి రచయిత ముదిరి గొప్ప రచయిత ఆపై మహారచయిత అయ్యే పరిస్థితులు దాపురించి వుండొచ్చు. పైన చెప్పుకున్న ‘అరిస్తే వాద్యం చరిస్తే పద్యం’ స్థితికి చేరుకుని ఉండొచ్చు. లేదా నాటి చోటా సబ్‌ ఎడిటర్‌ స్థితి నుంచి మరికొన్ని నిచ్చెనమెట్లు ఎక్కి ‘బాధ్యతాయుత’మైన స్థితికి ఎదిగివుండొచ్చు. ఈ కొత్త అధికార స్థితిలో కొత్తకొత్తగా ఏమైనా రాసి తీరాల్సిందే, కొత్త జనరంజక శీర్షికల గురించి మల్లగుల్లాలు పడాల్సిందే, ఆ కొత్త శీర్షికల విజయానికి అంగలార్చాల్సిందే. అప్పడాలు, ఆధ్యాత్మికం, అల్లికలు, వంటావార్పు….ఏవైతేనేం, ఆ వృత్తి శీర్షికల్ని తన ఇష్టాయిష్టాలకి సంబంధం లేకుండా కొనసాగించాల్సిందే. అటువంటి దశలో రాసినదే ‘బాలీవుడ్‌ క్లాసిక్స్‌.’ ఇవి ఏవో పుస్తకాల నుంచి ఎత్తిపోతలన్న ఆరోపణ (నింద)ని పక్కనబెడదాం. ఈ వ్యాసాలలో చాలా సినిమాలకు చేసిన వ్యాఖ్యానాలు చాలా mediocre, కొన్ని third-rate కూడా. అశేష పాఠకకోటి మనోభావాలను దృష్టిలోనుంచుకొని చేసినందువల్ల కాబోలు, కొన్ని వ్యాఖ్యానాలు చవకబారు నీతిబోధల్లా ఉంటాయి. తమ భావాలకి పొసగని వృత్తిపరమైన అటువంటి తద్దినాలకి సాధారణంగా వేరే మారుపేర్లు పెట్టి అచ్చుకు తోసేస్తారు రచయితలు. కానీ, ఖదీర్‌ ఆ పనిచేయలేదు సరికదా వాటిని ‘బాలీవుడ్‌ క్లాసిక్స్‌ ‘ సంకలనంగా అచ్చొసి వదిలేశాడు. ‘ప్రత్యేక లాభాల్ని’ ఉద్దేశించాడు కాబట్టే తన పేరును ఆ పెట్టుబడిలో భాగం చేశాడు ఖదీర్‌. దానికి కొనసాగింపే ‘నూరేళ్ళ తెలుగు కథ’ పుస్తకం కూడా. లక్ష్మీ గారు అన్నట్టు సాక్షి యాజమాన్యం వాటిని తన పుస్తకాలుగా ప్రచురించడానికి వీల్లేదని అనడమే కాకుండా, ఖదీర్‌ రాస్తున్న ప్రతి అక్షరం ఆయనకి వ్యక్తిగత పాపులారిటీ ఆర్జించేపెట్టే పెట్టుబడిగా మారకుండా మారుపేర్లతో మాత్రమే సాక్షి పత్రికలో ప్రచురించినా పర్యవసానాలు ఎలా ఉండేవో?!
    ఇకపోతే, గ్రంథస్వీకర్తలు, గ్రంథావిష్కర్తలు ఆయా ఆవిష్కరణ సభలో వక్తలు…ఇత్యాదులు కచ్చితంగా రచయిత ఇష్టాయిష్టాలు బట్టే నిర్ణయమవుతారు. అది వ్యక్తిగతమే అయినప్పటికీ ఖదీర్‌ ఎంపిక లక్ష్మీగారి వ్యాఖ్యల్ని బలపరిచేలా ఉందనే చెప్పాలి. ‘మన్‌చాహే గీత్‌’ ఆవిష్కర్త సినీసంగీత దర్శకుడు కీరవాణి; ‘బాలీవుడ్‌ క్లాసిక్స్‌’ కృతిభర్త లగడపాటి శ్రీధర్‌, ఆవిష్కర్త దర్శకరత్న దాసరి, వక్త ప్రియదర్శిని రామ్‌ (అప్పటి సాక్షి యాజమాన్యం) తాజా గ్రంథ స్వీకర్త డా. గురవారెడ్డి, ముందుమాట ప్రవక్త, గ్రంథ ఆవిష్కర్త రామకృష్ణారెడ్డి (సాక్షి యాజమాన్యం). మున్ముందు రీఛార్జ్‌ గ్రంథస్థమైనా ఇదే పరంపర కొనసాగుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు.
    అయితే లక్ష్మీ గారి అభిప్రాయానికి చిన్న కరెక్షన్‌ చేయాల్సిన అవసరం కూడా ఉంది. వైఎస్సార్‌ చనిపోయినప్పుడు ఖదీర్‌ రాసిన వ్యాసాన్ని అభద్రతకి నిలువెత్తు తార్కాణంగా చూశారామె. కానీ, అది నిజం కాదు. అటువంటి భజన వ్యాసం రాయకపోయినంత మాత్రాన ఉద్యోగం పోదు. కానీ, apple of management’s eye కావడానికి, మరింత పదోన్నతికి మాత్రం అది బాగా ఉపయోగపడుతుంది. అలా వృత్తిలోనే కాకుండా, చిత్తశుద్ధికి కొలమానం వంటి ప్రవృత్తి రచనావ్యాసాంగంలో కూడా బాహాటంగానే కెరీరిస్టుగా ఉండవచ్చని, ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అని దానిపట్ల ఎటువంటి సంకోచపడనక్కర్లేదని వర్తమాన తరానికి ఖదీర్‌ ‘ఎదుగుదల’ ఎలుగెత్తుతోంది. గురువు నామినే కాదు, గురువుని మించిన శిష్యుడు ఖదీరూ పుడింగే.

  5. Akondi Sundari

    లక్ష్మి గారితో నేను ఏకీభవించట్లేదు సుమండీ. ప్రతీ రచయితకీ తన అభిరుచి ప్రకారం వ్రాసే హక్కు ఉందంటారా లేదా?ప్రతీ దానికీ వ్యక్తిగత మైన అభిప్రాయాల దగ్గర్నుంచి ప్రాంతీయ ఇస్టాలని రుద్దే వరకు (సంగి శెట్టి శ్రీనివాస్) భూతద్దాలతో వెదుకుతుంటే ఎలాగండీ. వంద కాదు వెయ్యేళ్ళు అని పుస్తకం తెచ్చినా కూడా రచయితలు మిగులుతూనే ఉంటారు.ఇవన్నీ రచయిత కోణంలో కష్టమే కదా.అరుణ పప్పు గారు రచయిత యొక్క శ్రమ ని గుర్తించి మళ్ళీ తనదైన భావుకత్వాన్ని మిళాయించి వ్రాసిన వ్యాఖ్యని కూడా అపార్దపు కోణం లో చూస్తున్నట్లు స్పష్టంగా తెలిసి పోతోంది.చక్కని పదాలు కూర్చి చిక్కని భావాలని తెలియ చేస్తున్నవర్ణనని మీరు భట్రాజు అని వ్రాయడం విమర్శించడం అవుతుందా మరీ? విమర్శ అంటే ఇలా పదాల గేలా?

  6. PSM Rao

    Khadeeru noorellundaali Telugu katha veyyellaku velagaali Pappu Aruna eppatikii undaali!

  7. జంపాల చౌదరి

    మంజరి గారి ప్రశ్న:
    >> పుస్తకం.నెట్ నడుపుతున్నందుకు ఎవరికైనా డబ్బులు కట్టాలా?

    సౌమ్య, పూర్ణిమ చెప్పటం లేదు కానీ, మిగతా ఖర్చుల సంగతి ఎట్లా ఉన్నా పుస్తకం.నెట్ ఇంటర్నెట్ డొమెయిన్ రిజిస్టరు చేసుకోవటానికీ, డొమెయిన్ హోస్టింగ్‌కూ నెలకో, ఏడాదికో ఎంతోకొంత డబ్బులు కడుతూనే ఉండాలి కదా.

  8. manjari lakshmi

    Purnima గారికి, నాకు ఈ నెట్లు గురించి అంతగా తెలీదు. కానీ నాభావం ఏమిటంటే ఈ నెట్లు నడిపే వాళ్ళ పైన ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఈ నెట్లు నడుపుకోవటానికి నెలకింతనీ, సంవత్సరానికింతనీ ఏమన్నా కట్టాలేమో, మా అందరి కోసం (అంటే ఈ నెట్ నడపటం కోసం), మా అందరికీ ఉచితమైన ఎంటర్తైన్మెంట్ ఇవ్వటం కోసం, మీరు కడుతున్నారేమో అనీ, నెట్ నడుపాలంటే అలా ఏమన్నా చెయ్యాలా అనీ నా ప్రశ్న. మీ మాటల్లో డబ్బు విషయం వచ్చేసరికి నాకు కూడా ఈ డబ్బులు గురించి అడగాలనిపించి అడిగాను. అయితే Rs.150/- అనేది పుస్తకం గురించి జోక్ అని ఇప్పుడు మీరు చెపితేనే అర్ధమైంది. అంతకు ముందు అర్ధం కాలేదు. ఎక్కడా మీరు క్షమాపణలు చెప్పుకొనేంతటి మాటలు ఏమీ రాయలేదే? ఎందుకలా చెపుతున్నారో నా కర్ధం కాలేదు. అయినా సరిగా రాయకపోవటం నాదే తప్పు కదా!

  9. Purnima

    మంజరి గారు: మీ వ్యాఖ్య చదవగానే నాకు కొంచెం ఆవేశం పొంగుకొచ్చి బదులిచ్చాను. దాన్ని తొలగించి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 🙂

    లేదండి. మీకా అనుమానం ఎందుకు వచ్చిందో గానీ, నేనన్నది పుస్తకం ఖరీదు నూటాభై గురించి. మీరు కూడా ’నడుపుతున్నందుకు కట్టాలా?’ అన్నారే గానీ, ’సైటు చూడ్డానికి, వ్యాసాలు చదవడానికి డబ్బులు కట్టాలా?’ అని అడగపోయేసరికి నాకు మీ వ్యాఖ్యలో విపరీతార్థాలు తోచాయి.

    సమాధానం మరోసారి: పుస్తకం.నెట్‍లో వచ్చిన వ్యాసాలు చదువుకోడానికి కానీ, వ్యాసాలు రాయడానికి కానీ ఏ డబ్బులూ కట్టక్కరలేదు, ఎవ్వరికీ! అలాంటి మార్పులూ,చేర్పులూ చేసిననాడు దాన్ని అందరికీ అన్నివేళలా తెలిసేలా ప్రకటిస్తాం.

  10. సౌమ్య

    @Manjari: :)) I think 150rs is the cost of this book which is being discussed about!

  11. మంజరి లక్ష్మి

    పుస్తకం.నెట్ నడుపుతున్నందుకు ఎవరికైనా డబ్బులు కట్టాలా? పూర్ణిమగారు రాసిన”నాలాంటి వారి నూటాభై రూపాయలు కాపాడి పుణ్యం కట్టుకోరూ.. ” మాటలు చూస్తే నాకు తెలుసుకోవాలనిపించి అడుగుతున్నాను.

  12. మంజరి లక్ష్మి

    మెహర్ గారి మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను.

  13. leo

    @మెహెర్
    +1

  14. మెహెర్

    ఈ పుస్తకంలో నాకైతే అతి కనిపించింది. అసలు యీ “రీటెల్లింగ్” అన్నదే పనికిరాని పద్ధతి. అది యిందులో పేలవంగా నిర్వహించారు. దీనికి బదులు శుభ్రంగా మూల కథల్నే ఓ చోట పేర్చి, ప్రతీ కథకి ఒక పేరాడు ముందు మాట రాస్తూ, ఒక anthology వేస్తే బాగుండేదనిపించింది. “వంశీకి నచ్చిన కథలు” అనో యాభై కథల పుస్తకం వచ్చింది యిటీవల. అందులో ఈ పద్ధతే అనుసరించారు. ప్రతీ కథ చివరా ఎందుకు నచ్చిందో ఒక పేరాడు క్లుప్త వ్యక్తీకరణ ఇచ్చారు వంశీ. ఎంపిక చేసిన కథల మంచీచెడ్డలు పక్కన పెడితే (వంశీకి నచ్చిన కథలు కొన్ని నాకు నచ్చాయి, కొన్ని నచ్చలేదు), అనుసరించిన పద్ధతి బాగుంది. మూల కథల్ని పాఠకుల దాకా చేర్చాలన్న సుదుద్దేశమే వుంటే అదింకా మంచి పద్ధతి. నా ఉద్దేశంలో ప్రస్తుత పుస్తకం తెలుగు కథల గురించి తెలీనివాళ్లకీ కాదు, తెలిసినవాళ్ళకీ కాదు, యింకొంత తెలుసుకోవాలనుకునే వాళ్లకీ కాదు. ఇలాంటివి చదివి మూల కథలు చదవక్కర్లేదనుకునే బద్దకస్తులకో, వాళ్ళ లివింగ్‌రూమ్ కాఫీ టేబుళ్ళ అలంకారానికో. ఈ కథలు చదివి మూల కథల వైపు వెళ్ళాలనుకునే ఓపికున్న పాఠకులెవరైనా నేటి తరంలో వున్నా, వాళ్ళకవి దొరుకుతాయన్న నమ్మకం ఎలాగూ లేదు.

  15. lakshmi

    పూర్ణిమ గారు,

    నా వ్యాఖ్యలకు సహృదయంతో స్పందించినందుకు, సద్భావనతో ప్రచురించినందుకు ముందుగా కృతజ్ఞతలు.

    ఖదీర్‌బాబు నూరేళ్ల తెలుగు కథ పుస్తకానికి సంబంధించి నేను రాసిన వ్యాఖ్యలకు రచయిత కాని.. ఆయన అస్మదీయ మిత్రులైన ఉమా అనబడే ఉమా మహేశ్వరావు కాని, నరేంద్ర అనబడే మధురాంతకం నరేంద్రకాని, నామినిగా సుప్రసిద్ధుడైన నామిని నాయుడు కాని (కచ్చితంగా వీరనే కాదు.. ఖదీర్‌బాబుకు అనుంగ సహచరులుగా చెప్పుకొనే కొంతమంది..) ఎవరూ స్పందించలేదు. బహుశా వారు బహిరంగంగా వచ్చి స్పందించటానికి ఇష్టపడకపోవచ్చు.

    మీరు అడిగిన విధంగా ఈ పుస్తకం మీద కాని.. చాక్‌ అండ్‌ చీజ్‌ మీద కాని రాసి పంపుతాను. కాని ఆ సమీక్షలు పంపే ముందు- రచయిత లేదా ఆయన వర్గం వారి ఖండన కోసం ఎదురు చూస్తున్నాను. ‘రాపిడి..’ ఈ నాగరికతకు మూలమంటారు. అది లేకపోతే అగ్ని లేదు. అగ్ని లేకపోతే మానవుడి అభివృద్ధి లేదు. అదే విధంగా మేధోపరమైన రాపిడి కూడా విస్తృతమైన అధ్యయనానికి ఉపకరిస్తుందనే నా భావనతో మీరు ఏకీభవిస్తారనుకుంటున్నాను. మంచికో, చెడులో ప్రారంభమయిన ఈ చర్చ ఆ దిశగా సాగాలని కోరుకుంటున్నాను. ఖదీర్‌బాబు పుస్తకంపై ఈ రోజు ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చిన సంగిశెట్టి శ్రీనివాస్‌ విమర్శను మీరు, పాఠకులు ముందుగా చదవాలని కూడా కోరుకుంటున్నాను. (ఆంధ్రజ్యోతి వివిధలో పనిచేసే స్కైబాబాకు, ఖదీర్‌బాబుకు జరుగుతున్న ఎస్‌ఎంఎస్‌ల యుద్ధం, పత్రికల్లో ప్రచురించే కథలు, కవితలలో ముస్లిం కోటా కోసం రెండు వర్గాలుగా చీలిపోయి వారు చేస్తున్న పోరాటం నేపథ్యంలో దీనిని చదవగలిగితే ఇంకా మంచిది..) http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2011/10/10/index.shtml

    ఒక్కొక్కప్పుడు తెలుగు కవిత మాదిరిగానే ఈ ముఠాల వల్ల, వాటిని పోషించే ముఠా మేస్త్రీల వల్ల తెలుగు కథకు ప్రమాదం ఏర్పడుతుందేమోననే భయం వేస్తుంది. ( సినిమా సంగీతం చచ్చిపోతుందేమోనని భయమేస్తుంది.. అనే బ్రహ్మనందం మార్కు కామెడీ (కింగ్‌ సినిమా) కాదు..సీరియస్‌గానే తీసుకోండి..ప్లీజ్‌). ఈ విషయాలన్నింటిపైనా ఒక సమగ్రమైన, క్రియాశీలకమైన చర్చ జరగాలని కోరుకొనేవాళ్లలో నేను ఒకరిని. అయితే మరో సారి చెబుతున్నాను.. ఈ పుస్తకంపై వచ్చిన, వస్తున్న విమర్శలకు రచయిత కాని ఆయన మిత్రులు కాని స్పందిస్తారనే నమ్మకం మాత్రం నాకు లేదు.పాపం.. కొందరికి వినాయకుడి బొడ్లో వేలు పెట్టి.. తేలు కుట్టిన తర్వాత కూడా అరవలేని (దు)స్థితి ఉంటుంది..

    – లక్ష్మి

  16. సౌమ్య

    ఇంతవరకూ మీ చర్చల మధ్యకి రాకూడదనే అనుకున్నా కానీ, ఇవ్వాళ నాకు అనిపించింది చెప్పాలి అనిపించింది చౌదరి గారి వ్యాఖ్య చూశాక.

    తెలుగు విరివిగా చదివిన వారి సంగతి నాకు తెలీదు కానీ, ప్రస్తుతం పదుల్లో, ఇరవైల్లో ఉన్న తరం వారిలో తెలుగు కథకుల గురించి, తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవడానికి అంత సులభమైన మార్గాలేవీ లేవు. ఇలా బ్లాగుల్లోకి వాటిల్లోకి వచ్చిన వారికి కాస్తో కూస్తో విషయాలు తెలుస్తాయి కానీ, తక్కిన వారికి? అలాగే, మాకున్న మిడిమిడి తెలుగుతో గొప్ప కథలు ఒకవేళ చదివే అవకాశం వచ్చినా, అవి అర్థం కావాలి అన్న గ్యారంటీ ఏమీ లేదు. కనుక, ప్రస్తుత పరిస్థితుల్లో చౌదరి గారు అన్నట్లు, ఈ పుస్తకం ఆ వెలితి తీరుస్తుందనే నాకూ అనిపిస్తోంది. ఎవరన్నా ఫలానా కథ ఉంది, అందులో థీం ఇది, ఇలా ఉంటుంది శైలి అంటూ వివరించి చెబితే, అది చదివాక అసలు కథల వైపుకి లాగొచ్చు చదువరులని. చిన్నప్పుడు చదివిన “Abridged Classics” పుస్తకాలు కూడా ఒక విధంగా ఇటువంటివే. ఇంతకీ, ఖదీర్ బాబు గారి కథలు గానీ, ఇతరత్రా ఏవి గానీ నేను చదివింది బహు స్వల్పం. ఇప్పుడీ పుస్తకమన్నా నేను రాబోయే నెలల్లో ఎప్పుడో చదువుతాను అని ఊహిస్తున్నానంతే. కానీ, ఇలాంటి ఒక పుస్తకం రావడం కనీసం నా తరం వాళ్ళకి ఉపయోగకరం అని అనిపిస్తోంది. ఆయన ఏ ఉద్దేశాలతో ఈ పుస్తకం తయారు చేసుకున్నా, ఈ ప్రయత్నానికి మాత్రం అభినందనీయులు.

  17. జంపాల చౌదరి

    ఇక్కడి సంభాషణలో నేను నూరేళ్ళ కథ పై రాసిన పరిచయం గురించీ, నా గురించీ, నూరేళ్ళ కథ పుస్తకం గురించీ, ఖదీర్‌బాబు గురించీ కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి.

    1) నూరేళ్ళ తెలుగు కథ పుస్తకం ఆర్థిక విషయాలతో నాకెట్టి సంబంధమూ లేదు. పుస్తకం ప్రెస్‌కాపీ సిద్ధం అయ్యాక, కథలపైన నాకు ఉన్న ప్రేమ వల్ల, ఇలాంటి పుస్తకం ఇప్పుడు అవసరం అన్న నమ్మకం వల్ల, ఖదీర్‌బాబుపట్ల ఉన్న మిత్రభావం వల్ల, అచ్చుతప్పులపట్ల నాకున్న చిరాకు వల్ల నేను ప్రూఫులు సరి చూసి పెట్టాను. అందుకు బహిరంగంగా పుస్తకంలో కృతజ్ఞతలు చెప్పాడు ఖదీర్‌బాబు. అది అతను చూపిన మర్యాద. నా వృత్తిలో శాస్త్రజ్ఞుడిగా ఏ పత్రాలు రాసినా, పత్రం చివర్లో – రచయిత పక్షపాత దృష్టి చూపించాడేమోనని పాఠకులు తమంత తాము విశ్లేషించుకోటం కోసం – conflict of interest అవకాశం గురించి వెల్లడించటం పద్ధతి. ఆ పద్ధతి నేను పుస్తకంలో వ్యాసాల్లో కూడా పాటిస్తున్నాను. ఆ వెల్లడింపుని బట్టి నేను చెప్పిన విషయాలని బేరీజు వేసుకునే హక్కు లక్ష్మిగారికి ఉంది.

    2) తెలుగు పుస్తకాల ప్రచురణలో నా పాత్ర గురించి లక్ష్మిగారు అన్నది మాత్రం అతిశయోక్తి. అంత సీనేమీ లేదు.

    3) నేను రాసిన పరిచయం అతిశయోక్తిగా ఉందని లక్ష్మిగారు అన్నారని నేను అర్థం చేసుకున్నాను.. నా వ్యాసాన్ని మళ్ళీ చదివి చూసుకున్నాను. నేను మామూలుగా పాటించే తూకపు పద్ధతుల్నే ఈ పరిచయంలోనూ పాటించాననే అనుకుంటున్నాను. లక్ష్మిగారి కొలతలు, నావి వేరై ఉండవచ్చు.

    4. తెలుగు రచయితల గురించి, కథల గురించి, సాహిత్యం గురించి, సాహితీ వ్యక్తుల ఆంతరంగిక విషయాల గురించి లక్ష్మిగారికి బాగా తెలుసు అన్న అభిప్రాయం ఆమె రెండు ఉత్తరాలవల్ల కలిగింది. అంత తెలిసిన వ్యక్తి, ఖదీర్‌బాబు గురించి “కొన్ని కథలు రాసినట్లు కూడా జ్ఞాపకం” అని వ్రాయడంలో సమతూకం కనిపించలేదు.

    5. ఖదీర్‌బాబు కానీ, వేరే ఏ రచయిత కానీ వ్రాసిన పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు, వారు ఉత్తమవ్యక్తులైతే తప్ప వారి పుస్తకాలని మెచ్చుకోకూడదు అని లక్ష్మి గారు అంటున్నారా? రచనలను కొలమానం వేసే పద్ధతి అది కాదు అని నా అభిప్రాయం. వ్యక్తుల కొలతలూ, వారి రచనల కొలతలూ ఒకటి కాదు.

    6. అ. లక్ష్మి గారు రెండో ఉత్తరంలో చర్చించవలసిన విషయాలుగా పేర్కొన్న మొదటి, రెండవ, ఐదవ విషయాలు:
    >> లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలను తీసుకొని వాటిని సంక్షప్తీకరించి తనదైన శైలిలో రాయటం- వారి గొప్పదనాన్ని కొంత్తైనా ఆపాదించుకోవటానికి చేసిన ప్రయత్నమే.
    >> కేవలం పుస్తకం వేయటానికి మాత్రమే ఈ ప్రయత్నం జరిగింది. (దానిలో తప్పేముందని మీరు అనచ్చు.. కాని పుస్తకం వేసుకొవటం కోసం చేసే రచనలకు మిగిలిన వాటికి తేడా ఉంటుంది.
    >> అలాంటి పుస్తకాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో మరో మణి మకుటం అని కీర్తించటంపైనే నా అభ్యంతరం.

    పై అభిప్రాయాలూ, మొదటి ఉత్తరంలో కొన్ని అబిప్రాయాలూ కలిపిచూస్తే నాకు అర్థమయ్యిందేమిటంటే: ఖదీర్‌బాబు డబ్బు, పేరు సంపాదించటం కోసమే ఈ పుస్తకమూ, ఇతర పుస్తకాలూ వ్రాస్తున్నాడు; అందుచేత ఈ పుస్తకాన్ని ఎక్కువగా మెచ్చుకోకూడదు అని లక్ష్మిగారి వాదన అని. వాదనకోసం, ఖదీర్‌బాబు పేరు, డబ్బులకోసమే ఈ నూరు కథాపరిచయాలు వ్రాశాడనుకుందాం. అయినా, ఈ పుస్తకం వల్ల తెలుగు కథాసాహిత్యానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా అన్నది అసలు ప్రశ్న; చేసిన పనిని సమర్థవంతంగా చేశాడా లేదా అన్నది కొసరు ప్రశ్న. ఈ పుస్తకం వల్ల తెలుగు కథాసాహిత్యానికి లాభమే జరిగిందని నా నమ్మకం. ఖదీర్‌బాబు ఈ పనిని సమర్థవంతంగానే చేశాడు అని కూడా నా అభిప్రాయం. ఈ పరిచయాల వల్ల చాలామంది తెలుగుపాఠకులకు ఇంతకు ముందు పరిచయం లేని మంచి కథలు, మంచి రచయితలతో కొత్తగా పరిచయం కలుగుతుంది. ఇందువల్ల ఖదీర్‌బాబుకు పేరో, డబ్బో, రెండూనో వస్తే నాకేమీ అభ్యంతరం లేదు.(అలాగే, పేరూ, డబ్బుల పైన ఏ ఆసక్తీ లేకుండా ఇలాంటి ప్రయత్నాన్నే ఎవరైనా చేసి భంగపడితే, వారిని వ్యక్తిగతంగా గౌరవించినా, వారి ప్రయత్నఫలాన్ని మాత్రం మెచ్చుకోముగదా). చేసిన పని నలుగురూ మెచ్చి కలకాలం నిలిస్తేనే ఎవరికైనా గొప్పతనం వచ్చేది.

    ఆ. మూడవ విషయం:
    >> దీనిలో ఉద్దేశపూర్వకంగా కొందరు రచయితలను తొలగించటం జరిగింది. నిస్పాక్షికత లేదు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ నా ఒరిజనల్‌ పోస్ట్‌లో ఉంది. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే చర్చలో ఇది ఒక భాగమే కాబట్టి సవివరంగా ప్రస్తావించటం లేదు.

    కథల ఎంపికలో ఖదీర్‌బాబు వ్యక్తిగత ఇష్టానిష్టాలు చోటు చేసుకున్నాయని, ఈ నూటిలో ఉండవలసిన కొన్ని కథలు, కొందరు రచయితలను చేర్చలేదని లక్ష్మిగారు అంటున్నారు (తొలగించడం సరైన పదం కాదేమో; ముందు ఒక పట్టిక ఉండి, దాన్లోంచి ఎవరినైనా తీసేస్తే తొలగించటం అంటాం; పట్టికలో అసలు చేర్చకపోతే అది తొలగించడం కాదు కదా). ఈ విషయం గురించి నేను నా పరిచయంలోనూ ప్రస్తావించాను. ఖదీర్‌బాబు వ్యక్తిగత ఇష్టానిష్టాలు నాకు తెలియవు కానీ, వాటి ప్రభావం ఇటువంటి ఎంపికలో ఉండదని నేను అనుకోను. ఎవరు ఏమి ఎంపిక చేసినా, వారి వ్యక్తిగత అభిరుచులు, వ్యక్తిత్వాలు ఆ ఎంపికను నిస్సందేహంగా ప్రభావితం చేస్తాయి. ఈ నూరు కథల, కథకుల ఎంపికతో నాకూ ఏకీభావం లేదు. ఇటువంటి ఎంపిక నేను చేసినా, లక్ష్మిగారు చేసినా ఇంకొందరికి ఏకీభావం ఉండకపోవచ్చు (అసందిగ్ధత ఉండే అవకాశాన్ని ఒప్పుకుంటున్నాను కాని, ఉండదు అనే నా దృఢ నమ్మకం). ఈ విషయంలో నా కొలత ఏమిటంటే నాకు నచ్చిన ఎంపికల, నచ్చని ఎంపికల దామాషా ఏమిటి అని. నాకు సంబంధించినంతవరకూ ఈ పుస్తకంలో నచ్చనివాటి సంఖ్య నచ్చినవాటితో పోలిస్తే అతి స్వల్పం. ఈ పుస్తకంలో లేని ప్రసిద్ధ కథకులు చాలామందే ఉన్నారు – సమకాలికులూ, పూర్వీకులూ కూడా. సంఖ్య నూటికి పరిమితమయ్యింది కాబట్టి ఏ కథ ఐనా ఈ నూటిలో ఉండాలంటే ఇంకో కథ తీసెయ్యాలి. ఉండాల్సిన ఫలానా కథ లేదు అనే వారు ఆ స్థానంలో తీసేయవలసిన కథ గురించి కూడా ప్రస్తావించాలి. లేకపోతే అది లిస్టులో నూట ఒకటో కథే అవుతుంది. నిజానికి ఎవరైనా అలా చెప్పినా, అది చెప్పినవారి 100 కథల లిస్టు అవుతుంది కానీ, ఖదీర్‌బాబు లిస్టు అవదు.

    లక్ష్మిగారికి గుర్తు ఉండే ఉంటుంది – మిలినియం ఆరంభదినాల్లో ఆంధ్రజ్యోతి వారు తెలుగులో గొప్ప కథల లిస్టు ఒకటి ప్రచురించారు; అలాగే కొన్నాళ్ళ క్రితం సాక్షివారు ఇంకో లిస్టు వేశారు. విశాలాంధ్ర వారు ఒక గొప్ప కథల పుస్తకం, కళాసాగర్ వారు ఒక పుస్తకం, జయంతి పాపారావుగారు ఒక పుస్తకం, ఇలా చాలా వచ్చాయి. వీటన్నిటిమధ్యా ఏకీభావం లేదు. ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉండటం మంచిదే. ఒకరు ఉపేక్షించిన లేక విస్మరించిన కథను ఇంకొకరు గుర్తు చేస్తారు. నూరేళ్ళ తెలుగు కథలో ఖదీర్‌బాబు ఎంపిక చేసింది ఒక్కటే ఆఖరు తీర్పేమీ కాదు. లక్ష్మిగారో, నేనో, ఇంకెవరో ఓపిక ఉంటే ఇలాంటిదే ఇంకో పుస్తకం తీసుకురావచ్చు.

    ఇ. నాల్గవ విషయం:
    – అసలు రచయితల శిల్పాన్ని వక్రీకరించటంపై కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అసలు రచనలు దొరుకుతున్న సమయంలో ఈ రిమిక్స్‌ల అవసరం ఉందనుకోను.

    అవసరం విషయంలో నేను లక్ష్మిగారితో విబేధిస్తున్నాను. ఒకటి – నాకు తెలిసినంతవరకూ ఈ రచయితలందరి రచనలూ, ఈ కథలూ అంత సులువుగా ఏమీ దొరకటం లేదు; దొరికిన కొందరు లబ్ధప్రతిష్టుల పుస్తకాలు ఎక్కువగా పాతపాఠకులే కొనుక్కుంటున్నారు; రెండు – ఇలాంటి సంక్షిప్త పరిచయాలు కొత్త పాఠకులని మూల కథలవైపు ఆకర్షితుల్ని చేస్తాయి అన్నది నా వ్యక్తిగత అనుభవం.

    ఖదీర్‌బాబు చేసింది మూల కథని సంక్షిప్తీకరణం చేయటం కాదు; ఆ కథని ఒక పరిమితిలో ఆసక్తికరంగా మళ్ళీ చెప్పటం. దానిపై లక్ష్మిగారికి ఉన్న అభ్యంతరం నాకు లేదు.

    ఈ. >> అలాంటి పుస్తకాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో మరో మణి మకుటం అని కీర్తించటంపైనే నా అభ్యంతరం.

    ఈ పుస్తకం తెలుగు సాహిత్య చరిత్రలో మరో మణి మకుటం అని నేనూ అనుకోవటం లేదు.. కానీ, ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న ఒక జాగాను ఈ పుస్తకం నింపుతుందని, ఇప్పుడు తీరని ఒక ముఖ్యమైన అవసరాన్ని ఈ పుస్తకం తీరుస్తుందని నా అభిప్రాయం. రేపు ఈ జాగానుంచి ఈ పుస్తకాన్ని తప్పించి, ఈ అవసరాన్ని ఇంకా సమర్థవంతంగా, సంపూర్ణంగా తీర్చే ఇంకో పుస్తకం వస్తే మంచిదే (ఆ పుస్తకాన్ని డబ్బుకోసం వ్రాసినా, పేరు కోసం వ్రాసినా). ఈరోజున ఇది ముఖ్యమైన, అవసరమైన పుస్తకం. ఈ పుస్తకం వల్ల తెలుగు కథకు, తెలుగు సాహిత్యానికి మంచి జరుగుతుంది. ఆ పని చేసినందుకు ఖదీర్‌బాబు నా దృష్టిలో అభినందనీయుడు.

    7. ఏ.సీ. గదుల్లో కూర్చుని మండే ఎండల గురించి వ్రాయటం గురించిన పోలిక ఈ కథా పరిచయాలకి వర్తిస్తుందని నాకు అనిపించటం లేదు.

    8. స్టార్లకు, యాంఖర్లకు ఉన్న తేడా గురించి లక్ష్మిగారు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను. యాంఖర్లలో కొంతమంది కాలక్రమాన స్టార్లు అవుతారని లక్ష్మిగారికి తెలీదు అని నేను అనుకోను. ముద్దుకృష్ణ వైతాళికులు వల్లే చాలామందికి గుర్తున్న మాట వాస్తవం కదా! ఖదీర్‌బాబు కూడా అలా ఐపోతాడేమోనని భయంగా, లేదా అనుమానంగా ఉందా?

  18. Purnima

    ఆహా లక్ష్మిగారు, మొదటిసారిగా ఒక ’చర్చ’కు ఆస్కారం కనిపిస్తోందిగా. థాంక్యూ!

    లేదండి. మీ వ్యాఖ్యను నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. తీసుకొని ఉంటే నా నేపధ్యం వివరించకుండానే మీతో వాదులాటకు దిగేదాన్ని. నా గురించి మీకు చెప్తే నా వైపు నుండి కూడా మీరు ఆలోచించి చెప్పగలరేమోనని విన్నవించుకున్నాను. అరుణగారి పట్ల, జంపాలగారి పట్ల నాకు గౌరవాభిమానాలు ఉన్నా వారిని వెనుకేసుకొని రావడానికి వ్యాఖ్య రాయలేదు. ఎవరు, ఎక్కడ, ఎవర్ని ఇలా అన్నా, నేను నా అనుమానాలు అడిగేదాన్ని.

    ’అమాయకత్వం’ అన్న పదం వాడారు. దానికి బదులు ’అజ్ఞానం’ అన్న పదం వాడున్నా సరిపోయేది. ఎంతకాదనుకున్నా, ignorance is bliss కదా!

    ముందే చెప్పినట్టు రచయితలూ, రచనలూ, వాటికి ప్రేరణలూ, సిద్ధాంతాలు – ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు కొత్త. పైగా నేను రోజూ ఆయా రచయితలతో నేను పనిజేయను, చాయ్-బిస్కట్స్ తినను, వాళ్ళ ఆలోచనాసరళి, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సాధకబాధకాలు నాకు తెలీదు. అజ్ఞానం! 🙂

    మీ వ్యాఖ్యను బట్టి మీకు ఇవ్వన్నీ బాగా తెల్సుననీ, వాటితో పరిచయం ఉందనీ అర్థమయ్యింది.

    నేనీ పుస్తకం కొనలేదు. చదవలేదు. అందుకని పుస్తకంపై మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. విభేధించలేను.

    ఇహ పోతే, పుస్తకం.నెట్ సంగతి:

    పత్రికల్లో గట్రా పుస్తకాల పరిచయాలూ, సమీక్షలూ వస్తూనే ఉన్నాయి. ఉంటాయి. అవుండగా మేం ఒక సైటు మొదలెట్టడానికి కారణం పాఠకులకు వేదిక కల్పించడమే! ఎంతసేపూ రాసే మీ అందరూనే రాసే తక్కిన వారి గురించి మాట్లాడితే ఎలా? 🙂

    రచయితలూ-ప్రచురణకర్తలూ-సమీక్షకులూ-పాఠకులూ పుస్తకప్రపంచానికి నాలుగు స్తంభాలని చదివిన గుర్తు. (ఖచ్చితంగా గుర్తు లేదు.) పాఠకులూ ముఖ్యమేగా!

    ఒక రచయిత పూర్వరంగం తెలీకుండా, రచన వెనుకున్న ఉద్దేశ్యాలతో పనిలేకుండా, అలా కొట్లోకి వెళ్ళి ఎవో కొన్ని పేజీలు తిరగేసి పుస్తకం కొనుక్కొని, ఇంటికొచ్చి చదువుకునే పాఠకుల వేదిక ఇది. వాళ్ళకి పుస్తకం గురించి ఏదనిపిస్తే అది రాస్తారు. అందులో తేలికతనం ఏమీ లేదు. అవి వారి ఆలోచనలు. వారి అభిప్రాయాలు.

    ఇక్కడ మీరు మీ అభిప్రాయాలూ, అభ్యంతరాలూ పంచుకున్నట్టు వారున్నూ. అలా పంచుకునేవారి కోసమే ఈ వేదిక. అందుకే ఒకటే పుస్తకంపై పలు వ్యాసాలు వస్తాయి. మీరు కూడా ఇదే పుస్తకం గురించి రాయండి, ఇక్కడే, సవివరంగా!

    మీకు ఓపికా, తీరికా ఉంటే మంచి సాహిత్య విమర్శ, సాహిత్య సమీక్ష, పుస్తక పరిచయం లక్షణాలు ఏమిటి? వాటినెలా రాస్తారు? తెలుగులో వచ్చిన సాహిత్య విమర్శ పుస్తకాలు లాంటి వాటిని కూడా వ్యాసాలు రాస్తే మా అజ్ఞానానికి కాస్త తగ్గించినవారవుతారు. (ఆయనిప్పుడు ఎక్కడున్నా, స్టీవ్ జాబ్స్ వోంట్ మైండ్.. 🙂 )

    ఇహ, మీరు లేవనెత్తిన అభ్యంతరాలపై పుస్తకం చదివినవారో, లేదా వాటిని గురించి అవగాహన ఉన్నవారో చర్చిస్తారని ఆశిస్తున్నాను.

    ఇంతకీ నేనా ఆర్చర్ కథ ’చాక్ ఆండ్ చీజ్’ చదవలేదు.. అసలు దాన్ని ఆధారంగా చేసుకొని మీరెందుకు ఓ వ్యాసం రాయకూడదు. మీది విభిన్నమైన POVలా ఉంది. కొద్దో గొప్పో ఎవరో ఒకరికి ఉపయోగపడకపోదు.

    ఎదురుచూస్తుంటాను.

    పూర్ణిమ

  19. lakshmi

    పూర్ణిమగారికి,

    మీ సమాధానానికి కృతజ్ఞతలు. మీరు నా వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకొని స్పందించినట్లు భావిస్తున్నాను. పుస్తకం డాట్‌ నెట్‌ ఉద్దేశాలను కాని రివ్యూ ప్రచురించటం వెనక ఉన్న లక్ష్యాలను కాని నేను ప్రశ్నించలేదు. ఇదే విధంగా అరుణగారిపైన కాని జంపాలవారిపైన కాని నాకు వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు. కేవలం రచయితల రాసిన రివ్యూలపై నాకు అభ్యంతరాలను తెలియజేశాను. కాని మీరు ఓనర్‌షిప్‌ తీసుకొని సమాధానం ఇచ్చారు. దానికి మరో సారి కృతజ్ఞతలు.

    మొదటగా మీకు పుస్తకాల రివ్యూల పట్ల, రచయితల పట్ల ఉన్న అభిప్రాయాలతో ఏకీభవించలేను. కాని మీరు అడిగిన ప్రశ్నలకు, చేసిన వ్యాఖ్యలకు మాత్రం సమాధానం ఇవ్వదలుచుకున్నాను.

    – ” తాము చదివిన పుస్తకం గురించి తమకు కలిగిన భావావేశాలను గానీ, అభిప్రాయాలు, ఆలోచనలూ కానీ, లేక విశ్లేషణలు, విమర్శలు పంపవచ్చు. అవి భజనలవచ్చు. వెటకారాలు అవ్వచ్చు. కారాలు మిరియాలు అవ్వచ్చు. అవి సమీక్షలే కావనవసరం లేదు. అవి సమగ్ర విశ్లేషణలే అవ్వకపోవచ్చు. అవి రాస్తున్నప్పుడు రచయితల వ్యక్తిత్వాలకు బేరీజు వేసి రచనలను తూకానికి పెట్టాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదివేవాళ్లు స్పందించగల మనుషులైతే చాలు. పరిణితుల్లో వాళ్లకి ఇక్కడెవ్వరూ డాక్టరేట్లు ఇవ్వబోరు..”

    నాకు తెలిసినంత వరకూ రచనలో ప్రతిబింబించే అంశాలు రచయిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఏసీ రూముల్లో కూర్చుని భావావేశంతో ఊగిపోయే కవులు మండుటెండలో పనిచేసే వ్యక్తిలో కలిగే అలజడిల గురించి రాయటం కేవలం మోసం చేయటం అవుతుందని నేను భావిస్తాను. ఏ రచనైనా అనుభూతి ప్రధానమని . దాని వెనక ఉన్న లక్ష్యాలు కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయని నేను గాఢంగా నమ్ముతాను. ఒక రచయిత తాను నమ్మిన సిద్ధాంతానికో.. మనసులో కలిగిన భావావేశానికో.. ఇతరుల చూపించిన ప్రేరణకో స్పందించి ఒక రచన చేస్తాడనేది నా అనుభవం. అలా అవసరం లేదు.. ఏసీ రూములో కూర్చుని ఎండ ఎంత ఉందో చెప్పలేమా? అనుభవించటం అవసరమా? వాస్తవానికి ఏసీ రూమ్‌లో కూర్చుంటే బాగా రాయచ్చు కదా.. అంటే నా దగ్గర సమాధానం లేదు. ఒక వ్యక్తి పుస్తకాన్ని సమీక్షించే సమయంలో వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలనేది నా ఉద్దేశం. గాలిజనార్థన రెడ్డి అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అది వాళ్లిష్టం అంటారా..నేను అదనంగా చెప్పేది ఏమి లేదు. బెజవాడ కమ్యూనిస్టుల గురించి మీరు వినే ఉంటారు.

    – ఒక పాఠకుడు మీ సైట్‌కు వచ్చేది అందులో ఉండే కంటెంట్‌ గురించి. తాను చదవని పుస్తకాల గురించి కొత్త విషయాలను తెలుసుకోవటానికి. మీరు అన్నట్లు పుస్తకాలను ఇష్టంగా చదువుకొనే వారు మాత్రమే దీనిలోకి వస్తారు. దానిలో కూడా ఒక స్టాండర్డ్‌ ఉండాలని ఆశిస్తారు. అలా ఆశించవద్దనేది మీ ‘తమకు కలిగిన భావావేశాలను…… పరిణితుల్లో వాళ్లకి ఇక్కడెవ్వరూ డాక్టరేట్లు ఇవ్వబోరు…” సమాధానం ద్వారా నాకు అర్థమయింది. తేలికతనం అనేది ఎక్కడ మంచిది కాదు. ముఖ్యంగా సాహిత్యంలో తేలికతనం, తెంపరితనం అంతగా రాణించవనేది నా అభిప్రాయం. దీనితో మీరు ఏకీభవించకపోవచ్చు. ..

    – “..సరదాకి ఈ సైట్‌ మొదలుపెట్టాం. ఒక పుస్తకంతో నాకు కలిగిన అనుభవాలను ఇక్కడ పంచుకుంటుంటాను. అంతకు మిక్కిలి నాకు తెలుగు సాహిత్యలోకంతో ఏ సంబంధము లేదు….” అనే మీ వ్యాఖ్యల ద్వారా- సాహితీలోకంతో పెద్దగా పరిచయం లేకుండా మీరు ఈ సైట్‌ మొదలుపెట్టారని స్పష్టం చేశారు. మీకు సాహిత్యలోకం గురించి తెలియనప్పుడు రచయితల వ్యక్తిత్వాల గురించి, వారి అసలు లక్ష్యాల గురించి వీలైనంత తక్కువ చెబితే మంచిది. కొన్ని సార్లు అమాయకత్వం కూడా ఒక వరం. స్టీవ్‌ జాబ్స్‌ చెప్పినట్లు అది మీకు జీవితాంతం ఉండాలని ఆశిస్తున్నాను.

    – ఇక తెలుగు సాహితీ ప్రపంచంలో వివిధ పుస్తకాలను అచ్చువేయటం ద్వారా లబ్ద ప్రతిష్టులైన జంపాల చౌదరి గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు మీకు మనస్తాపం కలిగిస్తే క్షమాపణలు. బహుశా జంపాల చౌదరి గారు పుస్తకాలు అచ్చువేయటానికి అనేక మందికి ఆర్థిక సాయం చేస్తారని, దానికి అనేక మంది రచయితలు, రచయిత్రులు కృతజ్ఞతులై ఉంటారని బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మళ్లీ స్టీవ్‌ జాబ్స్‌ను గుర్తు చేస్తున్నాను. కాని ఈ పుస్తకాన్ని డాక్టర్‌ గురువారెడ్డిగారి ఆర్థిక సాయంతో ప్రచురించారు. పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు.. ఎలా ప్రచురించారు అనే విషయంపై నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. జంపాల వారిపై చేసిన వ్యాఖ్యలు ఎటువంటి చెడు ఉద్దేశాలను అంటకట్టడానికి కాదని మీకు మరో సారి మనవి చేస్తున్నాను.

    – ఇక మీరు సూచించనట్లు- “ఓ ఫలానా గారండి.. నాకు ఇక్కడిక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. మనం చర్చించుకుద్దాం..’ అంటూ నాకున్న అభ్యంతరాలు చెబుతున్నాను.

    – లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలను తీసుకొని వాటిని సంక్షప్తీకరించి తనదైన శైలిలో రాయటం- వారి గొప్పదనాన్ని కొంత్తైనా ఆపాదించుకోవటానికి చేసిన ప్రయత్నమే.
    – కేవలం పుస్తకం వేయటానికి మాత్రమే ఈ ప్రయత్నం జరిగింది. (దానిలో తప్పేముందని మీరు అనచ్చు.. కాని పుస్తకం వేసుకొవటం కోసం చేసే రచనలకు మిగిలిన వాటికి తేడా ఉంటుంది. దీనితో మీరు ఏకీభవించలేకపోవచ్చు. దానిని నేను అపరిణితి కింద పరిగణించను. కేవలం అమాయకత్వమే. స్టీవ్‌జాబ్స్‌ను గుర్తు చేసుకోండి..)
    – దీనిలో ఉద్దేశపూర్వకంగా కొందరు రచయితలను తొలగించటం జరిగింది. నిస్పాక్షికత లేదు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ నా ఒరిజనల్‌ పోస్ట్‌లో ఉంది. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే చర్చలో ఇది ఒక భాగమే కాబట్టి సవివరంగా ప్రస్తావించటం లేదు.
    – అసలు రచయితల శిల్పాన్ని వక్రీకరించటంపై కూడా అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అసలు రచనలు దొరుకుతున్న సమయంలో ఈ రిమిక్స్‌ల అవసరం ఉందనుకోను.
    – అలాంటి పుస్తకాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో మరో మణి మకుటం అని కీర్తించటంపైనే నా అభ్యంతరం.
    ప్రతి వ్యక్తి తనను నచ్చినవారిని కీర్తించటానికి.. తెలుగు సాహితీ చరిత్రలో తిరుగులేని వీరులుగా నిలబెట్టడానికి మీ సైట్‌ తోడ్పడతుతోందనే విషయంపై నాకు కొంత విచారం ఉంది. బహుశా మీకు ఆ విచారం కూడా ఉండి ఉండకపోవచ్చు. ముందు చెప్పినట్లు- అమాయకత్వం ఒక వరం. అది మీకు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను.

    ఈ వ్యాఖ్యలను మీరు ప్రచురిస్తారా? లేదా అనే విషయాన్ని నేను నిర్ధారించుకోలేకపోతున్నాను. ఈ చర్చను మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను.

    – లక్ష్మి

  20. Purnima

    లక్ష్మి గారు:

    సుధీర్ఘమైన వ్యాఖ్యనంతో మీ అభిప్రాయాలను నిస్సంకోచంగా పంచుకున్నందుకు ముందుగా థాంక్స్.

    నా అభిప్రాయాలు చెప్పేముందు నా గురించి కొంత:

    నేనో సాప్ట్-వేర్ ఇంజినీర్‍ను. సరదాకి పుస్తకాలు చదువుతుంటాను. అంతకన్నా సరదాకి ఈ సైటు మొదలెట్టాం. ఒక పుస్తకంతో నాకు కలిగిన అనుభవాలను ఇక్కడ పంచుకుంటుంటాను, అప్పుడప్పుడూ. అంతకు మిక్కిలి నాకు తెలుగు సాహిత్యలోకంతో ఏ సంబంధమూ లేదు. అదృష్టం కలిసొచ్చి ఒకిద్దరి రచయితలను కలవడం తటస్థించాక వారు రచయితలన్న సంగతి, వారి పుస్తకాల సంగతి మర్చిపోయి వారితో ఆత్మీయానుబంధం ఏర్పడిందనుకోండి. కానీ, దాని వల్ల వాళ్ళకు గానీ, నాకు గానీ డబ్బు రిత్యా ఏం కల్సిరాలేదు. 😛 నాకు తెల్సినవారిలో ఖదీర్ బాబు లేనేలేరు. 🙂

    ఇంత ఎందుకు చెప్పానంటే, పై మీ వ్యాఖ్యలో చాలా విషయాలు అర్థం కాలేదు. కాకపోతే మీ బాక్‍గ్రౌండ్ నాదానికన్నా భిన్నమైందని అర్థం అయ్యింది. అందుకని ఈ కింది ప్రశ్నలు కొన్ని తెలియనితనంతోనూ, కొన్ని తెల్సుకోవాలన్న ఆరాటంతోనూ అడుగుతున్నాను.

    >> ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు, ఆలోచన ధోరణిని తెలుసుకోవటానికి రచనలు, ప్రయత్నాలు ఉపకరిస్తాయి.

    కాదనను గానీ, అవునూ అనను. ఒక వ్యక్తి రాసివాటిని బట్టి వ్యక్తిత్వాన్ని తూకవేయటం ఒక పుస్తకం చదివి రివ్యూ రాయడమంత తేలిక కాదు. మీకు ఈ రచయిత బాగా పరిచయస్థులై, మీరు వారిని చాన్నాళ్ళు నిశితంగా గమినించుంటే తప్ప ఆయన గురించి మీ వ్యాఖ్యలు నేను ఒప్పుకోలేను. ఎంత కాదనుకున్నా, ఎన్ని వేల పేజీలు రాసినా, రచనా వ్యాసంగం రచయిత జీవితంలో ఒక భాగం మాత్రమే. ’ఉపకరిస్తాయి’ అన్న పదం వాడారు కాబట్టి, మీరు ’నిర్దారణ’కు వచ్చి ఉండరనే ఆశిస్తున్నాను.

    >> ముఖ్యంగా జంపాల చౌదరిగారి, పప్పు అరుణ గారి రివ్యూలు చదివిన తర్వాత తెలుగు భాషకు అతిశయోక్తాలంకారాలు పెద్ద దౌర్భాగ్యమనిపిస్తోంది.

    ఇప్పుడెలాగంటారు మరి? 🙂

    >> జంపాల చౌదరిగారికి ఖదీర్‌బాబుగారు పుస్తకంలోనే కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి- ఆయన రివ్యూ వెనకున్న ‘అర్థాన్ని’ అర్ధం చేసుకోవచ్చు.

    ఈ ఒక్క స్టేట్మెంటుతో నేను మీ గురించో నిర్దారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. రమ్మంటారా? 😛

    ఇదో.. ఇప్పుడు మీరు మళ్ళీ, “ఆ.. ఆయన మీ సైటుకు రాసిపంపిస్తుంటారు కదా! అందుకే మీరు వెనకేసుకొస్తారు లే!” అనుకోడదు మరి, కనీసం నేను విషయం చెప్పేవరకైనా ఆగాలి.

    జంపాలగారిని ముళ్ళపూడిగారు ’కోతి కొమ్మచ్చి’లో ’హీరో’ అన్నారండి. అందుకని ఆయన కోతికొమ్మచ్చి రివ్యూలు ఎడాపెడా రాసి ’అర్థాన్ని’ అర్థం చేసుకునే వీలును కల్పించలేదు కదండీ! ఆయన ఇక్కడ చాలా పుస్తకాలు పరిచయం చేసారు. తెలిసో, తెలియకో పాపం వారు తెలుగు సాహిత్యలోకంలో పుస్తకాల ముందుమాటల్లో నిలిచిపోయేంతగా పనులు చేసేస్తున్నారేమో.. కానీ ఆయన ఇంగ్లీషు పుస్తకాల గురించి చెప్పారండి. వాళ్ళెవ్వరూ వచ్చి ’అర్థాలు’ వెతకలేదండి. తెలుగులో కూడా ఆయన పేరు ప్రస్తావించబడని చాలా పుస్తకాలను గూర్చి చెప్పారండి. అప్పుడూ ఎవరూ ’అర్థాలు’ వెతకలేదు.

    నేనే ఓ పుస్తకం రాసి మీకే అంకితం ఇచ్చాననుకోండి. తర్వాత ఎప్పుడో ఎవరో ’మీకా పుస్తకం నచ్చిందా?’ అని అడిగితే, నచ్చినా నచ్చలేదని చెప్తారా? కేవలం మీ పేరుందని దాన్ని ఆస్వాదించటం మరుస్తారా? ఎందుకింతటి భయంకరమైన assumptionsకి వచ్చేయటం, అదీ పదిమందిలో.

    మీకు అరుణగారూ, జంపాలగారూ రాసింది నచ్చలేదు. అందుకు తగ్గ కారణాలు మీకున్నాయి. అప్పుడు మీరు “ఓ ఫలానా గారండి.. మీర్రాసిన దాంతో నాకు ఇక్కడిక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. మనం చర్చించుకుందాం” అంటే ఎలా ఉంటుంది? మీర్రాసినట్టు రాస్తే ఎలాగుంటుందో తెల్సిపోయిందిగా.

    పరిణితి లేదు, పేరు కనిపించగానే ఉబ్బిపోయి.. లాంటి వ్యాఖ్యలు మీరెలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు మీ వ్యాఖ్యలో నాకు పరిణితి కనిపించటం లేదు. అదియున్నూ నా అపరణితి అవుతుందా? 🙂

    అయినా ఇలా కాదు కానీ, రచయిత వ్యక్తిగత విషయాల్లోకి పోకుండా, ఆయనపై సైకో అనాలిసిస్‍లు చేయకుండా ప్రస్తుత పుస్తకం ఎందుకు బాగోలేదని మీరు విపులంగా రాసి పంపగలిగితే అచ్చు వేసుకోడానికి ఈ సైటు సిద్ధం.

    చివరిగా నాదీ ఒక మనవి. ఇప్పటికే అరగిపోయిన టేప్‍రికార్డర్‍లాగా నేను ఇది చెప్పి చెప్పి ఉన్నాను. కానీ మరొక్కసారి..

    పుస్తకం.నెట్ అనేది పుస్తకాలను ఇష్టంగా చదువుకొనే వాళ్ళు తాము చదివిన పుస్తకం గురించి తమకు కలిగిన ’భావావేశాలను’గానీ, అభిప్రాయాలూ, ఆలోచనలూ కానీ, లేక విశ్లేషణలు, విమర్శలూ పంపవచ్చు. అవి భజనలవ్వచ్చు, వెటకారాలు అవ్వచ్చు, కారాలు మిరియాలు అవ్వచ్చు. అవి సమీక్షలే కానవసరం లేదు. అవి సమగ్ర విశ్లేషణలే అవ్వకపోవచ్చు. అవి రాస్తున్నప్పుడు రచయితల వ్యక్తిత్వాలను బేరీజు వేసి రచనను తూకానికి పెట్టనవసరం లేదు. పుస్తకాలు చదివేవాళ్ళు స్పందించగల మనుషులైతే చాలు, పరిణితుల్లో వాళ్లకి ఇక్కడెవ్వరూ డాక్టరేట్లు ఇవ్వబోరు.

    ఈ కిందది మాత్రం నేనెప్పుడూ చెప్పలేదండి. మీకోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను. మళ్ళీ నా వ్యాఖ్యలో ’అర్ధం’ వెతుకుతారేమోనని.

    పుస్తకం.నెట్ ఒక నాన్-ప్రాఫిట్ వెబ్‍సైటు. ఇక్కడ వ్యాసాలు రాసేవారికి డబ్బులివ్వరు. వేసుకునేవారికి డబ్బులివ్వరు.

    వ్యాఖ్యలు రాసేవారికి సమస్యే లేదనుకోండి. అరుణగారో, జంపాలగారో ఇది చదివి, “ఎందుకు ఆవేశం పడ్డం” అని మెత్తగా మందలిస్తారేగానీ ఒక్క పైసా కానీ, సెంట్ కానీ ఇవ్వరండి..ప్చ్.. 🙂

    అన్నట్టు, మొదట ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు మీ వ్యాఖ్య నాకు అర్థం కాలేదు, ఈ పుస్తకం ఎందుకు అంత బాలేదో.. మాబోటి వారికి కూడా అర్థమయ్యేలా చెప్పే ఓపికుంటే, వినిపెడతాం మాలో కొందరం. రచయిత సంపాదన మనక్కెందుగ్గానీ (ఐటి కి సాయపడితే వాళ్ళేం కమీషన్లు ఇవ్వరనుకుంట), నాలాంటి వారి నూటాభై రూపాయలు కాపాడి పుణ్యం కట్టుకోరూ..

    లేదూ.. మీకు నేనుగానీ, నా వ్యాఖ్యగానీ నచ్చలేదు అననుకుంటే ఇక్కడితో వదిలేయండి. మీరో కొండెక్కి, నేనింకో కొండమీదుండి, ఒకరికి ఒకరం అర్చుకోవటం అంటే నాకు మా చెడ్డ చిరాకు.

    Please don’t revert if you can’t see a point here.

    నమస్తే!

    పూర్ణిమ

  21. Ravindra

    Mahesh garu,

    Oka manchi pusthakanni parichayam chesaru. manchi prayathanam, kani lakshmi garu cheppinattu khadeer saakshidwara pusthakalu prachurinchbadatam koraku mathrame wrasaru antam bagaledu. Kadheergari modati sankalanam POLERAMMA BANDA chadivithe baguntundi. A pusthakam loni kathalu chadivi a pathrallo thamani gurthichinchukuntaru.Schoollo chadive rujulani gurthukuthestai. Veelaiathe danni kuda parichayam cheyyandi.

  22. lakshmi

    చాక్‌ అండ్‌ చీజ్‌!

    జెఫ్రీ ఆర్చర్‌- ‘చాక్‌ అండ్‌ చీజ్‌’ అనే ఒక కథ రాశాడు. చీజ్‌కు, సుద్దముక్కకు ఉండే తేడాను చెప్పే కథ అది. నూరేళ్ల తెలుగు కథపై వచ్చిన రివ్యూలు చూసిన తర్వాత ఆ కథ గుర్తుకు వచ్చింది.

    మహ్మద్‌ ఖదీర్‌బాబు రాసిన కొన్ని వ్యాసాలు, కథనాలు సాక్షి ఫీచర్స్‌లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కొన్ని కథలు రాసినట్లు కూడా జ్ఞాపకం. కాని చాలా మందికి గుర్తు ఉండిపోయేది వైఎస్‌ఆర్‌ చనిపోయినప్పుడు- వాళ్ల అబ్బాయిని కేంద్ర బిందువుగా పెట్టి రాసిన ఒక ఆత్మ కథనం. అది జీవితంలో అభద్రతకు నిలువెత్తు తార్కాణం. యాజమాన్యాలు మారినప్పుడు తమ భద్రతకు వచ్చే ముప్పును ముందు ఊహించి, స్పందించి వేసే ఒక వ్యూహం. బహుశా ఇదంతా ఖదీర్‌బాబు రాసి ప్రచురించిన – నూరేళ్ల తెలుగు కథకు నేరుగా సంబంధం ఉండకపోవచ్చు. కాని పరోక్షంగా ఈ ప్రస్తావన చాలా అవసరం. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు, ఆలోచన ధోరణిని తెలుసుకోవటానికి రచనలు, ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఖదీర్‌బాబు సంక్షిప్తీకరించిన నూరేళ్ల తెలుగు కథను ఈ నేప«ధ్యం నుంచే చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఖదీర్‌బాబు పుస్తకంపై వచ్చిన స్పందనలు చూసిన తర్వాత ప్రతిస్పందించకుండా ఉండటం దాదాపు అసాధ్యమవుతోంది. ముఖ్యంగా జంపాల చౌదరిగారి, పప్పు అరుణ గారి రివ్యూలు చదివిన తర్వాత తెలుగు భాషకు అతిశయోక్తాలంకారాలు పెద్ద దౌర్భాగ్యమనిపిస్తోంది.
    అరుణగారి రివ్యూ రచయిత్రి అపరిణితిని స్పష్టంగా తెలియజేస్తోంది. జంపాల చౌదరిగారికి ఖదీర్‌బాబుగారు పుస్తకంలోనే కృతజ్ఞతలు చెప్పారు కాబట్టి- ఆయన రివ్యూ వెనకున్న ‘అర్థాన్ని’ అర్ధం చేసుకోవచ్చు. కాని అరుణగారి రివ్యూను వెనకున్న కారణాలు మాత్రం తెలియదు. అంతే కాదు.. ఇలాంటి రివ్యూల ద్వారా తెలిసో, తెలియకో- ఆమె తెలుగుకథ సంస్కృతికి తీరని చేటు చేస్తున్నారని కూడా అనిపిస్తోంది. దానికున్న కారణాలను పాఠకులకు వివరించాల్సిన అవసరం కూడా ఎంత్తైనా ఉంది.
    తెలుగు కథ గొప్పదనం, ఇప్పటి దాకా ప్రచురితమైన మంచి కథలకు సంబంధించి అనేక సంకలనాలు వెలువడ్డాయి. వెలువడుతున్నాయి. ఇవన్నీ వ్యక్తుల ఇష్టాఇష్టాల ఆధారంగా జరిగేవి. వారికి ఇతరులపై ఉన్న ఆవేశకావేశాలు, కారుణ్యవిద్వేషాల ఆధారంగా ప్రచురితమయ్యేవి. దేవులపల్లి రాసే వచనాన్ని అమూల్యంగా భావించేవారికి పురాణ సుబ్రమణ్య శర్మ శైలి ఇష్టం లేకపోవచ్చు. చలాన్ని సాహితీదేవుడిగా కొలిచేవారికి దేవులపల్లి ఉత్తి వేస్ట్‌ అనిపించచ్చు. అవన్నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు. ఇక కథ సంక్షిప్తీకరణల విషయానికి వస్తే- ఇంగ్లిషులో ఇలాంటి ప్రయోగాలు అనేకం జరిగాయి. పాశ్చాత్య రచయితలు మాత్రమే కాకుండా కుష్వంత్‌ సింగ్‌ వంటి రచయితలు సంక్షిప్తం చేసిన రచనలు అనేకం ఉన్నాయి. కుష్వంత్‌ సింగ్‌ తన కథలనే స్వయంగా సంక్షిప్తీకరించిన సందర్భాలు కూడా అనేకం. (వీటిలో కొన్నింటిని చిన్న చిన్న పుస్తకాలుగా వేసి అవుట్‌లుక్‌ వంటి పత్రికలతో అనుబంధంగా కూడా అందించారు). ఇలాంటి ప్రక్రియలకు సాహితీనేపథ్యం, శైలి వైవిధ్యం, భాషా వైదుష్యంతో పాటుగా నిస్పాక్షికంగా వ్యవహరించే తీరు మొదలైనవి ఉండాలి. గతంలో రచనలు చేసిన వ్యక్తిగా- ఖదీర్‌బాబుకు వీటిలో కొన్ని లక్షణాలు ఉండచ్చు. కాని ఈ నూరేళ్ల తెలుగు కథ ఎంపిక, దానిని సంక్షిప్తీకరించిన తీరుతెన్నులు, రచయితలను ఎంపిక చేసిన నిస్పాక్షిత మొదలైన విషయాలలో ఖదీర్‌బాబుపై అనేక అభ్యంతరాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఇటువంటి ప్రయోగాలు చేసిన సమయంలో- అసలు రచయితకు, దానిని కొసరు చేసి చూపించే వ్యక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించకూడదు. అంతే కాకుండా శాస్త్రీయధోరణిలో కథలను ఎంపిక చేయటం కూడా ఒక నైపుణ్యమనే చెప్పాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఈ కథా సంపుటంలో -తల్లితండ్రుల ప్రేమ గురించి కొన్ని కథలు ఉన్నాయి. ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన కథలలో- తల్లితండ్రుల అనురాగం గురించి రాసిన కథలలో- జగన్నాథ శర్మ (ప్రస్తుతం నవ్య వార్తా పత్రిక సంపాదకుడు)- రాసిన నాన్న కథ అత్యుత్తతమైనదని అందరూ చెబుతారు. (ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు. చాలా మంది విమర్శకుల అభిప్రాయం కూడా). దానికి ఈ సంకలనంలో స్థానం లేదు. దీనికి కారణం అసలు రచయితతో ఖదీర్‌బాబుకు ఉన్న వైరుధ్యాలు, వైషమ్యాలు కారణం కావచ్చు. కాని మొత్తం పుస్తకంపై దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. సమకాలిన రచయితలకు సంబంధించిన
    ఇలాంటి ఉదాహరణలను అనేకం చెప్పచ్చు.
    పైన చెప్పినట్లు- అతిశయోక్తులు మన తెలుగు రచయితలకున్న ఒక దౌర్భాగ్యం. అరుణ గారికి ఖదీర్‌బాబు గుడిలో దీపం తిప్పే పూజారిలా కనిపించటానికి కారణాలు తెలియవు కాని నూరేళ్ల తెలుగు కథకు ఖదీర్‌బాబు ప్రథమ పూజారి కాడు. కాబోడు. ఆయన రాస్తే తప్ప- తెలుగు కథ సోగసును తెలుసుకొనే దౌర్భాగ్య పరిస్థితిలో తెలుగువారు లేరు. ఉండబోరు కూడా. తెలుగు కథలను సంక్షిప్తీకరించి అందరికి అందచేయాలనేది చాలా మంచి ఆలోచన. కాని అది పుస్తకాలు వేసుకోవటానికి చేసే ఒక జిమ్మిక్‌గా మారినప్పుడు అనేక విపరీత పరిణామాలు ఏర్పడతాయి. దురదృష్టవశాత్తు- ఖదీర్‌బాబు ట్రాక్‌ రికార్డు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. హిందీ సినిమాల గురించి రాసినా (ఇది ఒక ఇంగ్లిషు పుస్తకానికి తెలుగు అనువాదం అనేది కొందరి ఆరోపణ).. రీఛార్జ్‌లు రాసిన- లక్ష్యం పుస్తక ప్రచురణే అనేది సుస్పష్టం. తాను రాసిన రచనలను ముద్రించే హక్కు ఏ రచయితకైనా ఉంటుంది. కాని పుస్తక ముద్రణ కోసం దాని ద్వారా వచ్చే వాణిజ్య ప్రయోజనాల కోసం రచనలు చేయటం ప్రారంభించనప్పుడు సమస్య ప్రారంభమవుతుంది. ఖదీర్‌బాబు పుస్తక ప్రచురణ కోసం (సాక్షి యాజమాన్యం మీరు పుస్తకాలు ప్రచురించుకోవటానికి వీలు లేదు అని స్పష్టంగా చెబితే- ఖదీర్‌బాబు కలం నుంచి ఒక్క ముక్కైనా రాలుతుందా అనేది నా అనుమానం.. ) ఈ రచనలను చేశాడనేది తిరుగులేని నిజం.
    గ్రామాల్లో ముసనబులు, కరణాలు (లేకపోతే ఇప్పటి రాజకీయనాయకులు అనుకోండి..) ఉంటారు. వారిని వెంబడించే వారు కొందరుంటారు. వాస్తవానికి వారికి మునసబు, కరణాలతో పెద్ద పని ఉండద్దు. స్వలాభం కోసం వెంట తిరుగుతూ ఉంటారు. ఇద్దరి మధ్య స్థాయి భేదాలు ఉంటాయి. కాని ఎక్కడికి వెళ్లినా మునసబు, కరణాల స్నేహితులు కాబట్టి వారికి గౌరవ మర్యాదలు జరుగుతాయి. ఈ విషయం ఖదీర్‌బాబుకు బాగా తెలుసు. అందుకే గొప్ప సినిమాలు కావచ్చు, గొప్ప కథలు కావచ్చు, గొప్ప రచనలు కావచ్చు.. వాటితో అనుబంధం వల్ల కొంత గొప్పతనం అబ్బుతుందనే భావన బలంగా ఉండి ఉండచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని ఖదీర్‌బాబు గుర్తించుకోవాలి. స్టార్‌ షోలలో యాంకర్స్‌ కూడా అందరిని ఆకర్షిస్తారు. కాని స్టార్స్‌ స్టార్సే. వారిని పరిచయం చేసే యాంకర్స్‌ యాంకర్సే.
    చివరగా పుస్తకం నెట్‌ వారికి ఒక మనవి. ‘ఆహా..ఓహో..’ అనే భజంత్రీగాళ్లు అనేక మంది. చప్పట్ల బ్యాచ్‌లు కూడా అనేకం. శృతి చేయటం పూర్తి కాకుండానే శభాష్‌ అనే వారు కూడా చాలా మందే. ఇలాంటి వారి రివ్యూల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. దీనిని పుస్తకం డాట్‌ నెట్‌ గుర్తిస్తే మంచిది. ఇది నా అభిప్రాయం. దీనితో మీరు విభేదించవచ్చు. చర్చకు కూడా రావచ్చు.

  23. bsramulu

    mee samixa parichayam baagundi.

    congrats.

    bsramulu

  24. చంద్ర మోహన్

    అందమైన పరిచయం. పుస్తక పరిచయాలన్నీ ఇంత బాగుంటే తెలుగు పుస్తకాల అమ్మకాలు పెరిగిపోవూ!

  25. రాము

    చాలా అధ్బుతంగా ఉంది. తెలుగు వారికి పంచ భక్ష పరమాన్నం అందించినంత చక్కగా వివరించారు.

  26. రచయిత నెంబర్ నూటొకటి

    తెలుగు కథ గురించి ఖదీర్ బాబుకేంతెలుసు, నా మొహం ? అంత తెలిసిన ఘటికుడైతే రాసినవే రాస్తాడా ? అదీ గౌరవ మర్యాదలూ పేరు ప్రతిష్ఠలూ కలిగిన రచయితల కథలనన్నీ తిరగరాసి పేరు కొట్టేస్తాడా ? అయినా వంద కథలు రాశాట్ట. ఎందుకూ ఏడవనా ? ఏం అంతమందిలో నేను కనపడలేదా ? నా కథల పుస్తకం అదే పనిగా పంపించాను. అదో దండగ.

  27. KumarN

    WOW..SPELLBOUND!!
    Uffff. ఎంతందంగా రాసారండీ మీరు. అసలు దీని గురించి తెలీని నాలాంటివాళ్లని ఆవురావురుమంటూ చదివించిన మీ రాత తీరు, మీరిప్పటివరకీ రాసినవాటిల్లో ఒన్ ఆఫ్ ద బెస్ట్.

Leave a Reply