పుస్తకం
All about booksపుస్తకాలు

May 3, 2011

స్త్రీల వ్రతకథలు-2

Written by: తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

ఈ నోముల్లో కొన్ని ఒక్కరోజులో ముగించేవాటి నుంచీ కొన్నివారాల పాటు ఆచరించాల్సినవాటి దాకా, అలాగే కొన్ని నెలలపాటు చేయాల్సినవాటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు దీక్షపూనాల్సినవాటి దాకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు – అంగరాగాల నోము కొత్తగా ఈడేఱిన ఆడపిల్లలకు స్త్రీశరీరంలోని వచ్చే మార్పుల్ని బోధించడానికి ఉద్దేశించినటువంటిది. ఆ మార్పుల్ని వర్ణించే తెలుగుపాట కాలగర్భంలో కలిసిపోయింది. దాని పల్లవి ఒకటే మిగిలింది. రచయిత ఎంత ప్రయత్నించినా లభ్యం కాలేదట. అలాగే అట్లతద్దె పడుచుమొగుడే రావాలని, ముసలిమొగుడు వద్దేవద్దనీ ఏడాదికి ఒకరోజు ఆచరించేది. అట్లమీద ఆవపువ్వునోము ఒక ఏడాదంతా ప్రతిరోజూ చేసుకోవాల్సినది. అనంతపద్మనాభ వ్రతం ౧౪ సంవత్సరాల పాటు చేసుకోవాలి. ఆముక్తాభరణ సప్తమీ వ్రతం పన్నెండేళ్ళు చేసుకోవాలి. అలాగే కేదారేశుడి నోము ౨౧ సంవత్సరాల పాటు నోచుకోవాలి.

వీటిల్లో కొన్నికొన్నినోములు విచిత్రమైన ఫలితాల్ని ఆశించి ఆచరించేవి ఉన్నాయి. ఉదాహరణకు – పెద్దవారు ఉండగా చిన్నవారి మరణాల్ని అఱికట్టేందుకు అమావాస్యా-సోమవారపు నోము (అమాసోమవ్రతం) నోస్తారు. శనిపీడ నుంచి విముక్తి కోసం ఉప్పుగౌరీనోము-1 నోస్తారు. అంట్లూ-ముట్లూ ఇంట్లో అందఱికీ ఉద్దేశపూర్వకంగా అంటించడం వల్ల కలిగే మహాపాపాన్ని నివారించడం కోసం ఋషిపంచమీ వ్రతం చేస్తారు. పదే పదే కడుపులొచ్చి పోతూంటే కడుపు కదలని గౌరీనోము నోస్తారు. సవతితల్లి పెట్టే బాధల నుంచి విముక్తి కోసం కన్నెతులసి నోము నోస్తారు. ఆడవాళ్ళకు కంటిలోపాలుంటే అవి తీఱడం కోసం కాటుకగౌరి నోము నోస్తారు. జన్మజన్మలకీ బాలవితంతుత్వం సంప్రాప్తించకుండా ఉండడం కోసం కుంకుమగౌరి నోము నోస్తారు. పుట్టిన పిల్లలంతా వరుసగా చనిపోతూ ఉంటే కుందేటి అమావాస్య నోము నోస్తారు. (పురుషులాచరించే హిందూమతంలో ఇది సర్పదోషం క్రిందికొస్తుంది గనుక దీనికి రాహు-కేతువుల పూజ చేయాలి) ఇలా వందలాది ఫలితాల నిచ్చే నోములున్నాయి.

ఈ నోముల్లో ఎక్కువ భాగం శైవ/ స్మార్త సంప్రదాయానికి చెందినవి. వైష్ణవ సాంప్రదాయికాలు క్వాచిత్కం. అందుకనే ఎక్కువ వ్రతకథల్లో కథానాయకురాలు దుఃఖిస్తూంటే పార్వతీపరమేశ్వరులు “కాకతాళీయంగా ఆ దారిన వెళుతూ “ఏమమ్మా ! ఎందుకేడుస్తున్నావు ?” అని అడిగి తెలుసుకుని “దీనికి విఱుగుడుగా ఫలానా బచ్చలిగౌరి నోముంది. ఆచరించు” అని ఆ వ్రతవిధానాన్నంతా ఉపదేశించడం కనిపిస్తుంది. వీటికి చాలమట్టుకు స్త్రీదేవతలే ఫలప్రదాయినులు. పురుష దేవుళ్ళ ప్రమేయం బహు పరిమితం. కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆనాటి గ్రామీణ వ్యావసాయిక జీవితం తాలూకు ఛాయలు విస్తారం.

మచ్చుకు మూణ్ణాలుగు చూడండి :

(కడుపు చలవ కోసం) 37. కుందేటి అమావాస్య నోము కథ : ఒక కుందేలు మేతకు వెళుతూ  తన పిల్లల్ని ఒక బానలో దాచి వెళ్ళింది. అది అలా వెళ్ళగానే, పుట్టిన బిడ్డలెవఱూ దక్కక పుట్టెడు దుఖంలో ఉన్న ఒక చాకలిస్త్రీ వచ్చి ఆ బానను పొయ్యికెక్కించి మంటబెట్టసాగింది. అంతలో తల్లికుందేలొచ్చింది. అప్పుడు ఆ బానలో ఉక్కిరిబిక్కిరవుతున్న పిల్లలు , “ఉడికిపోతున్నాం అమ్మా !” అనగా  ఆ కుందేలు బాన చుట్టూ తిరుగుతూ”భయపడకండి బిడ్డల్లారా ! ఉడక్కుండా మీరు, ఉండ్రాళ్ళు దానమిచ్చాను” అంది. అంతలోనే పిల్లలు మళ్ళీ “చచ్చిపోతున్నాం అమ్మా !” అనగా, “చావకుండా మీరు, చలిమిడి వాయనమిచ్చాను” అంది. అది విని పిల్లలు “చిమిడిపోతున్నాం అమ్మా !” అనగా “చిమడకుండా మీరు, చిమ్మిలి వాయనమిచ్చా”నన్నది. “చిట్లిపోతున్నాం అమ్మా !” అన్నాయి పిల్లలు. “చిట్లకుండా మీరు, అట్లు వాయనమిచ్చా”నంది  తల్లి. “వేగుతున్నాం అమ్మా !” అన్నాయి పిల్లలు. “వేగకుండా వేపుడు బియ్యం వాయనమిచ్చా”నంది తల్లి. తిరిగి పిల్లలు “పేలిపోతున్నామమ్మా !” అనగా, బాన చుట్టు తిరుగుతూనే తల్లికుందేలు “పేలకుండా పేలాలు వాయనమిచ్చా”నన్నది. “ఈసారి పిల్లలు అడుగంటి పోతున్నామమ్మా !” అన్నాయి “అడుగంటి పోకుండా అటుకులు వాయనమిచ్చా” నన్నది. “పాకిపోతున్నాం అమ్మా !” అనగా “పాకకుండా పాయసం వాయనమిచ్చా”నంది తల్లికుందేలు. అప్పుడు పిల్లలు “పొంగిపోతున్నాం అమ్మా !” అంటే , “పొంగకుండా పోణీలు వాయనమిచ్చా” నన్నది. …”కాలుతున్నాం అమ్మా ! ” అనగా, “కాలకుండా గారెలు వాయనమిచ్చా”నన్నది. “కందుతున్నా”మనగా “కందకుండా కంద వాయనమిచ్చా”న న్నది. “మాడుతున్నా”మనగా “మాడకుండా మజ్జిగ వాయనమిచ్చా”నన్నది. వెంటనే బానలోని పిల్లలన్నీ చెక్కుచెదఱకుండా బయటికొచ్చి తల్లిని చేఱుకున్నాయి…. చాకలిస్త్రీ బాగా ఆలోచించి ఆ రోజు అమావాస్య కాబట్టి దానికి “కుందేటి అమావాస్య” అని పేరుపెట్టి నోముపట్టగా కడుపుచలవ గలిగి ఆమె కన్న సంతానం కలకాలం బతికింది. (పుటలు ౫౮,౫౯)

113. పదమూడు పువ్వుల నోము కథ :- పూర్వమొక పుణ్యాత్మురాలు పార్వతీపరమేశ్వరులను ప్రతిరోజూ పదమూడు పువ్వులతో పూజిస్తూండేది. ఆమె భక్తికి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై “ఏం కావాలో కోరుకో”మనగా, యథాప్రకారం వారికి పదమూడు పువ్వుల పూజ చేస్తూ ఇలా కోరుకోసాగింది :

మొదటి పువ్వు వేసి – భూమి, ఆకాశాలలాంటి తల్లిదండ్రుల్నీ
రెండవ పువ్వు వేసి – సూర్యచంద్రుల్లాంటి అత్తమామల్నీ
మూడవ పువ్వు వేసి – ముసలితనం రాని అందచందాల్నీ
నాలుగో పువ్వు వేసి – పట్టపు రాజును చెట్టపట్టాలనీ
అయిదో పువ్వు వేసి – పెనిమిటి పరస్త్రీల వంక కన్నెత్తి చూడకుండా తనను ఎడబాయకుండా ఉండాలనీ
ఆఱో పువ్వు వేసి – అష్టైశ్వర్యాలనీ, అయిదోతనాన్నీ
ఏడో పువ్వువేసి – ఏడుగుఱు కంసాలులు చేసిన ఏడువారాల నగలు ధరించాలనీ
ఎనిమిదో పువ్వువేసి – లక్ష్మివంటి, పార్వతి వంటి ఇద్దఱు కూతుళ్ళనిమ్మనీ
తొమ్మిదో పువ్వు వేసి – మువ్వలాడే కొడుకు, గజ్జెలాడే కొడుకు, అందెలాడే కొడుకు, అన్నమడిగే కొడుకు.ఉగ్గు కోరే కొడుకు, పడమట భారతం చదివే కొడుకు, ఉత్తరాదిని ఊళ్ళేలే కొడుకు, ద్వారమెత్తే కొడుకు, మగువలకు మనసైన కొడుకు, మనవల్ని ఇచ్చే కొడుకు,
అన్నదానం, భూదానం, గోదానం, కన్యాదానం, సుబ్వర్ణానం, వస్త్రదానం, పుస్తకదానం మొదలైన దశదానాలూ చేయించే కొడుకు, అన్ని విద్యలూ తెలిసినకొడుకు, అంత నేలా ఏలే కొడుకు – ఇలా పదముగ్గుఱు కొడుకుల్నీ
పదో పువ్వు వేసి – ఇంటిల్లిపాదినీ ఏకచ్ఛత్రంగా నడిపే శక్తినీ
పదకొండో పువ్వు వేసి – ఆయువంతా ఆరోగ్యాన్నీ
పన్నెండో పువ్వు వేసి – అల్లుడి ఇంటికి వెళ్లే అవసరం లేకుండా ఉండాలనీ
పదమూడో పువ్వు వేసి – అంతాన కైలాసంలో గౌరీదేవిసాన్నిధ్యం కావాలనీ

ఇలా పదమూడు కోరికలు కోరగా, దయ గల దేవుళ్ళు ఉమాశంకరులు ఆమెకు ఆ వరాలన్నీ ఇచ్చి అంతర్ధానమయ్యారు. (పుట-౧౨౦)

(ఇంగితజ్ఞానం కోసం) 126. పెద్ద సంక్రమణ దీపాల నోము :- ఒకానొక బ్రాహ్మణునికి ఒక్కతే కూతురు. అందువల్ల అతడామెను అతిగారాబంగా పెంచుతూ – తాను నేర్చుకున్న సమస్తమైన విద్యలనూ ఆమెకు నేర్పాడు. అన్ని విద్యలను నేర్చుకున్నప్పటికీ – ఆ పిల్లకి ఇంగితజ్ఞానం కలగనందువల్ల ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూండేవాడు. సహజంగానే ఆ బ్రాహ్మణుడు సూర్యభక్తుడు. ఒకనాడతను తీవ్రమైన ధ్యానంలో ఉండగా – మనస్సులో సూర్యోదయమైనట్లుగా అయ్యి – “భక్తుడా ! మీ కూతురి చేత పెద్ద సంక్రమణ దీపాల నోము పట్టించు. తద్ద్వారా ఆమె ఇంగితాన్ని కలిగినదై నీ చింత దూరమవుతుంది” అని నోము పట్టే పద్ధతి, ఉద్యాపన వగైరాలన్నీ – చెప్పినత్లు తోచింది. ధ్యానం నుంచి తేఱుకున్న ఆ విప్రుడు – అది భగవదనుగ్రహంగా తలపోసి కూతురి చేత ఆ నోము పట్టించగా ఆమె అత్యంత లోకజ్ఞానినియై ఎంతో ఆనందంగా జీవించి తన తండ్రికి మనశ్శాంతిని కలిగించింది. (పుట-౧౨౯)

(ఆహారం సహించడం కోసం) 127. పెరుగు మీద పేఱిన నెయ్యి నోము : పాడిపంటలు సమృద్ధిగా ఉన్న ఒకానొక సంపన్న దంపతులకు లేక లేక ఒక్కతే కూతురు కలిగింది. పసినాటి నుంచీ ఆ పిల్లకు పాలూ, పెరుగూ, వెన్నా, నెయ్యీ, మజ్జిగ అనేవి సరిపడేవి కావు. ఆ పిల్ల వాటికి దూరంగా ఉండటం వలన ఆమె మీద ప్రేమ కొద్దీ ఆ తల్లిదండ్రులు కూడా తాము ఆ పదార్థాలని తీసుకోవడం మానేశారు. వాటన్నిటినీ దానధర్మాలకే ఉపయోగించేవారు. ఇలా ఉండగా – ఒకనాడా ఊరొచ్చిన ఒక ఋషీశ్వరుడు ఈ దంపతుల బాధను విని, ఆలోచించి “దంపతులారా ! మీ అమ్మాయి చేత పెరుగు మీద పేఱిన నెయ్యి నోమును నోపించినట్లయితే ఆ పిల్లకు వాటిమీది విరక్తి తొలగిపోతుం”దని చెప్పాడు. తల్లిదండ్రులు ఆ ఋషీశ్వరుడి వద్ద ఆ వ్రతవిధానాన్నీ, ఉద్యాపననీ తెలుసుకొని, ఇంటికి చేఱి తమ కుమార్తెచేత నోము నోపించగా, అది మొదలు ఆ పిల్ల పాలాది వస్తువుల పట్ల రుచి కలిగినదై మసలసాగింది. (పుట – ౧౩౦) తిండి సహించని ఇలాంటి అమ్మాయిలు ఈరోజుల్లో కూడా విస్తారంగా ఉన్నారు.

రచయిత ఈ వ్రతాల కంటే ముందు “ఏడాది పొడవునా ఆచరించాల్సిన ప్రకృతిపూజల పట్టిక” ని కూడా ఒక పెద్ద పటంగా పుస్తకం మధ్యలో జోడించి ఇచ్చారు. ఈ విధమైన శీఘ్ర ఆచూకీ (Ready reference) చాలా సౌలభ్యంగా ఉంది.  చాలా ఉపయుక్తంగా ఉంది. వాటిల్లో వివిధ పవిత్ర వృక్షాలూ, ఆవు-దూడలూ, దీపదేవత, పాల గిన్నె మొదలైనవాటికి ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలో, చేస్తే ఏమేమి ఫలితాలు కలుగుతాయో జాబితా కట్టారు. అన్ని వ్రతాలకీ కలిపి సర్వసామాన్యంగా పాటించాల్సిన నియమ నిష్ఠలేంటనేది తెల్పడానికి మళ్లీ ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించారు. చూస్తే, మన ప్రాచీన తెలుగుస్త్రీల జీవితమంతా ఆముష్మిక సాధనలోనే గడిచిపోయిందేమో ననిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ, ఈ గ్రంథంలో అక్కడక్కడ రచయిత ప్రయోగించిన పచ్చివ్యావహారికం మాత్రం మింగుడుపడదు, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు చెందని అ-స్థానికులకి ! ఈ ఒక్క పుస్తకమనే కాదు. ఏ కారణం చేతనో ఇటీవలి కాలంలో రాజమండ్రి నుంచి ప్రచురితం అవుతున్న పుస్తకాల రచయితలు ఇతర తెలుగుజిల్లాల్ని దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నట్లు కనిపించడం లేదు.

నిజానికి ఈ పుస్తకం నేను మా ఆవిడ కోసం కొన్నాను. కానీ నేనే చదువుకుంటున్నాను.

(తరతరాల సాంప్రదాయిక సంపూర్ణ స్త్రీల వ్రతకథలు ; రచన – శ్రీ బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి మఱియు శ్రీమతి బొమ్మకంటి రుక్మిణి ; ప్రచురణ – గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్సు, కోటగుమ్మం, రాజమండ్రి – 533101 ఆంధ్రప్రదేశ్ ; ప్రచురణ సం|| 2008 ; పుటలు – 196 (క్రౌన్ సైజు) ; వెల – రు. 42)About the Author(s)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం4 Comments


  1. ఇది రాజమండ్రిలో గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వారి పుస్తకాల దుకాణంలో దొఱుకుతుంది. వారికి రాష్ట్రమంతటా పుస్తక పంపిణీ నెట్‍వర్క్ ఉంది కనుక మిహతా పెద్ద పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా ప్రయత్నించవచ్చు.


  2. Param

    EE pustakam ekkada labhistundo cheppagala vaaru..


  3. ప్రతిలో ముద్రణాస్ఖాలిత్యాలు ఏమీ లేవు కదండీ?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0