వ్లదీమిర్ నబొకొవ్ నవల: The Gift (part 1)

(నబొకొవ్ నవల – The Gift గురించిన పరిచయ వ్యాసం మూడు భాగాల్లో ఇది మొదటిది)

దాదాపు నూటనలభయ్యేళ్ళ క్రితం రచయిత్రి జార్జిశాండ్ తన మిత్రుడు ఫ్లొబేర్‌కు పంపిన ఒక ఉత్తరంలో, కళాకారుణ్ణి ముఖ్యపాత్రగా ఊహించి ఒక నవల రాయమంటూ యిలా సలహా యిచ్చింది:

“Try some day to write a novel in which the artist (the real artist) is the hero, you will see what great, but delicate and restrained, vigor is in it, how he will see everything with an attentive eye, curious and tranquil, and how his infatuations with the things he examines and delves into, will be rare and serious. You will see also how he fears himself, how he knows that he cannot surrender himself without exhaustion, and how a profound modesty in regard to the treasures of his soul prevents him from scattering and wasting them. The artist is such a fine type to do, that I have never dared really to do him. I do not consider myself worthy to touch that beautiful and very complicated figure; that is aiming too high for a mere woman. But if it could certainly tempt you some day, it would be worthwhile.”

[“ఎపుడైనా నిజమైన కళాకారుణ్ణి కథానాయకునిగా తీసుకుని నవలొకటి రాయటానికి ప్రయత్నించు. అందులో ఎంత గొప్ప బలం— సున్నితమైన, సంయమనంతో కూడిన బలం— వుంటుందో; అతను ప్రతీ వివరాన్నీ శ్రద్ధగల కంటితో కుతూహలంగా, ప్రశాంతంగా ఎలా పరికిస్తాడో; తాను పరిశీలించే, నిమగ్నమయ్యే విషయాల పట్ల అతని వ్యామోహాలు ఎంత అపురూపంగా, గంభీరంగా వుంటాయో నీకు అర్థమవుతుంది. అంతేకాదు; తల వొగ్గడమంటూ జరిగితే శూన్యమై మిగులుతాడన్న సంగతి యెరిగి తనకు తానే ఎలా జడుస్తాడో, తన ఆత్మలోనున్న సంపదల పట్ల అతనికి వుండే గొప్ప అణకువభావం వాటిని వెదజల్లి వృథా కానీయకుండా ఎలా ఆపుతుందో నువ్వు చూడగలుగుతావు. ఇంత చక్కని పాత్ర కాబట్టే నేనెన్నడూ కళాకారుణ్ణి చిత్రించే సాహసం చేయలేదు. ఆ అందమైన, సంక్లిష్టమైన మూర్తిని తాకేందుకు అర్హురాలిగా నన్ను నేను పరిగణించుకోవటం లేదు; అది ఒక స్త్రీ పరిధికి అందని ఎత్తు. కానీ నీకేనాడైనా ఆసక్తి కలిగించగలిగితే, అది ప్రయత్నయోగ్యమే అవుతుంది.”]

ఇది చదవగానే, ఫ్లొబేర్‌ ఈ ప్రయత్నం ఎప్పుడూ ఎందుకు చేయలేదోనన్న కుతూహలం కలిగింది. అయితే పేజీ పూర్తిగా తిరగేయకుండానే బహుశా ఎలాంటి సమాధానమిచ్చి వుంటాడో ఊహకి అందేసింది. తిరగేసి చదివాక అదే నిజమైంది:

“I don’t agree with you that there is anything worthwhile to be done with the character of the ideal artist; he would be a monster. Art is not made to paint the exceptions, and I feel an unconquerable repugnance to putting on paper something from out of my heart. I even think that a novelist hasn’t the right to express his opinion on any subject whatsoever. Has the good God ever uttered it, his opinion? That is why there are not a few things that choke me which I should like to spit out, but which I swallow. Why say them, in fact! The first comer is more interesting than Monsieur Gustave Flaubert, because he is more general and there fore more typical.”

[“ఆదర్శ కళాకారుని పాత్రతో ఏదైనా యోగ్యమైనది సృష్టించగలమనే నీ అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను; వాడో మృగం అవుతాడు. కళ మినహాయింపుల్ని చిత్రీకరించటానికి కాదు; అంతేగాక, నాకు నా హృదయంలోంచి ఏదైనా వెలికి తీసి కాగితంపై పెట్టాలంటే భరించలేని వెగటుపుడుతుంది. ఒక నవలాకారునికి ఏ విషయం మీదా సొంత అభిప్రాయాల్ని వెల్లడించే హక్కు లేదని కూడా నేను నమ్ముతాను. దేవుడెపుడైనా ప్రకటిస్తాడా సొంత అభిప్రాయాల్ని? అందుకే, బయటకు వెళ్ళగక్కితీరాలనిపించేంతగా చాలా విషయాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, నేను దిగమింగుకుంటాను. అసలెందుకు వాటిని చెప్పడం! దారిన తారసిల్లే మొదటి ఆసామీ ఎవ్వడైనా శ్రీమాన్ గుస్తావ్ ఫ్లొబేర్‌ కన్నా ఆసక్తికరమైనవాడే. ఎందుకంటే వాడు నాకన్నా సాధారణమైన వ్యక్తి, కనుక ఓ మూసకు ప్రతినిధి”]

కాస్త కదిపితే చాలు, యిలా ఆదర్శవంతమైన కళ గురించి తాను నమ్మిన సిద్ధాంతాలన్నీ ఏకరువు పెట్టడం ఫ్లొబేర్‌‌కు అలవాటనుకుంటా. ఇది అతని ఉత్తరాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే దీనికి అతణ్ణి మన్నించేయవచ్చు. ఎందుకంటే ప్రపంచసాహిత్యంలో వచన రచనను “ఫ్లొబేర్‌‌ ముందు”, “ఫ్లొబేర్‌ తరువాత” అని రెండు విభాగాలుగా వర్గీకరించవచ్చు. రాసినవి మూడు నవలలే అయినా అవి అంతటి మార్పు తీసుకొచ్చాయి; ఆధునిక నవలా ప్రక్రియకు ఒరవడి దిద్ది మార్గదర్శకాలుగా నిలిచాయి (ముఖ్యంగా “మేడామ్ బొవరీ”). ఉన్నట్టుండి కమ్ముకున్న మార్పు ప్రభావం ఎపుడూ బలంగానే వుంటుంది; కనీసం తన ఆకస్మిక ధోరణి వల్లనైనా సరే. కానీ ఆ మార్పు నిలదొక్కుకోవాలన్నా, దాని ప్రభావం అటుపిమ్మట కొనసాగాలన్నా, ఒక్కోసారి దానికి ఆద్యుడైన వ్యక్తి తన సిద్ధాంతాల్ని స్థిరంగా నాటుకునే దాకా పదే పదే బిగ్గరగా చాటాల్సి వుంటుంది. “నవలా ప్రక్రియ యింకా తన హోమర్ రాక కోసం ఎదురు చూస్తుంది” అన్న ఫ్లొబేర్‌కు ఆ హోమర్ తనే కాబోతున్నానని తెలుసు (హోమర్ కావ్య ప్రక్రియకు ఆద్యుడని ప్రఖ్యాతి), వచన రచనలో తాను తీసుకురాబోతోన్న మార్పు పదికాలాల పాటు నిలిచిపోయేదనీ తెలుసు. అందుకే సందుచిక్కిన ప్రతీ సందర్భంలోనూ అంత బలంగా తన అభిప్రాయాల్ని వెల్లడించేవాడు.

కళాకారుణ్ణి కథానాయకునిగా తీసుకుని నవల రాయడానికి ఫ్లొబేర్‌ చెప్తున్న అభ్యంతరాల సారాంశాన్ని యిలా చెప్పుకోవచ్చు: కళాకారుడు మిగతా మానవ సమూహమంతటికీ ఒక మినహాయింపు (ఒక “మృగం”). కళ మూసల్ని చిత్రీకరించటానికే గానీ, యిలాంటి అరుదైన మినహాయింపుల్ని చిత్రీకరించటానికి కాదు. కాబట్టి కళాకారుణ్ణి కథానాయకునిగా తీసుకుని నవల రాయటం అసాధ్యం. ఫ్లొబేర్‌ విషయంలో యివి నమ్మకాలుగా మాత్రమే మిగిలిపోలేదు; రచనల్లోనూ, జీవితంలోనూ వీటిని పాటించాడు కూడా. రచనల్లో ఎప్పుడూ సాధారణత్వాన్ని ప్రతిబింబించే మూస పాత్రల్నే చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. జీవితంలో ఎప్పుడూ ఒక కళాకారుడిగా తనను మిగతా ప్రపంచం నుండీ మినహాయించుకోవడానికి ప్రయత్నించాడు.

అతని రచనల్లో ప్రధాన పాత్రలేవీ అసాధారణ లక్షణాలూ, ప్రత్యేక విలువలూ వున్న వ్యక్తులు కాదు, మినహాయింపులు కాదు. వాళ్ళంతా మామూలు జనమే, మూసలే. చివరికి అతని జీవితానికి బాగా చేరువైన ఇతివృత్తంగా పలువురు భావించే నవల “సెంటిమెంటల్ ఎడ్యుకేషన్”లో కూడా, తనను ప్రతిబింబించే కథానాయక పాత్ర ఫ్రెడరిక్‌కు దాదాపుగా తన స్వభావమంతా—తన పరిసరాలు, స్నేహాలు, ప్రేమానుబంధాలూ అన్నీ—అరువిచ్చాడు గానీ, తన కళానైపుణ్యం (తన రచనాశక్తి) మాత్రం యివ్వలేదు. అంటే తనలో ఏది ప్రత్యేకం అనుకున్నాడో, ఏది తనని మిగతా మామూలుతనం నుంచి మినహాయిస్తుందనుకున్నాడో, దాన్ని మాత్రం తనకే అట్టిపెట్టుకున్నాడు.

అలాగే నిజజీవితంలో కూడా ఒక కళాకారునిగా తనని తాను సమూహం నుంచి వేరు చేసుకోవటానికి ప్రయత్నించాడు. సంసారమన్నది లేకుండా, కొద్దిమంది స్నేహితులు తప్ప ప్రపంచంతో నిమిత్తం లేకుండా, కేవలం రచనకే—పేజీలకే, పేరాలకే, వాక్యాలకే, అక్షరాలకే—అంకితమైపోయిన అతణ్ణి సొంతవూరు క్రాయిసెట్‌లో జనం “హెర్మిట్ ఆఫ్ క్రాయిసెట్” (క్రాయిసెట్ సన్యాసి) అని పిలిచేవారట. ఈ తరహా సన్యాసి జీవితాన్ని అతను మరోచోట యిలా సమర్థించుకున్నాడు (దాదాపు పై ఉత్తరంలోలానే):

“You can depict wine, love, women and glory on the condition that you are not a drunkard, a lover, a husband or a private in the ranks. If you participate in life, you don’t see it clearly: you suffer from it too much or enjoy it too much. The artist, in my opinion, is a monstrosity, something outside of nature.”

[“నువ్వో త్రాగుబోతువో, ప్రేమికుడివో, భర్తవో లేదా పటాలంలో సిపాయివో కానంతవరకూ మాత్రమే మద్యం గురించి, ప్రేమ గురించి, స్త్రీల గురించీ యింకా గెలుపు గురించీ రాయగలవు. జీవితంలో పాలుపంచుకున్నంత సేపూ నువ్వు దాన్ని స్పష్టంగా చూడలేవు: దాని వల్ల మరీ బాధపడటమో లేక మరీ ఆనందించేయటమో చేస్తావు. కళాకారుడు, నా ఉద్దేశ్యంలో, ఒక ప్రకృతి బాహ్యమైన రాక్షసాంశ.”]

1NABOKOVసరిగ్గా యిక్కడే ఫ్లొబేర్‌ నుంచి వ్లదీమిర్ నబొకొవ్ వేరు పడతాడు. (సరిగ్గా పన్నెండు పేరాల తర్వాత నేను అసలు విషయానికి వస్తున్నాను.) వేరుపడటమంటే మళ్ళీ కళాకారులుగా యిద్దరూ భిన్నధృవాలని కాదు నా ఉద్దేశ్యం. నబొకొవ్‌కి ఫ్లొబేర్‌ రచనలంటే చాలా అభిమానం; అలాగే, కాలగతి అటూయిటూ అయి నబొకొవ్ తర్వాతే ఫ్లొబేర్‌ పుట్టివున్నా, అతను కూడా నబొకొవ్‌ని కళాకారునిగా అంతే అభిమానించి వుండేవాడని నాకనిపిస్తుంది. నేను చెప్పే వేరుపడటం వ్యక్తులుగా వాళ్ళ మనస్తత్వాల గురించి. నబొకొవ్ స్వీయచరిత్ర “స్పీక్, మెమొరీ” మొదటి పేజీలో కొన్ని వాక్యాలు ఈ వ్యత్యాసాన్ని కొంత వ్యక్తపరుస్తాయి (సందర్భౌచిత్యం పూర్తిగా పొసగక పోయినా, జీవితం పట్ల నబొకొవ్ ధోరణిని తెలియజెప్పే ఒక వాక్యం కోసం ఈ పేరా యిస్తున్నాను):

“Nature expects a full-grown man to accept the two black voids, fore and aft, as stolidly as he accepts the extraordinary visions in between. Imagination, the supreme delight of the immortal and immature, should be limited. In order to enjoy life, we should not enjoy it too much…. I rebel against this state of affairs.”

You Might Also Like

Leave a Reply