Multiple City – Writings on Bangalore

ఆ మధ్యోమారు బెంగళూరు ఫోరం మాల్ లోని లాండ్మార్క్ షాపులో తిరుగుతూ ఉంటే, కనబడ్డది – ’మల్టిపుల్ సిటీ’ -రైటింగ్స్ ఆన్ బెంగళూర్ అన్న పుస్తకం. పేరు చూడగానే – సుకేతు మెహతా రాసిన ’మాక్జిమమ్ సిటీ’ గుర్తొచ్చింది (మొదలుపెట్టి, పుస్తకం బాగున్నాకూడా రకరకాల కారణాల వల్ల మధ్యలో ఆపేసిన ఎన్నో పుస్తకాల్లో ఇదొకటి!!). కింద …ఆన్ బెంగళూరు అని చూడగానే ఇంక కొనేయాలనిపించింది. గత సంవత్సర కాలంలో – దీర్ఘకాల బెంగళూరు వాసులెవరన్నా తగిలితే, వాళ్ళీ నగరం గురించి బోలెడు కబుర్లు చెప్పడం, నాకూ ఈ నగరం నచ్చడం, నాకలాంటి పాత సంగతులపై ఆసక్తి ఉండటం – ఇవన్నీ కలిపి వెంటనే ఆ పుస్తకం కొనేసేలా చేసాయి. అయితే, కొనడం అయితే కొనేస్తాను కానీ, ఒక్కోసారి చాలారోజులకి కానీ వాటిని చదవను. కానీ, ఈ పుస్తకం – ఫోరం నుంచి రెండు బస్సులు మారి ఇంటికి చేరేలోపు తన ప్రేమలో నేను పడిపోయేలా చేసింది!!

పుస్తకం సంగతికొస్తే – ఇది బెంగళూరు గురించిన వ్యాసాల సంకలనం. ’బెంగళూరు గురించి’ అన్న గొడుగు కింద అదీ, ఇదీ అని లేకుండా, ఈ నగర సంబంధిత సమస్త విషయాలూ వస్తాయి. చరిత్ర, జ్ఞాపకాలు, కథలు, కవితలు, వర్తమానం, ఇక్కడి జీవితం, ఇక్కడి జీవనశైలి, ఇక్కడి ప్రముఖులు, ప్రాంతాలు, వారి కథలు, వాటి కథలు – అన్నీ కలిసిన సంకలనం ఇది. (ఇలా ఉండే సంకలనం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ’సెలెక్ట్’ బుక్ షాప్ వారి అరవై ఏళ్ళు పూర్తైనప్పుడు వేసిన పుస్తకం- Modern Reading, a miscellany కూడా ఇలాంటిదే!!) కొన్ని కన్నడ నుండి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. ఒక సినిమా పాట ని కూడా అనువదించినట్లున్నారు. ఆర్కే నారాయణ్, యు.ఆర్.అనంతమూర్తి,లంకేశ్,శశి దేశ్‍పాండే,రామచంద్ర గుహ, సిద్ధలింగయ్య,అంజుమ్ హసన్, రాజమోహన్ గాంధీ, మహేష్ దత్తాని, విలియం డాల్రింపుల్, థామస్ ఫ్రైడ్మాన్, చర్చిల్ (ఔను..విన్స్టన్ చర్చిలే!!) – వంటి వారి వ్యాసాలీ సంకలనంలో ఉన్నాయి. మధ్యమధ్యన కనబడే కార్టూన్లు బాగున్నాయి. కవర్ పేజీ డిజైన్ నగర వైవిధ్యాన్ని చాటి చెబుతుంది.

బెంగళూరులో సాయంత్రాలు హాయిగా కిటికీల్లోంచి గాలి లోపలికొస్తూ ఉంటే (ఔను మరి, బైట వర్షం పడుతుంది కనుక, అక్కడికెళ్ళి కూర్చోలేం కదా!), ఏ మంత్రీ మాల్లోనో విండో షాపింగుకో, లేకుంటే ఏ క్రిష్ణ భవన్ వంటి హోటెల్లోనో కాఫీ టిఫిన్లకో పోక, ఇంట్లో కూర్చునే బెంగళూరు మొత్తం చుట్టుకురావొచ్చు. బెంగళూరంటే, నవతరం బెంగళూరు మాత్రమేననుకునేరు! నగరం పుట్టినప్పటి చరిత్ర నుండి, ఇప్పటి దాక, నగర ప్రస్థానం మొత్తం కెలెడిస్కోపులో మారే రంగులకు మల్లే మీ ఎదురుగుండా కనిపిస్తుంది. వ్యాస రచయిత్రల నొస్టాల్జియా పుస్తకం పేజీల్లోంచి తన్నుకొస్తుంది, మనల్ని చుట్టుకుంటుంది.

అన్నింటికంటే, నాకు నచ్చిన విషయం ఏమిటంటే – వ్యాస రచయితల్లో చాలా మంది కన్నడిగులు కాకపోవడమే. అసలు పుస్తకం కూర్పరి కూడా బెంగాలు ప్రాంతం వారు. బెంగళూరు నగరంలో అందరికీ చోటుందని చెప్పకనే చెప్పారు. ఇక్కడ కూడా కొన్నిసార్లు కనబడే దురభిమానమూ, ఇతర భాషల వారిపై అవిశ్వాసమూ వంటివి పక్కన పెట్టి అర్థంచేస్కుందాం పై వాక్యాన్ని 🙂 ఆమధ్య నగర శివార్ల సంచారంలో ఉండగా ఒక బెంగాలీ కుటుంబం కనబడ్డది. వాళ్ళు ఓ నలుగురు అన్నదమ్ములు -పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. వాళ్ళ పిల్లలు – దాదాపు పదేళ్ళ వయసువారు. ఎంచక్కా – బైట కన్నడం, ఇంట్లో బంగ్లా – ముచ్చటేసింది. ఇదే పుస్తకంలో గాంధీ బజారు వీథుల్లో ఒకప్పుడు జరిగిన సాహితీ చర్చల గురించి చెబుతూ – మాస్తి వెంకటేశ అయ్యంగార్ – ఇంట్లో తమిళం మాట్లాడినా, రాసిన సాహిత్యం కన్నడంలో అని చదువుతున్నప్పుడు పై కుటుంబమే గుర్తొచ్చింది.

ఈ పుస్తకం చదివాక –
౧) కన్నడ సాహిత్యం గురించి తెలుసుకోవాలి
౨) కన్నడ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి
౩)ఇలా బెంగళూరు పై వచ్చిన పుస్తకాలేమన్నా ఉన్నాయేమో చూడాలి
౪)కన్నడ నేర్చుకోడం మొదలుపెట్టి, మానేసి నాలుగేళ్ళౌతోంది, అది మళ్ళీ మొదలుపెట్టాలి.
-అని అనిపించాయి 🙂

కొన్ని సంవత్సరాలుగా జనజీవనంతో నిండిన ఏ నగరానికైనా ఇలాంటి చరిత్ర ఉంటుంది. బెంగళూరు దానికి అతీతమేమీ కాదు. కానీ, ఏ నగరం ప్రత్యేకత దానిది. ఈ నగరం ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

పుస్తకం వివరాలు:
Multiple City – Writings on Bangalore
Edited by Aditi De
First Edition: 2008, Penguin
Cost: Rs 399/-
Flipkart Link here.

You Might Also Like

5 Comments

  1. chengalva

    నేను ఈ సైట్ నుంచి ఏదయినా ఒక పుస్తకం డౌన్లోడ్ చేసుకుని అవకాసం ఉందా

    1. సౌమ్య

      లేదు.

  2. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] ప్రాంతాల్లో ఒక జర్నలిస్టు అనుభవాలు Multiple City – Writings on Bangalore : బెంగళూరు నగరం గురించి వివిధ […]

  3. tejaswinivandana

    multiple city book gurinchi cheptonte naku chadavalani undi
    nenu kuda banglore fan ni
    naku enduko aa city ante okarakamaina abhimanam
    chala sarlu vellanu kani . akkade unte baguntundi ani kuda anipistundi
    akkadi places matrame kadu manushulu kuda chala manchivallu

    meeru gandhibajar, krishna bhavan ila cheptonte forum mall s ilacheptonte paata rojulu gurtuvochhai
    tappakunda book chaduvuta

  4. కొత్తపాళీ

    బాగుంది. మాక్సిమం సిటీ చదివాను. ముంబై గురించి సాధారణంగా తెలియని అనేక కోణాలు పరిచయమైనాయి.

    మిగతా విషయాలు ఏమైనా, కన్నడ నేర్చుకోండి. ఎన్ని భాషలొస్తే అంత మంచిది

Leave a Reply