“ముక్కోతి కొమ్మచ్చి” ఇప్పుడు మార్కెట్లో…
ఈ నాటి బ్రేకింగ్ న్యూస్: రమణగారి యనభైవ జయంతి సందర్భంగా మార్కెట్లో విడుదలవ్వబోయిన “ముక్కోతి కొమ్మచ్చి” ఎట్టకేలకు (ఓ వారం, పది రోజుల జాప్యంతో) మార్కెట్టులో అందుబాటులో ఉంది. తక్షణమే మీ మీ కాపీలను సొంతం చేసుకోండి.
’పుస్తకం ఎలా ఉంది?’ వేడన్నంలో కొత్తావకాయ వేసి అమ్మ కలిపి పెట్టే గోరు ముద్దులా ఉంది. ఎంత ఘాటుకు ఎంత కమ్మదనం కలపాలో, ఎంతటి వినయానికి ఎంతటి పొగరు జతచేయాలో, ఏ నీతికి ఏ లోకరీతి సరిజూపాలో అంత బా తెల్సిన చేయి మరోటుందా? అందుకని గుప్పెట్లో పట్టేంత ముద్ద అయినా, దాన్ని ఆస్వాదించి, జీర్ణించుకునే సత్తా ఉంటే ఓ జీవితకాలపు ధైర్యాన్ని ఇచ్చే దివ్యౌషధం అది. గోరంత దీపమే అయినా చీకట్లనూ పారద్రోలే అఖండ జ్యోతి. షరా మామూలుగా ఇందులోనూ బోలెడు కోతి కొమ్మచ్చాట ఉంది. షరన్నర మామూలుగా, అవి తన గురించి, తన గొప్పదనాన్ని గురించి కాక, తనతో పాటు అల్లుకుపోయిన అందరి కథలూ! ఫక్కున నవ్వించే జోకులు. ’ఔరా!’ అనిపించే విశిష్ట వ్యక్తిత్వాలు. నిట్టూర్చేలా చేసే నిజాలు. చమత్కారాల మాటున నూరిన కారాలు. సవినయ పొగరు. సంతోషాలను సాగించుకున్న తీరు. బాధలను సాధించిన వైనం. అచ్చు రమణలానే, బాపూ జంటగా, ఎప్పటిలానే..
రానున్న తరాలకు విశిష్ట ’కానుక’ ఈ ఆత్మకథ! రాసినవారికి, రాయించినవారికి శతకోటి దండాలు. వారం వారం వాయ తీయగానే వేడి వేడిగా లాగించేయడం ఈ తరం వారికి లభించిన అదృష్టం.
(బాపూరమణీయం మూడో భాగం)
ముళ్ళపూడి వెంకటరమణ
వెల: 100/-
హాసం ప్రచురణలు
E101, Satyanarayana Enclave,
Madinaguda, Hyderabad 500049
Ph: 040-23047638
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌస్.
సౌమ్య
నేను ఇంకో ఏడాది ఎక్కువ పడిగాపులు పడి చదివాను.
మొదటి రెండు భాగాల్లాగే నాకు ఈ భాగం కూడా బాగా నచ్చింది.
అలా కొమ్మ కొమ్మకీ ఎగురుకు వెళ్ళిపోయే కథనం – బహుశా అందరి “టీ కప్పు” కాదేమో…కానీ, నా టీ-కాఫీ కప్పు కూడా అదే కావడం వల్ల, మూడు భాగాలనూ బాగా ఆస్వాదించగలిగాను అనుకుంటున్నా.
krsna
నేను ఈ వ్యాసాలు ఆసాంతం చదివాను. పైన చెప్పినట్టుగా వేడన్నంలో కొత్తావకాయ నెయ్యి తో తిన్నట్టే కాదు అప్పుడే పొదుగు దగ్గర తీసిన పాలంత గోర్వెచ్చగా, కమ్మనైన తెలుగుదనం దిట్టంగా దట్టించిన అలనాటి జీవన రీతులు బతుకు చిత్రాలు కూడా మన మనసుని స్పృశిస్తాయి. మరో అచ్చు తెలుగు పుస్తకం ఇలా ఇంకెప్పటికి రాదంటే అతిశయోక్తి లేదు.
-krsna
Srinivas Nagulapalli
బాపూ బొమ్మ సహితంగా చదివింపజేసే పుస్తక పరిచయం బాగుంది.
సినిమా చూడకపోయినా ’చెప్పకపోతే పొగరంటారు. చెప్తే తెలివంటారు. నన్నేం చేయమంటారు”
అన్నది మంచి ప్రశ్న. జవాబు చేయమనడమే! అంటే? అదే, చెప్పడం, చెప్పకపోవడం కాదు, చేతలతో చెప్పడం. Why? Because deeds speak louder than words. And clearer too:-)
======
విధేయుడు
_శ్రీనివాస్
Purnima
@critic:
Glad you commented! I liked your comment. (if that helps.)
రాజేంద్ర కుమార్‍గారు వ్యాఖ్య రాయకున్నా ఆ వాక్యాన్ని తొలగించేదాన్ని. పుస్తకం చదివీ చదవగానే ఇది రాసాను. రాసి రాయంగానే పబ్లిష్ చేసాను. కొన్ని గంటలకు కొంత భాగాన్ని తీసివేసాను. ఈ వాక్యాన్ని సవరించేలోపు నాకు నెట్ సమస్యలు వచ్చాయి. నేను మళ్ళీ తిరిగి వచ్చే లోఫు ఈ వ్యాఖ్య ఉంది. ఆయన అభ్యంతరం పెట్టటం కాక నన్నేవో ప్రశ్నలు కూడా అడిగారు. వాటికి సమాధానాలు ఇచ్చే ఉద్దేశ్యం నాకు లేవనే చెప్పడానికే స్పందించాను.
ఆ వాక్యంతో సమస్యమేమిటంటే, దాన్ని subjectiveగా ధ్వనింపజేయలేకపోవటం. అదే నేను, “పుస్తకం ఎలా ఉందో చెప్పటం నా మటుకు నాకు మూర్ఖత్వంగా తోస్తుంది.” అని రాసుంటే, “ఆయ్.. పుస్తకం ఎలా ఉందో చెప్పటం మూర్ఖత్వం ఎలా అవుతుంది? చెప్తావా? లేదా?” అన్న వ్యాఖ్య వచ్చేదా? అనుమానమే!
అది పక్కకు పెట్టినా, రాజేంద్ర గారి అభ్యంతరంతో నాకు అభ్యంతరాలున్నాయి. ఒక పుస్తకాభిమాని ఎలా ప్రతిస్పందించాలో చెప్పే రూల్స్ ఎక్కడున్నాయి? సగటు సినిమాభిమానిలా మాట్లాడకూడదంటే? ’కుమ్మేసాడు’, ’ఫలనా వాడు కెవ్వ్వ్వ్’ లాంటివి పుస్తకాలకీ, రచయితలకీ అనకూడదా? అలా అయితే, చలం రచనలు నాకు నచ్చవని ఒక ఫోరంలో రాసినప్పుడు, ‘you’re doomed’ అన్న స్పందనని ఏమనాలి? ఒక్క చలాన్ని చదవకపోతే నేను నాశనమవుతానా? రాజేంద్ర కుమార్‍గారు చెప్పినట్టు అభిమానులు నడుచుకునే యుటోపియన్ ప్రపంచానికి నన్ను తీసుకెళ్తే, లెంపలేసుకొని ఊరుకునేదాన్ని. ఇక్కడ కాబట్టి నాకు పస కనిపించలేదు.
వ్యాఖ్య వచ్చినా, రాకున్న సవరించే ఉద్దేశ్యం నాకుందని చెప్పానుగా. అంతే! ఆయన ఇచ్చిన కారణాల వల్ల కాదు. క్షమాపణలా? “ఛ! ఇప్పుడు నేను పుస్తకం ఎలా ఉందని అడిగితే, మూర్ఖుణ్ణి అయ్యిపోతాను.’ అన్న క్షణకాల అభద్రతను కలిగించినందుకు. 🙂
పుస్తకం.నెట్‍ని సామాన్య పాఠకునికి వేదికగానే చూసాము, ముందునుండి. అక్కడికీ మొదలెట్టేటప్పుడు అన్నారు కొందరు, “సినిమాల్లా రాసినట్టు పుస్తకాల గురించే రాస్తే ఒప్పుకోరు” అని. ఎప్పటికప్పుడు మాకీ సమస్య ఎదురవుతూనే ఉంది. పుస్తకం గురించి మాట్లాడేడప్పుడల్లా చేతులు కట్టుకొని, పంతులకు పాఠాలు అప్పజెప్పినట్టుండాలనే ఆశిస్తున్నారు. అప్పుడోసారి జరిగిన గొడవలో ఒక అనామకుడు, “వాళ్ళకి సమీక్షలంటే తెలీదు. అందుకే పాపం, అభిప్రాయాలూ, అనుభవాలూ అని ఏవో పెట్టుకున్నారు!” అని వ్యాఖ్యానించారు. కాదండయ్యా! సమీక్షంటే ఏమిటో, అదెట్లా ఉంటుందో మాకు తెల్సు. కాని అలాంటి సమీక్షల కోసం కాదు మా ఉద్దేశ్యం. ఈనాటికీ షేక్స్ పియర్ గురించి సమీక్షలు రావచ్చు. కాదనటం లేదు! కాని నూటిలో తొంభై తొమ్మిది పాఠకులు షేక్స్-పియర్ గ్రాంధికం భరించలేక ఒగ్గేసేవారే. కాదనగలరా?
>> ‘అనువు కాని చోటు’ అని తెలిసి కూడా ఆ చోటులో ఏదో రాసేసి పస ఉన్న, పస లేని వ్యాఖ్యలకు అవకాశమివ్వటం, వాటిపై స్పందించటం మాత్రం ఎందుకూ?
ఏదేదో రాసేసి తప్పించుకొనిపోవడానికి నాకు (మీకున్నన్ని – అని అనుకుంటున్నాను) వెసులుబాటులు లేవండి. (మారు పేర్లు, పనిచేయని ఈమెయిళ్ళూ) ఏది రాసినా, ఒళ్ళు దగ్గరబెట్టుకొని రాయాలి. ఎప్పుడైనా తడబడితే.. చూస్తున్నారుగా, ఏమవుతుందో!
పస లేదని నాకనిపించింది. అందరికీ అనిపించాలని లేదుగా. ఆ వ్యాఖ్యను నిరాకరించి, వాక్యాన్ని సవరించి బోలెడు సమయం ఆదా చేసుకోవచ్చు. అప్పుడు, మీకు ’క్రిటిక్’ అవతారం దాల్చే అవకాశం ఏది? 🙂 ఒక సైటు మోడరేటర్లు తమ స్వాభిప్రాయలకన్నా తమ భాధ్యతను నిర్వర్తించడం ముఖ్యం అని తెలీని క్రిటిక్ మీరు? రాజేంద్ర గారి వ్యాఖ్యలో నాకు నచ్చని విషయాలుండచ్చు గాని, నలుగురిలోకి రాకూడని వ్యాఖ్య లక్షణాలేవీ లేవుగా. మరి? ఆకాడికేదో, నాకు నచ్చనవేవీ పుస్తకంలో ఉండనట్టు.. టూ మచ్ ఇది!
స్పందించటం ఎందుకూ? If only I can sue my network provider for that long service interruption. 🙂
And let me remind you, every single time I write for pustakam.net, I know I’m not writing in my blog. My best efforts have been to adjust to the readers of this site. And yes, I wouldn’t have changed the sentence under scanner had it been on my blog!
సరే! నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేసాను. మీరో, మరెవరో ఎన్ని అడిగినా, ఇందులో ఎన్ని లొసుగులు వెతికినా, స్పందించటానికి నేనుండబోను. త్రివిక్రమ్ డైలాగ్‍తో ముగించెద: ’చెప్పకపోతే పొగరంటారు. చెప్తే తెలివంటారు. నన్నేం చేయమంటారు” (అని నేను అడగను. పొగరుకే నా ఓటు.)
critic
@ పూర్ణిమ: ’పుస్తకం ఎలా ఉంది?’ అని అడిగే మూర్ఖత్వం ఎవ్వరూ చేయబోరనే అనుకుంటాను… ఈ వాక్యాన్ని మీరు సవరించింది రాజేంద్రకుమార్ గారి అభ్యంతరం చూశాకే కదా? ‘కేవలం, పుస్తకం.నెట్ నా అభిప్రాయాలకు సరైన వేదిక కాదని గుర్తెరిగి సవరించాను’ అన్నారు. ఆ గుర్తెరగటం ఆయన వ్యాఖ్య చూశాకే కదా? అలాంటపుడు ఆ వ్యాఖ్యలో పస లేదంటూ తీసిపారెయ్యటమెందుకు? అలా చెప్పేశాక మళ్ళీ ‘క్షమాపణలు’ కోరటం ఎందుకూ?
అసలు మీ అభిప్రాయాలకు సరైన వేదిక అని ‘గుర్తెరిగిన’చోట మీరు పుస్తక పరిచయాలు మాత్రం ఎందుకూ రాయటం? ‘అనువు కాని చోటు’ అని తెలిసి కూడా ఆ చోటులో ఏదో రాసేసి పస ఉన్న, పస లేని వ్యాఖ్యలకు అవకాశమివ్వటం, వాటిపై స్పందించటం మాత్రం ఎందుకూ?
వేలమూరి శ్రీరామ్
థాంక్స్ పూర్ణిమ గారూ,waiting for this book,thank u for information
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
పస లేని అభ్యంతరాలు అసలు ప్రచురించకండి.క్షమాపణలు,మన్నించటాలు చాలా పెద్దమాటలు.ఇంతకన్నా నేను చెప్పగలిగింది యేమీలేదు ప్రస్తుతానికి.
Purnima
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి:
ఆ వాక్యాన్ని సవరించాను.
(మీ అభ్యంతరంలో పస కనిపించి కాదు. మీరు సినిమాభిమానుల, సాహిత్యాభిమానుల నడవడి గురించి చేసిన విశ్లేషణ వల్ల అసలే కాదు. కేవలం, పుస్తకం.నెట్ *నా అభిప్రాయాలకు* సరైన వేదిక కాదని గుర్తెరిగి సవరించాను. చోటు అణువు కానిది కాబట్టి వాదాలకు పోకుండా, మిమల్ని, మీలా ఆలోచించేవారిని క్షమాపణలు కోరుతున్నాను. మన్నించండి.)
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
’పుస్తకం ఎలా ఉంది?’ అని అడిగే మూర్ఖత్వం ఎవ్వరూ చేయబోరనే అనుకుంటాను…..పూర్ణిమ గారు రచయితలమీద వల్లమాలిన అభిమానం ఉండటం పుస్తకప్రియులందరికీ సహజమే.అయితే సాహితీప్రియులకీ సగటు తెలుగుసినిమా అభిమానికీ కొంతవ్యత్యాసముంటుంది,ఉండాలి కూడా.ఎలా ఉంది అని అడిగించుకోని పుస్తకాలు కూడా ఉంటాయా???ఎలా ఉందని అడగటం మూర్ఖత్వమవుతుందా?ప్రపంచేతిహాసాలకు,షేక్ స్పియర్ రచనలకూ కూడా ఇప్పటికీ ఎప్పటికప్పుడు సమీక్షలు వస్తూనే వున్నాయి అన్న సంగతి మనం గమనంలో ఉంచుకోవాలి.