“మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” – ఒక అద్భుత పుస్తకం

విష్ణుభొట్ల లక్ష్మన్న

ఒక విశ్వవిద్యాలయమో లేదా అనేక వ్యక్తుల ద్వారా ఏర్పడి ఆర్ధిక వనరులు బాగా ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ మాత్రమే పూనుకొని చెయ్యాల్సిన పరిశోధన, అందుకు సంబంధించిన ఫలితాలను సామాన్యులకు అందుబాటులో రాసి దాన్ని ప్రచురణల ద్వారా గ్రంథస్థం (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి సహకారంతో) చెయ్యవలసిన పనులను – ఒక తెలుగువాడు తనొక్కడే చెయ్యబూనటం సాహసం! అదీ ఏభై ఏళ్ళ క్రితం! భారతీయ భాషల్లో ఎక్కడా చెయ్యని ప్రయత్నం తెలుగులో చేసి ఈ పుస్తకం ద్వారా మనకి అందించింది శ్రీ తిరుమల రామచంద్ర. ఈ పుస్తకాన్ని దాదాపు పాతికేళ్ళ కిత్రం నేను చదివినా ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే కలిగిన ఆనందం మాటల్లో చెప్పటం కష్టం. ఇప్పటి తెలుగు జాతి అంతా శ్రీ రామచంద్రకు ఈ ఒక్క పుస్తకం రచయితగా ఋణపడి ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

ప్రశ్నలు

ప్రపంచంలో ఏది మొదటి పుస్తకం? ప్రపంచ లిపుల పుట్టుకలో పురాతన సంస్కృతులైన ఈజిప్ట్, క్రీటు, మొసపొటేమియా, గ్రీసు, పర్షియా జాతుల లిపుల ప్రభావం ఎంత? అతి ప్రాచీన సంస్కృతుల్లో ఒకటైన మన చరిత్రలో చాలా కాలం వరకు నోటి మాటకున్న విలువ వ్రాతకు ఎందుకు లేక పోయింది? భారత దేశానికి తనదంటూ ఒక మూల లిపి ఉందా? లేదా? మనకి లిపి భిక్ష పెట్టింది విదేశీయులా? మరి బ్రాహ్మీ లిపి, ఖరీష్టి లిపి అని పేర్లు వింటాం కదా అవి ఎక్కడ పుట్టాయి? సింధు నాగరికతలో కనుగొన్న లిపులకు ఇప్పుడు మన దేశంలో వాడకంలో ఉన్న లిపులకు ఏమైనా సంబంధం ఉన్నదా? మరి సంస్కృత, ప్రాకృత భాషల యొక్క వర్ణమాలల మూలాలు ఎక్కడ? ఏది మన లిపి? అది ఎంత పాతది? లిపి రాతలో ఎడమనుంచి కుడి వైపు, కుడి నుంచి ఎడమ వైపు, పై నుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి – ఇవన్నీ ఎలా, ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? అసలు ప్రపంచంలో లిపి ఎంత పాతది? లిపులన్నీ చిత్ర లిపులుగానే మొదలయ్యాయా? బౌద్ధ, జైన మతాలు మన లిపి విస్తరణకు ఎలా తోడ్పడ్డాయి? తెలుగు సాహిత్యంలో ఆది కవి అయిన నన్నయ్య గారి భారతం మూల ప్రతి ఒకటి ఒకవేళ ఇప్పుడు దొరికితే మనం చదవగలమా? తెలుగు, కన్నడ లిపులకి గల అనుబంధాలేమిటి? ఒకప్పుడు ఒకే లిపిగా ఈ రెండు భాషలు ఉన్నాయనుకుంటే ఇవి రెండు విడివిడి లిపులుగా ఎప్పుడు వేరయ్యాయి? తెలుగులో ఇప్పుడు ఉన్న అక్షరమాలకి ఎప్పుడు, ఎందుకు, ఎలా కొత్త అక్షరాలు వచ్చి కొన్ని ఉన్న అక్షరాలు పోవటం జరిగింది? విచిత్రంగా కనిపించే అరసున్న మన అక్షరమాలలో ఎప్పుడు – ఎలా వచ్చింది? అచ్చులో ముద్రించటం వల్ల తెలుగు లిపిలో జరిగిన మార్పులేమిటి?

అన్నీ ప్రశ్నలే!

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి!

ఈ సమాధానాలన్ని సరైనవే కానక్కరలేదు. కానీ, 50 ఏళ్ళ క్రితం ప్రచురించ బడ్డ ఈ పుస్తకంలో చాలా సమాధానాలు సరైనవే! ప్రతి పాఠకునికి ఈ సమాధానాల కన్నా ఈ పుస్తకం చదువుతుంటే కలిగే ఆలోచనలు, ఉదయించే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. భాష మీద మమకారం ఉన్న ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది. అప్పటి తరంలో ప్రతిభామూర్తులైన శ్రీ తాపీ ధర్మారావు, శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ వంటి ఉద్దండులనే మెప్పించిన ఈ పుస్తకాన్ని చదివి మెచ్చని వారు ఉండరేమో!

ఇంత కష్టమైన “పొడి వస్తువు” (dry subject) ను తీసుకొని వాడుక భాషలో అందరికీ అర్ధమయ్యేలాగా వ్రాయటం ఎంత కష్టమో అది ప్రయత్నించిన వారికే తెలుస్తుంది. సంస్కృత, ప్రాకృత భాషలను మథనం చేసి, వైదిక బౌద్ధ వాఙ్మయాన్ని అధ్యయనం చేసిన శ్రీ రామచంద్ర ఈ పుస్తకానికి న్యాయం చేకూర్చారు

ప్రపంచంలో రెండు ముఖ్యమైన లిపుల రహస్యాలను కనిపెట్టిన ఇద్దరు మేధావులు

మానవజాతి మనుగడలో ఎన్నో లిపులు ఉద్బవించాయి! అలాగే ఎన్నో కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన లిపులు కాలగర్భంలో కలిసిపోయాయి. అటువంటి లిపులలో రెండు లిపులను కొంచెం వివరంగా ప్రస్తావించారు శ్రీ రామచంద్ర తన పుస్తకంలో. మొదటిది పురాతన ఈజిప్ట్ సంస్కృతికి మూలమైన హైరోగ్లిఫ్ లిపి, రెండవది భారత దేశ సంస్కృతికి మూలమైన సంస్కృత, ప్రాకృత భాషల వెనుకనున్న బ్రాహ్మీ లిపి. ఆశ్చర్యమేమిటంటే ఈ రెండు లిపుల రహస్యాలను ఛేదించిన వారు పాశ్చాత్యులే! మొదటి వ్యకి ఫ్రెంచ్ దేశస్తుడైన జాన్ ఫ్రాన్స్‌వా ఛాంపోలియన్ (Jean-François Champollion). రెండవ వ్యక్తి బ్రిటీష్ దేశస్తుడైన జేంస్ ప్రిన్సెప్ (James Prinsep).

రెండు భాషలు (ఈజిప్షియన్, గ్రీకు) మూడు లిపులు (హైరోగ్లిఫ్, డెమోటిక్, గ్రీకు) లతో ఉన్న రొసెట్టా ఫలకం (Rossetta Stone) దొరకటం హైరోగ్లిఫ్ లిపి రహస్యాన్ని కనుక్కోటానికి ఉపయోగపడితే, వివిధ ప్రాంతాల్లో దొరికిన అశోకుని శాసనాలు (అలహాబాద్, రథియా, మథియా, ఢిల్లీ, సాంచీ) బ్రాహ్మీ లిపి రహస్యాలను కనుక్కోటానికి సహాయపడ్డాయి. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి! హైరోగ్లిఫ్ లిపి, బ్రాహ్మీ లిపిల రహస్యాలను కనిపెట్టటంలో ఆ ఆ కాలాల్లో రాజ్యమేలిన రాజుల పేర్లు, రాణుల పేర్లు సరిగ్గా గుర్తించటం వల్ల ఈ లిపులలో వాడిన అక్షరాలను గుర్తించగలగటం ఒక ముఖ్యమైన పరిశోధనా అంశం!  ఈ రెండు లిపులని కొన్ని వందల సంవత్సరాలు ఎందరో వ్యక్తులు ఎంతో ప్రయత్నం చేసినా ఎవ్వరూ చదవలేక పోయారు. ఈ ఇద్దరు మేధావులు ఈ లిపుల రహస్యాలను ఛేదించి మానవ జాతికి ఎంతో ఉపకారం చేసారు. ఈ పుస్తకం నిండా ఇటువంటి వివరాలు ఎన్నో! మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు మేధావులు అతి చిన్న వయస్సులో (42, 40 ఏళ్ళు) అకాల మరణం పొందటం.

తెలుగు లిపి ఆవిర్భావం  – శాసనాల చిత్రాలు

తెలుగు లిపిలోని పరిణామక్రమాన్ని వివరించే ఈ రెండు పట్టికలను చూడండి. శాతవాహనుల కాలంలోని అధికార భాష అయిన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో రాయబడ్డ “గాథా సప్తశతి”లో తెలుగు పదాలు మొదటిసారిగా ఉపయోగించారని పరిశోధకుల అభిప్రాయం.

[cincopa 10762708]
ఇక్కడ కొన్ని శాసనాల చిత్రాలను పాఠకుల వీలు కోసం ఇస్తున్నాను. మన తెలుగు లిపి ఎలా పరిణామం చెందింది అన్నది క్రీస్తు పూర్వం దాదాపు ఐదు వందల ఏళ్ళ క్రితం అశోకుని శాసనాల నుంచి మొన్న మొన్నటి బ్రౌన్ కాలం నాటి వరకు ఉన్న లిపులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ శాసనాల చిత్రాలను, అందుకు సంబంధించిన వివరాలను ఈ లింక్ నుండి తీసుకోబడ్డాయి.

చిత్రాల వివరాలు:

Telugulipi1a & 1b : తెలుగు లిపి పరిణామం

1 & 2. Asoka_script-1 : క్రీస్తు పూర్వం దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి అశోకుని కాలంలోని బ్రాహ్మీ లిపి.

Satavahana_script:  క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో చెక్కబడిన ఈ శాసనం మహారాష్ట్ర నాసిక్ గుహలో దొరికిన శాతవాహనుల కాలం నాటి శాసనం.

Ikshvakula_script :  క్రీస్తు శకము మూడవ శతాబ్ది లోని ఇక్ష్వాకుల కాలంనాటి శాసనం.

Salankayana_Script:  క్రీస్తు శకం నాల్గవ శతాబ్దిలోని శాలంకాయన నంది వర్మ శాసనం.

Vishnukundi_script:  క్రీస్తు శకం ఆరవ శతాబ్దిలోని విష్ణుకుండి ఇంద్ర వర్మ శాసనం.

Pallava_script:  క్రీస్తు శకం 640లోని పల్లవ నరసింహ వర్మ శాసనం.

nannaya_script:  క్రీస్తు శకం పదకొండవ శతాబ్దిలోని నన్నయ కాలపు లిపి (రాజరాజ నరేంద్రుని శాసనం).

Tikkana_script:  క్రీస్తు శకం పదమూడవ శతాబ్దిలో కాకతి గణపతి దేవుని శాసనం (తిక్కన కాలపు లిపి).

Srinatha_script:  క్రీస్తు శకం పదునాల్గవ శతాబ్దిలోని పెద కోమటి వేమా రెడ్డి శాసనం (శ్రీనాథుని కాలపు లిపి).

Christian_Script:  క్రీస్తు శకం 1747 సంవత్సరంలో క్రిస్టియన్‌లచే రాయబడిన తెలుగు లిపి.

Brown_script:  క్రీస్తు శకం 1817 సంవత్సరంలో బ్రౌన్ దొర కాలం నాటి తెలుగు లిపి.

బ్రాహ్మీ లిపి అవతారాలు – ఱ చర్చ

ఇప్పటికీ తెలుగులో ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడాలి అన్నది నా లాగే చాలా మందికి తెలియని విషయం అనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే ఱ ళ లపై చర్చ బాగుందనిపించింది. మీ కోసం కొన్ని విషయాలు ఈ పుస్తకం నుంచి.

ఱ ళ లను గురించి ఇది వరకే కొంత తెలుసుకున్నాము. ళ అనేది భట్టిప్రోలు శాసన కాలం నుంచి క్రమంగా అభివృద్ధి అవుతున్న ప్రత్యేకాక్షరమే గాని ల పైన చుక్క పెట్టడం వల్ల నడమంత్రంగా తయారైంది కాదు. అలాగే ఱ (బండీ ర) కూడ చాల పాతది. ఇది మనకు శాలంకాయనుల నుంచే – అంటే ఇప్పటికి 16 వందల ఏళ్ళ నాటి నుంచి – శాసనాలలో కనిపిస్తున్నది. తమిళంలోను అంత ప్రాచీనకాలం నుంచి ఉంది. కన్నడంలోను మన శాసనాలలో కన్నా ముందుగానే ఉంది. మీరు దీనిని – ఱ ను – మొదటి తెలుగు శాసనమైన ఎర్రగుడిపాడు శాసనంలోను, తర్వాతిదైన లక్ష్మీపురం శాసనంలోను చూచారు గదూ! నేడు ర, ఱ ఉచ్చారణ ఒక్కటే అయిపోయింది గాని పూర్వం భిన్నోచ్చారణ ఉండేది. కనుకనే విడివిడిగా అక్షరాలు పుట్టాయి. సంస్కృత శాసనాలలో గ్రామాల పేర్లు వ్రాసేటప్పుడు ఱ వాడేవారు. దీనిని బట్టి “ర” కు “ఱ” కు ఉచ్చారణ వేరుగా ఉండేదని స్పష్టమౌతున్నది కదా!

మన పూర్వులు ఈ రెండింటి ఉచ్చారణ ఎప్పటికప్పుడు వేరని హెచ్చరికతోనే ఉండేవారు. కాని వీటి సౌకర్యం – అంటే ఒకదానికొకటి వ్రాయడం, ప్రమాదవశాత్తుగా గాని అజ్ఞానవశాత్తుగా గాని జరుగుతూనే ఉండేది. లక్ష్మీపురం శాసనం రెండవ పంక్తిని చూడండి. విట్ఱజుల అని ఉంది. ఇది విట్రాజుల అని ఉండాలి. రాజు అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది. గనుక ర యే కాని ఱ కాదు. కాని లేఖకులు, లిపికారులు ర ఱ భేదం కాని, హ్రస్వదీర్ఘ భేదం కాని అంతగా పాటించేవారు కాదు. ఈలాటి వచన శాసనాలలోనే కాక నన్నయ్యకు ముందున్న పద్య శాసనాలలోను ర కు మారు ఱ వ్రాయడం కనిపిస్తుంది. అద్దంకి శాసనంలో  “కొట్టంబు ల్వణ్డ్ఱెణ్డు” లాంటి ప్రయోగాలున్నాయి.

సరికొత్త వివరాలతో ఇటువంటి మరో పుస్తకం

ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ వివరాలు 53 ఏళ్ళకు తప్పకుండా ముందువై ఉండాలి. కారణం. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ 1957లో. ఇన్నేళ్ళలో ఈ పుస్తకంలో చర్చించబడ్డ అనేక విషయాలలో ఎంతో పురోగమనం  సాంకేతికంగా, పరిశోధనా పరంగా తప్పకుండా జరిగి ఉంటుందని తేలికగానే ఊహించవచ్చు. కొత్తగా దొరికిన శిలాశాసనాలు, కొత్త – పాత శిలాశాసనాల లిపులను అర్ధం చేసుకోటంలో సాధించిన విజయాలు దృష్టిలో పెట్టుకొని “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు – సరి కొత్త విషయాలు” అన్న శీర్షికతో మరో పుస్తకం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. శ్రీ రామచంద్ర అప్పట్లో కనుగొన్న విషయాలను తరవాత పరిశోధనలో కొన్ని సవరించబడితే అది తప్పకుండా తెలుగు వాళ్ళు తెలుసుకోవాలి! ఇప్పటి తెలుగు వారిలో ప్రాకృతం, పాలి లిపి వంటి అంశాల పై సాధికారంగా పరిశోధన చేస్తున్న వారు చెయ్యాల్సిన పని ఇది.

పుస్తకం ముద్రణలో….

ఈ పుస్తకం చదువుతుంటే నేను చాలా సార్లు బాధ పడ్డాను. నా బాధలు మీతో మనవి చేసుకోటానికి ఈ సమీక్షే నాకు వేదిక. ఈ పుస్తకంలో ఎన్నో శాసనాల చిత్రాలు, మరెన్నో లిపులు మనకి తేలికగా అర్ధమయ్యేటట్టు యదాతధంగా చూపించే ముద్రణలు, కొన్ని విలువైన లిపులు కాలానుగుణంగా ఎలా రూపాంతరాలు పొందాయో తెలిపే పట్టికలతో ఎంతో సమాచారం ఇవ్వబడింది. అయితే ఈ శాసనాల చిత్ర పటాలు చదవటానికి కష్టమై (కారణం ఈ చిత్రాల నాణ్యత తక్కువ) చదువరులను తేలికగా ఆకర్షించవు. పైగా కొందరు చదువరులు అంత అందంగా కనపడని ఇటువంటి ఛాయా చిత్రాలను చూడాగానే విసుగు పుట్టి పుస్తకాన్ని పక్కన పెట్టే ప్రమాదముంది. పోలిక తెస్తున్నానని పుస్తకం పాఠకులు అనుకోకపోతే ఒక్క విషయం చెప్పాలని ఉంది.

ఈ మధ్యనే ప్రముఖ హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ జీవిత విశేషాలను వివరిస్తూ జయా బచ్చన్ పర్యవేక్షణలో ప్రచురించబడ్డ ఒక అద్బుతమైన పుస్తకం చూచాను. పుస్తకంలోని రాతకు సంబంధించిన విషయాలను పక్కన పెడితే, ఈ పుస్తకంలో ముద్రించిన ఛాయా చిత్రాలు ఎంతో అందంగా ముద్రించబడటమే కాకుండా ఈ పుస్తకానికి ఉపయోగించిన కాగితం నాణ్యత అత్యుత్తమమైనది. ఎంతో మంది సినిమా అభిమానుల్లాగా నాకు కూడా ఇష్టమైన ఈ సినిమా కథానాయకుడికి పట్టిన అదృష్టం నాకూ సంతోషమే! కానీ అటువంటి భాగ్యానికి మన తెలుగు భాష నోచుకోలేదా అని మనస్సు చివుక్కుమంది. ఎంతో విలువైన సమాచారం, పరిశోధన వివరాలు ఉన్న “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” వంటి పుస్తకాల ముద్రణలో మన తెలుగు జాతి ఎప్పుడైతే నిద్ర లేస్తుందో అప్పుడే మనకు మనం గౌరవం ఇచ్చుకున్నట్టు లెక్క!

ఈ పుస్తకం వివరాలు

ప్రథమ ముద్రణ: నవంబరు 1957. పరివర్ధిత ద్వితీయ ముద్రణ: ఏప్రెల్ 1990. పరివర్ధిత తృతీయ ముద్రణ: జూలై 1993. వెల రూపాయలు: 50-00. ప్రచురణ కర్తలు; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.

You Might Also Like

29 Comments

  1. శ్రీ తెలుగు

    పని చెయ్యని లంకెలకి సంబంధించిన వ్యాఖ్యల్ని దయచేసి తొలగించగలరు.

    1. సౌమ్య

      శ్రీతెలుగు గారికి: పుస్తకం.నెట్లో రెండువేలకి పైగా వ్యాసాలు ఉన్నాయి. వీటిలో ఎన్నింటిలో లంకెలు పనిచేస్తున్నాయి? ఎక్కడ లేదూ అని ఎప్పటికప్పుడు చూసి మార్చడం తలకుమించిన పని.

  2. విష్ణుభొట్ల లక్ష్మన్న

    తాడేపల్లి గారు:

    ఈ పుస్తకానికి లింక్ ఇచ్చి మీరు మంచి పని చేసారు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. రమణ

    తాడేపల్లి గారూ.. మంచి సమాచారం. కృతజ్ఞతలు.

  4. తాడేపల్లి

    ఈ పరిశోధనగ్రంథపు పంపక సులభ కవిలె (PDF) ఈ క్రింది లంకెలో
    లభ్యమవుతున్నది.

    http://www.scribd.com/doc/47412060

    1. డా. మూర్తి రేమిళ్ళ

      1.Unfortunately, the book is removed from SCRIBID. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందేమో ఎవరైనా చెప్పండి please .

      2.మరపు రాని మనిషి DLI లో వుంది. link :

      http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0012/658&first=1&last=177&barcode=2020120012653

      3. సాహితీ సుగతుని స్వగతం కూడా DLI లో వుంది. link:
      http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0071/562&first=1&last=316&barcode=2990100071557

    2. దానయ్య

      సంవత్సరాల తరబడి పనిచెయ్యని తప్పుడు లింక్స్ కి సంబంధించిన కమెంట్స్ ని ఇంకా ఇక్కడే ఉంచడం పుస్తకమ్ సైట్ కి ప్రతిష్ఠాకరమేనా? అడ్మిన్స్ దయచేసి ఆలోచించాలి.

    3. సౌమ్య

      దానయ్య గారికి:
      పుస్తకం.నెట్ లో 1౮00 కి పైగా వ్యాసాలున్నాయి. పాత వ్యాసాలని సమయానుకూలంగా రీవిజిట్ చేసి లంకెలు పని చేస్తున్నాయో లేదో చూడ్డం మా చేతిలోని పని కాదు. దానిలోని శ్రమ కూడా తక్కువేమీ కాదు. ఏ పత్రికా పాత సంచికల్లోకి వెళ్ళి ఈ విధంగా పాత వ్యాసాల్లో లంకెలు అప్డేట్ చేస్తోంది అని నేను అనుకోవడం లేదు. కనుక, “ప్రతిష్ట”కి దీనితో లంకె పెడితే దాదాపు అన్ని భాషల్లోని పత్రికలూ (పుస్తకం.నెట్ లాంటివి కాదు. దినపత్రికలూ గట్రా కూడా) అప్రతిష్ట పాలవుతున్నట్లే లెక్క 🙂

  5. విజయవర్ధన్

    విష్ణుభొట్ల లక్ష్మన్న గారు,

    ఇప్పుడే క్రింది link మళ్ళీ చూసాను. బొమ్మలన్నీ వున్నాయి:
    http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html
    మీరు ఇక్కడ పెట్టినవాటి బొమ్మలన్నీ ఏదో software ద్వారా కలిపినట్టున్నారు. ఆ software traffic quota ఐపోయిందని message వస్తోంది.

    “Cincopa user is out of traffic quota for this month. If you are the owner you can Go Pro Now! and get 14-day free trial”

    1. డా. మూర్తి రేమిళ్ళ

      unfortunately , this link is also not working sir.

  6. Rohiniprasad

    నేను రాద్దామనుకున్న పుస్తకం గురించి లక్ష్మన్న చక్కగా రాశారు.
    ఈ పుస్తకం 1955 ప్రాంతాల అచ్చవగానే మా ఇంటికొచ్చేసింది. అవి నేను తెలుగు చదవడం నేర్చుకున్న రోజులు. అప్పటినుంచీ తెలిసీతెలియని వయసులోనే ఈ పుస్తకాన్ని లెక్కలేనన్నిసార్లు చదివాను. ఆ కాపీ ఇప్పటికీ (బైండ్ చేయించాను) నా దగ్గరుంది.
    తెలుగువారిలో నా లెక్కన జ్ఞ్ఞానపీఠ్ బహుమతికి అర్హులైనవారిలో తిరుమల రామచంద్ర ప్రథముడు. ఏ రాజకీయాలూ తెలియని ఆ మహాపండితుడు జీవితమంతా lime lightకు దూరంగానే ఉండి వెళిపోయాడు! పాలీభాష నుంచీ అనేక లిపులూ, భాషలూ తెలిసిన బహుముఖప్రజ్ఞ్ఞాశాలి ఆయన.
    ఆయనను వ్యక్తిగతంగా ఒక్కసారే అతికొద్దిసేపు కలుసుకోగలిగాను. 1997లో జరిగిన తెలుగు యూనివర్సిటీవారి బొంబాయి అఖిలభారత సమావేశానికి ఆయన వచ్చారు. ఆ ఏడాదే ఆయన కాలంచేశారు.
    ఈ పుస్తకం చిన్నప్పటినుంచీ నాకు అభిమానపాత్రంగా ఉండేది. ఇందులో ఆయన ఇలిన్, సెగాల్‌వంటి సోవియట్ రచయితల రచనలనూ, ఇతర వివరాలనూ సరైన పద్ధతిలో వినియోగించుకున్నారు. ఆ తరవాతి భారతీయభాషల వివరాల్లోకి వెళ్ళినప్పుడు తన పాండిత్యం మీదనే ఆధారపడ్డారు.
    ఇలాంటి పుస్తకం మళ్ళీ దొరకదేమోనని దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. తరవాత విశాలంధ్రవారు పునర్ముద్రించారని గమనించాను. ప్రస్తుతపరిస్థితి నాకు తెలియదు.
    రామచంద్రగారి వ్యాసాలను నేను సంపాదకత్వం వహించే కాలనిర్ణయ్ కేలండర్‌లో వీలున్నప్పుడల్లా ప్రచురిస్తూ ఉంటాను. అందుకు పారితోషికం వారమ్మాయి డా. నీరజకు పంపే ఏర్పాటు చేశాను. ఆవిడ ఏపీవీక్లీలో పనిచేస్తారట. వీలున్నప్పుడు వెళ్ళి కలుసుకుంటాను.
    తెలుగువారికి భాషాభిమానం ఉన్నంతగా భాషాపరిజ్ఞానం ఉండదు. ఆ లోటును అద్భుతంగా తీర్చగలిగిన పుస్తకం ఇది. కేవలం భాష గురించిన జెనరల్ నాలెడ్జ్‌తో ముగించకుండా రచయిత గుణింతాలూ, ఒత్తులూ మొదలైన వివరాలలోకి కూడా వెళ్ళారు. లక్ష్మన్న చెప్పినట్టుగా ఈనాటి అత్యాధునిక పరిశీలనల వివరాలు అప్పట్లో ఆయనకు లభించకపోయినప్పటికీ ఆయన కృషి మాత్రం అనన్యసాధ్యం అనిపిస్తుంది. ప్రతి తెలుగువాడు కొని, చదవదగిన పుస్తకం ఇది.

  7. srihari

    @సౌమ్య:
    Ippudu ee pustakam ekkadaina dorukutunda?
    Intro chadivina taruvaata chaala excited gaa feel ayyanu…
    Daya chesi ee book ekkada dorukutundo evaraina cheppagalara?

  8. Guest

    వియయ్‌వర్ధన్ గారు:

    మీరు ఇచ్చిన లింక్ నుంచే నేను కొన్ని శాసన చిత్రాలను ఈ వ్యాసం కోసం తీసుకున్నాను. ఎందుకో అవి ఇక్కడ ఇప్పుడు కనపడట్లేదు!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. విజయవర్ధన్

    తెలుగు లిపి పైన శేషు మాధవ రావు అడ్లూరి మరియు శ్రీనివాస్ పరుచూరి గారు ఒక website తయారు చేసారు:
    http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/index.html

    ఇక్కడ పెట్టిన చిత్రాలు స్పష్టంగా వున్నాయి.

  10. P. Trinadha Rao

    Any Children books are available

  11. జంపాల చౌదరి

    I am a bit surprised that nobody has mentioned yet a recent publication on this subject by the AP Oriental Manuscripts Library: Telugu Script: origin and evolution, 3rd century BC to 16th Century AD. This 162 page book was apparently printed on art paper in a quality manner and is priced at Rs. 350. Edited by Dr. PV Parabrahma Sastri and NS Ramachandramurthy.

    I have not seen the book yet, but the book received a glowing review in the Sunday new books section of Andhra Jyothi (reprinted in the August 2010 issue of Telugu Naadi). for copies, Director, AP Oriental Manuscripts Library and Research Institute, behind OU Police Station, Hyd 500 007

    1. డా. మూర్తి రేమిళ్ళ

      Dr. Jampala garu,

      May be a coincidence, just 3 days back on the occasion of Tirumla Ramachandra gari centenary, I got a hard copy of the book at Hyderabad. Planning to read it during the week end and hoping to post more details next week. But before reading the content, I am feeling why at all such a book should be written in English. Even if it is made so for others, it should have a Telugu version also. some of the Telugu specific words cant be read correctly in English, whatever cosmetics and italics they may do !

      (PS: మీరు ఇంగ్లీష్ లో రాసేరు కదా అని నేను కూడా ఇంగ్లీష్ లో రాసేను కానీ, ఇది ఎంత వరకు సమంజసమో నాకే తెలీదు )

    2. డా. మూర్తి రేమిళ్ళ

      It is a great book with lot of information came out as a result of deep research.

      I started reading that and felt like commenting. But somehow it turned out to be a full fledged review and hence submitted to pustakam.net for review and see if it is eligible to go as a book review.

    3. డా. మూర్తి రేమిళ్ళ

      Dr .Jampala గారు అండ్ other సాహితీ మిత్రులు,

      The review of the book is published and is available now at
      http://pustakam.net/?p=16059

  12. నరేష్ నందం

    అద్భుతమైన పుస్తకానికి అత్యద్భుతమైన పరిచయం.
    మన భాషను, తరాలుగా వస్తున్న మార్పును వివరించారు.

    ఆ పుస్తకం బహుశా ఇప్పుడు ఎక్కడా దొరకదేమో!
    పుస్తకం కాపీలు ఉన్నవారు.. కనీసం జిరాక్స్ తీయించే అవకాశం ఉందేమో చెప్పండి.

    రామచంద్ర గారిపై ఆంద్రప్రభలో వచ్చిన ఓ వ్యాసం. (ఆయన రాసిన ’బృహదారణ్యకం’ లోంచి..)
    http://www.andhraprabhaonline.com/sundayspecial/article-36573

    ధన్యవాదాలు.

    1. రమేశ్

      ఈ పుస్తకము విశాలాంద్ర బుక్ హౌస్ లో దొరుకుతుంది

  13. ప్రణవ్

    లక్ష్మన్న గారు, అద్భుతమైన గ్రంధాన్ని పరిచయం చేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. ఇందులో భాష, లిపి గురించి రాసిన ప్రశ్నలు దాదాపు అన్నీ నాలోనూ అంకురించాయి. కానీ ఎవరినీ అడిగి తెలుసుకునే అవకాశం దొరకలేదు. ఈ బృహత్కార్యాన్ని ఒక్కరే చేశారంటే నిజంగా వారు మహానుభావులు.

  14. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    అద్భుతమైన పరిచయం.
    ఈ పుస్తకం ఇంకా దొరుకుతూంటే అది మన అదృష్టం అనుకోవచ్చు

  15. విష్ణుభొట్ల లక్ష్మన్న

    ఈ వ్యాసాన్ని చూడముచ్చటగా ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఇవ్వబడ్డ శాసనచిత్రాలను కావల్సినవారు జాగ్రత్తగా పరిశీలించవచ్చు. కాని ఈ పుస్తకంలో ఇవే శాసనాలు చదవటానికి అంత సులభతరం కాదు. పురాతన తెలుగు లిపిలో మన పూర్వీకులను చూసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు.

    నా దగ్గర ఈ పుస్తకం ఉన్నది కాని అది PDFలో పెట్టాలంటే ఎలాగో నాకు తెలియదు. పైగా ఇది రచయిత హక్కులను ఉల్లఘించే పనేమో? తెలిసినవారు సలహా చెప్పగలరు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  16. mmd

    ee pustakam yevarivaddananna vunte pdf link pettagalaru?

    thanks

    1. డా. మూర్తి రేమిళ్ళ

      mmd గారు:
      ఈ పుస్తకం విశాలాంధ్ర లో దొరుకుతోంది. Rs. 120 … నిన్ననే Jan 08, 2014 కూడా చూసేను.

  17. సౌమ్య

    చాలా బాగా రాసారండీ!
    చిన్నప్పట్నుంచి ఈ పుస్తకాన్ని ఇంట్లో చూస్తూనే ఉన్నా ఎప్పుడూ చదవలేదు. మీ సమీక్ష చూసాక చదవాలి అనిపిస్తోంది!

  18. మందాకిని

    అద్భుతమైన సమాచారం!
    మీకు ధన్యవాదాలు. పుణ్య జీవులు తమ జీవితాల్ని అంకితం చేసి మనకు నిధుల్ని వదిలి వెళ్ళారు.
    చూడలేని, ఉపయోగించుకొని ముందు తరాలకు ఏమీ మిగిల్చి పోని ఈ తరం(లోని కొంతమంది) గుడ్డివాళ్లం.

  19. రవి

    అమూల్యమైన పుస్తకం ఇది. ఇటువంటి పుస్తకం సాధారణ వ్యావహారికంలో వ్రాయడం సులువు కాదు. రామచంద్ర గారు అవలీలగా ఆ పని చేశారు. ఈ పుస్తకంలో భాగాన్ని తెలుగు విద్యార్థులకు సిలబస్ గా పెట్టాలి.

    దురదృష్టవశాత్తూ ఇప్పుడీ పుస్తకం ముద్రణ నిలిపివేసినట్టు కనబడుతూంది.

Leave a Reply