సాహిత్యంలో సాక్షర నారీ సభ

రాసిన వారు: అయల శ్రీధర్
నా పరిచయం—నా పేరు అయల శ్రీధర్. ఇటీవల “క్షీరగంగ” అనే బ్లాగు మొదలుపెట్టాను. నా కథలు 30 ఏళ్ల క్రిందట వివిధ మాస వార పత్రకలలో ప్రచురింపబడ్డాయి. వాటలో ‘స్మిత నయన’ అనే కథకి ‘జాగృతి’ బహుమతి నిచ్చంది .’విరిసిన హరివిల్లు’ అనే కథకి ఆంద్రప్రభ స్పెషల్ కథగా ప్రచురించింది. దాదాపు ఇరవై కథలు సామాన్య ప్రచురణకి నోచుకొన్నాయి. ‘చీకటి చకోరాలు’ అనే నాటికకి పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు వచ్చింది. “బీబీ నాంచారి’ అనే నాటకం 14 కేంద్రాల లో విజయవంతంగా ప్రదర్శింపబధింది. 21 ఏప్రిల్ 2004 బీబీ నాంచారిని మా-టివి వారు టెలికాస్టు చేసారు. సిరియల్ పూర్తి కాకుండానే స్ఫాన్సర్స్ లేక అది ఆగిపోయింది.

సాక్షర నారీ సభ అంటే. చదువుకొన్న అమ్మాయిల సభ/లేక కవిత్వ పరీక్ష!! ఇలాంటి సన్నివేశాలు మన సాహిత్యంలో ఉన్నాయా? అన్న ప్రశ్న సహజం. దానికి జవాబు “సత్య ఫ్రభ “ అన్న చారిత్రాత్మిక నవలలో ఉంది.

‘ సత్య ప్రభ’ ఆంధ్ర విష్ణు కాలం నాటి చారిత్రాత్మిక నవల. ఈ నవల 1934/1936 కాలం నాటి సాహిత్య మాస పత్రిక ‘భారతి’ లో ‘పూర్ణ’ అనే పేరుతో ప్రచురణ జరిగింది. కాని అసంపూర్ణంగా నిలిచిపోయింది. ఆ తరువాత 1965/1966లలో తిరిగి ‘సత్యప్రభ’ అనే పేరుతో ఆంధ్ర ప్రభ వార పత్రికలో, సీరియల్ గా ప్రచురిపబడి పుస్తకంగా కూడా వచ్చింది. తరువాత ఇంగ్లీషు భాషలో కూడ అనువదింపబడింది. దీనికి మూలకథ వ్రాసినది సామాన్య వ్యక్తి కాదు. అతని పేరు గురుపరంపరలలో ఒకటిగా కీర్తంప బడుతోంది. ‘నాయన’ అని, ‘ముని’ అని ప్రేమగా శిష్యులు పిలుచుకొనే అతని పూర్తి పేరు—‘శ్రీ,శ్రీ.శ్రీ వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని ‘ భారతి సాహిత్య మాస పత్రికలో 1937లోఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. కాని “గణపతి-ముని’ స్వర్గస్థులయి పోవడం వల్ల అది అసంపూర్ణంగా ఉండి పోయింది. శ్రీ గణపతి ముని ఈ నవలకి పెట్టిన పేరు ‘పూర్ణ’! ఆ తరువాత 30 సంవత్సరాలకి అతని కుమారుడు కీ.శే. వాసిష్ట ( అయలసోమయాజుల మహాదేవ శాస్రి ) ఈ నవలని, “సత్యప్రభ” అనే పేరుతో పూర్తి చేసారు. దానిని ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక 1966లో సీరియల్ గా ప్రచురించింది. ఆతరువాత దీనిని శ్రీ గంటి శ్రీరామ మూర్తిగారు ఇంగ్లీషు భాషలో అనువదించారు. ఇంగ్లీషు ప్రతిని Kavya Kantha Bharati—ANAKAPALLE ప్రచురించారు. అదండీ, నచలా రాజమైన సత్య ప్రభ ప్రస్థానం!

కథ:
కృష్ణానదీ తీరంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని ‘సుచంద్రుడనే’ కుండిన వంశ బ్రాహ్మణ రాజు రాజ్య పాలనలో కొన్ని అవక తవకలు చోటుచేసుకొంటాయి. రాజూ కుమార స్వామిలాంటి బల పరాక్రమ వంతుడే అయినా, అతని బలహీనత మహారాణి లీలావతీ దేవి సౌందర్యారాధన! అతనికి తండ్రి ఏర్చికూర్చి చేసిన పట్టమహిషి చారుమతీ దేవి, పట్టాభిషేకానంతరం తాను ప్రేమించి పెళ్లాడిన తరుణి గౌతమ సునందుని కుమార్తె లీలావతి.

ఆమెని పెళ్లి చేసుకొన్నాక సునందుడు మహామంత్రి ఎందుకూ పనికిరాని అతని కుమారుడు వీరనందుడు రాష్ట్రియుడు (పోలీసు శాఖ ముఖ్యాధికారి) అయ్యారు. విధాన నిర్ణయాలు తీసికొనే రాజకులంలో ఏ విషయంమీధ నిర్ణయం చేయాలో ఆ శాఖామంత్రి, (ఉదాహరణకి భూ సంస్కరణల విషయమయితే ఆ శాఖామంత్రి ) మహామంత్రి మరియు మహారాజు కలిసి కూర్చొని శ్రీ ముఖాల ద్వారా నిర్ణయాలని జనాంతికం చేసేవారు. మహారాజు, మాహామంత్రి ఇద్దరు తన వాళ్లే కాబట్టి లీలావతీ దేవి పాలనే పరోక్షంగా నడిచేది.

లీలావతీ దేవి పాలనలో జరిగిన మంచి—‘ స్త్రీల కోసం ఒక గురుకుల స్థాపన! భగవతి శుభ్రాంగి ధానికి కులపతి. అది కాక స్త్రీ-పురుషులిరువురికీ ఆచార్య భవనంది ఆధ్వర్యంలో ఒక శాస్త్ర గురుకులం, ఆచార్య విషమసిద్ధి అధ్వర్యంలో శస్త్రాస్త్ర గురుకులం మొదటినుండి ఉండేవి.

మన కథాకాలానికి ఆ రాజ్యంలో సమస్యలు అధిక పన్నులే కాక ముఖ్యంగా మూడు.

మొదటిది సింహాసన ఉత్తరాధికారి సమస్య! పట్ట మహిషి చారుమతీ దేవి (దివంగతురాలు) కుమారుడు శక్తిధరుడా? లేక లీలావతీ దేవి కొడుకు భోగనాథుడా? సమస్యఎక్కడంటే శక్తిధరుడు , భోగనాథుని కన్న ఆరు నెలలు చిన్నవాడు.అందువల్ల జ్యేష్టుడా? లేక పట్ట మహిషీ పుత్రుడా?ఎవరు అర్హులు అన్నది.

రెండవది సామంత రాజ్యమైన చిత్రకూట రాజ్య న్యాయమైన వారసత్వ సమస్య! వర్తమాన పాలకుడైన వీరేశ్వర భట్టాచార్యుడు అసలైన కుమారుడు కాదని అతడు తన పినతల్లి పెంచుకొన్న కొడుకనీ, సిసలైన రాజపుత్రికనైన తనకే రాజ్యం దక్కాలని శాంతిసేన రాజ ధర్మాసనం ముందు చేసుకొన్న ఫిర్యాదు.

మూడవది చాల భయంకరమైనది, తిరుగుబాటుదారుడైన నిశుంభుడనే నాగకుల వీరుడు మరొక తిరుగుబాటు దారైన ఇరావతి అనే నాగకన్యతో కలిసి పరంతప సంఘమనే సంఘాన్ని (మావోయిస్టు పార్టీ లాంటిది) స్థాపించి రాజ్యంలో భాగం ఇవ్వమని లేకుటే యుధ్ధానికి సిధ్ధం కమ్మని బెదిరించడం.

ఈ మూడు సమస్యలని మన కథానాయిక సత్యప్రభ ఎలా పరిష్కరించింది అన్నదే ఈ నవల లోని కథ. చిత్రాతి-చిత్రమైన మలుపులు, ఊహాతీతమైన సంఘటనలు, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు, సాహిత్య సౌరభాలు గుబాళించే ద్విపద పద్య సంపదలతో, రోమాలు నిక్కబొడిచే కథా కథన శైలితో ఇద్దరు మహానుభావులు తీర్చిదిద్దిన నవలారాజం ఇది!

ఆంధ్ర సాహితీ సరస్వతికే వజ్రాల హారం లాంటి ఈ నవల కథ గురించి, కథనం గురించి, రచయితల గురించి మరిన్ని వివరాలకి పోకుండా, ప్రస్తుత చర్చనీయాంశమైన సాక్షర నారీ సభలోకి నేరుగా ప్రవేశిద్దాం.

[ఈ నవల లోని ఒక చిన్న భాగాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.]
**************************************************
మహారాణి లీలావతీ దేవి పుట్టిన రోజు ఏర్పాటైన సాక్షర నారీ సభలో, పరీక్షార్థులైన కన్యాషట్కంగా కీర్తించబడే కవయిత్రులు ‘సత్య ప్రభ’’ మణిమాల’; ధరణి; మధువాణి; ఫలిని;రథిని; మాత్రమే అయినా వైల్డ్క్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశం పొందుతుంది ‘రాజకాళి’ అనే ఉన్మత్త సిద్ధకవీశ్వరి.ఒక్కొక్కరు పరనారీ పరామర్శమును, ప్రత్యక్షంగా గాని, తాత్పర్యంద్వారా గాని నిషేధిస్తూ రెండేసి ద్విపదలు చెప్పవలెను అని ఉద్ఘాటిస్తుంది భగవతి శుభ్రాంగి. ఏడుగురూ వరుస క్రమంలో లేచి నిలబడి తమ తమ కవితలు గానం చేస్తారు.

సత్యప్రభ —
చల పర నారీ పిశాచికి తనదు వెలగల – హృదయము బలియీయ వలదు
పరి విధముల బోవు భారము చేత – పరిణీత మీరిన ప్రణయము రోత.

మణిమాల..
నర రంభయైనను పర నారి వలదు-తరుణ సోదరులార! దైవంబు కలదు
నీ కాంత విడుచుట నీచమైన పని- ఫై కాంత బట్టుట ఫాపముల గని.

ధరణి…..
నరునకు పరనారి నాశన మాత్ర- స్థిర కళంకము తెచ్చు జీవితయాత్ర
పర సుందరీలోల ఫురుషుడు చేయు – వర ఫుణ్య కర్మ ముల్వరుసగా మాయు

మధువాణి…
ఎగ్గు చేష్ట పరుని ఇల్లాలి ఫాల – తగ్గును మర్యాద దానిచే చాల
నరులెంగిలి భుజింప నగుదురువాడ – పరనారి ఎంగిలి పరికించి చూడ

ఫలిని …..
చోరత ఒక్కని శుభముల బాపు – జారత బాపును జాతుల ఏపు
పర పద్మ లోచనా భజనమ్ము తప్పు – ఫురుషుడా, దానిచే పొసగును ముప్పు

రథిని …..
పరనారి సద్ధర్మ వధశాల సుమ్ము – వరమతీ! పెద్దల వాక్యంబు నమ్ము
ఫిల్లరా చిన్నది పెఱభామ నీకు – తల్లిరా పెద్ధది తలవంఫు తేకు

రాజకాళి …
పై నారి వంచించి పట్టిన కామి – స్నానాలు జఫమూలు సలిఫిన నేమి
పర నారి సోకించు పాపంబు పండి – స్మరుడీశునయనాగ్ని చచ్చెను మండి

పరనారీ పరాజ్ఞ్ముఖుని స్తుతిస్తూ, ఒక్కొక్కొరు ఒక ద్విపదను రచించవలెను అని శుభ్రాంగి ఆదేశించింది.

సత్య ప్రభ……..
చలు చైయజాలదు స్వైరిణి ఎవని – విలసిల్లు వీరుడై యవని.
మణిమాల… అన్య కాంతలఫట్ల అచలుడే మౌని – ధన్యుడు ముదముతో ధర మోయు వాని

ధరణి …
తను గాత్రి నన్యను దలఫని వాడు-జనధాత్రి సద్ర్వత శాలుల రేడు
మధువాణి పర భుక్తమగుచుండు ఫలల పిండంబు – నిరసముగా చూచు నరుడు రత్నంబు

ఫలిని ..
లలితాన్య సతులపై లౌల్యము విడిచి – ఫలితుడైన సుకృతి పద ఫద్మము శుచి

రథిని….
ధర నెందరో ధర్మధారుల కన్న – తరుణు లన్యల యెడ దాంతుడు మిన్న

రాజకాళి……..
కల్లు ద్రావిన గూడ కలుషిగా డతడు – చెల్లెలుగా నన్యు చెలి చూచు నెవడు

ఒక్కొక్క కవీశ్వరి తనకు శ్రేష్టంగా తోచిన ధర్మాన్ని భోదిస్తూ ఒక్కొక్క ద్విఫదను రచించాలి అని ఆదేశించింది శుభ్రాంగి. వారు ఈ విధంగా ఆశువులు అల్లారు.

సత్యప్రభ…..మూడిన విఫదను ముందుండి త్రోలి – నాదుకొన్నతి సేత నరుల ధర్మంబు.
మణిమాల… తూచాలు తప్పక తొలిపల్కు చెప్పు – నాచారమున నిష్ట యమల ధర్మంబు.
ధరణి ….. సభలోన చాటెద సర్వజీవులకు – నభయ ప్రదానమే యధక ధర్మంబు.
మధువాణి…..సత్యమే జగమున నిత్య ధర్మమని -అత్యంత మెరిగిన ఆర్యుల పలుకు
ఫలిని….సర్వభూతంబుల సమబుద్దీతోడ – గర్వంబు వర్జించి కనుట ధర్మంబు
రథిని…. తనువు లోఫల నుండు తనయందు నిల్చి – తనివును మరచుట తల్లి ధర్మంబు
రాజకాళి…. ఆలును బిడ్డల నత్యాదరమున- పాలించుచుండుట పరమ ధర్మంబు

ఎవరికి తోచిన విధాన వారొక్కక్క ద్విపదతో రెండేసి పదార్థాలను జయగానం చేయండి అని మరల ఆదేశించింది.. వారు ఇట్టా కీర్తించారు.

సత్యప్రభ.. కార్యము సాధంచు కత్తికి జయము –మర్యద దాటని మాటకి జయము
మణిమాల… నిరతము ఫనిచేయు నేతకు జయము- నరులు సుఖించెడు నాడుకి జయము
ధరణి…..చిత్తము మెచ్చిన చేతకు జయము—సత్తువ కల్గన శాంతికి జయము.
మధువాణి…..గెలిచిన వీరుని కీర్తికి జయము—నిలిచిన పరపతి నీతికి జయము
ఫలిని…కామము మించిన ప్రేమకు జయము—సామకు మూలమౌ సమతకు జయము
రథిని….అఖిలము నందుండు ఆత్మకు జయము—నిఖిలము మఱచిన నిష్టకు జయము
రాజకాళి…అని గెలిపించెడు ఆటకి జయము—పని నడిపించెడు పాటకు జయము

అని గెలిపించెడి ఆట అంటే ఏమిటి? అని అడిగింది లీలావతి. “మంఢల ప్రచారం” అని బదులిచ్చాడు ఆచార్య విషమసిద్ధి. మహారాజ్ఞి ఏమైనా అడగవచ్చును” అని పల్కింది శుభ్రాంగి, ఆమె ఏమీ అడగలేదు.తిరిగి ఇలా అడిగింది శుభ్రాంగి. అనురక్త రమణిని నధికరించి ఒక్కొక్క రొక్కక్క ద్విఫదను రచించండి. వారు ఇలా గానం చేసారు.

సత్యప్రభ- సన్నుత రతిభావ సౌమ్య రమ్యాంగి – కన్నుల ఫండుగ వెన్నెల భంగి!
మణిమాల- అనురక్త చిత్తకు అక్షిసన్మణికి—జనులార! సుఖ కోటి సాటియే సతికి.
ధరణి- నగుమోము గల చాన నల్లనిదైన—మగనికి లోకాన మరుఫాలవాన.
మధువాణి- ప్రేమ ప్రసన్నమౌ ప్రేయసి ముఖము –శ్యామ చిహ్నము లేని చంద్ర మండలము.
ఫలిని- ప్రేమ మనంబున పెరిగిన చాలు—కామిని కన్నులు కమల దళాలు.
రథిని-ధుమ ధుమలాడని రమణి ముఖంబు- ఘుమ ఘుమలాడెడు కనకాంబుజంబు.
రాజకాళి- పిలిచిన వెంటనే ప్రీతితో పలుకు– నళిన దళాక్షియే నాకంబు మనకు.

శ్రీ వారేమైన అడుగ వచ్చును”, అని లీలావతి భర్త ముఖాన్ని చూచి అన్నది. “ ఇప్పుడు దేశానికి ఏమి కావాలోఒక్కొక్క రొక్కొక్క ద్విపదతో నిర్దేశించి చెప్పండి.” అని మహారాజు కోరాడు. మహారాజు వాంఛానుసారం వారు ఈ విధంగా సూచించారు.

సత్యప్రభ – ధనువున దొంగల దండన చేసి—ధనమును నిలబెట్టు ధన్వి కావలెను.
మణిమాల- జన పీడకుల దొంగజాడల గనుచు—జనపతికి వచించు జనుడు కావలెను.
ధరణి- అందరి మతముల కైక్యము గూర్చు—మందును కనిపెట్టు మౌని కావలెను.
మధువాణి – అహి భయమార్పగ నధ్వను జూపి—మహిపతి నడిపించు మంత్రి కావలెను.
ఫలిని – మగవారి నెచ్చించి మాటల చేత—పగవారి గెలిపించు పడతి కావలెను.
రథిని – మెరిసెడి లోపలి మెఱుపుపై సరిగ– గురి చూప గల్గిన గురువు కావలెను.
రాజకాళి- ఆడుచు పాడుచు నందరిలోన—వేడిని చల్లార్చు వేశ్య కావలెను.

ఇక ఒక్కొక్క రొక్కొక్క ద్విపదతో మంగళగానము చేసి సభను ముగించండి. అని శుభ్రాంగి చెప్పగా వారు ఇలా గానం చేసారు.

సత్యప్రభ – అమరుల నాథుడౌ హరికి మంగళము-సమర మహాశక్తి శచికి మంగళము.
మణిమాల- పతిదేవు నర్చించు సతికి మంగళము-సతి నాదరించెడు పతికి మంగళము.
ధరణి- మనలను పాలించు మహికి మంగళము-జన సమృద్ధంబైన సభకు మంగళము.
మధువాణి- మనుజులలో నుండు మతికి మంగళము-కనకాంధ్ర సాహిత్య కళకు మంగళము.
ఫలిని-పర కష్టహారి భూపతికి మంగళము-సరస విలాస తత్సతికి మంగళమ.
రథిని-దివి నుదయించెడి రవికి మంగళము- భువి నుదయించెడి కవికి మంగళము.
రాజకాళి-లోకాన జీవించు మీకు మంగళము- శ్లోకాలు రచియించు మాకు మంగళము.
********************************************
-అదండీ! సాక్షర నారీ సభ! ఈ నవల దురదృష్టవశాత్తు ఇప్పుడు లభ్యం కాదు. దీనిని ఈబుక్ గా తీసుకొనిరావడం మంచిదేమో ! ఎవరైనా పూనుకొంటే నా వంతు సహాయం నేను చేయడానికి ఎల్లప్పుడూ తత్పరుడనై ఉంటాను.

You Might Also Like

6 Comments

  1. Jagannadha rao annapantula

    Sir,
    evarainaa satya prabha navala net lO peTTagalaraa? maa pinni gaaru chaalaa rOjulai ee navala kaavaalani aDugutunnaaru.

    – Jagannadharao Annapantula

  2. అనిల్

    ఈ బుక్ ఆలోచన బాగుంది.

  3. గంటి లక్ష్మీ నరసింహమూర్తి

    అవును, చౌదరిగారూ, మీఅభిప్రాయం సరియైనదే.ఆంధ్రప్రభ వారపత్రికలో 17-6-64 నుండి 2-12-64 వరకు సీరియల్ గా సత్యప్రభ ప్రమురించ బడినది.భారతి లో సీరియల్ గా వచ్చింది పూర్ణ.మీరు చెప్పినట్తుగా బెైండింగు చేసుకొని భద్రపరచు కొనే ఆలవాటు ఉండబట్టే ఈ నవల ఇప్పటి వరకూ లభ్యమవుతున్నది.కీ.శే.ఏటుకూరి బలరామమూర్తిగారు అలా భద్రపరచిన పుస్తకం మొన్నటి వరకూ నా దగ్గరే యుండేది.ఇప్పడు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భరతీ స్వామి(కుర్తాశం పీఠాధిపతి గారి వద్ద నున్నది.మీకు ఇంగ్లీషు లో సున్నది కావాలంటే నేను మీకు పంపగలను(ఉచితంగానే)-మూర్తి

  4. జంపాల చౌదరి

    సత్యప్రభ నవలను నా చిన్నతనంలో ముందు సీరియల్‌గా (భారతిలో అని భ్రమపడేరు, ఆంధ్రప్రభలో), ఆ తరువాత సీరియల్ను చింపి చేసిన బైండు పుస్తకంగానూ చదివిన జ్ఞాపకం (అప్పట్లో, బాగున్న సీరియల్స్‌ని, కథల్నీ, వ్యాసాల్నీ బైండు చేయించి దాచుకొనేవారు). ఆ రోజుల్లో చాలా ఉత్కంఠని కల్గించిన ఈ పుస్తకంకోసం తర్వాత ప్రయత్నించాను కాని మళ్ళీ దొరకలేదు.

    ఈమధ్య ఎంబీఎస్‌ప్రసాద్ ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా పరిచయం చేశారు ఏడుభాగాల వ్యాసంగా: http://telugu.greatandhra.com/mbs/august/andhra_part1.php3

    ప్రసాద్‌గారు ఈ పుస్తకం 1964లో సీరియల్‌గా వచ్చిందన్నారు. ఇక్కడ అయల శ్రీధర్‌గారు 1966లో అంటున్నారు. నా జ్ఞాపకం ప్రకారం 1964 (నేను ఏడోక్లాసులో ఉండగా) అనే అనిపిస్తుంది.

  5. గంటి లక్ష్మీ నరసింహమూర్తి

    అయల శ్రీధర్ గారి సత్యప్రభ నవలని గురించి వివరణ చాలా బాగుంది.నా సోదరుడు కీ.శే.డా.గంటిశ్రీరామమూర్తి ఆంగగ్లములోనికి తర్జుమా చేసిన నవల ఇప్పుడు 4లేక5 కాపీలు మాత్రం నా దగ్గర ఉన్నాయి.తెలుగులో ఒకటిలేక రెండు కాపీలు హైద్రాబాదు గ్రందాలయము లలో ఉన్నాయి.ఈ రెండింటిని మరలా పునర్ముద్రించవలసి యుంది.విశాలాంధ్ర వారు పర్మిషను ఇస్తానన్నారు.ఇప్పడు నేను”సత్యప్రభ నవలలో ద్విపదలు” సేకరించి ముద్రణకు సిద్దం చేసి ఉంచాను.శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతి స్వామీజీ గారి ఆమోద ముద్ర పడగానే ప్రచురిస్తాను.నాయన గారి గురించి ఇంకా ఏమైనా విషయములు తెలుసుకోవాలనుకొంటె నా e-mail కి కాని ఫోనులో కాని సంప్రదించ వచ్చును.ఫోను నం.08026482744.e-mail lnmganti@yahoo.com-మూర్తి

  6. కొత్తపాళీ

    చాలా బావుందండీ.

Leave a Reply