ప్రాకృత వాఙ్మయంలో రామకథ – తిరుమల రామచంద్ర

raamacamdra3“ప్రజలే ప్రకృతులు.వారి భాష ప్రాకృతం.ఈ ప్రాకృతం అప్పటి మేధావులు చేసిన మార్పుతో – సంస్కారంతో సంస్కృతమయింది. ఈ సంస్కారం వేదాల ఆవిర్భావానికి ముందే జరిగింది. సంస్కృత ప్రాకృతాలు రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందాయి.

ఈ ప్రాకృతంతో మనకు గల సంబంధం దాదాపు మూడు సహస్రాబ్ధాల నాటిది. మనకు బౌద్ధ జైనాలతో కలిగిన ఘనిష్ట సంబంధంతో తెలుగు ప్రాకృతాల మధ్య పరస్పరం ఆదాన ప్రదానాలు జరిగాయి. ఈ భాషలు రెండూ జన్యజనక సంబంధం కలవా అన్నంతగా కలిసిపోయాయి.”

పై ఉద్దేశాలు ప్రాతిపదికగా, సత్యమే లక్ష్యంగా, భాషా శాస్త్రం పట్ల వైజ్ఞానిక దృక్పథంతో డా. తిరుమల రామచంద్ర గారు, భారతి పత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.

పై విషయాలనే ఆరుద్ర గారు కూడా తమ సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటిలో, అమరావతీ స్థూపం వద్ద దొరికిన రాతిపలకలోని తొలి తెలుగు మాట “నాగబు” అన్న పదం వివరణతో ఆరంభించి, సాకల్యంగా చర్చించారు.

“జనని సంస్కృతంబు సకల భాషలకును” అన్న వాదన అశాస్త్రీయమని, భాషా శాస్త్రం విషయంలో అనులోమ, ప్రతిలోమాలు సహజమని తిరుమల రామచంద్ర గారు ఈ పుస్తకంలో అనన్య రీతిలో ప్రస్తావిస్తారు. నిజానికి ఈ ప్రాతిపదిక, ఇప్పటిది కాదు. హాలుడి గాథా సప్తశతిలో తెలుగు పదాలు, క్రీ.శ్. ౫ వ శతాబ్దపు కుమారిల భట్టు, ఆ తర్వాత ఆచార్య హేమచంద్రుడి “దేశీ నామాల” నిఘంటువు దీనికి ఆధారం.

ఈ పుస్తకంలో నవరత్నాల వంటి ౯ అద్భుత వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కటీ చూద్దాం.

౧. ప్రాకృత వాఙ్మయంలో రామకథ
ఈ వ్యాసంలో ప్రాకృత సాహిత్యంలో రామకథ బౌద్ధ,జైన, వాల్మీకి సాంప్రదాయానుసారులుగా, మూడు విభిన్న రీతులలో కొనసాగిన వైనాన్ని వివరిస్తారు. ఏ దైనదుర్విపాకమో, ఏ బుద్ధి జాడ్య జనితోన్మాదమోగాని, బౌద్ధ జైన సాహిత్యాలు వాల్మీకి రామాయణ సుధాస్వాదన వంచితాలయాయని వాపోయారు, రామచంద్ర గారు.  ఈ వ్యాసంలో రచయిత ఆయా బౌద్ధ జైన రామాయణ గాథలను పరిచయం చేయడమే కాక, స్థాలీపులీకంగా అక్కడక్కడా ప్రాకృత పద్యాలను, సంస్కృత అన్వయాన్ని విశదీకరించారు. భాషాభిమానులకు, వివిధ రామాయణాలపై ఆసక్తి ఉన్న వారికీ చక్కటి ఉపకరణం ఈ వ్యాసం.

౨. వజ్జాలగ్గంలో తెలుగు పదాలు :

వజ్జాలగ్గం హాలుని గాథా సప్తశతి లాంటి ప్రాకృత గాథా సంకలనం. దీని రచయిత శ్వేతాంబర జైనుడయిన జయవల్లభుడు. ఈ వ్యాసంలో రామచంద్ర గారు ప్రస్తుత తెలుగు పదాలకు మూల రూపమైన ౨౩ శబ్దాలను పరిచయం చేసి, వాటి సందర్భాన్ని తెలుపుతూ, ఆ పదాలు సంస్కృత తద్భవాలు అన్న వాదనను, పూర్వపక్షం చేస్తారు. వీటిలో కొన్ని పదాలు, “వింతర”,”ఓ”,”ఆవట్టయే,”విసూరణం” వగైరా..

ఉదాహరణ : ” గగ్గర

తే ధణ్ణా గురుణియం
బబింబ భారాలసాహి తరుణీహిం
ఫురియాహర దర గగ్గర
గిరాహి జే సంభరిజ్జంతి

(తే ధన్యా గురునితంబ
బింబ భారాలసాభిః తరుణీభిః
స్ఫురితాధర దర గద్గద
గీర్భిః యే సంస్మర్యంతే)

పెద్ద నితంబాలతో మందగమనం చేస్తున్న అందమైన స్త్రీలు పెదవులు కదిలిస్తూ కొద్దిగా గరగరలాడే గొంతులోనే స్మరించే పురుషులు ధన్యులు.

“ఈ గగ్గర తెలుగు పదమని భావిస్తున్నాను. గొంతు గరగరలాడుతున్నది అని ప్రయోగం. ఈ గరగరే గగ్గరగా ప్రాకృతంలో ప్రవేశించి ఉంటుంది. గర + గర గగ్గర.

౩. ప్రాకృత ప్రకృతి :

రామచంద్ర వారి ఎన్నో అద్భుత వ్యాసాలలో ఒకానొక ఆణిముత్యం ఈ వ్యాసం (కథ). జీవిత సంఘర్షణలో భాగంగా ధృవ ప్రాంతపు ఆర్యుల ప్రస్థానం దక్షిణ దిశగా, అటు మధ్య ప్రాచ్యం వైపు, ఇటు భారత దేశం వైపు మళ్ళిన వైనాన్ని, వేదాలలోని ఋక్కుల సహాయంతో, అత్యద్భుతంగా వివరించారు రామచంద్ర గారు. ఇంతటి గహనమైన విషయాన్ని, ఓ వ్యక్తి కథ చెబుతున్నట్టుగా, అక్కడక్కడా చక్కని వేద మంత్రాలను ఉటంకిస్తూ, వాటి వెనుక భావాలను వివరిస్తూ ఉత్కంఠ భరితంగా చెప్పడం కేవలం ఈ రచయితకే చెల్లిందేమో.

ఓ దృష్టాంతం.

“మా గమనం-పయనం మరి కొంత కిందికి సాగింది. ధృవనక్షత్రం సప్త ఋషులతో పాటు మరికొన్ని నక్షత్రాలు కనిపించాయి.ఉషస్సు కాంతి సన్నగిల్లింది. అదిగో! అదిగో! ఆశ్చర్యం! ఎరుపు పసుపు కాంతుల పెద్ద బిళ్ళ వంటిది కనిపించింది. నిండుగా ఉంది. తరిగిపోవడం లేదు. కొంతకాలం కనిపించి,కొంతకాలం కనిపించక పోతున్నది.

పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే

అనుకున్నారు మాలోని ఓ పెద్ద. ఇదొక నిండైన గోళం, ఇటు చూసినా నిండైనదే,అటు చూసినా నిండైనదే. ఈ నిండైన గోళం నుంచి – కాంతి పూర్ణ దివ్య గోళం నుంచి మరల పుట్టే – కొంత కాలం తర్వాత మళ్ళీ కనిపించే గోళం కూడా నిండైనదే.ఆ దివ్య కాంతులీనే గోళం నుంచి ఇక మీద పుట్టే – కనిపించే గోళం కూడా నిండుగానే ఉంటుంది.”

ఈశావాస్యోపనిషత్తులోని పై శ్లోకానికి, పారభౌతికార్థంలో కాక, సూర్యుడనే గోళం నుంచి చంద్రుడనే గోళం ఉదయిస్తున్నదని – రమణీయంగా కల్పన చేయడానికి బహుశా మరే రచయితా సాహసించి ఉండరు.

ఈ వ్యాసం చదివిన తర్వాత వేదాలు, కేవలం వర్ణ వివక్షను నూరిపోసే పాఠాలనో, ఓ ఆటవిక జాతి ఆలోచనలకు దర్పణాలనో అనుకునే వారికి కనువిప్పు కలుగకపోయినా, వారి ఆలోచనలను పునఃశ్చరించుకునే అవకాశం కలుగుతుంది అనడంలో సందేహం లేదు..

౪.తెలుగు ప్రాకృతాల సంబంధం :
సంస్కృతం అపభ్రష్టమై ప్రాకృతమయిందన్న సిద్ధాంతం అశాస్త్రీయమని, ప్రజల నిత్య వ్యవహార భాష ప్రాకృతమే సంస్క్రరింపబడి సమాజంలో ఉన్నత వర్గాల సొమ్మై, కాలం మారినా పొల్లు పోక, రక్షితమయిందని రామచంద్ర గారి, ఇంకా అనేకుల శాస్త్రీయ ప్రతిపాదన. సంస్కృత, ప్రాకృతాల సంబంధాన్ని, వైదిక భాషలో ఉన్న ప్రాకృత శబ్దాలను వివరిస్తూ, సోదాహరణంగా వివరించారీ వ్యాసంలో.

అంతే కాక, కొన్ని శబ్దాలు దేశీ పదాలని, అవి ఆయా ప్రాంతాలకు సంబంధించిన పదాలని, పాలీ ప్రాకృతంలో తెలుగు శబ్దాలు చేరి ఉండవచ్చునని కూడా రామచంద్ర గారు ఊహిస్తూ, ఓ ఆయా శబ్దాల పట్టికను మరికొందరు విద్వాంసుల సహాయంతో రూపొందించారు. అంతే కాక ప్రాకృత భాష ప్రస్థానం నన్నయ కాలం వరకు రూపు దాల్చిన తీరు ఈ వ్యాసంలో సోదాహరణంగా వివరించబడింది.

౫.అపభ్రంశ వాఙ్మయ పరిచయం :
అపభ్రంశం అంటే దిగజారిన అని అర్థం. అపభ్రంశ భాష అంటే శిష్టేతర భాష, అపాణినీయమైన భాష అని అర్థం. ఆ భాషలో కృషి చేసిన వారు జైనులు. వారి గురించిన సంగ్రహ చర్చ ఈ వ్యాసం.

౬.తెలుగు దేశంలోని బౌద్ధ శాఖలు :
బుద్ధుడి మహాపరినిర్వాణానంతరం బౌద్ధం లో వివిధ శాఖలు (థేర వాదం, మహా సాంఘికం) బయలుదేరాయి. అవి ఉపశాఖలై, విస్తరించి, ఎన్నెన్నో రూపాలు దాల్చాయి. ఆంధ్ర దేశం ఒకప్పుడు బౌద్ధానికి పట్టుగొమ్మ. అప్పటి ఆంధ్ర దేశంలో బౌద్ధం తీరు తెన్ను ఈ వ్యాసోద్దేశం.

౭.బౌద్ధ సాహిత్యం : ఆంధ్ర బౌద్ధాచార్యులు :
పై వ్యాసానికి అనుబంధంగా, నాగార్జునుడు, ఆర్యదేవుడు, అశ్వఘోషుడు, దిజ్ఞాగాచార్యుడు వంటి వివిధ బౌద్ధ కవులు, వారి సాహిత్యం మీద ఈ వ్యాసం.

౮ జిన వల్లభుడి మహావీర స్వామి స్తోత్రం :
కన్నడ, తెలుగు, సంస్కృతాలలో లభించిన గంగాధర శాసనం కారణంగా, ఓ గొప్ప తెలుగు కవి ఆనవాళ్ళు లభించాయి. ఆయన పేరు జినవల్లభ సూరి. ఈ శాసనాన్ని డాక్టర్ నెలటూరి వెంకట రమణయ్య గారు పరిష్కరించారు. ఇతని రచన ఒక్కటే లభించిందట. దీనిని తెలుగు విద్వాంసులకు పరిచయం చేస్తూ, ఈ వ్యాసం రాశారు. మహావీర స్వామి స్తోత్రం, తాత్పర్యమూ ఈ వ్యాసంలో చెప్పారు రామచంద్ర గారు.

౯.దేశీ నామమాలలోని తెలుగు పదాలు :
చెరుకూరి నారాయణ రావు గారి సంస్కృత, ప్రాకృత జన్యజనక సిద్ధాంతాన్ని ఆక్షేపిస్తూ, ఆయనతో చర్చలో భాగంగా ప్రాకృతంలో చేరిన అనేక శబ్దాలను ఉటంకిస్తూ, ఓ రోజు అప్పటి మదరాసు లోకల్  ట్రైనులో వారిద్దరి మధ్య జరిగిన సంవాదం యొక్క సంగ్రహం ఈ వ్యాసం. చాలా చక్కటి వ్యాసమిది.

********************************************************
Prakrita Vangmayam lo Rama katha – Tirumala Ramachandra
ఈ పుస్తకం ప్రాకృత అకాడెమీ, బరోడా బాంకు కాలనీ, న్యూ బాకారం, హైదరాబాదు వారి ముద్రణ. (1992). వెల ౩౦/-

ఇది వరకు ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరికేది. ఇప్పుడు దొరకడం లేదు.

భాషాభిమానులు, ముఖ్యంగా తెలుగు భాషా ప్రేమికులు తప్పక చదవవలసినదే కాక, దాచుకుని భావి తరాలకు  అందించవలసినది ఈ పుస్తకం.

********************************************************

You Might Also Like

9 Comments

  1. pavan santhosh surampudi

    ఈ పుస్తకాన్ని అంకితమిచ్చిన తీరు నా హృదయాన్ని చాలా బాధ పెట్టింది. సరిగ్గా నేను పుట్టిన నెలలోనే పుట్టిన రామచంద్రగారి మనవరాలు ఆపైన రెండేళ్లకే మరణించింది. ఆ పాప చిన్నప్పటినుంచి బాగా చురుకుగా ఉండేదట. ఏడాదిన్నర వయసులో దొడ్లో పూలతో ఆడుకుంటున్న పిల్ల ఏదో తనలో తానూ పాడుకుంటోందిట. ప్రాకృత పదాలు వినిపిస్తున్నాయేమిటా అని రామచంద్ర గారు జాగ్రత్తగా వింటే జాతక కథలలోని ప్రాకృతం, సంస్కృతం కలగాపులగంగా నోరు తిరిగీ తిరగని రీతిలో పాడుకుంటున్నట్టుగా వినిపించిందట. దిగ్భ్రాంతుడై ఆయన “ఏ భాషమ్మా పాపా?” అంటే “పాళీ” అని సమాధానం చెప్పిందట. తన చెవులు తానె నమ్మలేక ఏ భాష? అని మళ్ళీ అడిగితే వీడేంటి ఆట చెడగొడుతున్నాడు అన్నట్టుగా చిరాకుతో “పాళీ తాతా” అని తన పాట తానూ కొనసాగించింది అట. ఇది ఇంట్లొ వాళ్లకు చెప్తే నమ్మకున్నా గౌరవంతో విన్నారట. ఇదంతా చెప్పి రెండేళ్లకే కాన్సర్ తో మరణించిన మనవరాలికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. అది చదివి చాలాసేపు బాధపడ్డాను. మా రామచంద్రగారు చెప్తే ఇంట్లొ వాళ్ళు నమ్మకపోవచ్చు గానీ నేను నమ్ముతున్నాను.

  2. Ravindranath tagore

    nagabu ane padam tholi telugu padamani amaravathi sthupampina kanugonna mahaniyudi peru kosam vedikanu dorakaledu.dayachesi aa vivaralu kuda prachurinchagalaru.

  3. రవి

    లక్ష్మన్న గారు,

    వ్యాఖ్యకు నెనర్లు.మీరు ఉటంకించినవి గొప్ప రచనలు. మరపు రాని మనీషులు ఈ మధ్యనే విడుదల అయ్యిందనుకుంటాను. చాలా ప్రయత్నం తర్వాత నాకు విశాలాంధ్రలో దొరికింది. మీ సమీక్ష కోసం ఎదురు చూస్తుంటాను.

    రవి

  4. విష్ణుభొట్ల లక్ష్మన్న

    తిరుమల రామచంద్ర గారి ఆఖరి రచన ‘హంపీ నుంచి హరప్పా దాకా’. ధారావాహికంగా ‘ఆంధ్ర ప్రభ ‘ వార పత్రికలో ప్రచురింపబడి, అజో-విభొ ఫౌండేషన్ వారిచే రెండు ముద్రణలు పొందిన గొప్ప పుస్తకం. వీరిదే మరొక అరుదైన పుస్తకం ‘మరపురాని మనీషి ‘ పుస్తకం. 1960 ప్రాంతాల్లో విశ్వనాథ, దేవులపల్లి, గుర్రం జాషువా, కాశీ కృష్ణాచార్యులు వంటి తెలుగు తేజో మూర్తులను ఇంటర్వ్యూ చేసి, అరుదైన ఫొటోలతో ఉన్న పుస్తకం ఇది. సమయం దొరికితే సమీక్షించాలని ఉంది.

    లక్ష్మన్న

  5. రవి

    రాకేశ్వర రావు గారు,

    సరిచేయబడింది.

    నెనర్లు,
    రవి.

  6. రాకేశ్వర రావు

    మీరు ఏ కీబోర్డు వాడతారు ? జ్ఞ(jña) కి బదులుగా ఙ్ఞ(ṅña) వ్రాస్తున్నారు. ఈ రెండవది (ṅña) పలకడం కూడా అసాధ్యం(అంటే మామూలు జనాలకి). ఉదాహరణకు మీరు వ్రాసిన కొన్ని పదాలు – వైఙ్ఞానిక, దిఙ్ఞాగాచార్యుడు.

    అలానే వాక్ + మయము = వాఙ్మయము (అనునాసిక సంధి కద). మీరు దానికి కూడా వాఙ్ఞ్మయం (vaaṅñmayamu) అని వ్రాసారు. ఆ మూడు అనునాసికాలు అలా వఱుసగా చదవడం కూడా అసాధ్యం.
    మీరు అతికించిన బొమ్మలో వున్నట్టుగా సరిఁజేయగలరు.

    మీ
    రాకేశ్వర రావు

  7. రవి

    అసూర్యంపశ్య గారు,

    లైబ్రరీలలో దొరకవచ్చు. తిరుమల రామచంద్ర గారి “హంపీ నుంచి హరప్పా దాక” తర్వాత జన బాహుళ్యానికి దగ్గరయారనుకుంటాను. అంతకు ముందు ఆయన పుస్తకాలు కొన్ని “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” , “నుడి-నానుడి” వంటివి బాగా పేరొందినవి ఐనా, కేవలం భాషాభిమానులకు మాత్రం పరిమితమైనవని నా ఊహ.

  8. అసూర్యంపస్య

    లైబ్రరీల్లో కూడా దొరకదంటారా? 🙁
    తిరుమల రామచంద్ర గారి గురించి వినడమే కానీ, ఎప్పుడూ వారి పుస్తకాలు చదవలేదు…. “నుడి-నానుడి” అన్న పుస్తకం మాత్రం ఓసారి ఎక్కడో కాసేపు తిరగేశాను.
    మీ పరిచయానికి ధన్యవాదాలు.

    1. pavan santhosh surampudi

      లైబ్రరీలలో దొరుకుతోంది. శాఖా గ్రంథాలయాల్లో సైతం ఈ పుస్తకం దొరుకుతోంది.

Leave a Reply