తానా తెలుగు కథ

1993లో తొమ్మిదవ తానా సమావేశాలు న్యూయార్క్ నగరంలో జరిగాయి. ఆ సమావేశాల్ని ప్రపంచ తెలుగు సమ్మేళనంగా నిర్వహించారు అప్పటి అధ్యక్షుడు డా. నల్లమోతు సత్యనారాయణ, కన్వీనరు డా. గడ్డం దశరథరామి రెడ్డి. అప్పటివరకూ జరిగిన తానా సమావేశాలన్నిటికన్నా భారీస్థాయిలో జరిగింది ఆ సమావేశం. ప్రపంచ తెలుగు సమాఖ్య (World Telugu Federation) అప్పుడే ఆవిర్భవించింది. పెద్ద సంఖ్యలో భారతదేశంనుంచి అతిథులు, కళాకారులు వచ్చారు. ఆ సమావేశంలో సారస్వత సమావేశాల నిర్వహణ బాధ్యత తీసుకున్న కమిటీవారు తానా సాహిత్య వాహిని పేరిట ఒక కవితాసంకలనం, ఒక కథాసంకలనం ప్రచురించారు. అట్లాంటాలో ఉండే ప్రొఫెసర్ పెమ్మరాజు వేణుగోపాలరావు మచ్చుతునకలు పేరుతో వచ్చిన కవితాసంకలనానికి సంపాదకత్వం వహించారు.

తానా తెలుగు కథ పేరుతో వచ్చిన కథా సంకలనానికి శ్రీ ఏ.ఎస్.మూర్తి సంపాదకులు. ఈ సంకలనం కాన్సెప్ట్ తానా సాహిత్య వాహినికి అధ్యక్షులుగా ఉన్న ఎర్రమిల్లి పద్మావతి గారిదట. డా. కేతు విశ్వనాథరెడ్డి, డా. రావూరి భరద్వాజ, డా. ముదిగొండ శివప్రసాద్‌లు సలహాదారులు. చిత్రాలంకరణ చేసింది ప్రముఖ చిత్రకారుడు చంద్ర.

ఈ సంకలనంలో మొత్తం 36 కథలున్నాయి. కథకులు – కథల వివరాలు.
గురజాడ అప్పారావు – మతము, విమతము
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి – కలుపు మొక్కలు
చలం – ఆమె త్యాగం
త్రిపురనేని గోపీచంద్ – సంపెంగపువ్వు
కొడవటిగంటి కుటుంబరావు – చెడిపోయిన మనిషి
బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం – పారిస్
మల్లాది రామకృష్ణ శాస్త్రి – ద్రౌపది వస్త్రాపహరణము
పాలగుమ్మి పద్మరాజు – గాలివాన
చాగంటి సోమయాజులు – మట్టి
బుచ్చిబాబు – విడిచేసిన అసలు విషయం
రాచకొండ విశ్వనాథ శాస్త్రి – కోర్టుకి రాని సాక్షులు
భానుమతీ రామకృష్ణ – ఇరుగు పొరుగు
కాళీపట్నం రామారావు – సంకల్పం
హితశ్రీ – ముగ్గురు ప్రయాణీకులూ ఓ డ్రైవరూ
రావూరి భరద్వాజ – ఒక చీమ కథ
మధురాంతకం రాజారాం – ఎడారి కోయిల
సి. రామచంద్రరావు – క్లబ్‌నైట్
ముళ్ళపూడి వెంకటరమణ – కానుక
ఆచంట శారదాదేవి – మామూలు మనిషి
భ రా గో – మీకూ కథలే ఇష్టం
వాసిరెడ్డి సీతాదేవి – జాక్‌పాట్
ఆర్. వసుంధరాదేవి – సీతాకోకచిలుక
పూసపాటి కృష్ణంరాజు – రెండు బంట్లు పోయాయి
కొమ్మూరి వేణుగోపాలరావు – మర మనిషి
పెద్దిభొట్ల సుబ్బరామయ్య – దగ్ధ గీతం
కేతు విశ్వనాథరెడ్డి – కూలిన బురుజు
సింగరాజు రామచంద్రమూర్తి – షా
ముదిగొండ శివప్రసాద్ – కథాప్రయోగం
కె. సదాశివరావు – క్రాస్‌రోడ్స్
సింగమనేని నారాయణ – అడుసు
వాడ్రేవు వీరలక్ష్మీదేవి – మంటలు
వి. రాజారామ్మోహనరావు – విరిగిన తెరచాప
జలంధర – ముంగిట్లో ముత్యాలు
ఓల్గా – ఒక రాజకీయ కథ
స్మైల్ – పృథ్వి
స్వామి – చంకీదండ

తెలుగు కథ విభిన్న పార్శ్వాల కదంబం ఈ సంకలనం. దాదాపు ఎనిమిదిన్నర దశాబ్దాల తెలుగు కథాచరిత్రలో అప్పటివరకూ అన్ని తరాల కథకులకూ ఈ సంకలనంలో ప్రాతినిధ్యం ఉంది. తెలుగు కథలతో పరిచయం ఉన్నవారికి ఈ రచయిత లందరూ పరిచయమై ఉండాలి. తెలుగు కథంటే మక్కువ ఉన్న వారికి ఈ కథల్లో చాలా కథలు తెలిసే ఉండాలి. వీటిలో కొన్ని కథలు వివిధ కథా సంపుటాల్లో వచ్చాయి. నేను ఈ పుస్తకం మొదటసారి చదివినప్పుడు నాకు కొందరు కథకులు, కొన్ని కథలు కొత్త. అడుసు, సంకల్పం కథలు మొదటిసారి నేను ఈ సంకలనంలోనే చదివాను.

ఈ సంకలనానికి ఇంకో ముఖ్య ఆకర్షణ ప్రతి కథకూ ముందు చంద్ర వేసిన రచయితల చిత్తరువులు. పరిణామంలో చిన్నగా ఉన్నా చక్కగా ఉన్నాయి. పుస్తకానికి ముఖచిత్రం కూడా చంద్ర వేసిందే. సింపుల్‌గా ఆకర్షణీయంగా ఉంది. రచయితల రేఖాచిత్రాలతో పాటు సంపాదకులు ఏ.ఎస్. మూర్తి గారు వ్రాసిన సంక్షిప్త పరిచయాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్‌లో టైప్‌సెట్ చేసిన ఈ పుస్తకం, ఫాంట్ సైజు కొద్దిగా తక్కువగానే ఉన్నా చక్కగా ఉంది. అచ్చుతప్పులు తక్కువ.

ఈ పుస్తకంలో సంపాదకుల, సలహాదారుల ముందుమాట, వెనుకమాట వంటివి ఏమీ లేవు; ప్రచురణకర్త (తానా సాహిత్య వాహిని) పేర ఒక ముందు మాట ఉంది. పద్మావతిగారితో పాటు పొన్నలూరి పార్వతి, సి.ఎస్.వి. మురళి, బాబు కె. వడ్లమూడి, విజయలక్ష్మి చిమ్మిరి, కనకప్రసాద్ సరిపల్లి, కలశపూడి శ్రీనివాసరావు ఈ కమిటీలో సహసభ్యులుగా ఉన్నారు.

ఈ తానా సమావేశానికి నేను హాజరైనా, అప్పుడు నాకు ఈ పుస్తకాలు ప్రచురించబడ్డ విషయం తెలీలేదు. కొన్నాళ్ళ తర్వాత కలశపూడి శ్రీనివాసరావుగారి దగ్గరనుంచి తెప్పించుకొన్నాను. ఈ పుస్తకం తానా సమావేశాల సందర్భంగా ప్రచురించినా, చాలా తక్కువ కాపీలు మాత్రమే అమెరికా వచ్చినట్టున్నాయి. తెలుగుదేశంలోనూ ఈ పుస్తకాన్ని శ్రద్ధగా అమ్మినట్టు లేదు. నాకు తెలిసిన కథాప్రియుల్లో ఈ పుస్తకం గురించి విన్నవాళ్ళు ఎక్కువ; చూసినవాళ్ళు, చదివినవాళ్ళు తక్కువ. ప్రచురణకూ, పంపిణీకి మధ్య సరైన సమన్వయం లేకపోవడం ఈ విచారకరమైన పరిస్థితికి కారణం. పుస్తకం ప్రచురించి పద్దెనిమిదేళ్ళు అయింది; కాపీలు ఇప్పుడు యూజ్డ్ బుక్‌స్టోర్స్‌లో తప్ప దొరకకపోవచ్చు.

అన్నట్లు, ఈ సమావేశాల సందర్భంగా ప్రచురించిన ఇంకో పుస్తకం, కాళీపట్నం రామారావుగారి ’యజ్ఞంతో తొమ్మిది’ కథల సంకలనం. రామారావు మాస్టారు ఈ సమావేశాలకి అతిథిగా వచ్చారు.

తానా తెలుగు కథ
జులై 1993
తానా సాహిత్య వాహిని ప్రచురణ
359 పేజీలు, 20 డా.

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

3 Comments

  1. Anil Battula

    ఇంత చక్కటి కథల పుస్తకం “తానా” పునర్ముద్రించాలని ఆశిస్తున్నాం.

  2. Jampala Chowdary

    @రామ: aalOcimcavalasina vishayamE.

  3. రామ

    ఇటువంటివి పునర్ముద్రించడానికి తానా ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందేమో. You print it and they will buy.

Leave a Reply