మా పసలపూడి కథలు

ముందుగా చెప్పాల్సిన సంగతి ఏమిటంటే: కొరియర్ పని వల్ల కూడా లాభాలున్నాయ్. ఒకరు నాకీ పుస్తకం ఇచ్చి, నువ్వు హైదరాబాదు వెళ్లినపుడు ఈ పుస్తకం ఇంకొకరికి ఇవ్వాలి అని చెప్పారు. ఈ మధ్యలో దాదాపు మూడువారాల వ్యవధి ఉంది….దానితో… ఏం జరిగిందో ఈసరికి మీకు అర్థమైపోయింది అనుకుంటాను 🙂 (అన్నట్లీ పుస్తకం పై వంశీ,బాపు గార్ల సంతకాలు కూడా ఉన్నాయి. దొంగనైనా కాకపోతిని బుక్కు కొట్టుకుపోవగా…. హీహీ)

మొత్తం డెబ్భై రెండు కథలున్నాయి. కొన్నేళ్ళ క్రితం, ఎవరింట్లోనో స్వాతి పత్రికలో ఒకసారి ఈ కథలు చూసాను. ఒకటీ అరా చదివాను. ‘అరె, డైరెక్టర్ వంశీ రచయితా కూడానా’ అనుకున్నాను. ఆ తరువాత, ఇవి పుస్తకంగా వచ్చాక, ఒకసారి లైబ్రరీలో చూసి తిరగేశాను. కొన్ని కథలు తెగ నచ్చాయి. కొన్ని మామూలుగా అనిపించాయి. అక్కడికి చాప్టర్ క్లోస్ అనుకున్నా కానీ, మూడోసారి దర్శనం లో మాత్రం, వదలకుండా చదివించాయి. ఎలాగంటే, పరీక్షకు చదువుకుంటూ, మధ్య మధ్య బ్రేకులు తీసుకుని ఒక్కో కథా చదివేంతగా. ఈ బిజీ జీవితాల్లో, రోజూ ఖచ్చితంగా కాసేపు చదివించాయి కనుక, నా దృష్టిలో ఇవి మంచి కథలే! పైగా, మాంచి కలర్ఫుల్ కథలాయే…. పుస్తకం అంతా కూడా రంగుల కలలా ఉంది! అన్నట్లు -ఐదు వేల కాపీలు రెండో ముద్రణలో వేసారట! కనుక, అంతమంది చేత చదివించింది కనుక, ఆ పరంగా కూడా మంచి పుస్తకం!

అన్నింటికంటే నాకీ కథల్లో బాగా నచ్చినవి ఐదు:
౧. మంచి తెలుగు భాష. అసలుకే ఇంత చిక్కటి తెలుగు నేను పుట్టాక పుట్టిన పుస్తకాల్లో చదివినది బహు తక్కువ. ఇంత పెద్ద పుస్తకంలో కనబడ్డ ఇంగ్లీషు పదాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.  నాకు మహా ఆనందం కలిగింది…నేను పుట్టిన తరువాత వచ్చిన ఒక పుస్తకంలో ఎంత మంచి తెలుగు ఉందో! అని.
౨. కళ్ళకు కట్టినట్లు ఉండే ఆ వర్ణనలు. కళ్ళ ముందు కదలాడే ఆ పాత్రలు.
(“ఎర్రపరికిణీ  చిలకపచ్చ జాకెట్టు తొడుక్కున్న మాణిక్యం నవ్వుతూంటే ఒలికిన పాలమీద వెన్నెల పడ్డట్టుంది. అలాగలాగ నవ్వుతా ఉంటుంటే సన్నగా, నాజుగ్గా ఉన్నా మాణిక్యం లేత శరీరం గమ్మత్తుగా ఊగిపోతుంది“)
౩. అసలును మించి కట్టిపడేసే బాపూ బొమ్మల కోసరులు (‘ఎర్రనూకరాజు గారి జంక్షన్’ బొమ్మ మాత్రం నాకు కళ్ళు మూసినా తెరిచినా గుర్తొచ్చింది!)
౪. ఎక్కడ రచయిత అభిప్రాయాలు మన మీదకి రుద్దకుండా కథ చెప్పుకుంటూ పోవడం. అలా, ప్రతి దాని మీద తీర్పులు వదలకుండా – మంచీ, చెడూ, గొప్పా, బీదా : తేడా లేకుండా అందరి గురించి ఒకే పద్ధతిలో చెప్పుకుంటూ పోవడం అంత తేలికేం కాదు అని నాకనిపిస్తుంది. ఇక్కడ హీరో పాత్రలపై ఆరాధనా భావమూ కలగదు… విలన్ల పై ద్వేషమూ కలగదు (నాకైతే కలగలేదు…. ప్రతి ఒక్కర్లోనూ మంచీ, చెడూ రెండూ ఉన్నట్లే తోచింది!)

౫. చెప్పీ చెప్పక చెప్పిన చరిత్ర. నాకీ ప్రాంతం తో పరిచయం లేదు. అసలు గోదావరి జిల్లాలని సినిమాల్లో తప్ప చూసిందీ లేదు. అలాంటి నాకు – ఈ కథలు చదువ్తూ ఉంటే, ఆ కథాకాలం నాటి వీథులూ, మనుషులు, మాటలు, అప్పటి సమాజం..వీటన్నింటి గురించి  – తెలియజెప్పిన పుస్తకం ఇది.

నచ్చనిది ఒకటే : మొనాటనీ.
ఒక విధంగా చూస్తే, అన్ని కథలు ఒకలానే ఉన్నట్లు లెక్క. అయితే, కథలన్నీ ఒక ప్రాంతం ఆధారంగా రాసినవి కనుక, అది సహజం అనుకోవచ్చు. మనమే అదే పనిగా చదవకుండా విరామాల్లో చదివితే ఈ మొనాటనీ ఉండదనుకుంటాను.

నాకు బాగా గుర్తుండి పోయిన పాత్రలు:
తెలుకుల రవణ, ‘నవ్వుతూ వెళ్లిపోయిందా మనిషి’ కోటమ్మ, ‘పిచ్చి వీర్రాజు’, ‘గొల్లభామ రేవు’ లో గొల్లభామ, ‘మలబారు కాఫీ హోటల్’ లో శివకామి, ‘ఆరని పొయ్యి’ లో వెమ్పర్తమ్మ గారు, అమాయకపు ‘తూరుపోళ్ళు’, ‘ఎర్రనూకరాజు గారి జంక్షన్’ లోని ఎర్రనూకరాజు, ‘మునగచెట్టు’ లోని భార్యాభార్తా, ‘బసివేశ్వరుడి గుడిమీద బూతు బొమ్మలు’ లో రంగాచారి…ఇలా చిన్న సైజు జాబితా తయారౌతోంది.

నాలా మీరు కూడా ఇప్పటికింకా ఈ పుస్తకం చదవకపోతే – నాలా కాకుండా, కొని చదవండి. అందరికీ కొరియర్ సర్వీసుల్లో మంచి పుస్తకాలు దొరకవు 🙂

మా పసలపూడి కథలు
(‘స్వాతి’ సపరివార పత్రిక ధారావాహిక)
వంశీ.
బొమ్మలు: బాపు

రెండవ ముద్రణ – డిసెంబర్ 2008
సాదా ప్రతి: 300
మేలు ప్రతి: 350
ప్రచురణ: కుట్టిమాస్ ప్రెస్, హైదరాబాదు (ఏమాటకామాటే, పేరు మాత్రం భలే ఉంది)

ఆన్లైన్ కొనుగోలు లంకె ఇక్కడ. రూపాయల్లో కొనుగొలుకి ఈవినింగ్ అవర్ వారి లంకె ఇక్కడ.

You Might Also Like

12 Comments

  1. varaprasaad.k

    ఓర్ని జిమ్మడా ఒక్కళ్ళు నాయం చెప్పెడివారే,అసలు వీడు సితార నుండి ఇప్పటి దాకా గుండెలు పిండేస్తునే వున్నాడు.

  2. shaik. mahammad shafi

    ee pustaka ye websitlo vundi

  3. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] కథలు మంత్రనగరి – పి.సత్యవతి కథలు మా పసలపూడి కథలు – వంశీ మదనపల్లె రచయితల సంఘం కథలు ‘ది […]

  4. పుస్తకం » Blog Archive » అందమైన పుస్తకం ఆకుపచ్చని జ్ఞాపకం

    […] పసలపూడి కథలతో మొదలుబెట్టి వంశీ కథలకు స్వాతి వారపత్రికలో ప్రత్యేకంగా బాపు విలక్షణమైన బొమ్మలు వేస్తున్నారు. ఆ కథలు పడ్డ స్వాతి పత్రికలను దాచుకోకపోతే ఆ బొమ్మలు మళ్ళీ దొరకటం కష్టం. ఈ కథలను ఇలా రంగుల్లో కాకుండా నలుపుతెలుపుల్లో ముద్రిస్తే ఆ బొమ్మల అందం పూర్తిగా తెలీదు. ఆ బొమ్మలు దాచుకోవాలంటే ఇలాంటి పుస్తకాలొస్తేనే సాధ్యమౌతుంది. ఈ బొమ్మలు స్వాతిలోకన్నా ఈ పుస్తకంలో – పేపర్, ప్రింటింగ్ నాణ్యతలవల్ల కాబోలు – ఇంకా అందంగా కనిపిస్తాయి. ఈ పుస్తకం వంశీ భావుకత్వానికి, రాజీబడనితనానికి ప్రతీకగా నిలుస్తుంది. […]

  5. Sameera Kumar

    asalu vamee peru lone maaya antha vundi.

    For the first time when i have seen Kanakamahalakshmi Recording Dance troop, being a hyderabadi, i could not completely follow the language and the pace at which the dialogues are rendered. But later on I have seen the movie umpteen number of times … aa patralalo mamekam aipoyenthaga. bhale cinima.

    Maa Pasalapudi Kathalu from the same scenario, is also an excellent rendition and great tribute to the people living by the side of Godavari.

    Naku anipistu vuntundi nenu Vamsee laaga enduku puttaledani.. anthagaa abhimanistaanu vamseeni.

    Vamsee waiting for your MAA serial…jingle chaala bagundi

    Sameer

  6. Phani

    Was excited to know that MAA TV is coming out with a serial with the stories. Coming soon watch out

  7. పుస్తకం » Blog Archive » గాలికొండపురం రైల్వేగేట్

    […] పెద్దగా పరిచయంలేదు. మొదట తెలిసింది పసలపూడి కథలు గురించి అవి చదివిన వెంటనే అమితంగా […]

  8. jaggampeta

    pustham varki subhakankshlu

  9. కొత్తపాళీ

    ఈ పుస్తకాన్ని గురించి నా ఆలోచనలూ సరిగ్గా ఇవే.
    కవర్ పేజి బొమ్మ మారినట్టుందే.
    వేణుశ్రీకాంత్ .. నిజజీవితాల్లో సోకాల్డ్ అక్రమ సంబంధాలు మనం అనుకునేంత అరుదు కాకపోవచ్చు.

  10. రవి

    ఈ కథలు స్వాతిలో మొదట్లో రెగ్యులర్ గా, ఆ తర్వాత అప్పుడప్పుడూ చదివేను. కొన్ని అద్భుతంగా మెరిసినా, కొన్ని లోపాలు.

    మొనాటనీ.
    ఇంటి పేర్లు రిపీట్ కావడం.
    యాస బావుంది కానీ, యాసే ముఖ్యమైన ఆధారంగా కథలల్లడం ఎల్లవేళలా బావోదు.

    అయితే కొన్ని కథలు మాత్రం చాలా ఉద్వేగభరితంగా రాశాడాయన. వాటికోసం మొత్తం పుస్తకాన్ని చదవచ్చు.

  11. వేణూశ్రీకాంత్

    నాల్గవ పాయింట్ చాలా బాగా చెప్పారు. అలా జడ్జ్ చేయకపోవడం వలననే ఆ కథలు ఎక్కువ మంది చదవగలిగేవిగా తయారయ్యాయి అని నాకనిపిస్తుంది. కానీ ఈ పుస్తకంలో నాకు నచ్చనిది చాలా కథల్లో కనిపించే అక్రమసంభందాలు కాస్త పంటికింద రాయిలా తగులుతూ ఈ రచయితకి మరో పాయింటే దొరకలేదా అనిపించి విసుగు పుట్టిస్తుంటాయి.

  12. శ్రీనివాస్ పప్పు

    ఆ పొత్తకం గానీ ఇక్కడెట్టేసి మిరటేటో ఎల్లారనుకుని ఆ పొత్తకం ఎత్తుకెల్లిపోదామనుకున్నా ప్చ్ ఏటి సేత్తాం కలికాలం జనాలకి తెలివితేటలు బాగా పెరిగిపొయ్యాయ్.

Leave a Reply