పుస్తకం
All about booksపుస్తకలోకం

May 9, 2011

దొరకని పుస్తకాలు కొన్ని.. సాయం చేద్దురూ..

More articles by »
Written by: Purnima

“హేమిటీ.. ఇక, దొరకని పుస్తకాల గురించి కూడా పోస్టులా?” అని నోర్లు వెళ్ళబెట్టేలోపు, నావో రెండు ముక్కలు. ఏం పుస్తకం.నెట్టో ఏమో గాని, ఇక్కడ  పుస్తకాల  గురించి రాస్తున్నప్పుడల్లా, ఎవరేం అంటారో, అనుకొని ఇంకేం అంటారో అన్న అనుమానం పీకుతూనే ఉంటుంది. మాకన్నా చదివే వాళ్ళూ, ఇంకెన్నో రెట్లు బాగా రాయగలిగే వారూ రాయరు. నిండు కుండ తొణకదులా అనుకుంట! మేమేమో, పుస్తకాలు తిరగేసిన పుణ్యానికే, మా వంతుగా ఈ-వేస్ట్ చేస్తుంటాం. (ఇక్కడ, ’మా’, ’మేం’ అన్నీ ఎన్టీర్ మార్కు “నేను” అని అర్థం.) అందుకని రాయడం మానేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. బద్ధకం “సై..సై” అంటుంది. అప్పుడూ, “పుస్తకాల గురించి తెల్సుకోవాలన్నా, తెల్సుకున్నదాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలన్నా నీకున్న ఏకైక సౌలభ్యం ఇదే!” అని బుద్ధి గడ్డి పెడుతుంది. అందుకని, చాన్నాళ్ళుగా వెతికినా దొరకని పుస్తకాల గురించి ఇక్కడ కాస్త గోడు వెళ్ళబోసుకుంటే.. ఏమో, గుర్రం ఎగురా వచ్చు.. 🙂 ఇక, నోళ్ళు వెళ్లబెట్టండి. 😛

Azhar – Harsha Bhogle: మాచ్ ఫిక్సింగ్ స్కామ్‍లో పడి, ఉన్న పేరంతా నాశనం చేసుకోక ముందు భారత మాజీ కెప్టన్ అజహరుద్దీన్ గురించి, ప్రఖ్యాత టివి కమెంటేటర్ హర్షా భోగ్లే రాసిన బయోగ్రఫీ ఇది. దీన్ని చదివిన వారందరూ, దాచుకోదగ్గ పుస్తకమనే చెప్తుంటారు. ప్రస్తుతం ముద్రణలో లేదు; కొత్త కాపీలు దొరికే అవకాశం శూన్యం. సెకండ్ హాండ్ షాపుల్లో పాత కాపీలు దొరకటం లేదు. కొన్ని ఆన్‍లైన్ పుస్తకాల షాపు వాళ్ళు ఈ పుస్తకం “ఇన్ స్టాక్” అని చూపిస్తారు. కాని, వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు. నేను పీకల మీద కూర్చునేసరికి, ఫ్లిప్‍కార్ట్ వాడు గోడౌన్లు, పాత పుస్తకాల షాపులనూ కూడా జల్లెడ పట్టానని చెప్పాడు. అయినా దొరకలేదు. దీన్ని పుస్తక రూపంలోనే చదవాలన్న పట్టింపు లేదనుకోండి. వంద పేజీలుండే ఈ పుస్తకం ఫొటో కాపీ అయినా, లేక స్కాన్ అయినా కూడా నాకు మహాప్రసాదం. ఒక హైద్రాబాదీ గురించి మరో హైద్రాబాదీ రాసిన పుస్తకాన్ని ఈ హైద్రాబాదీ చదవడానికి వదిలేయటం కూడదు! (ప్రాంతీయాభిమానం ఒక్కటే కాదు, అజహర్ చేయకూడని పనులు చేసినా, అవి తీవ్ర మనస్థాపానికి గురి చేసినా, అతణ్ణి ద్వేషించడం లేదు గనుక, ఇది చదువుకోగలను.)

పుస్తకం పై వచ్చిన కొన్ని రివ్యూ లింకు ఇస్తున్నాను: Indian uncut

*******************************************************************************************************

Anandi Gopal – S.J.Joshi (మరాఠి నుండి ఆంగ్ల అనువాదం): నేను స్కూల్లో ఉండగా (బహుశా, ఆరేడు తరగతుల్లో అని గుర్తు), దూరదర్శన్‍లో “ఆనంది గోపాల్” అని ఒక సీరియల్ వచ్చేది, వారానికో సారి అనుకుంట. శనివారం సాయంత్రం అని గుర్తు. ఆ సీరియల్ టైటిల్స్ వేసేటప్పుడు, ఓ చక్కని గీతల ముగ్గు వచ్చేది. దాని కోసమని ఊపిరి బిగబెట్టుకొని చూసేదాన్ని. మళ్ళీ చివర్లో వస్తుందని మొత్తం ఎపిసోడ్ చూసేసేదాన్ని. ఇంతకీ, ఇది తొట్టతొలి భారతీయ వైద్యురాలి కథ. ఏమీ చదువుకోని ఒక ఆవిడ, భర్త ప్రోత్సాహంతో చదువుకోవడం మొదలెట్టి, మెడిసిన్ చదివి, సమకాలీన సమాజంలో దూషణలకు గురైనా, పట్టుదలతో కొనసాగిన తీరు అన్నది కథలో ముఖ్య భాగం. విదేశాల్లో ఉండడం వల్ల, అనారోగ్యం పాలై ఆవిడ త్వరగా చనిపోతారనుకుంటా.

చాన్నాళ్ళ వరకూ ఇది తొట్టతొలి భారతీయ వైద్యురాలి ఆత్మకథ అనుకున్నాను. కాని, ఆవిడ వేరే ఆవిడ, ఇది కేవలం ఆవిడ జీవితాన్ని అనుసరించి అల్లిన కథ అని తెల్సింది. అప్పుడోసారి, ల్యాండ్‍మార్క్ లో ఏదో భారతీయ స్త్రీ విజయాలకు సంబంధించిన పుస్తకాన్ని తిరగేస్తుంటే, ఆ సీరియల్‍కు మూలాధారమైన పుస్తకం గురించి తెల్సింది. ఎస్.ఎస్.జోషి అనే ఆయన మరాఠిలో రాశారు. దీని ఆంగ్లానువాదంలో కోసం అప్పటి నుండి వెతుకుతున్నాను. దొరకటం లేదు.

ఫ్లిప్‍కార్ట్ లింక్ (స్టాక్ లేదు)

రివ్యూలు: sawnet.org, sparrowonline.org

*******************************************************************************************************

Life and Death are wearing me out – Mo Yan: మొన్నామధ్య నేనిక్కడ పరిచయం చేసిన “షిఫూ.. యుల్ డు ఎనీథింగ్ ఫర్ ఎ లాఫ్” అనే పుస్తక రచయిత కలం నుండి విరిసిన మరో పారిజాతం, ఈ పుస్తకం. రివ్యూలు చదువుతుంటే, మనసూరుకోలేదు. పుస్తకం మాత్రం చేతికందటం లేదు. బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాల్లో ఉన్న పాత పుస్తకాల షాపుల్లో దొరకచ్చని నా ప్రగాఢ విశ్వాసం. మీరు గానీ, అటేపు గానీ వెళ్తే, ఇది గానీ, మీ కళ్ళల్లో గానీ పడుతుందేమో, కాస్త కనిపెట్టుకొని ఉండండేం!

Newyork times review

******************************************************************************************************

రక్త రేఖ – గుంటూరు శేషేంద్ర శర్మ: గుంటూరు శేషేంద్ర శర్మ ఎలాంటి కవి అంటే, ఆయన కవిత్వం రుచి తగలనంత వరకే మనం మామూలుగా ఉండగలం. ఒక్కసారి గాని, ఆయన కవిత్వం గాని, రుచి తెల్సిందా, ఇంక ఆపటం కష్టం. ఆ కవిత్వం వాడి గాట్లు పెడుతున్నా, వేడి బొబ్బలెక్కిస్తున్నా, వెనకాడడం ఉండదు. ఆయన దేని గురించి రాసిన, దాసోహం అనటం తప్ప, చేయగలిగింది పెద్దగా ఉండదు. అలాంటిది ఆయన స్వగతం డైరీ రూపంలో దొరుకుతుందంటే.. మనసూరుకోదుగా! కాని, ఈ పుస్తకం మార్కెట్లో అలభ్యం. ఆయన ఇతర రచనలన్నింటినీ మొన్నీ మధ్యే పునర్ముద్రించినా, ఎందుకనో ఇది రాలేదు. వారి అబ్బాయి సాత్యకినే కల్సి, ఈ పుస్తకం అరువు అడుగుదామని ప్లాన్ వేశాం. ఆయణ్ణి కలవటం వీల్లుపళ్ళేదు. మార్కెట్లో దొరుకుతుందన్న ఆశ శూన్యం. అందుకని, మీ వద్ద ఈ కాపీ గానీ ఉంటే, నాకు ఓ ఫోటో కాపీ, ఇప్పించగలిగితే, బోలెడు బోలెడు థాంకులు.

In Pustakam

******************************************************************************************************

Editor to Author: The letters of Maxwell E Perkins: మీరు సాప్ట్ వేర్ రంగానికి సంబంధించిన వారైతే, డెవలపర్-టెస్టర్ కి మధ్య కీచులాటలను చూసే ఉంటారు. సాహిత్యానికి వచ్చేసరికి రైటర్-ఎడిటర్ మధ్యన కూడా ఇలాంటి బంధమేదో ఉందని నా నమ్మకం. ఇద్దరి ఉద్దేశ్యం, చేతిలో ఉన్న రచనను మరింత మెరుగుపరచటం. ఒకే పని ఇద్దరు చేయాల్సి వచ్చినప్పుడు బేధాభిప్రాయాలు కలగటం పరిపాటు. దానికి తోడు, అందులో ఒకరు ఆ రచనకు ఉనికినిచ్చినవారైతే, ఇంకోరు దాని ఉనికిని సార్థకం చేయాలనుకున్నవారికీ మధ్య సమన్యయం కుదుర్చుకోవటం అంటే ఆషామాషీ కాదు. అభినవ ఎడిటర్లు కొందరు, తప్పంతా రాస్తున్నవాళ్ళదేనని  – రచయిత, పాపం, రచన నాది అని కూడా అనకూడదట. అది అహంకార సూచనట. ఒక రచనలో రచయిత indefinable part కలిగుంటుందని గ్రహించలేని వాళ్ళు, వాళ్ళు – తుట్ట నెట్టేస్తుంటే, అసలు ఇన్ని శతాబ్ధాల సాహిత్యంలో ఈ ఎడిటర్-రైటర్ డిష్యుం, డిష్యుం ఎలా ఉండుంటాయో తెల్సుకుందామనే ఉత్సుకతతో గూగుల్లితే, నాకీ మహానుభావుడు గురించి తెల్సింది. పేరు – మాక్స్ వెల్ పర్కిన్స్. ప్రపంచం అబ్బురపడి ఆదరించిన అనేక సాహిత్య విన్యాసాలు, ఈయన పర్యవేక్షన లోంచే ప్రపంచాన్ని చూసాయి. హెమ్మింగ్వేతో ఈయన అనుబంధం గురించి చాలా చర్చలే ఉన్నాయి. లేఖా సాహిత్యం రూపేణ, వీరిద్దరి గురించి చాలా తెల్సుకోవచ్చునని ఆశపడ్డాను. పుస్తకం ఇంకా చేజిక్కలేదు. అందుకని ఆశ పడుతూనే ఉన్నాను.

Amazon link

**************************************************************************************************

సాగరసంగమం – సినిమా నవల: నాకు సినిమాలు బొత్తిగా ఎక్కవు. అందునా, సాగరసంగమం సినిమా నన్ను బాగా ప్రభావితం చేసినా, నాకు నచ్చిన సినిమాల జాబితాలోకి రాదు. అయినా, ఇప్పుడీ సినిమా నవల చదవాలని పంతం పట్టుకొని కూర్చున్నాను. డివిడీ చాలా తేలిగ్గా దొరికేస్తుంది. కాని, చూడ్డం కాదు, చదవటం కావాలి. సినిమా చూడాలంటే, చాలా కష్టపడాలి. అక్కడసలే జయప్రద ఉంటుంది. ఉన్న రెండు కళ్ళూ ఆవిణ్ణి చూడ్డానికే సరిపోవు. పోనీ కళ్ళు ఆవిడకు అప్పజెప్పి, మాటల మీద మనసు పెడదామా అంటే, ఇళయరాజా నేపధ్య సంగీతం మతి పోగెట్టేంత బాగుంటుంది. ఆపైన కమల్‍హాసన్! ఒక్క తిప్పలు కావనుకోండి. అందుకని, ఇళయరాజా నేపధ్య సంగీతం మట్టుక్కే వింటూ ఉంటాను. అలానే, సినిమా నవలనూ చదవాలని. అర్థమయ్యాయిగా, నా తిప్పలు! అందుకనిగానూ, నన్నీ పుస్తకంతో ఆదుకోండయ్యా.. అమ్మలూ…

(అన్నట్టు, విశ్వనాథ్ గారు ఏవైనా పుస్తకాలు రాసారా?)

****************************************************************************************************

జంధ్యాల గారి నాటికలు: పాతికున్నాయట. మొన్న జనవరిలో విశాలాంధ్ర వారి హాస్య నాటికల సంపుటంలో ప్రస్తావించారు. అన్నీ రేడియో వచ్చాయట, ఆయన సినిమాలకు రాక ముందు. తెలుగు సినిమా తల్లి గుడ్డిలో మెల్ల అదృష్టం వల్ల, ఈయన సినిమాలకు అంకితమయ్యిపోయారు గానీ.. లేకపోతే, తెలుగు సాహిత్యం గర్వించదగ్గ రచయిత అయ్యేవారని నా ఉద్దేశ్యం. ఏదేమైనా, ఈయన నాటికలు చదవడమో / వినడమో చేయాలి. ఇవి పుస్తకం లేక ఆడియో రూపంలో ఎక్కడైనా దొరుకుతాయో తెలుపగలరు.

****************************************************************************************************

The Making of a Cricketer: Formative years of Sachin Tendulkar in cricket: అంతర్జాతీయ స్థాయిలో సచిన్ ఆడక మునుపటి కథను, అతడికి అత్యంత సన్నిహితుడు, మెంటర్, అన్నయ్య అయిన అజిత్ టెండూల్కర్ రాసిన పుస్తకం ఇది. నాకు చాలా ఆలస్యంగా తెల్సింది. ఇప్పుడు ముద్రణలో లేదు. కాని పొరపాటున దొరికితే, వదులుకునే ఛాన్స్ మాత్రం ఉండదు. మీగ్గానీ ఈ వివరాలు తెలిస్తే, చెప్పండి.

(PS: Can’t afford any of these in amazon.com or amazon.uk. Kindly don’t suggest the same.)About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..34 Comments


 1. Ramana

  సాహిత్య మిత్రులకు నమస్కారములు

  నా చిన్నపుడు పాఠ్య పుస్తకములోని స్నేహగీతి అనే పద్యము కొద్దిగా గుర్తుంది

  తైలాలు లేకుండ వెలిగేటి దీపం
  విద్యుత్తు లేకుండ వేలిసేటి దీపం
  మా స్నేహ దీపం మలిపితే పాపం

  దోస్తీని మించింది లేదు లోకాన
  అది లేకుంటే నగరమే కాన

  దీని పూర్తీ పద్యం ఎవరి దగ్గరయినా ఉంటే దయచేసి పోస్ట్ చేయండి లేదా నాకు మెయిల్ చేయండి
  adepu.ramana007@gmail.com


 2. రావిశాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని మనసు ఫౌండేషన్ వారు 2011లొ ప్రచురించారు.అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో లభ్యమవుతాయి. ఈమెయిలు యైడి పంపితే పుస్తకం ముఖచిత్రం ఇతర వివరాలు పంపిస్తాను.9949391110 కు ఫోన్ చేస్తే వివరాలు తెలుపుతాను.


 3. indira

  షెర్లాక్ హోంస్ హౌండ్ ఆఫ్ బాస్కార్ వైల్స్ తెలుగు లో జాగిలం అనే పేరుతో రాజ్యలక్ష్మి అనే ఆవిడ అనువాదం చేసారని విన్నాను.ఇది చాలా రొజుల క్రిందటి సంగతి.బాస్కార్ వైల్స్ ని భాస్కర వల్లి అని కాస్త తెలుగుకి దగ్గరగా అనువాదం ఉందని విన్నాను.వేటపాలెం గ్రంధాలయం లో ఉండేదిట.దీని గురించి ఎవరికైనా తెలుసా?


 4. ravi

  కాళోజి నారయణ రావు గారి నా గొడవ ,ఇదీ నాగొడవ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?నేను చాలా చోట్ల ప్రయత్నిచాను కాని ఎక్కడ దొరకలేదు, మీలో ఎవరిదగ్గరైనావుంటే తప్పకుండా చెప్పండి,ప్లీజ్


 5. మిత్రులకు, పాటలి నవల శ్రీమతి మల్లాది వసుంధర గారి రచన చాలాకాలంగా వెతుకుతున్నా. దొరకటంలేదు. 1973 ఆంద్రాయూనివర్సిటీ వారిప్రచురణ ఇది. 80లలో డిగ్రీవారికి నాండిటైలు గా వుండేది. మిత్రులు కౌటిల్య చౌదరి గారు DLI లింకు ఇచ్చారుగానీ ఒక్కో పేజీ చవాలంటే ఇబ్బందిగా వుంది. పూర్తిగా డౌన్ లోడ్ చేసుకునే మార్గముంటే చెప్పండి. పుస్తకం దొరికే తావు చెపితే మరీ మరీ కృతఙ్ఞతలు.


 6. surya

  I have seen your blog it is very good. but I didn’t find one book which is written by sanjivaDev and title is “Tegina Jnapakaalu”. I am requesting u to keep this book in Your blog.


 7. గౌరి గారు, ఈ నవల నాకు పాత పుస్తకాల్ షాపుల్లో దొరికితే మీకు తప్పక పంపిస్తాను.


  • ఏటి ఒడ్డున నీటి పూలు రచయిత్రి కొలిపాక రమామణి గారి ఈ మెయిల్ దొరికింది. ఆంధ్ర ప్రభ లో వచ్చిన ఆ సీరియల్ స్కాన్ ప్రతిని నాకు సుజాత గారు పంపించారు. రెండు భాగాలు మాత్రం మిస్ అయ్యాయి.సుజాత గారికి చాలా చాలా థాంక్స్
   krama38@gmail.com


 8. థాంక్స్ సుజాతా, మీరు ఇచ్చిన వివరాలకి. కొండూరు శ్రీదేవిగారి నవల ఏటి ఒడ్డున నీటి పూలు ఏ పత్రికలో , ఏ సంవత్సరం వచ్చిందో
  తెలిస్తే చెప్పండి. అలాగే విజయవాడ లో పాత పుస్తకాల షాప్ లో దొరికినా సరే. మంచి తెలుగు కథలను, నవలల్ని తమిళ రీడర్స్ కి అందించాలని నా ప్రయత్నం.
  యండమూరి, యద్దనపూడి ,ఓల్గా ,డి.కామేశ్వరి, పి.సత్యవతి గార్ల రచనలని తమిళంలో అనువదించాను.


  Gowri Kirubanandan


 9. దువ్వూరి వేణుగోపాల్

  నాకు పత్రికలోనే జ్యోతిలోనో సీరియల్ గా వచ్చిన తారాపథం పుస్తకం కావాలి. ఇది పుస్తకంగా వచ్చింది. దాదాపు 27 సంవత్సరాలక్రితం సీరియల్ గా వచ్చింది. మీ ఎవరి వద్దైనా ఉంటే చెప్పండి. దీన్ని వ్రాసిన వారు కె.బి.యన్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేసిన కొండముది శ్రీరామచంద్ర మూర్తిగారు? దీనిలో నక్షత్రాలు గురించి చెప్పారు.


 10. రాధేశ్యాం: హంసగీతం – వివినమూర్తి గారి నవల రచన.నెట్ లో ఈ దిగువ చిరునామాలో లభ్యమవుతుంది.
  http://rachana.net/VBT_Advt.pdf


 11. Budugoy

  Thanks to all for providing the info


 12. Purnima

  @రాఘవ: శారద లేఖలు సివిల్స్ లో తెలుగు సాహిత్యం తీసుకున్నవాళ్ళకి సిలబస్‍గా ఉందని, విశాలాంధ్ర టైపు షాపుల్లో కాకపోయినా, గ్రూప్ పరీక్షల పుస్తకాలు అమ్మే షాపుల్లో దొరుకుతాయనీ చెప్పారు. “దొరికేస్తుంది గదా!” అని నేను శ్రద్ధగా ప్రయత్నించలేదు.

  మాలతి గారు, కనుపర్తి గారి గురించి వ్యాసం రాసినప్పుడు, ఈ-పుస్తకం లింక్ ఎవరో ఇచ్చిన గుర్తు!

  @nagaraju: మీరిచ్చిన లింక్ ద్వారా కొనడానికి ప్రయత్నిస్తాను. ఆ పుస్తకం చదవడానికి మోటివేషన్, ఎడిటింగ్ గురించి తెల్సుకోవడం కన్నా, పర్కిన్స్, హెమ్మింగ్వేలు ఎలా పనికానిచ్చారు అన్నది.

  ఎడిటింగ్ గురించిన ఇతర మెరుగైన పుస్తకాల పేర్లు చెబితే, ఉపయోగకరంగా ఉంటుంది, నాకైనా, ఇంకెవ్వరికైనా.


 13. @Budugoy: సంజీవదేవ్ ఆత్మకధ తెగిన జ్ఞాపకాలు, స్మృతి బింబాలు మరియు గతంలోకి కలిపి తుమ్మపూడి పుస్తకంగా వెలువరించారు. మరిన్ని వివరాలకు దీప్తిధార చూడండి. ఈ పుస్తకం నవోదయ, హైదరాబాదు మరియు ఇతర పుస్తక దుకాణాలలో లభ్యమవుతుంది.


 14. Gowri krupanandan garu,

  ఏటి ఒడ్డున నీటి పూలు అనే నవల రాసింది శ్రీమతి కొండూరు శ్రీదేవి గారండీ! ఆవిడ విజయవాడలో మా మేనత్త గారి పక్కింట్లో వారి బంధువుల ఇంటికి వస్తుండేవారు కృష్న లంకలో! నవల మాత్రం విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరకొచ్చు గానీ బయట లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంతకు ముందు కూడా ఈ నవల గురించి ప్రస్తావించారు ఎవరో! మీరేనా? ఆ నవల అంత బాగుంటుందా?

  పూర్ణిమా, సాగర సంగమం, సీతాకోక చిలుక సినిమా నవలలు నా దగ్గర ఉండేవి ఎప్పూడో చాన్నాళ్ళ క్రితం! తర్వాత ఎప్పట్లాగానే పోయాయి. ఇంకోసారి వాటి ని సంపాదించే ప్రయత్నం చేస్తాను. దొరికితే ఇస్తాను.


  • Sudhakara Reddy

   Dear Ms.Kirubanandan

   The novel was published in 1970s in Andhraprabha weekly. I have it at my native place but not sure about its condition. Will try to get it

   S.Reddy


  • సుధాకర్ రెడ్డిగారు, జీవవాహిని, ఎటి ఒడ్డున నీటి పూలు ఈ రెండు నవలల్లో మీరు ఏ నవల మీ దగ్గర ఉందో చెప్పలేదు. ఏది ఉన్నా నాకు మాత్రం పెన్నిది దొరికినట్లే. కాస్త శ్రమ అనుకోకుండా నాకు నవల జెరాక్స్ ప్రతి పంపిచ గలరా? tkgowri@gmail.com


 15. రమణ

  @Budugoy: తెగిన జ్ఞాపకాలు ఇక్కడ దొరుకుతుంది. పుస్తకం.నెట్ లోనే ఎవరో ఈ పుస్తకాన్ని గురించి చెప్పగా చూసి, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. మీరు మళ్ళీ గుర్తు చేశారు. చూద్దాం చదవటం ఎప్పటికీ కుదురుతుందో!


 16. lalitha sravanthi

  జలంధర కథలు……సినీ నటుడు చంద్ర మోహన్ గారి సతీమణి జలంధర, ఈ కథలు స్నేహితురాలి దగ్గర చదివాను, భలే ఉంటాయి, విశాలాంధ్ర ముద్రణ.


 17. @Budugoy: ఇటీవలే సంజీవదేవ్ స్మృతి సాహిత్యం మూడు పుస్తకాలనూ (తెగిన జ్ఞాపకాలు, స్మృతిబింబాలు, గతంలోకి) కలిపి “తుమ్మపూడి” పేరిట సంపుటీకరించి విడుదల చేశారు. ఏ పెద్ద పుస్తకాల షాపులో నయినా దొరుకుతుంది. ‘సాక్షి’ పత్రికలో ఈ వార్తకు సంబంధించిన లింకు: http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=16160&Categoryid=18&subcatid=0


 18. Budugoy

  Two books I want to find…..
  1). Papa poyindi — bairagi
  2). Tegina jnapakalu — sanjeevadev


 19. jaya

  somaraju suseela garu rasina “ILLERAMMA KATHALU” dorikite tappaka chadavandi. mee taste ki saripotumdi


 20. @రాఘవ:
  నా దగ్గర సంగీత సౌరభం మొదటి మూడు భాగాలూ వున్నాయి. నాలుగో దాని కోసం నాకు తెలిసిన ఆని బుక్ షాపులూ, ఎగ్జిబిషన్లూ కూడా వెతికేసాను. తిరుపతి (TTD ప్రింటింగ్ ప్రెస్) లో కూడా అడిగాను. దొరక లేదు.aakhariki ఈ-బుక్ PDF లో http://www.archives.org లో దొరికింది.
  హంసగీతం అని వివిన మూర్తిగారి నవల ( శ్రీనాధుడి గురించి చారిత్రాత్మక నవల) గురించి కూడా చాలా సార్లు వెతికాను. దొరకలేదు. మీకేమైనా తెలిస్తే కాస్త చెప్దురూ..!!


 21. చాలా ఏళ్ళక్రితం ప్రభలోనో ,పత్రికలోనో జీవవాహిని, ఏటి ఒడ్డున నీటిపూలు అన్న సీరియల్స్ వచ్చాయి. వాటిని వ్రాసింది ఎవరో మీకేమైనా
  గుర్తు ఉందా? మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించే కథా వస్తువు.
  పుస్తకాలుగా దొరుకుతాయా? ఆకాలంలో ఎవరైనా సీరియల్ సేకరించి ఉంటే దొరుకుతుందో ఏమో? వివారాలు తెలిస్తే కనీసం, సీరియల్గా వచ్చిన
  కాలం, పత్రిక పేరు సరిగ్గా తెలిస్తే కథా నిలయంలో ఎంక్వయిరీ చేయవచ్చు.

  గౌరీ కృపానందన్
  tkgowri@gmail.com


  • సుజాత

   గౌరి గారూ,ఏటి ఒడ్డున నీటి పూలు 1968 లో ఆంధ్ర ప్రభలో సీరియల్ గా వచ్చినప్పటి భాగాలు కొన్ని దొరికాయి. మొత్తం దొరికితే బాగుండని వెదుకుతున్నాను

   అన్నట్లు ఆ నవర రాసింది శ్రీదేవి గారు కాదు, కొలిపాక రమామణి అనే రచయిత్రి!


 22. ఎప్పటినుండో నేను వెతుకుతున్న పుస్తకాలు కూడా జోడిస్తాను:
  ౧ గుంటూరు శేషేంద్రశర్మ గారి షోడశి, స్వర్ణహంస. విశాలాంధ్రవాళ్లకి కనీసం ఒక వంద సార్లు చెప్పి ఉంటాను… ఇప్పుడు నన్ను చూడగానే వాళ్లు చెప్పే మొదటి మాట “మీరడిగిన పుస్తకాలింకా రాలేదు సార్” అని! 🙁
  ౨ కనుపర్తి వరలక్ష్మమ్మగారి శారద లేఖలు.
  ౩ రావిశాస్త్రి నవలలు.
  ౪ శ్రీపాద పినాకపాణిగారి సంగీతసౌరభం నాలుగూ భాగాలూ కలిపి. దొరికితే రెండో మూడో భాగాలు దొరుకుతున్నాయి కానీ అన్నీ కలిపి కనబడటం లేదు. అందుకే ఇంకా కొనుక్కోలేదు. 🙁
  ౫ శ్రీనాథుని కాశీఖండం, భీమఖండం.


 23. nagaraju

  I have Maxwell Perkin’s book with me. “తిరగెయ్యడానికే ఐతే” you are welcome to barrow it from me [because there are better books on editing than Perkin’s letters]. However, If you want to buy it – you can get it from abebooks (abebooks may have most other books you are looking for).

  I sincerely thank you and others who write here and elsewhere for relinquishing their right to silence.
  –regards
  nagaraju  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
IMG_7389

ఆరు కాలాలూ, ఏడు లోకాలూ – 2016లో నేను చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: చీమలమర్రి స్వాప్నిక్ *********** కిందటి ఏడు మా ఇల్లు – చాదస్తం బాబాయిలు, రెబెల్ ...
by అతిథి
22

 
 
viswanatha-aprabha

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
1

 
 
cheekatirojulu

రాజకీయ బీభత్స దృశ్యం – చీకటి రోజులు

వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ (ఈ వ్యాసం మొదట పాలపిట్ట జనవరి 17 సంచికలో వచ్చింది. పుస్తకం.నెట...
by అతిథి
1

 

 
booksread

నేనూ, పుస్తకాలూ, రెండువేల పదహారూ …

వ్యాసకర్త: పద్మవల్లి ************* ఓ రెండేళ్లుగా కొన్ని కారణాల వల్ల నేను పుస్తకాలు చదవటం బాగ...
by అతిథి
0

 
 
booksread

2016 లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: Naagini Kandala ********************* ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలె...
by అతిథి
0

 
 
IMG_20170131_173605936

కథా కబుర్లూ కాలక్షేపమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************* పొత్తూరి విజయలక్ష్మి గారు హాస్యకథలకు ప...
by అతిథి
0