శ్రీశ్రీ కవితతో నేను
నాకు శ్రీశ్రీ అన్న పేరు హైస్కూల్లో ఉన్నప్పుడు మొదటిసారి తెలిసిందనుకుంటాను. అయితే, పదో తరగతిలో ఉన్నప్పుడు, “నాకు నచ్చిన కవి” అన్న వ్యాసం రాయాల్సి వస్తే, షరామామూలుగా క్లాసు మొత్తానికీ “శ్రీశ్రీ” మీద వ్యాసం డిక్టేట్ చేసారు మా తెలుగు మాస్టారు! (అసలీకాలంలో పదిహేనేళ్ళకి తెలుగు కవిత్వం లో నాకు ఇతను అభిమాన కవి అని చెప్పేంత ప్రవేశం ఏ విద్యార్థి(ని) కి లభిస్తుందో మరి, అనుమానమే) అదీ శ్రీశ్రీ కవిత్వంతో నా మొదటి పరిచయం. అందులో మహాప్రస్థానంలోని కవితల్లోని వాక్యాలెన్నో సైట్ చేసారు. “పదండి ముందుకు, పదండి తోసుకు…”, “పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంపై హేమం పిండగ…” “నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం” “ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం” – ఇలా పంచ్ లైన్లు ఆ వ్యాసం నిండా. పదిహేనేళ్ళ తెలుగు అభిమానం గల విద్యార్థినిపై వీటి ప్రభావం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండిక. నేను ఆ వ్యాసం ఎన్నిసార్లు చదువుకున్నానో లెక్కలేదు. అలా ఆ కొద్ది లైన్లకే అప్పుడు నేను శ్రీశ్రీ అభిమానిని అయ్యాను. ఇంట్లో వాళ్ళని సాధించి సతాయించి ’మహాప్రస్థానం’ కొనిపించుకున్నాను. ఇది 1998 డిసెంబర్. (అంత కరెక్ట్ గా ఎలా చెప్పానా అనుకోకండి, నాకంత జ్ఞాపకశక్తేం లేదు. ఆ పుస్తకంలో తేదీ రాసాను అప్పట్లో. అంతే)
అప్పట్లో కొనిపించుకుని చదివానా, నాకు నిజంగా అర్థమయ్యిందా అంటే చెప్పలేను. అయితే, ఆ పదాల్లో ఉన్న లయ, ఒక్కో కవితలో ఉన్న ఆ వాడీ,వేడీ మాత్రం నన్ను ఆకట్టుకున్నాయని చెప్పగలను. ఆ లయ వల్ల చాలా వాక్యాలు అలా గుర్తుండిపోయాయి. అందుకు ’ఆకలిరాజ్యం’,’రుద్రవీణ’ కూడా చాలావరకు కారణం అయి ఉండొచ్చు. తరువాత మధ్యలో ఒక్కోరోజెప్పుడైనా తిరగేయడం మినహా మహాప్రస్థానం ప్రభావం నుండి బైటపడిపోయాను. మళ్ళీ గత సంవత్సరకాలంలో దాదాపుగా వారంలో నాలుగైదుసార్లైనా నేను అందులోని ఏదో ఒక వాక్యాన్ని తలుచుకుంటూనే ఉన్నాను. ప్రధానంగా ఓ సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు – “అద్వైతం” కవితను కన్యాశుల్కం సినిమా పాట “ఆనందం అర్ణవమైతే” గా విన్నాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలయింది. అద్వైతం కవిత ఎన్నిసార్లో చదివాను అప్పట్నుంచి. అప్పట్నుంచి మళ్ళీ మహాప్రస్థానం పారాయణం మొదలైంది. ఇప్పుడిక angry youth కనుక దీన్ని బాగా appreciate చేయగలుగుతున్నానేమో, అయి ఉండొచ్చు. పైగా ఈ రిసెషన్, నిరుద్యోగం ఈ నేపథ్యంలో ఇవన్నీ మరింత నచ్చుతున్నాయేమో.
“నిద్రకు వెలియై .. నేనొంటరినై… చీకటిలోపలి నా గదిలో….నా గదిలోపలి చీకటిలో…చీకటిలో, నా గదిలో…నా గదిలో, చీకటిలో..” – ఎన్ని అర్థాలతో ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు తలుచుకుంటూ ఉంటానో, దాదాపు ప్రతిరోజూనూ. “పదండి ముందుకు పదండి త్రోసుకు..ప్రభంజనం వలె హోరెత్తండి” చదువుతూ ఉంటేనే ఓ విధమైన ఉద్వేగం నిండుతుంది గుండెలో. “నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను……నేను సైతం….” అంటూ “జయభేరి” మ్రోగిస్తూ ఉంటే ఉత్తేజితులు కానివారుంటారా? “ఒకరాత్రి” కవిత చదువుతూ ఉంటే… “బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునన్ను”… వెంటాడదూ? “ఐ” కవితలో “భూతాన్ని యజ్ఞోపవీతాన్ని ..వైప్లవ్య గీతాన్ని నేను… స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్ర నైవేద్యం” అన్న భాగం నన్ను ఓ రెండు మూడ్రోజులు వెంటాడింది. “కళారవి” – ఆకలిరాజ్యం కమల్ హాసన్ – డెడ్లీ కాంబో 🙂 ఇందులో ఉండే వాడీ,వేడీ,వేగం,రిథం అన్నీ ఇష్టం నాకు.
“మాయంటావా? అంతా మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ! ఏమంటావు?” అంటూ ఎన్నిసార్లు ప్రశ్నించుకోలేదో! ఎన్నింటి గురించి అనుకోలేదో! “ఔను నిజం ఔను నిజం ఔను నిజం, నీవన్నది నీవన్నది నీవన్నది నిజం నిజం” అని మాత్రం అనుకోలేదా ఏమిటీ లెక్కలేనన్ని సార్లు! నిరుద్యోగ పర్వంలో “బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా! వృధా వృధా!” అని ఎన్నిసార్లు అనుకోలేదు? – శ్రీశ్రీ లేకుంటే ఆ భావాలన్నీ లోలోపల దాగిపోయి, వ్యక్తపరుచుకునే మార్గం లేక కుళ్ళి నాశనమయి నన్ను నాశనం చేసేవి కావూ? “ప్రతిజ్ఞ” కవిత మళ్ళీ పూర్తి ఆవేశం రగిలించే కవిత. ఈ రిసెషన్ లో జపం చేసుకోడానికి “నిజంగానే నిఖిలలోకం నిండుహర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా? నిజంగానే, నిజంగానే?” అన్నది తారక మంత్రంలాగా కనబడ్డం లేదూ? “జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచక్రాల్! జగన్నాథుని రథచక్రాల్! రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాలొస్తున్నాయొస్తున్నాయి” అంటూ ఉంటే ఆశ పుట్టడం లేదూ?
అయితే, ఇదంతా ఒక ఎత్తు. శ్రీశ్రీ జీవితం గురించి తెలుసుకున్నాక ఈ పుస్తకంలోని కవితలు తిరగేస్తూ ఉంటే కలిగిన అనుభూతి మరో ఎత్తు. కొన్ని కవితల్లో ఇదివరలో అనుభవించని ఎమోషన్ ని అనుభవించగలగాను ఆత్మకథ చదివాక. ఎందుకోగానీ, ఇది ఇంత నచ్చినా కూడా నాకు “ఖడ్గసృష్టి”, “సిప్రాలి” పెద్ద ఆసక్తికరంగా అనిపించలేదు. రెండూ కూడా నేను అలా తిరగేయడం మినహా చదవలేదు కానీ, ఆ తిరగేసినప్పుడు కనబడ్డ కవితలు/వాటెవర్ నన్ను ఇక ఆ పుస్తకం చదివే దిశగా ప్రోత్సహించలేకపోయాయి. అక్కడక్కాడా “పసిడిరెక్కలు విసిరి కాలం పారిపోయినజాడలేవీ ?” వంటి వాక్యాలు వెంటాడి వెంటాడి వేధించాయి అనుకోండి, అది వేరే విషయం. శ్రీశ్రీకి నిజంగానే “కవిత్వమొక తీరనిదాహం” కాబోలు అని అనుకున్నాను మహాప్రస్థానం “పారాయణం” చేస్తున్నప్పుడు. తరువాత మళ్ళీ ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడే ఆ భావం కలిగింది. మధ్యలో చూసిన కవితల సంకలనాలు ఎందుకో ఆ భావం కలిగించలేకపోయాయి. అయినప్పటికీ, “స్విన్‍బర్న్ కవికి” లో “కవీ! నీ గళ గళన్మంగళ కళా కాహళ హళా హళిలో… కలిసిపోతిని! కరిగిపోతిని! కానరాకే కదిలిపోతిని” అని శ్రీశ్రీ అన్న వాక్యాలు నాకు శ్రీశ్రీని ఉద్ద్దేశించే అనాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే. ఆయనే అన్నట్లు “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం”.
వికీసోర్సులో శ్రీశ్రీ రచనల్ని (మహాప్రస్థానం, ఖడ్గసృష్టి) ఇక్కడ చూడవచ్చు.
jyothi
naa hrudayanni kadilinchina mana sree sree gariki nenu saitham
sirassu vanchi pranamillutunnanu.
పద్మకళ
నేటి యువత ఉదోగం ఉపాధి, లక్ష్యం అంటూ ప్రతిక్షణం పరుగులు తీస్తున్నా , సుఖానికి అలవాటుపడి జులాయిగా తిరిగే వాళ్లు , విలువైన సమయాన్ని సినిమా హాళ్ళ ముందు అభిమాన నటుల దర్శనభాగ్యం కోసం వృథా చేసుకునే వాళ్ళకి లోటులేదు.
అటువంటి వారికి శ్రీ శ్రీ “ఎముకలు కుళ్ళిన , వయస్సు మళ్ళిన సోమరులారా ! చావండి” అన్న కవిత వినిపించాలంటాను. అలాగే ఆహా కవితలో లోకరీతిని చెప్పిన విధానం అద్భుతం.
“నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే … నిబిడాశ్చర్యంతో వీరు… నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యం గా వీరె…….”.
ఇంకా “పోనీ పోనీ … అంటూ… రానీ రానీ కష్టాల్ నష్టాల్ శాపాల్ తాపాల్….రానీ రానీ వస్తే రానీ .. రాట్లూ పాట్లూ…. ” ఈ కవిత ఎంత కష్టాన్ని అయినా భరించే ధైర్యాన్ని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఒకటా రెండా? శ్రీ శ్రీ మహాప్రస్థానం లోని ప్రతి కవితా ఖండికా ఆణిముత్యమే. ఆధునిక తెలుగుసాహిత్యంలో రక్తాన్ని మరిగించే కవనంతో యువ తేజస్సును కదిలించిన శ్రీ శ్రీ యుగపురుషుడు.
ఒక్క విషయం నాకు చాలా ఆనందాన్నిస్తున్నది. ఇప్పుడే 10 వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్న నా విద్యార్థులకి ఇదే వ్యాసాన్ని వివరించి శ్రీ శ్రీ గురించి తెలుసుకుంటే చాలు కవిత్వ ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది అంటూ … మహాప్రస్థానాన్ని రుచిచూపించగలగటం .. శ్రీశ్రీ శైలి ని గానం చేసి అందించటం జరిగింది. ఆ తర్వాత పిల్లలు ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ కవితా ఖండికలు కంఠస్థం చేయటం జరిగింది.
మీరు వ్యాసాన్ని బట్టి భవిష్యత్తులో నా విద్యార్థులు కూడా ఇలాగే అద్భుతమైన వ్యాసాలు రాస్తారని నమ్మకం కలిగింది.
congratulations.
ఈ మాట నా అభిమాన పంక్తి:
“ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వ మొక తీరని దాహం”
harish
mee blog chusina taravata naku mahaprasthanam chadavalani undi, sri sri fan ni aipoyanu….
thanx for the blog
P.S can u let me know where i can get books on Sri Sri…i wanna buy them
శ్రీశ్రీ త్రీ సీక్వెన్స్ « Rayraj Reviews
[…] ఫిబ్రవరి 18, 2009 మొన్న పుస్తకం.నెట్ లో శ్రీశ్రీ కవితతో నేను అని వచ్చినప్పుడు, కింద ఈ కామెంట్ […]
bala
sir my name is balu naku sri sri books unta pamgalru