స్నేహపూరిత సుఖజీవన ప్రయాణం-గురవాయణం
ముందుగా చెప్పేయవలసిన మాట (disclosure in advance ): హైదరాబాదులో చాలామంది మోకాళ్ళు తీసేసిన (కృత్రిమ కీళ్ళతో మార్చి ఏమార్చాడనుకోండి) ప్రముఖ ఎముకల వైద్యుడు (orthopedic surgeon), ఈ పుస్తకం రచయిత డాక్టర్ గురవారెడ్డి నాకు చిరకాల మిత్రుడు; గుంటూరు మెడికల్ కాలేజీలో నా తర్వాత ఐదేళ్ళకు చేరినప్పటికీ ఇద్దరికీ ఆసక్తి ఉన్న కొన్ని విషయాల వల్ల మిత్రులమయ్యాము. కళ్ళజోడు, కమల్ హాసన్ మీసాలతో, సన్నగా (ఆ రోజుల్లో లెండి. నిజ్ఝం. కావాలంటే ఈ పుస్తకంలో ఫొటోలు చూడండి), ఎప్పుడూ నవ్వుతూ గలగలా హుషారుగా మాట్లాడుతూ ఉండే ఆ కుర్రాడంటే నాకు ఇష్టంగా ఉండేది. తర్వాత నేనూ అతనూ దేశాలు పట్టిపోవడంతో కొంతకాలం కలవలేకపోయినా, ఒక దశాబ్దం క్రితం మళ్ళీ మా స్నేహాన్ని పునరుద్ధరించుకున్నాం. ఇంకో విషయం: ఈ పుస్తకంలో నా గురించి, అరుణ గురించి, మా తెలుగు నాడి గురించి కాసిని మంచి మాటలు కూడా ఉన్నాయి.
2007లో నవ్య వారపత్రికలో డాక్టర్ గురవారెడ్డి నవ్య మిర్చి అని ఒక కాలం రాయబోతున్నాడని ప్రకటన చదివితే చాలా ఆశ్చర్యం వేసింది. మనవాడిలో చాలా కళలు ఉన్నాయి అని తెలుసు కానీ ఈ కళ నాకు కొత్త. రాంగోపాల్ వర్మకన్నా ముందే నా ఇష్టం – మీ కష్టం అంటూ మొదలుబెట్టి, మొదటి కాలంలోనే తాను ఏం రాయబోతున్నాడో చెప్పేశాడు. “ఇక నేను ప్రతివారం ముచ్చటిస్తాను. దేని గురించి అని అడగద్దు. ఒకటని కాదు. ఏది తోచితే దాని గురించి… సింపుల్‌గా చెప్పాలంటే ఓ ఇద్దరు స్నేహితులు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నట్లు. శ్రీశ్రీ గారన్నట్లు ఏ విషయం అయినా సరే … కుక్కపిల్ల నుంచి అగ్గిపుల్ల దాకా…చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న నానుడి వినే ఉంటారు. దానర్థం … చెప్పేవాడికి మాత్రం ఏమాత్రం అడ్డూ ఆపూ లేవని. నాక్కూడా శ్రీరమణగారు అలాంటి లైసెన్స్ ఇచ్చేశారు. ఇక నా ఇష్టం, మీ కష్టం.” ఇద్దరు స్నేహితులు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నట్లు అన్నాడు చూడండి, అక్కడే ఉంది అసలు కిటుకు. గురవారెడ్డితో కబుర్లు చెప్పటమంటే అతను చెప్తుంటాడు, మనం వింటూ ఉంటామంతే.
ఇట్లా బెదిరించి మరీ మొదలెడితే ఇంకేం చేస్తాం, కొన్నాళ్ళేగా, భరిద్దాంలే అనుకుంటే, 52 వారాలపాటు (ఒక సంవత్సరం) ఆపకుండా రాసేశాడు. కొన్ని స్వవివరాలు, కొన్ని పాత స్మృతులు (నోస్టాల్జియా), కొంత యాత్రావర్ణన (ట్రావెలాగ్), కొంత వైద్యుడిగా తన అనుభవాలు, కొంత తన అభిరుచులు, కొంత తాను అభిమానించేవారి విషయాలు, చాలా తనపై తనే వేసుకున్న జోకులు అన్నీ కలిపి తనకిష్టమైనవి మనతో పంచుకొన్నాడు. వాటిలో చాలా విషయాలు తెలుగు ప్రజలకూ ఇష్టమవటంతో గురవారెడ్డిని చాలామంది పాఠకులు వారానికొకసారి తమ ఇంటికొచ్చి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతున్న స్నేహితుడిలానే భావించి, అభిమానించారు.
వీటిలో నాకు నచ్చిన వ్యాసాలు చాలా ఉన్నా, ముచ్చటగా మూడింటి గురించి చెబుతాను. ‘అను’బంధం అనే కాలంలో గురవారెడ్డి పూనాలో కాజువాలిటీ (ఎమర్జెన్సీ) డాక్టరుగా పనిచేస్తున్నప్పుడు దెబ్బ తిన్న వెన్నుపూసతో చేరిన రమేష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుకి వైద్యం చేసినప్పుడు, అతని ఫియాన్సీ (దీనికి సరైన తెలుగు మాట ఉన్నట్లు తోచటం లేదు) అను కేల్కర్‌తో పరిచయమయ్యింది. రమేష్, అను ప్రేమించుకుని, పెళ్ళిచేసుకోవటానికి పెద్దల అనుమతిపొంది, పెళ్ళికి నిశ్చితార్థం చేసుకొన్న రోజున అవుంద్ అనే కొండమీద గుడికి దేవుడి ఆశీస్సులకోసం వెళ్ళారు. అక్కడ కొంతమంది రౌడీలు ఆ అమ్మాయిని గొడవచేయబోతే అడ్డుకోబోయిన రమేష్‌ని ఆ రౌడీలు కొండమీంచి కిందకి తోసేశారు. రాత్రింబవళ్ళూ కృషి చేసినా కాంప్లికేషన్స్‌వల్ల మూడో రోజు రాత్రి రమేష్ మరణించడం ఈ కుర్ర డాక్టర్ని చాలా బాధించింది. చాలా ఏళ్ళ తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సీనియర్ పొజిషన్లో ఉన్న అను గురవారెడ్డికి మళ్ళీ తారసపడింది. ఆ అమ్మాయిని “మీ ఆయన ఏం చేస్తుంటారు” అని అడిగాడు. అను, చిన్న నవ్వు నవ్వి, “డాక్టరుగారూ, మా ఇద్దరకూ పెళ్ళి అయినా అవకపోయినా రమేషే నా భర్త అనుకున్నాను. తన జ్ఙాపకాలు తప్ప నా కెవ్వరూ తోడు లేరు, అక్కర్లేదు.” అని చెప్పేసి వెళ్ళిపోయింది.
ఈ వ్యాసంలో ఉన్న అనుభూతులకు పూర్తి వైరుధ్యంతో నడిచిన కాలం గురకారెడ్డి. “కొన్ని గురకలు వినబడతాయి. కొన్ని వెంటబడతాయి. నాది రెండో రకం ఐతే నేనేం చేయగలను.” అంటూ అసహాయంగా అడుగుతూనే, తన గురక తననీ, తనకు దగ్గరవాళ్ళని ఎంత ఇబ్బందిపెడుతుందో చాలా హాస్యంగా వర్ణించాడు గురకారెడ్డి. ఆయన గురక పోగొట్టడానికి, పోనీ తగ్గించడానికి దగ్గరవాళ్ళంతా తాపత్రయపడుతున్నా, మెలకువలోనే కాదు నిద్రలో కూడా తన “స్వరపేటిక మూగవోదని, రానున్న కాలంలో మీదపడే వయసు ప్రభావంతో మరిన్ని కొంగ్రొత్త రాగాలని పలికిస్తూ నా దగ్గరవారినీ, దూరంగా వున్న వారిని సమంగా అలరిస్తూనే ఉంటుం”దని తెలిసిన స్థితప్రజ్ఙుడు గురవారెడ్డి. ఇది చదువుతుంటే చాలా ఏళ్ళ క్రితం చదివిన తంబుగారి గుండు కథ గుర్తుకొచ్చింది. ఈ వ్యాసంలో హైలైట్: గురవారెడ్డి గురక గురించి ఆయన భార్య డాక్టర్ భవానీకి ఎవరో సానుభూతి ప్రకటించబోతే, ఆవిడ చాలా కూల్‌గా “బోరింగ్ భర్తకన్నా స్నోరింగ్ భర్త మిన్న” అన్నదట. బ్రావో! ప్రేమించి, ఎక్కువ పాట్లు పడకపోయినా, (పాటలు పాడి, ప్రేమలేఖలు రాసి, సెల్లుఫోనుల్లేకపోయినా సొల్లు కబుర్లు చెప్పాడనుకోండి, కానీ అవి ఆ అమ్మాయికి పాట్లు) పెళ్ళాడిన గురవారెడ్డి అదృష్టవంతుడనటానికి ఇంకేం దృష్టాంతం కావాలి?
తల్లితండ్రులతో తమ అనుబంధం గురించి అందరూ రాస్తారు. కాని, గురవారెడ్డి తన అత్త గారు (మాజీ కాంగ్రెస్ మంత్రి శ్రీమతి భవనం జయప్రద) గురించి వ్రాసిన కాలం, పోయినోళ్ళందరూ మంచోళ్ళు చాలా ఆర్ద్రంగా ఉంది.
నవ్య మిర్చిలో వచ్చిన వ్యాసాలతో పాటు, ఒక నిశీధ రాత్రి, గుంటూరు మెడికల్ కాలేజీ హాస్టల్లో, వర్షం హోరు మధ్య, కుర్రతనం జోరులో ఒక బలహీన క్షణంలో గురవారెడ్డి మొదటిసారిగా కలం జారగా పుట్టిన బిడ్డ – రెండు జడలు, నాలుగు కళ్ళు, మూడు ముళ్ళు అనే కథ ఈ పుస్తకంలో బోనస్.
ముళ్ళపూడి వారి ముందు మాటకు పెట్టిన శీర్షిక, “ముందు ఏ మందు?”, గోరంత దీపం చిత్రంలో ఒక మినీ కవిత, “ఏ మందు ఏ మందు, ఈ మందు నే మందు; ఈ మందు ఇక బందు నీ చూపు ముందు”ను గుర్తుకు తెచ్చింది.
బాపు వేసిన ముఖచిత్రం, ప్రతి వ్యాసానికి కొత్తగా తోడు చేసిన రాజు కార్టూన్లు, రంగురంగుల ఫొటోలు పుస్తకాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. పుస్తకం చాలా అందంగా ముద్రించారు (కళాజ్యోతి). అచ్చుతప్పులకోసం వెతుక్కోవాలి.
ఇందులో వ్యాసాలు చదువుతుంటే గురవారెడ్డిలోని భావుకుడు, కళాప్రేమికుడు, జీవితాన్ని ఆనందించటం ఎలాగో తెలిసినవాడు, మాటకాడు, చమత్కారి, మంచి డాక్టరు, మంచి స్నేహితుడు, మంచి కుటుంబసభ్యుడు, మంచి మనిషి కనిపిస్తారు. గురవారెడ్డి బొమికల వైద్యంతో పాటు తన మాటలతో ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచుతూ మానసిక వైద్యం కూడా చేసేస్తూ నాబోటివారికి పని తగ్గిస్తున్నా, నా మిత్రుడు అంటూ మురిపెంగా అతన్ని చూసుకుంటూ, అతనూ, భవానీ, ఇలాగే నూరేళ్ళపాటు అందర్నీ ఆనందపరుస్తూ, ఆరోగ్యాలు బాగుపరుస్తూ, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ బతకాలి అని కోరుకుంటున్నాను.
రాసింది నా మిత్రుడే ఐనా, మంచి కాలక్షేపపు పుస్తకం.
—
గురవాయణం
డాక్టర్ గురవారెడ్డి
జనవరి 2011
Shantha-Vasantha CharitableTrust
No. 822A, Road No. 40
Jubilee Hills, Hyderabad 500 033
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు
148 పేజీలు; 200 రూ.
***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
leo
@బొల్లోజు బాబా: Thanks so much for pointing to the interview!
Radhika
ఫియాన్సీ అంటే “వాగ్దత్త” అనుకుంటానండి!
రామ
ఫియాన్సీ అంటే “కాబోయే భార్య” ఏమో కదండీ? 🙂
Gopal Reddy Gade
Jampala garu
Thoughrowly enjoyed your afterword on Guruvayanam. Was there on its release day. Have known him only in the last few years. I always try to spend some time with him during my visits to Hyd. I can only say he is “Just a great guy to be with”.
Regards
Gopal
బొల్లోజు బాబా
i followed some of his columns.
my impression when i saw him in open heart interview by abn channel is the same as this..
భావుకుడు, కళాప్రేమికుడు, జీవితాన్ని ఆనందించటం ఎలాగో తెలిసినవాడు, మాటకాడు, చమత్కారి, మంచి డాక్టరు, మంచి స్నేహితుడు, మంచి కుటుంబసభ్యుడు, మంచి మనిషి