గోర్కీ నుంచి త్స్వైక్ దాకా (విరాట్ – ముందుమాట)

కొన్ని సమయాల్లో ఒకళో ఎవరో తారసపడతారు. ఎక్కడో చూశాం అనిపిస్తుంది. గుర్తురారు. గింజుకుంటాం. అయినా గుర్తురాదు. విరాట్ మొదటిసారి చదవటం పూర్తి చేసినప్పుడు అలాగే అన్పించింది. తర్వాత్తర్వాత గుర్తొచ్చింది. స్తెఫాన్ త్స్వైక్(Stefan Zweig), షోలహూవ్ (ఫేట్ ఆఫ్ ఎ మాన్ – Mikhail Sholokov), హెమింగ్వే (ఓల్డ్ మాన్ అండ్ ది సీ – Ernest Hemmingway) ,1953లో దమాన్ హు ప్లాంటెడ్ ట్రీస్ రాసిన జీన్ జియానో (Jean Giono) ఒకే పాలపుంత మీది నుంచే నడిచి వెళ్ళారని.

దాంకోస్ బర్నింగ్ హార్ట్ (Danko’s burning heart) అన్న ప్రాచీన బైబిల్ కథని గోర్కీ(1868 – 1936) తన సొంత శైలిలో రాశారు. గడ్డి ఏపుగా పెరిగి వున్న సువిశాలమైన స్టెప్పీలో ఒక గిరిజన తెగ ఉంటుంది. వాళ్ళు బలమైన మనుషులు. సాహసీకులు. భయం తెలియని వాళ్ళు. ఒక రోజు మరో తెగ వాళ్ళు హఠాత్తుగా వచ్చి దాడి చేస్తారు. దగ్గరలోనే దట్టమైన అడవిలోకి వీళ్ళు పారిపోతారు. అది భయానకమైన కీకారణ్యం. పెను వృక్షాలు కొమ్మలు పెనవేసుకుపోయి పైన ఆకాశం కనిపించదు. చీకటి. దగ్గర్లో ఓ కొలను. కొందరు నీళ్ళు తాగుతారు. ఆ నీటిలో విషపు ఆవిర్లు. ఇద్దరో ముగ్గురో చనిపోతారు. ఆడవాళ్ళ ఏడుపులు. కటికి చీకటి. అడవి గాలి మృత్యు సంగీతం. దిక్కు తోచదు. భయంతో బిక్క చచ్చిపోతారు. ఆ తెగలో అందమైన యువకుడు దాంకో. “ఏదో ఒకటి చెయి,” అని జనం అడుగుతారు. దాంకో లేస్తాడు. పదండి అంటాడు. ముందు నడుస్తాడు. ఎంత దూరం వెళ్ళినా రాళ్ళూ, చీకటీ, గాయాలు. దారీ తెన్ను లేని ప్రయాణం. అడవిలో హఠాత్తుగా తుఫాను. భయంతో దాంకోని తిడతారు జనం. మమ్మల్ని చంపడానికే తీసుకెళ్తున్నావు, మేమే నిన్ను చంపేస్తాం అంటారు. అంతలో దాంకో కళ్ళలో వెలిగే జ్వాలను చూసి భయపడతారు. దాంకో ఒళ్ళంతా నిప్పులా వెలుగుతుంది. దాంకో కుడి చేత్తో ఛాతిని చీలుస్తాడు. గుండెను బయటకి తీసి రెండు చేతుల్తో ఎత్తి పట్టుకుంటాడు. కటికి చీకటి మాయం అవుతుంది. మండే సూర్యునిలా గుండె కాంతులు వెదజల్లుతుంది. అలాగే నడుస్తుంటాడు దాంకో.

వెలుగు, వెనక జనం. చాలా దూరం వెళ్ళాక అడవి పెద్ద చప్పుడుతో చీలి వీళ్ళకి దారి ఇస్తుంది. దాటి పోగానే అడవి మూసుకుపోతుంది. పెద్ద మైదానం. ఏపుగా పెరిగిన గడ్డి, సూర్యాస్తమయ సమయం. సరస్సులో నీళ్ళు దాంకో గుండెలోంచి కారిన రక్తంలా ఎర్రగా మెరుస్తుంటాయి. స్వేచ్ఛ. జనం ఆనందంలో మునిగితేలి దాంకో సంగతే పట్టించుకోరు. ఒక చెట్టు మొదట్లో కూలిపోయి దాంకో చనిపోతాడు. గుండె అతని పక్కనే వెలుగుతూ ఉంటుంది. ఒక మూర్ఖుడు దాన్ని కాలితో నలిపేస్తాడు. అది అన్ని వైపులకీ నీలి కాంతి పుంజాలని వెదజల్లుతుంది అని చాలా పొయిటిగ్గా, ఫిలసాఫికల్‌గా కథని ముగిస్తాడు గోర్కీ.

స్తెఫాన్ త్స్వైక్ విరాట్ ముగింపూ, గోర్కీ దాంకో బర్నింగ్ హార్ట్ ముగింపూ మానవ జీవన సాఫల్యం గురించి మనకి స్పష్టంగా ఒక దారినే చూపిస్తాయి.

విరాట్ ఒక అరుదైన ఆత్మానుభవం. విరాట్ చదివాక ఓ చిరుగు చొక్కా రిక్షాపుల్లర్ తాత్వకుడిగా కనిపిస్తాడు. ఓ గొప్ప కోటీశ్వరుడు లేకి మనిషిగా అనిపిస్తాడు. There is no past, no future, only the greedy present అన్నట్టుగా ఉండే ఈ senseless rat raceని చూస్తే విరాట్ లాంటి పుస్తకాలతో ఇక్కడెవరికీ అవసరం లేదని అనిపిస్తుంది.

-ప్రకాష్

విరాట్ On Kinige

గతంలో విరాట్ పై ‘శాంతా బయోటెక్’ ఎండీ వరప్రసాద్ రెడ్డి గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి!

You Might Also Like

Leave a Reply