The Beautiful Tree, James Tooley – పుస్తకావిష్కరణ సభ
పెంగ్విన్ బుక్స్ ఇండియా వారి జేమ్స్ టూలీ రచించిన పుస్తకం “The Beautiful Tree” ఆవిష్కరణ సభ శుక్రవారం, 27 నవంబర్, సాయంత్రం 6:30 నకు లాండ్‍మార్క్, బంజారా హిల్స్ లో జరిగింది. రచయితతో పాటు డా|| ఐ.వి. సుబ్బారావు గారు (Chief Election Officer, Andhra Pradesh) మరియు విజయ్ మహాజన్ గారు (social entrepreneur and chairman of BASIX) ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. విద్యారంగం, వ్యాపారరంగం అభ్యసిస్తున్న జాతీయాంతర్జాతీయ విద్యార్థులు,social entrepreneurs, హైదరాబాద్‍లో అనేక సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నవారు, ఆంధ్రపదేశ్ ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేసినవారు, లాండ్‍మార్క్ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చారు.
పుస్తకావిష్కరణ విశేషాలను నాకు గుర్తున్నంతవరకూ ఇక్కడ పంచుకుంటున్నాను.
జేమ్స్ టూలీ – విద్యారంగానికి సంబంధించిన ప్రొఫెసర్. అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, ఘానా, చైనా, నైజీరియాలో “పేదలు – వారి విద్యావకాశాలు” గురించి పరిశోధించి, తన అనుభవాలనూ, పరిశోధనలనూ ఈ పుస్తక రూపేణ పంచుకున్నారు.
ఐ.వి సుబ్బారావు గారు – ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘానికి ముఖ్యాధికారిగా పదవిని చేబడుతున్న ఐ.వి సుబ్బారావు గారు, అంతకు పూర్వం Secretary of Education, AP కూడా బాధ్యతలను నిర్వహించారు. టూలీ పరిశోధన మొదలైన తొలినాళ్ళల్లో వీరి స్నేహానికి బీజం పడింది.
విజయ మాహాజన్ – పరిశోధనలో భాగంగా హైదరాబాద్‍లో ఉన్న సమయాన టూలీ – మహాజన్ స్నేహం కుదిరింది.
జేమ్స్ టూలీ గారి స్పీచ్‍లో ముఖ్యాంశాలు:
“పుస్తకావిష్కరణ సభ కూడా పెళ్లిలా ఉంది. అందరూ అభినందనలు తెల్పడం, ఇన్నేసి ఫోటోలు తీయటం అదీ చూస్తే నాకలానే అనిపిస్తుంది” అన్న హాస్యోక్తితో మొదలెట్టి, పుస్తకం గురించి చెప్పటం మొదలెట్టారు.
“నా పుస్తకంలో నా ప్రయాణం గురించిన విశేషాలుంటాయి. తొమ్మిది సంవత్సరాల, తొమ్మిది నెలల, ముప్ఫై రోజుల క్రితం మొదలైన ప్రయాణపు విశేషాలు. ఆ ప్రయాణం ఇక్కడే, మీ హైదరాబాద్‍లోనే మొదలైంది. ఉద్యోగరిత్యా నన్ను భారతదేశంలో విద్యారంగంలో ప్రైవేట్ సంస్థలు, అంటే మీ ఐఐటీలు, ఐఎస్‍బీల పనితీరు గురించి అంచనా వెయ్యమని పంపారు, ప్రపంచ బాంక్ వారు. ఇప్పటి తాజ్ దెక్కన్, అప్పటి హాలిడే ఇన్‍లో బస చేసి నా పని చేసుకుంటున్నా మనసెందుకో నా ఉద్యోగం నా మనసు కోరుకునే – పేదలకు నా సేవలు అందించే అవకాశం లేకుండా చేస్తుందనిపించింది. అప్పుడే ఉద్యోగంలో ఏ మాత్రం తీరిక దొరికినా హైద్ స్లమ్స్ లో తిరిగేవాడిని. అక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే, అక్కడున్న low cost private schools వల్ల అక్కడి పేద కుటుంబాలకు చెందిన బాలబాలికలు చదువుకుంటున్న వైనం. ప్రభుత్వ పాఠశాలలో కన్నా తమ పిల్లలని ఈ పాఠశాలల్లో పంపడానికే సుముఖంగా ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. లాభాల బాటలో నడుస్తూనే ఈ పాఠశాలలు పేదలకు చక్కటి విద్యను అందించటం నాకో మహాద్భుతంగా తోచింది. దీని గురించి చాలా మందికి చాలా విధాలుగా నచ్చజెప్ప చూశాను. అందరూ “ప్రైవేట్ అంటేనే పేదలను దోపిడి చేసేవి” అంటూ కొట్టిపారేశారు. నేను చూసినదానికి, నాకు వినిపించే అభిప్రాయాలకీ పొంతన కుదరలేదు. నేను భారతదేశంలోనే కాక, మరిన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పాఠశాలల గురించి పరిశోధించాను. అన్ని చోట్లా నాకు హైద్రాబాద్ లో ఎదురైన అనుభవాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల కన్నా ఇవే మంచి ఫలితాలిస్తున్నట్టు తెల్సింది. అలా అన్ని దేశాల్లో నా అనుభవాల్ని ఈ పుస్తకంలో పంచుకున్నాను.
ఈ పుస్తకానికి ఈ పేరే ఎందుకు పెట్టానంటే, దానికి సమాధానం ఈ పుస్తకం పదకొండవ అధ్యాయంలో చెప్పాను. గాంధీజీ గారి అభిప్రాయం ప్రకారం, బ్రిటీష్ వారు అవలంభించే విద్యావిధానం వల్ల భారత్‍కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పూర్వం మనకున్న పాఠశాల విధానం వల్లే మనకి లాభం చేకూరుతుంది. వారు వాడిన “the beautiful tree” అనే phrase నే నేను ఈ పుస్తకానికి ఉపయోగించాను. మీరూ నా పుస్తకానికి చదివుతారని ఆశిస్తున్నాను.” అని ముగించారు.
ఐ.వి. సుబ్బారావు గారి స్పీచ్:
ఐ.వి సుబ్బారావు గారు తన ప్రసంగం మొదలెడుతూ, “James Tooley is unstoppable and his book is unputdownable. జేమ్స్ చేస్తున్న పరిశోధన గురించి ముందు నుంచే తెల్సు కాబట్టి ఈ పుస్తకం ప్రచురణ కాక మునుపే అంతర్జాలంలో కొన్ని excerpts చదివాను. అవి చదువుతుంటూనే ఈ పుస్తకం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించగలిగాను. అనుకున్నట్టే ఈ పుస్తకం ఒక రిసర్చ్ బోరింగ్ బుక్ గా ఉండక, చదివింపజేస్తుంది. ఈ పుస్తకంలో చివర్న ఘానాలో సంభవించిన సూర్యగ్రహణాన్ని ఉదహరిస్తూ దాన్ని ప్రస్తుత మన విద్యావిధానానికి అన్వయిస్తూ. ప్రభుత్వ విద్యాధానం, ప్రైవటీకరణలలో ఎవరి నీడ ఎవరికి గ్రహణం కలిగిస్తుంది అన్న విషయాన్ని చర్చించారు. భారతదేశంలో “సత్యం-శివం-సుందరం” అనే నానుడి ఉంది. సత్యం అంటే సత్యాన్వేషణ, శివం అంటే మంచి, సుందరమైనది అంటే అందం కలిగి ఉన్నది. (సభలోని విదేశీయులకి ఈ వివరణ ఇచ్చారు) – ఈ పుస్తకం మూడింటి మేలు కలయిక. చాలా వరకూ చాలా మంది, ప్రభుత్వ ప్రయత్నాల ద్వారానే అందరికీ విద్యను అందించగలం అని భావిస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ లో కూడా పబ్లిక్ ఫండ్స్ ద్వారానే ఇది సాధ్యం అని చెప్తున్నారు. ఇది నిజం కాదని జేమ్స్ మనకి నిరూపించారు. గ్రహణాలు చూడ్డానికి ప్రత్యేక కళ్ళద్దాలు అవసరం పడతాయి. నిజాన్ని చూడ్డానికి, మన ముందున్న సమస్యను చూపించే అద్దం లాంటిదే ఈ పుస్తకం. జేమ్స్ చూపించిన ఈ పరిశోధన ఫలితాలను ఎలా ఉపయోగించుకొని విద్యను అందరికీ చేరువలోకి తీసుకెళ్లాలి అన్నది ప్రస్తుతం మనం ఆలోచించుకోవాల్సిన విషయం.” అని అభిప్రాయపడ్డారు.
విజయ్ మహాజన్ గారి స్పీచ్:
“నేను ఈ పుస్తకం ఇంకా చదవలేదు. మరి ఈ రోజు నేనిక్కడికి రావటానికి కారణం, జేమ్స్ గారి వ్యాసం ఒకటి చదివాను. నాకు తెల్సి, ఒక వ్యాసం అత్యధిక ఫండ్స్ సంపాదించటం అదే మొదటిసారి. పేద విద్యార్థుల కోసం కొందరు ముందుకొచ్చి ఒక ట్రస్ట్ ఏర్పచి, దానికి టూలీ నే అధ్యక్షకునిగా ఎన్నుకున్నారు. టూలీ మాత్రం ఇప్పుడు దాని నుండి తప్పుకొని తమ పరిశోధన కొనసాగిస్తున్నారు. అసలు ఈ పుస్తకం అట్టను చూస్తేనే ఈ పుస్తకం స్పిరిట్ తెలుస్తుంది. ఈ కవర్ డిజైన్ చేసినవారికి నా అభినందనలు. దేశం కానీ దేశంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ పరిశోధన జరిపారు. ఒక పుస్తక కొట్టులోకి వెళ్లి Darlympire అని అడిగితే, కొట్టతను Dharampal పుస్తకం ఇచ్చాడు. దాని ద్వారానే వీరి గాంధీజీ అభిప్రాయాలను తెల్సుకోగలిగారు. అంతే కాక, మన విశ్వవిఖ్యాత అమర్త్యా సేన్ గారి అభిప్రాయాలతో వీరు నిర్మొహమాటంగా వ్యతిరేకించారు.
నాకీ పుస్తకం బా నచ్చటానికి ఒక కారణం ఉంది. వీరు చేసిన పరిశోధన విద్యారంగానికి సంబంధించినదే అయినా, దీన్ని మనం మరిన్ని అసరాలు (తాగు నీరు, ఆరోగ్యం, వ్యవసాయ రుణాలు) తీర్చుకోవడంలో కూడా వినియోగించుకోవచ్చని నాకనిపిస్తుంది. మనం దేశం ప్రాధమికంగా వ్యవసాయ ఆధారిత దేశేమే అయినా, మన రైతులు చేసే అప్పులు ప్రభుత్వం సంబంధిత సంస్థల కన్నా ఇతరత్రా మార్గాల ద్వారానే ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. Hirschman ప్రతిపాదించిన Exit, Voice, and Loyalty మనం మరోటి కూడా కలుపుకోవచ్చేమో. అదే self-help.” అని ముగించారు.
ప్రశ్నోత్తరాలు:
చివర్న ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.
ప్ర: మీరు చెప్పిన ప్రకారం ప్రభుత్వేతర సంస్థల ద్వారానే ప్రగతి సాధ్యమా? ప్రభుత్వం విఫలమవ్వటంతో ప్రైవటీకరణ మాత్రమే మార్గాంతరమా?
జ: (రచయిత) లేదు. నేను దీన్ని ప్రభుత్వ విఫలంగా చూడ్డం లేదు. మీరన్న ప్రైవటీకరణ అంటే పై నుండీ మొదలవ్వాలి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది. తమలో తాము ఒకరికి ఒకరై చేసుకొంటున్న ఒక పనికి నా అభినందనలు మాత్రమే ఇవి. It’s a celebration of what is existing on its own, rather than pointing out of failures around.
ప్ర: ప్రభుత్వం వారు రిగ్యులైజేషన్స్ సడలిస్తే ఫలితం ఉంటుందంటారా?
జ: (రచయిత) అవును. తప్పకుండా ఫలితాలిస్తాయి.
ప్ర: నేను ఒక డాక్టర్ని. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాల్లోనూ, కళాశాల్లోనూ జరిగింది. అంతే కాక, కొన్నాళ్ళు ప్రభుత్వ కళాశాలలో పనిచేశాను. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్నా అంకిత భావంతో పనిచేసే చాలా మందిని చూశాను. మీరిలా ప్రభుత్వ శాఖ వారు ఏ పనీ చెయ్యరు, తమ బాధ్యతను నిర్వహించరు అన్న sweeping generalization ఎలా చేస్తారు? బహుశా, తగినన్ని సదుపాయాలు లేకపోవటం వల్లానూ, జనాభాకు సరిపడేనన్ని పాఠశాలలు లేకపోవటం సమస్య కావచ్చు కానీ, మీరెలా ప్రభుత్వోద్యుగులపై నిందలు వేస్తారు?
జ: (రచయిత) నా పరిశోధనలో తేలిది ఏమంటే ప్రభుత్వం వారి పాఠశాలల కన్నా ఈ ప్రైవేట్ స్కూల్స్ మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని. అందులో కొన్ని గొప్పగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలుండవచ్చు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. దాన్ని నేను గానీ, నా పుస్తకం గానీ వ్యతిరేకించం.
ప్ర: నేను ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు విద్యారంగంలో పనిచేశాను. మహబూబ్ నగర్ లో ఎడ్యుకేషన్ ఆఫీసరుగా పని చేశాను. ప్రభుత్వ పాఠశాలల్లో accountability లేకపోవటం వల్ల, పనిని బట్టి performance evaluation లేకపోవటం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.
జ: అవును.
ప్ర: ఇలాంటి ఒక మార్గాంతరం ఉండటం ద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు మరింత దిగజారే అవకాశాలు ఉంటాయంటారా?
జ: (రచయిత) ఏమీ ఉండకపోవచ్చు. ఇది ఒక ఉత్సాహపూర్వక అంశమే కానీ, ప్రభుత్వం పనితీరు దీని వల్ల దిగజారవచ్చు అంటే నేను ఒప్పుకోను.
(ఐ.వీ. సుబ్బారావు గారు) మనం దీన్ని “either – or” అనే విధంగా చూడకపోవటం మంచిది. రెండూ కలిసి ఎలా పని చేస్తే మెరుగైన ఫలితాలు అందగలవో అని ఆలోచించుకోవాలి.
ప్ర: నాకీ పుస్తకం టైటిల్ నచ్చలేదు. గాంధీజీ “బ్యూటిఫుల్ ట్రీ” అంటూ ప్రభుత్వ పాఠశాలల గురించి అని ఉండవచ్చు. మీరు దాన్ని ప్రైవేట్ స్కూల్స్ కి ఎలా అన్వయించారు?
జ: (రచయిత) బ్రిటీష్ రాక మునుపు భారతీయ విద్యావిధానం గురించి గాంధీ రాశారు. అప్పట్లో ఒక సమాజిక వర్గం తమలో ఒకరికి విద్యను అందించే బాధ్యతను ఇచ్చేవారు. ఆ బాధ్యతను నిర్వహిస్తున్నందుకు వారికి ధనరూపేణ లేక వస్తురూపేణ ఏదో ఒకటి ఇచ్చేవారు. గాంధీ గారు ఇలాంటి విధానమే భారతంలో పని చేస్తుంది. బ్రిటీష్ వారు మొదలెట్టిన విద్యావిధానం ఎన్ని శతాబ్దాలు గడిచినా తగిన ఫలితాలను ఇవ్వలేదు అని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పుస్తకానికి ఆ పేరు.
ప్ర: (విజయ్ మహాజన్) Education in India is supposed to be non-profitable. Though we have a law for it, we don’t have any such thing to be seen. Are we living a national lie?
జ: (ఐ.వీ. సుబ్బారావు గారు) అలాంటిదేమీ లేదు. ఒక విద్యాసంస్థ లాభాల బాటలో నడుస్తుంటే దాన్ని అడ్డుకునే వీలు ప్రభుత్వానికి లేదు.
ఈ చివరి ప్రశ్నలపై వాదోపవదాలు జరుగుతుండగానే, అప్పటికే ఆలస్యమైనందుకు చర్చను ఆపేశారు. తర్వాత రచయిత పుస్తకం కొన్నవారికి వారి వారి కాపీలపై సంతకాలు చేశారు.
పుస్తకం వివరాలు:
The Beautiful Tree – A personal journey into the how the world’s poorest people are educating themselves.
Author: Prof. James Tooley
Cost: Rs 499 (Hard Cover)
Publishers: Penguin
Purchase at Flipkart for Rs 419/-
Preview of the book at Google books.
kvrn
పుస్తకం వివరాలు, ఇంటెర్వ్యూ బాగుంది. ఐ వి సుబ్బారవుగరి స్పీచ్ బాగుంది