Sachin- Genius unplugged.

నేను స్కూల్లో ఉండగా, వివేకానంద వారి రచనలు బాగా చదివేదాన్ని. ఆయన ఒక చోట, “విశ్వాన్ని ఒక ఊపు ఊపి, ఉర్రూతలూగించే మహామహులను ఈ దేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది.” అని అంటారు. ఆ వాక్యం చదవగానే, స్పందనగా నా నోట వెలువడిన మొదటి మాట “సచిన్!” దశాబ్దం గడిచినా, నా నోట ఇంకా అదే మాట. ప్రపంచం ఇంకా ఉర్రూతలూగుతూనే ఉంది, సచిన్ ప్రభావంలో!

మీరెప్పుడైనా సచిన్ ఆడుతూ ఉండగా, స్టేడియంలో ఉన్నారా? ఉంటే, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు. కాని, మీరెప్పుడూ అది అనుభవించకపోయుంటే, ఆ సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సచిన్ బాట్ పట్టుకొని బయటకు వస్తుండగానే, డ్రెస్సింగ్ రూంకి ఇరువైపులా ఉన్న స్టాండ్స్ లో సందడి మొదలవుతుంది. మిగితా స్టేడియమంతా అతని first glimpse కోసం ఊపిరిబిగబెట్టుకొని చూస్తూ ఉంటారు. సచిన్ వడివడిగా మెట్లు దిగి, గ్రౌండ్‍లోకి అడుగు పెట్టే ముందు, బౌండరీ లైన్ వద్ద క్షణకాలం ఆగి ఆకాశానికేసి చూస్తాడు. అతను కనిపించిన ఆ క్షణం నుండి పిచ్ మధ్యకు నడిచే వరకూ, ఏదో పూనినట్టు, కొత్త శక్తి ఆవహించినట్టు, తన్మయత్వంలో ఏం చేస్తున్నామో కూడా గ్రహించలేక, ఆరేళ్ళ కుర్రాడి నుండి యనబ్బైల్లో పెద్దవాళ్ళు సైతం గొంతు చించుకొని అరుస్తారు, వెర్రి ఆనందంలో. గెంతులేస్తారు. కేరింతలు కొడతారు. ఆ కొద్ది క్షణాలూ, అది ఒక మామూలు క్రికెట్ స్టేడియం, మామూలు మనుషుల మధ్య, మనుషులు ఆడే ఒక క్రీడ అన్న స్పృహ దాదాపుగా ఎవ్వరికీ ఉండదు. ఒక మహోన్నతమైన శక్తిని కళ్ళారా చూసిన సంభ్రమాశ్చర్యాల్లో, అక్కడున్న ప్రతి ఒక్కరి ఆత్మ, స్వర్ణకమలం సినిమాలో “అందెల రవళిది పదములదా” పాటకు భానుప్రియ చేసినట్టు, ఆనందతాండవం చేస్తుంది. ఆడుతున్న ప్రతి క్షణం, ఆత్మ అద్వితీయానందాన్ని పొందుతూనే ఉంటుంది.

నన్నడిగితే దేవుళ్ళు ప్రత్యక్షమవగానే శ్లోకాలు చెప్పటమనేది పండితులకు మాత్రమే! వెర్రి భక్తి తప్ప మరేం తెలియని పామరులు, అతి సామాన్యంగా వ్యవహరిస్తూనే తమ భక్తి చాటవచ్చు. సచిన్ భక్తకోటి సహస్రగళ అర్చన వినాలనుకుంటే, సచిన్ ఆడుతున్న మ్యాచ్‍కి టికెట్ కొనుక్కోండి. పండితులు పాడే స్తోత్రాలు వినాలంటే, ఇదో ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న పుస్తకాలు లాంటివి కొనుక్కోవాలి మాట.

నిక్షేపంగా, ప్రతి రెండు-మూడు ఇన్నింగ్స్ కు కనువిందు కలిగిస్తున్నాడుగా, ఇప్పుడెందుకు చదూకోవడం అనుకున్నాను. కాని, సచిన్ పై రాసినదంటే, మనసూరుకోదు. పైగా, అనిల్ కుంబ్లే, ద్రవిడ్‍లు కూడా రాశారంటే, మనకు తెలీని సచిన్ గురించి తెల్సుకునే అవకాశం ఉంటుందని, పుస్తకం కొనుక్కోవడానికి డబ్బుల్లేక, స్నేహితురాలి దగ్గర నుండి అప్పు తీసుకున్నాను.

ఇదో వ్యాస సంకలనం. వ్యాస రచయితల్లో చాలా మంది జర్నలిజం, మీడియాకు చెందిన వారు కాగా, కొందరు ఆటగాళ్ళు, సచిన్‍తో, సచిన్‍కు ముందో ఆడినవారు. హర్షా భోగ్లే, పీటర్ రీబాక్, ఆర్. మోహన్, ఆయాజ్ మీమోన్, సురేష్ మీనన్ వంటి ప్రముఖుల వ్యాసాలున్నాయి.

సచిన్ ఒక మహాద్భుతమైన క్రీడాకారుడు. అది అతను ఆడ్డం మొదలెట్టిన కొన్నాళ్ళకే, ప్రపంచం గ్రహించింది. అతడి స్కూల్ టోర్నమెంట్ల నుండి, ఇరవై రెండేళ్ళ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ వరకు, సచిన్ అంటే సామాన్య మానవులు చేరువుకాలేని మహత్తర శక్తి అనే అనిపిస్తూ ఉంది. అందుకే, అతణ్ణి గురించి రాయాలంటే, అంతు పట్టని అనేక అంశాలు తగులుతూనే ఉంటాయి. అతను ఎంత సేపు, ఎన్నేళ్ళు ఆడుతున్నా చూడాలనిపిస్తుంది. అతని గురించి ఎంత రాసినా, ఇంకా చాలా ఉందనిపిస్తూనే ఉంటుంది. అందుకేనేమో, సచిన్ మీద వచ్చిన, వస్తున్న పుస్తకాలు ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉండిపోయాయి. ఈ పుస్తకం వాళ్ళు మాత్రం, ముందే ఆ విషయాన్ని విన్నవించుకున్నారు. “సచిన్” గురించి రాసిన వ్యాసాల్లో, సచిన్ వ్యక్తిత్వంలో, ఆటలో అనేకానేక అంశాలు స్పృశించడానికి ప్రయత్నించారు. ఆ విధంగా చూసుకుంటే, పుస్తక విషయానికి తగ్గ పేరు కాదనే అనిపించింది.

ఇప్పటికే బోలెడన్ని పుస్తకాలూ, వ్యాసాలూ, బ్లాగులూ చదివేసినా కూడా ఈ పుస్తకంలోని వ్యాసాలు fresh air అనే చెప్పవచ్చు. ఇందులో అన్నింటికన్నా నచ్చిన విషయం, సచిన్ భజనను పక్కకు పెట్టి, ఆయా వ్యాసకర్తలు సచిన్‍ను ప్రత్యేకమైన కోణాల్లో చూపించారు. ఉదాహరణ, పాకిస్థాన్‍పై అంతగా రాణించని సచిన్ గురించి ఒస్మాన్ సమైయుద్ధీన్ రాసిన వ్యాసం. మైక్ కొవార్డ్ రాసిన వ్యాసంలో, సచిన్-బ్రాడ్‍మాన్‍ల మధ్య ఆటను పోల్చటమే కాక, వారిద్దరి మధ్య సంగీతారాధనను కూడా పోల్చటం నాకు నచ్చింది. సంజయ్ మంజ్రేకర్, మకరంద్ వైన్‍గార్కర్ల వ్యాసాలు సచిన్‍లో ముంబయ్‍కర్‍ని ఆవిష్కరిస్తే, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్‍ల వ్యాసాలు “డ్రెస్సింగ్ రూం” సచిన్‍ను మన ముందుకు తెస్తాయి. సచిన్ కప్తెన్‍గా విఫలమవ్వటం వెనుక కారణాలను ఒక్కోళ్ళు ఒక్కో విధంగా విశ్లేషించారు. కొందరు హాస్యాస్పదంగా కూడా! ఒక్కో చోట, ఒక్కో విధంగా సచిన్ ఆశ్చర్యపరుస్తాడు. ప్రతీ వ్యాసం చదివాక, కలిగే భావనలో మాత్రం “మనకు తెల్సిన సచిన్” ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. Probably, all of us who watched him enough, know him enough! 🙂

అన్ని వ్యాసాల్లోకి నాకు విపరీతంగా నచ్చిన వ్యాసం: Air Tendulkar by Barney Ronay. ఈ మనిషికి సచిన్ అంటే అయిష్టత. సచిన్ చుట్టూ ఉండే ఆరాధన ఇంకా విసిగిస్తుంది. సచిన్ కష్టాల్లో ఉన్నప్పుడు వికటాట్టహాసం చేయాలనిపిస్తుంది. అయినా, కాలక్రమేణా ఈయన సచిన్‍కు దాసోహం అనక తప్పలేదు. అదెలానో వ్యాసంలోనే చదువుకోవాలి మరి. ఈ వ్యాసాల విశిష్టత అదే, వీటిని రాసినది ప్రొఫెషనల్ రచయితలే అయినా, వ్యాసాలు చాలా వ్యక్తిగతంగా, “సచిన్ నాకెందుకు ఇష్టం అంటే..” అన్న పంథాన నడుస్తాయి. బిషన్ సింగ్ అంతటి వారు, సచిన్‍ను మానవాతీత శక్తిగా, “మర్యాద పురుషోత్తముడు”గా అభివర్ణిస్తుంటే, ఆనందాశ్చర్యాలు కలుగక మానవు. ఆ వెంటనే వచ్చే ద్రవిడ్ వ్యాసంలో సచిన్ ఎంత సామాన్యంగా వ్యవహరిస్తాడో గమనింపజేస్తుంటే, మళ్ళీ ఆనందాశ్చర్యాలే!

ఇది బయోగ్రఫీ కాకపోయినా, సచిన్ బాల్యం నుండి, ప్రస్తుతం వరకూ చాలా స్పృశిస్తుంది. కొన్ని కథనాలు ఇప్పటికే విని ఉన్నా, కొన్ని కొత్తగా తెలుస్తాయి. సచిన్ ఇంతటి స్థాయికి ఎదగటానికి, ఎదుగుతూ ఒదగడానికి దోహదపడ్డ వ్యక్తులూ, కారణాలను, ఆయా వ్యాసకర్తలు విశ్లేషించారు. క్రికెట్ క్రీడకు తెచ్చిన గుర్తింపు, జనాల్లోకి చొచ్చుకుపోవటానికి కారణమవ్వడం లాంటి అంశాలే కాకుండా, యావత్ భారతావని పై, ముఖ్యంగా యువతపై, సచిన్ ప్రభావం లాంటి అంశాలను కూడా ఆలోచింపజేసే విధంగా రాశారు. సచిన్ ఒక క్రికెటర్ అన్న దశ నుండి చాలా ముందుకు వెళ్ళాడు. “సచిన్ మా దేవుడు” అని ఉద్ఘాటించేది, వేలంవెర్రిలో కాదనుకుంటాను. ముంబయ్‍లో రెండేళ్ళ క్రితం జరిగిన మారణకాండ తర్వాత నిస్తేజంగా ఉండిపోయిన భారతం పెదవులపై చిర్నవ్వులు తెప్పించగలిగింది, ఒక్క
సచినే! సామాన్యునితో సచిన్‍కున్న బంధానికి, బహుశా, క్రికెట్ ఒక సాకు మాత్రమే!

పుస్తకాన్ని, ఇంకెందుకు సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా, ఇందులో సచిన్ ఒక ప్రముఖ హిందీ చలనచిత్ర పాత్ర వేషం తీయించుకున్న ఫోటో కోసమైతే తప్పని సరిగా కొనాలి. మిగితా ఫోటోలన్నీ బాగున్నాయి. అనిల్ కుంబ్లే కెమరా బంధించినవి కూడా ఉండడంతో, ఇండియన్ టీంతో ఉన్న కొన్ని అరుదైన ఫోటోలు ఉన్నాయి. అవి, పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణగా మిగిలాయి. చివర్లో, సచిన్ ఆయా సందర్భాల్లో అన్న మాటలు, సచిన్‍‍పై పలువురి అభిప్రాయాలను చేర్చారు. జతగా, కొన్ని సాటస్టిక్స్ ని కూడా పొందుపరిచారు. నాకు అనవసరం అనిపించాయి. అన్ని వ్యాసాలూ సచిన్‍ అంకెలకు అతీతం అన్న విధంగా ప్రస్తుతించి, చివర్లో మళ్ళీ గ్రాఫులు ఏమిటో అర్థం కాలేదు. ఆ పేజీలు చకచకా తిప్పేశాను.

సచిన్‍ను ఇష్టపడేవారు, దాచుకోదగ్గ పుస్తకం. సచిన్‍ను ఇష్టపడని వారు, చదవాల్సిన పుస్తకం.

తన తొలి టెస్టు సీరిస్‍లో పాక్ బౌలర్ వేసిన బంతికి ముక్కు చితికాక, “నేను ఆడతాను” (మై ఖేలేగా!) అని అన్నాడట. అదే మాట సచిన్ నోట మరికొన్నాళ్ళ పాటు ఉండాలని, సచిన్ నామజపంతో మన నోర్లు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

______________________________

Details of Book:
Sachin – Genius Unplugged
Foreword By Muttiah Muralitharan
Editor: Suresh Menon
Published by: West Land
Price: 599
Genre: Sports / Biography
Available through Flipkart

You Might Also Like

14 Comments

  1. Purnima

    @Shiva: మొన్న నవతరంగం లో ఒక సినిమా గురించి రాసా.. మీ అంత దురుసుగా కాకున్నా, జనాలు అబ్యంతరం వ్యక్తం చేసారు. ఇవ్వాళా పట్టు బట్టి మళ్ళీ ఆ సినిమా చూసాను.. రెండో సారి కాస్త అన్న బోర్ అనిపించి ఒక రకం detachment తో చూడగలనని అనుకున్నాను. కాని, నాకిప్పుడా సినిమా ఇంకా నచ్చేసింది. ఇప్పుడు రాయాల్సి వస్తే ఇంకెన్ని రాస్తానో.

    సో..నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. కొన్ని మనల్ని కదిలిస్తాయి. Jose Saramago ఒక చోట అన్నట్టు…అవి హృదయపు seismographic readings. నేను వాటిని గురించే రాస్తాను. అందుకని మీకు అతిగా అనిపించచ్చు. కారనజన్ములా, అవతార పురుషులా అన్నది నాకనవసరం.. వాళ్ళ వల్ల నాకు ఎంత ఆనందం, భావోద్వేగం కలిగాయో నాకు ముఖ్యం. నేను సరైన వేదిక మీద రాస్తున్ననే నమ్మకం నాకు ఉంది.. మీరు, కాని చోట కావాలనుకున్నవి వెతుక్కుమ్తున్నారేమో నాకు తెలీదు. ఈమాట వారు “కథ నచ్చిన కారణం” అనే శీర్షిక నడుపుతున్నారు. అక్కడ నేను ఇలాంటి వ్యాసమోటి రాస్తే.. మీ అభ్యంతరానికి ఒక అర్థం ఉంది.

    రవి శాస్త్రి కావాలనుకుంటే టీవీ చూడాలి.. స్టేడియం కి వెళ్లి స్టాండ్స్ లో కూర్చొని రవి శాస్త్రి కోసం తప్పించటం లో అర్థం లేదు. పోనీ, అదన్నా ఓకే.. కాని చుట్టూ గోల కి.. వెధవ సంత అని అంటే కాస్త కష్టం కదూ?

    సచిన్ మనిషే! కాదనను. తప్పులు చెయ్యచ్చు. కళ్ళు మూసుకోను. అంత మాత్రాన సచిన్ ని ఆరాధనకి అనర్హుడు అన్నది మీ అభిప్రాయం. Respect personal opinions అని సచినే చెప్పాడు. విని ఊరుకోగలను. కాని.. మానేయండి అంటే వినను. వంద శతకాలు, వేల పరుగులు, ఎనలేని రికార్డులు.. సచిన్ని నిర్వచించేవి ఇవి, మీ లెక్కన. భారతదేశం మొత్తం మీద సచిన్ ఫాన్స్ అన్న పోల్ తీసుకుంటే కొన్ని కోట్ల మంది లెక్కలోకి రావచ్చు. కాని కేవలం అతడి ఆటను ఆస్వాదించటం కాక, ఆకాశం మిద పడిపోతుందని అనిపించే క్షణాల్లో సచిన్ ని తలచుకొని, వెయ్యి ఏనుగుల బలం వచ్చే వారూ వందల్లో ఉంటారేమో.. వాళ్ళని వాళ్ళ మానానికి వదిలెయ్యండి..(ఉచిత సలహా..)

    నా వ్యాసాలన్నీ క్షుణ్ణంగా చదివి, వ్యాఖ్యానించినందుకు థాంక్స్. వీలున్నప్పుడు, పుస్తకం “మా గురించి” పేజి కూడా చదివి.. అక్కడ మేం పెట్టిన జార్జ్ ఆర్వెల్ కోట్ ని కూడా చదవండి. పుస్తకం దాన్ని ఆధారంగా చేసుకునే నడుస్తోంది. నడుస్తుంది. Look for the right things at right places.

    Above all, my role in contributing here is not to guide people on reading. Or make them read. I read a book and then I’m talking loud enough so that people interested may hear it. And I trust their judgments when they pick up books, by reading or not reading this. Someone’s getting benefited is not my credit. Someone being ruined is also not my headache.

    And.. if Sach can’t be a role-model for this country and it’s youth..it sounds pathetic to me..

  2. p.sambasiva

    పూర్ణిమ గారు, మీరు ఏది రాసిన అసలు ఇంతవరకు ఇలాంటి పుస్తకం లేదనో, లేదా అసలు అందులోని కథానాయకుడు గాని, రాసిన రచయిత గాని కారణజన్ముడనో లేదా ఇక పుట్టబోరు అనే పద్ధతిలో రాస్తూ ఉంటారు. కాస్త బాలన్సుడ్ గా రాస్తూ ఉండండి. పూర్తి భక్త ధోరణి లో భక్త రామదాసి పద్ధతిలో రాయకండి. సచిన్ పైన ఎంత వేలంవెర్రి ఉందొ అంతేవేర్ర్రి సినిమా తారల పైన కూడా వుంది. సినిమా నుండి రాజకీయనాయకులైన వారిపైన కూడా వుంది. కులాలకి , అస్తిత్వాలకి సంకేతంగా మారిన నాయకులను ఇలాగే ఆరాధించే వాళ్ళున్నారు. భావావేశం ఉండడం మంచిదే గాని, దానికి కాస్త విచక్షణ ఉండడం మంచిది.
    వ్యక్తి పూజల్లోంచి కాస్త బైటికి రండి. ప్రతి వ్యక్తీ లోన మంచి, చెడు రెండూ ఉంటాయి, మీరు అమితంగా ఆరాధించే రమణ గారి మాటల్లోనే చెప్పాలంటే.
    రెండూ బేరీజు వేసుకుని, విశ్లేషించుకుంటే , ఇంత వ్యక్తీ పూజ లోకి వెళ్ళే అవకాసముండదు.
    ఇంతకాలం అవకాశాలు ఇచ్చి, ప్రోత్సాహం ఇస్తే , సామాన్యులూ విజయాలు సాధిస్తూ ఉంటారు, ఇక సచిన్ లాంటి వారి సంగతి చెప్పేదేముంది?
    అయినా విజయాల గురించి తప్ప, అపజయాల గూర్చి విశ్లేషణ ఉండదాఅండి ?
    ఉత్త భజనా, మరికొంత భావుకత్వం తప్ప ఏముంది మీ రివ్యూ లో!
    దురుసుగా రాస్తున్నానని కాకుండా , మీ reviews ఒకసారి సమిక్షించుకోండి;
    ఫలానా శతకాల క్రికెట్ వీరుల్లపైన , నూరు చిత్రాల కథానాయకుల పైన , యుగానికోక్కడు , చరిత్రకోక్కడు లాంటి పుస్తకాలు ఎపుడూ వస్తూ ఉంటూ నే ఉంటాయి. ఇవన్ని మార్కెట్ ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు. ఇలాంటి వాటిపైన సమీక్షలు రాసి .ఇంకా craze పెంచి , తప్పుడు ధోరణులు పెంచకండి
    యువతకి ఎలాంటి వారు ఆరాధ్యులుగా ఉంటె బాగుంటుందో ఆలోచించండి.
    — s h i v a .
    హుబ్లి.

  3. Andy

    Kudos!
    Nothing short of Spectacular
    Its an honor to have a book like this
    thanks a ton for sharing.very Well written!

  4. వేణూశ్రీకాంత్

    ఈ వ్యాసం సగం చదివాక మొదటిసారిగా నేను నా లైఫ్ లో “క్రికెట్ చూడకపోవడం వల్ల నేనేమైనా మిస్ అవుతున్నానా..” అని ఆలోచించాను పూర్ణిమా.. అంత బాగా ప్రజంట్ చేశారు 🙂

  5. Independent

    The guy(Sachin) is frikking Gandhi-like figure for me (I know..not everyone here likes Gandhi), and he keeps getting better and better everyday.

    What crushes me is the gravity of his personality, more than the weight of his bat and the ballooning stats-bag, that follows him everywhere.

    And as far as the review is concerned..somehow I felt boring.

  6. జంపాల చౌదరి

    >>మీరెప్పుడైనా సచిన్ ఆడుతూ ఉండగా, స్టేడియంలో ఉన్నారా?

    Reminds me of watching the other God, the God of basketball, Michael Jordan being introduced, particularly at the Stadium in Chicago. Thousands of cameras would flash all around the stadium eclipsing the spotlight in the arean and the gleeful roar of the crowd would quickly rises to a crescendo and take its own time to subside, only to reappear everytime he touches the ball and starts running towards the opponent’s basket.

  7. prasanth

    @Purnima: you are most welcome.

  8. Purnima

    @prasanth:

    Got a copy of outlook edition! 🙂 Thanks to you, having a great time reading those articles. Will write an article soon.

    Hunt is on for “The Week” edition. Hoping and praying that I’ll get hold of it soon.

    Thanks again for choosing to comment here. If not for you, I might have missed these forever.

  9. prasanth

    @Purnima:
    as you noticed,outlook’s edition is a recent one.it could be available.
    the week’s edition is released in last week of December.actually it is issued along with the regular issue without charging any additional price i.e 25 bucks.this could be hard to get since two months have been passed.
    both issues are different in content, the former contains writings of cricket journalists where as the latter contains writings of cricketers played with sachin ranging from his arc rival mc grath to chaser ponting and many others.i must say,it is a collectible and worth a search if you are a lover of sachin.

  10. Purnima

    @prasanth:

    Thanks a ton, dude!

    No. I didn’t know a thing about those two special editions. Outlook seems to be a recent one. Getting hold of a copy shouldn’t be a problem.

    But when this “The week” thing happened? How tough would it be to get it now?

    Please revert!

    Thanks again.

    Purnima

  11. prasanth

    i am also a big fan of sachin.have you read outlook and the week commemorative editions of his fifty centuries?those two are really good interms of content and contributerds of those also some big names of cricketand cricket journalism.coming to the prices, very much affordable to anyone.

  12. సౌమ్య

    @Praneetha: IT would have been nice if you supported the claim with some stats.

    Of the 65 articles that came in 2011, Sowmya (that is me) wrote 9 and Purnima wrote 3 articles. Which is 18% roughly. 🙂

  13. Praneeta

    As much as I like the pustakam.net works,I often observe that most( ofcourse, not all) of the posts are by Purnima/Sowmya and comments too.

    my suggestion is, probably you will have to announce it one more time that you need some writers who can contribute. and that way , we can perhaps avoid more posts from same writer and more posts in similar styles.

    Can this be considered to have fresh air here

  14. సౌమ్య

    Good one. ఇది చదవగానే ఇప్పుడు ఈ పుస్తకం చదవాల్సిందే అనిపించింది.
    ‘అనుకున్నామని, జరగవు అన్నీ. అనుకోలేదని, ఆగవు కొన్నీ – అన్నది వేరే మాట 🙂

Leave a Reply