ఆత్రేయ ఆత్మకథ..!

(ఇవ్వాళ (12th September) ఆత్రేయ వర్థంతని టివిలో అరగంట సేపు ఒక కార్యక్రమం వేశారు; ఆయన సినిమా పాటలు కూర్చి. ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలనిపిస్తుందనుకోండి. కాని, నేను ఆయన ఆత్మకథను చదివానని చెప్తున్నా, ఒక చిరు వికటాట్టహాసంతో!)

ఆత్రేయ – ఆ పేరు వినగానే, తెలుగువాడి గుండె ఒక్కసారి మూలగక తప్పదు. ప్రణయాల్లో, ప్రళయాల్లో ఆత్రేయ మాట పాటగా నోట పలక్కుండా ఉండదు. మనసును నిర్వచించినా, మనసుతో కుప్పిగంతులు వేయించిన, పగిలిన మనసు చేత కవిత్వపు మధువు తాగించినా ఆయనకే చెల్లింది. మనసు గాయాలకు, ఆత్రేయ పాటలే ఐయోడిన్! పుండు మీద మందు రాసుకొని, క్షణకాలపు మంటకు కెవ్వుమని అరిచి, ఆనక ’ఉఫ్..ఉఫ్’ మంటూ ఊదుకుంటూ, ఆయన్ని వింటూనే పెరిగాం. విరిగే దాకా, పెరుగుతూనే ఉంటాం.

ఆత్మకథ – కథలంటే చెవికోసుకునే వారు, ఆత్మకథలంటే చెవులూ, ముక్కు అన్నీ కోసేసుకుంటారు. స్వోత్కర్షల గోల పక్కకు పెడితే, ఆత్మకథలోని కబుర్లు, అనుభవాలూ ఎన్నేసి విశేషాలను తెలుపుతుందని. మిలన్ కుందేరా ఒక చోట వాపోతాడు, అనుభవం నుండి నేర్చుకొని మాత్రం ఒరిగేదేమిటి? ఎప్పటికప్పుడు కొత్తే అయినప్పుడు, పాత అనుభవాన్ని ఏం చేసుకుంటామని? అయ్యుండచ్చు! ప్రతీ క్షణాన్నీ మొట్టమొదటిసారిగా జీవిస్తుండచ్చు, పనికి వస్తాయో లేదో, తర్వాతి సంగతి! ఇప్పుడు వినడానికి ఎంత బావుంటాయని.

ఇక.. ఆత్రేయ ఆత్మకథ అంటే! మనసు ఒప్పొంగిపోదూ, గోదారల్లే! దానికి అడ్డుకట్ట వేయడమంటూ కుదురుతుందా? ఎపి ఆర్కైవ్స్ లైబ్రరీలో పుస్తకం చూసి, బిరువా నుండి తీసి , కొన్ని పేజీలు చదివి, కాగితాలపై అక్షరాలను ప్రేమగా తడిమి, ఆలస్యమయ్యిపోతుందని మళ్ళీ బీరువా పెట్టేసి, హడావుడిగా బయటకు వచ్చేశాక, ఇంటికొచ్చేశాక, మళ్ళీ జీవితపు రొటీన్ లో పడిపోయాక.. అదో ఆదమరుపులో గుర్తొస్తుంది, బిరువాలో ఆ పుస్తకంతో పాటు, నా మనసునూ పెట్టేసానని. ఒకటా, రెండా, ఇన్నేళ్ళ సాన్నిహిత్యం – తిట్టుకున్నా, పోట్లాడుకున్నా – మనసును వెనక్కి తెచ్చుకోవాలి గదూ! మళ్ళీ వెళ్ళాను. ’జిరాక్స్ తీసుకుంటున్నాను రా.. ఇప్పుడు ఇంటికి పోయి, మళ్ళీ వద్దాం’ అని సర్దిపుచ్చి ఇంటికి తీసుకొచ్చినా, మళ్ళీ ఉద్యోగం-ఇల్లు-ఉద్యోగం ఘోషలో మనసు మూగబోయింది. చిన్నబుచ్చుకున్న దాన్ని చూసి, ఓ రెణ్ణెళ్ళ తర్వాత జిరాక్స్ తెచ్చుకుంటే.. ఇక్కడితో ’శుభం’ కార్డు అనుకుంటున్నారు కదూ?!

ఇవి జీవితాలు నాయనా! ఒక అంశం సుఖాంతం అవ్వగానే మరో అంశం మొదలవుతుంది. మనసు పడింది కదా అని, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చదివి వినిపించేస్తే ఇంకేమన్నా ఉందా? అసలే సున్నితమైనది. జీవితంలో ఎటూ తప్పటం లేదు, పుస్తకాల విషయంలోనైనా అది ఎక్కువ నొచ్చుకోకుండా చూసుకోవాలి కదా! ’ఇది ఆత్మకథ! అంటే ఎన్నో కమ్మని కథలూ, మరెన్నో వ్యధలూ ఉంటాయి. నవ్విస్తుంది. అంతకన్నా ఎక్కువ భాదించనూ వచ్చు. అందులోనూ.. ఆత్రేయ ఆత్మకథ! జాగ్రత్త సుమా.. మరీ మనసును కష్టపెట్టుకోక’ అని మనసుకు చెప్పి, చదవటం మొదలెట్టాను.

అనుకున్నట్టే మొదటి దెబ్బ తగిలింది..

“అమ్మ కాలిన చితిమంట లారిపోయె
అమ్మ పోయిన ఎదమంట లారలేదు
పచ్చి కసుగాయ హృది విధి విచ్చుకత్తి
దూసి చేసిన గాయమ్ము మాసిపోదు.

మొదటి రెంటికే మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. ఈ లోపు నా బుర్ర: పచ్చి కసుగాయ? అంటే? – ఓహ్.. పచ్చికాయ. పచ్చికాయని కత్తితో పొడిస్తే ఏమవుతుంది? గట్టి జామకాయను కోసిన అనుభవం గుర్తు తెచ్చుకుంటుంది. పొంతన కుదరదు? పక్కనున్న వాళ్ళని అడుగుతుంది. ’చెట్టుకుండగానే కాయకు గాయమయ్యిందనుకో, అది పక్వానికొచ్చినా ఆ గాయం అలానే ఉంటుందన్న మాట. ఇక్కడ, ఆయన హృదయం లేతగా ఉన్నప్పుడే గాయమయ్యింది, ఆ తర్వాత ఆయన హృదయం పెరుగుతూనే ఉంది, కాని ఆ గాయంతో సహా!” అని సమాధానం వస్తుంది. “ఓహ్.. లొట్టపోయిన గుండెనా?” అని మెదడు వెటకారమాడుతుంది. మనసుకు మాత్రం బాగా సాగదీసిన రబ్బుర్ బాండ్ వదిలేయడం వల్ల చురకలా తగిలి ఏడుస్తుంది.

ఆ వెంటనే, దాని ధ్యాస మార్చడానికన్నట్టు,

పలకా బలపము పోయెను
కలమున్ పెన్సిళ్లు పుస్తకాలుగా వచ్చెన్
గలగల నురకలు వేసెడి
సెలవలె జీవితము చెంగుచెంగున సాగెన్

నవ్వుతుంది; చిన్నపాపాయిలా.. రేపు బడికి రావక్కరలేదన్నట్టు.

“తప్పులు చాల గలవు నే
చెప్పితినని కోపపడుట చెల్లదు నీవే
చప్పున సరిదిద్దుకొనుము
పప్పులు నములుటలు కావు పద్య రచనముల్”

పద్యరచనలే కాదు, పద్యపఠనాలు తేలీక కాదని నా బుర్ర ఓ పక్క ఇష్టపడుతూ శ్రమిస్తుంది. తొలి పద్య రచన తర్వాత ఆత్రేయగారి ఆనందం చూసి, నా మనసూ హర్షిస్తుంది.

అదియే నా తొలి పద్యము
అదియే నా జీవితాన కమృత ఘటిక, నా
కది యొక పుట్టుక, నాలో
నొదిగిన ప్రతిభలకు నాందియో యన వెలసెన్.

పుట్టిన ఊరన్నా, కన్నతల్లన్నా ఎవరికి ఇష్టముండదూ? ఆత్రేయగారికి చాలా ఇష్టం. ఆయన ఆత్మకథా వాటితోనే మొదలవుతుంది. వారి అమ్మగారికే ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఆపైన ఆయన వెళ్ళిన బడులూ, చదివిన చదువులూ, నేర్చిన విద్యలూ, సహపాఠకులూ, గురువులూ – వీళ్ళని గురిచి చెప్పుకొస్తారు. అన్నీ చంధస్సుగల పద్యాలే అయినా, ఆయన సినిమా పాటలకు మల్లే సరళమైన పదాలతోనే ఉంటాయి. ఎంచుమించు మనకు కలిగే అనుభవాల్లానే ఉంటాయి.

ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాక, “తొలిగాయం” అన్న టైటిల్ కనిపిస్తుంది. “తొలిప్రేమ”ని మనసు చదువుకుంటుంది. ఒక ధీర్ఘ నిట్టూర్పు విడుస్తుంది. అది ఊహించినట్టే, అది ఆయన తొలి ప్రణయపు విశేషాలు.

చిలుకమ్మ గోర్వంక చెరగులన్ ముడిచిన
ముద్దు మా ఇద్దరి యొద్దికంట
సంగీత సాహిత్య సంయోగ రససిద్ధి
కల జంట మాదంట కలల పంట
మాలతీ మమకార లోల రసాలాను
నిత్యానురక్తి మా నేస్తమంట
రసభావ శబ్ధార్థ రమణీయ నవయువ
కావ్య మధురిమ మా కలయికంట

’ఓహ్.. నేను పొడిపొడి అక్షరాల్లో కలలు చూస్తే, వీరేమో చంధోబద్ధంగా కన్నారే కలలు” అని మెదడు పళ్ళికిలిస్తుంది. ఇంకెక్కడి మనసూ? అది ఈ పాటికే తీవ్ర దుఃఖంలో మునిగిపోతేనూ! ఆత్రేయగారు వారి మామగారింట చూసిన ఒక అమ్మడి మీద మనసు పారేసుకుంటారు. డ్రీం సీక్వెన్సులు వేసేసుకుంటారు. ఆ ఆమ్మాయీ కుందనపు బొమ్మలా ఉంటుంది. వీరిని ఇష్టపడుతుంది. కాని ఆ అమ్మాయి తల్లి మీద సంఘంలో కొన్ని అనుమానాలు ఉంటాయి – ఆమెకి ఒక కుష్ఠి రోగితో పెళ్ళవుతుంది. పుట్టిన బిడ్డ ఆ రోగికి పుట్టలేదని అందరికీ తెల్సు. అలాంటి నేపధ్యం గల కుటుంబం నుండి కోడలిని అంగీకరించటం ఆత్రేయ నాన్నగారికి నచ్చదు. నచ్చజెప్పటానికి ఈయన చాలానే తంటాలే పడతారు. “నువ్వంటున్నది నిజమే నాయనా..” అని అంగీకరిస్తూనే, “కాని సంఘానికి వ్యతిరేకంగా పోలేను..” అంటూ నోరు కట్టేస్తారు, ఆయన తండ్రి. చేసేది ఏమీ లేక, తాను మనసుపడిన పడతి మరొకరి అర్థాంగిగా మారటం చూస్తూ భరిస్తారు.

అప్పటి వరకూ భర్త ముఖం కూడా చూడకుండా, ఎన్నెన్నో ఆశలతో మొదటి రాత్రి గదిలోకి వెళ్ళాక, అతడికి కుష్ఠు వ్యాధని తెల్సినప్పుడు. ఆమె పరిస్థితిని వివరిస్తూ రచించిన పద్యాలు:

ఝళఝళ ఝర్ఘర ఝణఝణ
ఛళఛళ నటరాడ్వివర్త ఝంఝా విచలత్
ప్రళయాభీల ఘనాఘన
ఫెళఫెళ రావార్భటి భువి ప్రిదిలిన యటులన్

గొల్లుమనుచు నేడ్వ గొంతుక పెకలదు
ఊసురు విడువ గుండె ఓటుపడదు
కన్నదెల్ల నిజమొ కల్లయో యను చిన్న
సందియమ్మె జీవశక్తిగాగ

కలయా? నిజమా? భ్రమయా?
కలతయ? తన్నేడింపించు గారడి పనియా?
తెలియక, తెలివియు తప్పగ
శిలాకృతి వహించి నిల్చె జీవచ్ఛవమై.

తొలిగాయానికి మంగళం పాడేస్తూ, ఈ విధంగా ధైర్యాన్నిస్తారు.. ఏం జరిగినా మన మంచికే అంటూ!

గాయము లెన్నేనియు నీ
కాయమునన్ మాసిపోవు గానీ హృదిలో
గాయమ్మాజన్మాంతము
మాయని వేదనగ మారి మనుగడ మార్చున్.

అంతే.. అంతే! అదేమో ఆరని చితి.. మనమేమో జీవితకాలపు కాటికాపర్లం. ’నీ వల్ల కలిగిన గాయం కూడా దాచుకోదగ్గదే!’ అని నిసిగ్గుగా ఒప్పేసుకోవడం. హమ్మ్.. తొలిగాయం.. ఆజన్మాంత గాయం! హమ్మ్.. ఏదీ? నా మనసేదీ? కొన్ని వేల కోట్ల బాధల్లో కూరుకుపోయింది. అమ్మను గూర్చీ, తొలివలపు గూర్చీ చెప్పాక, ఆత్రేయ ఆత్మకథ అర్థాంతరంగా ముగుస్తుంది. ఆ రెంటికీ మించి ఆయన జీవితాన్ని summarize చేసేవి లేవని ఆయనకు అనిపించిందేమో మరి! ఆయనకు బద్ధకం జాస్తి అని పేరు. “పూర్తి చేయకుండానే పోయాడు” అని సంపాదకత్వం బావురుమంది, మొదటి పేజీలోనే! వెనక్కి తిరిగి చూసుకుంటే, బహుశా ఆయనకు ఈ ఇద్దరూ తప్పించి ఇంకెవ్వరూ కనిపించుండరు! అందుకే “బద్ధకం” ముసుగేసారేమో! ఏమో!

ఆత్మకథ ముగిసాక, ఆయన ఇతర పద్యరచనలు, గేయాలూ, సూక్తులూ, వ్యాఖ్యలూ, ఛలోక్తులూ, నాటకరంగం పై రాసిన ఒక వ్యాసం, అనుబంధంలో ఆయన రాసిన ఒకటి అరా నాటికలూ ఉన్నాయి. ఇందులో అధిక శాతం, ఎక్కడా ప్రచురింపబడనివే! ఆయన డైరీల నుండి సేకరించారని చెప్పారు. చక్కని ప్రయత్నం. “ఆత్మకథ”ంటూ చేసిన ప్రయత్నం బాగున్నా, ఆయన అప్పుడప్పుడూ రాసుకున్న random thoughts నాకు చాలా నచ్చాయి. కొన్ని ఆయన సినిమా పాటల భావాన్నే స్ఫురింపజేస్తాయి. కాని చాలా వరకూ ఆత్రేయలోకి తొంగి చూసే అవకాశాన్నిస్తాయి. అందులో నాకు నచ్చినవి కొన్ని వ్యాసం చివర్న పొందుపరిచాను.

పుస్తకం పూర్తయ్యాక – అసలు పూర్తి చేయటానికే కష్టమయ్యింది – ’ఇంకా కావాలని’ మనసు మారాం చేసింది. ఉన్నదే కదా! దానికి నచ్చిందే కావాలి. ఇంకా కావాలనుకోవటం, “మాస్టారూ… మీరు భలే ఏడుస్తున్నారు. ఏదీ ఇంక్కొంచెం ఏడ్వండి.. అద్గదీ!” అన్నట్టు ఉంటుందని చెప్పినా, కావాలనే కూర్చుంటుంది. “చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు..” అని దాన్ని ఆత్రేయగారి మాటల్లోనే తిట్టుకోవటం తప్ప నేనూ చేసేది ఏమీ లేదు. దీన్నే ఆత్రేయగారు ఒక పద్యంలో చెప్పారు.

ఒకని గుండె పగిలి యొలికెడి రక్తమ్ము
పరులకమృత ప్రాయమగుట వలన
గాయపడిన నాటి గాలీబుఘజలులు
మధురకవితలాయె మనకు నేడు

Poetry is no thing said but the way of saying it.

మరే! దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే.. ఈ కవులున్నారే, వీళ్ళూ మనకు మల్లేనే, నవ్వుతారు, ఏడుస్తారు, జీవిస్తారు. వీళ్ళని తలకెక్కించేసుకొని పూజింజేస్తాం కాని, మనకు మించిన బాధలు పడ్డారేంటి వీళ్ళు? మనకు మించిన జీవితాన్ని చూసేసారేంటి? పుట్టటం అంటూ జరిగిపోయాక, సిరివెన్నల గారన్నట్టు, అందరమూ ఈదేదీ ఆ చంచాడు భవసాగరాలే గా! కవి గాని వాడూ, కవిత్వం చేతగాని వాడూ – పడతాడు, లేస్తాడు, పడుతూ లేస్తాడు, లేస్తూ పడతాడు. వీళ్ళూ అంతేగా! మరి వీళ్ళెందుకట ఆరాధించటం? “ఆహో.. ఓహో!” అనటం? మన కన్నీళ్ళు కూడా తలగడ మీద నీటి చారలైయ్యి ఆరిపోకుండా, చీకటి గదుల్లో, దుప్పటి ముసుగుల్లో, మూసిన రెప్పల్లో, నిట్టూర్పుల్లో దాగిపోకుండా ఉంటే మనమూ కవులమే! అదే మనకీ, ఒక ఆత్రేయా, ఒక గుల్జార్ కీ గల తేడా! మనం వెక్కి వెక్కి ఏడుస్తాం. వీళ్ళు ఏడ్చేది గాక, ఏడిపిస్తారు – గుండెలో గూడుకట్టుకొన్న దిగులను కరిగేలా ఏడిపిస్తారు. మన ఏడుపేంటో మనకి తెలియజెప్పి ఏడిపిస్తారు. సరిగ్గా ఏడ్వడం నేర్పిస్తారు. అంతే వీళ్ళు చేసేది. చేయగలిగిందీ! అందుకే మనం వాళ్ళని నెత్తిన పెట్టుకునేది.

ఏడుపును గూర్చి ఆత్రేయ గారి పద్యం:

ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న
కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె,
ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న,
అతని ఏడ్పున కసలైన యర్థమేమొ.

ఏడుపుకి అర్థాలు, కన్నీటికి నామకరణాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. “ఎందుకింత నవ్వు? ఆనందం?” అని ఆలోచించుకోం గా, ఆనందించేస్తాం. “నీ వల్లే నాకీ ఏడుపు” అని దెప్పడానికి బాగున్నా, “నీ ఏడుపు నాదైంది” అనే కదా, అంతరార్థం. దీన్నే ఆత్రేయ ఈ విధంగా చెప్పారొక చోట:

నీకు నా బాధ గోరంత, నా కదేమొ
చీమ నిను కుట్టునను గుండె చెదిరిపోవు

“సినిమా కవి బతుకు అనేకానేక అభిరుచుల గల విటులను సంతృప్తిపరిచవలసిన పడుపువృత్తి.” అని ఆత్రేయగారన్నారో చోట. ఆయన సినిమా పాటలన్నీ ఆయన చేసిన వృత్తే అనుకున్నా, అవే మనల్ని రంజింపజేసాయి. మన జీవితాల్లో భాగమయ్యాయి. అలాంటిది ఏ enforcement లేకుండా ఆయనకై ఆయన రాసుకున్న కన్నీళ్ళల్లో అందం చూడాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! అసలు, ఇలాంటివి చదవడం కోసమే, జీవితంలో కొన్ని కష్టాలూ, నష్టాలూ అనుభవించాలి. అప్పుడే వీటిలో అందం తెలుస్తుంది. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లో లేదు కాని, దీన్ని మొదటి ప్రచురించిన “మనస్వని” పబ్లిషర్స్, ఆర్ధిక సాయం అందించిన సినీప్రముఖులూ, ఎక్కడెక్కడో పడున్న రచనల్ని వెతికి తెచ్చిచ్చిన సహృదయులూ – అందరూ అభినందనీయులు! ఈ పుస్తకాన్నే కాక, ఆత్రేయ కదంబం పేరిట ఆరేడు పుస్తకాలను భద్రపరిచిన “ఏ.పి. ఆర్కైవ్స్” వారూ, అడగ్గానే నాకీ పుస్తకం జిరాక్స్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు!

నాకు నచ్చిన కొన్ని కవితలు.

నీవు కవయిత్రిగా పుట్టి నేను నీకు
కలముగానైన జన్మించ వలతు చెలియ
అపుడు నీగుండె పడెడి మారాట మక్ష
రమ్మగును చెలి! నాపాళి రక్తమంటి.

*************

తెలియునని, తెలిసితినని, తెలిపెదనని,
వాగితిని, వ్రాసితిని, అహంభావినగుచు —
నేను నేననుకొనుచు నిన్నేళ్ళు గడచె,
ఎవరు నేనన్నదింతకు నెరుగనైతి

*************

దేవుడున్నాడొ లేడొ, ఈ దినమువరకు
నరుని, దేవునిమించియే నమ్మినాను,
అడుగడుగున వాని దగాల ననుభవించి
అలసిపోతిని – కావలె నాటవిడుపు.

*************

విన్నాను కథను, కథకుని
కన్నుల కన్నీటి తెరలు క్రమ్ముట కన్నా
నున్నా రనుకొన్నా నీ
మన్నున మనసున్న మనుజ మాణిక్యములున్

*************

బాధనుండి కవిత ప్రభవించు – అందుకే
అక్షరమ్మురాక – అయితి కవిని

*************

చూడకుము నన్ను, నీ చూపు సోకినంత
తరలివెళ్ళిన ప్రాణముల్ తిరిగివచ్చు

*************

చితిని కాలెడివేళ ఆ చిటపటలకు
భాష్యమేమి? నీ నామజపమ్ముగాక!

*************

మనము దేవుని అడుగుట మరతుమనియె
ఆడుదానిని సృష్టించినాడు స్రష్ట!

*************

కాలమా! నీకు బానిస కాను, నీవు
ఎంత ఎదురొడ్డినను నేను ఎదుగగలను

*************

చెప్పులను కొంటి కాళ్ళు రక్షించుకొనగ,
ముళ్ళు చెప్పులలోనే కాపురము పెట్టె!

*************

నీ హృదయమందు తావుకై నిన్నువేడ
నీకు హృదయమే లేదన్న నిజము తెలిసె

*************

హృదయ వీణియ నొకసారి కదిపినంత
మ్రోగు ననురాగ మధురాగ మాగ దింక
మారు పలికెడి హృదయమ్ము దూరమైన
కొండకోనల పాలయి బండబారు!

*************

కాలం!

ఎన్నో యుగాలుగా ఉన్నాను
ఇంకెన్నో యుగాలు వుంటాను
పన్నెండు నెలల్లో బతికే నువ్వా
నాకు కొలమానం
నీ ఆయుర్దాయం నిర్ణయించింది నేను
నీకు పేరుపెట్టింది నేను,
నీకు ప్రేరు తెచ్చింది నేను
నీవు చరిత్రగా మారేదీ నా చర్యవల్లనే,
నీ గర్భంలో కలసిపోతానని గర్వించకు
దాన్ని ఛేదించుకొని వచ్చే అవిచ్చిన్న
శక్తిని నేను

నీ గర్భం నాకో మేకప్‍రూం
ఓ డ్రస్సింగ్ రూం
విరామ స్థలం
విశ్రాంతి గృహం ’అంతే’!

*************

తెలివి

విడిపోయి తెలుసుకొంటిని
కలిసుండు టెంత బాధని
ఆనాడు ఎరుగనైతి
విడిపోతె ఇంత సుఖమని
నీకు ప్రేమన్న దెరుకలేదని
నిన్ను ప్రేమించి తెలుసుకొంటిని
అసలు ప్రేమించుటే పెద్ద తప్పని

నిన్ను ద్వేషించి దిద్దుకొంటిని

***************

కాగితాల ఏడుపు

అడుగు గడప దాటగానె
అగుపిస్తుందొక పటము
అటు తిప్పి తగిలించండి
ఇటువైపే మిగిలిందండి

నల్లని సీరాతోటి
ఇన్నేళ్ళూ ఖరాబుచేసి
నే రచించి చించినట్టి
కాగితాల దస్తరాలు
నవ్వుతాయి ఏడ్వలేక

ప్రతి ఒక్కరూ కవియై మా
బ్రతుకులకు మసిపూసి
పారేస్తాడిలా మమ్ము
పొగిడేస్తారీ జనమ్ము

కవి వ్రాతల చేదు త్రాగి
కసటెక్కిపోయాము
కట్టుకోండి పొట్లాలు
రుచి చూస్తాం మిఠాయిలు!
అంటాయి మీ చెవిలో
ఆ సాయం చేయండి

కావిరంగు ఎక్కివున్నా
కనీసం ఇప్పుడైనా
పనికొస్తాయ్ పసిపిల్లలకు
అది వరమా కాగితాలకు.

************

జీవితం నిప్పంటించిన సిగరెట్ వంటిది
అనుభవించినా ఆదమరచినా
అది మాత్రం కాలిపోతుంది
తుదకు బూది మిగులుతుంది

*************

You Might Also Like

15 Comments

  1. jawaharlal,sr.citizen

    మంచి ఆర్టికల్. బెస్ట్ విషెస్.పుస్తకం ఎక్కడ లభ్యమవుతుందో చెప్పండి

  2. kalaga kalyan kumar

    unbelievable uuuuuuuuuuuuuu…………….

  3. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] ఆత్రేయ ఆత్మకథ: “మరుపే తెలియని నా హృదయం, తెలిసీ వలచుట తొలి నేరం, అందుకే ఈ గాయం.” అనుకుంటాం గాని, గాయాలలో నుండి పుట్టే గేయాల మాధుర్యమే వేరు. గొంతులో అడ్డం తిరిగిన దుఃఖాన్ని, కన్నీళ్ళలా ప్రసవింపజేసే మంత్రసాని ఈ గేయాలే కదా! ఆత్రేయ తెలుగువాడిగా పుట్టినందుకు ఎగిరి గంతులేసినంతగా నచ్చిన రచన ఇది. […]

  4. రామ

    ఈ పుస్తకాన్ని మీరు పరిచయం చేసిన తీరు చాలా బాగుంది.

  5. వంశీ కృష్ణ

    మీరు రాసింది చదవగానే ఒకసారి వెళ్లి అదృష్టం పరీక్షించుకుందామని మా వూరి లైబ్రరీ కి వెళ్ళాను ..కదంబం అని దొరికింది ..ఆత్మ కధ ఉన్నది అందులో ! చదువుతూనే ఉన్నాను ఇంకా …

  6. Purnima

    @రాఘవ: తార్నాకలో “సి.సి.ఎం.బి” ఎదురుగా ఉంటుందండి. పేరు సూచించినట్టుగానే ఇది మన రాష్ట్ర ఆర్కైవ్స్ అన్నీ పొందిపరిచి ఉంటారు. ఇక్కడకు ముఖ్యంగా రిసెర్చర్స్ వస్తూ ఉంటారు, వారి వారి సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి కదా! కాని, మాలాంటి అతి సామాన్యులనూ ఏ సంకోచం లేకుండా అనుమతించారు. లైబ్రరీలో మా మానానికి మమల్ని వదిలేసారు. పుస్తకాలు అడిగితే, వారే జిరాక్స్ తీయించి ఇచ్చారు.

    కాకపోతే, పుస్తకం జిరాక్స్ కోసం అనుమతికై ఒకసారి, అనుమతి తీసుకున్నాక ఒకసారి, పుస్తకం తెచ్చుకోడానికి ఒకసారి.. ఇలా చాలా ఓపిగ్గా తిరగాలి. ఓపిక ఉండాలే గాని, ఇదొక నిధి! అక్కడ స్టాఫ్ మాత్రం భలే మంచివాళ్ళు!

    పూర్తి చిరునామా:

    Address:
    Rajya Abhilekha Nlym, Upl Road, Tarnaka, Hyderabad, 500007
    Phone:
    +91-40-27002373 +91-40-27003372 +91-40-23453890

  7. vijayalakshmi

    naku navala telugu lo kovale any navala

  8. రాఘవ

    ఈ ఏపీ ఆర్కైవ్స్ ఎక్కడ ఉందండీ?

  9. లలిత (తెలుగు4కిడ్స్)

    పూర్ణిమా, నువ్వింక కవిత్వం రాయడం మీద ధ్యాస పెట్టాలేమో:)
    చాలా బరువైన భావాలు నీ వ్యాసాల నిండా కనిపిస్తాయి.
    కథైనా, కవిత్వమైనా మనసులో పుట్టి చచ్చిపోదు పూర్ణిమా!
    నీకు బహుశా సరైన సమయం సందర్భం దొరకాలేమో.
    నేను నీ భావాతిశయాన్ని తట్టుకోలేక పడిపోకుండా ఉండాలని గబ గబా చదివేసి, ఇక్కడ ఉదహరించిన పద్యాలూ, కవితల మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. అవి ఇక్కడ ఉంచి మంచి పని చేశావు. పుస్తకం ఇప్పుడూ దొరకదేమో అని కూడా చెప్తున్నావు కాబట్టి కూడా మంచి పని చేశావనే అనిపిస్తోంది.

    “తెలియునని, తెలిసితినని, తెలిపెదనని,
    వాగితిని, వ్రాసితిని, అహంభావినగుచు —
    నేను నేననుకొనుచు నిన్నేళ్ళు గడచె,
    ఎవరు నేనన్నదింతకు నెరుగనైతి”

    వేమనని తలపిస్తున్నాడు.
    మనసులో మునిగి తేలిన మన సుకవి.

  10. కొడవళ్ళ హనుమంతరావు

    ఆత్మకథ అర్ధాంతరంగా అయిపోవడానేమో, పరిచయంలో జీవిత విశేషాలకన్నా రచనల ప్రస్తావన ఎక్కువయింది. తొలివలపుతోనే ముగించడానికి కారణమేమయి ఉంటుందబ్బా? పద్మావతి గారికి [1] పశ్చాత్తాపపు ముక్కేమన్నా చెప్పాల్సుంటుందనా?

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఆత్రేయ పశ్చాత్తాప పడినట్టే, కానీ …!” 24-11-1989 ఆంధ్రజ్యోతి లో రంగనాయకమ్మ ఉత్తరం. “మానవ సమాజం, నిన్నా – నేడూ – రేపూ,” అన్న పుస్తకం నుండి. స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, 2006.

  11. Purnima

    @Som: పుస్తకం ఇప్పుడు కొనడానికి దొరకదనే అనుకుంటున్నాను. పాత లైబ్రరీల్లో మాత్రం ఉండవచ్చు.

  12. Som

    పూర్ణిమ గారూ,
    ఈ పుస్తకం కొనుక్కోవడానికి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా (హైదరాబాదు లో)…..

  13. కామేశ్వర రావు

    పొద్దున పొద్దున్నే బాగా ఏడిపించేసారు! 🙂

  14. సౌమ్య

    “మాస్టారూ… మీరు భలే ఏడుస్తున్నారు. ఏదీ ఇంక్కొంచెం ఏడ్వండి.. అద్గదీ!”
    – :))

  15. Rao S Lakkaraju

    చాలా శ్రమ పడ్డారు. బాగుంది రచన.

Leave a Reply