రక్తరేఖ – గుంటూరు శేషేంద్ర శర్మ

“రక్తరేఖ” (Rakta Rekha) అలియాస్ “The arc of blood” అన్న పుస్తకం గుంటూరు శేషేంద్ర శర్మ ఆలోచనల సమాహారం. అది ఒక విధంగా చూస్తే పుస్తకం పై రాసినట్లు, “poet’s notebook”. ఆయన డైరీలోని వాక్యాలని యధాతథంగా ప్రచురించారు. గుంటూరు శేషేంద్ర శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయడం అనవసరమే అయినా, కొంతవరకూ ఆయన లో ప్రొఫైల్ లో ఉండేవారని నాకు అనిపిస్తుంది. కనుక, చిన్న సైజు పరిచయం చెబుతాను, నాకు తెలిసినంతలో. ఆయన పండితుడు, కవి, తత్వవేత్త, విమర్శకుడు, పరిశోధకుడు అన్నింటికీ మించి గొప్ప మేధావి. సంస్కృతాంధ్ర భాషల్లోని పురాణాలను, కావ్యాలనూ, ఇతిహాసాలనూ క్షుణ్ణంగా అభ్యసించారు. ప్రపంచ సాహిత్యాన్ని చదివారు. ఆయన డైరీ చదువుతూ ఉంటే ఉర్దూపై కూడా మంచి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. “నా దేశం, నా ప్రజలు” అన్న ఈయన పుస్తకం నోబెల్ సాహిత్య పురస్కారానికి కూడా నామినేట్ అయింది.

‘రక్తరేఖాలో ఆయన ఎన్నో విషయాలని గురించి తన భావాలను రాసుకున్నారు. “భూమధ్య రేఖ గుండా రంధ్రం తవ్వితే ఎలా ఉంటుంది?” వంటి ఆలోచనలు మొదలుకుని, ఉపమాలంకారం-సింబాలిజం గురించిన సోదాహరణమైన చర్చ, అక్కడక్కడా కవిత్వం, పాశ్చాత్య సాహితీకారులపై అభిప్రాయాలు, తాత్విక చింతన, పురాణాల గురించిన చర్చలు, నేటి కవిత్వం గురించి అభిప్రాయాలు, కవిత్వ స్వభావం గురించిన భావాలు, తాను ఎక్కడికో వెళ్ళినప్పటి అనుభవం, ఎవరినో కలిసిన ఉదంతం – ఒకటని చెప్పే వీలు లేకుండా, ఒకదాన్ని వదిలేసారనే వీలు కూడా లేకుండా ఎన్నో విషయాల గురించి ఆయన అభిప్రాయాల సమాహారం ఈ పుస్తకం. ఈయన భాషలో అక్కడక్కడా క్లిష్టత ఉంది. కానీ, అంత లోతైన భావాలను భాషలో ఆమాత్రం క్లిష్టతైనా లేకుండా వాక్యాల్లో పెట్టడం అసంభవమేమో అనిపించింది. శేషేంద్ర శర్మ గారితో నా తొలి పరిచయం నేను చదివిన ఒకటీ అరా కవితల ద్వారా. తరువాత, “కాలరేఖ” సాహిత్య వ్యాస సంకలనం ద్వారా. ఇప్పుడు ఈ “రక్తరేఖ” ద్వారా. ఒక్కో అడుగులో ఆయనలో భిన్న కోణాన్ని చూశాను. రక్తరేఖలో ఏం చూసానంటే చెప్పడానికి మాటలు రానంత భిన్నమైన కోణాల్ని ఒకేపుస్తకంలో చూసాను. ఇది చదివాక, ఈ పుస్తకం “ప్రస్తావన” లో శేషేంద్ర శర్మ గారి గురించి రాయబడ్డ వాక్యాలూ, అక్కడ ఉదహరింపబడ్డ ఆయన కవిత్వమూ (పద్యాలు కూడా ఉన్నాయి కానీ, ఆ భాష నాకు అర్థం కాదని వదిలేశాను) – చూశాక నాకు ఆయన్ని మరింత చదవాలన్న కుతూహలం కలిగింది.

ఈ పుస్తకం గురించి నాకు కంప్లైంట్లు కూడా ఉన్నాయి. డైరీని యధాతథంగా ప్రచురించడం దేనికి? కాస్త ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అన్నది మొదటి సందేహం. ఎందుకంటే, కొన్ని కొన్ని రెండు మూడు సార్లు వచ్చాయి. ఒకే పేజీలో కొన్ని ఆంగ్లంలోనూ కొన్ని తెలుగులోనూ ఉన్నాయి. ఆంగ్లంలోని వ్యాసాలన్నీ ఒక చోట, తెలుగులోని వ్యాసాలన్నీ ఒక చోట పుస్తకాన్ని రెండు భాగాలుగా వేసి ఉండొచ్చు కదా! అంటే, అదే పుస్తకంలో రెండు భాగాలుగా విభజించి ఉండొచ్చు కదా. అదే విధంగా, రాసిన విషయాలని ఏదన్నా విధంగా విభజించగలరేమో ప్రయత్నించి ఉండాల్సింది. ఒక వైపు అంతరిక్షం గురించి చెబుతూ ఉంటారు. వెంటనే ఒకపక్క ఉపమ గురించి చర్చ వస్తుంది. అది అయీ అవగానే ఒక seperator అన్నా లేకుండా వెంటనే – తాత్వికంగా ఉన్న కవిత్వం మొదలౌతుంది. డైరీ అన్నాక random గానే ఉంటుంది కానీ, జనం చదివేందుకు ప్రచురిస్తున్నప్పుడు ఆ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉండొచ్చేమో. ఇదే విషయం ఈ పుస్తకానికి ఆర్.ఎస్.సుదర్శనం రాసిన ప్రస్తావన లో కూడా అన్నారు.

ఇప్పుడు ఈ పుస్తకం దొరుకుతుందో లేదో అన్నది మరి నాకు తెలీదు. నేను ఒక స్నేహితుడి ద్వారా దొరికిన డెబ్భైల నాటి ఎడిషన్ ను చదివాను.

You Might Also Like

6 Comments

  1. యోగి

    అయ్యో! అసూర్యంపశ్య అంటే రవి అని ఎక్కడో నా బుర్రలో చిన్న mis-mapping. క్షమించాలి 😛

  2. యోగి

    Kasturi garu,

    Your comment makes me wanna read this. I have read Somerset Maugham and some of Tagore’s works. I will somehow get hold of this book and read it.

    Thanks a lot to Ravi for this review and you for the comment 🙂

  3. kasturimuralikrishna

    రక్త రేఖ చాలా గొప్ప పుస్తకం. రచయిత అంతరంగపు లోతులలోకి తొంగి చూసే అవకాశం పాఠకులకు చిక్కుతుంది. ముఖ్యంగా, అడవి నా ముంగిటికి రావాలి, అన్న భావం రచయిత సున్నిత మనస్తత్వాన్ని అతి సున్నితంగా చూపిస్తే, నాకూ, నా కోరికలకూ మధ్య నా దురదృష్టాన్ని పెట్టావు అన్న భావం వచ్చే వాక్యాలు నిరాశోపహతులకు తమలా ఆలోచించేవారింకా వున్నారన్న సాంత్వననిస్తాయి. i rate this book on par with writers note book by somerset maugham. and also stray birds of rabindranath Tagore. it is like a combination of both with an individuality of its own.

Leave a Reply