Dawn of the Blood

వ్యాసం పంపినవారు: మార్తాండ

dawn_of_the_bloodDawn of the Blood (రక్తపాతపు మొదలు) పంజాబ్ లో నక్సలైట్ ఉద్యమం గురించి వ్రాసిన అత్యంత వివాదాస్పద నవల. 1970లలో పంజాబ్ లో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో వ్రాసిన నవల ఇది. ఈ నవల రచయిత జస్వంత్ సింగ్ కన్వాల్ పంజాబ్ రాష్ట్రం అంతటా తిరిగి ప్రగతివాద ఉద్యమాల గురించి సమాచారం సేకరించి అనేక రచనలు వ్రాసారు. అందులో “డాన్ ఆఫ్ ది బ్లడ్” నవల ఒకటి. మార్క్సిస్ట్ సూత్రీకరణ ప్రకారం సమాజంలో నాలుగు వర్గాలు ఉన్నాయి. అవి bourgeoisie (ధనవంతుల వర్గం), petty-bourgeoisie (మధ్య తరగతి వర్గం), proletariat (కార్మిక వర్గం), lumpen proletariat (అట్టడుగు కార్మికులు & భిక్షకుల వర్గం). నేటి భారతీయ సమాజంలో పట్టణ ప్రాంత మధ్య తరగతి వర్గానికి, గ్రామీణ రైతాంగ వర్గానికి మధ్య కూడా వైరుధ్యం కనిపిస్తుంది. పంజాబ్ లో వర్గ విభజన మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పంజాబ్ లోని పట్టణ ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవాళ్ళలో ఎక్కువ మంది హిందువులు (ముఖ్యంగా ఆర్యసమాజికులు & సత్నామీయులు), గ్రామీణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది సిక్కులు. మతం కూడా పంజాబీ సమాజంలో విభజనలకి కారణమయ్యింది. పంజాబీ గ్రామీణ ప్రజల జీవితాలని ప్రతిబించించే రచనలు వ్రాసిన వారిలో జస్వంత్ సింగ్ కన్వాల్ ఒకరు. ప్రగతివాద సాహిత్యం రచించిన ఇతర రచయితలు సాధారణ సంస్కరణవాద పంథాలో రచనలు వ్రాయగా, జస్వంత్ సింగ్ కన్వాల్ మార్క్సిస్ట్ సోషలిజం వైపే మొగ్గు చూపారు. మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంత భూమికతో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇంకా ఉనికిలో ఉంది కానీ పంజాబ్ లో మాత్రం చావు దెబ్బ తిన్నది. పంజాబ్ ప్రభుత్వం నక్సలైట్లని క్రూరంగా అణచివెయ్యడం, మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడిన ఖలిస్తాన్ ఉద్యమం బలపడడం వల్ల పంజాబ్ లో నక్సలైట్ ఉద్యమం మృత్యు ముఖం వైపు పయనించింది. పంజాబ్ లో 1970లో ప్రభావం చూపిన నక్సలైట్ ఉద్యమ స్వరూపాన్ని గుర్తు చేసే నవల “డాన్ ఆఫ్ ది బ్లడ్”. ఈ నవలని ఎమర్జెన్సీ కాలంలో వ్రాయడం వల్ల అప్పట్లో పబ్లిషర్లు ఈ నవలని ప్రచురించడానికి ముందుకి రాలేదు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత ఈ నవలని ఇంగ్లిష్ లోకి అనువదించడం కూడా జరిగింది. పంజాబీ సాహిత్యంలోనే కాదు, భారతీయ ఆంగ్ల సాహిత్యంలో కూడా ఇది ఒక చారిత్రక నవల.

ఈ నవల అనేక కథలు కలిసిన సంకలనం. అందులో కొన్నిటి గురించి కొన్ని లైన్లు ఇవి:

Duel between Young and old కథలో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు టీచర్లకి జీతం పెంచుతాం అని వాగ్దానం చేస్తారు. టీచర్లకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాం అని చెపుతారు. ఆ పార్టీ వాగ్దానాల్ని టీచర్లు ఎంత వరకు నమ్మారో ఏమో, పోలింగ్ ఏజెంట్లు గా నియమించబడిన ఆ టీచర్లు ఇంకో పార్టీ లఖా సింగ్ అనే అభ్యర్థి ఆశ చూపిన డబ్బులు తీసుకుని అతని కోసం అక్రమాలు చేస్తారు. టీచర్ల వర్గానికి కొందరు టీచర్లు వెన్నుపోటు పొడుస్తారు. టీచర్ల ద్రోహి అయిన లఖా సింగ్ ఎన్నికలలో గెలుస్తాడు.

Peasant in Market Yard కథ పేద పంజాబీ రైతుల కన్నీళ్ళకి సాక్షి. ఈ కథలో హీరా సింగ్ అనే పేద రైతు తన కూతురు పెళ్ళికి రెండు సంచుల చక్కెర కొందామనుకుంటాడు. బహిరంగ మార్కెట్ లో చక్కెర ధర ఎక్కువ కనుక హీరా సింగ్ చక్కెర కోసం సివిల్ సప్లైస్ స్టోర్ కి వెళ్తాడు. స్టోర్ లో రెండు సంచుల చక్కెర అడుగుతాడు. పంజాబ్ లో చక్కెర కొరత ఉంది, రాష్ట ప్రభుత్వం పెళ్ళిళ్ళకి ఒక సంచి కంటే ఎక్కువ చక్కెర ఇవ్వకూడదని ఆదేశించింది అని స్టోర్ కీపర్ సమాధానం చెపుతాడు. హీరా సింగ్ అతనితో వాదించినా వినిపించుకోడు. హీరా సింగ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ నవలలోని “Revolution Through the Barrel of a Gun” కథలో ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతురు పెళ్ళికి డబ్బాలు, క్వింటాళ్ళ స్థాయిలో నెయ్యి, పాలు ఖర్చు పెట్టిస్తాడు.

The Elephant’s Tusks కథలో జల్మాన్ ఆర్థికంగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చినవాడు. అతనిలో విప్లవ భావాలు బలంగా లేకపోయినా, కేవలం హీరో అనిపించుకోవడానికి ఉద్యమంలో చేరుతాడు. జల్మాన్ పార్టీ డాక్యుమెంట్లు చదవకుండా నిర్లక్ష్యం చెయ్యడం వల్ల పార్టీకి అతని మీద అనుమానం వచ్చి రెండు సార్లు అతనికి వార్నింగ్ ఇస్తారు. జల్మాన్ లో విప్లవ భావాలు బలహీనంగా ఉన్నాయని గమనించిన అతని కుటుంబ సభ్యులు తమ బంధువైన పోలీస్ ఆఫీసర్ సహాయంతో అతన్ని లొంగిపోయేలా చెయ్యాలనుకుంటారు. జల్మాన్ కొంత మంది రాజకీయ నాయకుల్ని చంపాడు కాబట్టి అతని మీద ఉన్న కేసులు ఎత్తివెయ్యడం సాధ్యం కాదని, అతను ఇన్ఫార్మర్ గా మారి పార్టీలోని కీలక వ్యక్తుల్ని పట్టిస్తే కెనడా వెళ్ళిపోవడానికి పాస్ పోర్ట్ ఇప్పిస్తానని డి.ఎస్.పి. గా ఉన్న వాళ్ళ బంధువు అంటాడు. అప్పుడు జల్మాన్ ఇన్ఫార్మర్ గా మారి హుకామా అనే నక్సలైట్ ని పోలీసులకి పట్టిస్తాడు.

Bane of Changez Khan కథలో I.G. నాయకత్వం పోలీసులు ఒక గ్రామానికి వెళ్తారు. ఈ గ్రామస్తులు పోలీసులకి మద్దతు ఇవ్వడం లేదని, నక్సలైట్లకి మద్దతు ఇస్తున్నారని I.G. మండి పడతాడు. గ్రామస్తులని వెరైటీగా టార్చర్ చెయ్యాలనుకుంటాడు. అందుకు అతను ఎంచుకున్న మార్గం పంట పొలాలని ద్వంసం చెయ్యడం. పోలీసులు గ్రామంలో పశువులన్నిటికీ కట్టిన తాళ్ళు విప్పేసి పొలాలలోకి వదులుతారు. ఆవులు, బర్రెలు, ఒంటెలు, మేకలు అని తేడా లేకుండా ఒక్క పశువుని కూడా మిగల్చకుండా విప్పేసి పంట పొలాలలోకి వదులుతారు. చేతికందాల్సిన పంటలని పశువులు మేసేస్తాయి. పత్తి చేనుల్లో పత్తి కాయలు పశువులు తినేయగా, పనికిరాని కాండాలు మాత్రం మిగులుతాయి. ఇలా అన్ని పంటలు నాశనం అవుతాయి. చెంఘీజ్ ఖాన్ అనుచరులు గ్రామాలని ఎంత దారుణంగా కొల్లగొట్టేవాళ్ళో, పోలీసులు ఆ గ్రామాన్ని అంత దారుణంగా కొల్లగొడతారు.

ఈ నవలలో ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ నవలగా మలిచిన నిజజీవితపు కథలు.

You Might Also Like

4 Comments

  1. Marthanda

    I was searching for the book “Insurrection to Agitation” written by Punjabi English author Paramjit S Judge. While searching for that book, simultaneously I also found to book “Dawn of the Blood” written by controversial author Jaswant Singh Kanwal. He wrote many other stories and novels but the novel “Dawn of the Blood” was most controversial. Without regarding to controversy, the novel “Dawn of the Blood” became popular in Indian English literature.

    I purcahsed this book from Oscar Publications, Delhi through their online shopping site. I paid them through cheque and received the book via registered post.

  2. మరో ప్రపంచం సాధ్యమే » Blog Archive » పుస్తకం.నెట్ లో “Dawn of the Blood” నవల పై రివ్యూ

    […] పుస్తకం.నెట్ వెబ్ సైట్ లో “Dawn of the Blood” నవల పై నేను వ్రాసిన రివ్యూ పబ్లిష్ అయ్యింది. http://pustakam.net/?p=737 […]

  3. Purnima

    నేనూ మాలతి గారితో ఏకీభవిస్తున్నాను. మొదటి పేరా లేకపోతే, ఇదేదో చరిత్రకు సంబంధించినది, మనకొద్దులే అని అనుకునేదాన్ని.

    పుస్తకాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసినందుకు నెనర్లు! నేపధ్యాన్ని వివరించినందుకు మరిన్ని!

  4. మాలతి ని,

    నవలకి నేపథ్యంగా పూర్వరంగం వివరించడం చాలా బాగుంది. నాలాటివారికి పనికొస్తాయి ఇలాటి వివరణలు. మార్తాండగారూ అభినందనలు.

Leave a Reply