గాలికొండపురం రైల్వేగేట్

రాసినవారు: వేణూ శ్రీకాంత్
***************

సాహితీ లోకంతో పరిమితమైన పరిచయమున్న నాకు వంశీ ఒక దర్శకుడుగా తప్ప కథకుడుగా పెద్దగా పరిచయంలేదు. మొదట తెలిసింది పసలపూడి కథలు గురించి అవి చదివిన వెంటనే అమితంగా నచ్చేసి కాస్త రీసెర్చ్ చేసిన మాట వాస్తవమే ఐనా అతని ఇతర పుస్తకాలు చదివే అవకాశం ఇప్పటివరకూరాలేదు. మొన్న పుస్తకోత్సవంలో వెండితెర నవలలు ఇంకా వంశీవి ఏమైనా పుస్తకాలు ఉంటే చూపించండి అనగానే ఓ అరడజను పుస్తకాలు నా ముందుంచాడు. వాటిలో అన్నిటికన్నా ముందు నా దృష్టిని ఆకర్షించింది “గాలికొండపురం రైల్వేగేటు” ఆహా ఏం పేరు, పేరు లోనే వర్షం పడిన తర్వాత వచ్చే ఓ రకమైన మట్టి వాసన తాలూకు కమ్మదనం కనిపించడం లేదు. ఇలాంటి పేర్లు పెట్టడంలో వంశీ సిద్దహస్తుడు కదా అనుకుంటూ పుస్తకం అట్ట వెనుకనున్న సినాప్సిస్ పై దృష్టి సారించాను.

సినాప్సిస్ లో ఓ పోలీసాఫీసర్ భార్య చేసిన హత్య గురించిన ఇతివృత్తం అనగానే అన్వేషణ సినిమా గుర్తు చేసుకుని వంశీ థ్రిల్లర్ కథలను ఎలా నడిపిస్తాడో కదా అని ఏవేవో ఊహించుకుంటూ కొనేశాను. నవల ఆసాంతం అందమైన అఱకు ప్రాంతపు అడవి కొండలు లోయలు టన్నెల్స్ తాలూకు వర్ణనలతో స్వచ్చమైన పల్లె జీవనాన్ని ప్రతిఫలిస్తూ ఆసక్తిగా చివరికంటా చదివిస్తుంది. అదీకాక నా బాల్యం (ఆరు నుండి పన్నెండేళ్ళ మధ్య) అంతా నరసరావుపేట రైల్వే స్టేషన్ దగ్గరలో గడిచింది అప్పట్లో మా ఇంటి ఓనర్ రైల్వే లో డ్రైవర్ గా పని చేసేవారు కనుక బ్రేక్ వ్యాగన్ లు, ఇంజన్లు, టర్న్ టేబుళ్ళు సిగ్నలింగ్ వ్యవస్థ, సిగ్నల్ క్యాబిన్, పట్టాల మధ్య స్లీపర్స్ ఇత్యాది రైల్వే భాష తాలుకు పదాలతో కూడిన వర్ణనలన్నీ నాకప్పటి ఙ్ఞాపకాలను గుర్తుచేసింది. ఇక ఇంజనీరింగ్ చదివేప్పుడు తిరిగిన బొర్రాగుహలు అరకు లోయల అందాలు వంశీమాటలతో మళ్ళీ కళ్ళముందు కదలాడి ఈ నవల చదివినంత సేపూ నన్ను మైమరపించాయి.

కథ విషయానికి వస్తే ఎత్తైన కొండలమధ్య ప్రకృతి ఒడిలో అందమైన పల్లెటూరు గాలికొండపురం. అక్కడ నివసించే రైల్వేఉద్యోగులు గిరిజనుల సమస్యలను తీరుస్తూ తల్లోనాలుకలా మెసలే ఓ తెలివైన టీచరు సుగుణ, ఆమె భర్త విశాఖపట్నంలో పని చేసే ఓ పోలీసాఫీసర్ పేరు మురళీకృష్ణ, గాలికొండాపురం రైల్వేగేట్ స్టేషన్ మాష్టరు మాలి, ఆ ఊరికి వచ్చిన టూరిస్ట్ లకు బలవంతంగా చుట్టుపక్కల ప్రాంతాలను చూపించే ఓ గైడ్ జగన్నాథం, స్టేషన్ ఎదురుగా ఉన్న హోటలు ఓనర్ కం సర్వర్ హరిబొంధూ, ఇవీ నవలలోని ముఖ్య పాత్రలు.

ఓ రోజు కొందరు కాలేజి టూరిస్టులతో కలిసి ఆ స్టేషన్ లో దిగిన కామిని చర్యలు అనుమానాస్పదంగా ఉంటాయి ఆమె ఆపల్లెలో తన స్మగ్లింగ్ ప్లాన్ సక్రమంగా అమలవ్వాలంటే అక్కడివారికి దిశానిర్దేశం చేసే సుగుణని తప్పించాలని తన హత్యకోసం పలువిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి ఓ ప్రయత్నంలో ఎదురు తిరిగిన సుగుణ కామిని ని కొట్టి కుర్చీకి కట్టేస్తుంది. ఆపై ఏంచేయాలో అర్ధంకాక సహాయం కోసం స్టేషన్ మాష్ట్రర్ మాలి ని తీసుకొచ్చేసరికి కామిని చనిపోయి ఉంటుంది. కామినిని తనే చంపాననుకున్న సుగుణ మాలి, జగన్నాథం, హరిబొంధూ సహాయంతో కామిని శవాన్ని లోయలో పడేస్తుంది. కామిని ముఠా స్మగ్లింగ్ కార్యకలాపాల గురించి ఇన్వెస్టిగేషన్ కోసం సుగుణ భర్త మురళీకృష్ణ అదే ఊరికి ట్రాన్స్ఫరై వస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సుగుణ వల్ల ఈ హత్య జరగలేదు అని నిరూపించి ఆపై ఈ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు అన్నది మిగిలిన కథ.

రైల్వేట్రాక్ పై ఒక వ్యక్తిని బంధించి పడేసిన సీన్ తో నవలను ప్రారంభించిన వంశీ నవలంతా ఉత్కంఠతో అందమైన వర్ణనలతో ఆసక్తిగానే నడిపించారు. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కు కీలకమైన పాయింట్ దగ్గర లాజిక్ మిస్ అవడంతో చదివినంత సేపు ఎంతో ఆసక్తిగా సాగిన నవల పూర్తయ్యాక అసహనాన్ని మిగులుస్తుంది. కథ పరంగా కొన్ని లొసుగులు ఉన్నాయి. వంశీకి మాత్రమే ప్రత్యేకమైన అందమైన వర్ణనలు మాత్రం చదివి ఆస్వాదించగలిగిన వారు పుస్తకం చదవచ్చు కానీ కథా కథనాల విషయంలో ఈ నవలకు కొన్ని మైనస్ మార్కులు పడతాయి. పేరు చూసి చాలా గొప్పగా ఊహించుకున్న నవల ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఇంత నిరుత్సాహ పరుస్తుందనుకోలేదు. అందుకే నాలా పేరు చూసి బుట్టలో పడేవాళ్ళ కోసమని ఈ చిన్ని పరిచయం.

గాలికొండపురం రైల్వేగేట్
ఎమెస్కో ప్రచురణ
పేజీలు 179
ధర: 70 రూపాయలు.

**********

వంశీ మీద అభిమానంతో నాలా ఆయన పుస్తకాలు అన్నీ కొనేవారికి మరో సూచన ఏమిటంటే “ఆకుపచ్చని ఙ్ఞాపకం” అనే 32 కథల సంకలనం మరియూ “ఆనాటివానచినుకులు” అనే 23 కథల సంకలనం రెండిటిలోనూ కామన్ గా 17 కథలు ఉన్నాయి కనుక ఓ సారి ఆలోచించి కొనుక్కోండి. నాఓటు మాత్రం ఖరీదు ఎక్కువైనా రంగు రంగుల బాపు బొమ్మలతో ఎక్కువ కథలున్న 360 పేజీల వీక్లీ సైజు బౌండ్ పుస్తకం ఆకుపచ్చని ఙ్ఞాపకానికే.

‘గాలికొండపురం రైల్వేగేట్’ ఆన్లైన్ కొనుగోలుకు: AVKF లంకె ఇక్కడ. Eveninghour.com వారి లంకె ఇక్కడ.

You Might Also Like

14 Comments

  1. varaprasaad.k

    పబ్లిషింగ్ పొరపాట్లు వెరీ కామన్,పోనీండి మంచి కథలు ఒక మంచి భోజనం రేటుకి దొరికినప్పుడు అంతగా ఆలోచించక్కర్లేదు.

  2. వేణూశ్రీకాంత్

    @లలిత:

    లలిత గారు, నిజమేనండీ చదువుతున్నంత సేపు అందమైన వర్ణనలతో ఆహ్లాదంగా అనిపించినా కథా కథనాల్లో లొసుగులవలన నవల ముగించాక తీవ్రంగా నిరుత్సాహ పడతాము. నేను కాలేజ్ రోజులలో అరకు ఆ ప్రాంతాలన్ని తిరిగాను. ఆ రైల్వేగేట్ లేదని నవల మొదట్లోనే చెప్తాడండి వంశీ, కేవలం ఆ స్టేషన్ కి అలా పేరువచ్చింది అంతేఅంటాడు. పసలపూడికథలు కొత్త ఎడిషన్ నేను చూడలేదండి.

  3. లలిత

    వేణూ గారు,
    ఈ నవల నాకు నచ్చలేదండి . సినిమా కోసం రాసినట్టు అనిపించింది . చాలా సందేహాలు తీర్చకుండానే వదిలేసాడు . నవల చదువుతున్నంతసేపూ అన్వేషణ సినిమా గుర్తొచ్చేది .
    ( ఈ నవల చదివాకా అరకు వెళ్ళాం . గైడ్ గాలికొండాపురం వ్యూ పాయింట్ కి తీసుకెళ్ళాడు. చాలా బావుందనుకోండి. గాలికొండాపురం రైల్వే గేట్ ఎక్కడా అంటే అదేమీ లేదని చెప్పాడు . )
    పసలపూడి కధలు కొత్త ఎడిషన్ చాలా బావుంది. బాపు బొమ్మలతో
    ఆకుపచ్చని జ్ఞాపకం కూడా కొందామనుకుంటున్నాను . బాపూనీ , వంశీనీ ఇద్దరినీ ఒకే ఫ్రేం లో చూసుకోవచ్చు (దాచుకోవచ్చు )

  4. వేణూశ్రీకాంత్

    చౌదరి జంపాల గారు నేను విషయసూచిక మాత్రం పరికించి ఒక అంచనాకి వచ్చాను. రెండు పుస్తకాలు ఇంకా చదవలేదు. సమగ్రమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆకుపచ్చని ఙ్ఞాపకం టపాలో ఈ వివరణ కూడా కలిపితే బాగుంటుందేమో కదా.

  5. చౌదరి జంపాల

    @వేణూశ్రీకాంత్: ఆనాటి వాన చినుకులు నుండి “ఆకుపచ్చని ఙ్ఞాపకం” లోకి ఎక్కని కథలు ఇవి. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం, ఒకరోజు, ఒక శిథిలమైన నగరం, కాకినాడలోరైలుబండెక్కికోటిపల్లి వెళ్ళాం, ఉప్పుటేరుమీద ఒక ఊరు, రాజమండ్రిలో కైలాసం.

    వేణూ శ్రీకాంత్ గారూ:

    నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం కథ ‘అలా కాకుండా ఉంటే ఎంత బాగుండేది’ అన్న పేరుతో కొత్త పుస్తకంలో ఉంది. ఐతే కొత్త కథలో నల్లమిల్లి పెదభామిరెడ్డిగారు లేరు.

    ఒక రోజు కథ సంగతి ఇంకొద్దిగా విచిత్రం. చూడబోతే ఆ కథ ముందు ఇండియా టుడే లోనూ, ఆ తర్వాత ఆనాటి వాన చినుకులు మొదటి ఎడిషన్‌లోనూ ఆకుపచ్చని జ్ఞాపకం అన్న పేరుతో ప్రచురింపబడింది. ఈ కథ ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ వాల్యూంలో లేదు. కొత్త పుస్తకంలో ఉన్న ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ పేరుతో ఉన్న కథకీ పాత కథకి విషయంలో స్వారూప్యత ఉంది కానీ ఇది వేరే కథ.

    ఇంకో విషయం: ఆనాటి వానచినుకులు రెండో ఎడిషన్ వెనక అట్ట మీద సూచికలో ‘ఆకుపచ్చని జ్ఞాపకం’ పేరు ఉంటుంది. లోపల ఇండెక్స్‌లో ఆ స్థానంలో ఒక రోజు ఉంటుంది.

    ఒక అనుబంధం ఒక ప్రారంభం అని వంశీ పరంగా ఉత్తమ పురుషలో చెప్పిన కథ ఆనాటి వానచినుకులులో ఉంది. ఆ కథ కొత్త పుస్తకంలో ఒక అనుభవం ఒక ప్రారంభం అన్న పేరుతో ప్రథమ పురుషలో, వంశీ కాకుండా వేరే డైరెక్టర్ ముఖ్యపాత్రగా సాగుతుంది.

    ఒక శిథిలమైన నగరం, కాకినాడలో రైలుబండెక్కి కోటిపల్లి వెళ్ళాం, ఉప్పుటేరు మీద ఒక ఊరు, రాజమండ్రిలో కైలాసం: ఈ నాలుగూ కథలు కాదు; ట్రావెలాగ్స్.

    పాత వాల్యూములలో లేనివి 13 కథలు కొత్త పుస్తకంలో ఉన్నాయి.

  6. సుజాత

    vENUSREEKANTH,

    Yes, I’m talking about the second edition! All the stories you mentioned are there in the second edition!

  7. వేణూశ్రీకాంత్

    చౌదరి జంపాల గారు అవునండి. నా దగ్గర ఉన్నది 2008 లో వచ్చిన ఎడిషన్. దాని ప్రథమ ముద్రణ 2003 లో అనుంది. సుజాత గారు చెప్పినది ఈ రెండవ ఎడిషన్ గురించే అయి ఉండచ్చు.

  8. చౌదరి జంపాల

    @చౌదరి జంపాల: ఆనాటి వానచినుకులు 2008లో వచ్చిన రెండో ఎడిషన్ ఇప్పుడే కనబడింది.

  9. చౌదరి జంపాల

    నా దగ్గర ఆనాటి వానచినుకులు 2002 ఎడిషన్ ఉంది. ఈ పుస్తకం ఆ తర్వాత ఇంకో ఎడిషన్ వచ్చిందా?

  10. వేణూశ్రీకాంత్

    సుజాత గారు,
    నేను పైన లిస్ట్ చేసిన కథలు “అనాటివానచినుకులు” లో ఉన్నాయి కానీ “ఆకుపచ్చని ఙ్ఞాపకంలో” లేవు. ఈ ఆరుకథలు మినహాయించి “అనాటివానచినుకులు” లోని తక్కిన 17 కథలూ “ఆకుపచ్చని ఙ్ఞాపకంలో” కూడా వేశారు.

  11. సుజాత

    వేణూ శ్రీకాంత్, ఆనాటి వాన చినుకులు రెండో ఎడిషన్ లో మీరు చెప్పిన కథలన్నీ ఉన్నాయని గుర్తుందే !

  12. bonagiri

    సుజాత గారు,
    350 రూపాయల రేటు చూసి ఆకుపచ్చని జ్ఞాపకం నేను కూడా కొనలేదు.
    ఆనాటి వాన చినుకులు, పసలపూడి కథలు ఇదివరకు కొన్నాను.

  13. వేణూశ్రీకాంత్

    “ఆకుపచ్చని ఙ్ఞాపకం” ముందుమాటలో వంశీ ఇదే విషయం చెప్పారండి, ఎందుకు వేశానంటే మరి బాపు గారు ఈ మధ్యే ఆ కథలకు కూడా రంగు రంగుల బొమ్మలేశారు, ఆ బొమ్మలను ఈ రంగుల పుస్తకంలో చేర్చాలనీ.. అని చెప్పారు. “సీతారామ లాంచీ సర్వీస్” ఇందులోకూడా ఉంది.

    ఆనాటి వాన చినుకులు నుండి “ఆకుపచ్చని ఙ్ఞాపకం” లోకి ఎక్కని కథలు ఇవి. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం, ఒకరోజు, ఒక శిథిలమైన నగరం, కాకినాడలోరైలుబండెక్కికోటిపల్లి వెళ్ళాం, ఉప్పుటేరుమీద ఒక ఊరు, రాజమండ్రిలో కైలాసం.

    మరో విషయం పసలపూడి కథలు కూడా రెండు ఎడిషన్స్ ఉన్నాయి గమనించారా ఒకటి 140 రూపాయల బ్లాక్ & వైట్ చిన్నపుస్తకం ఇంకోటి 300 రూపాయిల రంగు రంగుల వీక్లీ సైజ్ పుస్తకం. ఇవి రెండూ దొరుకుతున్నాయి కానీ “ఆకుపచ్చని ఙ్ఞాపకం” కి ఆ సౌలభ్యంలేదు.

  14. సుజాత

    కథలు ఇలా కామన్ గా రెండు మూడు సంకలనాల్లో వేయకుండ్దా ఒక సారి వంశీకి ప్రైవేటు చెప్పేయాలి! ఆనాటి వాన చినుకులు మొదటగా వేసింది నా దగ్గరుంది. అయితే రెండో సారి వేసిన దాంట్లో సీతారామా పురం లాంచీ సర్వీసు కలిపారు. దానికోసం ఈ సెకండ్ ఎడిషన్ కొని మొదటగా కొన్నది ఒక ఫ్రెండ్ కి ఇచ్చాను.మొన్న ఆకుపచ్చని జ్ఞాపకం చూస్తే మళ్ళీ అందులోనూ ఇవే కథలు! కొన్ని మాత్రం కొత్తవి. ఆ కొత్తవి మాత్రమే కొనాలంటే ఎలా?

    ఎన్ని పుస్తకాలని కొని పెట్టుకుంటాం, కొద్ది తేడాలతో!వంశీ ఈ విషయం ఎందుకు ఆలోచించడో!

    అందుకే అది కొనలేదు. ఎవరైనా ఆకుపచ్చని జ్ఞపకం కొని ఉంటే…నాకిస్తే కొత్త కథలు చదివి ఇచ్చేస్తా!

Leave a Reply