Philip Pullman – His Dark Materials

ఇది ఒక మూడు నవలల సీరియల్ సంకలనం. లైరా అన్న పన్నెండేళ్ళ బాలిక, విల్ అనే దాదాపు అదే వయసున్న బాలుడూ భిన్న ప్రపంచాల మధ్య వారధుల్ని సృష్టించుకుంటూ, రకరకాల అవాంతరాల్ని ఎదుర్కుంటూ, వారికి ఎల్లప్పుడూ సాయం చేసేవారితో పాటు, వారి అంతం కోరి వెంటాడే వారిని తప్పించుకుంటూ, చివరకు అనుకున్నది సాధించడం ఈ మూడు పుస్తకాల కథలోని సారం. పేరుకి ఇది పిల్లల ఫాంటసీ నవల. టీనేజీ తొలిరోజుల్లో ఉండే పిల్లలని ఉద్దేశించినది అనుకుంటా. అయితే, చదివేకొద్దీ ఆలోచనలో పడేసే విషయాలు అనేకం ఉన్నాయిందులో. ఒక పక్క ఊహాజనితమైన ప్రపంచమే అయినా, దాన్ని ఊహించుకునే కొద్దీ, అది మన మనోఫలకంలో ఒక రూపు పొందేకొద్దీ, జీవితం, అనుబంధాలు, మతం ఇలా ఎన్నో విషయాల గురించి ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టుముడతాయి.

ఇందాకే అన్నట్లు ఇది మూడు పుస్తకాల సమాహారం. మొదటిది – “The Northern Lights”. ఇదే “గోల్డెన్ కంపాస్” సినిమాగా వచ్చింది. ఈ పుస్తకాన్ని కూడా అదే పేరుతో వ్యవహరిస్తారు. ఇందులో, కథ లైరా అన్న అమ్మాయి ప్రపంచంలో మొదలవుతుంది. ఉండకూడని చోట బీరువాలో దాక్కుని కొంతమంది శాస్త్త్రవేత్తల సంభాషణను లైరా, పాన్ వినడంతో కథ మొదలవుతుంది. అలాగే, జరగిన, జరిగే, జరగబోయే విషయాల గురించి చెప్పే ఒక ఉపకరణం వాడ్డం ఎవరి సాయమూ లేకుండానే లైరాకు అబ్బుతుంది. అక్కణ్ణుంచి, ఈ కథ – లైరా తమకు సమాంతరంగా ఉన్న ప్రపంచాలలోని ఒకదానిలోకి వెళ్ళేందుకు తన “ఆత్మ” పాన్ ను తీసుకుని గీత దాటడంతో ముగుస్తుంది. ఈ ప్రపంచాల మధ్య వారధి సృష్టించినది Lord Asriel అన్న వ్యక్తి. అసలు ఆయనెవరు? ఈ ప్రపంచాలేమిటీ? వారధులేమిటి? ఎందుకు? ఎక్కడ? ఏమిటి? ఎలా? ఇవటుపెడిటే, ఆత్మను తీసుకుని లైరా వెళ్ళడం ఏమిటి? ఆత్మకి ఇంకో పేరేమిటి? – ఇదంతా తెలియాలంటే, మీరు పుస్తకం చదవాలి మరి. ఈ భాగంలో ప్రధానంగా ఈ పాత్రల ప్రపంచం గురించి, అలాగే, కథ ప్రకారం విలన్ అయిన ’చర్చి’ సాధించాలనుకుంటున్న కార్యం గురించీ తెలుస్తుందంతే. ఇదంతా, ఎక్కడా ఆపకుండా చదివించినా కూడా, దీని తరువాత వచ్చిన రెండో భాగం నా అభిప్రాయంలో మరొక అద్భుతమైన ఊహను సృష్టించింది.

రెండో పుస్తకం పేరు – “The Subtle Knife”. విల్ అనే కుర్రవాడు అనుకోకుండా ఒకతన్ని హత్య చేస్తాడు. పోలీసులు తనని పట్టుకుంటారన్న భయంలో తిరుగుతూ, ఒకానొక పార్కులో ఒక కిటికీ గుండా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. Asriel సృష్టించిన వారధి ద్వారా లైరా, ఆమె ఆత్మ పాన్ లు కూడా అదే లోకంలోకి ప్రవేశిస్తారు. అనుకోకుండా వీరిద్దరూ కలిశాక, ఒకరి కథ ఒకరు తెలుసుకున్నాక, సమాంతరంగా వివిధ ప్రపంచాలు ఉన్నట్లు అర్థమౌతుంది. ఆపై, అనుకోకుండా, విల్ ఒక కత్తికి హక్కుదారుడౌతాడు. ఆ కత్తిని ఉపయోగించి దేన్నైనా ముక్కలు చేయవచ్చు -ఎలా ఉపయోగించాలో తెలిస్తే. ఆ కత్తే ప్రపంచంలో ఇదివరలో విల్ ప్రవేశించిన లాంటి కిటికీలు తయారు చేసిందన్నమాట. ఆపై, ఎన్నో సాహసాలు చేస్తూ, చిక్కులను ఎదుర్కొంటూ, తాము చేయవలసిన పనులేమిటో వివిధ శక్తుల ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉండగా, అనుకోని పరిస్థితుల్లో లైరా అదృశ్యమవడంతో ఈ భాగం ముగుస్తుంది. ఈ భాగంలోనే వివిధ ప్రపంచాల్లోని జీవులూ, వివిధ జీవుల శరీర తత్వాలూ, వారు చేయగలిగిన, చేయలేని పనులూ – ఇలా ఇలా ఒక కొత్త ఫాంటసీ ప్రపంచం ఆవిష్కృతమౌతుంది చదువరుల మెదడులో.

మూడోపుస్తకం పేరు – “The Amber Spyglass”. ఈ మూడింటిలోకీ పెద్దదిగా ఉన్న పుస్తకం. ఇందులో, విల్ లైరా ను వెదుక్కుని, అపై ఇద్దరూ మరణించిన వారి ప్రపంచానికెళ్ళి, వారిని విముక్తుల్ని చేయడం నుంచి అసలు ఏ పనికోసమైతే తమని విధి కలిపిందో, అది సాధించేదాకా, అది సాధించి, చివర్లో విడిపోయేదాకా కథ సాగుతుంది. ఇక్కడితో ఈ ట్రైలజీ ముగుస్తుంది.

అయితే, మొత్తమ్మీద, ఈ కథలు, ఉపకథలు, పాత్రలు, పాత్రల చిత్రణలు – ఇవన్నీ ఒక స్థాయిలో అద్భుతం అయితే; ఒక భావజాలాన్ని తీసుకుని, దాన్ని ఈ ఫాంటసీలోకి అద్భుతంగా జొప్పించడం నాకు అన్నింటికంటే బాగా నచ్చింది. ఈ పుస్తకం మతతత్వ వాదుల నుంచి కొంత విమర్శకు గురైందని చదివాను. ఒక కోణంలో చూస్తే, అది అర్థం చేసుకోదగ్గదే కానీ, మరోలా చూస్తే, ఆ విమర్శలు అర్థంలేనివి అనిపిస్తుంది. All said and done, its a fantasy story. String Theory గురించి విన్న వారిగ్గానీ, దానికి సంబంధించిన వీడియోలు చూసినవారిగ్గానీ – ఈ సమాంతర ప్రపంచాల ఆలోచనతో బానే పరిచయం ఉండొచ్చు. ఈ పుస్తకం లో, ముఖ్యంగా రెండో,మూడో భాగాల్లో – ఈ ఆలోచనను వాడుకోవడంలో గొప్ప ఊహాశక్తిని చూపారు.

కానీ, ఏమాటకామాటే చెప్పుకోవాలి, మూడో భాగం కాస్త బోరు కొట్టించింది. మొదటి రెండు భాగాలతో పోలిస్తే కథనం కాస్త మందకొడిగా సాగినట్లే లెక్క. అందులోనూ, ’స్పై గ్లాస్’ కు ఈ భాగంలో ఉండే పాత్ర తక్కువే అయినా, పేరు మాత్రం దాని పేరే పెట్టారు. అసలు మూడో నవల అనవసరంగా సాగదీసినట్లనిపించింది నాకు. ఈ ఒక్కటి తప్పిస్తే, నాకు ఈ మూడింటిలో చెప్పుకోదగ్గ లోపాలేవీ కనబడలేదు. మూడో భాగంలో మరణం గురించీ, వ్యక్తిగత మరణాల గురించీ, మరణానంతర ప్రపంచం గురించీ – చర్చించిన ఘట్టాలు మాత్రం నాకు చాలా నచ్చాయి.

ఈ పుస్తకాల గురించిన వికీ పేజీ లోకి వెళ్తే, మరిన్ని వివరాలు తెలుస్తాయి.

ఈ మూడు భాగాల్లో, నాకు బాగా నచ్చిన మూడు వాక్యాలు ఉటంకించి, ఇక్కడితో, ఈ పరిచయం ముగిస్తాను.

“But think of Adam and Eve like an imaginary number, like the square root of minus one: you can never see any concrete proof that it exists, but if you include it in your equations, you can calculate all manner of things that couldn’t be imagined without it.”
-“The Golden Compass” నుండి.

“Her last conscious thought was disgust at life; her senses had lied to her. The world was not made of energy and delight but of foulness, betrayal, and lassitude. Living was hateful, and death was no better, and from end to end of the universe this was the first and last and only truth.”
-“The Subtle Knife” నుండి.

” ‘The only way you’ll cross the lake and go to the land of the dead,’ he said, […] ‘is with your own deaths. You must call up your own deaths. I have heard of people like you, who keep their deaths at bay. You don’t like them, and out of courtesy they stay out of sight. But they’re not far off. Whenever you turn your head, your deaths dodge behind you. Whenever you look, they hide. They hide in a tea cup. Or in a dewdrop. Or in a breath of wind. Not like me and old Magda here,’ he said, and he pinched her withered cheek, and she pushed his hand away. ‘We live togheter in kindness and frienship. That’s the answer, that’s it, that’s what you’ve got to do, say welcome, make friends, be kind, invite your deaths to come close to you, and see what you can get them to agree to.’ ”
-“The Amber Spyglass” నుండి.

పై మూడూ చూస్తే, ఈ పుస్తకాలు ఎన్ని భిన్న కోణాలను స్పృశించాయో కొంచెం అవగాహన కలుగుతుందనుకుంటాను.

You Might Also Like

2 Comments

  1. పుస్తకం » Blog Archive » Christopher Paolini – Inheritance Cycle

    […] టోల్కియన్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఫిలిప్ పుల్మాన్ హిస్ డార్క్ మెటీరియల…వంటివి గుర్తొస్తే ఆశ్చర్యమేం లేదు. […]

  2. prasanth

    yes,it is a classic,the fantacy review also rated this in it’s top 100 fantacy novels.anyway you introduced a great children book.good work.

Leave a Reply