మనిషి జాడైన రామిరెడ్డి

రాసి పంపిన వారు: డాక్టర్ కె.ఉమారాణి
*********************
manishijadaరామిరెడ్డి కవిగా తన కవిత్వపు వెలుగులో మనుషుల జాడ కోసం వెతికుతున్నట్లు కనిపించినా, అతన్ని, అతని కవిత్వాన్ని పరిశీలించిన పాఠకులకు తానే మనిషి జాడ ఐన సందర్భం కళ్ల ముందు నిలుస్తుంది.“భూమిని ఒరుసుకొంటూ , పడుతూ లేస్తూ నడుస్తూ పరిగెత్తుతూ, బతుకుల్ని నిర్మించుకొంటున్న లక్షల మనుషుల్ని కాదు, నీనుంచి, నీలోంచి తప్పిపోయిన మనిషిని వెతుకు” అంటాడు రామిరెడ్డి. అలా వెతుకుతూ పోతున్న క్రమంలో చేతల్లో తనను తాను వెతుక్కుంటున్న రామిరెడ్డి మనకు పట్టుబడతాడు. కవిత్వాన్ని ప్రవృత్తిగా, సేవా కార్యక్రమాలను వృత్తిగా ఎంచుకొన్న రామిరెడ్డి తానేం చెబుతున్నాడొ అది ఆచరిస్తూ శ్రీ లక్ష్మి,రవికుమార్, ఫాతిమా,లక్ష్మి, అశొక్ లాంటి ఎందరి చదువులకో చేయూతగా నిలుస్తున్నాడు.

రామిరెడ్డి మొదటి కవితా సంపుటి ‘బిందువు’. అక్కడనుండి బయలుదేరిన తనకు మనిషిజాడను వెదికేందుకు పుష్కర కాలం పట్టింది. ఈ మధ్య కాలం లో కవిత్వాన్ని చిక్కగా తీర్చిదిద్దటానికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చుకున్నాడనే అనిపిస్తుంది.

ఒక సుదీర్ఘ కాలపు బంధనాలనుండి బయటకు వచ్చి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకోవాలని ప్రయత్నించినా అప్పటి వరకు ఉన్న గొలుసులు అదృశ్యం కావంటూ ” సంకెళ్ళ సెగ, మంటల మధ్య దేహం, ఏళ్ళ తరబడి శూన్యంతో సహవాసం” నుండి “బయటకు వచ్చి ఓళ్ళు విరుచుకొంటూ తల పైకెత్తాను, పిట్టల గుంపు ఆకాశాన్ని మోసుకుపోతున్నది, ఓ పావురం మేఘాలకు తెలుపురంగు పులుముతోంది” అయినా “బేడీలు తెగినా కటకటాలు మాయం కావు, ఆకాశం చేతికందుతున్నా గొలుసులు అదృశ్యం కావు” అంటాడు.

మట్టిలోంచి వచ్చిన రామిరెడ్డి తన కవిత్వంలో ఎన్నీ విధాల మట్టి పరిమళాల్ని వెదజల్లాడు. పురిటి మోసం, ఏటా ఒక పీడకల, పత్తి తియ్యడం గురించి, పొలాల తలాపిన, వరద తర్వాత లాంటీ కవితల్లో మట్టి అవస్థల్ని చిత్రీకరించాడు. నకిలీ విత్తనాల వలన ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతుల్ని చూసి పురిటీలోనే మోసపోతున్న వైనాన్ని ” చచ్చు పుచ్చు విత్తనాల్లో హైబ్రీడ్ రాగం దట్టించి, రంగు రంగుల లేబుళ్లు ముద్రించి, మట్టి మనుషులకు అందంగా అంటగట్టి పోతారు. అవి, ఒక హరిత విధ్వసాన్ని కడుపులో దాచుకొని, అన్నదాత ఒడిలో అమాయకంగా నిద్రిస్తుంటాయి, ఎటొచ్చీ ఒక్క విత్తనమూ నాగలి మొన దాకా చేరదు” అంటూ వ్యవసాయ పరిశోధనా సంస్థల డొల్లతనాన్ని వాటి పర్యవసానాలను మన కళ్ల ముందుంచుతాడు.

బెట్టగొట్టిన నేల గుండె దాహాన్ని తీర్చలేని రైతుకు పీడల్కలలు కాక మరేమి వస్తాయి. ప్రతి సంవత్సరం అదే పీడకల పునరావృతమవ్వడాన్ని రామిరెడ్డి పాఠకుల ముందు పరుస్తాడు. ఈ మధ్య కాలం లో స్థలాల వ్యాపారం చీసిన నిర్వాకాల్ని ‘పొలాల తలాపినా కవితద్వారా ఎండగట్టాడు రామిరెడ్డి. ఒకప్పుడు ” పొలాల తలాపిన ఎన్నన్ని పరవశాలో, భూమికి పురుడు పొయ్యడానికి, ఎద్దులూ ఏరువాకలూ సరసరా సాగుతుండేవి” మరి ఇప్పుడో ” పొలాల తలాపిన మోటారు బైకుల హడావుడి, తలగుడ్డలూ పై పంచల స్థానంలో దళారుల వేల స్థావరాలు, రాజధాని నేలకు రాజసం తగ్గిందంట, మావూరి భూములకు రెక్కలు మొలిచాయట” – కుహనా వ్యాపారవేత్తల మాయలో రైతులు నష్టపోతున్న విధాన్ని చూపుతూ ” ఇప్పుడు పట్టణాలనుంచి ఏ పల్లెకు వెళ్లే దారిలోనైనా, పొలాల తలాపిన దీపం పెడుతున్నారు” అంటాడు.

వరద ఎప్పుడైనా వరదే. జీవితాల్నీ, పొలాల్ని ముంచేసే వరద. అటువంటి ఒక వరద కాలాన “పొలం నిండా పైకి తేలిన శవాలు, నీటితాటికి ఉరేసుకుని మరణించినవి కొన్ని, తాలు మిరపగాయల్లా తేలియాడుతున్నవి కొన్ని, అలలపై కొట్టుకు పోతున్నవి కొన్ని, నీటి అడుగున సమాధైన శవాలెన్నో, గుట్టలు గుట్టలుగా పడివున్న శవాల సమాధుల నడుమ చేలో నిలబడ్డాను” అంటాడు. ఈ వాక్యాలు ఏ రైతు చరిత్ర చూసినా, ఏ కాలానైనా, ఏ దేశానైనా మోసపోవడం మినహా మరేం లేదు అనిపిస్తుంది. అయితే రామిరెడ్డి మాత్రం ఇంత విషాదంలోనూ ఎంతో ఆశవహ దృక్పథంతో “తెగిన వేర్లకు కుట్లు వేసి ఊపిరిపోస్తా, వరదనీటిని ఉమ్మేసి, కుళ్లిన కాయలకే పంట ఫలాని కాయిస్తా” అంటాడు.

చుట్టూ ఉన్న సమాజాని అతి దగ్గర నుండి నిశితంగా పరిశీలించి కవిత్వీకరించడంలో రామిరెడ్డి ఒక విధమైన నేర్పును ప్రదర్శిస్తాడు. సంభాషణాత్మకంగా ఉన్నట్లే ఉంటూ చెప్పదలుచుకున్న విషయాన్ని ఎటువంటు ముసుగులు లేకుండా పాఠకుల హృదయాలలోకి సూటిగా వెళ్లిపోయే విధంగా రాయడం రామిరడ్డి ప్రత్యేకత. ‘ఏ దేశమేగినా’ కవితలో అమెరికా వెళ్లిన కూతురు తన కష్టాల్ని తండ్రికి ఉత్తరం రూపంలో “ప్రియమైన నాన్నకు” అంటూ మొదలుపెట్టి తన జీవితం ఎలా నరకప్రాయమైందో తెలియజేస్తూ ” ఏదేశమేగినా, ఎందు కాలిడినా, అబ్బాయికి ఎదుటివారిని ఆలింగనం చేసుకోగల మనిషితనం” లేనప్పుడు జీవితాలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తాడు.

రామిరెడ్డి తన అమ్మమ్మ చివరి చూపును మనముందు పరిచి మనమూ మన అమ్మమ్మల జ్ఞాపకాల్లోకి వెళ్లే విధంగా చేశాడు. ” ఆమె కడసారి చూపుకోసం, జనం క్యూ కట్టారు” అంటూ ఆమె ” ఏ కవీ రాయని జానపదగీతమై వినిపించేది, పనికి పరికరాలకీ మధ్య రహస్యాల్ని కనిపెట్టిన అమ్మమ్మ ముగిసిపోయిన చరిత్రకాదు, తెరుచుకొన్న అధ్యాయ” అంటు ఆమె జ్ఞాపకాల్లో మనల్ని ముంచేస్తాడు.

రామిరెడ్డి కవిత్వపు పరిభాషను తయారు చేసుకోవడానికి పెద్దగా శ్రమ పడినట్లుగా అనిపించదు. అస్పష్టత, మార్మికత లాంటివి రామిరెడ్డి కవిత్వంలో మచ్చుకు కూడా కనిపించవు. కుశాల, తలాపి, ఇంకోపాలి, వసుగొయ్య లాంటి గుంటూరు మాండలిక పదాలు అతని కవిత్వంలో అలవోకగా యిమిడిపోతాయి.

ఇంకా ఈ సంపుటీలో ‘కరుగుతున్న కలల చప్పుడు లో బాల్యాని కోల్పోతున్న విద్యార్థులు, అనారోగ్య కారణాలతో సతమతమయ్యే ‘అతనొస్తాడు లాంటి వైవిధ్యభ్బరితమైన కవితలు కవికున్న వివిధ దృక్కోణాలను తెలియజేస్తాయి.

పుస్తకం వివరాలు:
మనిషిజాడ – కవి -ఎంవీ రామిరెడ్డి (manishi jaada – M.V. Rami Reddy)
వెల – 30రూలు , పేజీలు – 90
దొరుకుచోటు : ఎం. రాజ్యలక్ష్మి, 102. శ్రీకోట రెసిడెన్సీ, పోలీస్ స్టేషన్ దగ్గర, మియాపూర్, హైదరాబాద్ – 49
( అన్నట్లు ఈ పుస్తకం మీద వచ్చే ప్రతి రూపాయీ అనాథ పిల్లల చదువులకే)

You Might Also Like

Leave a Reply