శారదా శ్రీనివాసన్ గారి జ్ఞాపకాల తోట నుండి..

ఈ తరం, అనగా ఎలెక్ట్ర్రానిక్ యుగానికి సంబంధించిన ఇప్పటి తరం వారికి, శారదా శ్రీనివాసన్ ఒక అపరిచిత పేరు కావచ్చు. రేడియోలో నాటికల ద్వారా సినిమా తారలకున్నంత ఫాన్ ఫాలోయింగ్ పొందిన వ్యక్తిగా తెలియకపోవచ్చు. అయితేనేం? ఆవిడ రాసిన ’నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు’ అన్న పుస్తకం ద్వారా పాతతరం వారికి జ్ఞాపకాలను తాజా చేస్తూ, ఈ-తరం వారికి తెలీని విషయాలను తెలియజేసారు. ఆవిడను గురించే కాక, ఒక నలభై యేళ్ళ క్రితం దేశరాజకీయ పరిస్థితుల మధ్య ’ఆకాశవాణి’ కథను కూడా తెలిపే పుస్తకం.

దీనిపై ఎప్పటిలా పరిచయ వ్యాసంగా కాక, ఇద్దరం ఏకకాలంలో చదివినందు వలన సౌమ్యకూ, నాకూ మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ పంచుకుంటున్నాం. చదవడానికి, ఆ పై కబుర్లాడుకోడానికి మాకు ఈ పుస్తకం నచ్చినంతగా మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాం.

పూర్ణిమ: అమ్మాయ్.. రేడియోలో ఆదివారం మధ్యాహ్నం పూట ఒక కార్యక్రమం వచ్చేది. ఒక ఆడమనిషి ఇంటికి ఒక అతను రాగానే లోకాభిరామాయణం మొదలయ్యేది.. నాకెందుకో వాళ్ల గొంతులే అస్పష్టంగా వినిపిస్తున్నాయి, శారద గారి పుస్తకం చదువుతుంటే.. నీది అయిపోయిందా చదవటం?
సౌమ్య:ఆహా, అయ్యింది. అయ్యింది…. ఆతర్వాత కాసేపు శారద గారు ఎదురుగ్గా కూర్చుని కబుర్లు చెప్తున్న దృశ్యం ఊహించుకోవడమూ అయ్యింద ి.:) ఇప్పుడు ఈ పుస్తకం గురించి ఎవరెవరికి టముకు వెయ్యాలా? అని ఆలోచిస్తున్నా.
పూర్ణిమ: కొన్నాళ్ళ ముందు దువ్వూరిగారి స్వీయ చరిత్రను మెహర్ పరిచయం చేసినప్పుడు, కామేశ్వరరావుగారూ-మెహరూ కాసేపు ఆ తరం వాళ్ళ జీవితాలలోని నిండుతనం గురించి ఒక నోస్టాలజిక్ ఫీల్‍తో మాట్లాడారు. ఈ పుస్తకం చదివాక, నాక్కూడా కొంచెం ఈర్ష్యగా ఉంది, అప్పటి వాళ్ళ కమిట్‍మెంట్, passion చూసి. మనం ఒక ముప్ఫై ఏళ్ళు ముందు పుట్టక చాలా కోల్పోయామేమో! కానీ, ఇంకో ముప్ఫై ఏళ్ళ తర్వాత పరిస్థితి ఊహకు కూడా అందటం లేదు.

సౌమ్య: నిజమే. ఆమధ్య సుజాత గారు ఈ పుస్తకం గురించి రాస్తున్నప్పుడు కూడా ఇలాగే పాతికేళ్ళ ముందు పుట్టాల్సింది అన్నారు. కొన్ని తరాలు అంతే (మనలాగా). ఏం చేస్తాం? సరే గానీ, స్వతహాగా రచయితలు కాని వాళ్ళ స్వీయ అనుభవాలు చదివేందుకు ఒక్కోసారి చాలా బాగుంటాయి కదా. ఆమధ్య బుజ్జాయి గారి “నాన్న-నేను” కూడా ఇలాగే తెగ నచ్చింది నాకు..

పూర్ణిమ: నిజం ఒప్పుకోవాలంటే నాకీ పుస్తకం ఇలా  ఉంటుందన్న ఊహ కూడా కలగలేదు. నువ్వు అప్పట్లో పరిచయం చేసిన చలం నాటిక ‘పురూరవ’ ద్వారానే నాకీవిడ గురించి తెల్సింది. ఆవిడ పుస్తకం అనగానే చాలా చిక్కటి తెలుగుంటుందేమో అనుకున్నాను. కానీ ఈవిడ రాసిన విధానం, మన ముందు కూర్చుని  కబుర్లాడుతున్నట్టు ఉంది. హాయిగా.. అనవసరపు ఆర్బాటాలు లేకుండా. ఎన్ని సాహిత్యపు విశేషాలను ఎంత సరళంగా చెప్పేసారో..

సౌమ్య: లేదు, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మన తరహాలోనే మాట్లాడారు అప్పట్లో అనుకోకుండా కలిసినప్పుడు. ఈ పుస్తకం సరిగ్గా ఆవిడ మాట్లాడుతున్నట్లే ఉంది 🙂 అవును, అలా కబుర్లాడుతున్నట్లు ఉంటూనే భలే చెప్పేసారు బోలెడు సంగతులు. నేను మొదట…ఇలా ఒకే అంకం ఉందేమిటి, కొన్ని భాగాలు ఉండొచ్చు కదా అనుకున్నా. అయితే, దానికి వేరే కారణం ఉందిలే. ఐదో చాప్టర్ దాక చదివాను అనో..ఇలా గుర్తు పెట్టుకోవచ్చని. కానీ, ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదివేసే అవకాశాలు ఎక్కువ కనుక, ఆ ప్రమాదం అందరికీ ఉండదేమో. నేను మధ్యలో ఒక్కసారి ఆపా అంతే.

పూర్ణిమ: అసలీ పుస్తకం ఆడియోలో ఉండుంటే భలేగా ఉండేది. అసలలానే విడుదల చేసి ఉండాల్సింది. ఎంతైనా, ఆవిడ గొంతే ఒక సిగ్నేచర్ కదా!

సౌమ్య: ఆడియో పుస్తకం అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. అందునా అంత కథ ఆవిడే మాట్లాడాలి అంటే, ఈ వయసులో కొంచెం శ్రమ ఏమో. ఆవిడ కొన్ని కథలు చెప్తూంటే, కోతికొమ్మచ్చి ఆడియో పుస్తకంలా ఇంకొందరు కొన్ని పేజీలు  చెబితే, వర్కవుట్ అవుతుందేమో. ఇప్పుడిలా మాట్లాడుకుంటున్నాం కానీ, మొన్న మొన్నటి దాక మనకి ఆవిడెవరో కూడా తెలీదు కదా… మనలాంటి ఇంక చాలామందికి ఇంకా కూడా తెలీదు కదా.బహుశా,  ఈ నేపథ్యంలో ఆడియో బుక్ వల్ల అలాంటి వాళ్ళని రీచ్ అవ్వోచ్చేమో?

పూర్ణిమ: ఈ పెదాళ్ళు మన తరాన్ని బొత్తిగా లెక్కల్లో నుండి తీసేస్తున్నారేమోనని నాకో మా చెడ్డ అనుమానం. అంటే, “ఆ.. వీళ్ళు చదువుతారా? పెడతారా?” అన్న భావన ఉంటుందో ఒక పుస్తకాన్ని రూపొందించేటప్పుడు. వాళ్ళ తప్పు లేదనుకో. అయినా, రీచ్ అవ్వాలనే ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా. ఈవిడ చాలా సరళంగా రాసినా కూడా, ఆ మాత్రం తెలుగు కూడా చదవని వాళ్ళు మనలో ఎందరో కదా. అదే ఆడియో రూపేణ అయితే గుడ్డిలో మెల్లలా ఉంటుంది. ఆ పాయింట్ ఎలా ఉన్నా.. ఆవిడ కథే ఆవిడ మాటల్లోనే వినటం మనందరి అదృష్టంగానూ మిగులుతుంది. ముందు తరాలకీ పనికొస్తుంది. పంచుకోదగ్గ, జాగ్రత్తగా చూసుకో తగ్గ పుస్తకం కదా ఇదీ!

సౌమ్య:  నిజమే. ఆడియో గా రిలీజ్ చేయాలి అనుకుంటే, మన వంతుగా మన వయసు వారి చేత కొనిపించే బాధ్యత మనమీదే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అయినా :). కానీ, చాలా బాగా గుర్తు ఉన్నాయి కదా ఆవిడకి ఈ విశేషాలన్నీ. ఎన్ని పుస్తకాలు..ఎన్ని నాటకాలు..ఎంత మంది నటులు…రచయితలు… నేనైతే కొన్ని పేర్లు అసలు వినను కూడా లేదు ఇదివరలో, చదవడం అటు పెడితే!

పూర్ణిమ: నిజం! మొన్న మల్లాది గారి మీద ఒక్క పరిశోధనా గ్రంథం చదువుతున్నా అని చెప్పా కద! అందులో ఒక చోట, తెలుగు సాహిత్యం విశిష్టమైనది, చాలా ఉన్నతమైనదీ అనీ అభిప్రాయపడ్డారు. అప్పుడకున్నా, మరి ఇన్ని తక్కువ పేర్లే మళ్ళీ మళ్ళీ ఎందుకు వినిపిస్తాయని. ఇది చదువుతుంటే అర్థమయ్యింది, మనకీ ఒక్కప్పుడు మంచి రోజులు ఉండి ఉన్నాయని. అసలు తెలుగు నవలలనూ, కథలనూ అలా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియం‍లో ప్రసారం చేసారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మనకి ఎంటర్‍టేన్మెంట్ అంటే అర్థం ఒక్క సినిమాయే! How unfortunate!

సౌమ్య: వద్దు. నాకు వేరే ఇంకేవో గుర్తొస్తున్నాయ్ (రమణ గారి కొ.కొ. ఆడియో బుక్ వింటూంటే, ఏం వింటున్నావ్? ఏం రైటర్? ఏం రాసారు? అని లక్ష ప్రశ్నలేసిన ఇటాలియన్, చైనీస్ స్నేహితులతో సంభాషణ ముందూ, తరువాత, అలాంటి క్యూరియాసిటీ ప్రదర్శించిన తెలుగు స్నేహితులు కనబడలేదు) టాపిక్ చేంజ్!

పూర్ణిమ: సరే..సరే.. టాపిక్ మార్చేద్దాం. కానీ ఒక్క విషయం. అప్పట్లో చదివి, నాటకాలు వేసి వినిపించిన రికార్డింగ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా? ఎ.ఐ.ఆర్ ఆఫీసుకెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చా? ఇదొక్కటీ అడగనీ.. నన్నడగనీ..

సౌమ్య: మాగంటి .ఆర్గ్ సైటులో కొన్ని రేడియో నాటకాలు వగైరా ఉంటాయి. అప్పుడప్పుడు అవి వింటూ ఉంటే, ఎంత బాగున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అనిపిస్తూ ఉంటాయి. నిజంగా వాళ్ళ టైం లో చాలా vibrant atmosphere ఉండి ఉంటుందేమో కదా.  ఏ.ఐ.ఆర్. వాళ్ళ సంగతి నాకు తెలీదు కానీ, ఏవో దొరుకుతాయి కాబోలు. ఎవర్నన్నా అడిగి కనుక్కుందాం లే. మనకు పెద్ద దిక్కులు ఎంత మంది లేరు 😉 అదృష్టవంతులం మనం… ముప్పై ఏళ్ల తరువాత పుట్టలేదు. 😛

పూర్ణిమ: హమ్మ్.. ఈమాట వాళ్ళు కూడా అడపాదడపా ఏవో పెడుతూనే ఉంటారు. ఏ.ఐ.ఆర్ ఆఫీసంటే ఒకటి గుర్తొచ్చింది. ఇది కొంత సోదిగా ఉండచ్చు.. కానీ చెప్పనీ.. శారద గారు పుస్తకంలో ప్రస్తావించిన హైదరబాద్ ఎ.ఐ.ఆర్ ఆఫీసు గుండా నేను మూడేళ్ళు వెళ్ళాను, కాలేజీ టైంలో. అప్పటికే నాకు వివిధ భారతి బాగా అలవాటు. అందుకని ఆ ఆఫీసుని ఒక రకమైన అటాచ్‍మెంట్‍తో చూసుకునేదాన్ని. ఆ పరిసర ప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ముసురు పట్టినప్పుడు, ఆ రోడ్డు రోడ్డంతా భలేగా ఉంటుంది. ఇప్పటి పబ్లిక్ గార్డెన్ ఒక్కప్పటి జూ అంటే కళ్ళు తేలేసాను. ఇంకా, ఆవిడ చెప్పిన ఒక హోటెల్ ఉందే..అదింకా ఉందో లేదో గానీ, ఆ అవరణలో ఒక హోటెల్ ఉండేదని నాకు బాగా గుర్తు.  ఆవిడ మాటల్లో ఆ ప్రాంతం మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు. హైద్ర్రాబాద్ అవటం వల్ల నేనిలా ఊరిపోతున్నానుకో.. అయినా.. నాకా భాగం బా నచ్చింది.

పైగా నాకూ, ఆవిడకూ డబల్ కమీటా చాలా ఇష్టం. 🙂

సౌమ్య: నాకు శారద గారంటే ఊర్వశి 🙂

పూర్ణిమ: నేనింకా ఏమీ వినలేదు. 🙁 ఈ దెబ్బతో వినేస్తాను. అసలు ఈ పుస్తకం కూడా ఇప్పుడప్పుడే చదివుండేదాన్ని కాను. కినిగెలో పెట్టారు కాబట్టి, డౌన్లోడు చేసుకొని దొరికిన ప్రతి పది నిముషాల్లో కొన్నేసి పేజీలు చదువుతున్నాను.

సౌమ్య: నువ్వేమీ వినకుండానే ఇలా ఐపోతే..ఇక ఆవిడ డైలాగులు వింటే ఏమైపోతవో 🙂

పూర్ణిమ: నన్నూరించక! ఇంకా నీకేం నచ్చాయి ఈ పుస్తకంలో?

సౌమ్య: హూమ్…. నాకు ముఖ్యంగా ఆ పుస్తకం సాగిన తీరు నచ్చింది. ఫిక్షన్ రాస్తే : కథనం అనొచ్చు. జ్ఞాపకాలకి ఏమనాలో నాకు తెలీదు. మాగంటి.ఆర్గ్ లో ఆవిడ ఇంటర్వ్యూ ఒకటి రెండు భాగాలుగా ఉంది. ఆ ఇంటర్వ్యూ ఎలా conversational tone లో ఉందో, పుస్తకం కూడా అలాగే ఉండడం నాకు నచ్చింది. దీనివల్ల, శారద గారు ఎదుట కూర్చుని మాట్లాడుతున్న భావన కలిగింది. ఏం నచ్చింది పుస్తకంలో? అంటే – ఇదే. దీని వల్లే, నచ్చే ఇతర అంశాలన్నీ దృష్టిలోకి రాగాలిగాయి. సీరియస్ గా, అకాడెమిక్ గా రాసి ఉంటే…ఈ విషయాలన్నీ చదివే దాన్ని కాదేమో.  మరి నీకో?

పూర్ణిమ: నన్ను ఎందుకు అడుగుతావులే! నాకసలే కబుర్లు చెప్పేవాళ్ళంటే ఇష్టం. ఆ పై ఇంతిలా (without inhibitions, without any airs) కబుర్లు చెప్పేవారంటే మరీ మరీ ఇష్టం. కానీ, ఈ పుస్తకం నాకు నచ్చింది, శారద గారు ఎందరేసి మహానుభావుల గురించో చెప్పుకురావటం. రమణగారు అన్నట్టు ఒకరు తమ కథ చెప్తున్నారూ అంటే అందులో ఇంకెంత మంది కథలు అంతర్లీనంగా చెప్పుకురావటం జరుగుతుందో కదా! పైగా ఈవిడ పనిజేసిన, పని ద్వారా కల్సిన వాళ్ళంతా ఎంతటి విశిష్టులో కదా. ఇలాంటివి చదివినప్పుడు నాకనిపిస్తుంది, మన జీవితం ఒక ఖాళీ పుస్తకంగా మొదలవుతుంది. అందులో ఎంత మంది (విశిష్టులూ , గొప్పవారే కానవసరం లేదు) తమ సంతకం వదిలిపెడతారో అన్నదాన్ని బట్టి నిండుతనం అనుకుంటా..

ఈవిడకు ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుంది చూసావూ.. 🙂

సౌమ్య: ఎంచక్కా వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కలెక్షన్ ఆఫ్ ఆటోగ్రాఫ్స్  మీద దాడి చేద్దామేంటి?

పూర్ణిమ: నాకో ఆటోగ్రాఫ్ దొరికితే చాలు..

సౌమ్య: అబ్బే, నువ్వు మరీ అల్పసంతోషివీ!

పూర్ణిమ: నాకు Memoirs of Geisha అనే పుస్తకంలో ఒక మాట గుర్తొస్తోంది:

“Autobiography, if there really is such a thing, is like asking a rabbit to tell us what he looks like hopping through the grasses of the field. How would he know? If we want to hear about the field on the other hand, no one is in a better circumstance to tell us-so long as we keep in mind that we are missing all those things the rabbit was in no position to observe. ”

నాకీవడ పుస్తకం చదువుతుంటే ఈ కోట్ పదే పదే గుర్తొచ్చింది. ఇందులో నాకా కుందేలు-గెంతుకుంటూ పోవటం పోలిక బాగా నచ్చుతుంది. నాన్న-బుజ్జాయి, ఇప్పుడీ పుస్తకం – వీటిల్లో నాకనిపించింది ఏటంటే, కుందేలు అలా గెంతుతూ పోతున్నప్పుడు చూసి గడ్డి, ఆ గడ్డి మీద మంచు చుక్కలూ, అది నడిచే మట్టీ ఇవ్వన్నీ బాగా capture అయ్యాయనీ. ఈ పుస్తకంలోనే చూడు.. శారద గారు, మనకు తెల్సిన మనుషులని ప్రస్తావించినప్పుడు మనకి వాళ్ళల్లో భిన్న కోణాలు తెలుస్తాయి. రేడియో అక్కయ్యగారు అనుకున్న పనైతే కానీ వదిలిపెట్టేవారు కారనీ, దాశరధిగారు సరదాగా ఉండేవారనీ..  Am I making sense? 🙂

కానీ నా పాయింట్.. It needn’t be about the rabbit himself, it could be about the grass and everything and anything that the rabbit eye can capture and it’s mind can register.

సౌమ్య: పధ్ధతి లేకపోవడంలో పధ్ధతి అదే. ఆవిడ ఈ వరుసలో చెప్పాలి అనుకుని చెప్పకపోయినా కూడా మనకి, కొన్ని ఇమేజెస్ ఏర్పడ్డాయి కదా 🙂

పూర్ణిమ: ఊ! అందులోనూ, ఈవిడ మాట్లాడే ధోరణిలో ఉన్నా, ఎక్కడా ఎక్కువగా వర్ణనలకు పోయినట్టనిపించలేదు. అయినా కూడా ఇమేజెస్ ఏర్పడ్డాయి. నాకు కాసేపు అలా అసెంబ్లీ రోడ్డులో తిరిగిరావాలి అనేంతగా.. 🙂

హమ్మయ్య.. నేను ’విరామం’ దగ్గరకు చేరుకున్నా.. ఇప్పటికి..

సౌమ్య: అవును, నిజమే @యినా కూడా ఇమేజెస్ ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎవన్నా పుస్తకాలు తెల్సా నీకు?

పూర్ణిమ: ఊహు.. తెలీదు. శ్రీనివాసన్ గారితో పరిచయ, ప్రణయ విశేషాలు చెప్తారని ఆశపడ్డా.. (నో! అలా చూడకు). శ్రీనివాసన్ గారి గురించి తెల్సుకోవటం బాగుంది. ఆయన రూపొందించినవి ఇప్పుడు ఫారెన్ యూనివర్సిటిలో టీచింగ్ మెటిరియల్ అట!

ఇక్కడే శారద గారి ఒక మాట, రేడియో పనిజేస్తున్నారు… వీళ్లకేంటి ఆడుతూ, పాడుతూ గడిపేస్తరని జనం అనుకునేవారట. అది చదివి నవ్వొచ్చింది. కాస్త సరదాగా ఉంటే కష్టాల్లేవనుకుంటుంది లోకం. కానీ ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం రేడియో ఉద్యోగం ఎంత కష్టమనిపించిందో నాకు. కాకపోతే అంత కమ్మింట్‍మెంట్‍తో చేసారు కాబట్టి అలా అనిపించిందో..

సౌమ్య: అవును, శ్రీనివాసన్ గారి రచన సంగతి చదవగానే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇలాంటి విషయాలు మనకి తెలీకుండా పోతాయో అని. నువ్వు అంటూంటే ఒక విషయం తట్టింది. వీళ్ళు క్రెడిట్ సొసైటీ, యూనియన్ పెట్టుకోవడం : ఈ కథలన్నీ చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి కదా! నాకైతే వావ్! అనిపించింది. ఆ చిరంజీవి గారి పేరు మాగంటి.ఆర్గ్ సైట్ లో పెట్టిన నాటకాల్లో విన్నాను. భలే మనిషి కదా!

పూర్ణిమ:  వీళ్ళంతా ఇష్టంగా పనిజేసిన వాళ్ళు. ఇష్టమై చేసినవాళ్ళు. జీతభత్యాల కోసం కాక. అందుకని వాళ్ళు భలేంటి మనుషులే అవుతారులే! సంతోషాలకోసం తప్ప, కంఫర్ట్స్ కోసం పాకులాడలేదు..

సౌమ్య: హూమ్… రేడియో వాళ్ళ నాటికలు పుస్తక రూపేణా తేవొచ్చు కదా ఎంచక్కా..ఆడియో సంగతి అటు పెడితే…

పూర్ణిమ: ఇంకా, ఆ వాణి పత్రిక కూడా! జనాలకోసం కాకపోయినా, కనీసం వాళ్ళ ఖజానాలో అయినా ఇవ్వన్నీ భద్రపరచి ఉండాల్సింది. అసలీ పుస్తకం చదువుతుంటే అర్థం అయింది నాకు, ఆకాశవాణిని అంతగా ఇష్టపడేవారెందుకో అన్నది.. సాహిత్యం, సంగీతం, సంక్షేమం, విద్య, వైద్య, సాంకేతికం.. అన్నింటిపై కార్యక్రమాలు. ఆ లిస్ట్ చదివావా, ఎవరైతే యువవాణిలో పనిజేసి ఆ తర్వాత ఎంతెంత పెద్ద పోస్టుల్లో ఉన్నారో? వాళ్ళు జాక్‍పాట్ కొట్టారనిపించింది.. శారద గారన్నట్టు, రేడియో ఒక యూనివర్సిటి..

సౌమ్య: ఒకచోట (పలుచోట్ల) ఆడిషన్ పద్ధతి, కొత్తవాళ్ల ట్రెయినింగ్ వంటి వాటి గురించి రాసారు కదా. ఎంత శ్రద్ధగా ఎంపిక చేస్తారో అనిపించింది. నిజంగా అప్పట్లో అలా యూనివర్సిటీ లాగే ఉండేదేమో. ఇప్పుడు ఎలా ఉందో?

పూర్ణిమ: రేడియోతో సంబంధాలంతగా లేవిప్పుడు. ఆప్ కీ ఫర్మాయిష్ టైపు కార్యక్రమాల్లో ఎస్.ఎమ్.ఎస్ లు తీసుకుంటున్నారని తెల్సు.. కానీ, శారద గారి ప్రకారం ప్రసార భారతి వచ్చాక, చాలా మారిపోయినట్టుగా ఉన్నాయి కదా..

సౌమ్య: మిగితా రేడియో చానెల్స్ లో మాత్రం సినిమా తప్పిస్తే వేరే ఏం విషయాలు మాట్లాడారేమో అనిపిస్తుంది…ప్రసార భారతి సంగతి తెలీదు కానీ.

పూర్ణిమ: Now, don’t get me started on that! నేను రాను, రాను సినికల్‍గా తయారవుతున్నానేమో గానీ, తెలుగు వాళ్ళకి సినిమా తప్ప దిక్కు లేదు. ఆ విషయం బాగా పసిగట్టిన సినిమా వాళ్ళు పరమ లోకువ కట్టి.. ఎలా చెప్పను? అసలైతే వేదికపైన ఉన్నవాడు సరిగ్గా చేయకుంటే రాళ్ళూ, గుడ్లూ వేసి కొడతారు. ఇక్కడ రివర్స్ లో తీసేవాడే ప్రేక్షకులకేసి కొడుతున్నాడు.. మనం ఏడవలేక నవ్వుతున్నాం… టాపిక్ ఛేంజ్..

ఇందులో బోలేడు సాహిత్యాన్ని, సంగీతాన్ని కోట్ చేసారుగా శారద గారు.. ఎంత బావున్నాయో చదువుకోడానికీ..

సౌమ్య: అవును, ఆవిడకి భలే గుర్తున్నాయే. చాలా విరివిగా చదివేవారు అనుకుంటాను (చదువుతున్నారు కూడానేమో!)

పూర్ణిమ: ఇలాంటి ఒక్క పుస్తకం చదివితే చాలు. ఒక వంద పుస్తకాలకి చిరునామాలు దొరుకుతాయి. ’పుస్తకాలను గురించి చెప్పే పుస్తకాల్లో’ ఇది ఒకటి అని నొక్కి వక్కాణించి చెప్పచ్చు.

అన్నట్టు శారద గారు, యద్దనపూడి నవలలు చదువుతూ వంటలు మాడబెట్టేసేవారంటే భలే నవ్వొచ్చింది..

సౌమ్య: నవ్వేమిటీ…. అవి అలాగే గ్రిప్పింగ్గా ఉంటాయి. బోలెడు ఫ్యాన్స్ కదా యద్దనపూడి గారికి అందుకే మరి 🙂  నీతో ఇలా మాట్లాడే కొద్దీ ఈసారి ఆవిడని కలవాలి అన్న తాపత్రేయం పెరుగుతోంది 🙂

పూర్ణిమ: యద్దనపూడి గారిని ఏమనే ధైర్యం నాకు లేదు.. ఆవిడను చదవకున్నా.. నవ్వెందుకూ అంటే, మనం చేసే పనులే, పెద్దవాళ్ళూ, గొప్పవాళ్ళూ చేస్తారనగానే కలిగే ఆనందం తాలూకూ నవ్వు. “అచ్చు.. నాలానే!” అని.. నేను వంట చేస్తానని కాదు.. అయినా..

అదిసరే.. ఇది చూడు.. భలే ఉందిగా:

కొండొండోరి చెరువుల క్రింద చేసిరి ముగ్గురు యవసాయం
ఒకరికి కాడిలేదు, రెండు దూడ లేదు
కాడీ, దూడ లేని యవసాయం, పండెను మూడు పంటల్లు
ఒకటి ఒడ్డులేదు, రెండు గడ్డి లేదు
వడ్డూ, గడ్డీ లేని పంటను, ఇశాఖపట్నం సంతతో పెడితే
వట్టి సంతే గానీ సంతలో జనంలేరు

సౌమ్య: :))

పూర్ణిమ: శారదగారిలో నాకు నచ్చిన మరో విషయం. ఆవిడ చేసిన పొరబాట్లను సంకోచం లేకుండా ప్రస్తావించారు. నచ్చని విషయాలను గూర్చి సూటిగా మాట్లాడారు. రేడియో గురించి మాటొచ్చినప్పుడల్లా ఒక రకమైన ఉద్వేగంతో, అనురక్తితో మాట్లాడారనిపించింది.

సౌమ్య: అవును. రేడియో అన్న పేరు వినగానే ఆవిడకి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా…… అసలు ఏ విషయమైనా కూడా, ఈ పుస్తకంలోని ప్రతి పేజీలోనూ ఆవిడ ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడారు అనిపించింది.

పూర్ణిమ: పుస్తకం పూర్తిచేసాను మొత్తానికి. చాలా నచ్చింది. గోల్డన్ పీరియడ్‍ను విహంగ వీక్షణం చేసిన అనుభూతి కలుగుతోంది. చాన్నాళ్ళ వరకూ గుర్తుండిపోయే పుస్తకం. పెద్దాళ్ళంతా ఓపిక చేసుకొని ఇలాంటి మంచి మంచి కబుర్లు చెప్తే మనకీ కొంచెం లోటు తీర్చినవారవుతారు. కొద్దో గొప్పో మనమూ నేర్చుకోడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం. ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు గానీ ఇక్కడితో ఆపేద్దాం ఇక.

సౌమ్య: అవును. ఇప్పటి వాళ్ళు రాయడమే కాదు, ఇదివరలో వచ్చిన ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా కొంచెం సమయం గడిపి, వాటి గురించి ఇప్పటి వాళ్ళకి పరిచయం చేస్తే బాగుంటుంది. కానీ, ఈ విన్నపం వాళ్ళలో ఎంత మంది చూస్తారో..ఎంత మంది స్పందిస్తారో!!

_____________________________________________________________________
పుస్తకం వివరాలు:
నా రేడియో నా జ్ఞాపకాలు అనుభవాలు
రచయిత్రి: శారద శ్రీనివాసన్
వెల: రూ. 125
పేజీలు: 201
ప్రచురణకర్తలు: జగద పబ్లికేషన్స్
ప్రథమ ముద్రణ: జూన్ 2011

ప్రతులకు:
విశాలాంధ్ర మరియు ఇతర ప్రముఖ పుస్తకవిక్రయశాలలు
ఆన్‍లైన్ కొనుగోలుకు: ఎ.వి.కె.ఎఫ్, ఈవినింగ్ అవర్

ఈ-ప్రతులకు: కినిగె.కాం

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు On Kinige

జాలంలో సంబంధిత లింకులు:

సుజాత గారి పుస్తకం పరిచయం
మాగంటి.ఆర్గ్ లో శారద గారి ఇంటర్వ్యూ (మొదటి భాగం, రెండో భాగం)
ఈమాటలో పురూరవ నాటకం
పురూరవ నాటకం పై పుస్తకం.నెట్లో వచ్చిన పరిచయ వ్యాసం

You Might Also Like

11 Comments

  1. నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు – శారద శ్రీనివాసన్ | పుస్తకం

    […] గతంలో పుస్తకం.నెట్ లో వచ్చిన చర్చ ఇక్కడ. ఈ పుస్తకం గురించి బ్లాగుల్లో వచ్చిన […]

  2. మహిళావరణం-7 « sowmyawrites ….

    […] దాని గురించి పుస్తకం.నెట్లో చర్చ ఇక్కడ […]

  3. raju maharshi

    sambhashana dwara pustaka sameeksha chalabavundi meeku ma krutagnatalu

  4. appaji

    మాగంటి .ఆర్గ్ సైటు

    maganti.org

  5. రామ

    నాకు కలోచ్చిందో లేక నిజమో గుర్తు లేదు కాని, ఒక సారి ఈనాడు ఆదివారం లో చదివిన గుర్తు. ఆకాశవాణి పుట్టినప్పటినుంచీ ఉన్న కార్యక్రమాలు అన్నీ కంపాక్ట్ డిస్కుల్లో రికార్డు చేశారనీ, అవి (తెలుగువి) విశాఖపట్నం AIR కేంద్రంలో దొరుకుతాయి అనీ చెప్పారు. విశాఖలో ఉండేవారు ఎవరైనా ఈ విషయాన్ని కనుక్కొని ఇక్కడ చెబితే సంతోషం.

  6. mohanramprasad

    Nice contribution to Telugu literature.

  7. budugoy

    అవునండీ. సీ పీ బ్రౌన్ అకాడమీ వారిదే.
    http://www.cpbrownacademy.org/Palagummi_Viswanatham_Atmakatha_Biography.asp.

    ‘ద హిందూ’ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి ఆయనతో చేసిన దీర్ఘ సంభాషణను జీవిత చరిత్ర ఫార్మాట్లో ముద్రించారు. చిన్న పుస్తకం.
    గమ్మత్తైన విషయమేంటంటే, ఆయన పుస్తకంలో రేడియో బృందంలో ఒక ప్రేమజంట గురించి చెబుతారు. వారిని స్ఫూర్తిగ తీసుకొని ఒక పాట రాశాను అని. no offense to anyone బహుశా వీరేనేమో.

  8. Purnima

    పాలగుమ్మి విశ్వనాథం జీవిత చరిత్ర? సి.పి.బ్రౌన్ అకాడమీ వాళ్ళది చూసిన గుర్తు. అదేనా? మొన్న ఆయన వ్యాస సంకలనం ఒకటి తీసుకున్నాను. అది చాలా నచ్చింది. అందులో కూడా అక్కడక్కడా రేడియో విశేషాలున్నయి.

    పై పుస్తకం వివరాలు తెలుపగలరు.

  9. budugoy

    మీ సంభాషణ కూడా పుస్తకమ లాగే బాగుంది. నా అభిమాన రచయిత దాశరధి గురించి చెప్పిన పిట్టకథ కూడా నవ్వు తెప్పించింది. జ్ఞాపకాలు చెబుతూ ఆవిడ చేసిన పొరపాట్లు నిస్సంకోచంగా చెప్పడం బాగుంది.
    ఈ రేడియో నాటకాల గురించి చదువుతుంటే radio jikaan అనే జపనీస్ సినిమా గుర్తొచ్చింది. తప్పక చూడవలసిన సినిమా. నా రేడియో అనుభవం కేవలం బాలానందంకే పరిమితమవ్వడంతో చాలా విషయాలు రిలేట్ చేసుకోలేకపోయాను.
    ఈ మధ్యే చదివిన పాలగుమ్మి విశ్వనాథం జీవిత చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కూడా రేడియోకు సంబంధించిందే. చదవవలసిన పుస్తకం.

  10. రాజా పిడూరి

    మీ సంభాషణ బాగుంది. ధన్యవాదాలు.

    చలం గారి గురించిన ఒక మంచి ఆడియో cd కావాలంటే వివరాలు.
    స్నేహ కుటి, భీమిలి 9849635847
    శ్రీ గురుప్రసాద్ గారు , వైజాగ్ 9951033415

    ఈ ఆడియో cd లో ….పురూరవ రేడియో నాటకం (క్వాలిటీ బాగానే ఉంది), ఇంకా ఈ నాటకం గురించి శారదా శ్రీనివాసన్ గారు చెప్పిన విశేషాలే కాకుండా చలం గారు స్వయంగా పాడిన చిన్న చిన్న పాటలు ఉన్నాయి. చలం చేత ‘ చాటునుండే ఎంకిని సభకి రాజేశావ’ అన్న ఏక వాక్య లేఖ ని వ్రాయించిన రేడియో ఇంటర్వ్యూ (బాలాం త్రపు రజనీకాంతరావుగారు శంకరాభరణం సినిమా ఫేం శ్రీ గోపాల్ – బ్రో, చే, వా, రెవరు, రా? అని విరిచి పాడిన సంగీతం మాస్టారి పాత్ర వేసిన వారు – ప్రభృతుల సహాయం తో రికార్దింగ్ సామగ్రి నంతా అరుణాచలం తీసుకువచ్చి చేసినది) కూడా ఉంది. ఇది కాక పురూరవ నాటకం గురించి వీరలక్ష్మీ దేవి గారి వ్యాఖ్యానం కూడా..

  11. జంపాల చౌదరి

    బాగుంది.
    మీ ఇద్దరూ అప్పుడప్పుడూ ఇలా పబ్లిగ్గా మాట్లాడుకుంటుంటే ఇంకా బాగుండొచ్చు.
    ఆడియో ఐతే ఎలా ఉంటుందో 🙂

Leave a Reply