Wheel of Time – కాల చక్రం

వ్యాసం రాసిపంపిన వారు: దైవానిక

ఫాంటసి కథలు ఇష్టపడే వారికి, ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా సాగే Wheel of Time సీరీస్ ని పరిచయం చేయడం నిజంగా అదృష్టమే. ఈ సీరీస్ ని  రాబర్ట్ జోర్డన్ అనే కలంపేరుతో , జేమ్స్ ఆలివ్ రిగ్ని జూ. (James Oliver Rigney, Jr.) రచించారు. దీనిగురించి మరింత చెప్పేముందు సీరిస్ కి సంబంధించి కొన్ని నిజాలు చెప్పాలి.

1. ఈ సీరీస్ ఇంకా పూర్తి కాలేదు. మొదటి పుస్తకం 1990లో వచ్చింది. ఇప్పటికి 12 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 2 రావాల్సి ఉన్నాయి.
2. రాబర్ట్ జోర్డన్ గారు సీరీస్ ముగించకుండానే కన్నుమూసారు. ఆయన కథంతా చనిపోయే ముందు రికార్డ్ చేసారు. ఇప్పుడు ఆ కథని బ్రాండన్ సాండర్సన్ కొనసాగిస్తున్నారు. బ్రాండన్ ఆధ్వర్యంలోనే 12వ పుస్తకం వచ్చింది.

ప్రపంచంలోనే ఎందరో ఫాన్స్ ని సంపాదించిన సీరీస్ ఇది. అసలు కథా మూలానికి వస్తే, కాలం మొత్తం ఏడు యుగాలుగా విభజించపడింది. ఒకొక్క యుగము దాటి కొత్త యొగానికి వేళ్ళి, అన్ని అయిపోయాక మళ్ళా మొదటికి వచ్చేస్తూంటుంది. కాలచక్రం తిరగడానికి రెండు రకాల శక్తులు దోహద పడుతూ ఉంటాయి. అవి సైదిన్(మగ), సైదర్(ఆడ) (Saidin and Saidar) శక్తులు. ఆ శక్తులని ఉపయోగించ గలిగే వాళ్ళు “అయిస్ సెడయ్”లు (Aes Sedai). కాలచక్రం తిరగడం ఆరంభానికి ముందు, బ్రహ్మ(creator), షైతాన్(విల్లన్) ని బంధించేసి ఉంచుతాడు. కాని మూడో యుగంలో అయిస్ సెడయ్‌లు కొన్ని పరీక్షలు చేస్తూ షైతాన్ ఉనికిని జైలులోంచి కొంచెం బయటి ప్రపంచం మీద పడేట్టు చేస్తారు. షైతాన్ ఈ కాస్త సందులోంచి, ప్రపంచంలో అతి ఆశాపరులు, శక్తివంతులైన 13మందిని తనవైపు తిప్పుకొంటాడు. వారు షైతాన్ని విడిపించి ప్రపంచాధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. అప్పుడూ లివిస్ థెరిన్ టెలమన్ (Lews Therin Telamon), అయిస్ సెడయ్‌లందరిని కూడగట్టుకొని యుధ్దం చేసి జైలుని మూసేస్తాడు, దానిలోనే ఆ పదమూడు మంది ఇరుక్కుపోతారు. ఈ పోరాటంలో మగ శక్తి సైదర్ని షైతాన్ మలిన పరుస్తాడు. ఆ శక్తి మలీన పడటం వలన, లివిస్ థెరిన్ టెలమన్ పిచ్చియెక్కి ప్రపంచాన్ని ముక్కలు చేసేస్తాడు. అటు తరువాత సైదర్ ని ఉపయోగించేవారికి పిచ్చి యెక్కి ప్రాణాంతకంగా మారతారు. వీరిని ఆడ అయిస్‌సెడయ్లు శక్తి హీనుల్ని చేస్తూంటారు. ఇదంతా జరిగిన కథ.

మొదటి పుస్తకం ఇది జరిగిన 3500 సంవత్సరాల తరువాత మొదలవుతుంది. లివిస్ థెరిన్ టెలామన్(డ్రాగన్) మళ్ళా జన్మిస్తాడు. అతడిని అన్వేషించడంతో కథ మొదలవుతుంది. ఈ సారి షైతాన్ని పూర్తిగా జైల్లో మూసెయ్యగలరా లేరా అన్నదానిమేదే పూర్తి కథ ఆదారపడుతుంది.

ఈ కథలో పాత్రలు , వాటిని చిత్రీకరించిన తీరు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. మనిషి తను అనుకున్నదే కరెక్ట్ సిద్దాంతం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో, రాజకీయాలు ఎలా ఎవరి వీలును బట్టి ఉపయోగించుకుంటారో, శక్తి మనిషిని ఎలా మర్చేస్తుందో చాలా చక్కగా వివరించారు. ఫాంటసి జగత్తుని, మొత్తం దేశాలు ప్రజలు, వారి అలవాట్లని సృష్టించడంలో రచయిత అందెవేసిన చెయ్యి అనిపిస్తుంది. ముఖ్యంగా “అయిల్” ప్రజలు వారి అలవాట్లు మనల్ని నవ్విస్తూనే ఆకట్టుకుంటాయి. ఇంత పెద్ద జగత్తుని సృష్టించి దాని చుట్టూ కథని అల్లడానికి ఖచ్చితంగా అన్ని పుస్తకాలు అవసరమవుతాయి అని పూర్తిగా చదివాక మీరే తెలుసుకుంటారు.

మీకు ఫాంటసి కనుక నచ్చితే, ఈ సీరీస్ మిమ్మల్ని ఏ విధంగాను నిరాశ పరచదు. అంత పెద్ద సీరీస్ ని ఇంత చిన్నవ్యాసం సరిగా పరిచయం లేదనుకుంటాను. పుస్తకాలకి ఇంకా లంకెలు కావాలంటే, వికీ లింకులు చదవగలరు. కాలచక్ర ప్రపంచంలోకి దూసుకెళ్ళండి, ఆ అనుభూతుల్ని ఆస్వాదించండి.

You Might Also Like

Leave a Reply