Moonwalking With Einstein -అన్ని విషయాలూ జ్ఞాపకం ఉంచుకొనే కళ

మనలో చాలామందికి తెలియని క్రీడల పోటీప్రపంచం ఒకటి ఉంది. జ్ఞాపకశక్తి పోటీల ప్రపంచం. ఆ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు 52 ముక్కల పేకదస్తాని అరనిమిషం పాటు చూసి ముక్కలన్నిటినీ వరసగా చెప్పేయగలరు. అరగంటలో 676 పేకముక్కలని వరుసగా గుర్తుపెట్టుకోగలరు. 375 పాదాల (lines) కొత్త పద్యాన్ని ఒక్కసారి చదివి విరామచిహ్నాలతో సహా అప్పజెప్పగలరు. వెయ్యి బైనరీ అంకెల్నీ, 470 అస్తవ్యస్తపు అంకెల్నీ ఐదు నిమిషాల్లో చదివి అప్పజెప్పగలరు. 70 కొత్త వ్యక్తుల ఫొటోల్ని ఐదు నిమిషాలపాటు చూస్తే ఏ ఫొటో చూపించినా ఆ మనిషి పూర్తి పేరు చెప్పగలరు.

ఇంత జ్ఞాపకశక్తి వీరికి ఎలా వచ్చింది? వీరు జన్మతః ఈ అద్భుత జ్ఞాపకశక్తితో పుట్టారా? ఏ దేవత ఐనా కరుణించి వీరికి ఈ శక్తి ఇచ్చిందా? మామూలు మానవమాత్రులు ఇలాంటి జ్ఞాపకశక్తిని సాధనతో పొందగలరా? ఇంత జ్ఞాపకశక్తి ఉంటే ఏం సాధించవచ్చు? అసలు జ్ఞాపకాలు, జ్ఞాపకశక్తి ఎలా ఏర్పడుతాయి? 2005లో అమెరికన్ జ్ఞాపకశక్తి పోటీలకు విలేకరిగా వెళ్ళిన జాషువా ఫోయెర్‌కి ఈ ప్రశ్నలే కలిగాయి. అన్నట్లు ఆ సంవత్సరం ఆ పోటీలను గెలిచిన వ్యక్తి, వర్జీనియాకు చెందిన 24 ఏళ్ళ వయసున్న కంప్యూటర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి /బిజినెస్ కన్సల్టెంట్ రాం కొల్లి (తెలుగు పేరులాగే ఉంది; పక్క ఫొటో 2005 పోటీలప్పటిది; ఇతర వ్యక్తిగత వివరాలు తెలీలేదు).

ఆ పోటీలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ప్రయత్నిస్తున్న చాలామంది “మెమరీ అథ్లెట్స్”ని జాషువా ఇంటర్వ్యూ చేశాడు. ఇలాంటి జ్ఞాపకశక్తి సంపాదించటం బ్రహ్మవిద్య, పూర్వజన్మ సుకృతం, అత్యుత్తమ మేధస్సు లాంటివేం కాదని, కావాలంటే జాషువా కూడా “మెమరీ ఛాంపియన్” కావచ్చని బ్రిటన్‌నుంచి వచ్చిన ఎడ్ కూక్ (Ed Cooke) అంటే జాషువా నమ్మలేదు. కానీ అతనికి జ్ఞాపకశక్తి గురించి, ఈ పోటీలకు తయారయ్యే పద్ధతుల గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం కలిగింది. ఆ ప్రయత్నంలో అతను నేర్చుకొన్న విషయాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరచాడు.

క్రీ.పూ. ఐదవ శతాబ్దిలో సైమోనిడెస్ అనే గ్రీక్ కవి ఒక పెద్ద సభాభవనంలో తన కవిత్వాన్ని వినిపిస్తున్నాడు. కవితాపఠనం అయి కూర్చోబోతుండగా తన కోసం ఇద్దరు వార్తాహరులు వేచి ఉన్నారని కబురు తెలిసి వారిని కలుసుకోవడానికి భవనం విడచి బయటకు వెళ్ళాడు. అతను బయటకు వెళ్ళిన కొన్ని నిమిషాలకు ఆ భవనం అకస్మాత్తుగా కుప్పగా కూలిపోయింది. ఆ విధ్వంసంలో రాళ్ళక్రిందపడి నుజ్జునుజ్జు ఐన తమవారిని అయినవాళ్ళు గుర్తు కూడా పట్టలేని విషాద పరిస్థితి. తమవారికోసం వచ్చిన బంధుమిత్రులకు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీక విలపిస్తున్నారు. ఆ విధ్వంసాన్ని సైమోనిడెస్‌కు కొంత సేపు నిస్థబ్ధంగా చూసి కళ్ళు మూసుకొన్నాడు. అంతకు ముందు తాను కవితను చదువుతున్నప్పుడు తన ఎదురుగా ఆసీనులైన సభికుల్లో ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తు తెచ్చుకోవటం ప్రారంభించాడు. అతని మనోనేత్రం ముందు కూలటానికి ముందున్న సభాభవనం, అందులో కూర్చున్న సభికులు స్పష్టంగా సాక్షాత్కరించారు. ఎవరు ఎక్కడ కూర్చున్నారో, వారి దుస్తులు, ముఖకవళికలతో సహా అతనికి స్పష్టంగా గుర్తుకు వచ్చింది. ఆ వివరాలను అక్కడ శోకిస్తున్న బంధుమిత్రులకు చెబితే వారు తమవారి అవశేషాలను చూసి అవసరమైన కర్మక్రియలు జరుపుకున్నారు. ఆ రోజున సైమోనిడెస్ అనుభవం నుంచి జ్ఞాపకశక్తి ఒక కళగా ఉద్భవించింది.

అచ్చు యంత్రం రాకముందు, కావ్యాలని, విజ్ఞానగ్రంథాలని, మతగ్రంథాలని కాగితంపైన, పత్రాలపైన రాయటం ఉండేది. అంతకన్నా ముందు ఎంత పెద్ద విషయమైనా మౌఖికంగా విని దాన్ని గుర్తుపెట్టుకొని తరువాత తరానికి అందించడం మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో విజ్ఞానం ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక ప్రాంతంనుంచి ఇంకో ప్రాంతానికి అందించటానికి జ్ఞాపకశక్తే ప్రధాన వాహిక. కొన్నివేల శ్లోకాలున్న వేదాలు కొన్నివందల ఏళ్ళపాటు తరతరాలుగా మౌఖికంగానే అందించబడ్డాయి. చదువుకుంటున్న ప్రతివారూ విధిగా జ్ఞాపకశక్తిని పెంచుకొనే మార్గాలని సాధన చేసేవారు. ముఖ్యమైన అన్ని విషయాలను మానవ మస్తిష్కంలోనే (internal means of memory) భద్రపరచుకోవలసిన అవసరం ఉండేది. వివిధ విషయాలను జ్ఞాపకం చేసుకోవటానికి సులువైన మార్గాలు చాలా వ్యాప్తిలో ఉండేవి. ముందు రాత, తరువాత అచ్చు, ఇప్పుడు సంఖ్యాయుత మాధ్యమాలు వచ్చాక గుర్తుంచుకోవలసిన విషయాలు మస్తిష్కంలో కాక బయట జాగ్రత్తగా దాచుకొనే సదుపాయం (external means of memory) కలిగింది. ఇప్పుడు భారీ ఎత్తున సమాచారం వేళ్ళ చివరే దొరుకుతుంది. ఆ సమాచారాన్ని పనిగట్టుకొని మెదడులో దాచుకోవలసిన అవసరం లేదు. నిత్యజీవితంలో దైనందిన విషయాలు తప్ప మిగతా విజ్ఞానాన్ని దాచుకోవలసిన విస్తృత జ్ఞాపకశక్తి అవసరం రోజురోజుకూ తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే మార్గాలు, సులువులు నెమ్మదిగా మాయమైపోతున్నాయి.

జ్ఞాపకశక్తిని పెంపొందించే పద్ధతులు నేర్చుకొని సాధన చేస్తే ఎంతటి క్లిష్టమైన విషయాలనైనా సులువుగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఈ సులువులని ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికోసం చూసినదాన్ని చూసినట్లుగా మనసులో ఛాయాచిత్రంగా ముద్రించుకోగలగటం (photographic memory, eidetic memory) లాంటి ప్రత్యేక శక్తులేమీ అవసరం లేదు అని ఈ జ్ఞాపకశక్తి పోటీలలో పాల్గొనేవారు చెబుతారు. ఈ విషయాలని నేర్చుకోవటానికి, గుర్తు పెట్టుకోవటానికి వీరు సామాన్యంగా వాడే పద్ధతులు రెండు. మొదటిది వారి మనసులో స్మృతి భవనాల (memory palaces) నిర్మాణం. రెండవది గుర్తుకు పెట్టుకోవలసిన విషయాలని (అంకెలు, పేకముక్కలు, చారిత్రక విషయాలు, గణితసూత్రాలు, ఏదైనా కానీ) మనోదృశ్యాలుగా మార్చుకోవటం. ఆ దృశ్యాల్ని ఈ భవనాల్లో నిర్ణీతప్రదేశాలలో గుర్తుగా భద్రపరచుకొంటారు. అవసరమైనప్పుడు ఒక్కసారి వారి మనసులో ఈ స్మృతిభవనంలోకి వెళ్ళి అక్కడ వారికి కనిపించే దృశ్యాలని చూస్తే గుర్తు పెట్టుకోదలచిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆ దృశ్యాలని ఎంత వింతగా, విలక్షణంగా సృష్టించుకొంటే అంత సులువుగా వాటిని గుర్తు పెట్టుకోవచ్చు. ఈ దృశ్యాలని తయారు చేసుకోవటానికి వ్యక్తి, క్రియ, కర్మ (person, action, object – PAO) అనే సూత్రాన్ని వాడుకొంటారు. రోజూ విధిగా సాధన చేస్తే ఇలా విషయాలని గుర్తుపెట్తుకోవటం వారి ప్రవృత్తిలో భాగం ఐపోతుంది.

జాషువా ఫోయెర్‌కి ఈ మాటలపైన నమ్మకం కలుగలేదు. ఐనా, దీని సంగతేమో చూద్దామని, ఎడ్ కూక్ దగ్గర శిష్యరికం చేస్తూ, రోజూ సాధన మొదలు బెట్టాడు. అదే సమయంలో జ్ఞాపకశక్తి వెనుక ఉన్న శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడం మొదలు బెట్టాడు. దీనిలో భాగంగా అతను విపరీతమైన జ్ఞాపకశక్తి ఉన్నవారినీ, ఏదీ జ్ఞాపకం ఉండనివారినీ, జ్ఞాపకాల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేవారిని, అపురూప మేధావులని (Savants) కలుసుకొన్నాడు. మెదడుకు కలిగిన కొన్ని గాయాలవల్ల ఏ విషయమూ జ్ఞప్తిలో ఉండని E.P. వంటి వారిని కలిశాడు. డస్టిన్ హాఫ్‌మన్ నటించిన రెయిన్ మాన్ (Rain Man) పాత్రకు స్ఫూర్తి ఐన కిం పీక్‌ని (పన్నెండు వేల పైగా పుస్తకాలు చదివి, వాటిలో ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకొన్నవాడు), వివిధ విషయాల్లో పాండిత్యం కలిగిన “బ్రెయిన్ మాన్” డేనియెల్ టామెట్‌ని కలిశాడు. మానవమేధస్సుపై పరిశోధనలు చేస్తున్న డేనియెల్, ఎరిక్సన్ పరిశోధనశాలలో తన జ్ఞాపకశక్తిని పరీక్షించుకొన్నాడు. జ్ఞాపక శక్తి పోటీలలో ఉత్తమశ్రేణిలో ఉన్న క్రీడాకారులని కలసి ఇంటర్వ్యూ చేశాడు.

ఈ క్రమంలో జ్ఞాపకశక్తి గురించి ప్రస్తుత శాస్త్రీయ విజ్ఞాన స్థితి, నిత్యజీవితంలో చారిత్రకంగా మారుతూ వస్తున్న జ్ఞాపకశక్తి పాత్ర, ప్రయోజనం, బడి చదువుల్లో జ్ఞాపకశక్తి స్థానం, కాల్పనికప్రతిభ జ్ఞాపకశక్తుల మధ్య ఉన్న సంబంధ వైరుధ్యాలు వంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో కూలంకషంగా చర్చిస్తాడు. అనేక ప్రశ్నలు మనముందు ఉంచుతాడు.

2005 అమెరికన్ జ్ఞాపకశక్తి పోటీల తర్వాత, జాషువా ఫోయెర్ ఎడ్ కూక్ గురుత్వంలో, డేనియెల్ ఎరిక్సన్ శాస్త్రీయ సాంకేతిక సహాయంతో రోజూ శ్రద్ధగా తన జ్ఞాపకశక్తిని పెంచుకొనే మార్గాలని సాధన చేయటం మొదలుబెట్టాడు. ఈ పుస్తకంలో తన సాధన గురించిన వివరాలను, తన జ్ఞాపకశక్తి అభివృద్ధి క్రమాన్నీ మనతో పంచుకొంటాడు. 2006 అమెరికన్ జ్ఞాపకశక్తి పోటీలలో పాల్గొన్నాడు. ఒక ఏదాది క్రితం తనను అబ్బురపరచిన అసాధారణ కృత్యాలను ఈసారి తానే చేశాడు. 52 పేకముక్కల దస్తాని 55 సెకన్లలో గుర్తు పెట్టుకొని కొత్త అమెరికన్ రికార్డు నెలకొల్పాడు. పోటీ ఆఖరు ఆవృతంలో అంతకు ముందు సంవత్సరం ఛాంపియన్ రాం కొల్లిని ఓడించి జాషువా ఫోయెర్ 2006 అమెరికన్ జ్ఞాపక శక్తి పోటీల విజేత అయ్యాడు (పక్క ఫొటోలో ఫైనల్ రౌండ్‌లో జాషువా, రాం).

ఇంత సాధన తరువాత, పోటీలో గెలవడం కాకుండా జాషువాకు ఇతర మేలేమైనా జరిగిందా? అతని జ్ఞాపకశక్తి, మేధాశక్తి నిజంగానే పెరిగాయా? డేనియెల్ ఎరిక్సన్ ప్రయోగశాలలో పరిశోధనల ప్రకారం జాషువా గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి బాగా పెరిగాయి. తాను నేర్చుకొందామనుకొన్న విషయాలపై ఇంతకు ముందుకన్నా ఎక్కువ ధ్యానం పెట్టగలగడమే దీనికి ముఖ్య కారణం అంటాడు జాషువా. ఐతే నిత్యజీవితంలో ఈ జ్ఞాపకశక్తి ఉపయోగం అంతగా కనిపించడం లేదంటాడు. ఈ గెలుపుకు సంబంధించిన పార్టీలో పాల్గోనడానికి న్యూజెర్సీలో తన ఇంటినుంచి న్యూయార్క్ వెళ్ళి, పార్టీ అయిపోయాక రైల్లో ఇంటికి తిరిగివస్తుండగా అతనికి గుర్తొచ్చింది: ఉదయం న్యూయార్క్‌కు తను తన కార్లో వెళ్ళిన విషయం మర్చిపోయి, కారుని న్యూయార్క్‌లో వదిలేశానని 🙂

ఈ పుస్తకాన్ని జాషువా ఫోయెర్ చాలా సరళంగా, సరదాగా రాశాడు. క్లిష్టమైన శాస్త్రీయ, సాంకేతిక విషయాలను కూడా సాధారణ పాఠకుడు తేలిగ్గా అర్థం చేసుకొనేలా రాశాడు. విషయం శాస్త్రీయమే ఐనా, ఒక స్పోర్ట్స్ నవల లాగా ఉంటుంది కథనం. నాకుకూడా ఇంతకు ముందు తెలియని కొన్ని విషయాలు తెలిశాయి.

ఆ ఒక్కసారి తర్వాత జాషువా జ్ఞాపకశక్తి పోటీలలో పాల్గొనడం మానేశాడు. రాం కొల్లి 2009లో, 2010లో కూడా రెండవ స్థానంలో నిలచాడు. ప్రపంచ మెమరీ అథ్లెట్స్ పట్టికలలో మరిన్ని తెలుగు పేర్లు (నిశాంత్ కాశీభట్ల, యడవల్లి శ్రీ వైష్ణవి, వై. రమ్యశ్రీ వగైరా), భారతీయ పేర్లు కనిపిస్తున్నాయి. రెండేళ్ళుగా భారతదేశంలోనూ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోనే. మూడవ భారతీయ జ్ఞాపకశక్తి పోటీలు ఈ సంవత్సరం అక్టోబరు23న Hotel Marygold by Green Park, Green Lands, Begumpet లో జరుగనున్నాయి. వివరాలు ఇక్కడ.

**********

Moonwalking with Einstein
The Art and Science of Remembering Everything
Joshua Foer
2011
Penguin Press
307 pages/ $26.95

ఫ్లిప్కార్ట్ లో కొనుగోలుకు ఇక్కడికి వెళ్ళండి.
అమేజాన్ కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

6 Comments

  1. వీక్షణం-7 | పుస్తకం

    […] ఒక వ్యాసం ఇక్కడ. * కొంతకాలం క్రితం జంపాల చౌదరి గారు పరిచయం చేసిన “Moonwalking with Einstein” పుస్తకం గురించి […]

  2. Panthangi. Sreenivas

    Hi,

    Very interesting and amazing.

    Regards,
    Sreenivas

  3. సౌమ్య

    Interesting. Thanks for introducing.

  4. ధా. బ్ర.రా

    జంపాల చౌదరిగారు పైన చెప్పిన డానియెల్ టమెట్ (Daniel Tammet) (ఇతనికి ఉన్న న్యూరలాజికల్ కండిషన్ ని Synesthesia అంటారు) రాసిన ఆత్మ కథ Born on a Blue Day కూడా తప్పక చదవ తగ్గది. అది చదివాక ఆటిజం మీద మనకి సాధారణంగా ఉండే అనేక భ్రమలు తొలగిపోతాయి.

    Cheers,
    DBR

    1. Jampala Chowdary

      డేనియెల్ టమెట్ (అసలు పేరు డేనియెల్ కోర్నే) గురించి ఈ పుస్తకంలో ఒక ప్రకరణం ఉంది. టమెట్ జ్ఞాపకశక్తి సాధన వల్ల వచ్చిందేకాని ప్రత్యేకమైన మేధస్సు వల్ల వచ్చింది కాదని ఫోయెర్ అభిప్రాయం. పూర్వజీవితంలో సంపాదనకోసం టమెట్ తొక్కిన కొన్ని మార్గాలు కూడా ఫోయెర్‌కి నచ్చినట్టు లేదు.

Leave a Reply