పణవిపణి – తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం; నళినీకుమార్ కవిత్వం

ఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో నళినీకుమార్‌ది ఒక విచిత్రమైన ప్రత్యేక స్థానం. ఆయన కవి. కానీ ఆయనను చాలాకాలంగా సాహితీప్రియులు గుర్తుపెట్టుకొంటున్నది మాత్రం ఒక పుస్తకాన్ని ప్రచురించినందుకు. మహాప్రస్థానం గేయాలన్నీ ముందే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చినా, 1950 వరకూ మహాప్రస్థానం పుస్తకంగా వెలువడలేదు. ఎట్టకేలకు 1950లో “నళినీకుమార్ అనే మహానుభావుడి పూనికతో మహాప్రస్థానం పుస్తకరూపం సంతరించుకొంది”. రావ్ & రావ్ అనే సంస్థ పేర, మద్రాసు బి.ఎన్.కె ప్రెస్సులో, రాయల్ డెమ్మీ సైజులో, అందమైన తీరులో, రెండు వేల కాపీలు అచ్చు వేయించి, మూడున్నర రూపాయలకు పుస్తకాలని విక్రయించారు. ఆ రోజుల్లో అది ఎక్కువ ధరే. నళినీకుమార్ శ్రీశ్రీకిచ్చిన మూడువేల రూపాయల పారితోషికమూ అప్పుడు చాలా పెద్ద మొత్తమే.

పుస్తకప్రచురణ నళినీకుమార్ వృత్తి కాదు. ప్రవృత్తిరీత్యా అతనూ కవే. 1957 జూన్‌లో నళీనీకుమార్ రాసిన పణవిపణి అనే గేయకావ్యం క్రౌన్ సైజులో పూర్తి ఆర్టుపేపర్‌పైన కాలికోబైండుతో ప్రచురితమయ్యింది. సోమసుందర్ లెక్క ప్రకారం, పణవిపణి గేయచ్ఛందస్సులో తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం. ప్రతులన్నీ మిత్రులకూ, అభిమానులకూ అందినా పణవిపణి మాత్రం విపణివీధికి చేరలేదట. కాలక్రమేణా మరుగున పడ్డ ఈ కావ్యాన్ని ఇన్నాళ్ళ తర్వాత అభ్యుదయ రచయితల సంఘం పునర్ముద్రించింది.

పణవిపణి మాత్రాఛందస్సులో వ్రాసిన కావ్యం. పాదానికి ఆరుమాత్రల గణాలు రెండు. పద్యానికి నాలుగు పాదాలు. రెండేసి పాదాలకు యతిప్రాసలు పాటిస్తూ ఉత్తమపురుషలో చెప్పుతూ ఏక ఛందస్సులో వ్రాసిన కావ్యం. ఒక భావుకుని అంతర్మథనం కథాంశం. కృత్యాది ఐదు చిన్న భాగాలు (ప్రాతిపదిక, ప్రణతి, అంజలి, సమర్పణ, ప్రస్తావన), తొమ్మిది ఆశ్వాసాలతో (ఆటకట్టు, చదువు సంధ్యలు, గురితప్పిన బాణం, సరిపడని సంగతులు, తప్పొప్పులు, యాచుహషీ, అపశృతి, కొసరు లేని బేరం, చైతన్యం) 475 పద్యాల కావ్యం. రచయిత కథానాయకుడి మాటల్లో తన తాత్విక దృక్పథాన్ని సరళంగా సోదాహరణంగా వివరిస్తారు.

     ఈ యనంతవిశ్వము రమ
ణీయమ్మగు పణవిపణి –
అహోరాత్రమ్ముల్ మెఱసెడి
యాశాజ్యోతుల బరణి!          (443)

అనే పద్యం పుస్తకం ముందుపుటలోనూ, ఎనిమిదో ఆశ్వాసంలోనూ కనిపిస్తుంది. (పణవిపణి అంటే జూదశాల, casino).

ఈ కవి ఛందస్సులో రాయటానికి అతని అభిరుచి కారణం.
     అందమ్ముల బంధమ్మే
ఛందమ్మని నేనందును;
పంచవర్ణముల చిలుకకుఁ
బంజర మేదైన నేమి?      (ప్రస్తావన)

తన పుస్తకం పైన ప్రేమే కాదు, నమ్మకం కూడాను. తన కవితాపుత్రికను అంకితమిస్తూ గర్వంగా చెప్పుకొన్న మాటలు:
తన పిల్లలఁ జూచి కాకి
తన్మయ కావచ్చు గాని
లక్షలలో నెన్నఁ దగిన
లక్ష్మి సుమీ నా బిడ్డ!    
(సమర్పణ)

ఈ పుస్తకం లక్ష్యాన్ని వివరిస్తూ నళినీకుమార్ ప్రస్తావనలో చెప్పుకున్న మాటలు

     ఈ పాటలు లోకమ్మును
గాపాడుటకా? కాదు;
కష్టజీవులకు సౌఖ్యము
కల్పించుటకా? కాదు.     (ప్రస్తావన)

మరెందుకు వ్రాసినట్లు?

     ప్రకృతిలోని వైచిత్రికి
బారవశ్యమందిన నా
కన్నుల విరిసిన వెన్నెల
వన్నెలు సుమి యీ పాటలు. (ప్రస్తావన)

జీవితం గురించి రచయిత దృక్పథం:

     …
తన చుట్టును దాఁ దిరుగుచు
దపనుని జుట్టును భూమి

     ఎంతముందు కేఁగినను
నంతులేని పయనమ్మిది –
వెలుఁగుపుంత దారులలోఁ
దులలేనిది తుదిమజిలీ!           
(ప్రస్తావన)

మొదటి ఆశ్వాసం ఆటపట్టులో కథానాయకుడు జీవితాన్ని జూదపు ఆటగా గుర్తిస్తాడు.

     కపట ద్యూతము జీవిత
కార్యకలాప మ్మంతయు –
ఆడెను నిషధుఁడు, ధర్మజుఁ
డాడెను, నేనాఁడితిని.               (23)

ఈ ఆటలో తప్పుటెత్తులు ఒక్కరివల్ల పడవు. తారని అందరూ తప్పు పట్టినా, ఆ తప్పుకు కారణాలు బృహస్పతి తారా చంద్రులని ఒక్కచోట విడచి దేవలోకం వెళ్ళటంతో మొదలయ్యాయి. తప్పులు ఒక్కరివల్లే జరుగవు.

     ఏ తప్పున కైన నిట్లె
యెంద ఱెందఱో బాధ్యులు;
చెడు గంతయు నే యొకరికొ
చెందినదని యెంచరాదు          (53)

 

     ‘ఆటకట్టు’ సమయమ్ముల
నంతకుమును తా మెత్తిన
యెత్తుల నొకపరి యెంచుట
యేరి కైన సహజమ్మే!            (59)

అనుకొని తన జీవితకథను ఒకసారి సింహావలోకనం చేయబోతాడు కవి.
తనకు వయసు మీరాక పుట్టిన కథానాయకుణ్ణి అలారుముద్దుగా పెంచి, మంచి బుద్ధులు నేర్పించిన తండ్రి హఠాత్తుగా మరణించాడు.

     చదువు పూర్తికాలేదు
నదికి నీరు రాలేదు,
మరణించెను నా జనకుఁడు
చెరిగిపోయె నా బాల్యము.       (83)

మంచి కవిత్వం రాస్తూ జీవనాన్ని గడపాలని ఆశించిన కవికి తన తండ్రి మరణం వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి.

     ఆఁకటితో నల్లాడుచు
నందమ్ముల వెలిపుచ్చిన
కళాకారు లున్నారని
గ్రంథమ్ములఁ జూచితిని.         (122)

కానీ అంత నిబ్బరము ఇతని వల్ల కాలేదు. ఈలోపు పక్కవాళ్ళు పూనుకొని అతని పెళ్ళి జరిపించారు. భార్య అతని ఆశలకు సరి తూగినది కాదు, అయినా…

     అన్నమునకుఁ దగిన కూర
యందఱకును బ్రాప్తింపదు –
అంతమాత్రమున నిరశన
మవలంబించునదెవ్వరు?         (167)

ఐనా, జీవితంలో పరిపూర్ణతకు తావే లేదు.

     పూయని పూవులకేగా
మాయని గుణరూపమ్ములు –
పూసినదో – మాసినదో
వ్రాసిన దాతీరుగ విధి.            (208)

‘కగోత్సురుబె –శాటో నో ఎయిజామే’ (Kagotsurube Sato no Eizame) అనే విషాదాంత కబూకీ నాటకం చూశాడు కథానాయకుడు. ఆ నాటకంలో యాచుహషీ అనే వేశ్య తనను గాఢంగా ప్రేమిస్తున్న ఇద్దరి మధ్య చిక్కుకుని చివరకు తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది. నాటకం చూసి చలించిన కథానాయకుడు, ఆడువారిని చెడ్డవారిగా చూపించే కథలు అనేకాలు ఉన్నప్పటికీ, స్త్రీద్వేషం తగదు అనుకొంటాడు.

     ఇతిహాసమ్ము లన్నిటను
బ్రతికూలపు సాక్ష్యములని
చెలియలఁ గాదనువారికి
జీవితమొక శూన్యమ్ము.       (308)

ఆడువారిని అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టపడితే సుఖజీవనం సాధించవచ్చని ఈతని భావన.

     లోకమ్మను గ్రంథమ్మును
సాకల్యముగఁ జదివినఁ
గ్లిష్టపదా లెన్నైనను
గష్టతరా లనిపింపవు.          (341)

కథానాయకుని మససులో ఒక నిర్వేదం నెలకొన్నది. తాను ఏమీ సాధించకుండా నిరర్థకంగా జీవిస్తున్నానని బాధ పడటం మొదలుబెట్టాడు.

     నేనే కనుమూసినచో
నిద్రాణము కాదు జగమ్ము
ఏ లోటును గనిపింపదు
ఏ చేటును వినిపింపదు!     (366)

ఆత్మహత్య చేసుకొని తన జీవనాన్ని అంతం చేసుకోదలచిన కథానాయకుడు తన ఆలోచనలను ఒక స్నేహితునితో పంచుకొంటాడు. జీవితం పణవిపణే ఐనా –

     ఓడిన కొలఁదియుఁ దమితో
నొడ్డెడి వారున్నారు –
గెలుచుకొలఁదిఁ బొంగుచు సాఁ
గించెడి వారున్నారు!                (444)

అని గుర్తు చేస్తాడు స్నేహితుడు. దీర్ఘంగా ఆలోచించిన కథానాయకుడు తనలో ఉన్న నిస్థబ్ధత శాశ్వతం కాదని గుర్తిస్తాడు. అవకాశపు పిలుపు గుర్తించి దాన్నందుకోవటానికి నవచైతన్యంతో –

      శతసహస్ర తురగమ్ముల
శక్తి వచ్చె – నన్నెవ్వా
రడ్డెడివా రాపెడివా
రొడ్డెద నిదె పందెమ్ము.         (474)

అంటూ లేస్తాడు.

కథానాయకుడు చివరికి గుర్తించిన సత్యం – జీవితం పణవిపణే ఐనా,
     నిన్నటి రేపటుల మధ్యన
నేఁడొక కట్టని వంతెన –
దాఁటుదాక తహతహలే!
దాఁటుట మటుకు తథ్యము!      (475)

ఈ పుస్తకానికి కవి పలికిన భరతవాక్యమిదే.

ఈ పుస్తకం హాయిగా చదువుకోవడానికి మాత్రా ఛందస్సు దోహదం చేస్తుంది. కథానాయకుడు తనతో తాను చేసుకొనే తాత్విక చర్చ, ఎన్నో పిట్టకథలతో, రకరకాల సూచనలతో (రిఫరెన్సులతో) నిండి ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు నానుడులూ, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత కావ్యాలలో, పురాణాలలో ప్రసిద్ధ విషయాల ప్రస్తావన ఈ పద్యాలను పరిపుష్టం చేస్తాయి. అక్కడక్కడా మాటలతో ఆడుకున్న ఆటలు, పాత విషయాల రిఫరెన్సులు, కథానాయకుడి అంతర్మథనం మనల్ని ఠక్కుమని ఆపి ఆలోచింపజేస్తాయి. అక్కడక్కడా యతి ప్రాసలు సరిపడలేదని నాకనిపించినా, విద్వాన్ విశ్వం, కోవెల సంపత్కుమారాచార్య వంటివారికి అభ్యంతరం కనపడలేదంటే, ఇది మాత్రా ఛందస్సుల వాడకం గురించి నా అజ్ఙానమే అయివుండవచ్చు.

ఈ పుస్తకం మొదటి ముద్రణకు ముందు మాట అబ్బూరి రామకృష్ణారావుగారు వ్రాశారు. అప్పుడు ఆంధ్రప్రభలో విద్వాన్ విశ్వం విపులంగా సమీక్షించారు. ఈ రెండు వ్యాసాలకు తోడు 2006లో ఆంధ్రజ్యోతి దినపత్రిక వివిధ శీర్షికలో పణవిపణి గురించీ నళినీకుమార్ గురించీ కె.కె.రామానుజాచార్యులు, కోవెల సంపత్కుమారాచార్య వ్రాసిన వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో చేర్చారు. అరసం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, (నా చిరకాలమిత్రుడు) చెరుకూరి సత్యనారాయణ వివిధ సందర్భాలలో నళినీకుమార్ గురించి వ్రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. వీటికితోడు, మహాప్రస్థానం తొలి ప్రచురణ ముఖచిత్రం ప్రతిరూపం (ఫ్యాసిమిలీ), శ్రీశ్రీ రాతల్లో నళినీకుమార్ ప్రస్తావనలు కూడా ఉన్నాయి. (ఈ పుస్తకంలో చెప్పని విషయం: శ్రీశ్రీ ఆత్మకథ అనంతంలోమహాప్రస్థానం ప్రచురణ గురించి చెప్పినప్పుడు చిత్రంగా నళినీకుమార్ పేరు చెప్పకుండా ఒక మిత్రుడు అని మాత్రం అంటాడు. గుంటూర్లో శిష్ట్లా ఉమామహేశ్వరరావుతో జరిగిన ఒక సంఘటనగురించి వివరిస్తూ  నళిని స్కాచ్ తాగిస్తానంటే కాదని ఉమ్మయ్య దగ్గరకొస్తే నాటు సారా ఇచ్చాడు అన్నప్పుడు మాత్రమే అనంతంలో నళినీకుమార్ ప్రస్తావన కనిపిస్తుంది). ఈ పుస్తకం వెనుక అట్టపై పణవిపణిపై శ్రీశ్రీ అభిప్రాయం ప్రచురించారు.

వీరిచ్చిన వివరాల ప్రకారం, నళినీకుమార్ అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ. 1918లో కాకినాడ దగ్గర్లో ఉన్న అరట్లకట్ట గ్రామంలో జన్మించారు. విజయనగరంలో బి.ఏ. చదువుతున్నప్పుడు కవిత్వం వ్రాయడం, నాటకాల్లో వేయటం, విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనటం ప్రారంభించారు. అప్పుడే తనపేరును నళినీ రంజన్ కుమార్ అని మార్చుకున్నారు. నళినీకుమార్ స్థిరపడింది. నళిని అనే సాహిత్య మాసపత్రిక రెండు సంచికలు తెచ్చారు. పొగాకు, ఖనిజాల వ్యాపారంలోనూ, విదేశాలకు ఎగుమతి దిగుమతి వ్యాపారాలలోనూ ఇతరులతో కలసి పనిచేస్తూ, దేశవిదేశాలు తిరిగివచ్చారు. 1968లో, తన యాభయ్యవ యేట, గుండెపోటుతో అకస్మాత్తుగా గుంటూర్లో మరణించారు.

నళినీకుమార్ వ్రాసినవి మరో రెండు చిన్నపుస్తకాలు ఉన్నాయట. ఇప్పుడు అలభ్యం.

ఈ పుస్తకాన్ని చాలా అందంగా, శ్రద్ధగా పునర్ముద్రించారు (శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ). మొదటి ముద్రణలో ముఖచిత్రానికి ఎంచుకున్న ప్రణాళికనే ఈ ముద్రణకూ ఎన్నుకోవటం బాగుంది (మొదటిముద్రణ అట్ట ప్రతిరూపం లోపల ఇచ్చారు). గిరిధర్ వేసిన నళినీకుమార్ చిత్రం బాగుంది. అచ్చుతప్పులు బహుతక్కువగా ఉన్నాయి.

ఈ పుస్తకం చదవడం నాకు చాలా ఆనందం కలిగించింది. చాలాచోట్ల రచయిత భలే చెప్పాడే, భలే వ్రాశాడే, భలే ప్రయోగాలు చేశాడే అనుకొంటూ చదువుకున్నాను. మరుగునపడ్డ ఈ పుస్తకాన్ని బయటకు తేవటానికి కారణమైనవా రందరికీ నా నా కృతజ్ఞతలు.

పణవిపణి -గేయకావ్యము
మొదటి ముద్రణ 1957 జూన్
రెండవ ముద్రణ 2010 డిశంబర్
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం
ప్రతులకు:
పెనుగొండ లక్ష్మీనారాయణ
అధ్యక్షులు, ఆం.ప్ర.అరసం
4-15-122/8, అభ్యుదయ
9వ లేన్, భరత్ పేట
అమరావతి రోడ్, గుంటూర్ 522 002
ఫోన్: 94402 48778
151 పేజీలు; 100 రూ.

**************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors)కు అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

**************************

You Might Also Like

4 Comments

  1. రాజేంద్రకుమార్ దేవరపల్లి

    ఈ పుస్తకం గురించి ఆసక్తికరమైన సమాచారం చాసో మాటల్లో ఇక్కడ…
    http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=38501#

  2. కొత్తపాళీ

    ఆసక్తికరంగా ఉన్నది. తెప్పించుకుంటాను.

  3. K.Chandrahas

    కవిత్వం అంటే పెద్దగా పరిచయం లేదు నాకు. మీరు ‘పణ విపణి ‘ గురించి రాసింది చదివాక, ఏదో కొత్త ప్రపంచంలో నడుస్తున్న భావన కలిగింది. ఈ సాయంత్రమే విశాలాంధ్ర shop కు వెళ్ళి పుస్తకం కొన్నాను. ఇంకా చదవడం పూర్తవలేదు,అస్వాదిస్తున్నాను కాబట్టి. కావ్యంలోని compression, depth, ease, లాలిత్యం మామూలు కవులకు చేతకాదు.

    మీ పరిచయం వల్లే అంత మంచి కవిగురించి తెలిసింది; అంత మంచి కావ్యాన్ని చదువుతున్నాను. Many thanks.

    1. Jampala Chowdary

      చంద్రహాస్‌గారూ:
      పణవిపణి మీకూ నచ్చడం సంతోషం.
      కవిత్వం గురించి నేనూ ఎక్కువగా మాట్లాడను, నచ్చితే నచ్చింది అని చెప్పడం తప్పించి. పణవిపణి చదవడం నాకు ఆనందాన్ని కలిగింపజేసింది. పుస్తకం మొదటి ఆశ్వాసం పూర్తి చేసేటప్పటికే ఈ పుస్తకం అందరికీ పరిచయం చేయవలసిన పుస్తకం అని బలంగా అనిపించింది. నళినీకుమార్ ప్రతిభావంతుడైన కవి అని అనిపించింది.

Leave a Reply