“జగమే మారినదీ…” పుస్తక పరిచయం

రాసినవారు: కొల్లూరి సోమశంకర్
********************
చిత్ర సకుంటుంబ సచిత్ర మాసపత్రిక జులై 2011 సంచికలో అనుబంధ నవలికగా ప్రచురితమైంది “జగమే మారినదీ…”. రచన కస్తూరి మురళీకృష్ణ.

ఈ నవల మొత్తం జగమే మారినదీ మధురముగా ఈవేళా అనే పాట చుట్టూ తిరుగుతుంది. రకరకాల సందర్భాలలో పాత్రల మానసిక స్థితినిబట్టి పాట వస్తూంటుంది. జగమే మారినదీ అనే పాటతో మొదలుపెట్టిన ఈ నవలలో మారుతున్న వాటినెన్నింటినో ప్రస్తావించారు రచయిత. అయితే అవన్నీ మధురం కాకపోవచ్చు. నేటి సమాజంలో తలెత్తుతున్న పెడధోరణులు, వికృత ధోరణుల గురించి చెప్పడమే కాకుండా వాటి మూలాలను వెతికే ప్రయత్నం చేసారు రచయిత. కాలేజి పిల్లలు, ఉపాధ్యాయులు, కాలేజి మానేజిమెంటు, కుటుంబ సభ్యుల మనస్తత్వాలను, ఇంకా టివి చానెళ్ళ ‘అతి’ని , గుంపు మనస్తత్వాన్ని చక్కగా వర్ణించారు రచయిత.

నేటి విద్యార్ధులు మార్కుల మోజులో పడి భాషని, సాహిత్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో చెబుతూ, ఫలితంగా ఎంతో చక్కని సాహిత్యానికి దూరమవుతున్నారని వాపోతారు రచయిత. ఎప్పుడైతే విద్యార్థి సాహిత్యానికి దూరమవుతాడో, అప్పుడు తనలోని సున్నితత్వాన్ని గుర్తించలేడు, తోటివారి బాధలకు స్పందించలేక మానవత్వానికి సైతం దూరమవుటాడని వివరించారు.
సాహిత్యం, సంగీతం లాంటి కళలను ఆత్మానందానికి కాకుండా, ఉన్నపళంగా ‘ఫేమస్’ అయిపోడానికి ఉపయోగించుకునే వైఖరి ఎందుకు ప్రమాదకరమో, నిజమైన కళాకారుల్లా మారితే లభించే పరమార్థం ఏమిటో చెప్పారు రచయిత. క్షణంలో మతాబులా వెలిగే బదులు, అనంత కాలం ధృవతారగా నిలవాలని రచయిత ఆశిస్తారు. మారుతున్న తరాలకనుగుణంగా మారుతున్న ఆలోచనలనూ ప్రస్తావించారు రచయిత. ఆధునిక యువతీయువకుల వ్యవహార శైలిని ఆక్షేపించినా, వారు కనపరిచే ప్రతిభను మెచ్చుకున్నారు.

హీరోలంటే తెరపై అందంగా కనపడే బొమ్మలు. రచయిత, దర్శకుడు, కొరియోగ్రాఫర్, సంగీత దర్శకుడు, గాయకుడు, ఫోటోగ్రాఫర్….. ఇలా ఎంతమందో తెరవెనుక తమదైన నైపుణ్యంతో కృషి చేస్తే వెండి తెర మీద హావభావాలను ఒలికించే రీల్ హీరోల కంటే; ఎదిగీ ఎదగని మెదళ్లను ప్రభావితం చేసి వాళ్ళ మెదళ్ళలో మంచి ఆలోచనలు నింపి వారిని సరైన మార్గంలో నడపడానికి ప్రయత్నించే ఉపాధ్యాయులు; తమ బ్రతుకు తాము సక్రమంగా బతుకుతూ ఇరుగుపొరుగుకి సాయపడేవారే రియల్ హీరోలని రచయిత అంటారు.

కొద్ది రోజుల వరకు ఉన్నతంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పతనమైపోతాడెందుకు? ఒక్కరే ఉన్నప్పుడు ఏ మాత్రం ప్రమాదకరం కాని వ్యక్తి గుంపులో జొరబడితే, ఎందుకు విధ్వంసానికి తెగబడతాడు? వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన మీడియా జరిగిన సంఘటనలకు కారణాలను అన్వేషించకుండా, ప్రతీకారపు దాడులను ప్రోత్సహించేలా ఎందుకు రెచ్చగొడుతుంది? స్త్రీపురుషుల సంబంధాలలో స్వచ్ఛత ఎందుకు దూరమవుతుంది? యుక్తాయుక్త విచక్షణ లోపించడం వలనేనా? అవుననే అంటున్నారు రచయిత. ఆలోచనలలో అందరూ ఒకటే, ఆ ఆలోచనలను అమల్లో పెట్టడంలోనే మంచి చెడు విభజన వస్తుంది.

మొదలుపెట్టిన దగ్గర నుంచి, చివరిదాక ఆపకుండా చదివిస్తుంది, ఆలోచింపజేస్తుంది ఈ 104 పేజీల నవలిక. చిత్ర మాసపత్రికలో అనుబంధంగా వచ్చిన నవల కాబట్టి దీనికి వెల లేదు. అయినా అమూల్యమే. ఇటీవలి కాలంలో వచ్చిన ఓ మంచి నవలని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

You Might Also Like

Leave a Reply