పుస్తకం
All about booksపుస్తకభాష

March 9, 2011

చివరకు మిగిలింది

More articles by »
Written by: Jampala Chowdary
Tags: ,

’కథానాయిక కిటికీకి ఉన్న కర్టెన్లు పట్టుకుని లాగింది. అప్పటిదాకా చింకిపాతల్లో ఉన్న కథానాయిక మంచి అందమైన దుస్తుల్లోకి మారిపోయింది. ఉన్నట్టుండి సినిమా ఆగిపోయింది. లైట్లు వెలిగాయి. మానేజర్ వచ్చి, ’గాంధీగారిని ఎవరో కాల్చి చంపేశారు. ఇవాళ్టికి సినిమాలు ఆపేస్తున్నా’మని చెప్పాడు. బరువెక్కిన గుండెలతో ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత ఆ చిత్రాన్ని చూడటానికి వీలు కలగలేదు’ దాదాపు నలభైయేళ్ళ క్రితం నేను చదివిన ఒక వ్యాసం- మాలతీ చందూర్ వ్రాసిన ’పాత కెరటాలు’ అనే పుస్తకంలో గాన్ విత్ ద విండ్ (Gone with the wind) అనే నవలని పరిచయం చేస్తున్న వ్యాసం – ప్రారంభ వాక్యాలు ఇవి (దాదాపుగా, నాకు గుర్తున్నట్లు). ఆ సందర్భానికి ఉన్న నాటకీయత వల్ల ఈ ప్రారంభ వాక్యాలు, ఆ నవల్లో ఉన్న కథవల్ల గాన్ విత్ ద విండ్ అలా గుర్తుండిపోయాయి. కొంతకాలం తర్వాత, ఆ నవల చదవడం, సినిమా చూడడం జరిగింది.

ఇప్పుడు ఆ వ్యాసం ప్రస్తావన ఎందుకంటే అదే పరిచయ వ్యాసం డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి గార్ని కూడా ప్రభావితం చేసినట్టుంది. ఎంతగా అంటే ఆయన ఈమధ్య గాన్ విత్ ది విండ్‌ని చివరకు మిగిలింది పేరుతో అనువాదం చేసినప్పుడు, ఆ పుస్తకానికి మాలతీ చందూర్‌గారితో పరిచయం వ్రాయించుకోవాలని ప్రయత్నించారు. ఆవిడకి వీలు కాలేదన్నది వేరే విషయం. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఈ నవలని ఆవిడ తప్ప ఇంకెవరూ తెలుగులో ప్రస్తావించలేదని రమణారెడ్డిగారు తమ ముందుమాటలో అన్నది నిజమే అనుకోంటాను. (నాకూ, ఇంకా చాలా మంది తెలుగు పాథకులకూ ఇలాంటి చాలా ప్రఖ్యాత ఆంగ్ల నవలలు మాలతీ చందూర్‌గారి ద్వారానే పరిచయమయ్యాయి).

అమెరికన్ కాల్పనిక సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవలల్లో గాన్ విత్ ద విండ్ ఒకటి. ప్రచురితమైన మొదటి రోజుల్లో, అమెరికాలో బైబుల్ తర్వాత ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇది. ఇప్పటికి 30కోట్ల ప్రతులు అమ్ముడుబోయాయని అంచనా. పులిట్జర్ బహుమతి అందుకుంది. ఈ నవల ఆధారంగా వచ్చిన చిత్రం 1939లో విడుదలై, ప్రపంచంలో అన్ని సినిమాలకన్నా ఎక్కువమంది చూసిన చిత్రం అయింది; 12 అకాడెమీ అవార్డులు సంపాదించుకొంది. ఈ నవల, చిత్రాల ఆఖరి సన్నివేశంలో నాయకుడు అన్న మాటలు ”Frankly, my dear, I don’t give a damn!” ఆంగ్ల చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండే డైలాగుల్లో మొదటిదానిగా గుర్తింపు పొందాయి. ఈ కథలో నాయిక స్కార్లెట్ ఒహారా, నాయకుడు రెట్ బట్లర్, ఉపకథానాయిక నాయకులు యాష్లీ విల్క్స్, మెలనీ విల్క్స్‌ల ప్రత్యేక వ్యక్తిత్వాలు అమెరికన్ కాల్పనిక సాహిత్యంలో చాలా ప్రముఖంగా చిరకాలంగా జీవిస్తున్న పాత్రలు.

ఈ నవల కథాకాలం: 1861లో అమెరికాలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధం ప్రారంభకాలం నుంచి తొమ్మిదేళ్ళ తర్వాత దక్షిణరాష్ట్రాల పునర్నిర్మాణ ప్రయత్నాల వరకూ. కథాస్థలం: జార్జియా అనే దక్షిణ రాష్ట్రంలో క్లేటన్ కౌంటీ (జిల్లా అనుకోవచ్చు), అట్లాంటా నగరాలు. కథాప్రారంభంలో క్లేటన్ కౌంటీలో చాలా సంపన్న కుటుంబాలు పెద్ద పెద్ద కమతాల(ప్లాంటేషన్ల)లో పత్తిని పండిస్తూ ఉంటారు. ఆ కమతాల యజమానులు పెద్దపెద్ద బంగళాలలో నివసిస్తూంటారు. వారిదగ్గర పొలాల్లోనూ, ఇంట్లోనూ చాలామంది నల్లబానిసలు పనిచేస్తూ ఉంటారు. అప్పటి దక్షిణాదిలో తెల్ల కుటుంబాలకు ఒక ప్రత్యేకమైన జీవన విధానం, ఆచార వ్యవహారాలు, మర్యాదలు ఉన్నాయి. అలిఖితమైన ఒక ప్రవర్తనా నియమావళి ఉంది. స్త్రీలు పార్టీలతోనూ, పురుషులు గుర్రపుస్వారీ, వేట, జూదాలతోనూ విలాసమైన, తీరిక జీవితాలను గడుపుతూ ఉండేవారు. అంతర్యుద్ధం మొదలుకాక ముందు, దక్షిణాదివారికి తమ శక్తిపైన విపరీతమైన విశ్వాసం, ఉత్తరాదివారి (యాంకీల)పైన విపరీతమైన చులకనభావం. యుద్ధం జరిగితే ఒక్క నెలరోజులలో ఉత్తరాదివారిని మట్టికరిపిస్తామని నవ్విన దక్షిణాది యువకులు యుద్ధమంటే విపరీతంగా ఉత్సాహపడిపోతున్న రోజులు. యుద్ధం నిజంగానే మొదలవుతుంది. వ్యవసాయమే గాని, ఇతర పరిశ్రమలూ, పదాతి, ఆశ్విక దళాలేగాని నౌకాదళం లేని దక్షిణరాష్ట్రాలని నౌకాదిగ్బంధంతో ఊపిరాడకుండా చేశారు ఉత్తరాదివారు. పండిన పంటలను, ఎగుమతి చేసుకోవడానికి, వాడుకోవడానికి, అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఒక్క నెలలో ముగుస్తుందనుకున్న యుద్ధం ఏళ్ళతరబడి సాగింది. యుద్ధంలో లక్షలమంది దక్షిణాదివారు చనిపోయారు, అంతకన్నా ఎక్కువమంది క్షతగాత్రులయ్యారు. యుద్ధం తెచ్చిన పరిస్థితుల వల్ల, యుద్ధంలో గెలిచిన యాంకీ సేనలు జనరల్ షెర్మన్ నేతృత్వంలో సాగించిన దహనకాండవల్ల జార్జియాలో వ్యవసాయం పూర్తిగా దెబ్బ తింది. బానిసవిధానం రద్దు అవడంతో భూస్వామ్య వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలింది. ఒకప్పటి సంపన్న కుటుంబాలన్నీ దారిద్ర్యం పాలయ్యాయి. ప్రభుత్వంపై వారికున్న పట్టూ పోయింది. పాత మర్యాదలకూ, ఆచారాలకూ కాలం చెల్లింది. ఐదారేళ్ళ కాలంలో ఒక సామాజిక వ్యవస్థ, ఒక జీవన విధానం పూర్తిగా మాయమయ్యాయి.

మారిపోతున్న ఈ జీవన విధానానికి మిగతావారికి మల్లే తల వంచని ఇద్దరు వ్యక్తుల్ని ముఖ్యపాత్రలుగా చేసుకున్న ఈ పుస్తకం ఆ మార్పులను చాలా చక్కగా చిత్రీకరించింది. నాయిక స్కార్లెట్ టేరా అనే పెద్ద ప్లాంటేషన్ యజమాని జెరాల్డ్ ఒహారాకి పెద్ద కూతురు. తనకి కావలసిన దాన్ని సాధించుకోవటంకోసం ఎంతకైనా తెగించి ఏమైనా చేయగల వ్యక్తి. స్వార్థపరురాలు, ఈర్ష్యాళువు. ఆమెకున్న బలహీనతలు రెండు: యాష్లీ విల్క్శ్‌పైన ప్రేమ, తన భూమి టేరాతో ఉన్న బంధం. ఈ నవల ప్రారంభంలో ఆమె వయసు పదహారేళ్ళు. ఈ నవలాకాలం తొమ్మిదేళ్ళలో ఆమె జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఐశ్వర్యాలలో పుట్టిన పిల్ల ఆ తర్వాత తిండికి వెతుక్కోవలసిన దరిదాన్నీ చూస్తుంది. యుద్ధం కలిగించిన దుర్భర పరిస్థితుల్ని, రకరకాల కష్టాల్ని అనుభవిస్తుంది. అన్నిటినీ తట్టుకుని విపత్కర పరిస్థితుల్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తుంది.

కథానాయకుడు రెట్ బట్లర్ సమాజపు కట్టుబాట్లని తృణీకరించిన వాడు. అందరూ వల్లించే మహదాశయాలపట్ల, దక్షిణాది డాంబికాలపైన ఏమీ గౌరవం లేనివాడు. దక్షిణాది పెద్దమనుష్యులందరూ అతన్ని కంత్రీగా జమకట్టి వెలిగా చూసినా, తన బతుకును తనకిష్టమైన రీతిగా బతకాలని నమ్మినవాడు. ఒక విచిత్ర సన్నివేశంలో స్కార్లెట్‌ని చూసిన రెట్ ఆమెలో ఉన్న విలక్షణతకూ, జీవశక్తికీ, సౌందర్యానికీ ఆకర్షితుడౌతాడు. స్కార్లెట్ వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసినా, ఆమె కోసం అనేక అపాయకర పరిస్థితుల్ని రెట్ ఎదుర్కొంటాడు. సజీవమైన, బలమైన వ్యక్తిత్వాలుగల ఈ రెండుపాత్రల చుట్టూ ఎన్నో సహజమైన చారిత్రాత్మక సంఘటనలు, సజీవమైన పాత్రలు.

మార్గరెట్ మిచెల్ జీవించి ఉండగా ప్రచురితమైన ఒకే ఒక్క నవల ఇది. కొన్నాళ్ళు విలేఖరిగా పనిచేసిన మిచెల్, కాలిమడమకు గాయమై విశ్రాంతి తీసుకొంటూ ఈ పుస్తకం వ్రాసిందట. 1936లో, ఆమె 36వ ఏట, ఈ నవల ప్రచురితమై, విపరీతమైన ప్రజాదరణను పొందింది. ప్రచురించిన ఆరు నెలలలోపే మిలియన్ (పది లక్షలు) కాపీలు అమ్ముడుపోయాయి. 1937లో పులిట్జర్ ప్రైజు వచ్చింది. నవలను సినిమాగా తీసే హక్కుల్ని ఆ రోజుల్లో 25వేల డాలర్లు పెట్టి కొనుక్కొన్నారు. ఆ సినిమాలో నాయిక పాత్రధరించే నటికోసం జరిగిన వెతుకులాట అమెరికాలో ఎంతో ఉత్కంఠ కలిగించింది. 1949లో ఆమె అట్లాంటాలో రోడ్డు ప్రమాదంలో మరణించింది.

దక్షిణాది రాష్ట్రాల తెల్లవారిలో ఈ పుస్తకం పవిత్ర చారిత్రక గ్రంథం స్థాయి అందుకుందంటే అతిశయోక్తి కాదు. తాము కోల్పోయిన జీవనస్థితికి శాశ్వతత్వం కల్పించిన పుస్తకంగా దీన్ని వారు చూస్తారు. ఈ నవల అంతర్యుద్ధకాలం నాటి దక్షిణాది తెల్లవారి దృక్పథం నుంచే చెప్పబడిందని, వారి మంచినేగాని చెడుని చూడలేదని దీనిపై విమర్శ. నాయిక స్కార్లెట్ ఉదాత్త వ్యక్తి కాదు; చాలా లోపాలున్న స్వార్థపరురాలు. ఇలాంటి వ్యక్తిని ఉత్తమ నాయికగా ఎలా తీసుకొంటాం అన్నది ఇంకో ప్రశ్న. కొంతమంది విమర్శకులు దీన్ని చవకబారు దక్షిణాది ప్రేమకథగా కొట్టిపారేసినా, ప్రజలు మాత్రం ఈ పుస్తకానికి బ్రహ్మరథం పట్టారు.

చరిత్రలో ఒక సంధిసమయాన్ని ఈ పుస్తకం మరపు రాని విధంగా చిత్రీకరించిందని నా అభిప్రాయం. ఒక నాగరికత శిథిలమవటం కళ్ళకు కట్టేట్టుగా, గుండెకు హత్తుకునేట్టు మంచినైపుణ్యంతో చిత్రించింది రచయిత్రి. నాయికా నాయకులు ముందు లోపభూయిష్టమైన వ్యక్తులుగా కనిపించినా, తరచి చూస్తే ఇద్దరిలోనూ చాలా విశిష్ట లక్షణాలు కనిపిస్తాయి. ప్రేమించినవారికోసం ఏమైనా చేయగల త్యాగగుణం ఉంది. లోకానికి వెరవరు. కష్టాలకు భయపడేవారు కాదు; బతుకు మీద ప్రేమ ఉన్నవాళ్ళు. భవిష్యత్తుపై నమ్మకం ఉన్నవాళ్ళు. ఈ రెండు ముఖ్యపాత్రలే కాదు, మిగతా పెద్ద పాత్రలు, చిన్న చిన్న పాత్రలు కూడా గుర్తుంచుకొనే విధంగా ఉంటాయి. ఉదాహరణకు మెలనీ విల్క్స్ పాత్ర నవల గడుస్తున్నకొద్దీ ఉన్నతంగా పెరుగుతుంది.

చిన్న అచ్చులో దాదాపు వేయి పేజీల పుస్తకం గాన్ విత్ ద విండ్. దాన్ని మొత్తంగా అనువదించడం కష్టమైన విషయం. అంత పెద్ద పుస్తకాన్నీ 500 పేజీలకి కుదించగలిగారు అనువాదకుడు డా. ఎం.వి.రమణారెడ్డి. నవల ముఖ్యగమనానికి అవసరమైన సన్నివేశాలను, సంభాషణలు మాత్రమే ఉంచి, కథాగమనం కుంటుబడకుండా, ఉత్కంఠ చెడకుండా చూసుకొన్నారు. నాకు బాగా నచ్చిన విషయం, అనువాదమంతా చక్కటి తెలుగు నుడికారంతో సాగింది. పాత్రలూ, సంఘటనలూ, సంస్కృతీ మనవి కాకపోయినా, సంభాషణలలోనూ, వర్ణనలోనూ పరాయితనం చాలా తక్కువగా కనిపిస్తుంది. రాయలసీమ మాండలికమేమో మరి, నాకు తెలీని కొన్ని కొత్త పదాలు (ఉదా: అంబేద), కొన్ని కొత్త ప్రయోగాలు (sobriety= గెలివి) కనిపించాయి. 1950లలో నండూరి, ముళ్ళపూడి, కొడవటిగంటి వారు చేసిన అనువాదాల నాణ్యత ఈ పుస్తకంలో ఉంది. అనువాదం అనిపించకుండా పేజీలు తిప్పిస్తుంది. Carpetbaggers అనే పదబంధానికి చేసంచీగాళ్ళు అనే ప్రయోగం బాగుంది. అనువాదకుడు ఈ నవలకు తెలుగులో పెట్టిన పేరు కూడా నాకు బాగా నచ్చింది. నుడికారమున్న అనువాదానికి ఈ పేరు కూడా మంచి ఉదాహరణ.

కానీ ఈ అనువాదంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టినవి అమెరికన్ పేర్లను వ్రాసిన విధానం – కొన్ని పేర్లకు ప్రాంతాన్ని పట్టి వాటిని ఉచ్చరించే విధానం మారినా, కొన్ని మరీ ఇబ్బంది పెట్టాయి (ఏబ్ లింకన్, అబే లింకన్ కావడం, వేడ్ వేడే అవటం, కెంటక్కీ కెంచుకీ అవటం వంటివి). దీనికి అనువాదకుణ్ణొక్కణ్ణే తప్పు పట్టలేం. ఈ అనువాదం ధారావాహికంగా ప్రచురితమౌతున్నప్పుడు ఆ పత్రిక (నవ్య) సంపాదకులూ, ఉపసంపాదకులూ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసి సరిదిద్ది ఉండాల్సింది. (నవ్య వారపత్రికలోనే కొన్నాళ్ళ క్రితం హిట్లర్ పైన ఒక ధారావాహిక – ఇంకెవరో వ్రాసింది – ప్రచురించారు. ఆ నవలలొ జ్యూ (jew) పదాన్ని జెవ్ అని, జ్యూయిష్ (jewish) పదాన్ని జెవిష్ అని కొన్ని వందలసార్లు వస్తుంది. jews అన్న పదానికి యూదులు అన్న తెలుగు వాడుక ఉన్నా, అది కూడా వారు వాడలేదు. పాఠకులకు ఈ తప్పు ఉచ్చారణలు అలవాటైతే, ఆ తర్వాత సరైన ఉచ్చారణలను వాళ్ళు గుర్తు పట్టలేరు).

ఈ అనువాదంతో నాకున్న ఇంకో పేచీ ఏమిటంటే, మూలంలో మూడు సన్నివేశాలలో మాటలకి చాలా గుర్తింపు, ప్రాధాన్యత ఉన్నాయి. మొదటి రెండూ కథానాయికకి సంబంధించినవి. దుర్భర దారిద్ర్యాన్ని మొదటి సారిగా ఎదుర్కొన్న కథానాయిక, తన చుట్టూ మిగతావారిలా బేలగా మిగలక, ‘ఏం చేసైనా సరే, తాను, తనవాళ్ళూ ఆకలితో అలమటించకుండా ఉండకుండా చూస్తాను’ అని దేవుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తుంది. అప్పటివరకూ వట్టి స్వార్థపరురాలుగానే కనిపించిన కథానాయిక పాత్రలో కీలకమైన మలుపునీ, ఆమె వ్యక్తిత్వంలో ఉన్న బలాన్నీ స్పష్టంగా చిత్రీకరించే ఈ సన్నివేశం (సినిమాలో, ఇప్పటి పరిభాషలో ఇంటర్వెల్ బ్యాంగ్ డైలాగ్ ఇది) ఈ అనువాదంలో లేదు. ఆంగ్లనవలలో కథానాయిక ఆఖరు మాటలు ఓటమికి తలవంచని ఆమె ఆశావహ దృక్పథానికీ, ఆత్మవిశ్వాసానికీ అద్దం పడుతాయి. ఆ చివరి సన్నివేశమూ ఈ నవలలో లేదు. ఈ వదిలివేతలతో అనువాదకుడు కథానాయికకు అన్యాయం చేశాడని నా అభిప్రాయం. మూడవ ప్రసిద్ధ వాక్యం పైన చెప్పిన కథానాయకుడి ఆఖరు మాట – My dear, I don’t give a damn. (Frankly అన్న ముందు పదం సినిమాలో జోడించారు). ఈ అనువాదం ఈ వాక్యంలో చూపించిన తూష్ణీభావానికి న్యాయం చేయలేదు. యుద్ధం తర్వాత టేరాలో స్కార్లెట్ పడ్డ కష్టాలు, రెట్ బట్లర్ తన కుటుంబం నేపధ్యం గురించి చెప్పిన విషయాలు ఉంటే ఈ అనువాదం పరిపూర్ణంగా ఉండేది అనిపించింది. ఇవేవీ ఈ పుస్తకం చదివి ఆనందించడానికి అడ్డంకులు కావు; మూలంతో బాగా పరిచయమున్నవాళ్ళకే ఈ ఇబ్బందులు.

ఎం.వి. రమణారెడ్డిగారు నేను చదువుకున్న గుంటూరు మెడికల్ కాలేజ్‌లో నా ముందు తరం వారు. అతివాద వామపక్ష రాజకీయాల్లో కొంతకాలం ఉన్నట్టున్నారు. ప్రభంజనం అనే పత్రికను సంపాదకుడిగా నడిపేవారు. మా ఇద్దరికీ మిత్రుడైన చెరుకూరి సత్యనారాయణ (సత్యం) ప్రోద్బలంతో నేను ఆ పత్రికకి రామాయణ విషవృక్షంపై సమీక్ష వ్రాశాను 1975 ప్రాంతాల్లో. ఎమర్జెన్సీ సమయంలో ఆయన అజ్ఞాతంగా ఉంటున్నప్పుడు కొన్నిరోజులు గుంటూరులో రహస్యంగా గడుపుతున్నప్పుడు మిత్రుడు సత్యంతో పాటు ఆయన్ని నేను సరస్వతీమహల్ వెనుక ఒక లాడ్జీలో కలిసిన సంగతి గుర్తుంది కానీ, ఆయన రూపురేఖలు ఇప్పుడు స్పష్టంగా గుర్తు లేవు. నేను అమెరికా వచ్చాక ఆయన పేరు వార్తాపత్రికలలో తరచు కనిపిస్తుండేది. తెలుగుదేశం పార్టీలో చేరినట్లూ, ప్రొద్దుటూరునుంచి ఎమ్మెల్యే అయినట్లూ, ఆ తర్వాత రాయలసీమ విమోచన సమితికి నాయకత్వం వహించినట్లూ, ఆ ప్రాంతపు ఫాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్లూ వార్తాపత్రికల్లో చదివాను. 1994 ప్రాంతంనుంచీ ఆయన కథలు వివిధ పత్రికలలో వస్తున్నాయి (ఆ రోజుల్లోనే SCIT (Soc.culture.Indian.Telugu) యూజ్‌నెట్ గ్రూప్‌లో నేను ఎం.వి.రమణారెడ్డిని రచయితగా వర్ణిస్తే కేటీ నారాయణ అనే ఆయన ‘రమణారెడ్డి రచయిత ఐతే నేను అష్టదిగ్గజాల్లో ఒకణ్ణి’ అని నాకు దొరికిపోయాడు; అది ఇంకో కథ). రమణారెడ్డి గారి కథలు ’పరిష్కారం’ పేరుతో ఒక సంపుటిగా వచ్చాయి. 1950లలో వచ్చిన కొన్ని గొప్ప తెలుగు సినిమాలమీద తెలుగు సినిమా స్వర్ణయుగం అనే విశ్లేషణాత్మక పుస్తకం వ్రాశారు. Papillon నవలను రెక్కలు చాచిన పంజరం పేరుతో తెనిగించారు. మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్రనూ తెలుగులోకి అనువాదం చేశారు. ద్రౌపదిపైన ఒక పుస్తకం, నవచైనా గురించి ఇంకో అనువాదం ఈయన ఇతర పుస్తకాలు.

ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు, అవకాశమూ లేని వారికి ఈ అనువాదం ఒక ప్రపంచ ప్రఖ్యాత నవలను చాలా సరళమైన రీతిలో పరిచయం చేస్తుంది. మీకు ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటున్నా, గాన్ విత్ ద విండ్ ఇదివరకే చదివినా, ఈ అనువాదం తప్పక చదవాల్సిందే. సృజనాత్మకత ఉండి, తెలుగు పలుకుబడి తెలిసిన అనువాదకుడు ఎంత చక్కగా అనువదించగలడో చదివి ఆనందించవచ్చు. ఇంగ్లీషు చదవటం అలవాటు ఉన్నవారు మూలాన్ని తప్పకుండా చదవాలి. అనువాదంలో చేర్చలేకపోయిన అనేక సన్నివేశాలు, సంభాషణలూ ఈ పుస్తకానికి తీసుకొచ్చే పరిపూర్ణతను అనుభవించవచ్చు.

************************

చివరకు మిగిలింది
మార్గరెట్ మిచ్చెల్
అను: ఎం.వి. రమణారెడ్డి
నవంబరు 2010
ప్రచురణ: ఎం.వి. రమణారెడ్డి, ప్రొద్దుటూరు, కడప జిల్లా, 516 362
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
513 పేజీలు, 200 రూ.

************************

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.About the Author(s)

Jampala Chowdary

చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానాకు 2013-2015కు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా, 2015-2017కు అధ్యక్షుడిగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.13 Comments


 1. ఈ పుస్తకాన్ని నేను చదివి ఎంతగానో ఆస్వాదించాను. అందుకు పుస్తకం.నెట్ కు, శ్రీ జంపాల చౌదరి గారికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు.


 2. Chowdary gaaru,

  Very recently read the book Chivaraku migilindhi…I enjoyed a lot..But as you said Sir some parts which shows positive traits of Scarlett were missing…It would be good if the Telugu version includes them too…Thanks for the very nice review…Nagini.


 3. చౌదరి జంపాల

  సోమవారం (మార్చ్ 21) సాక్షి సాహిత్యం పేజీలో వచ్చిన ఒక పుస్తక సమీక్ష ప్రకారం (http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/21032011/4), నత్తి లలితారెడ్డి గారు సరియైన ఉచ్చారణ అన్న పుస్తకం ప్రచురించారట. వివిధరంగాలలో ఉన్న తెలుగువారు కానివారి పేర్లు ఎలా రాయాలో ఈ పుస్తకంలో సూచించారట. ప్రతులకు: శ్రీ వంశీ, యర్రంపల్లి, వయా చింతలపూడి, పశ్చిమగోదావరి జిల్లా.


 4. మంచి పరిచయం. ఇన్నాళ్ళూ ఈ నవల/సినిమా గురించి వినడమే కాని, తెలియలేదు. పుస్తకం చదవాలన్న కోరికని మీ వ్యాసం కలిగించింది.


 5. MUJJU

  very very nice and wonder


 6. చౌదరి గారూ… మీరు చెప్పింది నాకు అర్థమైంది. సంపాదకులదే అంతిమ బాధ్యత అయినా అది తప్పొప్పుల్ని సరిగ్గా సవరించే పరిజ్ఞానం ఈ మధ్య కొందరు సంపాదకుల్లో, ఉపసంపాదకుల్లో కరువవుతోందని నేను చెప్పాలనుకుంది.

  అందువల్ల ఇంత శ్రమా పడి అనువదించిన అనువాదకుడు అది పాఠకుడికి చేర్చడంలో (ఈ ఉచ్చారణలు, పేర్లూ వగైరా విషయాల్లో) మరి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందన్నది నా అభిప్రాయం


 7. Jampala Chowdary

  @Independent: కృతజ్ఞతలు. రమణారెడ్డి గారి అనువాదం ఇంకా సరళంగా ఉంటుంది.


 8. Jampala Chowdary

  @సుజాత: అనువాదకుడికి బాధ్యత లేదు అన్నది నా వాదన కాదు. ప్రచురించే పత్రిక సంపాదకులకు కూడా బాధ్యత ఉండాలి అన్నది నా ప్రతిపాదన. పత్రికలో ప్రచురితమయ్యే ప్రతిదానికి ఆఖరి జవాబుదారు సంపాదకుడే కదా. jew అన్న మాటను జెవ్ అని వ్రాసిన రచయిత్రి పేరు నాకు గుర్తు లేదు కానీ అది నవ్యలో ప్రచురితమయ్యిందని ప్రస్తుతం నేను యాగీ చేస్తున్నాను కదా; నష్టం ఎవరికి?

  @Sreenivas Vuruputuri: అవును, గెలివి పాత మాటే. దాన్ని soberకి వాడటం నాకు కొత్త. ఉచ్ఛారణ తప్పు; సంపాదకుడి (కనీసం ప్రూఫ్‌రీడర్) అవసరం మరోసారి నిరూపితమయ్యింది.

  @Sreenivas: పుస్త్కం తప్పు అని మీకు తెలీదని నేను అనుకోవటం లేదు.

  @Narasimharao Mallina: కృతజ్ఞతలు. Scarlett పేరుతో అనుమతి పొందిన ఒక తరువాయి కథ(sequel) ప్రచురించబడింది, దాదాపు ఇరవై యేళ్ళ క్రితం. ఒకటో రెండో అనుమతి లేని తరువాయి భాగాలు, ఒక పేరడీ కూడ ప్రచురింపబడ్డాయి. నేను వాటిని చదవలేదు.


 9. ‘గాన్ విత్ ది విండ్’ ఈ నవల పేరువింటేనే మనసు ఏ పూర్వజ్ఞాపకాలలోకో వెళ్ళిపోతుంటుంది. ఎందుచేతనంటే ఇదే నేను మొట్టమొదటగా చదివిన ఆంగ్ల నవల.మాలతీ చందూర్ గారి ఈ నవలా పరిచయమే నేను ఆంగ్లసాహిత్యంలోని పుస్తకాలు చదివే అలవాటును నాకు నేర్పింది.(శ్రీమతి మాలతీ చందూర్ గారికి ఇటీవలనే పతీవియోగం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగింది)నేను ఇంజనీరింగ్ 4 వ సంవత్సరం చదువుతుండగా జరిగిన నా పెళ్ళిలో నా స్నేహితులంతా కలసి నాకు బహూకరించిన పుస్తకాలలో ఉన్న 3 పుస్తకాలు ‘నవలలూ – నారీమణులు’కూడా వున్నాయి. ఈ 3 పుస్తకాలూ ఇంకా నా బుక్ షెల్ఫ్ లో భద్రంగా ఉన్నాయి.గాన్ విత్ ది విండ్ నేను కొనుక్కున్న మొదటి ఆంగ్ల నవల.దురదృష్టవశాత్తూ ఈ నవల ఇప్పుడు నా దగ్గఱ లేదు.తరువాత ఎప్పుడో దీనిని రెండవసారి కూడా చదివాను. దాని ఎక్సటెన్షన్ కూడా మళ్ళీ ఎవరో రాశారు. అదీ కొన్నా, కాని పూర్తి చేయలేదు. ఈ పుస్తకానువాదం గుఱించి ఇప్పుడే తెలిసింది.చదవాలి వీలు కలగజేసుకుని.
  జంపాల చౌదరిగారి పరిచయం చాలా బాగుంది. ఎన్నెన్నో పూర్వ కాదు అపూర్వ జ్ఞాపకాలను తట్టి లేపింది. దురదృష్టవశాత్తూ ఆ సినిమా చూడటం మటుకు నాకు సాధ్యపడలేదు.మద్రాసు ఐ.ఐ.టీ. లో చదువు తున్నప్పుడు ఆ సినిమా చూసే ప్రయత్నం చేసినట్టు గుర్తు,ఎందువల్లనో కాని సాధ్యపడలేదు.మాతరం వారిలో నాకు మల్లే ఆ నవల వలన ప్రభావితులైనవారెందరో ఉన్నారని తెలిసి చాలా ఆనందం కలిగింది.ఆ నవలను చివరకు మిగిలింది పేరుతో అనువాదం చేసిన శ్రీ యం. వి రమణారెడ్డిగారికి నా ప్రత్యేక అభినందనలు. స్కార్లెట్ ఓహారా పాత్ర యొక్క నవలలోని డైలాగులు ఇప్పటికీ మనసులో గింగిరాలు తిరుగుతూనే ఉన్నాయి. రెట్ బట్లర్ విలక్షణత అంటే నాకెంతో ఇష్టం, అలాగే మిలనీ మంచితనం కూడా. చౌదరి గారికి ఈ ప్రత్యేక పరిచయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.అన్నట్టు ఇంకో విషయమండోయ్. నా ఐ.ఐ.టి. చదువు మధ్యలోనే జరిగిన యాక్సిడెంటు తర్వాత (కాలు రెండుచోట్ల విరిగింది)నేను సైకియాట్రిక్ డిప్రెషనులోకి వెళ్ళినపుడు నాకు వైద్యం చేసి నన్నుమామూలు మనిషిని చేసిన మానసిక వైద్యులు గౌ.(లేటు) శ్రీ శంకరరావుగారిని(గుంటూరు జనరల్ హాస్పిటల్) నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.జంపాల వారు కూడా మానసిక వైద్యులే అని తెలిసి సంతోషమన్పించి ఇది వ్రాస్తున్నాను.


 10. Srinivas

  ఈ నవల నవ్యలో సీరియల్ గా వచ్చింది పుస్త్కంగా రాకముందు. మీరన్నట్టు చక్కటి నుడికారం.

  “పాఠకులకు ఈ తప్పు ఉచ్ఛారణలు అలవాటైతే, ఆ తర్వాత సరైన ఉచ్ఛారణలను వాళ్ళు గుర్తు పట్టలేరు”
  నిజమే! ఉచ్చారణే అందుకు ఒక ఉదాహరణ.


 11. Srinivas Vuruputuri

  జంపాల గారికి

  మీ పరిచయ వ్యాసం చాలా బావుంది.

  “గెలివి” పాత మాటే. బ్రౌణ్యం ప్రకారం Bloom, brightness or clearness of complexion, Joy సంతోషము అని అర్థాలు. Sobriety అనే అర్థంలో ఇప్పుడే వింటున్నాను.

  మరో చిన్న మాట – ఉచ్చారణ స్పెల్లింగు తప్పేమో. టైపో అయి ఉండవచ్చు.


 12. Independent

  wow..అబ్భ, ఎంత సరళంగానూ, ఆసక్తికరంగానూ పరిచయం చేసారండీ. ఈ పుస్తకం గురించి నీళ్ళు గొంతులోకి జారినంత సులభంగా ఉండేలా పరిచయం చేయటం అధ్బుతం. చాలా కొద్ది మంది మాత్రమే చేయగలరు.

  మిక్కిలి కృతజ్ఞతలు


 13. ఏబ్ లింకన్, అబే లింకన్ కావడం, వేడ్ వేడే అవటం, కెంటక్కీ కెంచుకీ అవటం వంటివి). దీనికి అనువాదకుణ్ణొక్కణ్ణే తప్పు పట్టలేం.సంపాదకులూ, ఉపసంపాదకులూ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసి సరిదిద్ది ఉండాల్సింది.______________________

  సంపాదకులు, ఉప సంపాదకులు ఇవాళ అంత శ్రద్ధ వహిస్తారని అనుకోవడం అత్యాశే! పైగా ఇలాంటి ఉచ్చారణ గురించిన అవగాహన వారికి ఉంటుందని కూడా అనుకోలేం కాబట్టి అనువాదానికి పూనుకున్న వారే వీటి గురించి శ్రద్ధ వహించాలి. అది వారి బాధ్యత

  పాఠకులకు ఈ తప్పు ఉచ్ఛారణలు అలవాటైతే, ఆ తర్వాత సరైన ఉచ్ఛారణలను వాళ్ళు గుర్తు పట్టలేరు____________

  అనువాదాలలో ఇటువంటివి దాదాపుగా అనివార్యమవుతూ ఉంటాయి.దీనికి కూడా పూర్తిగా అనువాదకుడితే బాధ్యత.

  పాపిలాన్ నవల తెలుగులోకి అనువాదం అయిందని ఇప్పుడే తెలిసింది.

  గాన్ విత్ ద విండ్ ఇదివరకే చదివి ఉన్నా, అనువాదం ఎలా ఉందో చూడ్డానికైనా ఈ తెలుగు వెర్షన్ చదవాల్సిందే అయితే

  ప్రతి కోణాన్నీ విశ్లేషిస్తూ, వ్యక్తిగతానుభవాన్ని జోడించి మరీ సమగ్రంగా పరిచయం చేసినందుకు చౌదరి గారికి ధన్యవాదాలు  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

“నల్లమల ఎర్రమల దారులలో… యాత్ర” పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************** ఒక రచన మరికొన్ని రచనలకి కారణమవుతుందని మనం వింటూం...
by అతిథి
0