పుస్తకం
All about booksపుస్తకంప్లస్

April 19, 2010

కొత్తపల్లి – తెలుగు పిల్లల ఈ-మాసపత్రిక – పరిచయం

More articles by »
Written by: సౌమ్య

మొదటిసారి ఈ పత్రిక గురించి బీఓఎస్‍ఎఫ్ వారి మెయిళ్ళలో విన్నాను. ఆపై, పత్రిక వెబ్సైటు చూసినపుడు – పిల్లలే కథలు రాయడం చూసినపుడు – ’ఇదేదో భలే ఉందే’ అనుకున్నాను. పత్రిక కాపీలు రెండు మూడు చేతిలో పడ్డాక, తిరగేయడం మొదలుపెట్టాక, ఇక దీని ప్రేమలో పడిపోయాను. అందుకే, కొత్తపల్లిని పరిచయం చేస్తూ పుస్తకంలో ఒక వ్యాసం రాయాలి అని నిర్ణయించుకున్నాను. ఒక చిన్న టీం, అనంతపురం లోని టింబక్టు ప్రాంతంలోని బడులు కొన్నింటిలోని విద్యార్థులు కలిసి నిర్వహిస్తున్న పత్రిక ఇది. నావరకైతే, కొత్త తరం చందమామ ఇది. పత్రిక చూడ్డానికి, చదవడానికి చాలా బాగుంది. వాళ్ళకున్న పరిమితుల్లో, పత్రికని చాలా బాగా తీసుకొస్తున్నారనే అనిపించింది నాకు.

పత్రికని ’క్రియేటివ్ కామన్స్’ లైసెన్సు తో విడుదల చేయడం ఒక ఎత్తైతే, కృతజ్ఞతల సెక్షన్లో – ’పైథాన్.ఆర్గ్, ఓపెన్ ఆఫీస్.ఆర్గ్. యూనికోడ్, బరహా, జింప్, స్కిం, ఉబంటు, టింబక్తు, ఇన్ఫోగమీ,అడేసిటీ, క్రియేటివ్ కామన్స్’ – వీటి పేర్లు ఉంచడం నాకు అన్నింటికంటే నచ్చిన, ఆశ్చర్యం కలిగించిన విషయం. ఆశ్చర్యం దేనికంటే, ఎక్కడో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి లోని ఒక పత్రిక – ఇంత విరివిగా ఓపెన్ సోర్సు ను వాడడమే కాక, అక్నాలెడ్జి చేస్తున్నందుకు. ఓపెన్‍సోర్సు కు ఇంతకంటే గొప్ప ఉపయోగం ఉండి ఉంటుందని నేననుకోను. అంతే కాక, తరువాత పుస్తకం.నెట్ తరపున కొత్తపల్లి వారితో జరిపిన ఈమెయిల్ సంభాషణలో పిల్లలు కూడా పైథాన్ వగైరాలు నేర్చేసుకుని సాంకేతిక సాయం కూడా అందిస్తున్నారు అని తెలిసాక, కొత్తపల్లి టీం పై మరింత అభిమానంతో కూడిన గౌరవం కలిగింది.

రెండవతరగతి పిల్లలు కూడా మంచి ఊహాశక్తితో కథలు రాయడం (తెలుగులో) చూసి మహా సంతోషంగా అనిపించింది. కొన్ని కథలకైతే బొమ్మలు కూడా వాళ్ళే వేసుకున్నారు. కథలన్నీ సింహభాగం చందమామ కథల్లా రాజులూ-రాణులూ-శరభయ్య-నారయ్య – అన్న స్టైలులో సాగుతున్నాయి కానీ, బహుశా పిల్లలకి చందమామలు చదివీ, అమ్మమ్మలు-తాతయ్యలూ చెప్పే కథలు వినీ వినీ – అవే ధోరణిలో ఆలోచనలు పోయి, ఇలాంటి కథలే పుడతాయేమోననిపించింది. నిజజీవితంలో జరిగే విషయాల నుండి కథలు ఎలా రాయొచ్చు? అన్న విషయంపై వీరికి ఎవరన్నా చెబితే, తప్పక వీరు ఆ కథావస్తువులతో కూడా మంచి కథలు రాయగలరు అనిపిస్తోంది, వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే. ఏ.కే.రామానుజన్, పర్తాప్ అగర్వాల్ ల కథల అనువాదాలు కూడా ఉన్నాయి ఈ సంచికల్లో. అలాగే, ప్రతి సంచిక చివర్లోనూ కొన్ని గేయాలూ, కొన్ని చిన్న మెంటల్ ఎక్సర్‍సైజులూ – కొంతవరకూ వైవిధ్యం చూపే ప్రయత్నం చేసినట్లే ఉన్నారు.

పత్రికలో వేసిన బొమ్మలు నాకైతే ఫ్రెష్ గా కనిపించాయి. వాటివల్ల పత్రిక బాగా కలర్ ఫుల్గా వచ్చింది. అక్కడక్కడా ’బాల’ పాత సంచికల నుండి వేసుకున్న జోకులు ఉన్నాయి. కొంత వైవిధ్యం ఉన్నా కూడా, ఇంకా చాలా విషయాలు చేర్చొచ్చు అనిపించింది. అయితే, వారు చేయగలిగింది వారు చేస్తున్నారు…మిగితా కొత్తదనం – పత్రిక చదివి, నచ్చిన వారు అందుకుని, తమ వంతు సాయం చేయాలి అనిపిస్తుంది నాకు. మొత్తానికి, చిన్నప్పుడు చదివిన బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాలమిత్ర, బుజ్జాయి, ఇప్పటికీ తరుచూ తిరగేస్తున్న చందమామ – వీటి లిస్టులోకి ’కొత్తపల్లి’ ని చేర్చేయాలని నిర్ణయించుకున్నాను నేను. వీటిలో కొన్నింటితో పోలిస్తే, కొత్తపల్లే ఆకర్షణీయంగా అనిపించింది కూడానూ. మీరు ఈ తరం పిల్లల తల్లిదండ్రులైతే, వారి తెలుగు ప్రాక్టీసుకు కొత్తపల్లిని చదివించడం, దానికి రాయించడం చేయవచ్చు.

కొత్తపల్లి పత్రిక ఆన్లైన్ లో ఇక్కడ చదవొచ్చు. ఆఫ్లైన్ లో చదవాలనుకుంటే, చందాదారులు ఎలా కావాలో, అక్కడే తెలుసుకోవచ్చు.

అన్నట్లు, ఈ ఏప్రిల్ సంచికతో కొత్తపల్లి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. అలాగే, ఆం.ప్ర. బాలల నాటకోత్సవాలలో భాగంగా, 2008లో హైదరాబాదు రవీంద్రభారతిలో టింబక్తు బడి పిల్లలు వేసిన ’రెండు రాజ్యాలు-రెండు దారులు’ అన్న నాటకం ఏప్రిల్ సంచికతో అనుబంధంగా వచ్చింది. మన విద్యావ్యవస్థ పరిస్థితిని చక్కగా ప్రతిబింబించిందనిపించింది నాకైతే. భవిష్యత్తులో కొత్తపల్లి టీం మరిన్ని కొత్త ఆలోచనలతో పత్రికని మున్ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను. పిల్లల పత్రిక కి పెద్దల తరపున ’ఆల్ ది బెస్ట్’ (నన్ను పెద్దల్లో ఇదొక్కసారికి చేర్చుకుంటున్నా!!)About the Author(s)

సౌమ్య3 Comments


 1. పుస్తకం వారికి ధన్యవాదాలు. నాకు, నా తెలుగుబడి పిల్లలకి మంచి పత్రిక అందజేసారు. వారిని సంప్రదించి ఇక్కడి పిల్లలకి తగు సమాచారం అవీ తీసుకుంటాను.


 2. Thanks for this inspiring post.


 3. పుస్తకం వారికి ధన్యవాదాలు, కొత్తపల్లి వారికి అభినందనలు.
  ఇటువంటి వివరాలు వీరి గురించి చక్కగా రాయడం కోసం ఎదురు చూశాను.
  కొత్తపల్లి వారికి కూడా మంచి పుస్తకం వారికి వలే విజ్ఞప్తి.
  ఆలోచనలు పంచుకోవడానికి, కొత్త ideas brainstorming చెయ్యడానికి, తెలుగు4కిడ్స్ సిద్ధంగా ఉంది.
  మీకు ఇష్టమైతే సంప్రదించగలరు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0