గజ ఈతరాలు – గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు
రాసిన వారు: కాకుమాని శ్రీనివాసరావు
*******************
చలం తన రచనల గురించి చెబుతూ “అది నేను, నా రక్తం, నా గడచిన జీవితపు ఛాయ” అంటాడు. గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు చదువుతున్నప్పుడు ఇవే మాటలు గుర్తుకువస్తాయి. ఈ కథల్లో రచయిత ఆత్మీయతే కాదు, రక్తమాంసాలూ ఉన్నాయి. కథాశిల్పం పట్ల గొప్ప అవగాహన, నైపుణ్యం ఉన్న కథకుడు కావటం వల్లే ఇప్పటిదాకా అతను రాసినవి ముప్పైలోపే. అందులోంచీ అత్యుత్తమకథలు పది ఎంచి “గజ ఈతరాలు” పేరుతో ఎన్.కే. పబ్లికేషన్ సంకలనం చేసింది.
జీవితంలోని ప్రతి అనివార్యతనూ ఆధునికం అనుకుని రాజీధోరణితో సరిపెట్టుకుని మన స్వీయజీవిత నేలమాళిగలోకి దూరిపోయే మానవజీవిత పరంపరలో, నిష్క్రియాత్మకంగా అలసత్వంతో బిగుసుకుపోయిన మానవసంబంధాల గురించీ, సకల మానవ వైఫల్యాల గురించి రచయిత మరమ్మత్తుకు పూనుకుంటాడు ఈ కథల్లో.
దాదాపు అన్ని కథల్లోను మానవజీవన వైఫల్యాలు, సరళీకృత ఆర్థిక విధానాలు వాటి పరిణామాలు చేసిన మానని గాయాలు కనిపిస్తాయి. కథలన్నీ చదివాక మనం ఏది కోల్పోయామో గుర్తుచేసుకుని హృదయం పెనుగులాడుతుంది. ముందుమాటలో చెప్పినట్లు ఈ రచయిత “కొట్టినా తట్టుకోగలడు కానీ ప్రేమిస్తే తట్టుకోలేడు, గుండెతడినీ, కంటిచెమ్మనీ దాచుకోలేడు”. మానవాళిపట్ల అపారమైన ప్రేమగలిగిన రచయిత. కథలో తాను సంపూర్ణంగా ప్రతిఫలించాలనే ఆర్తిచేత తనివితీరా కథ చెబుతాడు. కథ చెప్పాక కూడా తాను ప్రేమించే పాఠకుడికి ఇంకా దగ్గరవాలనే తపనతో ప్రతికథ చివరా దాని నేపథ్యాన్ని గురించి చెబుతాడు.
ఈ సంకలనంలోని మొత్తం పది కథల్లో ఉత్తమపురుషతో చెప్పిన కథలు ఎనిమిది. “నేను” అని చెప్పే కథలు రాయటం ఎంత తేలికో అంత కష్టం కూడా. బలమైన కథావస్తువుతో పాఠకుడికి బాగా దగ్గరవాలన్న తపన కలిగిన రచయితే ఈ మార్గం ఎంచుకుంటాడు. చిన్నచిన్న కథాగతాంశాల్ని కూడా నేర్పుతో తీర్చిదిద్దటం, కథలో వాటిని ప్రధానాంశాలకు బలాన్నిచ్చేవిగా మలచటంలో రచయిత పనితనం, నేర్పు మెచ్చుకోదగ్గవి. రచనాపరంగా ఒక విశేషమేమిటంటే కథల్లో పెద్దపెద్ద పారాగ్రాఫులుండవు. చిన్నచిన్న వాక్యాలతో రెండుమూడు లైనులతో విరిగిపోయే చిన్న పేరాలే ఉంటాయి. దీనిమూలంగా పఠిత కథలో తన అనుభవసాంద్రతను పెంచుకుంటాడు. ఈ కథకుడు ఎక్కువ దృశ్యశకలాల్ని ఈ రకంగా నేర్పుతో అల్లడంద్వారా మొత్తం కథను విసుగులేకుండా సునాయాసంగా పాఠకుడిచేత అనుభవింపచేస్తాడు.
పాలమూరు పేదలు గల్లంతైన జీవితాలు మూటగట్టుకొని వలసకూలీలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోపడి ధ్వంసమైపోయిన విషాదాన్ని, కనుమరుగవుతున్న పల్లెలను, గ్రామీణజీవన సౌరభాన్ని గుర్తుకుతెచ్చే కథ “వలసపక్షులు.” కళ్ళముందే ప్రపంచాలు మారిపోవడం ఈ కథలో చూడొచ్చు. శ్రమజీవులమధ్య మానవసంబంధాల్ని వర్ణించిన అరుదైన కథ ఇది. ఈ కథ చివరలో పాఠకుడు గొప్ప ఉద్వేగాన్ని పొందుతాడు.
జగదీశ్వరరెడ్డిలోని అత్యుత్తమ కథకుడిని బహిర్గతం చేసిన కథ “చీడ”. తన మనసుకు దగ్గరగా ఉన్న వస్తువుని తీసుకొని తనకు తాను తెలుసుకుంటూ సాగిన కథ చీడ. మానవుని దుఃఖానికి – జీవనవైఫల్యాలకుగల వాస్తవమూలాలను అంతర్లీనంగా చూపెట్టిన కథ ఇది. కథ చదివాక పుట్టెడు దుఃఖాన్ని, దిగుల్ని ఒడిలోపెట్టుకుని తల్లడిల్లిపోతాం. కళ్ళముందే పచ్చటిజీవితాలు చీడపట్టిపోతుంటే ఏమీచేయలేక చూస్తూ ఉన్న చేతుల్లేని సమాజంలోని “మంచికి” సంపంగి ప్రతీక. అందమైన పూలతీగల్లాంటి బాల్యం ఆర్థిక ఆదరువు కోల్పోయిన కుటుంబాల్లో చిధ్రమవుతుంటే ప్రకృతి అక్రోశం మానవ మనస్తత్వ మూలాల్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. అందమైన జీవనం తిరిగి అందరూ పొందాలనే రచయిత తపనకు అద్దంపడుతుందీ కథ.
ఈ కథలోని గాఢమైన ప్రకృతి పరిశీలన మెచ్చుకోదగిన మరొక అంశం. ఎన్నోరకాలైన పూలమొక్కలతో మమేకమైన ఒక అద్భుతజీవనశైలిని రచయిత గుర్తుకుతెస్తాడు. మొక్కల ఆకులపై రాత్రుళ్ళురాలిన మంచుబిందువులను పిచుకలు ముక్కుల్తో పొడిచి నీరుతాగుతుంటే వాటికి కితకితలు పెట్టినట్లుగా రచయిత రాయడం మనల్ని కూడా పులకరింపచేస్తుంది. అర్థరాత్రి ఆకాశంలో మిణుకుమిణుకుమనే గొరుకొయ్యలు ఎందరికి తెలుసు. అన్ని కథల్లోకంటే ఈ కథలో రచయిత ఆత్మీయతను పాఠకుడు ఎక్కువగా ఇష్టపడతాడు.
సమాజంలోని “మంచి” యొక్క నిస్సహాయతను చీడ కథలో చూస్తే దానికి ఆగ్రహం వచ్చినట్లు “జగదంబ జంక్షన్” లో రచయిత చూపెడతాడు. ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఓ శ్రమైకజీవన సౌందర్యాన్ని ముచ్చటగొలిపే విశాఖమాండలికపు సొగసుతో అద్ది ఈకథలో మనముందుంచుతాడు. సత్యానికి అసహనం, అగ్రహం వచ్చినపుడు అది కొట్టే చెంపదెబ్బలాగ గురమ్మ గుర్తుండిపోతుంది. రావిశాస్త్రి కథల్లోని నూకాలమ్మ, ముత్యాలమ్మల్లాగా చిరకాలం మిగిలిపోయేపాత్ర గురమ్మ. కథ చదివాక చదువుకోవల్సిన వయసులో పాడుకుంటూ అడుక్కుని జీవనం వెళ్ళదీస్తున్న బాల్యంపట్ల విపరీతమైన దయ, సానుభూతి, వారిని దగ్గరకుతీయాలనే ఆలోచన కలుగుతుంది. భద్రంగా బతికే జీవితాల్లో ఉండే సుఖం, లాలస పేదల జీవితాలకు దూరమై ఊరించడం గమనించాల్సిన మరొక అంశం.
తనకు చిన్నప్పటినుండీ తెలిసిన గజ ఈతరాలు పూర్ణమ్మ కాళ్ళకు తాళ్లతో బండరాయి కట్టుకొని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవటం విని గుండెలో ముల్లుగుచ్చుకొన్నట్లు అనుభవించిన విషాదాన్ని మనలో పలికించడానికి తన బాల్యాన్ని ఆలంబనం చేసుకొని గొప్ప పనితనంతో చెక్కిన కథాశిల్పం “గజ ఈతరాలు”.
పత్రికల శీతకంటి చూపుతో చిక్కిసగమైపోయిన నేటి తెలుగుకథలు చదివి విరక్తితో ఉన్న పాఠకులకు రచయిత తనివీతీరా చెప్పిన ఈ కథ గొప్ప సంతృప్తినిస్తుంది. కథలో కనపడే రచయిత అభిరుచికీ తన అభిరుచికీ చక్కటి సంవాదం కుదరడం ద్వారా కథనంలో పూర్తిగా పాఠకుడు లీనమవుతాడు. అడవిలోని రకరకాల చెట్లు, పండ్లు, పిల్లల ఆటలు, వాటి వివరాలు, ఆహ్లాదకరమైన హాస్యం, చక్కటి పనితనం మొదలైన అంశాలతో ఈ కథ ఎంతో కాలం గుర్తుండిపోతుంది.
అల్విన్ వాచ్ కంపెనీ మూతపడటంతో జీవచ్చవాలుగా మారిన, రోడ్డునపడ్డ కూలీల కార్మికుల ఆత్మఘోషను వినిపించే కథ “బతుకుగోస”. వైవిధ్యమైన టెక్నిక్ తో మనల్ని కూడా ఆత్మతోపాటు కథంతా తిప్పుతాడు.”గోస్ట్” అనే సినిమాలోని ఈ టెక్నిక్ ని అనుసరించానని రచయితే చెప్పుకున్నాడు.
రచయితే చెప్పినట్లు “పుడమిపుటల్లోంచి పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చిన అల్పాయిష్కు ఉసుళ్ల వంటి మనుషులు ఆకలి మంటలోపడి జీవనార్పణ చేసుకునే విధ్వంసం “ఉసుళ్ళు” కథలో కనిపిస్తుంది. రకరకాల ఆకళ్ళతో నిండిన సమాజం అన్నెం పున్నెం ఎరుగని యాదమ్మ లాంటి అడుక్కుతినే బాలికలను బలిచేయటం పాఠకుని రక్తాన్ని ఉడికిస్తుంది. మన హృదయకవాటాల దగ్గర ఆ అల్పప్రాణి “ఓ దొర్సానీ! మూడ్దినాలసంది బువ్వదింలే. సచ్చి నీ కడుపులపుడ్త. జెరంత..” అని ఎలుగెత్తి పిలిచే ఆకలికేకలు మార్మోగుతాయి.
కాలం గీసిన మరొక కరుకు చిత్రం “వాల్తేరత్త” కథ. గొప్పగా, దర్జాగా బతికిన వాల్తేరత్త చివరిరోజుల్లో అనుభవిస్తున్న దుఃఖం, వ్యధ మనకి దిగులు పుట్టిస్తుంది. పాత్రల్ని, వాతావరణాన్ని సంపూర్ణంగా మన అనుభవంలోకి తీసుకొనిరాగల నైపుణ్యం ఈ కథకుడిలో నిండుగా ఉంది. కళ్ళొత్తించే మానవసంబంధాల చిత్రణ పఠిత హృదయక్షళన చేస్తాయి. దాదాపు అన్ని కథల్లోను పాటల్ని, గేయాలని సందర్భోచితంగా వాడటం ఈ కథకుడి ప్రత్యేకత. దీనివల్ల నిండైన కళానుభవం, సాంస్కృతికానుభవం కలుగుతుంది. చరిత్ర, సామాజిక శాస్త్రాలు కలిగించలేని ప్రయోజనాలను ఈ సంకలనం కలిగించగలిగింది.
ఈ కథలోని ఈస్తటిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సంపెంగ వృక్షాల్ని చూసినప్పుడల్లా సింహాచలంకొండ గుర్తుకురావడం, బాల్యస్నేహితులిద్దరూ దొంగతనంగా తెచ్చిన జీడికాయల్ని కాల్చుతున్నప్పుడు అవి రసం కక్కుతూ పట్ పట్ మని శబ్దం చేస్తూ ఎగిరిపడటం, కాల్చుతున్నప్పుడు వాటినిండా వచ్చే ఒక విధమైన వాసన పఠితలో నిద్రాణంగా ఉన్న “అభిరుచిని” మేల్కొలుపుతుంది. రచనపట్ల, రచయితపట్ల ఒకవిధమైన ఇష్టం, అప్యాయత కలుగుతుంది. సౌందర్యానుభవం ఎలా కలిగించాలో తెలిసిన కళా మర్మజ్ఞుడు గొరుసు.
భవిష్యత్ సమాజాన్ని మోయాల్సిన నవతరం మానవసంబంధాల్ని భుజానవేసుకుని, ప్రేమానురాగాలను, అప్యాయతలను గుర్తుంచుకోగలిగే ప్రజలైనపుడు ప్రపంచంపట్ల ఆశ పుడుతుంది. అలాంటి గొప్ప ఆశావహదృష్టిని కలిగించే కథ వాచ్ మెన్. అపార్టుమెంటులోని అందరూ మాకెందుకని వాచ్ మెన్ శవాన్ని వదిలించుకోవాలని చూసినపుడు నిజాయితీతో యువతరం దహనసంస్కారానికి ముందుకురావడం మనం కోల్పోతున్న మానవతను, ప్రేమను తెలియపరుస్తుంది.
వ్యవస్థలో అమలవుతున్న దోపిడీ వెనక దోపిడీని చెప్పిన కథ “జలగలవార్డు”. వైద్యం ఖరీదైనవస్తువుగా మారిన సామాజిక సందర్భంలో పేదప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్ళే దిక్కుగా మారుతున్నాయి. అక్కడి పేదరోగుల జీవితాల్లోని ఆకలి తాండవాన్ని అన్ని కోణాల్లోను చూపెట్టిన కథ ఇది. పేదవాడినే దోచుకునే పేదవాడి జీవితపు చీకటికోణం, ఆర్థిక అవారం మనిషిని ఏస్థాయికి దిగజారుస్తుందో ఈకథలో తెలుసుకుని హతాశులమవుతాం.
ప్రపంచీకరణ చేసిన గాయాల్ని బలంగా ఒక దశాబ్దం క్రితమే చెప్పిన కథ “ఖాయిలా బతుకులు”. పూర్తి ఆర్థికపరమైన సామాజిక వస్తువుని కథగా మారుస్తున్నప్పుడు మంచికథకుడు ఆర్థ్రమైన జీవనస్పర్శను మరచిపోడు. సిద్ధాంతాలు, ఉపన్యాసాలు లేకుండా బతుకుచిత్రణలోంచి ఒక చారిత్రకవాస్తవాన్ని కళాత్మకంగా మలిచి చెబుతాడు. ప్రభుత్వరంగసంస్థల మూసివేత వెనకనున్న కుట్రను సాక్ష్యాధారాలతో గొప్ప సామాజికబాధ్యతను నిర్వర్తిస్తూ రికార్డు చేసిన కథ “ఖాయిలాబతుకులు”.
పుస్తకం చివరకొచ్చేటప్పటికి గొప్ప స్నేహితుడిని మిస్ అవుతున్నట్లు హృదయం రెపరెపలాడుతుంది. చేతివేళ్ళు అప్రయత్నంగా మళ్ళీ పేజీలను ఆర్థ్రంగా తడుముతాయి. కథలనీ మనం పోగొట్టుకొన్న జీవన సౌందర్యాన్ని గురించి చెబుతూ, మళ్లీ దాన్ని అందుకోవాలన్న ఆశను కల్పిస్తూసాగడం వలన ఈ కథాసంకలనం అత్యుత్తమ సాహిత్య ప్రయోజనాన్ని సాధించగలిగింది.
* * *
ఏవీకేఎఫ్ ద్వారా ఈ పుస్తకాన్ని ఈ లంకె వద్ద కొనుగోలు చేయవచ్చు.
chinababu
prapancheekarana gaayalaku guraina bratuku vetala kathalivi.
kakumani parichayam rachayita pi premanu penchindi. gorusu malli tana premikulaku ankitamivvali.
జంపాల చౌదరి
జగదీశ్వర రెడ్డిగారి కథలన్నీ ఇష్టమైనా, చీడ కథ మరీ ఇష్టం. అలాగే మంచి కథలంటే ఆయనకున్న ప్రేమ కూడా చాలా ఇష్టం.
ఈ సంవత్సరం కథలు రాస్తానని హామీ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈ బాకీ తీర్చుకొనేదాకా వదలం మరి.
బి.అజయ్ ప్రసాద్
గొరుసు జగదీశ్వరరెడ్డి గారు రాసిన చీడ, గజ ఈతరాలు, బతుకుగోస, ఖాయిలా బతుకులు వంటి కథలు కథా ప్రియులందరూ చదవలసిన కథలు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వలన ఏర్పడిన అనర్థాలు, చితికిన కుటుంబాలనే కాక తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కునే మనిషి బాధ్యతారాహిత్యాన్ని, స్వార్థాన్ని కూడా రచయిత స్పష్టంగా చూపిస్తాడు ఈ కథల్లో. ముఖ్యంగా చీడ, జగదంబ జంక్షన్ కథలు రచయిత చూపించిన జీవితం పరంగా, తెలుగులోని ఏ గొప్ప కథలకు తీసిపోని కథలుగా నిలిచాయి.
బి.అజయ్ ప్రసాద్
jagadeeshwar reddy
నా కథల సంపుటి ‘గజ ఈతరాలు’ పై శ్రీను రాసిన సమీక్ష … దానిపై వేణు వాఖ్య, మళ్లీ దానికి రవి వత్తాసు … అబ్బో! నాపై కత్తి గట్టి, కలం పట్టించి కథలు రాయించేవరకు ఊరుకోని వీరి వీరాభిమానానికి తట్టుకోలేక ఏడుపొచ్చేసింది. రాయదుర్గం విజయలక్ష్మి, జయప్రకాశరాజు గార్లకు కృతజ్ఞతలు. కథల్ని రాయలని ఉన్నా ఎందుకో రాయలేని తనం! దాన్ని ఈ సంవత్సరం అధిగమిస్తానని మాటిస్తూ … గొరుసు
P.Jayaprakasa Raju
ఘజ ఈతరాలు కథలపై సమీక్ష మరొక్కసారి కథలు చదివేలా చేసింది. కథలన్నీ రచయితకు తన జీవితంలొ ఎదురయిన సంఘటనలకు స్పందించి వ్రాసినవే.కథ చివరలొ వ్రాసిన కథా నేపథ్యం ఇందుకు నిదర్శనం. అందువల్లనే కథలన్నీ సజీవంగా వున్నయి. రచయిత కథలతోనె జీవనం సాగించలేడు.తనకంటూ ఒక వ్రుత్తి వుండాలి. గొరుసు జగదీస్వర రెడ్డి గారు ప్రస్తుత వ్రుత్తిలొ కూడ సాహిత్యానికే అంకితమవటం మనం చూడొచ్చు. వారినుండి మరిన్ని కథలు ఆశించడం అత్యాశ కాదేమొ. కథలను చక్కటి సమీక్షతొ మరొక్కసారి గుర్తుచేసిన కాకుమాని శ్రీనివాస రావు గారికి థన్యవాదాలు తెలుపుకుంటున్నాను. — ప్రత్తిగుడుపు జయప్రకాశ రాజు.
R.vijayalakshmi
visaakha maandalikaanni,telangana maandalikaanni baagaa ouposana pattina gorusu jagadeeswarareddygari kathalu telugu sahityaaniki oka adanapu alamkaram.Prapancheekarana nepadhyamlo manam kolpothunnajeevanaanni kanula mundu nilipi chala rojulu manalni ventaadutaayi gorusu gari kathalu.Aalwin company moosiveyadam venakaunna kaaranaalanu hetubaddamga vesleshinchagaligina galgina gorusugari kalam visraantini koradam telugu sahityaniki oka pedda nashtameKakumani vari visleshana chala bavundi. malli gorusugari kalam nundi manchi kathalni chadavalani aasistu….r.vijayalakshmi
దుప్పల రవికుమార్
@వేణు:
నిజమే వేణుగారితో పూర్తిగా నేనూ ఏకీభవించి గొంతు కలుపుతున్నాను. మళ్లీ గొరుసు కథలు చెప్పలని నేనూ బలంగా డిమాండ్ చేస్తున్నాను. రాయగలిగిన వాళ్లు కూడా రాయకుండా పెన్ను మూసి కోర్చోవడం ఎంత అన్యాయం? మనిషి మనసు లోతులను తరచి చూడగలిగిన కథకుడు, సామాజికార్థిక సంబంధాలను అర్థం చేసుకోగలిగిన రచయిత, ప్రస్తుత జీవిత గమనపు ఎరుక కలిగిన జర్నలిస్టు మూడింటి కలగలుపు గొరుసు. మళ్లీ రచన మొదలెట్టాలి. అంతే.
వేణు
సమీక్ష చాలా బాగుంది. సామాన్య జనం కథలను పఠనీయంగా, ఆర్ద్రంగా మలచటంలో జగదీశ్వరరెడ్డి ప్రతిభ కనిపిస్తుంది. ఎలాంటి తడబాటూ లేకుండా భిన్న మాండలికాల్లో అలవోకగా రాయగలగటం ఆశ్చర్యమేస్తుంది.
మరో ఆశ్చర్యం- ఈ ‘గజ ఈతరాలు’ సంకలనం తర్వాత రచయిత తను రాయాల్సిన కథలన్నిటినీ జర్నలిజం జమ్మిచెట్టు మీద దాచివుంచటం!