Adelaide Test – Wide Angle – Sir Sachin

జీవితంలో ఎప్పుడూ ఏడు కన్నా ముందు లేవని మీరు, చలికాలంలో తెల్లవారు ఝామున నాల్గింటికి లేచి క్రికిట్ టెస్టు మాచ్ చూసేవారైతే, సర్వకాల సర్వావస్థల్లోనూ ఇండియన్ బౌలింగ్ అంటే అనిల్ కుంబ్లే అని అనుకునేవారైతే, సచిన్ అంటే ఆరాథనపూర్వక ప్రేమ ఉంటే ఈ మూడు పుస్తకాలూ కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. కాని పక్షంలో వీటి పై నా అభిప్రాయాలు ఇవిగో:

Adelaide Test

భారత క్రికెట్‍ను ఇరవై ఏళ్ళు దీక్షగా ఫాలో అయిన అభిమానిగా, నచ్చిన టెస్టు విజయాల్లో 2001లో జరిగిన కోల్‍కత టెస్ట్ మాచ్ ముందుండాలేమో. కాని నాకు 2003 అడిలైడ్ టెస్ట్ ఎక్కువ ఇష్టం. కోల్‍కత లో జరిగిన ఒక అపూర్వ అద్భుతం, ఏదో జరిగిపోయింది అన్నట్టనిపించే రోజుల్లో, ఒక టెస్ట్ లో మళ్ళీ వెనుకబడి, మళ్ళీ ఆ ఇద్దరే మళ్ళీ అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించినందుకు. అద్భుతాలు వాటంతట అవి సంభవించవు, దాని వెనుక ఎంతో పట్టుదల, ఎంతో కఠోర పరిశ్రమ ఉంటాయని నిరూపించిన విజయం. ఈ మాచ్ ముగియగానే, స్టార్ స్పోర్ట్స్ లో గవాస్కర్‍తో మాట్లాడుతూ, “I’m drained, Sunny!” అన్న మాటలు, ద్రవిడ్ మొహంలో నీరసం, అదే సమయంలో ఆనందం: ఒకదాని కోసం పోరాడి సాధించుకున్నాక కలిగే ఆనందాతిశయాలు కలిగించే నీరసం. చివరి రెండు, మూడు వికెట్లు తీయలేక, మరో అరగంట బాటింగ్ చేయలేక చేతిలోకి రాబోతున్న విజయాన్ని భారత్ చాలా సార్లు జారవిడుచుకోవటం చూసి, చూసి ప్రాణం ఉసురోమనిపిస్తుండేది. అలాంటిది, ఊహాతీతంగా, తనను తానే ఆశ్చర్యపర్చుకుంటూ అగార్కర్ ఆరు వికెట్లు తీయడం, అద్భుతాల్లోకెళ్ళా అద్భుతం. ఆ దెబ్బతో నేను అగార్కర్‍కి అభిమానిని అయిపోయాను. (ఏకసభ్య సంఘంలే ఇది. నేనే అన్నీ!) మూడో రోజు ఆట ముగిసాక, రవిశాస్త్రి వ్యాఖ్యానం: “ఇక్కడ నుండి ఒక జట్టు నెగ్గిందంటే, మరో జట్టు చెత్తగా ఆడి మ్యాచ్‍ను పారేసుకుందని అర్థం.” ఆస్ట్రేలియన్లు ఎందుకో ముచ్చటపడి చెత్తగా బ్యాటింగ్ చేసారు. అయినా గాని, వాళ్ళవి చెత్తన్నర షాట్లు అయినా గాని, అగార్కర్ బాల్ వేయడం వల్లేగా! అంతే యువర్ హానర్! అగార్కర్ మరో ఏడు జన్మల్లో చేసిన పాపం కూడా రద్దు చేయచ్చుగాక!

ఈ మాచ్ వీడియోలు (ముక్కలు ముక్కలుగా కాదు. పూర్తిగా. కనీసం ఐదు రోజుల ఆటను పాకేజిలా పెట్టి) కోసం వెతికి వెతికి వేసారిన నేను, హిందూ ఈ-పుస్తకాల సైట్లో ఈ పుస్తకం కనిపించగానే, నా బాంకింగ్‍తో ఏవో సమస్యలున్నాయని ఫ్రెండ్ పీకల మీద కూర్చొని కొనిపించుకున్నాను.

మొన్నే జరిగిన ప్రపంచ కప్ అప్పుడు, హర్షా భోగ్లే ట్విట్టర్‍లో ఓ పెద్దాయన, “ముగ్గురు బార్‍లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టుంది గాని క్రికెట్ నిష్ణాతులు మాట్లాడుతున్నట్టు లేదు.” అని హర్షా నిర్వహిస్తున్న టాక్-షోను విమర్శించాడు. ఈ పుస్తకానికి కూడా అలాంటిదేదో పోలిక సరిపోతుంది. హిందూ పత్రిక వారిది అనగానే నా అంచనాలు అంతస్థులు దాటాయిగాని, వ్యాసాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఒకడు వచ్చాడు – ఇంత కొడుతున్నాడు – అప్పుడు వీడు ఔట్ చేసాడు – ఇన్ని పరుగులకి ఇంత వికెట్లు లా చెప్పుకుంటూ పోవటానికి ప్రత్యేకమైన పుస్తకాలు దేనికి? ఐదు రోజులూ జరిగిన మాచ్ విశేషాలు కాకుండా, ద్రవిడ్-లక్ష్మణ్-గంగూలి ఇంటర్వ్యూలు, ఆస్టేలియన్ మీడియా స్పందన, అడిలైడ్ గురించి వ్యాసం అదనంగా ఉన్నాయి. ప్రతి రెండు మూడు పేజీలకీ ఒక ఫోటో ఉంది కాని మంచి క్వాలిటి కావు.

పుస్తకాల విషయంలో వాల్యూ-ఫర్-మనీ గురించి నేను ఆలోచించను గాని, నలభై పేజీల పిడిఎఫ్‍కి తొంభై రూపాయలు వెల ఉన్నప్పుడు, అందులో ఎంతో కొంత సరుకుండాలిగా. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు నెట్లో బోలెడు చోట్ల దొరుకుతాయి. ఇంకా ఎక్కువ కూడా దొరకచ్చు. ఈ మాచ్‍ను గాని, సిరీస్‍ను గాని ఫాలో అయిన వాళ్ళు దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. ఇన్నాళ్ళ తర్వాత ఆ మాచ్‍ను రి-క్రియేట్ చేయడం అటుంచి, ఓహ్..ఏదో గెలిచారు! అన్న భావన కలిగించింది. కార్‍డస్‍ను చదివాక అసలిప్పటి క్రికెట్ సాహిత్యంపై విసుగొస్తుంది నాకైతే.

పుస్తకం మొత్తానికి నాకు నచ్చిన ఏకైక వాక్యం:

Watching Sourav Ganguly and Co. ove r five days, a Sigmund Freud might have ended up in asylum.

Such are the lines one looks for while reading or listening. If not for them, a muted TV and a collage of photos on paper would do the job. What is language for, after all? Too woo. (Alright. Not the whole truth. Still!)

Buy here.

_________________________________________________________________________

Wide Angle:

అనిల్ కుంబ్లే రిటైర్ అయిన కొన్నాళ్ళకే ఆయనది ఫోటోల పుస్తకం ఒకటి వెలువడింది. అప్పట్లో దీని వెల వేలలో ఉండేది. అయినా కుంబ్లే అనగానే కొనడానికి సిద్ధపడిపోయిన నన్ను కాళ్ళూ, చేతులూ కట్టేసి ఆపేసారు మా వాళ్ళు. ఎట్టకేలకు ఆ పుస్తకం లో-కాస్ట్-ఎడిషన్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది.

డిజిటిల్ అన్న పదం కూడా ప్రాచుర్యం పొందని రోజుల్లో కూడా, డ్రెస్సింగ్ రూంలో మెళ్ళో కెమరాతో కనిపించే కళ్ళద్దాల అబ్బాయి, ఆ తర్వాత కాలంలో తరతమ భేదాల్లేకుండా ఏ పిచ్‍ మీదైనా బౌలింగ్ చేసి భారత ఆశలను నిలిపిన కుంబ్లే తీసిన చిత్రాల విచిత్రాలను చూడాలని కుతూహలం తీరింది. ఇందులో టీం ఫొటోలు, ఫామిలీ, టూరిజం, చిన్నప్పటి ఫోటోలు చాలా ఉన్నాయి. అన్నింటికన్నా హైలైట్ సచిన్ గబ్బర్ సింగ్ వేషంలో ఉన్న ఫోటో. (దీన్ని సచిన్ – జీనియస్ అన్‍ప్లగ్డ్ లో కూడా వాడుకున్నారు.) టీం బిల్డింగ్ ఆక్టివిటీస్‍లో భాగంగా మనవాళ్ళు వేసే చిత్రవిచిత్ర బాలివుడ్ సినిమా వేషాలను చక్కగా బంధించారు. వీళ్ళు తిరిగే ఊళ్ళూ, చేసుకున్న పండుగలూ, గడిపిన క్షణాలను ఫోటోల రూపంలో చూడచ్చు. అలాగే కుంబ్లే ఫామిలీ ఫొటోలు. వీటిలో సౌరవ్ కుంబ్లే కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీయించుకున్న ఫోటో నాకు చాలా నచ్చింది. (అవును. నేను గంగూలీ ఫాన్.) పుస్తకం మొత్తానికే హైలైట్, మైసూరు వాళ్ళనుకుంట కుంబ్లే-ద్రావిడ్ కు సన్మానం చేసినప్పటి ఫొటో. ’తేజోమూర్తులు’ అన్న తెలుగుపదం ఉందా? దానికి అర్థం చెప్పగల ఫొటో. భలే ఉంది. ముఖ్యంగా తలపాగాలు.

ఇట్లాంటి పుస్తకాలు, మనకి చాలా సన్నిహితులతో కల్సి ఫామిలీ ఆల్బమ్‍ను చూస్తూ ఆనందించినట్టు ఆనందించాలి. అప్పుడు చాలా బాగుంటుంది.

 

_______________________________________________________________________

Sir Sachin

ఒక పుస్తకం గురించి రాస్తే ఇంకో పుస్తకం గురించి తెలుస్తుంది. Sachin – Genius Unplugged గురించి రాస్తే, ఇదో పుస్తకం వచ్చిందని చెప్పారు. అందుకని, వెతగ్గా వెతగ్గా ఒకానొక మాగ్‍జైన్ షాపులో దొరికింది. కొంచెం నలిగి, దుమ్ము పట్టి. అయినా కొన్నాను. కొన్నా దాన్ని ఊరికే ఉండక మూకుమ్మడి ఆటో (షేర్ ఆటో)లో కూర్చొని చదవటం మొదలెట్టాను. నా పక్కగా ఎవరో అబ్బాయి రానూ, పుస్తకం చూడనూ, ఎక్కడ దొరికిందో అడగనూ, పారిపోనూ. (కొనుక్కోడానికి.) ఆటో వాడు నన్ను అంటాడు, అందరూ వెళ్ళిపోతుంటే! నేనేం చెయ్యను?

ఇది ఔట్‍లుక్ వాళ్ళ పుస్తకం. వ్యాసాలూ, ఫోటోలూ చాలా బాగున్నాయి. అసలు ముఖచిత్రమే నాకు విపరీతంగా నచ్చేసింది. Genius is 1% inspiration and 99% perspiration అన్న మాట గుర్తొచ్చేలా ఉంది. ఇహ, ఎంత మంది ఎన్ని పదాలు వాడినా సచిన్ చేసే మాయాజాలంలో ఒక్కవంతు కూడా పట్టుకోలేరుగా, మాటల్లో. సచిన్‍ను పొగడ్తలతో ముంచెత్తటమొక్కటే కాక, సచిన్‍లో విభిన్న కోణాలను చూపిస్తూ, సచిన్ ఎందుకంత గొప్పవాడో చెప్పిన వ్యాసాలు బాగున్నాయి.

మిలిన్ కుందేరా నవల ఒకదానిలో మనిషి పుట్టక ముందు నుండే (అమ్మ కడుపులో ఉండగా స్కానింగ్) కెమరాను తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మనమెప్పుడూ ఒక కెమరా మనల్ని చూస్తున్నట్టే బతుకుతున్నాం. అవి మన జీవితాలు అని అభిప్రాయపడతారు. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా ఇరవై ఏళ్ళకు పైగా వంద కోట్ల మంది ప్రజల కెమరా కళ్ళ మధ్య జీవితాన్ని గడుపుతూ, ఖ్యాతిని ఘడిస్తూ కూడా ’మనిషి’లా వ్యవహరించే ఈ మనిషిని, దేవుడని అందుకే అంటారు; ఇంకా మనిషిగా, మంచి మనిషిగా మిగిలున్నందుకు.

All essays are available online here.

You Might Also Like

One Comment

  1. సూరంపూడి పవన్ సంతోష్

    ముందు రాసినదెవరో చూడలేదు. చదువుతున్నప్పుడు మాత్రం అనుకుంటూ చదివా పూర్ణిమ తప్ప ఎవరూ ఇలా రాయలేరని, im right.

Leave a Reply