నా అసమగ్ర పుస్తకాల జాబితా -4

రాసిన వారు: సి.బి.రావు

*******************

మీరు ఈ వ్యాస పూర్వ భాగాలు చదవకపోయుంటే, వ్యాస భాగం 1 ఇక్కడ, భాగం 2 ఇక్కడ, భాగం 3 ఇక్కడ చదవవొచ్చు.

Poetry


116) కృష్ణపక్షము – దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇది 1925లో మొదటిసారిగా ప్రచురించబడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలి పద్య కృతుల సంపుటి. ఈ పుస్తకాన్ని ఇక్కడనుంచి దిగుమతి చేసుకోవచ్చు.

117) వైతాళికులు -ముద్దు కృష్ణ సంకలనం.  నా బాల్యం నుంచీ నాతో ఉన్న ముద్దు కృష్ణ కవితా సంకలనం ‘వైతాళికులు’ . ఇప్పటికి 13 సార్లు ముద్రించారంటే దీనికున్న పాఠకాదరణ మీరు అంచనా వేయవచ్చు.

118) ఫిడేలు రాగాల డజన్  -పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి)
12 రాగాల లోంచి మచ్చుకు ఒక రాగం
“నా ఈ వచనపద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగదంతాను
చిన్నయసూరి వ్యాకరణాన్ని
చాల దండిస్తాను”
ఈ కవితల వైవిధ్యాన్ని పై పద్యం చెప్పుతుంది. ఈ కవి తన పేరును పట్టాభి నుంచి పఠాబి గా మార్చుకుని తన విలక్షణీయత ప్రదర్శించాడు. పైన పఠాబి  పదంలో అక్షరదోషం ఉందంటారా? అయితే పఠాభి అని చదువుకోండి. “మొత్తానికి ఈ పుస్తకం చాలా ఎంటర్ టైనింగ్ పుస్తకం” -సౌమ్య.  “భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం.” – వెల్చేరు నారాయణరావు. ఈ పుస్తకం గురించిన విమర్శ  ఇక్కడ చదవవొచ్చు.
119) అమృతం కురిసిన రాత్రి  – దేవరకొండ బాల గంగాధర తిలక్. “ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వం గా కూడా అనిపించనూ వచ్చు.” -స్వాతికుమారి.  ఈ పుస్తకం ఇక్కడ చదవండి. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చూడవచ్చు.
120) రంగాజమ్మ (1963) -డా. నాగభైరవ కోటేశ్వరరావు. చారిత్రక గేయకథా కావ్యమైన ఈ పుస్తక పరిచయం ఇక్కడ చూడవచ్చు.

121) నూతిలో గొంతుకలు, 122 ఆగమ గీతి  -ఆలూరి బైరాగి. ఆలూరి బైరాగి కవిత్వ తత్వం గురించి ఇక్కడ చదవవొచ్చు.
123) గాలిబు గీతాలు   -దాశరథి కృష్ణమాచార్యులు. గాలిబు గీతాలకు దాశరథి కృష్ణమాచార్యులు   మనోజ్ఞమైన తెలుగు అనుసరణ. బాపు బొమ్మల తో ఉన్న ఈ పుస్తకం ఆస్వాదించవలసినది.
124) కొయ్యగుర్రం  -నగ్నముని. ఈ పుస్తక పరిచయమిక్కడ చదవొచ్చు.

125) చింతల నెమలి  -జయప్రభ
కవుల వర్గీకరణలో జయప్రభ ఏ వర్గానికి చెందుతారు? “చింతల నెమలి” సంకలనంలోని “అంతా అంతే”  కవితపై వేలూరి వేంకటేశ్వర రావు చక్కటి విశ్లేషణ చూడండి.
“జయప్రభని చాలా రోజులక్రితం “తెలుసా” లోను, ఈమధ్యనే “కవితా” లోనూ  foremost ‘feminist’ poet గా పరిచయం చేశాను.(తెలుసాలో అల్లరి పడ్డాను, వాసు గారిలాంటి విమర్శకులతో!) This kind of labeling, feminist poet, dalit poet, progressive poet, regressive poet, etc., is sad! There are poets and non-poets. That’s all!

జయప్రభ కవితల్లో, “స్త్రీవాద” కవితలుగా నిలదొక్కుకున్నవి, “చూపులు,””అందుకేగా వాళ్ళు ఋషులు,” వగైరా! “చింతల నెమలి” సంకలనంలో, జయప్రభ label దాటిన కవిగా కనిపిస్తుంది. అందులో కొన్ని గీతాలు simply superb! అనక తప్పదు. ఈ “అంతా అంతే” పద్యమే, ఏరకంగానూ జయప్రభ vintage కాదని నా ఆరోపణ.

కాలంతో పాటు కాకినాడ మారినట్టే
జ్ఞాపకాలూ మారిపోతాయి
భావనారాయణుడి గుళ్ళో
నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు
వరి కంకుల కోసం పోయి పోయి
వరదలో చిక్కుకున్నట్టు – అంతా అంతే!

వెక్కిరించాడంటే సమాజాన్ని
వెంకటచలానిదా తప్పు!

నేరేడు చెట్టు కింద పళ్ళేరుకుందికి
పందెం వేసుకుని పరుగులు పెట్టిన
కాలేజీ అమ్మాయిలు ఎందరో
నవ్వులన్నీ ఇగిరి పోయి
ఉప్పుమళ్ళై పేలిపోయి
వంట రుచుల్లో కరిగిపోయారు.

వెయ్యగా వెయ్యగా గులకరాళ్ళు
నీళ్ళెప్పటికో పైకొస్తాయని
వెతుకుతూ వెతుకుతూ వెర్రి కాకులమై
ఎండ పడ్డ కలలతో
ఎంత దాహంతో ఉన్నాం! ఏమై పోతున్నాం!

మామిడి తోటలొదిలేసి
ఇసక మేటాలొదిలేసి
ఓ అయ్య చేతిలో పెట్టి
ఇల్లు కట్టుకోమన్నారని కదా
ఇంత దూరాలొచ్చేసాం?

ఏం చేస్తున్నారంటే
పిల్లలతో గిన్నెలతో
మీరు మాత్రం ఏం చెప్తార్లెండి!
మన ఆశలు కాలవగట్టు పొలాలు కావుగా
ఏటి పొడవుతా పచ్చగా ఏదో ఒకటి పండటానికి!
మరెలాగంటే చెప్పలేం.
పొడుపు కథలు విప్పలేం!

ఏమీ తెలియని తనంలో ఎంత సుఖం!
సపోటా చెట్ల మీద చదువుకి సన్నాహాలు
సర్పవరం పూతోటాల్లో పుప్పొడి సరాగాలు
ఏమర్రా!
చండామార్కుల వారింకా ట్యూషన్లే చెబుతున్నారా?
మెక్లారిన్ హైస్కూలు మలుపులూ
గోదావరి కాలవ దాటి
పాత జగన్నాథ పురంలో
తాతల నాటి సందులూ!
వెంట బడిన కుర్రాళ్ళని చూసి వెక్కిరింతలూ
కంటి కొనల కవ్వింతలూ కేరింతలూ

అంతేలే!
పారిపోయిన పదహారో ఏడు మరి తిరిగి రాదు.
తన పని తాను చేసుకుంటూ
బల్ల కట్టు మాదిరి ఆ గట్టూ ఈ గట్టూ తిరుగుతుంది జీవితం!

తొలి యవ్వనం మళ్ళి పోయింది.
కాలంతో పాటు కాకినాడ మారినట్టే
జ్ఞాపకాలూ మారిపోయాయి!

నా ఉద్దేశంలో, ఈ కవిత ప్రారంభంలోనే, — మొదటి రెండు చరణాల్లోనే, బెడిసి కొట్టింది. ఆ చరణాలని సమర్ధించుకోవడం కోసం మిగిలిన పద్యం అల్లడం జరిగినట్టు నేను భావిస్తున్నాను. అందుకనే “రూళ్ళకర్ర  పద్యం” అన్నాను.

నా అనుభవంలో నా జ్ఞాపకాలు ఏవీ మారలేదు. సరికదా, అవి వయస్సుతో మరీ దృఢమై వేధిస్తున్నాయి. మరీ మరీ గుర్తుకొస్తున్నాయి. జయప్రభలాంటి కవులకి అనుభవాల జ్ఞాపకాలు భిన్నంగా ఉంటాయని నేను అనుకోను. అందుకనే, నేను మొదటి రెండు చరణాలూ తిరగ రాసుకున్నాను. ” కాలంతో పాటు కాకినాడ మారినట్టు జ్ఞాపకాలు ససేమిరా మారవు” అని! వెనకటి మనుషులు, స్థలాలు, పరిస్థితులు వగైరా ఎంత మారిపోయినా (in the poem, the change is for worse!), నా (మన) జ్ఞాపకాలు మారవు అని నా మనవి.

నేను కవిని కాను. విమర్శకుడిని అంతకన్నా కాను. అందుకని, నా ఊహలు కాగితం మీద పెట్టినప్పుడు గజిబిజిగా, ఒక్కొక్కసారి pedestrian గా ఉండచ్చు.”
-వేలూరి వేంకటేశ్వర రావు.

126) జైత్రయాత్ర  -శివారెడ్డి. జైత్రయాత్ర  కవితలపై ఆరి సీతారామయ్య సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
127) చితి చింత  -మోహన ప్రసాద్. మోహన ప్రసాద్ “చితి-చింత”లో అనుభూతితో ఆర్ధ్రమైన గొప్ప కవిత్వం రాసాడు.  -ఇస్మాయిల్
128) ఊరి చివర  -అఫ్సర్. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.

129) ఎడతెగని ప్రయాణం  -యాకూబ్. ఈ పుస్తక పరిచయం  ఇక్కడ చదవవొచ్చు.
130) మువ్వల చేతికర్ర  -శిఖామణి. ఈ పుస్తక పరిచయం  ఇక్కడ చదవవొచ్చు.
131) నిశ్శబ్దంలో నీ నవ్వులు, వాన కురిసిన పగలు   -తమ్మినేని యదుకులభూషణ్. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.
132) వేసవి వాన  -విన్నకోట రవిశంకర్. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.

133) పల్లెలో మా పాత ఇల్లు – ఇస్మాయిల్. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చదవవొచ్చు.

134) ప్లెమింగో (విడిది పక్షుల దీర్ఘ కవిత)   -పెరుగు రామకృష్ణ . ఈ పుస్తక పరిచయం ఇక్కడ చూడవచ్చు
135) పడమటి కోయిల పల్లవి  -యండమూరి వీరేంద్రనాథ్. ప్రసిద్ధ పాశ్చాత్య కవుల కవితలకు తెలుగు స్వేచ్ఛానుసరణ.

Science
136) ముంచుకొస్తున్న మహమ్మారి వంకాయ   -చంద్రలత. ఈ పుస్తక పరిచయం ఇక్కడ చదవవొచ్చు
.
137) దక్షిణ భారత పక్షులు   -రిచర్డ్ గ్రిమెట్
Richard Grimmet వ్రాసిన Birds of Indian Sub-continent అనే పుస్తకానికి తెలుగు అనువాదం. ఇది Bombay Natural History Society వారి ప్రచురణ.  పుస్తక పేరులో సూచించిన విధంగా దక్షిణ భారత పక్షుల వివరణ సచిత్రంగా ఉంటుందీ పుస్తకంలో.  పక్షుల గురించి తెలుసుకొనగోరే వారికి చాల ఉపయుక్తకరమైన పుస్తకం.

Drama

138) కన్యాశుల్కం  (1897 )  – గురజాడ . కన్యాశుల్కం నాటకం ప్రచురణ (1897) కు ముందే  1892 లో ప్రదర్శించబడింది. కన్యాశుల్కం వాడుకభాషలో వచ్చిన మొదటి సాంఘిక నాటకం.ఈ నాటక పరిచయానికై ఇక్కడ చూడవచ్చు. కన్యాశుల్కం  నాటకం ఇక్కడ వినవచ్చు.

139) ‘చింతామణి’ (1920), 140) ‘వరవిక్రయం’ (1921 )   -కాళ్ళకూరి నారాయణరావు. కన్యాశుల్కం (1892 ) లో వేశ్య ఐన మధురవాణి నాట్యం, తర్కం, వేదాంతం తెలిసిన సుందరి.   ఆ తరువాత (1920) వచ్చిన చింతామణి కూడా అంతటి కళావంతురాలే.  సాంఘిక దురాచారాలపై ధ్వజమెత్తిన కాళ్ళకూరి నారాయణ రావు చింతామణి నాటకం లో చింతామణి, సుబ్బిశెట్టి  ఇంకా బిల్వమంగళుడు  ప్రధాన పాత్రలు.  అదోని పట్టణంలో, 1984 లో,  రాత్రి 11 గంటలకు మొదలయిన ఈ  నాటక ప్రదర్శన  తెల్లవారి 4 గంటల దాకా   చూశాను. చింతామణి తెలివైన, అందమైన వేశ్య. ఆమె ప్రలోభంలో పడి తన ఆస్తిని పోగొట్టుకుంటాడు సుబ్బిసెట్టి. బిల్వమంగళుడు ఒక విటుడు. బిల్వ ప్రశ్నలకు  చింతామణి జవాబులు విజ్ఞానభరితంగా ఉంటాయి. ఆ ప్రశ్నలు, జవాబులు ఇవిగో, చూడండి. అత్యంత సుందరమైనది- ప్రకృతి. అత్యంత భయంకరమైనది – సంసారం. మనల్ని ఎపుడూ విడువనిది- ఆశ. దేనిచేతను చావనిది- అహంకారం. ఎంత దారిద్ర్యం లో ఉన్నా సుఖపెట్టగలిగేది – తృప్తి. అన్నింటి కంటే బలమైనది- అవసరం. అన్నింటికంటే సుఖమైనది- ఇతరులకు సలహా చెప్పుట. అన్నింటి కంటే కష్ట సాధ్యమైనది- తన తప్పు తాను తెలుసుకొనుట. పాపాలన్నిటిని హరించేది- పచ్చాతాపం.  నాటకం చివరలో చింతామణి విరాగిణి ఐ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ ఎందరో తనను మోహించారంటూ, తన స్తనద్వయము చూపుతూ ఇవి కేవలం తోలు తిత్తులని వీటిపై వ్యామోహమెందులకని ఆవేదనతో అంటుంది.   వేశ్యా వృత్తిని విడనాడి దైవచింతనలో పడుతుంది. వేశ్యా వ్యామోహం కూడదని రచయిత ఆస్తిని పోగొట్టుకున్న దీనుడైన సుబ్బిసెట్టి పాత్ర ద్వార ఒక సందేశం ఇస్తాడు. సాంఘిక ప్రయోజనం, వినోదం కలిసిన నాటకమిది.
కాళ్ళకూరి నారాయణరావు  వరవిక్రయం నాటక ప్రధాన పాత్ర సింగరాజు లింగరాజు కు డబ్బే సర్వం. డబ్బే లోకం. ఈ నాటక పరిచయానికై ఇక్కడ చూడవచ్చు. సాంఘిక దురాచారాలైన వర విక్రయం, వేశ్యాలంపటం, తాగుడు వ్యసనాలపై కాళ్ళకూరి ఎక్కుపెట్టిన అస్త్రాలే వర విక్రయం, చింతామణి, మధుసేవ నాటకాలు. ఈ నాటకాల విపుల పరిచయం ఇక్కడ చూడవచ్చు.వరవిక్రయం  నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.
141) ఖూని   -కవిరాజ త్రిపురనేని రామస్వామి చౌదరి
” రామస్వామి గారు పరశురాముడిలాగా సాహిత్యరంగంలో అవతరించారు. విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు రాశారు. కవిరాజు ‘ ‘ఖూనీ’అని రాశారు.” -జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి .
విశ్వనాధ, మహాభాగతంలోని వేనరాజు పాత్రను చిత్రించిన తీరుకు ఖిన్నుడయిన త్రిపురనేని, వేనరాజు సద్గుణాలను ఉటంకిస్తూ వ్రాసిన నాటకమే ఖూని. సాంఘిక సంస్కరణలలో విప్లవకారుడైన త్రిపురనేని రచనలు, జీవితం పై  ‘ప్రశ్నించడం నేర్పిన త్రిపురనేని’  అంటూ డాక్టర్ చాట్ల శ్రీరాములు వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
142) కంఠాభరణము  -పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఈ రచన  తెలుగులో పరిపూర్ణమైన   ప్రహసనం (హాస్యం ప్రాధాన్యత గల రచన).
ఈ నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.
143) భాగ్యనగరం   -నార్ల చిరంజీవి . గోల్కొండ యువరాజు కులీకుతుబ్, భాగమతిల ప్రణయ గాధ ఇది. హైదరాబాదుకు భాగ్యనగరం  అనే పేరు భాగమతి పేరుమీద వచ్చినదే. ఆల్ ఇండియా రేడియో లో ప్రసారితమైన ఈ నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.
144) సీత జోస్యం   -నార్ల వెంకటేశ్వర రావు  (1981 సాహిత్య అకాడమీ అవార్డు). ఇది కేంద్ర సాహిత్య అకాడమీ  ప్రచురణ. సీత చెప్పిన జోస్యమేమిటి?  ఈ పుస్తక పరిచయానికై ఈ పుస్తక పీఠిక ఇక్కడ చదవవొచ్చు.
145) తప్పెవరిది   -పాకాల వేంకట రాజమన్నారు. ప్రఖ్యాత నటుడు బళ్ళారి రాఘవ కు పేరు తెచ్చిన వాటిలో రాజమన్నారు  తప్పెవరిది ( 1929)  నాటకం ఉంది.  రాజమన్నారు  ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత (ఉత్తమ నాటక రచయిత 1974). పాకాల రాజమన్నారు నాటకాలు, జీవితం గురించి ఇక్కడ చదవవొచ్చు.

146) సిరికా కొలను చిన్నది  -వేటూరి సుందర రామమూర్తి. రాయలనాటి రమణి రమణీయ చిరస్మరణీయ గాధ.  కృష్ణా జిల్లా లోని కృష్ణా నదీ తీరాన ఉన్న శ్రీకాకుళం నేపధ్యంలో ‘సిరికా కొలను చిన్నది’  కధ రూపొందింది.  గంటన్నర ఉండే ఈ సంగీతభరిత నాటకానికి సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు, శ్రీరంగం గోపాలరత్నం గాత్రం సమకూర్చారు. కధ లో రాయల నాటి తెలుగు సంస్కృతి, ప్రజా జీవన సరళి గోచరమవుతాయి. కృష్ణదేవరాయలు శ్రీకాకుళం సందర్శించినట్లు అక్కడి శిలాశాసనాలద్వారా తెలుస్తుంది.  ఇది రేడియో కోసం వ్రాసిన నాటిక. ఈ కధ కల్పితం కావచ్చును. ఈ నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.
147) కుక్క పిల్ల దొరికింది  -రావి కొండల రావు. జనాదరణ పొందిన చక్కటి హాస్య నాటిక.
148) యండమూరి వీరేంద్రనాథ్ నాటికలు  -యండమూరి వీరేంద్రనాథ్. ఇందులో ‘రుద్రవీణ’, ముష్టియుద్ధం, గులకరాళ్లు-గులాబిముళ్లు, సర్వదష్ట (స్త్రీ పాత్ర లేనిది), మనీ+షి=మనీషి, మనుషులొస్తున్నారు జాగ్రత్త (స్త్రీ పాత్ర లేనిది), కుక్క (స్త్రీ పాత్ర లేనిది) – ఈ ఆరు నాటికలు, రంగులనీడ నాటకం ఉన్నాయి.
ఈ పుస్తక సమీక్షకై ఇక్కడ చూడవచ్చు.
149) ఆగండి కొంచం ఆలోచించండి -గణేష్ పాత్రో. గణేష్ పాత్రో తో ముఖా ముఖీ ఇక్కడ చదవవొచ్చు.
150) మరో మహెంజో దారో  (1970)  – ఎన్. ఆర్.నంది. మరో మొహెంజొదారో నాటకం 19 భాష ల్లోకి అనువాదమైంది. సుడిగుండాలు చిత్రంతో కలిపి ఎన్. ఆర్.నంది సుమారు 20 సినిమాలకు పనిచేశారు. 1) హలో డాక్టర్ 2) సినీ జనారణ్యం 3) సీత 4)  అరణి 5) ఛార్లెస్ -ఛార్లెస్ 6)  దిగిరండి–దిగిరండి ధృతరాష్ట్రభువికి 7) ఎలకలొస్తున్నాయ్ జాగ్రత్త 8) గుడ్ బై భూదేవి గుడ్ బై 9) కాంచనగంగ 10) కీలుబొమ్మలు 11) మరో మొహంజదారో 12) నైమిశారణ్యం  13) పుణ్యస్థలి 14) స్మృతులు 15) తిరపతి 16) విశ్వ చైతన్య
17) సిగ్గు -సిగ్గు  (1985) 18) దృష్టి 19) ఎన్.ఆర్.నంది నాటకాలు -నాటికలు వగైరా  లాంటి ఎన్నో అద్భుత రచనలు చేసిన ఎన్.ఆర్.నంది దుర్భర దారిద్ర్యంలో, 80 సంవత్సరాల వయసులో, పాల పాకెట్లు అమ్ముకుంటూ జీవించి, మురుగు కాల్వలో పడి మరణించాడు, అని ఆంధ్ర భూమి లో వచ్చిన వార్త పై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ రచ్చబండ కు సత్యం మందపాటి ఆగస్ట్ 04 2002  న వ్రాసిన ఉత్తరం పై చర్చ జరిగింది. NR Nandi No more  అని మకుటం ఉన్న ఆ ఉత్తరాన్ని ఇక్కడ చదవవొచ్చు. అయితే హైదరాబాద్లో ఆయన స్వగృహంలో నే కన్ను మూసినట్లు తెలుగు వెబ్ పత్రిక thatstelugu లో భిన్నమైన వార్త ఉంది.
151) సమాధి కడుతున్నాం చందాల్విండి  – పరుచూరి వెంకటేశ్వరరావు. పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరూ పరుచూరి సోదరులుగా తెలుగు సినిమారంగంలో ప్రసిద్ధ రచయితలు.  వారి రచనలు గురించి వారు చెప్పిన విశేషాలు ఇక్కడ చదవవొచ్చు.
“ఆంధ్రా వద్దంది – మద్రాసు రమ్మంది : ఎమర్జన్సీలో పరుచూరి వెంకటేశ్వరరావుగారు రాసిన ‘సమాధికడుతున్నాం చందాలివ్వండి’ నాటకం విజయవాడలో ప్రదర్శిస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. హైద్రాబాద్‌లో వేద్దామని టికెట్లు కూడా అమ్మేశాక ఆ నాటకం ప్రదర్శించడానికి వీల్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో రాజబాబుగారి పుట్టినరోజు సందర్భంగా నాటకం వేయడానికి రమ్మని మద్రాసునుండి పిలుపు వచ్చింది (అప్పుడక్కడ డి.ఎం.కె. ప్రభుత్వం ఉంది). కాకరాలగారి ఆధ్వర్యంలో ఆ నాటకాన్ని మద్రాసులో విజయవంతంగా ప్రదర్శించి తిరిగొచ్చాం.”  -దేశిరాజు శ్రీమన్నారాయణ మూర్తి .
152) చిల్లరకొట్టు చిట్టెమ్మ   -దాసం గోపాలకృష్ణ. దాసం గోపాలకృష్ణ చిల్లరకొట్టు చిట్టెమ్మ  నాటకం ఆధారంగా అదే పేరుతో చిత్రం వచ్చింది. ఈ చిత్ర విశేషాలు ఇక్కడ చూడవచ్చు.
153) ఒంటెద్దు బండి   -ఎల్‌.బి. శ్రీరాం. ఎల్‌.బి. శ్రీరాం నాటకం ఒంటెద్దు బండి  ఆధారంగా వచ్చిన అమ్మో ఒకటో తారీకు  (దర్శకత్వం:ఇ.వి.వి.సత్యనారాయణ)   అనే సినిమాలో ఈ రచయిత,నటుడు  కన్నీళ్లు తెప్పించేలా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.  ఎల్‌.బి.  రంగస్థల రచనాభిషేకం అనే పేరుతో, బాపు ముఖ చిత్రంతో వీరి నాటకాలు పుస్తక రూపం ధరించాయి.
154) కళ్లు  -గొల్లపూడి మారుతీరావు. 1975లో సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నాటిక ‘కళ్లు’. ఈ నాటిక పై సమీక్షకై ఇక్కడ చూడవచ్చు.
155) కుందేటికొమ్ము  -దివాకరబాబు. స్వార్ధపరులైన గ్రామ పెద్దల కుమ్ములాట్లపై ఎక్కుపెట్టిన వ్యంగాస్త్రం ఈ నాటకం.

156) రాగవాసిష్ఠం   -బోయి భీమన్న. వివాహమైన నూతన దంపతులకు చూపిస్తారు అరుంధతి నక్షత్రాన్ని. ఈ అరుంధతి చండాల యువతి. వసిష్ఠుడు మహా ముని.వీరి ప్రేమ గాధే ఈ రాగవాసిష్ఠం. ఈ నాటకం పై  డా. దార్ల వెంకటేశ్వర రావు  సమీక్ష ఇక్కడ చూడవచ్చు.
157) రంగూన్ రౌడి  -సోమరాజు రామానుజరావు. ఈ నాటకం ఆధారంగా నాగయ్య నటించిన  తొలి చిత్రం  గృహలక్ష్మి (1938) వచ్చింది. వేశ్యా వ్యామోహం, మధు పాన దుర్వ్యసనాలకు లోనైన కధా నాయకుడి కధ ఇది. నా బాల్యంలో రంగూన్ రౌడి  నాటకాన్ని విరివిగా ప్రదర్శించేవారు.
“రంగూన్ రౌడి బహు ప్రజాదరణ పొందిన నాటకం. దొమ్మేటి (సత్యనారాయణ), కన్నాంబలు ప్రధాన పాత్రల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటా నాటక ప్రదర్శనలిచ్చారు. ఆ నాటకం రికార్డుల సెట్ కూడా వెలువడింది.నిజానికి వేర్వేరు గ్రామఫోను కంపెనీలవాళ్ళు, వారివారి ట్రూపులతో పాడించి విడుదల చేశారు.”  -పరుచూరి శ్రీనివాస్.

Children’s Literature

158) పేనూ- పెసర చేనూ   -నార్ల చిరంజీవి. బాలసాహిత్య రచనలో చెయ్యితిరిగిన రచయిత ఐన నార్ల చిరంజీవి వ్రాసిన ఈ పుస్తకం ఇప్పటికి 7 ముద్రణలు నోచుకుందంటే ఈ పుస్తకం పిల్లలలో ఎంత ప్రాచుర్యం పొందిందో గమనించవచ్చు. పెనేవిటి? పెసర చెనేమిటి? ఇదేగా మీరు అడగబొయే ప్రశ్న.  కృష్ణా నదీ తీరం లోని అడవిలోని పక్షులు, జంతువులు, మర్రి చెట్టు, వెన్నెల మొదలైన వాటి నేపధ్యంలో వ్రాసిన బాలల నవల ఇది.
159) వనసీమలలో  -ఫెలిక్స్ జల్తె. బెంబి అనే జింక పిల్ల జీవిత కధ ఇది. మహీధర నళినీ మోహన్ అనువాదం. ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో ధారావాహికంగా వెలువడింది.
160) ఇందూ -చందూ -కె.సభా
పక్షుల్ని ప్రేమించండి అని జీవకారుణ్యాన్ని ప్రభోదించే సచిత్ర పిల్లల నవల
161) టాం సాయర్ ప్రపంచయాత్ర  -మార్క్ ట్వేన్. అనువాదం: నండూరి రామమోహన రావు
టాం సాయర్, హకల్‌బెరిఫెన్ , నీగ్రో కుర్రాడు జింల ప్రపంచ సాహసయాత్ర ఇది. బెలూన్ లో మిసిసిపీ నుంచి అట్లాంటిక్ సముద్రం మీదుగా సహారా ఎడారిలో సింహాలు, పులుల మధ్య సాహస యాత్ర.  ఇది హాసం ప్రచురణ. యాభై సంవత్సరాల తరువాత పునర్ముద్రణ.  పిల్లలను విశేషంగా ఆకర్షిస్తుందీ సాహాస యాత్ర.

అమెరికాలో తెలుగు పుస్తకాలకు దూరంగా ఉంటూ తయారు చేసిన జాబితా ఇది. భారతదేశం లో ఉంటే తప్పక మరికొన్ని పుస్తకాలు కలిసి ఉండేవి. చింతల నెమలి, తనలో తాను వగైరా పుస్తకాల చిత్రాలు సేకరించలేకపోయాను. మిత్రులు అవి అందించి సహకరించకోరుతాను. ప్రసిద్ధి గాంచిన నాటకాలైన ఈ చరిత్ర ఏ సిరాతో, కొక్కొరోక్కో, గోగ్రహం (తనికెళ్ళ భరణి),వగైరాల వివరాలు నాకు లభ్యం కాలేదు. వీటి  రచయితల, ఇతర విశేషాలు తెలిసిన వారు వాటి విశేషాలను వ్యాఖ్య ద్వారా తెలియచేయవచ్చు. పుస్తకాల జాబితా లో ఉదహరించిన పుస్తకాల, పుస్తక వివరణ కాని ఇతర పరిచయ లింక్ కాని ఇవ్వని పుస్తకాల గురించి మీరు సమాచారమివ్వాలనుకుంటే,  వ్యాఖ్యల ద్వారా  తెలుపవచ్చు. ఈ వ్యాసం లో పరిచయం చేసిన పుస్తకాల గురించిన అదనపు సమాచారం మీ వద్ద వుంటే అది మనందిరితో పంచుకోవచ్చు.

ఇవి నా దృష్టి కొచ్చిన కొన్ని తెలుగు పుస్తకాలు. అసంఖ్యాకమైన తెలుగు పుస్తకాల  ఖజానా లోంచి కొన్ని పుస్తకాలను ఎంపిక చేయటం సాహసమనే చెప్పాలి. ఈ చిట్టా సమగ్రం కాదు. చాలా అణిముత్యాలు ఈ జాబితా లో లేవు. ఉదాహరణకు శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాధ శాస్త్రి , మునిమాణిక్యం నరసింహా రావు, ఇచ్ఛాపురపు జగన్నాధ రావు ల రచనలు,చలసాని ప్రసాదరావు సంపాదకత్వం లో వెలువడిన కళ, వెనిగెళ్ల కోమల అనువాదాలు, ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకధ కోతి కొమ్మచ్చి, శరత్ సాహిత్యం,లియో టాల్ స్టాయ్ అన్నా కెరినా వగైరాలను ఈ వ్యాసంలో స్పృశించలేదు. నేను ఉదహరించని అమూల్య పుస్తకాల గురించి మరెవరైనా “సిబిరావు విస్మరించిన మహత్తర తెలుగు పుస్తకాల జాబితా ”  అని వ్రాయాలని పూనుకుని, ఈ జాబితా సమగ్రం చెయ్యాలనుకుంటే అది ఒక మంచి పరిశోధనా వ్యాసం కాగలదు. ఈ జాబితాలో తప్పక ఉంచతగ్గ పుస్తకం మీ దృష్టిలో ఉంటే తెలుపవచ్చు.పుస్తక ప్రియులకు  ఇది ఒక సంప్రతింపు వ్యాసం. పాఠకులు వారి అభిరుచికి తగ్గట్లుగా పుస్తకాలు ఎంపిక చేసుకోవటానికి ఈ వ్యాసం ఉపయోగపడితే, వ్యాస  ప్రయోజనం నెరవేరినట్లే.

అయిపోయింది.

You Might Also Like

4 Comments

  1. krishna

    దక్షిణ భారత పక్షులు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా.

  2. cbrao

    “మీ పుస్తక పరిచయాలు బాగున్నాయి. కానీ,ఒకే వ్యాసంలో అన్నిటినీ చూపడం అతి సంక్లిష్ట కార్యం.”
    -అవును. అందువల్లే “నా అసమగ్ర పుస్తకాల జాబితా” నాలుగు వ్యాసాలుగా వ్రాయవలసివచ్చింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

  3. kadambari

    సింహావలోకనంగా – మీ పుస్తక పరిచయాలు బాగున్నాయి.
    కానీ,ఒకే వ్యాసంలో అన్నిటినీ చూపడం అతి సంక్లిష్ట కార్యం.
    వర్గ విభజనతో కొంతవరకూ ధ్యేయం నెరవేరుతుంది.
    ఉదాహరణకు హాసం – పబ్లికేషన్సు ప్రచురణల వలన,
    సినీ రంగాన్ని విభిన్న కోణాలలో పరిచయం చేస్తూ
    మంచి పుస్తకములను చాలా వెలువరించారు.
    అందువలన, ప్రతి విభాగానికీ విస్తృత కృషి అనివార్యం ఔతున్నది;
    సంక్రాంతి శుభాకాంక్షలు

Leave a Reply