110 ఏళ్ళ నాటి నాటకం – ప్రతాపరుద్రీయం

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]

ఏ రంగంలోనైనా ఆధునీకత తరుముకొస్తున్న రోజుల్లో చరిత్రలో సుస్థిరస్థానం పొందగలగడమంటే అది మహోత్కృష్టమైన కళాఖండం అయి ఉండాలి. తెలుగు భాష, తెలుగు సాహిత్య, నాటకరంగాలలో అటువంటి స్థానాన్ని పొందగలిగినదే ప్రతాపరుద్రీయనాటకం. కళాప్రపూర్ణ బిరుదు ప్రథమ స్వీకర్త, నెల్లూరు మండలవాసి – వేదం వెంకటరాయశాస్త్రి దీన్ని రచించారు. 1897లో వేదం వారు రచించిన ఈనాటకం అప్పట్లో సంచలనం కలిగించింది. ఆంధ్రరాష్ట్రం నలుచెరుగులా కొన్ని వేలసార్లు ఈనాటకాన్ని ప్రదర్శించారు. ఇప్పటికీ సజీవమైన నాటకంగా చరిత్రపుటల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈకళాఖండం భాసుని యౌగంధరాయణం వెలువడకముందే వేదంవారు పెక్కు కల్పనలతో, కథాగమన వేగంలో సర్వలక్షణ సమన్వితంగా, హిందూ-ముస్లింల ఐక్యతను పోషిస్తూ, ప్రోత్సహిస్తూ కథను సుఖాంతం చేశారు. ఈనాటకంను వెంకటగిరి రాజా (28వరాజు) గోపాలకృష్ణ యాచేంద్రులకు (1879-1916) అంకితం చేశారు. 1897 సంవత్సరంలో గురజాడ అప్పారావు కన్యాశుల్కం పూర్వ రూపంతో అవతరించింది. అదే 1909వ సంవత్సరంలో పెద్దదిగా వెలువడింది. గురజాడవారు డిసెంబర్ ఆరవతేది 1912 సంవత్సరం వ్రాసిన లేఖలో ప్రతాపరుద్రీయ నాటకాన్ని మెచ్చుకున్నారు. ’పెక్కు విషయములలో నేను మిమ్ము మెచ్చుకొనుచున్నాను…ముఖ్యంగా ప్రతాపరుద్రీయంలో మీరు చూపిన భాషాతత్పరతకునూ, దేశభక్తికినీ, చారిత్రక వాతావరణముతోడి కథానిర్మాణమునకు మీరు పాత్రలను, సంస్థలను ఆదర్శప్రాయముగా సృష్టించినారు’ అని లేఖలో రాసారు. విమర్శకులమని చెప్పుకున్నవారిలో దానిని గ్రహింపగలవారు చాలా కొద్దిమంది. తెలుగుసాహిత్యంలో యుగకర్తగా ఆదరణను అందుకున్న గురజాడ వ్యావహారికభాషావాది. భాషా విషయాల్లో విభేధాలున్నా, పెక్కు విషయాల్లో వేదంవారినీ, ప్రత్యేకించి ఈ నాటకాన్ని మెచ్చుకోవడం అప్పట్లో సాహితీ,చరిత్ర,భాషాకారుల్లో చెప్పుకోదగ్గ విషయంగా పేర్కొన్నారు. 1886లోనే ప్రతాపరుద్రీయ నాటకాన్ని కథగా రాసారు. జనవినోదిని పత్రికలో నాటకంగా స్వతంత్ర్య రచన చేశారు. 1853లో జన్మించిన వేదంవారు, 1879లో ఉపాధ్యాయ శిక్షణ అనంతరం శ్రీకాకుళం,చోడవరం,విశాఖ,రాజమహేంద్రవరం మొదలైన చోట్ల తెలుగు పండితులుగా పనిచేశారు. సనాతనధర్మ సంరక్షకుల పక్షం చేరి, కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919) చేపట్టిన వితంతువివాహానికి వ్యతిరేకులై అశాస్త్రీయం అన్న వాదాన్ని కనిపెట్టిన వ్యక్తి వీరు. 1929లో మరణానంతరం కూడా వీరి అముద్రితాలు ముద్రణకు నోచుకున్నాయి. ఇటీవలే వేదంవారి 151వ జన్మదినోత్సవ సందర్భంగా ఈనాటక ప్రదర్శన జరిగింది.

You Might Also Like

3 Comments

  1. Venu Vedam

    Some people consider this work the first ever popular drama written in Telugu. Maybe that’s why the reference to Yougandharaamaayanam in the article. Let me check this with my father and provide the clarification.

    By the way, in case you are interested, the complete Prathaparudriya Natakamu in PDF format is available in the link given below.

    http://www.pudurudravida.com/wp/prn.pdf

    Regards
    Venu Vedam
    Pogathota, Nellore.

  2. వాడపల్లి శేషతల్పశాయి

    భాసుని నాటకముల గుఱించి మనకు తెలిసినది (లభించినది) 1909లోనే. ఆ ఉద్దేశ్యంతో అలా వ్రాసి ఉంటారు.

  3. కామేశ్వర రావు

    “ఈకళాఖండం భాసుని యౌగంధరాయణం వెలువడకముందే” – ఈ ముక్క అర్థం కాలేదు! యౌగంధరాయణానికి తెలుగు అనువాదం అనా?

Leave a Reply