జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ!

పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద పేజీలు.. చూడ్డానికి చిట్టిగా, ప్రేమ కథ అంటూ విషయం ఘాటుగా ఉండడంతో “ఓ గంటలో అవ్వగొట్టేయచ్చు” అంటూ మొదలెట్టిన పుస్తకం ఇది. చదవటం పూర్తవ్వగానే “అబ్బే.. ఇంతేనా?” అనిపించింది. సమయం గడిచే కొద్దీ, పుస్తకం నాలో ఇంకుతున్న కొద్దీ “అబ్బో.. చాలానే ఉంది” అనిపించింది.

ఇది ఒక ప్రేమ కథ! అంటే ఒక అమ్మాయి – ఒక అబ్బాయి ఉన్నారన్న మాటే. ప్రేమన్నాక ఏవో ఆవాంతరాలో, భయంకరమైన బాక్‍డ్రాపో ఉండాలి కదా..అది రెండో ప్రపంచ యుద్ధ సమయం సమీపంలో జరిగుతుంది! ఇక కథ అన్నాక ఎవరో ఒకరు చెప్పాలి..అందుగ్గాను మన హీరోయిన్ మరిది ఉంటాడు.

అప్పటి వ్యవస్థను, ఆచారాలనూ ధిక్కరించి తన మనసుపడ్డ మగాడితో ధైర్యంగా నడిచిపోయే ఒక అమ్మడి కథ ఇది! కొంతమంది అమ్మాయిలుంటారు.. వాళ్ళకేం కావాలో, అది ఎందుకు కావాలో కూడా తెల్సు! తెలీటంతో పాటు దాన్ని సాధించుకునే ధైర్యం, తెగింపు కూడా ఉంటాయి. తమపై తాము పూర్తిగా అవగాహనతో ఉంటారు కాబట్టి ప్రపంచం వారి గురించి ఏమనుకుంటుందో అన్న చింత ఉండదు. ఆత్మవిశ్వాసం, నిర్భీతి అనే రెక్కలతో స్వేచ్ఛా విహంగాల్లా విహరించే వీరిని చూసి లోకం కుళ్ళుకోవచ్చు, ఆడిపోసుకోవచ్చూ, శాపనార్థాలూ పెట్టవచ్చు, అన్నీ తాత్కాలికంగానే! ఆ ఆత్మవిశ్వాసంలో ఇమిడిన అందానికి మాత్రం కాస్త ఆలస్యంగానైనా ప్రపంచం ఎప్పుడూ జోహార్లే పలుకుతుంది. జమీల్యా అచ్చు ఇలాంటి అమ్మాయే! ఈమె శారీరిక సౌందర్యవతి అని కథలో అనేక మార్లు చెప్తారు. కానీ ఈ పాత్ర నిజంగా మనతో నిలిచిపోయేది మాత్రం ఒక సంపూర్ణ స్త్రీ మూర్తిగా. ఇక ఇంతటి అమ్మాయి మనసు పారేసుకునే వాడు, నిజంగానే మరో గొప్ప వ్యక్తిత్వం అయ్యుండాలి. ఆ హీరోనే దనియార్.. ఒక యుద్ధవీరుడు. కోపంతో మొదలయ్యి, పంతాలూ వేళాకోలాల్లో ఒకరిపై ఒకరికి అభిమానం కలిగి, అది కాస్తా ప్రేమై ఇద్దరనీ నిలువనీయక అప్పటి సామాజిక పరిస్థుతులను కాళ్ళదన్ని మరీ సహజీవనం కొనసాగిస్తారు. పుస్తకంలో ఒక చోట ఉటకించబడట్టు దనియర్ ఆత్మిక బలం అటువంటిది.

ఇందులో విశేషంగా చెప్పుకోవల్సిన మరో పాత్ర, ఈ కథను తన జ్ఞాపకాల పొరల్లోనుండి జాగ్రత్తగా మన కళ్ళ ముందు నిలిపే పాత్ర: జమీల్య మరిది. కొత్త కోడలికి అత్తారింట మరిదికి మించిన స్నేహితుడుండంటారు. జమీల్యా విషయంలో కూడా ఇది నిజం. అన్నలంతా యుద్ధానికెళ్ళిపోయాక చిన్నతనంలోనే పెద్దరికం తెచ్చిపెట్టుకునే ప్రయత్నంలో ఎప్పుడూ వదిన చుట్టూనే తిరిగే ఈ కుర్రాడు, తన వదిన ప్రేమకథకి ప్రత్యక్ష సాక్షి. మొన్న కవిత్వంపై టాగోర్ రాసిన ఒక వాక్యం:
Like a tear or a smile a poem is but a picture of what is taking place within.” జమీల్య ప్రేమకావ్యం ఆమె మరిదిలో నిద్రాణమై ఉన్న చిత్రలేఖనం తట్టి లేపుతుంది. ప్రేమ కూడా కవిత్వమే ఏమో. నాకీ కథలో నచ్చినది అదే.. జమీల్య-దనియర్ ప్రణయం ఒక ఎత్తు అయితే అది ఒక మనిషిని కదిపి, కుదిపిన తీరు నన్ను కదిలించింది. పెంపరికం, social conditioning, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ ఎంత ప్రభావం చూపుతున్నా మనలోని “మనిషి” ప్రేమారాధకడే అన్న నమ్మకం కలిగించింది.

Beauty of the book?! ఒడ్డున నుంచున్న వాళ్ళు వచ్చి పోయే అలల తుంపర్లతో ఆడుకోవచ్చు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇందులో భాషగానీ, భావం గానీ. ఇది తెలుగులోకి అనువదించబడ్డ పుస్తకం. ఆలోచనల్లో మునిగే సాహసముంటే, ఓ సముద్రమంతా చుట్టి రావచ్చు. ఈ కథ జమీల్య మరిది గీసిన ఒక చిత్రపఠం వర్ణనతో మొదలవుతుంది. చదవడం పూర్తయ్యాక ఎందుకో ఒకసారి పుస్తకం వంక చూస్తే వచ్చిన చిలిపి ఊహ.. యష్ రాజ్ పోస్టర్ బాయ్ లా ఈ పుస్తకం “come.. fall in love” అంటూ నన్నూరిస్తున్నట్టు 😉

పుస్తకం వివరాలు:

పేరు: జమీల్య (Jamilya)
రచయిత: చింగీజ్ ఐత్‍మాతొవ్ (Chingiz Aytmatov)
అనువాదం: పుష్పల లక్ష్మణ రావు (Uppala Lakshmana Rao)
వెల: రూ. 40/-
ప్రచురణ: హైదరబాద్ బుక్ ట్రస్ట్

You Might Also Like

12 Comments

  1. sridhar

    my fav book …..enni vandala saarlu chadivaano….1998 nundi

  2. పుస్తకం » Blog Archive » జమీల్య

    […] ఇదే రచన పై పుస్తకం.నెట్ లో మరో వ్యాసం ఇక్కడ! […]

  3. Hyderabad Book Trust

    జమీల్యా పుస్తకం లో వుప్పల (ఉప్పల) లక్ష్మణ రావు గారి పేరులో పొరపాటు దొర్లినందుకు చింతిస్తున్నాము. మలి ముద్రణలో ఈ పొరపాటును సవరించడం జరుగుతుంది.
    మీ సమీక్ష చాలా బాగుంది.
    దీనిని మా బ్లాగులో పొందుపరిచేందుకు అనుమతించ గలరు.
    – హైదరాబాద్ బుక్ ట్రస్ట్

  4. రవికుమార్

    మీ పరిచయం చాలా బాగుంది. జమీల్యా రచయిత ఈ శతాబ్దపు గొప్ప రచయితల్లో ఖచ్చితంగా ఒకరు. అయితే ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధ నవలలపై పరిచయాలు రాసేటప్పుడు మరింత వివరంగా రాస్తే సాహితీ ప్రియులకు బాగుంటుంది. అటు విద్యార్థులకూ పనికొస్తుంది.

  5. తాడేపల్లి

    ఈ పుస్తకాన్ని ౨౦ ఏళ్ళ క్రితమే చదివాను. ఇందులోని ఇతివృత్తం మన సాంస్క్సృతిక నేపథ్యంలో ఎక్కువమందికి నచ్చకపోవచ్చు.

  6. నెటిజన్

    @ కొడవళ్ళ హనుమంతరావు గారికి నెనరులు. ఇంకా ఎవరు చెప్పలేదేమిటి అని అనుకుంటున్నప్పుడు మీరు వచ్చారు.

  7. కొడవళ్ళ హనుమంతరావు

    పేరు లక్షణరావు కాదు, లక్ష్మణరావు. ఓల్గా ఆయన గురించి అన్నది – “లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితా, గొప్ప వ్యక్తీ కావటం చాలా అరుదుగా జరిగే విషయం” – అక్షరాలా నిజం. “అతడు – ఆమె” నవలా, “బతుకు పుస్తకం” స్వీయ చరిత్రా చదివి తెలుసుకోవచ్చు. తెలుగువాళ్ళంతా తప్పక తెలుసుకోవాల్సిన రచయిత వుప్పల.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. నెటిజన్

    వారి బ్లాగులో దిద్దుకున్నట్టున్నారు!

  9. నెటిజన్

    అది వ్రచురణకర్తల నిర్లక్షం!
    అసలు ఆ ఉప్పల లక్షణ రావు ఎవరన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించారా?

  10. నెటిజన్

    అది వ్రచురణకర్తల నిర్లక్షం!

  11. Purnima

    :O నేను కొన్న పుస్తకం పై పేరు “పుష్పల లక్ష్మణ రావు” అనే ఉంది?!!

  12. నెటిజన్

    క్షమించాలి. అనువదించింది – “ఉప్పల లక్షణ రావు”, “పుప్పల” కాదు.

Leave a Reply