గడచిన సంవత్సరం, చదివిన పుస్తకాలు, పెరిగిన పరిచయాలు

వ్యాసకర్త: లలిత జి
పుస్తకం వారితో నా పరిచయం అనుకోకుండా జరిగింది. పిల్లల కోసం అంతర్జాలంలో తెలుగు విషయాలు ఏమున్నాయో వెతుకుతుంటే పుస్తకం వారి వల కనిపించింది. అందులో పుస్తకాల గురించి ఎన్ని కబుర్లున్నాయో. కానీ పిల్లల కోసం ఒక వర్గం లేదేమిటనిపించి, అదే మాట వారిని అడిగాను. అంతే, వారు ఆ ఒక్క మాట అందుకుని ఓ నెల బాల సాహిత్యం ‘ఫోకస్‘ ప్రకటించేశారు. ప్రకటించి ఊరుకోకుండా పది మందికీ చెప్పి రాయించారు. అంతటితో ఆగకుండా బాలసాహిత్యంలో జరుగుతున్న రెండు మంచి ప్రయత్నాలని కళ్ళముందు ఉంచారు. అవి, మంచిపుస్తకం, కొత్తపల్లి పిల్లల పత్రిక . “ఔరా! ఏమి ఈ అమ్మాయిలు!” అనిపించారు. వీరు బ్లాగ్లోకంలో ఇంతకు ముందే పరిచయమయ్యి, అప్పుడే ఆశ్చర్యపరిచినా, రెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఈ విధంగా పరిచయమయ్యి ఆ ఆశ్చర్యం హద్దు పెంచారు.

బాలసాహిత్యం పై నేను రాసిన వ్యాసాలకి వ్యాఖ్య రాసి, మాలతి గారు పునఃపరిచయమయ్యారు. అటునుంచీ, ఇటునుంచీ, “తెలుగెప్పుడూ రెండో భాషే ”  చర్చలో మళ్ళీ కలుసుకోవడం, ఆ పైన మాలతి గారు సామెత కథలకి సాయం చేస్తానంటూ ముందుకు రావడం, ఆ పైన కొన్ని సామెత కథలతో  పాటు సీరియస్ విషయం మీద చిన్న సరదా కథ కూడా తెలుగు4కిడ్స్ కి తోడవ్వడం, దాదాపు చక చకానే జరిగిపోయాయి.

అదే ‘ఫోకస్’ లో “టోటో ఛాన్” పరిచయం  చేసి పూర్ణిమ పూర్తిగా చదివేలా చేసింది. అది స్నేహితురాళ్ళతో పంచుకుంటే ఇంకెవరివో బాల్య స్మృతులను తట్టిలేపింది. చంద్రలత గారుపరిచయం చేసిన Going to School in India కూడా చాలా బావుంది. ఈ రెండు పుస్తకాలూ, మరి కొన్ని మంచి పుస్తకాలూ మా పిల్లల బడులకు, టీచర్లకు ఈ సంవత్సరం బహుమతిగా ఇవ్వాలి అని నా ఆలోచన.

ఇక పోయిన సంవత్సరం నేను చదివిన పుస్తకాలు:
2010 చందమామలు. పుస్తకంతో పరిచయం ఏర్పడినప్పుడే చందమామ చరిత్ర కూడా చదవడం మొదలు పెట్టాను. చందమామ అభిమానులు, చందమామ రాజు గారు, చందమామకు మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేందుకుందుకు పడుతున్న తాపత్రయం తెలుసుకున్నాను. నా జ్ఞాపకాలెన్నో నెమరు వేసుకున్నాను. మా పిల్లలూ కొంచెం పెద్ద వాళ్ళయ్యారు. ఇదే సరైన సమయం అని చందమామ చందాదారునయ్యాను. బాగా ఎదురు చూడ వలసి వచ్చింది. కానీ మొత్తానికి చేతికందాక ఆ సంతోషం చెప్పలేనిది. మా పెద్దబ్బాయి బొమ్మల్లో మునిగి తేలడం, మా చిన్నబ్బాయి నేను చదివి వినిపించిన కథలు వినడమే కాకుండా వాటి గురించి ఆలోచించి చర్చించడం, వీటి వల్ల నాకు కలిగే సంతోషం నాకే అర్థమౌతుంది.

బాల సాహిత్యమే కాకుండా, నేను చదివిన పుస్తకాలు కొన్నే అయినా, అవినన్ను అమితంగా ఆలోచింప చేస్తున్నాయి. అవి, “The pursuit of Happyness”, “Writing Down the Bones”, “Committed”, “Eat Pray Love”. అవును, అన్నీ ఆంగ్ల పుస్తకాలే. పుస్తకం.నెట్ లో పరిచయం చేసిన తెలుగు పుస్తకాలు కొన్ని ఈమధ్యే తెప్పించుకున్నాను. వాటితో పాటు మాలతి గారి “కథల అత్తయ్య గారు” కూడా. అవి 2011 లో చదివిన పుస్తకాలు అంటూ పరిచయం చెయ్యాలి:)

పైన చెప్పిన ఆంగ్ల పుస్తకాలలో రెండు మా స్నేహితురాలు సూచించినవి. తను Eat Pray Love గురించి చెప్పినప్పుడు, ఆ రచయిత్రిని ఓప్రా షోలో చూసినట్టు గుర్తుకు వచ్చింది. ఆ పైన, ఆ తర్వాత ఆమె రాసిన పుస్తకం Committed అని గుర్తుకు వచ్చి, తర్వాత రాసిన పుస్తకం ముందు చదవాలనిపించింది. ఆమె అభిప్రాయం మారిపోయిందా, ఏమిటి, అన్న అనుమానంతో చదవడం మొదలు పెట్టాను. ఐతే ఆమె పరిశీలనకు అబ్బురపడ్డాను. ఎన్నో కొత్త కోణాల్లో ఆలోచించడం మొదలు పెట్టాను. మొత్తానికి ఈ పుస్తకం ముందు చదవడం మంచిదే అయ్యింది. రెండో పుస్తకంలో రచయిత్రి రాసిన విషయాలు చదవడానికి ఎక్కువ సుముఖత కలిగింది. Eat Pray Love సినిమాగా వచ్చింది, నేనింకా చూడలేదు. పుస్తకానికి సినిమా ఎంతవరకూ న్యాయం చేసిందో తెలియదు. పుస్తకం కూడా లైబ్రరీ నుంచి తెచ్చుకున్నాను కనుక మూడో భాగం చదవకుండానే ఇచ్చెయ్యాల్సొచ్చింది. మళ్ళీ తీరిక దొరికినప్పుడు తెచ్చుకుని చదవాలి.
ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పుడు “మీరేం చదువుతున్నారు?” లో పంచుకున్న ఆలోచనలు:
“Eat Pray Love చదువుతున్నాను.
ఒక (I don’t mean typical) ఆధునిక అమెరికా మహిళ మనసు చదివినట్లు ఉంది.
కొన్ని విషయాలు ఇక్కడ పెరగడం మూలంగా విరుద్ధం, accept చెయ్యాలనిపించదు, accept చెయ్యనవసరం లేదు. కానీ అవి పై పై విషయాలు మాత్రమే.
కానీ లోతుగా చూస్తే, అసలు విషయానికి వస్తే మాత్రం ఆమె స్వగతం మనకు ఏ సంస్కృతిలోనైనా పరిచయం అయ్యే అనుభవాలూ, మనస్తత్వాలకి ఏమీ దూరంగా లేదు.
ఒక మానసిక సంఘర్షణను అక్షరాలలో చూస్తాము. మనమూ ఆలోచించుకుంటాము (నా లాంటి వారు).
ఈమే Committed కూడా రాశారు.
మొదటి పుస్తకం self discovery అయితే రెండోది సంఘంతో రాజీ పడడం.
తను తన ప్రేమికుడినుంచి ఏమి ఆశిస్తోందో, అవి దొరకకపోవడం ఎలా బాధిస్తోందో చెప్పినప్పుడు, ఆమె తల్లి (happily married) “నేను కూడా అవి కావాలనుకున్నాను” అని చెప్పడం విస్తు పరుస్తుంది. “ఐతే నేను ఏదైనా పొందవచ్చును అనే విషయ జ్ఞానంతో పెరిగిన సమయం కాదది.” (నా అనువాదం పూర్తి న్యాయం చెయ్యక పోవచ్చు అసలు మాటలకి), అని తల్లి చెప్తే రచయిత్రి ఆలోచనలో పడుతుంది. ఇలాంటి ఉదాహరణలు (పరస్పర విరుద్ధాలు) అక్కడక్కడా రెండు పుస్తకాలలోనూ కనిపిస్తాయి, బాగా ఆలోచింపచేస్తాయి .
ఆధునిక వాదులైనా, సాంప్రదాయ వాదులైనా చదవ వలసిన పుస్తకం ఇది. స్వేఛ్ఛకీ ఒక ఖరీదు ఉంది అని తెలిసి ఆ ఖరీదుతో సహా ఆ స్వేఛ్ఛను ఆహ్వానించి, సంఘర్షణ తర్వాత ఒక సంతృప్తికరమైన సమాధానం, లేదా, సాధన మార్గం తెలుసుకో గలిగే ప్రయత్నం అర్థం అవుతుంది.
స్వేఛ్ఛనీ, ఆధునిక మహిళ మనఃస్థితినీ కొంచెం tolerate చేసే స్థాయికి ఎదగ వచ్చు, ఆధునిక మహిళ “సుఖ పడదు” పైగా బోలెడంత సంఘర్షణను ఎదుర్కొంటూ తన మార్గాన్ని అన్వేషించుకుంటుంది, అటువంటి ఆకాంక్ష ప్రతి తరంలోనూ స్త్రీలకీ ఉన్నా, ఈ తరం వారికి అవకాశం కూడా ఉందనీ, అది ఎలా వినియోగించుకోవాలి అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవలసినదేననీ ఇలా చాలా అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకోదల్చుకుంటే. ఈ ఆధునిక స్త్రీలందరూ కూడా ఒకే రకం వారు కాదు అనీ తెలుస్తుంది.
ఒక సంవత్సరం పాటు celibacy అవలంబించి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మూడు దేశాలు తిరిగి pleasure, ఆధ్యాత్మికత, ఈ రెండిటి మధ్య balance పట్ల తన దృక్పథాన్ని తాను తెలుసుకునే ప్రయత్నం ఈ పుస్తకం ఇతివృత్తం.
Again, it is not about a typical lady of any generation. It is about a particular woman in search of her true self, who also, luckily, has the opportunity to actually take up that search, by virtue of being born in modern times.”

Writing Down the Bones, Freeing the writer within కూడా స్నేహితురాలు పరిచయం చేసినదే. నేను ఈ పుస్తకాన్ని చదవమని చెప్తాను. కానీ నచ్చుతుందనో, ఎంతో బావుందనో చెప్పను. నాకు బాగా నచ్చింది అనే వ్యక్తీకరణ కూడా దీనికి నప్పదు. అలాగని నచ్చలేదు అని కూడా కాదు. ఐతే నేను ఇంకొన్ని సార్లు, కనీసం ఇంకా ఒక్క సారి అయినా చదవాలనుకుంటున్నాను. ఇందులో ఒక అతి చిన్న చాప్టరు మా పిల్లలకు కూడా చదివి వినిపించాను. మా చిన్నబ్బాయి అది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాడు కూడా. అది, “Don’t Marry The Fly” అని. హోటల్లో సీను వర్ణిస్తూ details అన్న ధ్యాసలో పడి ఆ కప్పు మీద వాలిన ఈగను వివరంగా వర్ణిస్తూ కూర్చుంటే పాఠకుడు నిరాశ చెందుతాడు అని సరదాగా చెప్పడం అన్న మాట. ఇందులో నన్ను ఆలోచింప చేసే విషయాలలో కొన్ని, రచయితల గురించి చెబుతూ, “We are not our writing” అని చెప్పడం ఒకటి. రచన చేశాకా దానిని let go చెయ్యడం గురించి. రచయితలు కావాలనుకునే వారు ప్రతిరోజూ రాయడం గురించి, మన నిజ జీవిత అనుభవాలని కాల్పనికంలోకి అన్వయించుకోవడం గురించీ, ఇంకా ఎన్నో విషయాలు. అన్ని విషయాలకన్నా ముందు, ఈ విషయాలు విడి విడిగా అర్థం చేసుకున్నా, అన్నీ అన్ని వేళాలా సరైనవి కాదు అని ముందే చెప్పడం, అలాగే ఒక దానికి ఒకటి వ్యతిరేకంలా అనిపించే విషయాలు, Don’t Marry The Fly కన్నా ముందు The Power Of Detail గురించి చెప్పడం, Living Twice, అంటే రచయితలు తమ రచనల ద్వారా తమ అనుభావలను మళ్ళీ జీవించడంఅనుభవించాల్నుకొంటూ ఉండ వచ్చు అనే విఆలోచనను స్పృశించడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాకుగా నచ్చినవి చాలా ఉన్నాయి.

పైన చెప్పిన పుస్తకాల రచయిత్రులు “Natalie Goldberg”, “Elizabeth Gilbert” ఆలోచనలు చాలా విషయాలలో నాకెంతో పరిచయమైనవీ, నాకు బాగా గురి ఉన్న వాళ్ళు చెప్పే వాటికి దగ్గరగా ఉన్నవీ అనిపించాయి. పాశ్చాత్య స్త్రీలు, నాకు పరిచయం లేని life style జీవించే వాళ్ళూ ఐనా, వీరి ఆలోచనలు ఇంత దగ్గరగా ఉండడం, ముఖ్యంగా Elizabeth Gilbert ఆధ్యాత్మిక దృక్పథం, నన్ను ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఇంకా, అడపా దడపా ఇంకొన్ని పుస్తకాలు కొంచెమే చదివాను. అబ్దుల్ కలాం గారు రాసిన Ingnited Minds, Wings of fire కొంచెం చదివి వదిలేశాను. Ignited minds గురించి పుస్తకం.నెట్ లో వ్యాసం రావడం నాకు సంతోషం కలిగించింది. నా భావాలు కొన్నింటికి అక్కడ వ్యక్తీకరణ దొరికింది. Wings of Fire సాంకేతిక విషయాలు మొదలైన చోట ఆపేశాను. మళ్ళీ తీసి చదవాలి. ఐతే పుస్తకంతో సంబంధం లేని ఒక విషయం పంచుకోవాలనిపిస్తోంది. నాకు పరిచయమైన ఒక పాకిస్తాను అమ్మాయి, భారత దేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తే అర్థం చేసుకోవడానికి కష్టపడింది. దేశానికి మతం లేదని చెప్తే అర్థం చేసుకునే ప్రయత్నంలో “ఐతే ముస్లిం కూడా ప్రభుత్వంలో ఉండచ్చా?” అని అడిగి, వెంటనే, ఆమే సమాధానం చెప్పుకుంది, “అవును, మీ ప్రెసిడెంటుగా అబ్దుల్ కలాం ఉన్నారు కదా” అని. అప్పుడు నా దేశం సెక్యూలర్ అని చెప్పుకోవడానికి నేను ఎంత గర్వపడ్డానో మాటల్లో చెప్పలేనిది.

2010 లోనే చదవక పోయినా నెహ్రూ గారి జీవిత చరిత్ర ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను. అది ఒక సారి చదివి పక్కన పెట్టేసేది కూడా కాదనుకోండి. అది ప్రతి భారతీయుడూ చదవాలి. గాంధీ గారి ఆత్మకథ కన్నా, గాంధీ గారి గురించి కొంచెమైనా అర్థం కావాలంటే ఆయన గురించి నెహ్రూ మాటల్లో వినాలి. అలాగే అబ్దుల్ కలాం గారి గురించి కూడా ఇతరులు రాసినవి ఏమైనా చదివాలేమో అనిపిస్తోంది. అది సరే, ఇంకా నెహ్రూ గారి జీవిత చరిత్ర ఎందుకు చదవాలంటే, నేడు నెహ్రూ అంటే కాంగ్రెస్ అనీ, వివేకానందుడు అంటే ఇంకో పార్టీ అనీ ముద్రలు ఏర్పడినట్లనిపిస్తోంది. అలాగే గాంధీ గారి గురించి కూడా. తప్పు ఒప్పులతో కలిసి పార్టీలకు అతీతంగా ఈ గొప్ప మనుషుల గురించి తెలుసుకోవాలి. ఘాడ్సే మాటల్లో గాంధీ గారి గురించి చదవడం మంచిదే. కానీ గాంధీ గురించి తెలుసుకోవాలంటే, ఇంకా ఎంతో చదవాలి. భగత్ సింగ్ పేరే అత్యంత ఉత్సాహాన్నీ, ఉద్రేకానీ కలిగిస్తుంది. కానీ అతని లేఖలనుకుంటా, చిన్నప్పుడెప్పుడో చదివాను, మళ్ళీ బ్లాగుల్లో చదివాను. సరిగ్గా చదివితే అతనిది ఉగ్రవాదం ఎందుకు కాదో, ఉగ్రవాదం ఎందుకు సరైనమార్గం కాదో తెలుస్తుంది. చిన్నప్పుడు అతని ఉత్తరం ఒకటి చదివి అవును, “భగవద్గీతలో చెప్పినది ఇదే కదా” అనిపించడం గుర్తు. “కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన”… అని. ఇప్పుడు వేరే కోణాలు కొద్దిగా అర్థం అవుతున్నాయి. గాంధీ పేరైనా, భగత్ సింగ్ పేరైనా, సత్యాగ్రహం చేపట్టినా, ఆయుధ మార్గం పట్టినా, అది తొడుగు మాత్రమే ఐనప్పుడుజరిగేది నష్టమే. ఆ యా ఉద్యమాలు ఇప్పటికీ మనసుల మీద ఎందుకు ముద్ర వేశాయంటే, అవి నడిపిన వ్యక్తుల నిజాయితీ, నిబద్ధతల వల్ల. మనలో ఉత్సాహాన్నీ, ఉద్రేకాన్నీ కలిగించే వ్యక్తులను పేరు మాత్రమేగా కాకుండా, వారి గురించి చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనం హీరోలుగా భావించే వారి సుగుణాలే కాక వారి బలహీనతలనూ తెలుసుకోవాలి. సుగుణాలది పై చేయి ఎలా అయ్యిందో ఆలోచించాలి. వారు సాధించిన విజయాలే కాక అపజయాలనూ అర్థం చేసుకోవాలి. జీవితానికి జయాపజయాలకన్నా విస్తృతమైన పరిభాష ఉందని తెలుసుకోవాలి. విజయం “లైం లైటు” ఐతే అపజయం “టార్చి లైటు” – దారి చూపిస్తుంది. ఈ నా ఆలోచనలకు దగ్గరిగా ఉన్న పుస్తకాలనే నేను చదివాను, అవి నాకు నచ్చాయి అని చెప్పొచ్చేమో, 2010 లో నేను చదివిన పుస్తకాల గురించి.

ఇప్పటికి “ఇంతే” సంగతులు. చిత్తగించగలరు 🙂

You Might Also Like

2 Comments

  1. Anil kk

    Lalitha garu,

    Two things well said…

    1. గాంధీ గారి ఆత్మకథ కన్నా, గాంధీ గారి గురించి కొంచెమైనా అర్థం కావాలంటే ఆయన గురించి నెహ్రూ మాటల్లో వినాలి.

    2. ఆ యా ఉద్యమాలు ఇప్పటికీ మనసుల మీద ఎందుకు ముద్ర వేశాయంటే, అవి నడిపిన వ్యక్తుల నిజాయితీ, నిబద్ధతల వల్ల. మనలో ఉత్సాహాన్నీ, ఉద్రేకాన్నీ కలిగించే వ్యక్తులను పేరు మాత్రమేగా కాకుండా, వారి గురించి చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Incidentally, I too hold the same opinion.
    Thank u for the review.

Leave a Reply