ఏరిన ముత్యాలు

(“కృష్ణారెడ్డి గారి ఏనుగు” కథా సంకలనం గురించి ఆచార్య తుమ్మల రామకృష్ణ ముందుమాట)
*****************************************************
సాధారణంగా కనబడే శ్రీ శాఖమూరు రామగోపాల్‌ అసాధారణమైన పనులను చేస్తుంటారు అని చెప్పేందుకు దోహదపడే ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు’ అనే శిరోనామంతో పాఠకుల ముందుకు వస్తున్న ఈ పుస్తకం ఒక అక్షర సాక్ష్యంగా మనముందు నిలబడుతది. రామగోపాల్‌ ఎంతో ఇష్టంగా కన్నడ కథా సాహిత్యంలోని కొన్ని గొప్ప కథల్ని ఎన్నుకొని వాటిని తెలుగులోకి అనువదించారు.

పూర్ణచంద్ర తేజస్వి, శాంతరస, నాగమంగల కృష్ణమూర్తి, కూదవళ్ళి అశ్వత్థ నారాయణరావ్‌, కుం. వీరభద్రప్ప, ఆర్‌.టి. శరణ్‌, ఎస్‌. తమ్మాజిరావ్‌, కె. సత్యనారాయణ,  హెచ్‌. రమేష్‌ కెదిలాయ, ఎ.ఆర్‌. కృష్ణ శాస్త్రి, గోరూరు రామస్వామి అయ్యంగార్‌, కు.వెం.పు మొదలైన కథకులు తమ విశిష్ట రచనల ద్వారా కన్నడ కథా సాహిత్యాన్ని పరిపుష్టం  చేసిన కథకులని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. వీరి కథలు చదివితే ఆ విషయం పాఠకులైన మీకే బోధపడుతది.

అనువాదం అంటేనే కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అనువాదం చేసే వ్యక్తికి అటు మూల భాష (కన్నడం); ఇటు లక్ష్య భాష (తెలుగు)… ఈ రెండిటికి సంబంధించిన సమగ్ర పరిజ్ఞానం ఎంతో ఉండాలి. ప్రత్యేకించి కల్పనా సాహిత్య సంబంధమైన నవలల్ని, కథల్ని (కథానికల్ని) అనువాదం చేయడం అంత సులువైన పనేమీ కాదు. పాత్రల స్వభావాలు, పాత్రల అంతరంగాలు, సంభాషణల లోతు, నేపథ్యాల మూలాలు, కంఠస్వరాల అంతరార్థాలు, రచయితల ఉద్దేశం, రచయిత ప్రాపంచిక దృక్పథం మొదలైన అనేక అంశాలు మూలభాషలో లాగనే లక్ష్యభాషలోకి రావాలి. రచయిత హృదయ ఆవిష్కరణ జరగాలి. అప్పుడే అది మంచి అనువాదం అన్పించుకొంటది. అందువల్లే ఒక భాషలో ఎన్నో అనువాదాలు వస్తున్నా కొన్ని మాత్రమే కలకాలం గుర్తుంటాయి. అలా గుర్తుండి పోయే అనువాదాలలో ఒకటిగా రామగోపాల్‌గారి ‘కృష్ణారెడ్డి గారి ఏనుగు’ అనే  శిరోనామంతో ఉన్న ఈ అనువాద కన్నడ కథామాలిక చిరస్థాయిగా నిలుస్తదని నా వ్యక్తిగత అభిప్రాయం. రామగోపాల్‌ తెలంగాణా, రాయలసీమలకు సరిహద్దుగా ఉండే కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో కొద్ది కాలం వ్యవసాయం చేయటం వలన, తన మాతృభాష కన్నడం గాకపోయినా కన్నడం నేర్చుకొని, ఆ భాషలోని మాధుర్యాన్ని ఒడిసి పట్టుకొని, దివంగతురాలైన తన తల్లి ఋణం తీర్చుకోడానికి అన్నట్లు ఇప్పుడెంతో శ్రమ కోర్చి, నిస్వార్థంగా నిరాపేక్షతో కన్నడ నగమేరు ధీరులైన కథకుల కథల్ని మనకు అనువదించి అందించడం వెనుక అతనికి సాహిత్యం పట్ల ఉన్న అభిరుచి, మమకారం, గౌరవం ఎలాంటిదో తెలుస్తుంది.

రామగోపాల్‌ సాదాసీదాగా నిరాడంబరంగా కన్పించినా ఎంతో లోతైన అవగాహన, పరిశీలన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. అనువాద క్రీడను దైవంగా భావించే వ్యక్తి. పట్టు వదలని విక్రమార్కుడి లాంటి వ్యక్తి. ఈ మాట (వాక్యం) ఎందుకు చెపుతున్నానంటే – వైయక్తిక కారణాలవల్ల గత నాలుగేళ్ళుగా సృజనాత్మక సాహిత్యం వైపు కన్నెత్తి చూడలేకపోయిన నన్ను మళ్ళీ అటువైపుకు ఓర్పుతో నేర్పుతో మళ్ళించిన వ్యక్తి రామగోపాలే!

నా స్వంత విషయం ఇక్కడొక మాటగా చెప్పాలి. కన్నడ భాషా పత్రికలు కథల్ని ఎంతగానో గౌరవిస్తాయి. నేను రాసిన ఊరి మద్దిస్తం, మహా విద్వాంసుడు… ‘పంచాయితీ’ ‘నాదస్వరం’ అనే పేర్లతో దిన పత్రికైన కన్నడ ప్రభలో ప్రచురించబడినవి. సుప్రసిద్ధ కథకుడు మరియు నవలా రచయితైన కుం. వీరభద్రప్పగారు నా కథల్ని కన్నడంలోకి అనువదించారు. అవి ‘కథా కావ్యం’ అనే పేరుతో కన్నడ ప్రభలో అచ్చయిన విధానం చూస్తే మనస్సు ఎంతగానో ఉప్పొంగిపోయింది. కన్నడ ప్రభలో ఆ శీర్షిక క్రింద కథ తప్పితే మరేమి ఉండదు. మనకు లాగా గజ్జి తామర మందుల ప్రకటనల మధ్య కథను ప్రచురించకపోవడం ఎంత అదృష్టం రచయితలకు!

రామగోపాల్‌ అనువాదం చేసిన ప్రతి కథా ఒక ఏరిన ముత్యం లాంటిది. ప్రతి కథలోనూ దేని ప్రత్యేకత దానిదిగానే ఉంది. ప్రతి కథలో కన్నడ మట్టి వాసన కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. తనది యథాతథ అనువాదం అని రామగోపాల్‌ చెపుతున్నా ఈ కథల్ని చదువుతుంటే కన్నడ కస్తూరి అనే నానుడి పదే పదే గుర్తుకొస్తుంది. తప్పక ఈ కథలు తెలుగు పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి. వాళ్ళ భావ సంస్కారాలలో  మార్పును తెస్తాయి. ఆలోచనలలో, అవగాహనలలో మార్పును తెస్తాయి. సాహిత్యానికి ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది.

ఇరుగు పొరుగు మనుషులతో సంబంధాలు తెగిపోతున్న ఈ రోజులలో ఇలాగైనా (అనువాదాల రూపంలో) ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య భిన్న భాషా సంస్కృతుల మధ్య కల్సియుండాల్సిన గొప్ప అనుబంధాల్ని పెంపొందించుకుందాం భారతీయులలాగ.

చివరిగా ఒక మాట సుమా…. శ్రీ శాఖమూరు రామగోపాల్‌ మనకు కన్నడిగులకు మధ్య ఒక వారధిలా నిలబడి, మున్ముందు మరిన్ని మంచి కథల్ని అనువదించి, అందించి మనందరి మన్ననలకు పాత్రుడవుతాడని ఆశిద్దాం…. ఈ కథల్ని ఆదరిద్దాం…..!

ఆచార్య తుమ్మల రామకృష్ణ

తెలుగు శాఖ, మానవీయ శాస్త్రాల విభాగం

హైద్రాబాద్‌ విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ పోస్టు

హైద్రాబాద్‌ – 46

23-05-2009

కృష్ణారెడ్డి గారి ఏనుగు పుస్తకం కినిగె.కాం కొనుగోలు చేయవచ్చు

You Might Also Like

Leave a Reply