మల్లాది రామకృష్ణ శాస్త్రి… మాష అల్లాహ్!

గ్రూచో మార్క్స్ ఆత్మకథ చదువుతున్నప్పుడు ఆయన తెగ నచ్చేస్తుంటే, పుస్తకంలో ఇచ్చిన ఆయన ఫోటోల్లో ఒకటి ఎంచుకొని, “యు రాక్.. డ్యూడ్!” అని రాసుకుంటే సరిపోతుంది. “యు కిడ్!” అని ఆయన నవ్వేసుకుంటారు. చింతపిక్కేసినా మునగనంత చిక్కటి మజ్జిగలాంటి కథలు రాసిన క్లీస్ట్ ను చదివి, “చితగొట్టేశావ్, కదా!” అననుకుంటే, “మరే!” అని జర్మన్‍లో అని ఊరుకుంటాడు. అదే, తెల్ల పంచె కట్టుకొని, హుందాగా కూర్చొని, చిర్నవ్వును చిందిస్తున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని చూస్తూ, చూస్తూ ఇలాంటి కుప్పిగంతులు వేయడానికి కుదరదు. రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకోవాలనిపిస్తుంది. కాని ఆ దణ్ణంలో “you blew me away!” అన్న అర్థం ఎలా జొప్పించాలో తెలీదు.

ఆయన్ను గూర్చి, ఆయన రచనా కౌశలాన్ని గూర్చి సభక్తికంగా, సగౌరవంగా రాయాలంటే ఆయన విద్యలోనూ, విద్వత్తులోనూ వెయ్యో శాతమైనా ఉండాలి. (వీరికి యాభై భాషల్లో (యాభై అనగా, ఐదు పక్కన సున్నా!) ప్రావీణ్యం ఉందని చదివాను. నేను యాభై భాషల పేర్లు కూడా చెప్పలేను, తడుముకోకుండా!) అందుకని, ఈ వ్యాసం ఆయణ్ణి ప్రస్తుతించటం కోసం కాదు. కనీసం, ఆయనకు తగ్గ స్థాయిలో ఉండబోదు. ఆయన కథలు చదవటంలో నాకున్న అనుభవాలను, నాకొచ్చిన భాషలో పంచుకోవటం.
ఈ పరిచయం ముఖ్యంగా, నా బోటి వాళ్ళ కోసం రాస్తుంది. (నా బోటి వాళ్ళు = తెలుగు సాహిత్యాన్ని ఇప్పుడిప్పుడే పరిచయం చేసుకుంటున్నవారు.)
మూడేళ్ళ క్రితం, తెలుగు పుస్తకాల కొట్ల మీద దండయాత్రల్లో భాగంగా మల్లాది కథలూ, నాటికలూ, వ్యాసాలూ అన్నీ కొనేసి, భద్రంగా అల్మారాలో పెట్టేసాను. ఓ పదిరోజుల పాటు ట్రిప్పుకెళ్తూ కథల పుస్తకం మొదటి భాగం తీసుకెళ్ళాను. ముప్ఫై గంటల రైలు ప్రయాణం అయ్యాక, ఆరు గంటలు బస్సు ప్రయాణం చేసి, ముంచుకొచ్చేస్తున్న నిద్రను ఆపుకోటానికని, యముకలు కొరికే చలిలో పుస్తకం తెరిస్తే, ఎలాగుంటుందయ్యా అంటే – ఆగండి, నా ఉపమానం ఎందుకు? మల్లాది వారిదే ఇస్తాను. – “ఆవాలు దిమ్మరించినట్టు పేజీ యావత్తూ క్రిక్కిరిసి అక్షరాలు ఉన్నాయి.”

అక్షరాలే కాదు, బొలెడన్ని చుక్కలూ, గీతలూ. ఒక్క ముక్క కూడా చదవలేకపోయాను. అప్పుడు మూసిన పుస్తకం మళ్ళా రెండు నెళ్ళ క్రితం తెరిచాను.

మధ్యలో వీరివి చలువ మిరియాలు (వ్యాస సంకలనం), కృష్ణాతీరం (నవల) చదివాను. కృష్ణాతీరం చదివేటప్పుడు మల్లాదిని ఎలా చదవాలో అర్థమయ్యింది. గబగబా స్కాన్ చేసినట్టు చదివితే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సంభాషణల విషయంలో ఎవరు ఏం అంటున్నారో తెల్సుకోడానికి మల్లాది, “సో ఆండ్ సో ఇలా అన్నాడు.” అన్న క్లూస్ ఇవ్వరు. పాత్ర స్వభావాన్నీ, గొంతునూ బట్టి మనకు మనంగా తేల్చుకోవాలి. కొన్ని చోట్ల అక్షరాలకన్నా పంక్చువేషన్ చాలా ముఖ్యమైపోతుంది. అన్నీ గమనిస్తూ, ఒక్కోటిగా అర్థం చేసుకుంటూ చదవనిదే ఆయన రచనలోని అసలందం మనకి లొంగదు. అరటి పండు వల్చి నోట్లో పెట్టరు గాక పెట్టరు. పాఠకుడుకి ఒక స్థానం ఇచ్చి, అందుకనుగుణంగా రాస్తారు.

ఇహ, ఆయన కథల విషయానికి వచ్చే ముందు, కాల్పనిక సాహిత్య సృష్టిలో నేను చదవినంతలో, నాకు అవగాహన ఉన్నంతలో రచయితలకుండే మోటివేషన్స్.

౧. కొందరు తమ జీవితాల్లో లేనివాటిని, అవుంటే ఎంత బావుణ్ణు అననుకుంటూ ఊహించుకొని కథలూ, నవలలూ రాయడం.
౨. కొందరు తాము చూస్తున్న జీవితాలను చూసినట్టు కథలుగా రాయటం.
౩. కొందరు తాము నమ్మిన సిద్ధాంతాలకూ, తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక కాల్పనిక ప్రపంచాన్ని కల్పించి, అందులో నెగ్గుకురాగల పాత్రలను సృష్టించటం. ఇంకో విధంగా చెప్పాలంటే, ’కథలోని నీతి” ని ముందు రాసుకొని, ఆనక కథ రాస్తారు.
౪. చాలా అరుదుగ, కొందరు రచయితలు ప్రపంచాన్ని, దాని పోకడలనూ, మనిషినీ, అతడి ప్రవృత్తినీ నిశితంగా గమనించి, తర్కించి, పరిశోధించి, పరిపూర్ణంగా అనుభవించి, రాసే సాహిత్యం ఉంటుంది. కలకాలం నిలిచే సాహిత్యం, కాస్తో, కూస్తో పనికొచ్చే సాహిత్యం ఇదేనని నా అభిప్రాయం.

మల్లాది రాసిన కథలు ఈ నాలుగో  కోవలోకే వస్తాయి. నేను చదివిన మొదటి సంపుటిలో అత్యధిక కథలు వయస్సులో ఉన్న ఆడ-మగ కు సంబంధించిన కథాంశాలు ఉన్నవే! ఈ అంశంతో కూడిన కథలు, ప్రపంచ సాహిత్యంలో, చాలానే ఉండుంటాయి. కాని మల్లాది రాసిన విధంగా రాయటం చాలా అరుదు.

అసలు, ఒక్కో కథకీ ఒక్కో వ్యాసం రాసేంతటి విషయమున్నాయి వాటిలో. కథ, కథనం, శైలి, శిల్పం, భాష, భావం – ఇలా ఏ అంశం గురించి ఆలోచించుకుంటూ పోయినా, ఎడతెరిపి లేని వానను చూస్తున్న భావన కలుగుతుంది. చదువుతున్న కొద్దీ కొత్త అర్థాలు స్పృసిస్తుంటే, ఇవి కథలా? కథల్లాంటి కవితలా అన్న అనుమానం కలుగకమానదు.

రచనలను బట్టి రచయిత వ్యక్తిత్వాన్ని తరాజులో వేసి తూకడం చాలా ప్రమాదకరమైన పని. రచయిత ఏం రాసిన, పాఠకుడు తను చూడగలిగింది మాత్రమే చూస్తాడు అన్నది నాకు నచ్చిన సూత్రం. దీని వల్ల, రచయితకూ, పాఠకుడికీ అనవసరపు బాగేజిలు తప్పుతాయి. అందుకని నేను సామాన్యంగ రచయితల జోలికి పోకుండా, వాళ్ళు మలచిన పాత్రలతో ఆటపాటలకు సిద్ధమవుతాను.  కాని, మల్లాదిని అలా విస్మరించలేకపోయాను; లొలిటను చదివాక నబొకొవ్‍ను గౌరవించకుండా ఉండలేకపోయినట్టు.

అందుకు కారణం, మల్లాది పాత్రలు. వాటికున్న పరిస్థితులు మామూలివే; మీకూ, నాకూ గంటకో సారి ఎదురయ్యేంతటి సామాన్య పరిస్థితులు. కాని, ఆ పరిస్థితుల్లో ఈయన పాత్రలు వ్యవహరించే తీరు వల్ల మల్లాది జీవితాన్ని ఏ దృష్టితో చూసారో ఇట్టే తెల్సిపోయింది.
లీడర్ – ఈ పదం వాడాలంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంది.(ముఖ్యంగా శేఖర్ కమ్ముల సినిమా తర్వాత). ఆయన పాత్రల్లో నన్ను అమితంగా ఆకర్షించినది ఈ లీడర్‍షిప్ క్వాలిటీస్. అంటే, యుద్దాలు చేసారనో, రాజకీయాల్లో చేరారనో, టీం లీడ్స్ అయ్యారనో కాదు. లీడర్ అంటే స్థితిగతులను క్షుణ్ణంగా పరిగణించి, పరిక్షించి, ప్రతిభావతంగా ఆ సంక్లిష్టత నుండి బయటపడ్డం లేక పడేయడం. కొన్ని సార్లు, అవతలి వాళ్ళ బాధ్యత మీదేసుకొని వాళ్ళ (లాంగ్ టర్మ్) బాగోగుల కోసం వాళ్ళని తీవ్రంగా కష్టపెట్టటం.

ఉదాహరణలుగా,

మంచి ముత్యాలు కథలో ఇద్దరి స్నేహితుల మధ్య సంభాషణ:
“సంతోషించాను. సమయంవస్తే నిన్ను నమ్మినవాడిని అని అయినా చూడకుండా పాతాళంలోకి నెట్టేయగలవు.”
“అవును, అటూ ఇటూ కాకుండా మధ్యను త్రిశంకుడి లాగా నావాడు ఉంటే నాదేం ప్రయోజకత్వం. చేతికొద్దీ విసిరితే నీతిమాలినవాడైతే అడుగుకి అంటుకుపోతాడు. కాకపోతే ఎదురెగిరి ఆ ఊపుతో స్వరం మీదకు గంతులేస్తాడు. ఎటైనా మా బాగే.”

సాని-పాప కథలో ఆమెను అరాధిస్తున్నాడనీ తెల్సి కూడా ఆమెను పెళ్ళి చేసుకుంటానని ముందుకొచ్చిన మనిషి దూషించి పంపివేసి, ’నిజం చెప్పటం కన్నా అబద్ధం మేలు’ అననుకొని, మామూలు మనిషై పోతుంది.

అలా అని, ఇలాంటి వాళ్ళే ఉంటారనుకోడానికి వీల్లేదు. మనసున్నా వెన్నుముక్క లేని మనషుల గాధలనూ బాగా రాసారు. కోరి వలచిన ప్రియురాల తనంతట తానుగా వచ్చి కౌగిలిలో ఒదిగినా చేతగానివాడికి మల్లే అవకాశాన్ని జారవిడుచుకున్న వాడి కథను మల్లాది రాసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మగాళ్ళని చిన్నచూపు చూడ్డానికే పనిగట్టుకొని రాసిన ఆడ-రాతలనుకునేవారు, ఉండకపోరు.

ఆడ-మగ ఈక్వేషన్లో ఎవరిది పై చేయి అన్న తర్జన, భర్జన కొన్ని యుగాలుగా సాగుతున్నా, ఆడ చేయి ఎప్పుడు పైనుంటుందో, మగ చేయి ఎప్పుడు పైకొస్తుందో బాగా తెల్సిన రచయిత మల్లాది. రంగు కళ్ళద్దాలు పెట్టుకోకపోతే, మల్లాది సాహిత్యం సమాజంలో ఆడ-మగలను, ఆలూ-మగలను నిష్పక్షపాతంగానే చూపిస్తారు. ఆయన కాచి, వడపోచిన జీవితమెంతటిదో కాని, ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది.

“ఒక్క ఇండియాను మినహాయిస్తే – ఏ దేశంలో చూసినా, మన్మధుడు అక్షరాభ్యాసపు వయసన్నా రాని పసిగుడ్డు – రతీదేవికి అంగాంగ వైభవం అంతా పుష్కలమే కాని, – కళ్ళు మాత్రం ఉండవు – అంతమాత్రాన ఆ దేశాల్లో రాత్రులూ, పవళ్ళూ గొడ్డుపోతున్నాయా?”

“ఆ వృద్ధుడు ఎక్కడకు తేలుస్తాడో తనకు తెలుసును – ’మనిషిపోతే పోయిందే అనుకో – పుట్టెడు దుఃఖమే అనుకో, అందుకని, నిత్య – నైమిత్తిక కర్మకాండ ఏది మానాడు? – పోయినవాళ్ళకోసం అఘోరిస్తూ కూర్చుంటే ఇహ ఈ బతుకు ఏం కానూ? – ఉసూరుమంటూ రోజులు ఎలా వెళ్ళమారను?’ – ఇదే ధోరణి కాదూ? –

” ’నీవు ఎన్నైనా అను.. నిన్ను విడిచి బ్రదుకలేను’
’ఎవరు బ్రదకమన్నారు?’
’ముదురుతుందే’
’ముదరందే నదురూబెదురూ పోతుందా.. పోతేగాని నీలాటి సరస్సలకు నచ్చుతానా?… ముందునడు.’
’నీవు రాక్షసివి…నన్ను ఫకీరునిచేసి…కుళ్ళించి…’
’ఫో..అంత బుద్దే ఉంటే… ఒళ్లు బాగుచేసుకొని.. కాంగ్రెసులో కలు!’ “

ఇహ, ఈయన తెలుగు! కోతి కొమ్మచ్చి ఆడియోను పరిచయం చేస్తూ, ’తెలుగు అమ్మలా ఉంటుంది. తెలుగు గుళ్ళో అమ్మవారిలా ఉంటుంది.’ అని రాసుకున్నాను. మల్లాది తెలుగు చదువుతుంటే కలిగే తన్మయత్వం అంతా ఇంతా కాదు. పోలికే తప్పనిసరైతే, మల్లాది రాస్తుంటే తెలుగు భాష “సలామే ఇష్క్ మేరీ జాన్..” అని రేఖలాగా ఆడుతూ, పాడుతూ వంగి వంగి సలాములు చేసుంటుందని నా ఊహ. “ప్రౌఢత్వం” అన్న తెలుగు పదం అంతకు ముందు విన్నాను. ఇప్పుడు రుచి చూశాను. నాకు నాట్యశాస్త్రంలో అసలుకే ప్రవేశం లేదు గాని, మల్లాది గారి వచనం ఒక ఉత్కృష్ట కళాకారిణి చేసిన పరమాద్భుతమైన నాట్యంలా ఉంటుంది. ఆ వచనం చదువుతుంటే, మన కనుబొమలకూ కథకళీ నృత్యకారుడి కనుబొమలకు మల్లే ఆడ్డం మొదలెడతాయి. కథక్ నృత్యరీతిలో ఉండే swirls and twirls తెలుగు భాష చేస్తుండగా చూడాలంటే మల్లాదిని చదవాల్సిందే!

చివరిగా, నాకీ కథల్లో నచ్చిన అతి ముఖ్యాంశం. మల్లాది తన పాఠకులకు ఒక సముచిత స్థానం కల్పిస్తారు. స్త్రీ-పురుష సంబంధాలను వివరించడానికి తాపత్రయపడే తక్కిన రచయితల్లా అన్నీ విడమరచి చెప్పరు. ఎప్పుడో ఒక చాటువు (శ్రీనాధునిది అనుకుంటా) చదివిన గుర్తు. తెలుగు యువతులు పైట ధరించే తీరుని అభివర్ణించడానికి, అభినందించడానికీ, ’గుజరాతీ స్త్రీలు మొత్తం మూసేసుకొని, తమిళ యువతులు మొత్తం కనిపించేట్టు దుస్తులు ధరిస్తారు. తెలుగింటి ఆడపడుచులు మాత్రం కనీ కనిపించకుండా, దాచి పెట్టీ పెట్టకుండా పైట్ వేసుకుంటారు.” అని. మల్లాది కథలు చదువుతున్నంత సేపూ ఆ చాటువు భావం నాకు స్ఫురిస్తూనే ఉంది. మల్లాదికి ఎంత దాచాలో, ఎంత చెప్పాలో, ఏం చూపించాలో చాలా బాగా తెల్సు. మిగితాదంతా పాఠకుల పని. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత!

డిక్షనరి సాయం లేకుండా చదవటం కష్టం. ఒక్కసారి చదివిస్తే అయిపోతుందనుకుంటే మరీ కష్టం. కొన్ని కథలు అర్థం కాకపోవచ్చు. మరేం నష్టం లేదు. భాష పైనా, మనసుపైన పట్టు పెరిగే కొద్దీ, ఈ కథల్లో అమృతం చిక్కబడుతూ ఉంటుంది. మధిస్తూ ఉండాలి.

తెలుగు సాహిత్యంలోనే కాదు, నన్ను అడిగితే, ప్రపంచ స్థాయిలోనూ మల్లాదిది విశిష్ట స్థానమే! ఇటాలియన్, చెక్, చైనీస్, జపనీస్, లాటిన్ అమెరికన్, పొర్చుగీస్, జర్మన్ సాహిత్యాలను అనువాదాలను చదివి నా బోటి వాళ్లు మురిసిపోతున్నట్టు, మల్లాదిని చదివి ప్రపంచం మురిసే అవకాశం ఉందా? నాకు అనుమానమే!

————————–

మల్లాది రాసిన కథలూ, నాటికలూ మార్కెట్లో ఉన్నాయి. సినిమా పాటల పుస్తకం ఒహటుందని విన్నాను. కాని నేనో చోట చదివినదాని బట్టి, ఆయన రాయని సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన కవిత్వం రాస్తారని ఈ కథల్లోనే తెల్సింది. ఆయన ద్విపదలు రాసారట! కవిత్వం రాసారట! అవెక్కడ దొరుకుతాయో చెప్పగలరా? మల్లాది రాసిన, మల్లాది గురించిన పుస్తకాలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా నాకు తెలియజేయండి.. PLEASE!

____________________________

పుస్తక వివరాలు:

మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు – 1

శతజయంతి ప్రచురణ

వెల: 150

ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞాన్ భవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాదు – 500001

—————————–

మల్లాది కథ ఒకటి సాక్షిలో.

You Might Also Like

7 Comments

  1. కామేశ్వరరావు

    పూర్ణిమగారు, ఆ పద్యం ఇది:

    ఘనతర ఘూర్జరీ కుచయుగ క్రియ గూఢము గాక, ద్రావిడీ
    స్తనగతిఁ దేట గాక, యరచాటగు నాంధ్ర వధూటి చొక్కపుం
    జనుగవ బోలి గూఢమును చాటుదనంబును గాకయుండఁ జె
    ప్పిన యదిపో కవిత్వమనిపించు, నగించు నటుగాక యుండినన్.

  2. Purnima

    కొత్తపాళిగారు: నాకా పద్యం దొరకటం లేదు. మీకు తెలిస్తే ఇక్కడ పంచుకోగలరు, దయచేసి.

  3. కొత్తపాళీ

    చాలా బాగా రాశారు పూర్ణిమ. మల్లాది కథలని గురించి, భాషని గురించి మీ అబ్సర్వేషనులు సరైనవి. మీరు చివర్లో ఉదహరించిన పైట పద్యంలో ఉపమాన వస్తువుకూడా తెలుగు కవిత్వమే.

  4. సౌమ్య

    “సామగానం” అని ఒక కథ చదివా ఇప్పుడే. మీరందరూ కలిపి నన్ను తిట్టినా కూడా, నా జీవితంలో నేను చదివిన మొదటి మల్లాది వారి కథ ఇదే. నాకు తెగ నచ్చేసింది. ఆ పేరెందుకు పెట్టారో అర్థం కాలేదు కానీ, కథ మాత్రం నాకు చాలా బాగుంది చదవడానికి.

  5. Purnima

    @శారద:

    మీ సందేహం చిన్నది కాదని నాకో పెద్ద అనుమానం. 🙂

    మల్లాది గారి కథల శీర్షికల్లోని అర్థాలనూ, అంతరార్థాలనూ వెతికి పట్టుకోవటం అంత తేలికైన పని కాదనుకుంటాను. మల్లాది కథల సంపుటికి ముందుమాటలోనూ అదే అభిప్రాయం ఉంది. ఇప్పుడే చదువుతున్న పాలగుమ్మి పద్మరాజు గారి వ్యాస సంపుటిలో కూడా, మల్లాది గారి గురించి రాసిన వ్యాసంలో ఇదే అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఒక్క రాగాల విషయమనే కాదు, “మధ్యాక్కర”, “యక్షగానం” లాంటి పేర్ల వెనుకున్న ఉద్దేశ్యం తెల్సుకోవటం, కనీసం వాటిని గురించి చీకట్లో బాణాలు వేయడం కష్టమనిపిస్తోంది నాకు.

    కథ శీర్షికని కథలో అంతర్భాగంగా భావించే నేను, మల్లాది కథల విషయంలో “అందాజు” వేయడానికి కూడా సరిపోనని బాగా అర్థమయ్యింది. మల్లాది గారి తనకు తాను వీటిని ఎక్కడైనా విశిదీకరించుంటే అది మన భాగ్యమే!

  6. శారద

    ఈ కథల పుస్తకం నేనూ చదివానండీ! ఆయన రాసిన లలిత శృంగారం నాకు చాలా నచ్చింది. అయితే నాదొక్క చిన్న సందేహం.
    ఆయన చాలా కథలకి రాగాల పేర్లు పేట్టారు. (“శివ రంజని”, “అసావేరి” ఇలాగ!). ఆ పేర్లలో అంతరార్ధమూ, ఔచిత్యమూ నాకస్సలే అర్ధం కాలేదు. మీకేమైన అంతు బట్టిందా?
    శారద

  7. narasimharao mallina

    బాగుందండీ మీ సమీక్ష. ఈ పుస్తకం నా కింకా దొరకలేదు. దొరకపుచ్చుకొని చదువాలి. ఈలోగా ఓసారిది చూడండి.
    http://pustakam.net/?p=4881

Leave a Reply