Christopher Paolini – Inheritance Cycle

క్రిస్టఫర్ పాలినీ అన్న యువ రచయిత రాస్తున్న నాలుగు నవలల సంకలనాన్ని “ఇన్హెరిటన్స్ సైకిల్” గా వ్యవహరిస్తారు. ఇది మొదట మూడే భాగాలుగా వెలువరించాలని భావించి, “Inheritance Trilogy” అని పిలిచినా, మూడో భాగం చివరకొచ్చేసరికి, ఇంకా చెప్పాల్సింది ఉన్నందున నాలుగో భాగం కూడా వస్తుందని ప్రకటించారు. అది ఇంకా రాలేదు కానీ, ఇంతలోగా నేను ఈ మూడింటినీ చదవడం తటస్థించింది. అందువల్లే ఈ పరిచయం. తనకు పదిహేనేళ్ళున్నప్పుడు పాలినీ మొదటి నవల మొదలుపెట్టాడు. ఇప్పుడతని వయసు ఇరవై ఎనిమిది. నాలుగో భాగం ఇంకా రాస్తున్నాడని విన్నాను. వీటిల్లో మొదటి నవల సినిమాగా కూడా వచ్చింది. ఇదీ ఆ నవలల వెనుక కథ.

ఇప్పటివరకూ వచ్చిన మూడు నవలలు:
ఎరగాన్ (Eragon)
ఎల్డెస్ట్ (Eldest)
బ్రిసింగర్ (Brisingr)

నవలలు (ముఖ్యంగా మొదటి రెండూ), చదవడానికి బాగున్నాయి. పాలినీ కాల్పనిక ప్రపంచంలోకి తీసుకుని, కొండకచో లాక్కుని పోగలవు. వీటిలో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన విషయాలు మూడు:
1) ఇవి పిల్లల ఫాంటసీ నవలలు కావడం
2)పాలినీ ఈ నవలల్లో మొదటిది మొదలుపెట్టినపుడు అతని వయసు పదిహేను కావడం.
3)ఈ నవలల్లో వాడిన భాష గానీ, చూపిన కల్పన, చెప్పిన వర్ణనలు గానీ – ఒక టీనేజీ కుర్రాడి స్థాయికి అద్భుతంగా ఉండటం.

కథాంశం విషయానికొస్తే, ఒక మామూలు రైతు కుటుంబంతో కలిసి జీవిస్తున్న ఎరగాన్ అనే కుర్రవాడు అనుకోకుండా ఒక రాకాసిబల్లి గుడ్డు దొరికి, అది పగిలి “డ్రాగన్” అయ్యి, దానికి అతను “రైడర్” అయ్యానని తెలుసుకుని, దుష్ట, మాంత్రిక రాజు చేతి నుండి తన రాజ్యాన్నీ, అలాగే దేశం శివార్లలో ఉన్న ఇతర జాతుల స్వతంత్ర్యాన్నీ కాపాడగలిగాడా? దారిలో అతనికి ఎదురైన సమస్యలేమిటి? – ఇదీ ప్రధాన కథ. ఇందులో బోలెడు ఉప-కథలు. వెరసి, ఇప్పటికే ఒక పదిహేనొందల పేజీల పైచిలుకు కథ.

మొదటి భాగం ఎరగాన్ లో – కథా పరిచయం, కొంత నేపథ్యం ఉంటాయి. ఎరగాన్ డ్రాగన్ రైడర్ అయ్యాక, కొన్ని ప్రాథమిక శక్తుల్ని సంపాదించుకుని క్రూరుడైన రాజు తాలూకా సైన్యంతో యుద్ధం చేస్తూ, చాలా శక్తివంతుడైన మాంత్రికుణ్ని అంతం చేసి ప్రజలందరి గౌరవాభిమానాలను పొందడంతో ముగుస్తుంది. రెండో భాగంలో ఎరగాన్ elves అనబడు జాతివారితో ఉంటూ, అక్కడే శస్త్ర విద్యల్లో కఠోర శిక్షణ పొంది, చివరకు మరో యుద్ధానికి సిద్ధమౌతాడు. ఆ యుద్ధం ముగుస్తున్నప్పుడే అనూహ్య సంఘటన ఒకటి జరిగి, ఒకప్పటి మిత్రుడు శత్రువయ్యాడన్న విషయం గ్రహిస్తాడు. మూడో భాగం లో ఎరగాన్ కజిన్ రోరాన్ కూడా అతన్ని కలిసి, అందరూ రాజును అంతమొందించడానికి ముందుకెళ్ళడంతో కొనసా..గుతోంది.

మొదటి రెండూ వేగంగా చదివేయొచ్చు కానీ, మూడో నవల ఎంత వివరంగా ఉంటుందంటే, ప్రతి పాత్ర తాలూకూ సవివర జీవిత చరిత్ర తెలిసిపోతుంది మనకి, ఆయా పాత్రల తాలూకా సాంఘిక వ్యవహారాలతో సహా. రచయిత కాల్పనిక శక్తికి జోహార్లు చెప్పడానికి నాకేం మొహమాటం లేదు కానీ, కథాగమనానికి ఈ వివరాలు ఎంత తోడ్పడ్డాయి? అన్నదే ప్రశ్న. హ్యారీ పాటర్ లాగా ఇది కూడా ఒక ఏడెనిమిది భాగాలుగా రాసి ఉంటే, ఆ మూడో భాగం అంత బోరు కొట్టకపోవునేమో. ఇప్పటికీ, బోరు కొట్టడం మాట అటుంచితే, అద్భుతమైన కల్పన – అనే అంటున్నాను, పాత్రల చిత్రణలు, వివిధ తెగల ఆచార వ్యవహారాల వర్ణనల్లో తీసుకున్న శ్రద్ధా, ప్రతి చిన్న విషయం గురించి కూడా చెప్పిన విధానమూ చూస్తూంటే. అయితే, కథని ’తర్వాతేమౌతుంది?’ అన్న కుతూహలంతో చదివితే, బోరు కొడుతుంది ఈ మూడో భాగం. అలా కాక, అదొక సమాంతర జీవితం అనుకుని, ఎరగాన్ లాగా మనమూ ఫీలై, ఒక్కొక్క పేజీనీ అనుభవిస్తూ పోతే మాత్రం అద్భుత ప్రపంచం ఆవిష్కృతమౌతుంది. ఆ పని పెద్దలకంటే పిల్లలే బాగా చేయగలరు కనుక, ఇది అచ్చమైన పిల్లల నవలల సీరీస్.

ఈ కథ మధ్యలో వచ్చిన ఇతర కథలనూ, పాత్రలనూ, సంఘటనలూ చదువుతూ ఉంటే, టోల్కియన్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఫిలిప్ పుల్మాన్ హిస్ డార్క్ మెటీరియల్స్ వంటివి గుర్తొస్తే ఆశ్చర్యమేం లేదు. తను ఈ కథని అలాంటి నవలల ప్రేరణతోనే మొదలుపెట్టానని పాలినీనే చెప్పుకున్నాడు. అయితే, ఒక కుర్రవాడు తనకంటే చిన్న పిల్లల కోసం, తనదైన పంథాలో సృష్టించిన ప్రపంచం కనుక, నా దృష్టిలో ఇవి పిల్లలంతా తప్పక చదవదగ్గ నవలలు (నాకు ఎన్నోసార్లు మధ్యలో బోరు కొట్టినా కూడా!). పెద్దల్లో పిల్లలు కూడా ఓపికా, సమయమూ ఉంటే చదవొచ్చు. పాలినీ భవిష్యత్తులో మరిన్ని మంచి పిల్లల నవలలు రాయాలని కోరుకుంటున్నాను.

You Might Also Like

Leave a Reply