మరోసారి గొల్లపూడి “అమ్మకడుపు చల్లగా”

వ్యాసం రాసిపంపినవారు: విష్ణుభొట్ల లక్ష్మన్న

తెలుగులో ఆత్మకథలు తక్కువ. కందుకూరి వీరేశలింగం గారి “స్వీయ చరిత్ర”, టంగుటూరి ప్రకాశం పంతులు గారి “నా జీవిత యాత్ర”, ఈ మధ్యనే ఇక్కడ పరిచయం చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి గారి “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ”, తిరుమల రామచంద్ర గారి “హంపీ నుంచి హరప్పా దాకా” వంటి ఆత్మకథల పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. తెలుగు చదవటమే తక్కువైపోతున్న ఈ కాలంలో, గొల్లపూడి మారుతీరావు గారు తెలుగులో రాసిన “అమ్మకడుపు చల్లగా” ఆత్మకథ ఎక్కువ మంది తెలుగువారిని చదివించే ఒక గొప్ప పుస్తకం. ఏ రంగంలో అయినా విశేష కృషి చేసి అపారమైన అనుభవం గడించిన వ్యక్తులు తమ అనుభవ సారాన్ని తరవాత తరాలకు అందివ్వటం ముదావహం. ఒక రకంగా ఇది వారి బాధ్యత కూడా! అనేక రంగాల్లో అత్యున్నత శిఖరాలను చేరిన శ్రీ గొల్లపూడి ఆ బాధ్యతను బాధ్యతగా పూర్తి చేసారు.

ఈనాటి యవతకి 1960, 70 దశాబ్దాల్లో ఆంధ్రరాష్ట్రంలో సాంస్కృతిక రంగాల్లో – ముఖ్యంగా నాటకాలు, సాహిత్యం, రేడియో కార్యక్రమాలకి సంబంధించిన – అనేక విషయాలను ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది. గొల్లపూడి వారికి చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు వల్ల అప్పటి తన జ్ఞాపకాలను జాగ్రత్తగా ఈ పుస్తకం ద్వారా అందించారు. తను కుర్రవాడిగా ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠాలు, ఆయనతో కలిసి తిరిగిన పెద్దలు స్నేహపూర్వకంగా గొల్లపూడి వారికి ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా అందరూ తెలుసుకోతగ్గవే!

500 పేజీలకి పైగా సాగిన ఈ ఆత్మకథలో ఎందరో మహోన్నత వ్యక్తుల పరిచయాలతో పాటు 600 లకు పైగా అందమైన, అరుదైన ఫొటోలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తి జీవిత ప్రయాణంలోనూ అన్నీ మధుర ఘట్టాలే ఉండవు. కొన్ని అనుకోని సంఘటనలు, మరికొన్ని బలమైన ఎదురు దెబ్బలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. మారుతీ రావు గారి లాంటి కొద్ది వ్యక్తులు మాత్రమే జయాపజయాలను సమంగా తీసుకోగలరు. అది ఈ పుస్తకం అంతా కనిపిస్తుంది. నిజానికి జీవితంలో కొన్ని విజయాలకి తట్టుకొని నిలబడగలటం ఎక్కువ కష్టమేమో!

తెలుగు వచన సాహిత్యంలో ఈ రచయిత స్పృశించని అంశం లేదు! కథలు, నాటకాలు, నాటికలు, బాల సాహిత్యం, నవలలు, వ్యాసాలు, అనువాదాలు, సినీ రచనలు, రేడియో రచనలు, సంపాదకీయాలు కాక తెలుగు రచయితలు అరుదుగా వ్రాసే “ట్రావెలోగ్” కూడా రాసి ఒక విలక్షణత సంపాదించుకున్నారు గొల్లపూడి వారు.

జగమెరిగిన వ్యక్తిగా గొల్లపూడి వారు అందరికీ పరిచయం ఉన్నట్టే నాకూ ఉన్నా మాకు ముఖపరిచయం ఈ మధ్యే జరిగింది. జూలై 2009లో మూడు వారాలకి అమెరికా వచ్చిన సందర్భంలో డాలాస్‌లో కలుసుకున్నాం. అప్పుడు గడిపిన కొద్ది గంటల పరిచయంతో పాటు ఈ పుస్తకంలోని వారి అనుభవాలు చదువుతుంటే శ్రీ గొల్లపూడి వ్యక్తిత్వంలోని ఒక విశిష్టత గమనించకుండా ఉండలేకపోయాను. అది వారి నిరంతరం శ్రమించే గుణం. సాధారణంగా వయస్సుపై బడుతున్న కొద్దీ “నిన్న” గురించి ఆలోచనలు ఎక్కువయ్యే సందర్భంలో ఇంత అపారమైన అనుభవమున్నా మారుతీరావు గారు ఇంకా “రేపు” గురించి ఉత్సాహంతో ఎదురు చూస్తూ అందుకు తగ్గట్టు శ్రమించటమే ఆ విశిష్టత.

చరిత్రను గ్రంథస్థం చెయ్యటంలో తెలుగువారికి తగిన శ్రద్ధ లేదు అన్న విషయం మన చరిత్రే చెపుతుంది. అలాంటి నేపధ్యంలో, ఈ పుస్తకంలో నేను గమనించిన రెండు ముఖ్యమైన విశేషాలు గురించి చెప్పక తప్పదు. ఒకప్పడు అత్యంత వైభవంగా వెలిగిన ఆంధ్ర నాటక రంగ విశేషాలు, అందులో పాలు పంచుకున్న ప్రముఖుల పేర్లు, వారి నాటక రంగ ముచ్చట్లు అక్షరబద్ధం కావటం చాలా ఆనందమైన విషయం. రెండవది అలనాటి రేడియో. “హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాలనుండి (ఒకేసారి) ప్రసారం” అన్న మాటలు నా చిన్నతనంలో తరచు రేడియోలో వినపడేవి. అప్పటి ప్రొగ్రాంలలో ఉన్న నాణ్యత గత ముప్ఫై ఏళ్ళుగా ఆంధ్రాకు దూరంగా నివాసమున్న నాకు ఇప్పటికీ అందమైన జ్ఞాపకాలే! అలనాటి నాటకరంగం, రేడియో కార్యక్రమ వైభవ విలువలు “అమ్మకడుపు చల్లగా” పుస్తకం ద్వారా ముందు ముందు తరాలు తెలుసుకొని ఆనందిస్తాయని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను.

ఈ పుస్తకం చూడగానే “ఆహా! ఎంత అందంగా ముద్రించారు!” అనిపిస్తుంది. హార్డ్ కవర్‌లో అచ్చేసిన ఈ పుస్తకంలో ఇంకో విశేషం – పుస్తకం చివర్లో ఏ ఏ వ్యక్తులు, పదాలు ఏ ఏ పేజీల్లో ఊటంకించబడ్డారో(యో) కూడా ఇవ్వటం వల్ల పుస్తకానికి మరింత శోభ వచ్చింది.  అదే ఈ పుస్తకంలో చివరన ఇచ్చిన ” ముఖ్య పద (విషయ) సూచిక” వల్ల ఈ పుస్తకంలో ప్రస్తావించిన అనేక విషయాలను ఈ సూచిక ద్వారా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇటువంటి వీలును కలిగి ఉన్న తెలుగు పుస్తకాలు ఎక్కువ ఉంటాయని నేను అనుకోను.

ఆత్మకథలు రాయటంలో ఒక చిక్కు ముడి ఉంది. ఆత్మకథా రచయిత తన ఆత్మకథలో ఎక్కడా లేనట్టే ఉండాలి కానీ ఉన్నట్టే కథ చెప్పాలి. మారుతీరావు గారు సరిగ్గా ఆ చిక్కుముడి చక్కగా విప్పారు ఈ పుస్తకంలో. కథ చెప్పే శైలి కూడా ఏదో ఎదురుగా కూర్చొని మనతో మాట్లాడుతూ చెప్పినట్టే ఉంది.

వ్యక్తిగా గొల్లపూడి ఎలా ఎదిగారు?

కుర్రాడిగా ఉండగా చదువు మీద కన్న నాటకాలు, సాహిత్యం (తెలుగు, ఇంగ్లీషుతో సహా) మొదలైన విషయాల మీద ఉన్న ఇష్టం వల్ల పెద్దగా చదువు అబ్బకపోయినా అపారమైన అనుభవజ్ఞానాన్ని సంపాదించిన విశిష్ట వ్యక్తి శ్రీ గొల్లపూడి. విజయనగరం, విశాఖపట్టణం ఊళ్ళలో చిన్నతనపు రోజుల్లోనే నాటకాల్లో వేషాలు కట్టటమే కాకుండా తెలుగులో కొన్ని మంచి నాటకాలకి రచయితగా పేరు తెచ్చుకున్నారు. “కళ్ళు” అన్న నాటికకు ఎన్ని బహుమతులు వచ్చాయో చెప్పటం కష్టం. ఆ నాటిక మా మిత్రబృందం అమెరికాలో ప్రదర్శించినపుడు కూడా ఎన్నో ప్రశంసలందుకొంది. ఒక పక్క నాటకాల్లో వేషాలు, మరో పక్క నాటకాల రచన, ఇంకో పక్క కథలు, నవలల రచనలతో మొదలైన సాంస్కృతిక పరిచయం, అనేక రంగాల్లో నిష్ణాతులైన గొప్పవారితో స్నేహానుబంధం వల్ల, చేపట్టిన ప్రతి రంగంలోను ఎన్నో  లోతులు చవిచూసారు. అలాగే జర్నలిజంలో ప్రవేశించి తనదైన ముద్రతో సంపాదకీయాలు, శీర్షికల నిర్వహణలతో తనదైన ముద్ర ఏర్పరుచుకున్నారు. ఈ అనుభవాలతో “ఆకాశవాణి”లో ఉద్యోగం మరింత ప్రతిభావంతంగా నిర్వహించారు. చాలా మందికి గొల్లపూడి వారు సినిమా వ్యక్తిగా పరిచయం అవ్వటానికి సినిమా అన్న మాధ్యమమే కారణం అని నేను అనుకుంటాను. ఐతే, సినిమా అధ్యయనానికి ముందే వీరు చూపిన ప్రతిభ మరుగున పడే ప్రమాదం ఉంది. ఈనాడు అన్ని కళలని తనలోనే ఇముడ్చుకొని విశ్వరూపం చూపిస్తున్న “సినిమా” గురించి తెలిసినంతగా ప్రజలకు ఒకప్పటి తెలుగు నాటక రంగ వైభవం, తెలుగు భాషా ప్రపంచాన్ని ఉన్నత శిఖరాలపై నిలిపిన సాహిత్య చర్చలు – గోష్ఠిలు – అవధానాలు,  అపురూపమైన ఆకాశవాణి కార్యక్రమాలు ఇప్పటి వారికి తెలియదంటే ఆశ్చర్య పడనక్కర లేదు. అలాంటి అప్పటి వివరాలు ఈ పుస్తకంలో కోకొల్లలు.

వందేళ్లకు పైగా విశిష్ట స్థానం సంపాదించుకున్న విశాఖ నాటకరంగం గురించి విపులమైన వివరాలు ఈ పుస్తకంలో అక్షరబద్ధమైనాయి. కె వెంకటేశ్వరరావు ఆ రోజుల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో చేసిన కృషి, ఆ ప్రభావం అప్పట్లో కుర్రాడిగా ఉన్న గొల్లపూడి వారిపై ఎంత బలంగా ఉందో గుర్తుంచుకోతగ్గవి. నిజానికి ఒకప్పుడు ఉచ్ఛదశలో ఉన్న నాటక రంగం ఈనాడు తన ఉనికినే కోల్పోవటానికి గల కారణాలు గొల్లపూడివారు తన ఆత్మకథలో వివరిస్తారు. నండూరి రామమోహనరావు, తిరుమల రామచంద్ర వంటి హేమాహేమీలతో కలిసి పనిచేసి జర్నలిజంలో ఎన్నో ఎత్తులు చవిచూసారు. ఆకాశవాణిలో పనిచెయ్యటం వీరి జీవితంలో మరో మధుర ఘట్టం. న్యాపతి రాఘవరావు, న్యాపతి కామేశ్వరమ్మ (రేడియో అన్నయ్య, అక్కయ్య), పాలగుమ్మి విశ్వనాథం, స్థానం నరసింహారావు, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, మంచాల జగన్నాథరావు, బాలాంత్రపు రజనీకాంతరావు – ఇలా చెప్పుకుంటూ పోతే తరగని పేర్ల జాబితా తయారవుతుంది – వంటి మహామహులతో పరిచయాన్ని సద్వినియోగపరుచుకున్న గొల్లపూడివారి అదృష్టానికి ఈర్ష్య పడకుండా ఉండలేం!

తెలివైన వ్యక్తి వచ్చిన అవకాశాలను తన ఎదుగుదలకు – ఒక్క ఆర్ధికపరంగానే కాక, జ్ఞాన సముపార్జనకు, వ్యక్తిత్వ వికాసనకు – ఎలా ఉపయోగించుకోవాలో గొల్లపూడి వారిలో స్పష్టంగా కనపడుతుంది. వీరి ఆత్మకథలో “సినిమా” ఘట్టం కూడా ఆసక్తికరమైనదే! సినీ రచనల్లో అనేక కథలు, సంభాషణలు, స్క్రీన్ ప్లే, మాటలు, వీరి సమగ్ర సాహిత్యంలో భాగాలే. ఇక సినిమా నటుడిగా రెండువందల చిత్రాలకి పైగా పనిచేసిన మారుతీరావుగారు “బహుముఖుడు” అనటంలో అతిశయోక్తి లేదు.

ముందు తరాలకు వెలుగు

ఈ పుస్తకంలో చాలా అనుభవాలు పాఠకులని ఆలోచింపచేస్తాయి! ఉదాహరణకు ఈ పుస్తకంలోని  క్రింది వాక్యాలు చూడండి.

“జీవితం వేసే జమాఖర్చుల్లో చాలామంది ‘ ఖర్చు ‘ లకి తల వొంచేస్తారు. కాని, ఖర్చుని ఆనందంగా తర్జుమా చేసుకోవడం చేతనైతే అది కూడా చివరికి ‘ జమ ‘ కిందనే పర్యవసిస్తుంది. ఇది లెక్కల పరంగా కాదు – ధృక్పథం పరంగా, ఆలోచనాపరంగా, ఆచరణపరంగా, ఒక ఫిలాసఫీగా నేను నేరుచుకున్న పాఠం.

చాలా సందర్భాలలో నేను కృంగినప్పుడే ఫీనిక్స్‌ లాగా మీదకి లేచాను. కష్టాన్ని ఓ దశగా మాత్రమే అంగీకరించాను. నా పట్ల చూపే సానుభూతిని విదిలించుకున్నాను. అలాగే ‘ అభినందన ‘ ని త్వరగా మరచిపోవడం నేర్చుకున్నాను.”

“ప్రాప్తవ్య మర్ధం లభతే మనుష్యః”

అభ్యంతరాలు

ఐతే ఈ పుస్తకంలోని కొన్ని విషయాలతో నేను ఏకీభవించని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు, ఈ పుస్తకంలోని గొల్లపూడివారి మాటల్లో ఉన్న కొన్ని వాక్యాలు మీ ముందుంచుతాను.

“నాకు అమెరికాలో అవ్యవస్థ కనిపిస్తుంది. పరుగు తెలుస్తుంది. డబ్బు కనిపిస్తుంది. కృత్రిమమైన జీవన సరళి కనిపిస్తుంది. నల్లవారిని అమెజాన్ అడవులకి తగిలేసిన కాందిశీకుల జులుం కనిపిస్తుంది. వ్యక్తిగతమైన సంబంధాలు కనిపించవు. తల్లులకూ తండ్రులకూ అనాధ శరణాలయాలు కనిపిస్తాయి. డాలర్ పిచ్చి కనిపిస్తుంది. వ్యక్తిత్వాలనూ, జీవిత విలువలనూ తాకట్టు పెట్టుకొని బాంకు ఎక్కౌంట్లూ, కార్లూ పెంచుకొంటున్న – భారతీయుల మధ్య తరగతి ‘ యావ ‘ కనిపిస్తుంది. యోగ, మెడిటేషన్, వేదాంతం వైపు నిస్సహాయంగా అమెరికన్లు మొగ్గు చూపిస్తుంటే – చాట్లతో, మరిచిపోయిన తెలుగు ముక్కలతో, పొట్టి పాంట్లతో, శరీరాన్ని వీధిన పారేసుకున్న భారతీయుల కృత్రిమ ‘పశ్చమీ’ కరణ కనిపిస్తుంది. వెరసి – నన్ను అమెరికా భయపెడుతుంది – వీలైనంత త్వరగా పారిపోవాలనిపిస్తుంది.

ఇది నా స్పందన – ఎవరికీ దీనితో విభేధించటం కాని, చర్చించటం కాని జరిపే హక్కు లేదు.”

పైనున్న రెండు పేరాల్లో మొదటి పేరాలోని విషయాల్లో నేను కొంత ఏకీభవిస్తాను. ఒకే వాక్యం ఉన్న రెండో పేరాతో నాకు చిన్న గొడవ ఉంది. గొల్లపూడి వారంటే నాకు గౌరవం, పైగా నాకు మంచి మిత్రులు. కానీ, ఇంత పేరున్న విశిష్ట వ్యక్తి రాతలకు అభ్యంతరం చెప్పటం కూడా సద్విమర్శే అని నేను అనుకుంటాను.

మారుతీరావు గారు విసృతంగా ప్రపంచమంతా పర్యటించిన వారు. ఎంతో అనుభవజ్ఞానాన్ని సంపాదించుకున్న వారు. అంతే కాదు. వారి అనుభవాలను అక్షర రూపంగానే కాక ఆ ఆ యాత్రల్లో తీసుకున్న అందమైన ఛాయాచిత్రాలను అందరితో ఈ పుస్తకంలో పంచుకున్న సహృదయులు. ఈ ప్రయాణాల్లో వారు అమెరికా దేశానికి, ఐరోపా ఖండానికి ఉన్న కొన్ని తేడాలను ఈ పుస్తకంలో ముచ్చటించారు. వాటిలో కొన్ని నాకు స్వానుభవం కూడా. ఐతే, ఒక దేశంలో జీవిస్తూ, అక్కడి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ, పన్నులు కడుతూ, పిల్లల్ని పెంచుతూ అక్కడి వ్యవస్థలో ఒక భాగమైతే తప్ప ఆ దేశపు వ్యవస్థను, ఆచార వ్యవహారాలను లోతుగా గమనించలేం! విజిటర్‌స్ గా దేశాలు చూసేవారు ఆయా దేశాల్లో చూడగలిగేది పై పై పూతలే! ఈ విషయాలని పక్కన పెడితే, “అమ్మ కడుపు చల్లగా” ఒక గొప్ప పుస్తకం.

ఇక నా రెండవ అభ్యంతరం. 400 రూపాయలు ఖరీదున్న ఈ పుస్తకాన్ని ఆంధ్రరాష్ట్రంలో ఎంతమంది కొని చదవగలరో నాకు ఊహకు అందట్లేదు. ఈ పుస్తక రచయిత ముఖ్య ఆశయం తన అనుభవాలను అందరికీ అందివ్వటం అని నేను అనుకుంటున్నాను. అందుకు వీలుగా ఈ పుస్తకం ధరను తగ్గించటం, మన దేశంలోని గ్రంధాలయాలకు ఎక్కువ రాయితీలతో ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తే ఎక్కువ మంది చదివి ఆనందించగలరు!

ముద్రణ: ఆనంద్‌సాయి ప్రింటర్స్, సిల్వర్ ప్రింటర్స్, హైదరాబాదు. ప్రతులకు: కళాతపస్వి క్రియేషన్స్, లలితా మహాల్, 10/7 ఎ, అన్నై సత్యనగర్ మెయిన్ రోడ్, రామాపురం, చెన్నై – 600 089. ఫోన్ : 044 – 2249 1939

ఈ పుస్తకం స్ఫూర్తితో అయినా మరికొందరు పెద్దలు తమ స్వీయ కథలని వినిపిస్తారని ఆశిద్దాం!

ఈ పుస్తకం పరిచయం అయ్యింది కాబట్టి నా (మా) సొంత గోల ఒకటి చెప్పుకోవాలి!

నా (మా) సొంతగోల

ఒక రోజు డెట్‌రాయిట్‌లో ఉన్న మా రామన్న ఇంట్లో కబుర్లు చెపుతూ ఉంటే మా రామన్న నాతో ” ఒరేయ్! మా ఊళ్ళో కొందరు నేను గొల్లపూడి మారుతీరావులా ఉంటావు అంటారు!” అని చెప్పగానే విని నవ్వేసి ఊరుకొన్నా. అదేదో సినిమాలో గొల్లపూడిని “సింగిల్ పూరీ శర్మ” గా కుర్రాళ్ళు పెట్టిన ముద్దు పేరు గుర్తొచ్చింది. నన్నెవరూ అలా పిలవట్లేదు కదా అనుకున్నంతలో, మా ఆష్టిన్‌లో కొత్తగా పరిచయమైన ఒక స్నేహితుడు నాతో “మీరు గొల్లపూడి మారుతీరావులా ఉంటారని మీతో ఎవరూ అనలేదాండీ?” అనగానే నవ్వు ఆపుకోలేకపోయా. మాఇద్దరి కవలల ఫొటో ఇక్కడ ఇస్తున్నాను. అసలు విషయానికొస్తే, గొల్లపూడి వారికి ఉన్నంత విసృతమైన అనుభవం, ప్రవేశం, జ్ఞానం మాకు లేకపోయినా కొన్ని విషయాల్లో ఆ అభిరుచులు మాకూ ఉన్నాయి, నాటకాలు వేయటం, సంగీతం – సాహిత్యాల్లో కొంత పరిచయం, మన తెలుగు వాళ్లకి చేతనైనంత సహాయం చెయ్యాలన్న తపన లాంటివి అన్న మాట.

సమగ్రంగా చూస్తే ఒక పాఠకుడిగా ఈ పుస్తకాన్ని చదివి నేను ఆనందపడ్డాను. ఇప్పటి దాకా మీరు ఈ పుస్తకం చదవక పోయినా, చదివే అవకాశం వచ్చినా – తప్పకుండా చదవమనే నా రికమెండేషన్!

You Might Also Like

13 Comments

  1. పుస్తకం » Blog Archive » గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”

    […] విష్ణుభొట్ల లక్ష్మన్న గారి సమీక్ష ఇక్కడ చదవొచ్చు. (No Ratings Yet)  Loading […]

  2. ఈ మధ్య చదివిన పుస్తకాలు 12/07/2011 « నా ప్రస్థానం

    […] అమ్మకడుపు చల్లగా – గొల్లపూడి మారుతిరావు ఇది రచయిత ఆత్మ కథ. తెలుగులో ఇంత చక్కగా, అందంగా, శ్రద్ధగా, ముచ్చటగా తీర్చి దిద్ది అచ్చు వేసే పుస్తకాలు నాకు తెలిసి చాలా అరుదు. మీరు చదివినా చదవకపోయినా ధర పెట్టగలిగితే ఈ పుస్తకం కొని దాచుకోండి. చాలా పెద్ద పుస్తకం, చదవటానికి చాలా రోజులు పట్టింది. ఒక వైవిధ్యమయిన జీవన ప్రయాణం కదా మరి. ఎన్నో విజయాలు ఒక తీరని లోటు ఈ పుస్తకం. నన్ను నిరాశ పరిచిన ఒకే ఒక విషయం “అమరావతి కథలు” గురించి కానీ సత్యం శంకరమంచి గారి గురించి కానీ పెద్దగా వివరాలు లేక పోవటం. నచ్చిన విషయం పరనింద పెద్దగా లేకపోవటం. ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ. […]

  3. Madhurasree

    Thelivaina vyakthi vachinna avakasalanu thana yedugudalaku oka Arthikaparanganee kaka gynana samuparjanaku vyakthitwa vikasamunaku Yela Vupayoginchukovalo Gollapudi varilo spastanga kanipistundi Anna vakyalu chalabagunayi madhurasree Anantapur

  4. రవి

    చిలకమర్తి వారి “స్వీయచరిత్రము” కూడా ఆత్మకథల లిస్టులో ఒకటి.

    పుస్తకం ఖరీదు గురించి సరైన మాట అన్నారు. పేపర్ బ్యాక్ ఎడిషన్ ఒకటి తక్కువధరకు తీసుకుని వస్తే బావుంటుంది.

  5. కొత్తపాళీ

    చాలా బావుంది లక్ష్మన్న గారు.
    ఆంధ్ర నాటకరంగ చరిత్ర అనే పేరుతో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు ఒక ఉద్గ్రంధం రచించారు. అదిప్పుడు అందుబాటులో లేదు.
    మీరుగానీ రామన్నాగారు గానీ మారుతీరావుగారిలా ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు, కానీ చివర్లూ ఫొటో కత్తిలా గుంది. 🙂

  6. మెహెర్

    @అఫ్సర్:

    నా కామెంట్‌లో ప్రశ్నేం లేదు. అందులో చర్చించాల్సిన అంశమూ లేదు. శ్రీపాద, దువ్వూరిలవి బ్రాహ్మణ కథనాలైతే తప్పేదో వుందని నేనెక్కడా అనలేదే? ఆ రచనల పట్ల “స్వీయ కథనాలు”గా నాకే చిన్నచూపూ లేదు. (శ్రీపాద స్వీయకథనం ఏ భాషలోని స్వీయకథనాల వరుసలోనైనా తన వంతు స్థానాన్ని ధీమాగా సంపాదించుకోగల సత్తువ వున్న రచన అని నా నమ్మకం.) “శ్రీపాద కానీ, దువ్వూరి కానీ కేవలం బ్రాహ్మణ దౄక్కోణం వరకే చెప్పారని” నేనూ అనుకోవటం లేదు. కానీ వాళ్ళు చరిత్రకారుల దృక్కోణం నుంచి మాత్రం ఖచ్చితంగా చెప్పలేదూ అంటున్నాను. తమ తమ జీవన వాస్తవికతల్ని అక్షరాల్లో పట్టుకోవటమే వాళ్ళ ప్రధాన ఆశయం తప్ప, తమ చుట్టూ తమ పరిధికందని ప్రపంచాన్ని చారిత్రక దృష్టితో నమోదు చేయటం వాళ్ళ ఆశయం కాదూ అంటున్నాను. నేను బ్రాహ్మణుల్ని ఒక “కులం”గా తీసుకుని పై మాటలు అన్లేదు. ఒక “వర్గం” అని మాత్రమే అన్నాను. అవును, ఆ వర్గంలోంచి రాతగాళ్ళు ఎక్కువమంది పుట్టారు, తమ తమ జీవన చిత్రాల్ని నమోదు చేసారు. మిగతా వర్గాల్లో—కారణాలేవైతేనేం—ఈ సంఖ్యలో రాతగాళ్ళు ఏర్పడే పరిస్థితి లేకపోయింది (అప్పట్లో). కాబట్టి వాళ్ళ జీవితాల్ని ఎవరూ అంత నిశితంగా నమోదు చేయలేదు. ఇక్కడ మిగతా “వర్గాలు” అంటున్నది మళ్ళా కులాల దృష్టితో కాదు. ఇది మన వాళ్ళకున్న జబ్బు, ఏవన్నా సరే ఇలా “కులం” పేరిట భుజాలు తడుముకోవటం. ఈ అంశంపై ఏం మాట్లాడినా “కులాల” రంగుటద్దాలు తీసి ఉన్నదున్నట్టు చూడలేకపోవటం.

    ఇప్పుడు పై వాళ్ళవి కొందరు వ్యక్తుల స్వీయచరిత్రలుగా కాకుండా, మొత్తానికి “చరిత్రలు”గానే తీసుకుంటామూ అని ఎవరైనా అంటే, చరిత్ర అనే పదానికి వాళ్ళిచ్చుకునే ఇరుకైన నిర్వచనానికి కించ పడక చేసేదేం లేదు. మీరు ప్రస్తావించిన బ్రాహ్మణ స్వీయకథనాలన్నింటినీ ఓ చెంబులో వేసి గిలక్కొట్టి దాన్నే వడగట్టినా—ఒక చరిత్రకారుని నిష్పాక్షిక దృక్కోణంతో పోల్చి చూడాల్సి వస్తే—అది మన మస్తిష్కంలో నిలిపే ఊహాత్మక ప్రపంచానికీ, అప్పడు మన్నిన అసలు ప్రపంచానికీ శతసహస్రాంశమైనా పోలిక వుండదు. అవి ఆయా వ్యక్తుల వైయక్తిక ప్రపంచాలంతే. ఇక ఇక్కడ తెల్లవాళ్ళు రాసిన చరిత్రల ప్రస్తావన ఎందుకు? వాళ్ళు నిశితమైన (చరిత్రకారులకి అవసరమైన) విషయ సేకరణ చేసి రాయలేదు కాబట్టి అవి మూలపడ్డాయి. అది చరిత్రకారులుగా ఆయా వ్యక్తుల వైఫల్యం అనుకోవాలేగానీ, “మొత్తం తెల్లవాళ్ళూ” అని తీసిపడేయనక్కర్లేదు.

    >>>> నవలా, కథా రచయితలానే అతను కూడా దృక్కోణం నించే చూస్తాడు, రాస్తాడు.

    ఏమో, చరిత్రకారుడి దృక్కోణం ఇంత కురచగా వుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.

    >>>> సాహిత్యంలో బ్రాహ్మణ స్వరం రెండు మూడు దశాబ్దాలుగా మూగవోయింది. అన్ని రకాల అస్తిత్వాలు చరిత్రకెక్కించే వాదాలు బ్రాహ్మణ అస్తిత్వాన్ని అణచివేశాయి. వాళ్ళ “ప్రాతినిధ్యా”న్ని సామాజిక నేరంగా భావించాయి. ఇది అంత ఆరోగ్యకరమయిన ధోరణి అనుకోను.

    >>>> గతం వర్తమానం కన్నా సంక్లిష్టమయింది. కేవలం కొందరి ‘నిజాలే” చరిత్ర అనుకుంటే, ఇరుకు కంతల్లో మనం కూరుకుపోతాం. ఇరుకు పరిమితుల్ని విశాలం చేసేది ఆ కాలపు రక్త మాంసాల మనుషుల కథనాలు మాత్రమే, తరవాత ఆర్కైవుల్ని తవ్వే చేతులు కాదు.

    కొందరి నిజాలే (అంటే, దళితుల, ముస్లింల, మైనారిటీల నిజాలే) చరిత్ర అని నేనన్నానా? అయినా నేనన్నదంతా మీరు వేరే భాషలోకి (ప్రస్తుతం బాగా చెలామణీలో వున్న భాషలోకి) తర్జుమా చేసుకున్నారని అర్థమవుతోంది. ఆ jargon నేనూ విన్నాను. బ్రాహ్మణ “అస్తిత్వాలూ”, దళిత “అస్తిత్వాలూ”, ముస్లిం “అస్తిత్వాలూ” వగైరా. ఆ jargon నాకు రాదు. కాబట్టి నేనా విషయంలో ఏం మాట్లాడలేను గానీ, దానికీ నేను లేవనెత్తిన అంశానికీ ఏ సంబంధమూ లేదని మాత్రం చెప్పగలను. ఇలా అంటే ఇప్పుడు నా jargon కూడా మీకర్థం కాదని అర్థం చేసుకోగలను.

    పైన మీరు ప్రస్తావించిన రచనలన్నీ చారిత్రక రచనలకి ఖచ్చితంగా ముడిసరుకులుగా ఉపయోగపడతాయన్నది నిజం. అందులో సందేహం లేదు. కానీ వీటినే చరిత్రలంటే, నేను ముందే చెప్పినట్టు, మనం ఇరుకైన కంతలకు రాజీ పడిపోయినట్టే. చరిత్ర రచనకి చాలా కురచనైన అర్థాన్ని ఆపాదించినట్టే.

    >>> చెస్టర్టన్ చెప్పినట్టు అవి నేపధ్యంలో క్రీనీడలయినా పర్లేదు

    ఇకపోతే, ఆ క్రీనీడల వాక్యం నాదే. చెస్టర్టన్‌ది కోట్స్‌లో వుంచిన భాగం మాత్రమే.

  7. అఫ్సర్

    మెహెర్:

    అవును, చరిత్రకి నిజాలతోనే పని. కాని, చరిత్రకారుడు మనిషి. నవలా, కథా రచయితలానే అతను కూడా దృక్కోణం నించే చూస్తాడు, రాస్తాడు. అందుకే, తెల్లవాళ్ళు రాసిన భారత చరిత్రల్ని మనం తరవాత నిరాకరించాం. మన చరిత్ర మన దృక్కోణం నించి రాసుకున్నాం.

    మామూలు రచయితకి మాదిరిగానే చరిత్ర రచయితకీ నిజాలు ముడి సరుకు మాత్రమే.

    ఈ విషయం ఇంకా కొంచెం విస్తారంగా చర్చించాలి. ఒక వ్యాసం రాయాలని ఆలోచన. అప్పుడు మీ ప్రశ్నని మరింత వివరంగా చర్చిస్తా.

    ఇక మీరు “ప్రాతినిధ్యం” అనే మరో మాట వాడారు. అదే సందర్భంలో శ్రీపాద, దువ్వూరి స్వీయకథనాలు బ్రాహ్మణ దృక్కోణాలు మాత్రమే అన్నారు. అవి బ్రాహ్మణ దృక్కోణాలు అయితే తప్పేముంది? శ్రీపాద కానీ, దువ్వూరి కానీ కేవలం బ్రాహ్మణ దౄక్కోణం వరకే చెప్పారని నేను అనుకోను. మరీ ముఖ్యంగా దువ్వూరి స్వీయ చరిత్ర. (ఈ పుస్తకం గురించి ఈ మధ్య అరుణ గారు ప్రస్తావించారు.) నిజానికి ఇది విస్తృతంగా చర్చించాల్సిన సాంఘిక చరిత్ర వనరు.
    అవును, వారాలబ్బాయిలూ, వేదాధ్యయనాలూ, సంతలూ, స్మార్తాలూ, వాటి వొప్పుదలలూ, తిరుగుబాట్లు కూడా చరిత్రే! సాహిత్యంలో బ్రాహ్మణ స్వరం రెండు మూడు దశాబ్దాలుగా మూగవోయింది. అన్ని రకాల అస్తిత్వాలు చరిత్రకెక్కించే వాదాలు బ్రాహ్మణ అస్తిత్వాన్ని అణచివేశాయి. వాళ్ళ “ప్రాతినిధ్యా”న్ని సామాజిక నేరంగా భావించాయి. ఇది అంత ఆరోగ్యకరమయిన ధోరణి అనుకోను.

    అన్ని ప్రక్రియలూ, ప్రాతినిధ్యాలతో పాటు చరిత్ర రచనని కూడా పునర్మూల్యాంకనం చెయ్యాల్సిన సందర్భం ఇది. స్వీయ చరిత్రలు చరిత్ర లేని లోటుని భర్తీ చెయ్యకపోవచ్చు. కాని, చరిత్రలో కొన్ని ఖాళీల్ని భర్తీ చేస్తాయి.

    అలాగే, ప్రాతినిధ్యాల పేరిట కొన్ని వర్గాలు మాత్రమే ప్రాతినిధ్యానికి అర్హులనే భ్రమ తొలగిపోవాలనుకుంటా. ఈ సమాజంలో స్త్రీలూ, దళితులూ, మైనారిటీలతో పాటు బ్రాహ్మణులూ వున్నారు. బ్రాహ్మణులు ఇప్పుడు పూర్తి “అగ్ర” వర్ణం కూడా కాదు, గ్లోబలీకరణ తరవాత వాళ్ళూ పీడితులే. ఈ పీడిత చరిత్రని ఈ కాలపు శ్రీపాదలూ, దువ్వూరులు గొంతు విప్పి చెప్పాలి.

    చెప్పనివ్వండి. అది చరిత్ర రచనకి ముడి సరుకో, లేకపోతే, ప్రత్యామ్నాయ చరిత్రో అవుతుంది. చెస్టర్టన్ చెప్పినట్టు అవి నేపధ్యంలో క్రీనీడలయినా పర్లేదు.

    గతం వర్తమానం కన్నా సంక్లిష్టమయింది. కేవలం కొందరి ‘నిజాలే” చరిత్ర అనుకుంటే, ఇరుకు కంతల్లో మనం కూరుకుపోతాం. ఇరుకు పరిమితుల్ని విశాలం చేసేది ఆ కాలపు రక్త మాంసాల మనుషుల కథనాలు మాత్రమే, తరవాత ఆర్కైవుల్ని తవ్వే చేతులు కాదు.

  8. Rohiniprasad

    గొల్లపూడివారి పుస్తకం నేనుకూడా ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని చదివాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా అరుదైన ఫోటోలూ, తెలుగువారు గుర్తుంచుకోని కె. వెంకటేశ్వరరావువంటి మహానటుల వివరాలు చాలా బావున్నాయి.

    ఆత్మకథలనేవి వ్యక్తిగత దృక్పథంతో నమోదు చేసిన విషయాల సమాహారాలు. వీటిలో పెద్ద చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావనకు రాని చిన్న విషయాలు అనేకం ఉంటాయి. వాటన్నిటికీ ప్రాంతం, కుటుంబనేపథ్యం మొదలైన రంగు కాస్త అంటినప్పటికీ వాటిద్వారా తెలివైన పాఠకులకి చాలా సంగతులు అర్థం అవుతాయి. ప్రతిదాన్నీ కులం పేరుతో విమర్శించడం ఈనాటి స్టైల్ ఎంతవరకూ ఉపయోగకరమో నాకు తెలియదు.

    ఈ పుస్తకంలో మారుతిరావుగారికి అయిదారు తరాల ప్రముఖులతో వ్యక్తిగత పరిచయాలు ఏర్పడటం, కొనసాగటం కనిపిస్తుంది. అందుకు ఒక కారణం ఆయన కాస్త చిన్న వయస్సులో ఉండగానే రచయితగా, జర్నలిస్టుగా పనులు చేపట్టడం. ఒక వివిత్రమైన విషయమేమిటంటే ఆయన ఏ ఒక్క లైన్‌లోనూ స్థిరపడిపోలేదు. ముఖ్యంగా సినిమాల్లో నటించి, “ప్రాణాలతో” బైటికొచ్చి ఇతర వృత్తులు విజయవంతంగా చేపట్టిన తెలుగువారు చాలా అరుదుగా కనిపిస్తారు. లక్ష్మన్న చెప్పీ చెప్పని never-say-die spirit మారుతిరావుగారిలో కనిపిస్తుంది.

  9. మెహెర్

    @అఫ్సర్:

    >>> “మౌఖిక ప్రక్రియల్ని, వివిధ జీవన కథనాల్ని కూడా ఇప్పుడు చరిత్ర గానే భావిస్తున్నాము. ఇది ఇప్పుడు అత్యవసరమయిన మలుపు. శ్రీపాద, దువ్వూరి, చలం, తిరుమల రామచంద్ర లాంటి వారు నా దృష్టిలో చరిత్ర రచయితలే!”

    Perspective is not history. Facts are history. నేను శ్రీపాద, చలం, తిరుమల రామచంద్రల స్వీయకథనాలు చదివాను; ఇప్పుడు దువ్వూరి రచన చదువుతున్నాను. అవి ఎంతసేపూ వాళ్ళ దృక్కోణాల్నే చూపుతాయి తప్ప చరిత్రని కాదు; అది కూడా ప్రముఖంగా బ్రాహ్మణ వర్గపు దృక్కోణాల్నే! ఎంతసేపూ వారాలబ్బాయిలూ, వేదాధ్యయనాలూ, సంత చెప్పుకోవటాలూ, స్మార్తాలూ, లేదంటే — చలం విషయంలో — వీటన్నిటిపైనా తిరుగుబాట్లూ…. ఇవే మన చరిత్ర అంటే నేను ఒప్పుకోలేను. If you let me use a Chesterton’s phrasing in this context, “there are whole dim hordes of humanity” whom we don’t find in any of these books; their shadowy existences are just lurking in the background. వారికీ — దీటైన సుసంపన్నత కలిగిన వారి జీవితాలకీ — ఈ స్వీయ కథనాలు ఎప్పటికీ ప్రాతినిధ్యం వహించలేవు. మనకి చరిత్రకారులూ, చరిత్రని సమగ్రంగా నమోదు చేసే వ్యవస్థా లేకపోవచ్చు; అది తీరని లోటు. దాన్ని ఈ స్వీయ కథనాలు ఎన్నటికీ భర్తీ చేయలేవు. వీటిని చరిత్రగా ఒప్పుకోదలిస్తే, మనం గతాన్ని చాలా ఇరుకైన కంతల్లోంచి చూసేందుకు రాజీ పడిపోయినట్టేనని నా అభిప్రాయం.

  10. అఫ్సర్

    లక్ష్మన్న గారు:

    మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. వ్యాస రచనలో మీరు తీసుకుంటున్న శ్రద్ధ (రూప శ్రద్ధ అంటాను) ముచ్చటగా వుంది. తగిన పరిశోధనతో పాటు, వ్యాస రచనని వొక కళగా భావించి, మీరు ఈ ప్రక్రియా ప్రయాణం సాగిస్తున్నట్టుగా మీ వాక్యాలు దాఖలా ఇస్తున్నాయి.

    చరిత్ర రచన గురించి మీరు అన్న మాట నిజం.

    “చరిత్రను గ్రంథస్థం చెయ్యటంలో తెలుగువారికి తగిన శ్రద్ధ లేదు అన్న విషయం మన చరిత్రే చెపుతుంది.”

    నిజమే! కాని, ఏది చరిత్ర అన్న ప్రశ్నని బట్టి దీనికి జవాబులు వుంటాయి. లిఖిత చరిత్రని మాత్రమే చూస్తే, మన చరిత్ర రచనా విధానం బోధపడదు. మౌఖిక ప్రక్రియల్ని, వివిధ జీవన కథనాల్ని కూడా ఇప్పుడు చరిత్ర గానే భావిస్తున్నాము. ఇది ఇప్పుడు అత్యవసరమయిన మలుపు. శ్రీపాద, దువ్వూరి, చలం, తిరుమల రామచంద్ర లాంటి వారు నా దృష్టిలో చరిత్ర రచయితలే! గద్దర్, గోరటి కూడా వాళ్ళ పాటల్లో పాడుతున్నది చరిత్రే! బూదరాజు, ఉప్పల వంటి వారు రాసిన స్వీయ కథనాలు చరిత్రే!
    చరిత్రకారుడు మనకి విడిగా లేడు. అతను వివిధ ఇతర ప్రక్రియల్లోంచి మొదటి నించీ వున్నాడు. కాని, అతను సరిగా గ్రంధస్తం కావడం లేదు అన్నది నిజం.

    ఇక రేడియో గురించి నా బాధ. ఇవాళ దృశ్య గ్రహణాల తరవాత మన శ్రవణ సాధనాలు మూల పడే దుస్తితి వుంది గాని, తెలుగు రేడియో చరిత్ర గొప్పది. రేడియో లేకుండా అసలు మన బాల్యపు ఆలోచనల వికాసాన్ని నేను వూహించనయినా లేను. మన మెదళ్ళకి అది పొద్దు పొడుపు.

    మారుతీ రావు గారు ఆ పొద్దు పొడుపుని బాగా చూపించారు. అలాంటి పనే ఈ మధ్య ‘కౌముది ‘ జాల పత్రికలో సుధామ గారు చేసారు. ఆ పని ఇంకా గట్టిగా చెయ్యాల్సి వుంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారో, పన్నాల వారో , రజని గారో, ప్రయాగ వారో, శారదా శ్రీనివాసో, తురగా వారొ వారి రేడియో జ్ఞాపకాలు రికార్డు చెయ్యాలి. అదే చరిత్ర అవుతుంది. మీ వ్యాసం ఎవరినయినా ఆ పని వేపు మళ్ళించడానికి స్పూర్తి కావాలని నా చిన్ని చిన్ని ఆశ!

    1. pavan santhosh surampudi

      ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ వ్యాఖ్యలో ప్రస్తావించిన శారదా శ్రీనివాసన్ గారు దరిమిలా ఆవిడ రేడియో అనుభవాలని పుస్తకంగా వ్రాశారు.

  11. kalpana

    లక్ష్మన్న గారు,

    గొల్లపూడి వారి ఆత్మ కథ లో వున్న విషయాల్ని చక్కగా పట్టుకొని రాశారు.
    ఉదాహరణకు “ఆత్మకథలు రాయటంలో ఒక చిక్కు ముడి ఉంది. ఆత్మకథా రచయిత తన ఆత్మకథలో ఎక్కడా లేనట్టే ఉండాలి కానీ ఉన్నట్టే కథ చెప్పాలి. మారుతీరావు గారు సరిగ్గా ఆ చిక్కుముడి చక్కగా విప్పారు ఈ పుస్తకంలో. కథ చెప్పే శైలి కూడా ఏదో ఎదురుగా కూర్చొని మనతో మాట్లాడుతూ చెప్పినట్టే ఉంది.”
    మంచి పాయింట్.
    అమెరికా గురించి ఆయన రాసినా రాతల మీద సద్విమర్శ చేయటం కూడా బావుంది. సద్విమర్శ మంచి విమర్శకుడికి వుండాల్సిన ముఖ్య లక్షణం. అది కనిపిస్తోంది ఈ సమీక్ష లో….

  12. Achilles

    “తెలుగులో ఆత్మకథలు తక్కువ. కందుకూరి వీరేశలింగం గారి “స్వీయ చరిత్ర”, టంగుటూరి ప్రకాశం పంతులు గారి “నా జీవిత యాత్ర”, ఈ మధ్యనే ఇక్కడ పరిచయం చేసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్రి గారి “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ”, తిరుమల రామచంద్ర గారి “హంపీ నుంచి హరప్పా దాకా” వంటి ఆత్మకథల పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.”

    ఈ జాబితాలో మరోటి – దాశరథి రంగాచార్య గారి జీవనయానం. దాశరథి క్రిష్ణమాచార్య గారి యాత్రాస్మృతి.

Leave a Reply