నా అసమగ్ర పుస్తకాల జాబితా -1

రాసిన వారు: సి.బి.రావు
*********************

ఈ చిట్టా లో ఉన్న పుస్తకాలన్నీ నేను చదవలేదు. ఇందులోని కొన్ని పుస్తకాలు చదివినవి, మరికొన్ని చదవాలనుకుంటున్నవి. ఈ చిట్టాలో పరిగణనలోకి తీసుకోనివి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, మహాకావ్యాలు, ప్రబంధాలు. అయితే వీటి గురించిన కొన్ని విమర్శనా గ్రంధాలు ఈ జాబితాలో ఉండగలవు. సంజీవదేవ్ పుస్తకాలు ఎక్కువగా చదివాను. వీరు వ్రాసిన పుస్తకాలన్నీ (దాదాపు) నా చిన్ని గ్రంధాలయంలో ఉన్నాయి. ఈ రచయితపై అభిమానమెక్కువై  స్నేహితుల సహకారంతో ఒక సాలెగూడు నిర్మించాను .

కొడవటిగంటి కుటుంబరావు చదువు, గొపీచంద్ అసమర్ధుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకు మిగిలేది, అడవి బాపిరాజు రచనలు కోణంగి, హిమబిందు, నారాయణరావు, ముద్దుక్రిష్ణ సంకలనం వైతాళీకులు, చలం మైదానం, బిడ్డల శిక్షణ, లత గాలి పడగలు నీటి బుడగలు వగైరా పుస్తకాలు కాలేజీ రోజులలో చదివాను. విశ్వవిద్యాలయ చదువు, ఉద్యోగ పర్వం మధ్య ఖాళీలో మా ఊరి గ్రంధాలయంలో “సంజీవదేవ్ ఉత్తరాలు” పుస్తకం  నా కంటపడింది. పుస్తకం పూర్తిచేస్తూనే సంజీవదేవ్ కు ఉత్తరం వ్రాశాను. తిరుగుటపాలో జవాబందుకున్నాను. సంజీవదేవ్ చనిపోయే వరకూ వారితో నా అనుబంధం కొనసాగింది. సంజీవదేవ్ మిత్రులైన నరిసెట్టి ఇన్నయ్య, చలసాని ప్రసాదరావు, శ్రీ రమణ (వి.రాధాకృష్ణ), దండమూడి మహీధర్  ప్రభృతులు దరిమిలా నాకూ మిత్రులయ్యారు. అలా రచయితలతో ప్రథమ పరిచయం ఏర్పడింది. తరువాత  హైదరాబాదులో ఎందరో రచయితలు, చిత్రకారులు, సంగీతకారులు, నాట్యకారులతో పరిచయం ఏర్పడింది.  చిన్న ఊరైన పొన్నూరు (గుంటూరు జిల్లా) నుంచి హైదరాబాదు రావటంతో చిన్నదైన నా మనో గవాక్షం లోంచి పెద్దదైన సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.

ఈ తరానికి  తెలియని తెలుగు కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావిస్తాను. తెలుగు సాహిత్యాన్ని పురుష రచయితలు ఏలుతున్న సమయంలో  ప్రభంజనంలా వచ్చారు మహిళా రచయిత్రులు.  రంగనాయకమ్మ నవల కృష్ణవేణి  ఆంధ్ర ప్రభ వార పత్రిక లో ధారావాహికంగా (serial) గా వెలువడే రోజుల్లో కుర్రకారు ఎంతో ఆసక్తిగా చదివేవారు. తరవాత కోడూరి (అరికపూడి) కౌసల్య చక్రభ్రమణం, రంగనాయకమ్మ బలిపీఠం, మాదిరెడ్డి సులోచన, యద్దనపూడి సులోచనారాణి సెక్రెటరీ వగైరా రచనలు అప్పటి యువతీ యువకులను కట్టిపడేశాయి.   ఎంతగా అంటే మీరు నమ్మక పోవచ్చు – సెక్రెటరీ నవలలో నాయకుడు రాజశేఖర్ ఆరు అడగుల ఎత్తుండి, ఓడంత కారుండిన ఒక పిల్ల జమీందారు.  ఈ నవల చదివిన యువతులకు వారి వివాహ సందర్భాన వరుని ఎంపిక సమయంలో, ఒక పట్టాన ఏ కుర్రాడు నచ్చేవాడు కాదు. వారి మదిలో సదా రాజశేఖరమే మెదలుతుండేవాడు. ఈ అమ్మాయిలకు పెళ్లిసంబంధం కుదర్చలేక తల్లితండ్రులు సతమతమయ్యే వారు. మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఆ కాలంలో (మహిళా రచయిత్రుల స్వర్ణయుగంలో) ప్రచురణకర్తలు, పత్రికా సంపాదకులు ఈ మహిళా రచయిత్రుల కనుసన్నలలో ఉంటూ వారి రచనల కోసం ఎదురుచూపులు చూసేవారు.  ధారావాహికలు ఏ వారానికి ఆ వారం వ్రాయటం అనే కొత్త దశ మొదలయ్యింది. వీరి షరతుల మేరకు ప్రచురణకర్తలు పుస్తకాలు ప్రచురించేవారు. మహిళా ప్రభంజనం  ధాటికి పురుష రచయితలు తల్లడిల్లారు. పత్రికా సంపాదకులు మహిళల రచనలకు ప్రాధాన్యమివ్వటంతో పలువురు పురుషులు స్త్రీల పేర్ల తో వ్రాసేవారు.

రచయిత్రుల స్వర్ణకాలానికి చివర దశలో, రచయిత్రులు ఎంతో బలంగా కట్టుకున్న కంచుకోటను ఛేదిస్తూ  ప్రవేశించారు ఇద్దరు ప్రచండవీరులు.  వారే యండమూరి వీరేంద్రనాథ్ మరియు మల్లాది
వెంకట కృష్ణమూర్తి.  ఆ తరువాత పురుష రచయితలు విజృంభించారు. రచయితలు మూడు నవలలు   ఆరు కధలు రాస్తూ విలసిల్లారు. స్త్రీ పాఠకులు వీరికి రాచపోషకులు. మెల్లగా టి.వి. లో దూరదర్శన్ కు తోడుగా పలు కేబుల్ ప్రసారాలు రాసాగాయి.  ప్రభుత్వం విరివిగా అనుమతులివ్వటం తో మరిన్ని తెలుగు ఛానెళ్ళు ధారావాహికలు, సినిమాలు ఉధృతంగా ప్రసారం చెయ్య సాగటంతో స్త్రీ పాఠకులు టి.వి. ధారా వాహికలకు మళ్లటం తో పత్రికల, పుస్తకాల  అమ్మకాలు పడిపోయాయి. ఈ రోజు తెలుగు పుస్తకాలు చదివే పాఠకులు చాలా తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలలలో 5 వ తరగతి నుంచే  ఆంగ్లం లో పాఠాలు చెప్తున్నారు.
దీని వల్ల తెలుగు చదివే పాఠకులు రాను రాను మరింత క్షీణిస్తారు. ప్రస్తుతం కవులు ప్రచురించే కవితలకు విపణవీధిలో ఎలాంటి అమ్మేశక్తి లేదు. భవిష్యత్ లో ఇతర తెలుగు రచనలకూ ఇదే పరిస్థితి కలగవచ్చునని తెలుగు భాషాభిమానులు ఆందోళన చెందుతున్నారు.  రచయితలు కధలు, నవలలు స్థానంలో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, వాస్తు, జ్యోతిష్య పుస్తకాలపై తమ దృష్టి మళ్లించారు. తెలుగు రచయితల రచనలు ప్రచురించటానికి ప్రచురణకర్తలు ఆసక్తికరంగా లేరు. సొంతంగా ప్రచురించిన పుస్తకాలకు పుస్తక పంపిణీదారులనుంచి పుస్తక అమ్మకాల విలువ అందుకోవటంలో రచయితలు పలు అవస్థలు పడుతున్నారు. కొండొకచో అసలు ప్రతిఫలమే ముట్టడం లేదు. తెలుగు రచయితలు ఒక విష వలయంలో చిక్కుకున్నారు నేడు. పరిష్కారం కనుచూపుమేరలో లేదు.

ఏ భాషైనా సజీవంగా ఉండాలంటే భావితరం పౌరులైన పిల్లలు ముందుగా ఆ భాష నేర్చుకుని ఉండాలి. తెలుగు భాషను తరువాతి తరానికి అందించే వారధి వారే. నేటి విద్యార్థులు ఉద్యోగార్ధమై ఆంగ్ల భాషకు ప్రాధాన్యమివ్వవలసి వస్తుంది. ఈ నాటి అమెరికా తెలుగు కుటుంబాల పిల్లలలో తెలుగు మాట్లాడ కలిగే శక్తి మాత్రమే ఉన్నది. పెక్కుమంది తెలుగు చదవలేరు.

ఇదే ధోరణి కొనసాగి, తెలుగు భాషకు ప్రభుత్వ మద్ధతులేనట్లయితే కొన్నాళ్లకు ఇది అల్ప సంఖ్యాకులు మాట్లాడే భాషగా మారే ప్రమాదముంది.  తెలుగు దిన పత్రికలు, వార పత్రికల, పుస్తకాల  అమ్మకాలు మరింత పడిపోతాయి. తెలుగు భాష భవిష్యత్తే అయోమయంలో పడగలదు.

తెలుగు రచనలలో కొత్త పోకడలు  గురించి వెబ్ దునియా తో మాట్లాడుతూ మల్లాది వెంకట కృష్ణమూర్తి  చెప్పిన కొన్ని విశేషాలు కింద ఇస్తున్నా.

“ఇంగ్లీషులోని జెఫ్రీ ఆర్చర్‌ రాసిన ‘‘నాట్‌ ఎ పెన్నీ మోర్‌, నాట్‌ ఎ పెన్నీ లెస్‌” అనే నవల ప్రేరణతో నేను ధర్మయుద్ధం నవల రాశాను. అయితే- అది కాపీ కాదు. విలన్స్‌ గతంలో చేసిన నేరాలకి ఎంత శిక్షపడుతుందో సరిగ్గా అంతే శిక్ష పడేలా హీరో కథ నడిపిన క్రైంథ్రిల్లర్‌ ఈ నవల. కానీ ఇదే ఇంగ్లీషు నవలను యండమూరి ‘‘డబ్బు టు ది పవరాఫ్‌ డబ్బు” అనే నవలగా రాశాడు. అది కాపీ. నేను మక్కికి మక్కి చేయను, ప్రేరణ చెందుతాను.

వెన్నెలకంటి వసంతసేన పేరుతో సీరియల్స్‌ వచ్చాయి. అసలా వ్యక్తే లేదు. తోటకూర రఘు ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా ఉన్నప్పుడు జరిగిందిది. ఆమె బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వమని నేను సవాల్‌ చేశాను కూడా. గతంలో మయూరి వీక్లీలో హీరోయిన్‌ జయప్రద పేరుతో నవల రావడం ఈ కోవకు చెందిందే!

పాపులర్‌ రచయితల పేర్లు ఉపయోగించుకుని- ఎవరో రాసే ధోరణితో ఘోస్ట్‌ రచయితలు రావడం ప్రారంభమైంది. ‘ఉదయం’ డైలీలో తొలుత ఈమాదిరి ఘోస్ట్‌ రచయితలతో రాయించే ధోరణి ప్రారంభమైందని అనుకుంటున్నాను.”

సరే, తెలుగు పుస్తకాల విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తాను.  ఇప్పుడు నా పుస్తక ప్రపంచంలో విహరిద్దాము రండి .

పుస్తకాలను పాఠకుల సౌకర్యార్ధం ఈ కింది వర్గాల కింద విభజించటం జరిగింది.
అ) Essays -Criticism  ఆ) History ఇ) Biographies ఈ)  Fiction  -Novel ఉ) Fiction  -Short Stories ఊ)  Detective ఎ)  Music ఏ) Travel ఐ) Poetry ఒ)  Science ఓ) Drama ఔ) Children’s Literature

(ఇంకా ఉంది)

You Might Also Like

3 Comments

  1. పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -4

    […] భాగాలు చదవకపోయుంటే, వ్యాస భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ, భాగం 3 ఇక్కడ […]

  2. పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -3

    […] అసమగ్ర పుస్తకాల జాబితా  భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ […]

  3. పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -2

    […] వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవవచ్చు) Essays […]

Leave a Reply